Wednesday, September 4, 2013

అమ్రీష్ పురి, ఓం పురి ల వంశం ఏమిటి?

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పూరుడిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ. వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది. 

అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అని కోశాంబి అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున పురి అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్చిన్నతను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. 

ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ lo నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి. మీ స్పందనను దయచేసి అందులో పోస్ట్ చేయండి)

No comments:

Post a Comment