పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ పెట్రోలు పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు(9-10-13) తన కార్యాలయానికి మెట్రో రైలులో వెళ్లారు. ఆయన వెంట సిబ్బందీ, సెక్యూరిటీ, మీడియా కూడా ఉన్నారు.
ఓ మంత్రి ఇలా మందిని వెంటబెట్టుకుని రైల్లో వెళ్ళడం ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది అవదా, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదా, లాంఛనప్రాయం కాదా అని కొన్ని వార్తా చానెళ్లు ప్రశ్నిస్తున్నాయి. ఓ చానెల్ వీక్షకుల స్పందన కోరింది. వీక్షకులు కూడా దీనిని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు. నిజంగా పొదుపు చర్యలు తీసుకోవాలనే అనుకుంటే ఇంతకన్నా మంచి మార్గాలే ఉన్నాయన్నారు. దేశం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ప్రజలే పెట్రోల్ వాడకం మానేస్తారని, మంత్రి ప్రత్యేకంగా పొదుపు తత్వాన్ని బోధించనక్కరలేదని ఒక వ్యాఖ్యాత అన్నారు.
కొన్ని రోజుల క్రితం మొయిలీ ఇదే విధంగా పొడుపును ప్రతిపాదించారు. అప్పుడు కూడా మీడియా, కొన్ని రాజకీయపక్షాలు ఎద్దేవా చేశాయి.
నిజమే, రాజకీయనాయకుల చిత్తశుద్ధినీ, పబ్లిసిటీ యావనూ ప్రశ్నించవలసిందే. పొదుపు చేయడానికి ఇంతకన్నా మెరుగైన మార్గాలూ ఉన్నమాట కూడా నిజమే. మంత్రులు చేయవలసింది చేయకుండా ఇలా జిమ్మిక్కులతో జనాన్ని మోసం చేస్తున్నారన్న అభిప్రాయంలో నిజం ఉండదనీ చెప్పలేం. నాయకులలో ఉన్న సవాలక్ష లోపాలను ఎత్తి చూపి కడిగేయండి, తప్పులేదు. దాంతోపాటే, మెట్రో రైలు వాడకాన్ని ప్రోత్సహించే మంత్రి చర్యపై పాజిటివ్ గా స్పందించ నవసరమూ లేదా?
throwing the baby with bath water అన్నట్టుగా ఒక మంచి మెసేజ్ నీ తోసిపుచ్చడం సరైనదేనా?
పౌరరవాణా వ్యవస్థలపై ఆధారపడాలనీ, కార్ పూలింగ్ వంటి పద్ధతులను పాటించాలనీ, వ్యక్తిగత మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే మాట చాలాకాలంగా వినిపిస్తున్నదే. ముందు ముందు ఈ అవసరాన్ని మరింతగా గుర్తించాల్సి వస్తుంది. పౌరరవాణా సదుపాయాలను తగినంతగా అభివృద్ధి చేయలేదన్న విమర్శ మన ప్రభుత్వాలమీదా ఉంది. హైదరాబాద్ లాంటి నగరాలలో మెట్రో రైలు వల్ల కలిగే లాభాలలో ప్రైవేట్ వాహనాల వినియోగమూ తద్వారా కాలుష్యం తగ్గడం వంటివి కూడా ఉంటాయని మనకు తెలిసినదే.
ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు అత్యవసర వస్తువులు మినహా ఇతర వస్తువుల కొనుగోలును కొన్ని రోజులపాటు విరమించడం కూడా ధరల పెరుగుదలపై ఒక నిరసన ప్రకటన లేదా ధరలను కిందికి దింపే ఒక మార్గం కాబోదా?