Thursday, August 29, 2013

'పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి సరి!'

వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు...
                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం,  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ఆత్మశాంతిపర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

 (పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను పై మ్యాగజైన్ లో పోస్ట్ చేయండి)

No comments:

Post a Comment