Thursday, October 29, 2015

స్లీమన్ కథ-14: ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.
తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సేలోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:
(పూర్తి రచన 'ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/29/%E0%B0%8E%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%95%E0%B1%87%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6/ లో చదవండి)

Thursday, October 22, 2015

స్లీమన్ కథ-13: తొలి తవ్వకాలలో చితాభస్మం దొరికింది!

అది పెద్దగా ఖర్చులేని చిన్న ప్రారంభం. వెంట నలుగురు పనివాళ్లు, ఒక గాడిద. ఏడాది మొత్తంలోనే ఎండలు బాగా మండే కాలం కనుక, ఉదయం అయిదుకే బయలుదేరాలని ఉత్తర్వు చేశాడు. తను నాలుగుకే లేచి, సముద్రస్నానం చేసి, ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగి బయలుదేరాడు. కొండ ఎక్కడానికి రెండు గంటలు పట్టింది. పైకి వెళ్ళాక పెలొపనీసెస్ పర్వతాలను ఆనుకుని ద్రాక్షమద్యం రంగులో ఉన్న సముద్రం కనిపిస్తుందనుకున్నాడు(హోమర్ తన ఇలియడ్ లో అలా వర్ణించాడు). ఆ ఎత్తునుంచి గ్రీస్ మొత్తాన్ని చూడచ్చేమో నని కూడా అనిపించింది.

Friday, October 16, 2015

స్లీమన్ కథ-12: నడివయసులో ప్రేమలేఖ అందుకున్నాడు

అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు కల్కోస్ట్ లో ఇద్దరూ కలసి ఆడుకున్న రోజుల్ని నిరాసక్తంగా గుర్తుచేసుకున్నాడు. ఆపైన ప్రష్యా రాయబారికి రాసిన ఉత్తరంలోలానే ఎత్తిపొడుపులు జోడిస్తూ పరుషవాక్యాలు గుప్పించాడు. ఒకప్పుడు నీ ప్రేమను అర్థిస్తే తిరస్కరించావనీ, ఇప్పుడు వయసులో నా కంటే పెద్ద అయిన నీతో అవారాలా తిరిగే ఉద్దేశం లేదనీ అన్నాడు.  
(పూర్తి రచన 'ఒంటినిండా ఒంటరితనాన్ని కప్పుకుంటూ...' అనే శీర్షికతో  http://magazine.saarangabooks.com/2015/10/15/%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95/ లో చదవండి)

Wednesday, October 7, 2015

రాజధానిప్రాంతంగా విజయవాడపై ఫోకస్ ఏదీ?

(జాన్సన్ చోరగుడి రాసిన 'మన విజయవాడ' అనే పుస్తకంపై సాక్షి దినపత్రిక(4 అక్టోబర్ 2015)లో వచ్చిన నా సమీక్ష)

మొన్నటి వరకూ తెలుగువాళ్ళకు తమదంటూ చెప్పుకోదగిన ఓ మహానగరం లేదు. నగరం లేకపోతే నాగరికత ఎలా వస్తుంది?” అనేవారు రాంభట్ల కృష్ణమూర్తి. ఇప్పుడు తెలుగువాళ్ళకు రాజధాని రూపంలో మరో మహానగరం రాబోతోంది. దానిని అమరావతి అనే అందమైన, చారిత్రక స్ఫురణ కలిగిన పేరుతో పిలవబోతున్నా దానికి విశాలమైన దేహాన్ని కల్పించబోయేది మాత్రం విజయవాడే. ఇక్కడో విచిత్రం ఉంది. అమరావతి అనే రాజధానిలో విజయవాడ వెళ్ళి కలసిపోవడం లేదు. రాజధాని నగరమే విజయవాడలో కలిసిపోబోతోంది. ఈవిధంగా విజయవాడ రెండు త్యాగాలు చేయబోతోంది. రాజధాని అని ఘనంగా చెప్పుకునే అవకాశాన్ని అమరావతికి ధారపోస్తోంది. ఇంద్రుడికి ఆయుధం కావడం కోసం దధీచి వెన్నెముకను అర్పించినట్టుగా, రాజధాని కోసం విజయవాడ తన దేహాన్ని అర్పిస్తోంది.
అయితే, తను చేయబోతున్న త్యాగాల గురించీ; రాజధాని ప్రాంతంగా తను సరికొత్త రూపురేఖల్ని తెచ్చుకోబోవడం గురించీ విజయవాడనగరానికి ఇప్పటికీ తెలిసినట్టులేదు. పూర్వం బాల్యవివాహాలు చేసేవారు. పెళ్లన్నా, పెళ్లికూతురు ముస్తాబన్నా ఏమీ తెలియని వయసు కనుక; అలంకారానికి యాంత్రికంగా ఒళ్ళు అప్పగించడం తప్ప రేపు తన రూపు ఎలా మారుతుందో, పెళ్లి తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో బాలవధువుకి ఏమీ తెలియదు. పైగా మన  పెళ్లిళ్లు చాలావరకూ అర్థరాత్రి ముహూర్తాల్లోనే కనుక ఆ చిన్నారి నిద్రలో జోగుతూ ఉంటుంది. రాజధానీ అవతరణ పూర్వసంధ్యలో ఇప్పుడు విజయవాడ కూడా అలాగే జోగుతున్నట్టుంది.
ఏ జాతిచరిత్రలో నైనా రాజధాని నిర్మాణం ఒక ఉజ్వలఘట్టం. ఒక ఉత్తేజకరసందర్భం. ఎన్నో కలలు, ఊహలు, ప్రణాళికలతో మనసులు కిక్కిరిసిపోయి తబ్బిబ్బు పడాల్సిన సమయం. రాజధాని నిర్మాణమంటే కేవలం భూసేకరణ  కాదు. రియల్ ఎస్టేట్ పుంజాలు తెంచుకోవడం కాదు. ప్రభుత్వం ఏదో చేసేస్తుంటే జనం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన ఘట్టం అసలే కాదు. సమాజం తాలూకు సర్వాంగాలూ కొత్త రక్తం నింపుకుని సరికొత్త ఉత్సాహంతో పాలుపంచుకోవలసిన సన్నివేశం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ సందడి కనిపించడంలేదు. రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసికపార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం  ఉంటుంది. రాజధానిసుందరికి దేహపుష్టితోపాటు చక్కని నడక, నాజూకూ కూడా అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావివర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు.
అర్థమయ్యుంటే ఈ వర్గాల దృష్టి ఇప్పటికే విజయవాడమీద ఫ్లడ్ లైట్ కాంతితో పడి ఉండేది. ఈ నగర చరిత్రేమిటి, దీని కథేమిటి, దీని ప్రస్తుత స్థితి గతులు ఏమిటి, దీనికున్న హంగులూ, అవకాశాలూ ఎలాంటివి, రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి దీనికి ఇంకా ఏమేం కావాలి సహా అనేక ప్రశ్నల్లోకి ఇప్పటికే లోతుగా తలదూర్చి ఉండేవి. కనీసం విజయవాడ మీద చిన్నవో, పెద్దవో పుస్తకాలైనా ఈపాటికి మార్కెట్ ను ముంచెత్తి ఉండేవి. ఆ దాఖలాలు లేవు. అయితే, ఇంత ఎడారిలోనూ ఒక ఒయాసిస్... అది, జాన్సన్ చోరగుడి వెలువరించిన మన విజయవాడ.
తెలుగునాట అభివృద్ధి-సామాజిక అంశాలను కాలికస్పృహతో విశ్లేషించి వ్యాఖ్యానించే కొద్దిమంది సీరియస్ రచయితల్లో  జాన్సన్ చోరగుడి ఒకరు. విజయవాడపై తను చేసిన రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ  మన విజయవాడ పేరుతో తొలి ముద్రణను ఆయన 2000 సంవత్సరంలోనే ప్రచురించారు. ప్రస్తుత రాజధాని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దానికే మరికొన్ని అంశాలు జోడిస్తూ పునర్ముద్రించారు. ఆవిధంగా ఈ పుస్తకానికి ఒక వైతాళిక’(మేలుకొలుపు) స్వభావం వచ్చింది.
విజయవాడను కలర్ ఫుల్ గా కాకుండా బ్లాక్ అండ్ వైట్ లో చూపించడానికి జాన్సన్ ప్రయత్నించారు. నేటి తీరుతెన్నులను ఎత్తిచూపుతూ మెత్తని వాతలూ పెట్టారు. నైసర్గికంగా విజయవాడ ఉత్తర,దక్షణాలకు కూడలి అవడంవల్ల మొదటినుంచీ వర్తకకేంద్రంగానే ఉంటూవచ్చిందనీ, ఆ విధంగా వెచ్చాలవాడ అయి, క్రమంగా వెచ్చవాడ’, బెజవాడ అయిందని ఆయన అంటారు. క్రీ.శ. 10-11 శతాబ్దులలో విజయవాడ వేంగీ చాళుక్యుల ఏలుబడిలో ఉన్నప్పుడు రాష్ట్రకూటులు, వారి వత్తాసుతో రెండవ యుద్ధమల్లుడు జరిపిన దండయాత్రలతో విజయవాడ ఓ పెద్ద రణరంగంగా మారి అరాచక శక్తులకు ఆటపట్టు అయిందనీ; అప్పటినుంచీ ఆ అరాచక స్వభావం కొనసాగుతూ ఉండడం విజయవాడ ప్రత్యేకత అనీ అంటారు. పంచాయతీగా ఉన్నప్పుడు విజయవాడ రూపురేఖలేమిటి, అది ఎప్పుడు మునిసిపాలిటీ అయింది, విజయవాడకు ఎప్పుడు రైలొచ్చింది-- మొదలైన వివరాలను ఎంతో ఆసక్తి భరితంగా అందిస్తూనే; వ్యవసాయ ఆర్థికతనుంచి సినిమా, ఆటో మొబైల్ రంగాలకు;  రక రకాల మోసాలతో సహా డబ్బు సంబంధ వ్యాపారాలకూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చిందో ఒక సామాజికశాస్త్రవేత్తకు ఉండే లోచూపుతో విశ్లేషించారు. సామాజికవర్గాల అమరికను, ఊర్ధ్వచలనాన్ని స్పృశించారు. విజయవాడ పుస్తక ప్రచురణ కేంద్రంగా మారిన నేపథ్యాన్నీ తడిమారు. నాణ్యమైన చదువుల స్పృహ ఫలితంగా విస్తరించిన విద్యాసంస్థలతో, మేధోవలసలతో విజయవాడ గ్లోబలైజేషన్లో భాగమవుతున్నా; “ఇప్పటికీ వెరపు లేకుండా బహిరంగంగా బూతులు(సెక్సు కాదు, తిట్లు) మాట్లాడడం బెజవాడలో సహజ దృశ్యశ్రవణ”మనీ, “పొలం నగరంలోకి రావడం అంటే ఇదే” ననీ అంటూ ఆ చిన్న వ్యాఖ్యా దర్పణంలోనే కొండంత బెజవాడను చూపించారు.  “మానసిక కాలుష్యం లేని ఒక తరం కనుక ఆవిర్భవిస్తే...ఇక్కడ అన్ని విధాల ఆరోగ్యవంతమైన రాష్ట్రరాజధాని రూపు దిద్దుకోవడం ఇప్పటికీ సాధ్యమే” నన్న చారిత్రక ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు.
76 పేజీల ఈ సచిత్ర రచన పరిమాణంలో చిన్నదే కానీ విషయవైశాల్యంలో, లోతులో చిన్నది కాదు. రేపు ఒక సమగ్ర రచనకు అవకాశమిచ్చే అన్ని రకాల ప్రాతిపదికలూ ఇందులో ఉన్నాయి. రాజధాని నిర్మాణ నేపథ్యంలో రావలసిన అనేక రచనలకు ఇది వేగుచుక్క అనడం అతిశయోక్తి కాదు.
                                                           ***
మన విజయవాడ(బొమ్మ కలర్ కాదు బ్లాక్ అండ్ వైట్), రచన: జాన్సన్ చోరగుడి, పబ్లిషర్స్: కృష్ణవేణి ప్రచురణలు, విజయవాడ-8, ప్రతులకు: కృష్ణవేణి ప్రచురణలు, 54-19-10A, జయప్రకాష్ నగర్, విజయవాడ-520008; అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, వెల: 60రూ. 

Friday, October 2, 2015

'గాంధీ భారత్'(1915-2015)కు నూరేళ్ళు!

(అక్టోబర్ 2, 2015 గాంధీ జయంతి రోజున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన నా వ్యాసం)

స్వతంత్రభారతంలో పుట్టినవాళ్ళు గాంధీ శిలా విగ్రహాలు, గాంధీ చౌక్ లు, గాంధీ నగర్లు, గాంధీ జయంతులు, గాంధీ వర్ధంతుల మధ్య పెరిగారు. అవి లేని భారతదేశాన్ని వాళ్ళు ఊహించలేరు. అలాగే వాళ్ళలో చాలామందికి ఇప్పుడవి పెద్దగా స్పందనా కలిగించవు. కానీ, చరిత్ర కోణం నుంచి చూస్తే ఈ గాంధీ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది  గాంధీ భారతం జరుపుకుంటున్న శతజయంతివత్సరంలో వచ్చిన గాంధీ పుట్టినరోజు.  గాంధీ సరిగ్గా వందేళ్ల క్రితం, 1915లో, తన నలభై ఆరో ఏట దక్షిణాఫ్రికానుంచి భారత్ కు శాశ్వతంగా తిరిగివచ్చాడు. వస్తూనే భారత రాజకీయ, సామాజిక కార్యక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టాడు. అప్పటినుంచీ 1948లో హత్యకు గురయ్యేవరకూ వంచిన నడుము ఎత్తకుండా నిర్విరామంగా పనిచేశాడు. 1948 తర్వాత కూడా శిలావిగ్రహాలు, స్థలనామాలు, స్మారకనిర్మాణాలు వగైరాల రూపంలో దేశంలో మూల మూలలకు వ్యాపించిపోయాడు. మంచికీ, చెడ్డకూ; ఆరాధనకూ, ద్వేషానికీ అన్నింటికీ తనే లక్ష్యంగా మారాడు. కానీ ఇప్పుడిప్పుడు ఒక విచిత్రమైన పరిణామం సంభవిస్తోంది. ఒక పక్క గాంధీ ప్రాతినిధ్యం వహించిన భావజాలవిగ్రహాలపైనా, ఆయన ముఖ్య అనుయాయుల విగ్రహాలపైనా గునపం పోట్లు పడుతున్నాయి. మరోపక్క ఆ చేతులతోనే గాంధీ మెడలో పూలదండలు పడుతున్నాయి. గాంధీ ఈ రోజున ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకున్న భీముడి విగ్రహం అవడం స్పష్టంగా కనిపిస్తోంది.
వందేళ్లు సుదీర్ఘకాలమే. సాధారణంగా అంత నిడివికి చూపుల్ని విస్తరించే ఓపిక, ఆసక్తి చాలామందికి ఉండదు. విస్తరిస్తే మాత్రం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు! అలవాటైన చరిత్రా, పరిసరాల మీదుగా కాలంలోకి వెనక్కి వెడుతున్న కొద్దీ పాత గతమే కొంగొత్తగా కనిపిస్తూ మనల్ని విస్మితుల్ని చేస్తుంది. మన అవగాహనకు కొత్త కోణాలను, మెరుపులను అద్దుతుంది. అంతేకాదు, ఒక్కోసారి చరిత్ర వినూత్న వేషంలో పునరావృతమవడమూ కనిపిస్తుంది.
తిలక్, గోఖలేల భారతం
వందేళ్ల గాంధీ భారతానికి ముందు, అంటే 1914 వరకూ ఉన్నది గాంధీ భారతం కాదు. అది, బాలగంగాధర తిలక్, గోపాల కృష్ణ గోఖలే, లాలా లజపతిరాయ్, మదన మోహన మాలవీయ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సావర్కర్, జిన్నాల భారతం. వీరిలో చిత్తరంజన్ దాస్, సావర్కర్, జిన్నాలు గాంధీ కంటే చిన్న. అయినా భారత్ కార్యక్షేత్రంలో గాంధీకి సీనియర్లు. భారత్ కు వచ్చేనాటికి గోఖలేతోనే గాంధీకి సన్నిహితపరిచయం. గాంధీకి ఆయన గురుతుల్యుడు. తిలక్, లజపతిరాయ్, మాలవీయ, సావర్కర్ లు హిందువుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ముద్రపడ్డారు. బ్రిటిష్ ఛత్రచ్ఛాయలోనే ముస్లిం ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని జిన్నా భావిస్తున్నాడు. మళ్ళీ నాటి నేతల మధ్య సాత్విక, తీవ్రవాద భేదాలూ ఉన్నాయి. కుల ప్రాతిపదికపై రాజకీయాలు నడిపేవారూ ఉన్నారు. అలాగే, బ్రిటిష్ పాలకులకు మహజర్లు సమర్పించుకునే శిష్టవర్గం ఉంది. ఇక అనుయాయుల్ని చూస్తే, వాళ్లలోనూ కులం, మతం వగైరాల రూపంలో రకరకాల చీలికలు. ఆపైన నిద్రాణంగా అసంఖ్యాక సామాన్యజనం.
దక్షిణాఫ్రికాలో 20 ఏళ్లపాటు పోరాడిన అనుభవాన్నీ, విజయాలనూ వెంటబెట్టుకుని గాంధీ 1915, జనవరి 15న వచ్చి వీళ్ళమధ్య పడ్డాడు. అప్పటికాయన పేరు దేశంలోని నాయకులకే తప్ప, జనసామాన్యానికి అంతగా తెలియదు. బొంబాయిలో ఓడ దిగగానే గాంధీ, కస్తూర్బాలకు ఘనస్వాగతమే లభించింది. ఆరోగ్యం బాగులేకపోయినా గోఖలే కూడా పూనా నుంచి వచ్చి స్వాగతం చెప్పాడు. బొంబాయిలో వరసపెట్టి గాంధీ స్వాగతసభలు జరిగాయి. ఒక సభకు తిలక్, ఇంకో సభకు జిన్నా అధ్యక్షత వహించారు. భారత్ లో ఎలా ఉండాలో, ఏం చేయాలో గాంధీ ప్రణాళికతో వచ్చాడు. అప్పటివరకూ వేసుకున్న కాంట్రాక్టు కార్మికుల దుస్తులు వదిలేసి, గుజరాతీ సాంప్రదాయిక ఆహార్యంలోకి మారిపోయాడు. సభలలో ఇంగ్లీష్ పొగడ్తలకు గుజరాతీ ధన్యవాదాలు చెప్పి ఆశ్చర్యచకితం చేశాడు. ఈ పిచ్చివాడు త్వరలోనే ఇక్కడి అడవిమాలోకంలో కలసిపోయి అదృశ్యమైపోతాడని చాలామంది అనుకున్నారు.
అనుయాయిగా ఒక దర్జీ
కలసిపోయాడు కానీ అదృశ్యం కాలేదు. వస్తూనే గోఖలే ఆదేశంపై, అది కూడా థర్డ్ క్లాస్ బోగీలో, దేశమంతా చుట్టేశాడు. అప్పటికే అస్పృశ్యతా నివారణ, హిందూ-ముస్లిం ఐక్యత, స్వాతంత్ర్య సాధన అన్న అజెండా ఆయన దగ్గర ఉంది. తను పనిలోకి దిగడానికి ఒక స్థావరం, కొంత డబ్బు, మెరికల్లాంటి అనుయాయులు, ఓ పత్రిక అవసరమన్న అవగాహన ఉంది. క్రమంగా ఒకటొకటే సమకూడాయి. భారత్ లో ఆయనకు తొలి అనుయాయిగా చెప్పదగిన వ్యక్తి ఓ దర్జీ. అతనిపేరు మోతీలాల్. రైల్లో పరిచయమయ్యాడు. తమ విరమ్ గావ్ రైల్వే స్టేషన్ చుట్టూ కస్టమ్స్ వలయం ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంది, తీయించకూడడా అని గాంధీని అడిగాడు. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లడానికి మీరు సిద్ధపడితే ప్రయత్నిస్తానని గాంధీ అన్నాడు. మోతీలాల్ ఒప్పుకున్నాడు. గాంధీ వైస్రాయి దాకా వెళ్ళి ఆ చిన్న సమస్యను పరిష్కరించాడు.  అదే భారత్ లో తొలి సత్యాగ్రహ యోచనకు నాంది పలికింది.
'నాతో చేరి చరిత్ర సృష్టించు'
ఆయన ముఖ్య సహచరశ్రేణిలో మొదట చేరింది కృపలానీ.  శాంతినీకేతన్ లో ఉండగా గాంధీని కలసి, చరిత్ర అధ్యాపకుడిగా తనను పరిచయం చేసుకున్నప్పుడు, నాతో కలసి పనిచేస్తూ చరిత్ర సృష్టించు అని గాంధీ ఆయనతో అన్నాడు. ఆ తర్వాత పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి తదితరులు ఆయన ప్రభావపరిధిలోకి వచ్చారు. ఒకపక్క హిందూ తీవ్రవాదులు, ఇంకోపక్క ముస్లిం తీవ్రవాదులు, వేరొక పక్క కులవ్యతిరేక విప్లవకారులు—ఇదీ గాంధీ వచ్చేటప్పటికి ఇక్కడి పరిస్థితి. దక్షిణాఫ్రికాలో అప్పటికే అహింస, సత్యాగ్రహాలతో గాంధీ ప్రయోగాలు జరిపి ఉన్నాడు. హింసను వ్యతిరేకిస్తూ, అది పాశ్చాత్యమే కానీ భారతీయం కాదంటూ హిందువులనూ, హింసావాదులనూ కూడా ఆకట్టుకునే వ్యూహంతో గుజరాతీలో హింద్ స్వరాజ్ అనే పుస్తకం రాసి పెట్టుకున్నాడు. 1915లోనే కలకత్తాలో తీవ్రవాదపంథాకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ, హింసావాదంతో ఎవరైనా దేశాన్ని భయభ్రాంతంచేయాలనుకుంటే వారికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా ఉద్యమిస్తాననీ, ఒకవేళ తనే హింసాత్మకంగా తిరగబడదలచుకుంటే బహిరంగంగా చెప్పి మరీ చేస్తానన్నాడు. అలీసోదరులుగా ప్రసిద్ధులైన షౌకత్ అలీ, మహమ్మద్ అలీలు ఆ సమావేశంలోనే గాంధీ ప్రభావంలోకి వచ్చారు. భవిష్యత్తులో  హిందూ-ముస్లిం సమైక్యతా యత్నాలలో ఒక ముఖ్యపాత్ర పోషించి, అనంతర పరిణామాల వల్ల క్రమంగా ఆయనకు దూరమయ్యారు.
నిప్పులు చెరిగిన ప్రసంగం
గాంధీ ఎందుకోగానీ భారత్ లోకి అడుగుపెట్టిన తొలి ఏడాదిలో కొంత అస్థిమితంగానూ, అశాంతిగానూ ఉన్నట్టున్నాడు. మాట కూడా పరుషంగానూ, దూకుడుగానూ ఉన్నట్టు కొందరికి అనిపించింది. 1916 ఫిబ్రవరి 6న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకదినోత్సవానికి ఆహ్వానితుడుగా హాజరై ఆయన చేసిన ప్రసంగం ఇంకో ఉదాహరణ. ఎక్కడలేని మురికీ ఈ నగరంలోనే ఉందన్నాడు. ఒంటి మీద జిగేలుమనే ఆభరణాలతో వేదికమీద కూర్చున్న సంస్థానాధీశులను చూపించి, ఆ నగలు తీసి పక్కన పెడితే తప్ప ఈ దేశానికి విముక్తి లేదన్నాడు. ఈ దేశాన్ని రక్షించగలిగింది రైతులే తప్ప న్యాయవాదులో, డాక్టర్లో, జమీందార్లో కాదని తెగేసి చెప్పాడు. ఉత్సవానికి వైస్రాయి రాక సందర్భంగా నగరమంతటా పోలీస్ పటాలాల్ని దింపడాన్ని ప్రస్తావించి ఇలా భయంతో చస్తూ బతకడం కన్నా చావే నయమని అనేశాడు. అంతా దిగ్భ్రాంతి చెందారు. అధ్యక్షస్థానంలో ఉన్న అనిబిసెంట్ కలవరపడి గాంధీ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించింది. ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు మాత్రం గాంధీ ఆకర్షణలో పడిపోయారు. ఒకరు ఘనశ్యామ్ దాస్ బిర్లా, ఇంకొకరు వినోబా భావే. భవిష్యత్తులో వీరిద్దరూ గాంధీ ముఖ్యసహచరుల్లో భాగమయ్యారు.
పాత-కొత్తల వారధి
పై రెండు ప్రసంగాలూ, వీటి మధ్యలో 1915 డిసెంబర్ లో జరిగిన బొంబాయి కాంగ్రెస్ లో చేసిన ప్రసంగం గాంధీని మిగతా నాయకులకు భిన్నంగా జనానికి చూపించాయి. ఈయన తమ తరపున, తమలో ఒకడుగా, తమ భాష మాట్లాడుతున్నాడనుకున్నారు. అంతేకాదు, అన్ని పక్షాలవారినీ అధిక్షేపిస్తూనే వాళ్ళకు మద్దతు పలుకుతూ ఈయన వాళ్ళకో పజిల్ లానూ తోచాడు. గడియారం ముల్లైనా ఆగుతుందేమో కానీ గాంధీ ఆగే ప్రశ్నలేదు. ఆయన నిర్విరామంగా తిరిగే ఓ పని యంత్రం. దానికితోడు ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళిక ఉంటుంది. 1917లో చంపారన్, 1918లో ఖెడా రైతు ఉద్యమాలు, ఆ ఏడాదే అహ్మదాబాద్ జవుళిమిల్లు కార్మికుల పక్షాన జరిపిన సత్యాగ్రహం  విజయవంతమై గాంధీ ప్రతిష్టను పెంచాయి. 1918లోనే రౌలట్ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సత్యాగ్రహం ఆయనను యావద్భారత నేతగా ప్రతిష్టించింది. ఒకపక్క తిలక్, లజపతిరాయ్, మాలవీయ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్, జిన్నా(గాంధీ భారత్ కు వచ్చిన కొన్ని వారాలకే గోఖలే కన్ను మూశాడు)లాంటి పాత కాపులతో స్నేహవారధి కట్టుకుంటూనే తన సహచరశ్రేణిని నిర్మించుకుంటూవచ్చాడు. ఘర్షణ తలెత్తినప్పుడు సహచరుల బలంతో తన పంథాను నెగ్గించుకుంటూ, వీలు కానప్పుడు రాజీ పడుతూ ముందుకు వెళ్ళాడు. పాత, కొత్త నేతలతో; వారి భావజాలాలతో తను స్నేహవారధి కట్టుకోవడమే కాదు; క్రమంగా తనే వారధి అయ్యాడు. ఇటు హిందూ వాదులైన లజపతి రాయ్, మాలవీయ, స్వామీ శ్రద్ధానంద; అటు ముస్లిం ప్రతినిధులైన జిన్నా, అలీ సోదరులు ఆయన ప్రణాళికలో విడదీయలేని భాగాలు అయ్యారు. ఖిలాఫత్ ఉద్యమరూపంలో హిందూ-ముస్లిం ఐక్యత గట్టిపడుతున్నట్టే కనిపించింది. కానీ 1920 సహాయనిరాకరణ ఉద్యమం దరిమిలా ఐక్యత బీటలు వారింది. ఆ పగులు పెద్దదవడమే తప్ప మళ్ళీ అతుక్కోలేదు. కాకపోతే గాంధీ ప్రభావంతో హిందూ-ముస్లిం ఐక్యతను నొక్కి చెప్పే ఒక బలమైన వర్గం రూపొందింది.
సవాలుగా మారిన సావర్కర్, జిన్నా
ఈ నేపథ్యంలో 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.)అవతరించింది. అటు ముస్లిం శ్రేణులు కూడా వివిధపద్ధతుల్లో సంఘటితమవుతున్నాయి. వివిధ భావజాలాలకు వారధి కాగలిగిన గాంధీ నాయకత్వ సరళి అప్పటికీ చెదిరిపోలేదు. సుభాష్ చంద్రబోస్ వంటి రాడికల్స్ తో; ఆచార్య నరేంద్ర దేవ, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టులతో ఒక మేరకు పని చేయగలుగుతున్నాడు. అలాగే, ఇంతకు ముందు లజపతిరాయ్, మాలవీయ వంటి పాతకాపులైన హిందూవాదులను కూడా కలుపుకోగలిగాడు. కానీ, ఈ కొత్త హిందుత్వ వర్గాలను కలుపుకోవడం ఆయనకు చేతకాలేదు. బ్రిటిష్ కన్నా ఎక్కువగా ఆయనకు ఇద్దరు పెద్ద సవాలు అయ్యారు: ఒకరు సావర్కర్, ఇంకొకరు జిన్నా. విశేషమేమిటంటే జిన్నాను కలసుకోవడం కన్నా చాలా ముందే, 1909లో లండన్ లో గాంధీ, సావర్కర్ ఒక సమావేశంలో కలసుకున్నారు. అంతే, వాళ్ళ మధ్య ఎప్పుడూ మాటా మంతీ జరగలేదు. జిన్నాతో చర్చలు జరిగినా ఫలించలేదు. అలాగే, గాంధీ సనాతనవాదులతోనూ తలపడ్డాడు. ఈ వర్గం నుంచి ఆయనపై దాడులు, హత్యాప్రయత్నాలూ జరిగాయి. చివరికి వీరి భావజాల బంధువుల చేతిలోనే హత్యకు గురయ్యాడు.
అనేక కారణాల చేత గాంధీని తప్పు పట్టేవారు అన్ని రకాల భావజాలాలవారిలోనూ ఇప్పుడున్నారు. ఇందులో రెండు తేడాలు ఉన్నాయి. మొదటిది, చరిత్రను ఒక స్థిరస్థితినుంచి చూడడం. రెండవది, చలనశీలతనుంచి చూడడం. ఈ రెండు రకాల చూపులూ రెండు రకాల తీర్పునకు దారి తీయచ్చు. తటస్థంగా చూస్తే, అంతవరకూ శిష్టవర్గం ఆక్రమించుకుని ఉన్న రాజకీయవేదిక మీదికి జనసామాన్యాన్ని తీసుకురావడం, ఐక్యపోరాటాల నిర్మాణం వగైరాలలో ఈ వందేళ్ల భారతరాజకీయాలపై గాంధీ ముద్ర కనిపించవచ్చు. అదలా ఉంచితే, నూరేళ్ళ కాలచక్రం ఒక ఆవృత్తిని పూర్తి చేసుకున్నాక ఇప్పుడు గమనిస్తే; గాంధీ 1915లో భారత్ లోకి అడుగుపెట్టడానికి ముందు, అంటే 1914 నాటికి ఉన్న హిందూవాదుల తరహా రాజకీయాలే ప్రబల స్థితిలో ఉన్నాయి. గాంధీ భారతం నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి బిక్క చూపులు చూస్తోంది. చరిత్ర పునరావృతికి ఇదొక ఆసక్తికరమైన ఉదాహరణ. 

Thursday, October 1, 2015

స్లీమన్ కథ-11: చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు

చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంటూ వాళ్ళు పగలబడి నవ్వేశారు. “నేను మంచినీళ్లు అడగ్గానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చిన ఔదార్యం, దయా కలిగిన ఈ జనం కచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడూ నల్లమందు సేవించి ఉండ”రని డైరీలో రాసుకున్నాడు.

(పూర్తి రచన 'చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు' అనే శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/09/27/%E0%B0%9A%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A1-%E0%B0%AE%E0%B1%80%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%87%E0%B0%9F%E0%B1%81%E0%B0%95-%E0%B0%A4%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A/లో చదవండి)