Friday, September 27, 2013

'నెగిటివ్' వోటు ఒక పాజిటివ్ పరిణామం

వోటర్ల కోణం నుంచి చెప్పుకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు చరిత్రాత్మకం. ఈ తీర్పును బట్టి, ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు ఆ విషయాన్ని వోటరు బ్యాలెట్ పేపర్ మీద నమోదు చేయచ్చు. అంటే none of the above అనే ఆప్షన్ ఇకముందు బ్యాలెట్ పేపర్ మీద ఉంటుందన్నమాట. దీనినే నెగిటివ్ ఓటు అని కూడా అనచ్చు.

పార్లమెంట్ లో ఏ బిల్లు మీద అయినా లేదా ఏ తీర్మానం మీద అయినా ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు వోటింగ్ కు గైరు హాజరయ్యే హక్కు సభ్యులకు ఉంది. అలాంటి హక్కు వోటర్లకు మాత్రం ఎందుకు ఉండకూడదనే అభిప్రాయం ఈ తీర్పు సందర్భంలో వ్యక్తమైంది. అందులో న్యాయం ఉంది.

ఉన్నత, మధ్యతరగతి వర్గాలు; ముఖ్యంగా నగరాలు, మహానగరాలలో ఉన్నవాళ్ళు వోటు వేయరనీ, వారిలో పౌరస్పృహ లోపించిందనే విమర్శ వినిపిస్తూ ఉంటుంది. దానికి సాధారణంగా బాధ్యతారాహిత్యం, బద్ధకం వంటి కారణాలను ఆపాదించడమూ చూస్తుంటాం. ఇలాంటి కారణాలతో వోటు వేయనివారు ఉండరని కాదు. వీరితోపాటు, ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థీ నచ్చక వోటు వేయని వారూ ఉంటారన్న సంగతి ఈ చర్చలో ఫోకస్ కావడం లేదు. దీంతో ఓటు వేయడాన్ని నిర్బంధం చేయాలనే నినాదం రాజకీయపక్షాలనుంచి,రాజకీయేతరవర్గాలనుంచీ చాలాకాలంగా గట్టిగా వినిపిస్తోంది.

సుప్రీం కోర్టు తాజా తీర్పు ఈ చర్చలోని ఏకపక్షధోరణిని, అసమగ్రతను ఎత్తి చూపేలా ఉంది. ఏ అభ్యర్థీ, ఏ పార్టీ నచ్చకపోయినా సరే పౌరస్పృహ పేరుతో మొక్కుబడిగానైనా వోటు వేయాలనడంలో అర్థం లేదు. ఆ మొక్కుబడి లక్షణం ప్రజాస్వామ్యానికి ఎలాంటి మేలూ చేయదు. వోటింగ్ లో వోటర్లు అందరూ చైతన్యంతో పాల్గొన్నప్పుడే ఎన్నికలు అర్థవంతమవుతాయి. తిరస్కార వోటు కూడా వోటే. అది కూడా వోటరు choice ను సూచించేదే. దానికి ఉండే ప్రయోజనాలు, అది నేర్పే రాజకీయపాఠాలూ దానికీ ఉంటాయి. అభ్యర్థులను నిలబెట్టడంలో రాజకీయపక్షాలు ఇక మీద జాగ్రత్త పడతాయి. ఎన్నికలప్రక్రియ దీనివల్ల ఎంతోకొంత ప్రక్షాళనమవుతుంది.

నిజానికి తిరస్కార వోటుకు ఎప్పుడో అవకాశం కల్పించి ఉండవలసింది. ఇప్పటికైనా సుప్రీం కోర్టు ద్వారా అది జరుగుతున్నందుకు సంతోషించాలి. అయితే, సుప్రీం కోర్టు తీర్పులను తిరగదోడే పనికీ రాజకీయపక్షాలు పూనుకుంటున్నాయి. ఈ విషయంలో పార్టీ భేదాలకు తావులేని అపూర్వ సయోధ్య రాజకీయపక్షాలలో వ్యక్తమవుతోంది. కనుక తాజా తీర్పు అమలుకు పార్లమెంటు ద్వారా అవి చక్రం అడ్డేయడానికి ప్రయత్నిస్తే ఆశ్చర్యం లేదు.

 ఎన్నికల సంస్కరణలను కానీ మరో సంస్కరణను కానీ రాజకీయనాయకత్వాల నుంచి ఆశించలేమనీ, ఏ సంస్కరణ జరగాలన్నా సుప్రీం కోర్టు కొరడా అందుకోవలసిందేననీ తాజా తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది.

ఈ తీర్పు అమలులో కొన్ని ప్రశ్నలు లేదా సమస్యలు ఎదురయ్యే మాట నిజమే. ఉదాహరణకు. తిరస్కార వోటు అభ్యర్థులు తెచ్చుకున్న వొట్ల శాతం కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించాల్సి రావచ్చు. సమస్యలు ఉంటే ఉండచ్చు, కానీ తిరస్కార వోటు వోటర్ల పక్షాన జరిగే ప్రజాస్వామిక న్యాయం. ప్రస్తుతం ఉన్న వోటింగ్ పద్ధతిలో వోటర్లు పోషిస్తున్నది passive పాత్ర మాత్రమే. అంటే ఉన్న అభ్యర్థులలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం మాత్రమే. తాజా తీర్పు అమలు జరిగితే వోటర్లు active పాత్రలోకి మారతారు. తమ తీర్పుకు మూడో కోణం ఉందని చెబుతారు. తిరస్కార వోటు కూడా వోటే నన్న సంగతిని మరచిపోకూడదు. 

Wednesday, September 25, 2013

మన వివాహసంబంధాలు- గాంధారి పెళ్లి


మన వివాహ సంబంధాలు బోర్లించిన గోపురం ఆకారంలో ఉంటాయి. పైన ఉండే వైశాల్యమూ, చుట్టుకొలతా కిందికి వెడుతున్న కొద్దీ తగ్గిపోతాయి. పై భాగాన అంతర్జాతీయస్థాయి వివాహాలు ఉంటే, అట్టడుగున ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకునే వివాహసంబంధాలు ఉంటాయి. ఈ మధ్యలో జాతీయం, రాష్ట్రీయం, ప్రాంతీయం, గ్రామం వగైరా  ఉంటాయి. అంతర్జాతీయస్వభావం కలిగిన వివాహాల సంఖ్య తక్కువే అయినా వాటి  భౌగోళిక వైశాల్యం చాలా ఎక్కువ. రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీల వివాహం అంతర్జాతీయం. అలాగే, చాలాకాలంగా ప్రచారంలో ఉన్నట్టు రాహుల్ గాంధీ కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే జరిగితే అది కూడా అంతర్జాతీయం అవుతుంది.  జాతీయ వివాహాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. ఇందిరాగాంధీ-ఫిరోజ్ గాంధీల వివాహం జాతీయం. అలాగే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం. కిందికి వెడుతున్న కొద్దీ ఒకే స్వభావం కలిగిన వివాహ సంబంధాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కానీ, ఎంపిక స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది. కులం, ప్రాంతం వగైరాలకు చెందిన ప్రాధాన్యాలు, పట్టింపులు అందుకు కారణమవుతాయి. ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకోవడం బహుశా వివాహసంబంధాల సంకుచిత, కనిష్ట రూపం.  

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)

Thursday, September 19, 2013

సమైక్య సెంటిమెంట్ ఉందని నేతలకు తెలియలేదట! ఎందుకు తెలియలేదో అడిగారా?

విభజనా, సమైక్యమా అనేది కాసేపు అలా ఉంచుదాం...

నాకు కొన్ని రోజులుగా ఒకటే ఆశ్చర్యం కలిగిస్తోంది.

సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న సెంటిమెంట్ ఇంత బలంగా ఉన్నట్టు మాకు తెలియదని చాలామంది ఎంపీలు, మంత్రులు, కేంద్రమంత్రులు అనడం గమనించే ఉంటారు.

 "తొందరపడ్డామేమోననీ, సీమాంధ్ర అంచనాలో పొరపాటు చేశామనీ" సోనియా గాంధీ రాజకీయ సలహాదారు  అహ్మద్ పటేల్ అన్నట్టు తాజాగా వార్త వచ్చింది.

సీమాంధ్రలో సమైక్యానికి అనుకూలంగా బలమైన సెంటిమెంట్ ఉందని మంత్రులు సహా ప్రజాప్రతినిధులకు ఎందుకు తెలియలేదు? వాళ్ళు జనంలో లేరా? జనంతో కనెక్ట్ అయి లేరా? తమ తమ నియోజకవర్గాలలో జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోడానికి ఈ పదమూడేళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి కూడా ప్రయత్నించ లేదా? కనీసం, తెలంగాణకు అనుకూలంగా 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేసిన తర్వాతనైనా సీమాంధ్రుల మనోభావాలను తెలుసుకోడానికి వీరు ప్రయత్నించలేదా?

వారిని ఈ ప్రశ్నలు అడిగినవారు ఎవరూ కనిపించలేదు.

2004 ఎన్నికలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో, తద్వారా తెలంగాణ ఇస్తామన్న ఆశలు ఆ ప్రాంతం వారిలో ఎప్పుడైతే రేకెత్తించిందో, రాష్ట్రపతి పార్లమెంట్ ప్రసంగం లో ఎప్పుడైతే తెలంగాణ ప్రస్తావన చేశారో అప్పుడే తెలంగాణ తథ్యమన్న సంకేతాలు వెళ్లిపోయాయి. కాకపోతే ఎంత కాలానికి అనేదే అప్పటికి మిగిలిన ప్రశ్న.

పోనీ, ఆ సంకేతాలను అప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోలేక పోయారనుకుందాం. 2009లో చిదంబరం ప్రకటన చేసిన తర్వాతనైనా అర్థం చేసుకోవాలి కదా! ఎన్నికల రాజకీయంలో భాగంగా టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అంతమాత్రాన తెలంగాణ ఇచ్చేస్తారేమిటి అని మామూలు జనం అనుకోవచ్చు, రాజకీయనాయకులు అనుకోగలరా? వాళ్ళకు political instinct లేదా రాజకీయ ఇంగితం, లేదా దూరదృష్టి ఉండద్దా?

వారిని ఈ ప్రశ్నలు అడిగినవారూ కనిపించలేదు.

నాయకుల్లో పైన చెప్పిన లక్షణాలు ఉండి ఉంటే, వాళ్ళు జనంలో ఉండి ఉంటే;  తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా సమైక్య ఉద్యమాన్ని అప్పుడే  నిర్మించి ఉండేవారు. హైదరాబాద్ లో ఎంజీవోలు పెట్టిన సభల్లాంటివి సీమాంధ్రప్రాంతాలలోనూ పెట్టి ఉండేవారు.

ఇలా అనడంలో ఉద్దేశం, తెలంగాణాను ఇవ్వద్దనో, లేదా ఇవ్వమనో చెప్పడం కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని ప్రాంతాలలోని మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవలసిందే. ఇప్పటి సమైక్య ఆందోళన ముందునుంచీ ఉండి ఉంటే అదొక balancing factor గా ఉపయోగపడి కేంద్రం అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే దిశగా స్పష్టమైన ఆలోచనలు చేసి ఉండేది. ఊహించలేకపోయామంటూ సీమాంధ్ర నాయకులు తప్పించుకోజూడడం సరైన excuse అవుతుందా?!

తొందరపడ్డామనీ, అంచనా వేయలేకపోయామనీ అహ్మద్ పటేల్ అనవలసిన పరిస్థితి అసలెందుకు వచ్చింది? దానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి.  సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి తగిన feed back కేంద్రానికి అంది ఉండకపోవాలి. లేదా అందినా కేంద్రం దానిని పట్టించుకోకపోయి ఉండాలి. జనంలో సెంటిమెంట్ ఉందని మాకు తెలియలేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులే అంటున్నారు కనుక మొదటి కారణమే నిజమై ఉండాలి.

                                                                     ***
నాకీ సందర్భంలో ఒకటి గుర్తొస్తోంది.
అరవైదశకం చివరి మాట. అప్పటికి నేనింకా విద్యార్థిగా ఉన్నాను. ప్రపంచ తెలుగు సభలో, రచయితల సభలో జరుగుతున్నాయి, నాకు గుర్తు లేదు. కానీ ఒక సన్నివేశం మాత్రం ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ కళ్ళముందు కదులుతోంది, వేదిక మీద ముఖ్యమంత్రి సహా మంత్రులు పలువురు ఉన్నారు. కపిల కాశీపతి అనే ఓ సీనియర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయనాయకుల మీద నిప్పులు చెరుగుతున్నారు. అది ఎంతవరకు వెళ్లిందంటే, "అవాకులు చెవాకులు పేలే రాజకీయ నాయకుడిని నోరుముయ్యి(ఒక తిట్టు పదం వాడారు)అంటూ చొక్కా పుచ్చుకుని కిందికి ఈడ్చితే తప్ప ఈ రాజకీయాలు బాగుపడవు" అన్నారాయన. ముఖ్యమంత్రి ఉన్న సభలో ఆయన అలా మాట్లాడడం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసెసింది. అందుకే ఆ ఘటన గుర్తుండిపోయింది.

పాత్రికేయులు పద్ధతిగా ఉన్నారా అన్నది వేరే ప్రశ్న. ఉండేవారు ఉన్నారు, లేని వారు లేరు. అలాగే రాజకీయనాయకులూ...

నా ప్రశ్న ఏమిటంటే, జనంలో సెంటిమెంట్ ఉందని మాకు తెలియలేదు, ఊహించలేదన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులను "అయితే మీరు జనంలో లేరా, జనంతో కనెక్ట్ అయి లేరా?" అని ఏ ఒక్కడూ ఎందుకు అడగలేదు???


సముద్రతీరం వెంబడి నరసాపురం నుంచి మచిలీపట్నానికి...

 నే నోసారి నరసాపురం(ప.గో.జిల్లా) వెళ్లినప్పుడు తెలిసిన ఓ సంగతి నన్నెంతో విస్మితుణ్ణి చేసింది. మత్స్యకారులు నరసాపురానికి దగ్గరలో ఉన్న సముద్రతీరం వెంబడే సైకిళ్ళమీద కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొస్తారట!  నేటి రైలు, రోడ్డుమార్గాలలో సైకిల్ కంటే వేగంగా పయనించే ఏ వాహనం మీద వెళ్ళినా అది సాధ్యం కాదు. మా ఊరి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే, ఎదురుగా నదికి ఆవలి గట్టున తూర్పు గోదావరి జిల్లా ఊళ్ళు ఉంటాయి. కరణంగారు పొద్దుటే గొడుగు పుచ్చుకుని బయలుదేరి పడవలో గోదావరి దాటి తూ.గో. జిల్లా ఊళ్ళకు వెళ్ళి సాయంత్రం చీకటి పడే లోపల తిరిగొస్తూ ఉండేవారు.

భౌగోళిక రేఖాపటాలతో నిమిత్తం లేకుండా నదీతీర గ్రామాల వాళ్ళు ఒకే గుండెతో స్పందించడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. పాపికొండలలో పేరంటపల్లి అనే ఓ గిరిజన గ్రామంలో బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. పాపికొండలు నేడు మనం కొత్తగా గీసుకున్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలి కావడం నాకో అద్భుతంగా తోస్తుంది. బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. లాంచీ మా ఊరి రేవుకి వచ్చినప్పుడు గోదావరి గట్టుకు పరుగెత్తిన జనంలో నేను కూడా ఉన్నాను. 

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)



Wednesday, September 11, 2013

చలికాలంలో ఓ వెచ్చని సాయంత్రం...

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు.

 నిజానికి బాపన్నగూడెం అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  అదో చిన్న స్టేషన్. రైలు లేటు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది. 

అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా అనుకుంటూ నేను కూడా  ఆ మంట దగ్గరికి చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి పరిచయాలు ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి.

 ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన  తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు ఆ చలిమంటతో పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు...

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. దయచేసి మీ స్పందనను సారంగలో పోస్ట్ చేయండి)

మళ్ళీ మతకల్లోలాల 'ఉపాధి హామీ పథకం'?!

అప్పుడు 1992. ఇప్పుడు 2013.
మధ్యలో 21 సంవత్సరాలు!

1992కు ముందు కూడా దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది.
ఇప్పుడూ ఆర్థిక సంక్షోభంలో ఉంది.

అప్పుడు మతకల్లోలాలు దేశాన్ని అట్టుడికించాయి.
ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ పరిణామాలు ఆ దుర్దినాలను గుర్తుచేస్తున్నాయి

ఒక్క యూపీలోనే కాదు, ఇంకా అనేక రాష్ట్రాలలో
మతకల్లోల వాతావరణం ఉందని హోమ్ మంత్రి సెలవిస్తున్నారు.

 చరిత్ర ఎందుకిలా పునరావృతమవుతోంది?

ఆర్థిక సంక్షోభానికీ, మతకల్లోలాలకూ మధ్య
కనిపించని ముడి ఏమైనా ఉందా?!

ఆర్థిక సంక్షోభంనుంచి పుట్టుకొచ్చిన నిరుద్యోగుల సేన
ఇన్నేళ్ల విరామం తర్వాత
రాజకీయనాయకులకు వాటంగా అందివచ్చిందా?
మతకల్లోలాల రూపంలో 'ఉపాధి హామీ పథకం'
అమలు జరుగుతోందా?!

ప్రతి ఒకరూ కరువును ప్రేమిస్తారని
ఎవరో అన్నారు
అలాగే ప్రతి రాజకీయ నాయకుడూ
ఆర్థిక సంక్షోభాన్ని ప్రేమిస్తాడనే వాక్యాన్ని
దానికి జోడించుకోవాలా?!

మతకల్లోల కాలం తర్వాత అడుగుపెట్టిన
అభివృద్ధి కాలంలో జ్ఞాననేత్రం విప్పుకున్న
నేటి యువత ఇప్పటి పరిణామానికి
ఎలా స్పందిస్తుంది?

ఆ స్పందనలోనే దేశ భవిష్యత్తుకు
భరోసా ఉంది.

                             ***

ఇంకో ఆశ్చర్యం...

గతంలో మతకల్లోలాలప్పుడు
మతాల పేర్లు చెప్పకుండా
రెండు వర్గాల మధ్య ఘర్షణగా పేర్కొంటూ
మీడియా జాగ్రత్త, బాధ్యత పాటించేది

ఇన్నేళ్లలో అది కూడా
తన ప్రవర్తనా నియమావళిని
మరచిపోయినట్టుంది
మతాల పేర్లు పేర్కొని మరీ
కల్లోలాన్ని కవర్ చేస్తోంది.

ఏమైంది ఈ దేశానికి?
ఎటు వెడుతోంది?







Wednesday, September 4, 2013

అమ్రీష్ పురి, ఓం పురి ల వంశం ఏమిటి?

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పూరుడిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ. వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది. 

అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అని కోశాంబి అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున పురి అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్చిన్నతను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. 

ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ lo నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను దయచేసి అందులో పోస్ట్ చేయండి)