Sunday, August 3, 2014

పిల్లలపై పెద్దవాళ్ళ రుద్దుడు

పిల్లల పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది.

ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలపై తమ కోరికలు, సరదాలు రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందనుకుంటారు.

స్కూల్లో టీచర్లు తమ ఇష్టాలు, తమ నమ్మకాలు పిల్లలపై రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందనుకుంటారు.

పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళు తాము విశ్వసించే విషయాలనే పాఠాలుగా తయారు చేసి పిల్లలపై రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందను కుంటారు.

ప్రభుత్వాలు, న్యాయస్థానాలు...ఒకటేమిటి సమాజానికి చెందిన అన్ని అంగాలు పిల్లలను ఫలానా విధంగా తీర్చి దిద్దే బాధ్యత తమకు ఉందనుకుంటాయి. ఏ రంగానికి చెందినవారైనా సరే, పిల్లల పాలిట బెత్తం ఝళిపించే బడి పంతుళ్లే.

పెద్దవాళ్ళమనుకునే ప్రతివారూ పిల్లల్ని సొంత ప్రయోగశాలగా చూసే వాళ్ళే.

ఇంతకన్నా మరో ఛాన్స్ రాదన్నట్టు పెద్దవాళ్ళు తమకు తెలిసినవీ, తమకు ఇష్టమైనవీ, తాము నమ్మేవీ అన్నీ  పిల్లల నోరు బలవంతంగా తెరిపించి ఏకధారగా పోసేయాలనుకుంటారు. వారికి అవి జీర్ణమవుతాయా కావా అని కూడా ఆలోచించరు. మొత్తానికి పెద్దవాళ్ళు అందరూ కలసి స్కూలును ఒక concentrated camp గా మార్చివేస్తారు.

అరె..పిల్లలు స్కూల్లో ఎంతసేపు గడుపుతారో అంతకన్నా ఎక్కువసేపు తల్లిదండ్రులతోనూ, బయటి ప్రపంచంతోనూ గడుపుతారన్న స్పృహ వీళ్లలో ఎందుకు ఉండదు? పిల్లలకు మనం నేర్పే దానికంటే  వాళ్ళు సొంతంగా నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుందనే ఆలోచన వీళ్ళకు ఎందుకుండదు? ఇంకో సంగతి గమనించారోలేదో? పెద్దవాళ్ళ బుర్ర కన్నా పిల్లల బుర్ర షార్ప్ గా ఉంటుంది. గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. వారు దేనినైనా వేగంగా నేర్చుకోగలుగుతారు. తల్లిదండ్రుల్లారా, టీచర్లలారా, పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళు లారా, ఇంకా వివిధ రంగాలకు చెందినవాళ్ళ లారా...మీ పిల్లలతోనే మిమ్మల్ని పోల్చి చూసుకోండి, మీకు తెలియని విషయాలు అనేకం వాళ్ళకు తెలుసున్న సంగతి మీకే అర్థమవుతుంది.

తనకే ఆ అధికారం ఉంటే పిల్లలకు పాఠశాల నుంచీ భగవద్గీత బోధించే ఏర్పాటు చేస్తానని ఒక జడ్జీగారు సెలవిచ్చినట్టు తాజా వార్త. పిల్లలకు భగవద్గీత బోధించాలన్న సంగతి తమరు స్కూల్లో భగవద్గీత చదువుకున్న అనుభవంతోనే అంటున్నారా స్వామీ? బహుశా మీరు పెద్దయ్యాక భగవద్గీత మిమ్మల్ని ఆకర్షించి ఉంటుంది. పెద్దయ్యాక స్వచ్ఛందంగా భగవద్గీతవైపు ఆకర్షితులయ్యే అవకాశం పిల్లలకు కూడా ఇచ్చే బదులు బలవంతంగా బోధించడం ఎందుకు మహాశయా?

మా అబ్బాయికి చిన్నప్పుడు స్కూల్లో భగవద్గీత శ్లోకాలు బట్టీ పట్టించేవాళ్ళు. ఇంట్లో వాటిని వల్లెవేస్తూ ఉండేవాడు.ఇప్పుడు వాణ్ని అడిగితే ఒక్క శ్లోకం కూడా చెప్పలేడు.  పిల్లలకు భగవద్గీత అనే గ్రంథం ఉందన్న సమాచారం ఇస్తే చాలు. లాంగ్వేజ్ స్కిల్స్ కోసం కొన్ని శ్లోకాలను బట్టీ పట్టించడంలో తప్పులేదు. కానీ బోధించడమా?! ఏం బోధిస్తారు? వారికి అది ఏమాత్రం అర్థమవుతుంది? ఏమాత్రం తమకు దానిని అన్వయించుకోగలుగుతారు?

స్కూల్లో బలవంతంగా మీరు ఎన్ని నేర్పినాసరే, పిల్లలు పెద్దవుతున్నకొద్దీ స్వచ్ఛందంగా వాటిని మించి ఎన్నో నేర్చుకుంటారు. బలవంతంగా నేర్పినదానికన్నా స్వచ్ఛందంగా నేర్చుకున్నదే ఎక్కువ నాటుకుంటుంది. స్కిల్స్ అనే మాటను పనులకు సంబంధించే ఎక్కువగా వాడుతూ ఉంటాం. లెక్కలు నేర్చుకోవడం, భాష నేర్చుకోవడం వగైరాలు కూడా స్కిల్స్ కిందికే వస్తాయి. ఒక వయసు వరకు పిల్లలకు స్కిల్స్ అందించడమే ప్రధానం కావాలి. తక్కువ నేర్పి ఎక్కువ నేర్చుకునే అవకాశం పిల్లలకు వదిలేయడమే నిజమైన చదువు.

పిల్లల్ని పెద్దవాళ్ళు సొంత ప్రయోగశాలగా వాడుకోవడం అనే దౌర్జన్యాన్ని గుర్తించినప్పుడు, పిల్లల చదువు ఎలా ఉండాలన్నది ఫ్రెష్ గా ఆలోచించడానికి వీలవుతుంది.

3 comments:

  1. భగవద్గీత సంగతి ఏమో కాని, మీరు ముందు వ్రాసిన విషయాలన్నీ నిజాలే!

    ReplyDelete
  2. మంచి పోస్ట్, అభినందనలు సర్.

    ReplyDelete
  3. నేనూ భగవద్గీత అభిమానినే. గీతని కొద్ది శ్లోకాల రూపంలో పిల్లలకి కాస్త ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ మొత్తం పుస్తకాన్నీ ప్రిస్క్రైబ్ చేసే హక్కు మనకి లేదు. మంచి అని మనం అనుకున్నదైనా సరే, దేన్నీ ఎవరికీ తప్పనిసరి చేయకూడదు. నిర్బంధంలోంచి జ్ఞానం, సృజనాత్మకత పుట్టవు. మన సమాజంలో Freedom of thought and freedom of speech ఈ రెండూ లేకపోవడం వల్లనే మన దేశం ఎన్నున్నా ఓ మూల చతికిలబడి ఉండాల్సి వస్తోంది. శతాబ్దాల తరబడి ఈ రుద్దుడు పాలసీల మూలాన కొత్తాలోచనలంటేనే గడగడా వణికి చచ్చే పరిస్థితి మన సమాజంలో! ఒకప్పుడు సోవియట్ రష్యాలో కూడా దశాబ్దాల పాటు కమ్యూనిజాన్ని తప్పనిసరి పాఠ్యాంశంగా చేశారు. కానీ ఆ వ్యవస్థ పతనం కాకుండా ఆ రుద్దుడు ఆపలేకపోయింది.

    ReplyDelete