Friday, August 30, 2013

ఆశారామ్-శ్రీశ్రీ రవిశంకర్-జనం...ఎవరు నేరస్థులు?

ఇంతకీ ఎవరు నేరస్థుడు?!

మైనర్ బాలికను చెరిచాడని
ఆరోపణ ఎదుర్కొంటున్న
ఆశారామ్ అనే తెల్లగడ్డం మనిషా
లేక...

ఈ జనం క్షమామూర్తులు,
తప్పు ఒప్పుకుంటే క్షమించేస్తారు
అన్నశ్రీ శ్రీ  రవిశంకర్ అనే
ఆ నల్ల గడ్డం మనిషా?

నేరం రుజువయ్యేవరకూ
ఎవరూ నేరస్థుడు కాదు కనుక
ఆశారామ్ ప్రస్తుతానికి
నేరస్థుడు కాకపోవచ్చు

కానీ ఈ వెర్రి జనం మీద
విపరీతమైన నమ్మకంతో'
క్షమించేస్తారులే అన్న శ్రీశ్రీ రవిశంకర్
నా ఉద్దేశంలో
ఎటువంటి దర్యాప్తూ, విచారణా
అవసరం లేకుండానే
తేల్చి చెప్పగలిగిన
నేరస్థుడు!

ఆయన్ను కూడా అనుకోవడం
దేనికి లెండి
ఈ జనాల మధ్య 'జీవించే కళ'ను(art of living)
 ఔపోసన పట్టిన ఆ వ్యక్తి
అలాంటి సలహా ఇవ్వడంలో
ఆశ్చర్యం ఏముంది?

ఆశారామ్ కు ఇప్పటికే
రెండు కోట్ల మంది
భక్తులు ఉన్నారట
ఈ ఉదంతంతో
ఆ సంఖ్య నాలుగు కోట్లకు పెరగచ్చు

అసలు నేరస్తులు ఎవరో
ప్రత్యేకంగా చెప్పాలా?!


Thursday, August 29, 2013

'పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి సరి!'

వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు...
                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం,  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ఆత్మశాంతిపర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

 (పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను పై మ్యాగజైన్ లో పోస్ట్ చేయండి)

Wednesday, August 21, 2013

దేవదాసు సినిమాలో ఆ సన్నివేశం...

శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు శరత్. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు.  శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం...దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు  పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను దయచేసి అందులో పోస్ట్ చేయండి)

Tuesday, August 20, 2013

పరువు పోయింది...ఫైళ్లూ పోతున్నాయి!

ఇంతకాలం
వేల కోట్ల రూపాయిల
ప్రజాధనం
అవినీతి బకాసురునికి
ఆహారం
అయిపోతోందనుకున్నాం

ఇంతకాలం
దేశం పరువు
అంతర్జాతీయస్థాయిలో
గల్లంతయిపోతోందనుకున్నాం

తీరా దొంగలు
పట్టుబడే దశకు వచ్చేసరికి
ఫైళ్లే పోతున్నాయి!

అన్ని రకాలుగా
సిగ్గు విడిచేసిన
ఈ రాజకీయవ్యవస్థ
ఒంటి మీద
పోవడానికి ఒక్క
నూలు పోగైనా మిగిలిందా?!



Wednesday, August 14, 2013

గాంధీజీ హత్యను ఎందుకు ఆపలేకపోయారు?

1948, జనవరి 30న గాంధీ హత్య జరగడానికి పది రోజులముందు, జనవరి 20న గాడ్సే బృందం ఆయనను హతమార్చడానికి ఒక విఫలయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేల్చిన మదన్ లాల్ పహ్వా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే, గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు సేకరించి, ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా నివారించే గట్టి ఆధారం పోలీసులకు దొరికిందన్న మాట. పైగా పది రోజుల వ్యవధి కూడా ఉంది. అయినా నివారించలేకపోవడం భారత పోలీస్, పాలనావ్యవస్థలను శాశ్వతంగా సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఒక హాస్యాస్పద విషాదాధ్యాయం.

 ముందస్తు పథకం ప్రకారం, దిగంబర్ బడ్గే గాంధీ ప్రసంగ వేదిక వెనకనున్న సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఒక గది కిటికీ లోంచి గాంధీ మీద కాల్పులు జరపాలి. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ గది గుమ్మంలో ఒక ఒంటి కన్ను మనిషి కనిపించాడు! బడ్గే గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఒంటి కన్ను మనిషి కనబడడం పెద్ద అపశకునం కనుక నేను ఆ గదిలోకి వెళ్ళనని చెప్పేశాడు. ఆ తర్వాత, ఆ కిటికీ లోంచి గాంధీ పై బాంబు విసిరే పని గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేకు అప్పగించారు. కిటికీ చాలా ఎత్తుగా ఉండడంతో అతను ఆ పని చేయలేకపోయాడు. అంతలో మదన్ లాల్ బాంబు పేల్చడం, పోలీసులకు పట్టుబడడం జరిగిపోయాయి.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలం లో చదవండి. మీ స్పందనను దయచేసి సారంగ మేగజైన్ లో పోస్ట్ చేయండి)


Saturday, August 10, 2013

ఇదే మీడియా అప్పుడు నవాజ్ షరీఫ్ ను హీరోను చేసింది!

ఒక్కసారి మూడు నెలలు వెనక్కి వెళ్ళి చూడండి...

భారతీయ మీడియా పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలను మనదేశంలో జరుగుతున్న ఎన్నికలా అన్నట్టుగా పూనకం పట్టినట్టు కవర్ చేసింది. నవాజ్ షరీఫ్ విజయాన్ని చెబుతూ హిందూ దినపత్రిక Lion of Punjab roars in Pak అని శీర్షిక ఇచ్చింది.  కాబోయే ప్రధానమంత్రిగా ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రతి ఇంగ్లీష్ న్యూస్ చానెల్ పోటీ పడ్డాయి. నవాజ్ షరీఫ్ ప్రధాని అయితే ఆ వైపునుంచి ఉగ్రవాదానికి ప్రోత్సాహం తగ్గిపోతుందనీ, భారత్-పాక్ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించాయి. ఇంగ్లిష్ న్యూస్ చానెళ్ల శ్రుతిమించిన పాకిస్తాన్ fixation ఎప్పుడూ ఆశ్చర్యం  కలిగిస్తూనే  ఉంటుంది.

మూడు నెలల తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోందో చూడండి...

పాక్ సైన్యమూ, ఉగ్రవాదులూ దాడిచేసి అయిదుగురు భారత సైనికులను వధించారు. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నట్టు తాజా సమాచారం.  జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే నినాదం జనంలోంచి వినిపిస్తోంది. పాక్ దుర్మార్గానికి దీటైన జవాబు ఎలా చెప్పాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. పాకిస్తాన్ తో మాటలు కొనసాగించాలా వద్దా అన్న చర్చ మరోసారి తెర మీదికి వచ్చి ఏకాభిప్రాయానికి దూరంగా అదే పనిగా ఊదరగొడుతోంది. నవాజ్ షరీఫ్ ను గొప్ప ఆశాకిరణంగా మూడు నెలల క్రితం చూపించడానికి ప్రయత్నించిన ఇదే మీడియాలో ఇప్పుడు ఆయన భారతవిద్వేష గతం చర్చకు వస్తోంది. కిందటిసారి ఆయన ప్రధాని అయిన వెంటనే చైనాను సందర్శించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏవో నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్న విషయం ప్రస్తావనకు వస్తోంది. సైన్యం మద్దతుతోనే ఆయన మొన్నటి ఎన్నికలలో విజయం సాధించాడు కనుక ఉగ్రవాదచర్యల్లో స్వయంగా భాగస్వామి అయిన సైన్యాన్ని ఆయన అదుపు చేయలేడన్న విమర్సా వినిపిస్తోంది.

మొత్తానికి  మీడియా ఆశాకిరణంగా చూపించడానికి ప్రయత్నించిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు విలన్ గా పైకి తేలాడు.

ఆశాభావం తప్పు కాదు కానీ,  అందుకు కూడా కొంతకాలం ఓపిక పట్టి ఓ అభిప్రాయానికి రావడంలోనే విజ్ఞత, వివేకం ఉంటాయి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించడం మంచిది కాదు. అందులోనూ జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మీడియాలో అటువంటి ధోరణి అసలే మంచిది కాదు.  సున్నితమైన అంశాలలో విధాన రూపకల్పనలో మీడియాకు కూడా కొంత పరోక్ష భాగస్వామ్యం, బాధ్యత ఉంటాయి. జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలది కావడమే అందుకు కారణం.

పాక్ ఎన్నికలపై మీడియా అత్యుత్సాహాన్ని ప్రశ్నిస్తూ 5/13/13 న 'రెండు ఆశ్చర్యాలు-ఒక ఆవేదన' అనే శీర్షికతో ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు జరుగుతున్నది దానికి ధృవీకరణే. 

Wednesday, August 7, 2013

అశ్వత్థామను చూసిన మనిషి

మహాభారతంలో అశ్వత్థామ చాలా విలక్షణ పాత్ర.  ద్రోణ, శల్య, సౌప్తికపర్వాలలో తిక్కన ఆ పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడు. నిజానికి శల్య, సౌప్తికపర్వాలు రెండింటిలో కథానాయకుడు(లేదా ప్రతినాయకుడు) అశ్వత్థామే. యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు. చదువుతూ తిక్కన మహాకవికి మనసులో పాదాభివందనం చేసుకొన్న ఘట్టాలలో ఇది ఒకటి. అశ్వత్థామ చిత్రణపై నా హృదయస్పందనను పూర్తిగా వెల్లడించాలని మనసు ఉత్సాహపడుతున్నా, బలవంతం మీద ఆపుకుని విషయానికి వస్తాను.

అశ్వత్థామను కళ్ళారా చూసిన ఒక వ్యక్తి ఉన్నారనీ, ఆయన ఆ విషయం చెప్పగా విన్న వ్యక్తిని నేను ఎరుగుదుననీ మా నాన్నగారు అంటుండేవారు. అశ్వత్థామనేమిటి, చూడడమేమిటనుకుని మీరు విస్తుపోతూ ఉండచ్చు. చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని ఒక విశ్వాసం. ఇంతకీ విషయమేమిటంటే, హిమాలయ ప్రాంతంలో కొంతకాలం ఉన్న ఆ వ్యక్తి ఓ ఉషఃకాలాన నదికి స్నానానికి వెళ్లారు. అంతలో ఓ భారీకాయుడు నదిలోకి దిగబోతూ కనిపించాడు. ఆయన శరీరమంతా తూట్లు పడి చర్మం వేలాడుతోంది. జడలు కట్టి ఉన్నాయి. నదిలోకి దిగబోతున్న ఆ వ్యక్తిని చేతితో వారించాడు. దిగ్భ్రమతో గట్టుమీద నిలబడి పోయిన ఆ వ్యక్తి ఆయన స్నానం ముగించుకుని వెడుతుంటే, “తమరెవరు స్వామీ?” అని సంస్కృతంలో ప్రశ్నించారు. “ నేను ద్రోణపుత్రుడను, అశ్వత్థామను” అని ఆయన సంస్కృతంలోనే సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Thursday, August 1, 2013

రేపటి తీరాంధ్ర అభివృద్ధి ఎలా? ఈ వ్యాసం చదవండి

రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. అది వివిధ ప్రాంతాలలో కలిగించే సంతాప, సంతోషాలు కొంతకాలం కొనసాగడం సహజమే. ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోడానికి కొంత సమయం పట్టే మాట నిజమే. అయితే, తర్వాత అయినా భవిష్యత్ కార్యాచరణ మీద అన్ని ప్రాంతాలూ దృష్టి పెట్టక తప్పదు. ఈ నిర్ణయం నుంచి వీలైనన్ని సానుకూల ఫలితాలను పిండుకోడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. ఆ మేరకు రాజకీయనాయకత్వంలో సరికొత్త విజ్ఞత, బాధ్యత అంకురిస్తాయని ఆశించాలి. 

ఈ సందర్భంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి కొత్త బ్లూ ప్రింట్ అందించి రాజకీయనాయకత్వానికి సహకరించవలసిన నూతన బాధ్యత తెలుగు మేధావులపై ఉంది. అలా నిగ్గు తేలిన బ్లూ ప్రింట్ అమలుకు రాజకీయనాయకత్వంపై ఒత్తిడి తేవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. 

అభివృద్ధి అంశాలపై ఎంతో కాలంగా రాస్తున్న అరుదైన తెలుగు మేధావులలో జాన్సన్ చోరగుడి ఒకరు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే తీరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చర్చిస్తూ 2010లో ఆయన 'సాక్షి' దినపత్రికలో ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం రాశారు. ఆ వ్యాసం లింకు కింద ఇస్తున్నాను.