Friday, February 26, 2016

ఆంధ్రభాగవత కర్త(లు) ఒకరా, నలుగురా?..మరికొంత చర్చ

మహాభారతాన్ని ముగ్గురు కవులు అనువదిస్తే, భాగవతాన్ని పోతనగారు ఒక్కరే అనువదించారని చాగంటి కోటేశ్వరరావుగారు అన్న నేపథ్యంలో, “భాగవతాన్ని పోతన ఒక్కరే అనువదించలేదు, మరో ముగ్గురు అనువదించారు” అన్న వాస్తవిక వివరాన్ని గుర్తు చేయబోతే, అది కాస్తా ఊహించని మలుపు తిరిగింది.  అయినా మలుపు మంచిదే అయింది. అయ్యగారి నాగేందర్ స్పందిస్తూ సంగ్రహంగా ఇలా అభిప్రాయపడ్డారు.

1.     పన్నెండు స్కంధాలూ పోతనగారే రాశారు. ఆయన తన రచనకు ప్రాచుర్యం కల్పించలేదు, కోరుకోలేదు. ఈ విషయం కృతిలోనే చెప్పుకున్నారు. 2. చాలాకాలంపాటు పూజా మందిరంలోనే లోనే ఉంచడంవల్ల తాళపత్రాలకు చెదలు పట్టాయి. పోతనగారు జీవించినవి భవంతులు కావు. శ్రీనాథుడికో, నన్నయకో ఉన్న సదుపాయాలు పోతనకు లేవు. ఆయన జీవనవిధానం వేరు. 3. శిథిలమైన భాగాలను ఆయన శిష్యులైన గంగన, సింగన, నారయలు పూరించారు.  ఇదే శిష్టజనామోదమూ, బహుళజనామోదమూ పొందిన అభిప్రాయం. 4. ఈ విషయాలలో అనుమానాలు చొప్పించే ప్రయత్నం వ్యర్థం. 5. పోతన భాగవత రచన తర్వాతే వీరభద్రవిజయము రచించారు.

ఇంతకీ పండితులు ఏం చెప్పారన్న ఆసక్తితో నా దగ్గర అందుబాటులో ఉన్న ఆంధ్రమహాభాగవతప్రతిని, 1982లో పోతన పంచశతి మహోత్సవాల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధ శాఖ ప్రచురించిన "మహాకవి పోతన" అనే వ్యాససంపుటిని పరిశీలించే అవకాశం కలిగింది. అందుకు ధన్యవాదాలు.
శ్రీ మహాభాగవతాన్ని మొదట ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించగా, తెలుగు విశ్వవిద్యాలయం పునర్ముద్రించింది. "బహు పాఠాన్తర పరిష్కార విపుల పీఠికా సహితం"గా అందించిన ఈ ముద్రణకు రాయప్రోలు సుబ్బారావు, దివాకర్ల వేంకటావధాని, తాపీ ధర్మారావు, దీపాల పిచ్చయ్యశాస్త్రి, బిరుదురాజు రామరాజు సంపాదకత్వం వహించారు. ఆపైన వారితో సహా 26 గురు పండితులు భాగవతప్రతుల పరిశీలనలో పాల్గొన్నారు.
అనుమానాలు చొప్పించనిదే పరిశోధనే లేదు. కనుక అనుమానాలు చొప్పించే ప్రయత్నం వ్యర్థమని కొమ్ములు తిరిగిన పండితులే అనుకోలేదు. వాళ్ళూ పోతన మీద భక్తి, ఆరాధనా ఉన్నవారే. అలాగని పోతన భాగవతం గురించి ప్రచారంలో ఉన్న కథల్ని గుడ్డిగా నమ్మేసి ఊరుకోలేదు. సాధ్యమైనంతవరకు ప్రశ్నించారు, తర్కించారు. అకాడెమీ భాగవత విపుల పీఠికలో 153 పాఠాన్తరాలను చర్చించి సాధు పాఠాన్ని నిర్ణయించడానికి పండితులు చేసిన ప్రయత్నాన్ని గమనిస్తే; అంతకుముందు భాగవతాన్ని పరిష్కరించి ప్రచురించిన పెద్ద పెద్ద పండితులు కూడా చిన్న చిన్న ప్రమాదాలకు ఎలా లోనయ్యారో అర్థమవుతుంది. ఉదాహరణకు అనేకమంది పండితులు మూలంలో ఏముందో గమనించుకోకుండా కొన్ని పాఠాన్తరాలను కల్పించడం కనిపిస్తుంది. వెంకట్రామా &కో వారికోసం ఒంటి చేతితో భాగవతపరిష్కరణ చేసి అందించిన మా నాన్నగారు విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు కూడా అక్కడక్కడ ఇలాంటి ప్రమాదాలకు లోనయ్యారని చెప్పడానికి నేను సంకోచించను. ఇంకా విశేషమేమిటంటే, సాహిత్య అకాడెమీ అధ్వర్యంలో 26గురు  పండితులు చేసిన భాగవతపాఠనిర్ణయంలోనూ  పొరపాట్లను ఎత్తిచూపిన ఉదాహరణలున్నాయి. ఒక కవిని అభిమానించడం, కావ్యాన్ని ఆస్వాదించడం వేరు. పరిశోధన, పరిష్కరణ, పాఠనిర్ణయం అనేవి వేరు. వేటికవే తమవైన స్వతంత్ర అస్తిత్వంతో, స్వతః ప్రమాణాలతో పనిచేస్తాయి. రెంటినీ కలగాపులగం చేయకూడదు. పరిశోధనకు పూనుకున్నప్పుడు అంధభక్తి, స్వపరభేదాలు, అభిమానదురభిమానాలు అడ్డురాకూడదు. కనుక పరిశోధన మీద జిజ్ఞాస ఉన్న భావి పండితులు అనుమానాలను చొప్పించే ప్రయత్నం విధిగా చేస్తూ ఉండవలసిందే తప్ప వ్యర్థమని ఊరుకోకూడదు.

అకాడెమీ భాగవత పీఠికలో “కట్టుకథ”ల గురించిన కొన్ని వాక్యాలు:

1.     శైథిల్య వృత్తాంతము: భాగవతరచనమును గూర్చియు దాని శైథిల్యమును గూర్చియు వింతవింత కథలు ప్రచారమందున్నవి. తనకు కృతి నంకిత మీయని కారణమున సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతమును పాతిపెట్టించె ననియు నందువలన నది యుత్సన్నమయ్యెననియు నొక కట్టుకథ కలదు. పోతన్నగారే దాచి దాచి తమ చరమదశలో వెలికి దీసి కుమారుని కీ సారస్వతనిక్షేపము నందిచ్చు నప్పటికే శిథిలమై యుండెననియు మరియొక కథ కలదు. మొదటిదాని కన్న నిది మెరుగుగా నున్న కథ. కాని అనుముల సుబ్రహ్మణ్యశాస్త్రిగారును, మల్లంపల్లి సోమశేఖరశర్మగారును భాగవత ముత్సన్నమగుటకు అప్పటి రాజకీయపరిస్థితులే కారణములని చెప్పినది మరికొంత సమంజసముగా నున్నది...తెలంగాణ మధికభాగము బహ్మనీ సుల్తానుల వశమైపోయినది. మరికొంత గజపతుల చేతిలో బడినది. నిజమైన కారణమేదో తెలియదు.

అకాడెమీ భాగవత పీఠికాకర్త గంగన, సింగన, నారయలు భాగవతాన్ని పూరించారని కొన్ని చోట్ల, అనువదించారని కొన్ని చోట్ల అన్నప్పటికీ పూరణవైపే మొగ్గినట్టు కనిపిస్తుంది. ఆయన ఇంకా ఇలా అంటారు:

 నిజమైన కారణమేదో తెలియదు కాని పోతనగారి భాగవత మంతయు లభించలేదు. ప్రౌఢసరస్వతి యను బిరుదువహించిన కేసన వంటి కుమారుడుండ, దాక్షాయణీపరిణయకర్తలైన కేసన మల్లన కవుల వంటి మనుమలుండ, భాగవత శిథిలపూరణము లేదా శేషపూరణము నారయ, సింగన, గంగనల పాలబడుట చిత్రము.
అకాడెమీ భాగవత పీఠికాకర్త ప్రకారం వీరభద్రవిజయము భాగవతరచన తరువాతిది అనడం కట్టుకథ. ఆ వాక్యాలు ఇవీ:

2.    వీరభద్రవిజయము భాగవతరచనము జరిగిన తరువాత వెలసిన కృతి యను కట్టుకథ యున్నది గాని అది నమ్మదగినది గాదు. వీరభద్రవిజయమందే యది పోతనగారి పిన్నతనపు రచనమనియు, అప్పటి కాతనికి వీరశైవము ముదిరియున్నట్లును నిదర్శనములున్నవి.
“మహాకవి పోతన” అనే వ్యాససంపుటిలో, “పోతన దేశకాలములు-కృతులు” అనే వ్యాసంలో ఆచార్య బి. రామరాజుగారి వాక్యాలు:
1.     అదేమి చిత్రమో కానీ మన ప్రాచీన మహాపురుషుల జీవితములు కాలములు వివాదాస్పదములు, కట్టు కథలకు పుక్కిటి పురాణములకు ఆకరములు.
2.    శ్రీనాథ, పోతనల బాంధవ్యము కట్టుకథ.(అనుమానాలను చొప్పించడం వ్యర్థమనుకుంటే ఈ కథను కూడా నమ్మేయచ్చు)
3.    దురభిమాన మసత్యమునకు అసత్యము ప్రమాదమునకు దారితీయును కదా. వీరభద్రవిజయము పోతనగారి బాల్యకృతి యనియు, కనుకనే యిందులో దోషములు దొరలెననియు, భాగవతకల్పతరువను పరిణతకృతికి వీరభద్రవిజయములో బీజములున్నవనియు...తెలియవలెను.

గంగన, సింగన, నారయలు పోతనలానే కొన్ని భాగవత స్కంధాలను ఆంధ్రీకరించినట్టే(పూరించడం కాదు) రామరాజుగారు అభిప్రాయపడ్డారు:

మన భారత రామాయణముల వలెనే భాగవతము కూడా ఒక్క చేతి మీదుగా పూర్తికాలేదు. పంచమ స్కంధమును బొప్పరాజు గంగన, షష్ఠస్కంధమును ఏర్చూరి సింగన, ఏకాదశ,ద్వాదశ స్కంధములను వెలిగొందల నారయ, తక్కిన స్కంధములను పోతన ఆంధ్రీకరించినట్టు ఈనాటికి నిర్ధారణమైన సాహిత్యచరిత్ర...(సర్వజ్ఞ సింగభూపాలుడు పాతిపెట్టగా) కొంత శిథిలమైనదనియు, శిథిల భాగములనే గంగన, సింగన, నారయలు పూరించిరనియు నొక దంతకథ.

రామరాజు గారి ప్రకారం, సింగభూపాలుడు పోతన భాగవతాన్ని పాతిపెట్టించాడన్న”కట్టుకథ”ను కల్పించినవాడు “సర్వలక్షణసారసంగ్రహ”కర్త కూచిమంచి తిమ్మన(1740). రామరాజుగారు ఇలా అంటారు:

అప్పకవి(1656), పోతనగారు శకటరేఫ, సాధురేఫములకు సాంకర్యమొనర్చినందుననే పూర్వలాక్షణికు లుదాహరింప లేదన్నందున, సాంకర్యము చేసినది పోతనగారు కాదనియు తక్కిన వారనియు చెప్పక కూచిమంచి తిమ్మన, సాంకర్యమును చేసినది శిథిల భాగములను పూరించినవారనియు, ఆ శైథిల్యము సింగభూపాలుడు పాతిపెట్టించుట వలన జరిగినదనియు, అంకితమీయనందున పాతిపెట్టించెననియు దిట్టమైన కట్టుకథ యల్లెను.
కనుక గంగన, సింగన, నారయలు చేసింది శిథిలపూరణం కాదని , స్వతంత్ర అనువాదమే ననీ రామరాజుగారు అభిప్రాయపడ్డారు. స్వయంగా పోతనగారే వారి చేత రాయించి ఉంటారన్న నిడదవోలు వెంకటరావుగారి అభిప్రాయాన్ని ప్రస్తావించారు:

శిథిలపూరణ విషయము అప్పకవిగాని అజ్జరపు పేరయలింగముగాని కేసన మల్లన కవులుగాని ప్రౌఢసరస్వతిగాని చివరకు గంగన సింగన నారయలుగాని చెప్పలేదు. కనుక దీనిని సులభముగా త్రోసివేయవచ్చును. మరి భాగవతము బహుకర్తృకమెందుకైనట్లు? భారతమును ముగ్గురు వ్రాసిరి. రామాయణమును నలుగురు వ్రాసిరి. భాగవతమునుగూడ నలుగురు వ్రాసిరి. వాని వ్రాతయంతే కాబోలు. స్వయముగా పోతనగారే గంగన సింగనలను పంచమ షష్ఠ స్కంధములను రచింప ననుమతించి యుందురనియు, పోతనగారు దశమస్కంధ రచనానంతరము శివలోకమునకో విష్ణులోకమునకో పోయిన తరువాత వెలిగందల నారయ ఏకాదశ ద్వాదశ స్కంధములు రచించి యుండుననియు కనుకనే పంచమ షష్ఠస్కంధములు, పోతనగారు రచించిన తదితర స్కంధములట్లుగాక అద్వైతపరమై యుండగా, పోతన మరణానంతరము రచింపబడిన ఏకాదశ ద్వాదశ స్కంధములు విశిష్టాద్వైతపరముగా నున్నవనియు నిడదవోలు వెంకటరావుగారు సమన్వయించిరి.

లాక్షణికులు పోతనను ప్రామాణికకవిగా భావించని మాట సత్యమే. అంతమాత్రాన పోతనపై, పోతన భాగవతంపై వారికి భక్తిగౌరవాలు లేవని భావించడం పొరపాటు. జనం పోతనను సహజకవిగా,  ప్రామాణిక కవులను మించి నెత్తిన పెట్టుకున్నారు. రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.

భాగవత రచనకు ముందే వీరభద్రవిజయమును పోతన రచించారని రామరాజుగారు కూడా అభిప్రాయపడ్డారు:

వీరభద్రవిజయము పోతనగారి బాల్యకృతి యనియు, కనుకనే ఇందులో దోషములు దొరలెననియు, భాగవత కల్పతరువను పరిణతకృతికి వీరభద్రవిజయములో బీజములున్నవనియు...తెలియవలెను.

పోతన గురించి రామరాజుగారు ఇంకా ఇలా అంటారు:

అసలు శ్రీనాథుడు పోతనగారి యింటికే రాలేదు. వచ్చినాడనుకొన్నను అతనికింత భోజనము పెట్ట చేతకాని శుష్క దరిద్రుడు కాడు పోతనామాత్యుడు. పల్లకిలో నూరేగునంతటి ఆస్థానకవి కాకపోయినను తామింత తిని పదిమందికి పెట్టగల స్తోమత యున్నవాడే పోతనామాత్యుడు. భాగవతములో నాయన తన తల్లిదండ్రుల గూర్చి చెప్పిన పద్యములను కొంచెము శ్రద్ధగా చదివినచో నీ విషయము తెలియును. పోతన వయసులో నున్నపుడు రాజాస్థాన వైభవములకు ప్రాకులాడియేగదా భోగినీదండకమును రచించినది. అటు తరువాత వయస్సు పెరుగు కొలది ఉన్నదానితో సంతృప్తిపడుచు-“పలికెడిది భాగవతమట...”యను స్థితికి వచ్చినాడు.

పోతనగారిపై రామరాజుగారి భక్తిప్రపత్తులను ఎవరూ సందేహించనక్కర్లేదు. అయినాసరే, పరిశోధకుడిగానూ, వయసుతోపాటు పరిణతిని తెచ్చుకునే మానవస్వభావంపట్ల అవగాహన కలిగినవారుగానూ ఆయన ఇక్కడ నిర్మమ దృష్టినే కనబరిచారు.

అకాడెమీ భాగవత పీఠికాకర్త అభిప్రాయాలను ఇలా క్రోడీకరించవచ్చు: 1. భాగవతాన్ని సర్వజ్ఞసింగభూపాలుడు పాతిపెట్టించాడన్నది కట్టుకథ. 2. పోతనగారే దాచి దాచి చరమదశలో కుమారుడికి అప్పగించేనాటికి అది శిథిలమైనదనే కథ ఇంతకన్నా కొంత మెరుగైనది. 3. భాగవతం శిథిలమవడానికి అప్పటి రాజకీయపరిస్థితులే(రాచకొండ, దేవరకొండ రాజ్యాలు అంతరించడం, తెలంగాణలో అధికభాగం బహ్మనీ సుల్తానుల వశం కావడం) కారణమన్న అభిప్రాయం అంతకంటే సమంజసమైనది. 4. వీరభద్రవిజయము భాగవతరచనకు ముందే జరిగింది. 5. ఇవి ఇలా ఉండగా, గంగన, సింగన, నారయలు భాగవతాన్ని పూరించారని కొన్ని చోట్ల, అనువదించారని కొన్నిచోట్ల అకాడెమీ భాగవత పీఠికాకర్త రాశారు. అంటే దీనిపై విశేషంగా దృష్టి సారించలేదన్నమాట.

బిరుదురాజు రామరాజుగారి అభిప్రాయాలను ఇలా క్రోడీకరించవచ్చు: 1. సర్వజ్ఞసింగభూపాలుడు భాగవతాన్ని పాతిపెట్టించాడన్నది కట్టుకథ. 2. భారతాన్ని ముగ్గురు రాసినట్టే, భాగవతాన్ని నలుగురు రాశారు. 3. గంగన, సింగన, నారయలు చేసింది పూరణ కాదు, స్వతంత్ర అనువాదం. (నిడదవోలు వారి అభిప్రాయం ప్రకారం) గంగన, సింగనల చేత పంచమ, షష్ఠ స్కంధాలను పోతనగారే అనువదింపజేశారు. ఆయన స్వర్గస్తులైన తర్వాత నారయ ఏకాదశ, ద్వాదశ స్కంధాలను అనువదించారు. 4. భాగవత రచనకు ముందే వీరభద్రవిజయమును పోతన రచించారు. 5. పోతన పల్లకిలో ఊరేగగల ఆస్థానకవి కాకపోయినా శుష్కదరిద్రుడు కాదు. వయసులో ఉన్నప్పుడు రాజాస్థాన వైభవాలకు పాకులాడినా, వయసు పెరిగిన తర్వాత ఉన్నదానితో సంతృప్తి పడుతూ భాగవత రచనకు పూనుకున్నారు.

గంగన, సింగన, నారయలు భాగవతాన్ని పూరించారనో, అనువదించారనో తేల్చి చెప్పకపోయినా ఏదో కారణం వల్ల పోతన భాగవతం శిథిలమైందని మాత్రం అకాడెమీ పీఠికాకర్త అభిప్రాయపడ్డారు. నాటి రాజకీయపరిస్థితుల కారణంగా అది జరిగిందన్న అభిప్రాయం ఎక్కువ సమంజసంగా ఉందని పేర్కొని ఆ పరిస్థితుల గురించి కూడా రాశారు. కాకతీయ సామ్రాజ్య పతనానికీ, విజయనగర సామ్రాజ్య అవతరణ వికాసాలకూ మధ్యకాలంలో సంభవించిన తురుష్కుల దండయాత్రలూ, ధర్మగ్లానీ వంటి కారణాలవల్ల భాగవతం శిథిలమైందని దాని సారాంశం. భాగవతమనే తాళపత్ర గ్రంథం శిథిలమవడం అనే పరిణామానికి ఇంతటి విశాల పరిణామాలతో ముడిపెట్టడం ఎంతవరకూ తర్కానికి నిలుస్తుందనేది ప్రశ్న. అనేక తాళపత్రగ్రంథాలు ఉండగా ధర్మద్రోహులు ఒక్క భాగవతంపైనే కత్తి కట్టి దానిని శిథిలం చేశారా?

ఒకవేళ ఇదే నిజమనుకున్నా, ధర్మద్రోహుల దృష్టి పడేటట్లుగా పోతనే 12 స్కంధాలూ రచించిన భాగవత తాళపత్ర ప్రతులు ఒకటి కాక అనేకం, అనేకచోట్ల ఉండి ఉండాలి. భాగవతమతం పలుచోట్ల వ్యాప్తిలో ఉండి ఉండాలి. అది ఒక ఉద్యమంగా వ్యాపించి ఉండాలి. ధర్మద్రోహులు అన్ని చోట్లకూ వెళ్ళి పనిగట్టుకుని ఒక్క భాగవత తాళపత్రప్రతులనే ధ్వంసం చేసి ఉండాలి. అలా జరుగుతుందా?! భాగవతప్రతులు అనేక చోట్ల అనేకం ఉన్నాయనుకుంటే, విధ్వంసం నుంచి కొన్నైనా తప్పించుకునే అవకాశం ఉంది. అప్పుడు పోతన చిరకాలంపాటు పూజామందిరంలో ఉంచడం వల్ల ఆ ఒక్క ప్రతీ శిథిలమైందన్న వాదానికి అది బాధకం అవుతుంది. ఇలా కాక, పోతన దాచిన ఒక్క ప్రతీ శిథిలమై; ఆ కారణంగా మిగతా ముగ్గురూ దానిని పూరించిన తర్వాత దానికి అనేక ప్రతులు ఏర్పడి, అనంతరపు దాడుల కారణంగా శిథిలమయ్యాయా అనుకుంటే అప్పుడు నాటి రాజకీయపరిస్థితుల కారణంగా శిథిలమైన భాగాలను మిగతా ముగ్గురూ పూరించారని చెప్పడం కుదరదు. అలా ఎవరూ చెప్పడం లేదు కూడా.

అకాడెమీ భాగవత పీఠికాకర్త ప్రకారం, “ఆంధ్రదేశముమందును ఆంధ్రదేశము బయటను భాగవతమునకు సంబంధించిన తాళపత్రగ్రంథములు వందలసంఖ్యలో కలవు”. వీటిలో 26 ప్రతులను పాఠపరిష్కరణకు ఎన్నుకొన్నామని ఆయన చెప్పుకున్నారు. అవి 1750-1893 మధ్యకాలానికి చెందినవి. ఇంకా ప్రాచీనమైనవి ఉన్నాయో లేదో తెలియదు. పోతన కాలంలో ఒక్క ప్రతి మాత్రమే ఉండి అనంతర కాలంలో వందలప్రతులు ఏర్పడడానికి కారణమేమిటి, ఆ మధ్యలో ఏం జరిగిందని ప్రశ్నించుకుంటే దానికి సమాధానంగా విధ్వంసం వాదాన్ని ముందుకు తేవచ్చు. అదెంత అతార్కికమో చూశాం.

పోతన తనెంతో భక్తిప్రపత్తులతో రచించిన భాగవతం ఒక్క ప్రతినీ చెదల భక్షణకు విడిచిపెట్టే నిర్లక్ష్యానికి పాల్పడరనుకోవడమే అన్నివిధాలా హేతుబద్ధం. తన భాగవతరచనను కుటుంబసభ్యుల మధ్యా, మిత్రుల మధ్యా మక్కువతో ఆయన పఠిస్తూ తన భక్తితత్పరతను వాళ్ళతో పంచుకునే ఉంటారనడం ఎంతైనా స్వాభావికం. ఆవిధంగా తను కోరకపోయినా తన రచనకు ఇతోధిక ప్రాచుర్యం కల్పించి ఉంటారనుకోవడమే న్యాయం.  స్వయంగా కవులైన ఆయన కొడుకు, మనుమలు భాగవతాన్ని చెదలు తింటుంటే ప్రేక్షకపాత్ర వహించారనుకోవడం కంటే అసహజం, అన్యాయం ఉండవు. తన రచనకు పరిమిత సంఖ్యలోనే అయినా ప్రతులు తయారు చేయించడానికి ఆయన జీవనవిధానం, ఆర్థికస్తోమత అడ్డువచ్చాయని భావించడమూ అలాంటిదే. క్రమంగా భాగవతానికి ప్రాచుర్యం పుంజుకుని వందల సంఖ్యలో ప్రతులు ఏర్పడ్డాయి. ఇలా భాగవత శైథిల్యవాదన తేలిపోయినప్పుడు,స్వయముగా పోతనగారే గంగన సింగనలను పంచమ షష్ఠ స్కంధములను రచింప ననుమతించి యుందురనియు, పోతనగారు దశమస్కంధ రచనానంతరము శివలోకమునకో విష్ణులోకమునకో పోయిన తరువాత వెలిగందల నారయ ఏకాదశ ద్వాదశ స్కంధములు రచించి యుండుననియు కనుకనే పంచమ షష్ఠస్కంధములు, పోతనగారు రచించిన తదితర స్కంధములట్లుగాక అద్వైతపరమై యుండగా, పోతన మరణానంతరము రచింపబడిన ఏకాదశ ద్వాదశ స్కంధములు విశిష్టాద్వైతపరముగా నున్నవనియు నిడదవోలు వెంకటరావుగారు సమన్వయించిరి.” అన్న రామరాజుగారి అభిప్రాయమే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.  

8 comments:


 1. అప్పుడప్పుడు అలా కొంటె కామింటులు పెడితే ఫలితం ఇట్లాంటి భేషైన మేటరు బయటకు వస్తుందన్న మాట !

  బాగుందండి మీ విపులమైన టపా ! ఈ టపా ఇంకా మరింత ఉత్సుకత ను కలిగిస్తుందని ఆశిస్తో !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీ తియ్యని కామెంటుకు థాంక్స్ జిలేబీగారూ....

   Delete
 2. భాగవత కథను పూర్తిగ
  ఆ కవులు నలుగురు తెనుగు ఆకృతి యనగన్
  యేకము జేరి మనలకి
  చ్చెన్ కద ! పోతన యొకరన చెప్పన్ తగునా

  ReplyDelete
 3. ఆలస్యంగా చూసాను, విశేషమైన విషయాలను అందించారు. మొత్తంగా ఈ చర్చ ద్వారా నేనూ నాలుగైదుమాట్లు ఇతర వ్యాసాలు, పరిశోధనలూ చదివే అవకాశం కలిగింది అందులో భాగంగా కొన్ని ఘట్టాల పారాయణం చేసే అవకాశమూ కలిగిది. మీకు కృతజ్ఞతలు.

  ఇక ఈ వ్యాసంలో మీరు అందించిన విషయాలతో పాటు అసలు చర్చావిషయంపై, అకాడెమీ వారు తేల్చని విషయాలు & రామరాజుగారి అభిప్రాయాలు తెలియజేసారు. నేను బేరీజు వేసిన పరిశోధక వ్యాస విషయాలూ ఏతా వాతా మీరు కానీ పై వారుకానీ చెప్పినది ఏమంటే 1) చారిత్రకులు, పరిశోధకులు చెప్పే మాట ’ఆంధ్ర భాగవత కర్తలు నలుగురు’ 2)పౌరాణికులు చెప్పే మాట "సంపూర్ణ ఆంధ్ర భాగవత కర్త పోతనగారు, నష్టభాగాన్ని పూరించినది మిగిలినవారు మువ్వురు కాబట్టి నలుగురు కర్తలు. (మరో పరిశీలన ప్రకారం నలుగురు అప్పుడౌదుగురౌతారు వాళ్ళపేర్లు ఇంతకు ముందు చర్చలో ఉంచాను).

  ఈ రెండూ ప్రపంచంలో ఉన్నవే. దీనిపై ఈ రెండు మతాలూ వ్యాప్తిలో ఉన్నవే. ఇక "వాస్తవానికి ఈ ఒక్క అభిప్రాయం దగ్గర" అన్నది అసలు కుదరనే కుదరని విషయం. వాస్తవంగా అది జరిగినప్పుడు పరిశోధకులు కానీ, వ్యాసకర్తలు కానీ ఆ కాలంలో వాస్తవంగా లేరు. అవి వాళ్ళవాళ్ళకు లభించిన కొన్ని కొన్ని ఆధారాల సహాయంతో తమ బుద్ధి చేసిన "స్వాభిప్రాయాలు" మాత్రమే. దొరికిన కొన్ని కొన్ని ఆధారాలతో మనం డ్రా చేసిన లేదా మనమనుక్కున్న అభిప్రాయాలకి దగ్గరగా ఉన్నంతమాత్రాన "వాస్తవం కానేరదు". ఇక్కడ వాస్తవం అనేది మనకు కానీ, కొమ్ములు తిరిగిన పరిశోధకులకూ కానీ "తెలియనిది", మనం కాలంలో వెనక్కి వెళ్ళి చూడలేం. we just draw it to a conclusion based on resources available to us, which always stands for correction. Yes, పరిశోధనకు అనుమానం ఒక ఉపాయం కానీ సత్యానికి కాదు.

  నా అభిప్రాయాలకు (with supportings) దగ్గరగా ఉన్నది అకాడెమీ వారి వ్యాసం. మీరు చెప్పినదానికి దగ్గరగా రామరాజు గారి వ్యాసం ఉన్నంత మాత్రాన రెండూ వాస్తవాలు కావు. ఇతః పూర్వం చెప్పినట్లే రెండు పాఠాలూ ఉన్నాయి, భవిష్యత్తులోనూ ఉంటాయి కూడా. ఒక పాఠం వారికి మరొకపాఠం వారికి బేధాభిప్రాయాలు ఉండవచ్చు అంత మాత్రాన ఒకరిది తప్పు మరొకరిది ఒప్పు అని చెప్పడం, చరిత్రలో ఇదమిత్థంగా ఇది జరిగింది అని చెప్పడం ఏ ఒక్కరికీ కుదరదు. అలా చెప్తే అది కేవలం వారి అభిప్రాయం - స్వంతనిర్ణయమే. ఇంతకుముందు వ్యాసంలో చెప్పిందీ అదే.

  కృతికర్తపై భక్తిప్రపత్తులూ రాగద్వేషాలకతీతంగా చెప్తున్నమాటలివి. నావరకు నిక్కంగా చెప్పాలంటే కృతికర్తకన్నా కృతికే ప్రమాణ్యం ప్రాధాన్యతానూ... ఇక వీరభద్ర విజయమూ యవ్వన దశలోనే రచించారన్నది తెలిసినదే దానిని భాగవతానంతరం పునః సమీక్షించారన్నదీ కొన్ని చోట్ల సవరించారన్నదీ చరిత్రలో ఉన్నదే... అందుకే అందులో మధ్యమధ్యలో కొన్ని పద్యాల సొబగులు రుచివేరు. అది అప్రస్తుతం అనుక్కోండి.

  ఇటువంటి వ్యాసాదులు చరిత్రకారులుకు విద్వాంసులకు విద్యార్థులకు మాత్రం కొంతమేర ప్రయోజనం కూర్చవచ్చు. ధన్యవాదాలు. _/|\_

  ReplyDelete
  Replies
  1. చరిత్రకారులు, పరిశోధకులు చెప్పినా; పౌరాణికులు చెప్పినా ఆంధ్రభాగవతకర్తలు నలుగురే నని మీరూ తేల్చారు. ధన్యవాదాలు. పౌరాణికులైన చాగంటివారు ప్రమాదవశాత్తూ ఆ సంఖ్యావివరాన్ని విస్మరించారనే నా ప్రారంభ టపాలో నేను అన్నది. ఆ అసలు విషయాన్ని ప్రతిసారీ నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. అయినా చర్చ దారితప్పుతూనే వచ్చింది. అయినా అది మంచిదే అయింది అనుకోండి. ఎలా చూసినా నలుగురే నని మీరు కూడా అనడంతో ఎట్టకేలకు అది దారికి వచ్చింది.
   మీరన్నట్టు రెండు అభిప్రాయాలూ ఉన్న సంగతిని నేనూ ప్రస్తావించాను. ఒకటి జనశ్రుతిలో ఉన్నది, ఇంకొకటి చరిత్రకారులు, పరిశోధకులు తేల్చినది. జనశ్రుతిని అనుసరించాలా; చరిత్రకారులు, పరిశోధకుల అభిప్రాయాన్ని అనుసరించాలా అన్న విషయంలో ఎవరి ఇష్టం వారిది. అయితే, “మనం కాలంలో వెనక్కి వెళ్ళి చూడలేము” అన్న మీ వ్యాఖ్య ఒక ప్రమాదానికి దారి తీసే అవకాశముంది. ఆ కాలంలో మనం లేము కనుక ఫలానా ఘటన ఫలానా విధంగానే జరిగిందని లేదా జరిగి ఉంటుందని చెప్పడానికి, చెప్పినా నమ్మడానికి వీల్లేదు అన్నప్పుడు అసలు చరిత్ర రచనా, పరిశోధనా అన్నవే నిరర్థకం అవుతాయి. అదే మీ అభిప్రాయం అయితే మీ అభిప్రాయ స్వేచ్ఛ మీదీ.
   కృతికర్తకన్నా కృతికే నా దృష్టిలో ప్రామాణ్యమూ, ప్రాధాన్యమూ అన్నారు. మీ ఈ అభిప్రాయాన్నే ప్రమాణంగా చూసినా, ఎర్రన ఒరవడికి భిన్నంగా, స్కంధాంతగద్యలో తాము రాసినట్టే చెప్పుకున్న మిగతా ముగ్గురినీ పూరకులుగా కాక, స్వతంత్ర అనువాదకులుగా విశ్వసించకపోవడానికి కారణం లేదు. పూరించినా సరే, స్వతంత్ర అనువాదకులన్న అభిప్రాయం కలిగేలా స్కంధాంతగద్యలో చెప్పుకున్నారంటూ వారికి అనృతదోషాన్ని ఆపాదించాల్సిన అవసరమూ లేదు.

   Delete
  2. అయ్యా ప్రమాదో ధీమతామపి, నేన్నది ఒరిజినల్ గా ’పోతన గారు ఒక్కరే ఆంధ్రీకరించారు’ తదనంతరం నష్ట భాగాన్ని మిగిలిన మువ్వురూ/నలుగురూ పూరించారు. తప్ప ఒరిజినల్ గా ఆంధ్రీకరించినది నలుగురు అని నిర్ణయం కాదు. ఇక మళ్ళీ చర్చ మొదటికే వచ్చింది, ఇతః పూర్వం నేను చెప్పినవి మళ్ళీ ఒక సారి వీలుంటే గమనించగలరు. బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పిందీ అదే. పోతన గారొక్కరే భాగవతాన్ననువదించారు. తదనంతరం నష్టభాగ కొంత పూరణం కొంత అనువాదం ద్వారా మిగిలిన ముగ్గురు /నలుగురు చేసారు. మిగిలిన మువ్వురూ వ్రాసిన స్కందాంత గద్యాన్ని మీరుచూస్తున్నట్లే, పోతన గారి గ్రంథారంభ పద్యాలను నేను చూస్తున్నాను. పూరించడంలో పోతనగారి యథాతథ పద్యాలనే పూరించడం కాక లేక స్వంతంగా అనువాదము కూడా ఉన్నది. అంత మాత్రాన పోతనగారు ఒక్కరే పూర్తిగా ఆంధ్రీకరించలేదని కాదు ఏ అనృత దోషం మిగిలినవారికి ఆపాదించలేమో అది పోతనగారికి ఆపాదించడం కుదురుతుందా? అస్సలు కుదరదు కదా!... ఈ విషయం కూడా ఇతః పూర్వమే చెప్పాను. ఇక చరిత్ర పరిశోధనలు అన్ని సార్లు అర్థవంతమయ్యాయనీ అవుతాయనీ రూఢి ఏమీ లేదు ఈ ప్రమాదమెప్పుడూ ప్రతి పరిశోధన పక్కనే ఉంటుంది. నేను మొదటి నుండి చెప్తునదీ అదే, ఇటువంటి విషయాలలో జన శ్రుతి, అభిప్రాయ స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యతా ఉన్నది. ఇటువంటివెన్నో విషయాలు మనకి గతంలో ఉన్నాయి. పోతన గారు, శ్రీనాథుడు, రామదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రిగారు, ఇలా ఎందరో కోకొల్లలు ఈలాంటి విషయాలలో జనశ్రుతికి, చారిత్రకుల అభిప్రాయాలకి హస్తిమశకాంత విబేధాలున్నాయి. నేను ఒకటికి రెండు సార్లు చెప్పింది ఏ ఒక్కరి అభిప్రాయమో ఎక్కువది లేదా తక్కువది అని కాకుండా ఎవరి అభిప్రాయాలతో వారుంటూ పరుల అభిప్రాయాన్ని గౌరవించడం సముచితమైనది అని. మీరన్నట్లే అభిప్రాయ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది..... నాకూ, మీకూ అందరికీ, స్వస్తి

   Delete
  3. కొంచెం ఆలస్యంగా ఈ సమాధానం:
   1. అవును, మొదటే మీరు ఆంధ్రభాగవత(పూరకులు కానీ, అనువాదకులు కానీ) నలుగురే అన్నారు.చివరగా మీరు కూడా నలుగురే అని తేల్చారని నేను అనడం, ఒక కోణంలో ప్రమాదజనితమే. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ ప్రమాదాన్ని నేను గుర్తించాను.
   2. నాలానే మీరు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాలి. అసలు చర్చ ఎక్కడ ప్రారంభమైంది? ఆంధ్రభాగవతకర్తలు ఒకరా, నాలుగురా అన్న ప్రశ్నతో! దానికి ప్రేరణ ఏమిటి? “ఆంధ్రమహాభారతాన్ని ముగ్గురు అనువదించారు. భాగవతాన్ని పోతన ఒక్కరే అనువదించారు” అని చాగంటివారు అనడం! ఆంధ్రమహాభారత ప్రస్తావన లేకుండా, పోతన ఒక్కరే భాగవతాన్ని అనువదించారని చాగంటి వారు అని ఉంటే సమస్య లేదు. మహాభారత అనువాదకులు/ లేదా పూరకుడితో పోల్చడం వల్ల; ఆంధ్రభాగవతకర్తలు కూడా నలుగురే నన్న సంఖ్యావివరాన్ని ప్రస్తావించాల్సివచ్చింది. రెండు కృతుల దగ్గరా పూరణ/అనువాదం పోలిక కుదురుతోంది కనుక. ఈ పోలిక గురించి నేను మొదటే వివరించాను. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడగలరు.
   3. కనుక చర్చ ప్రారంభానికి వెడితే, ఆంధ్రభాగవతకర్తలు(మహాభారత కర్తలతో పోల్చి చెప్పినప్పుడు)కూడా నలుగురే నని చెప్పడమే నా అసలు ఉద్దేశమని మీకు అర్థమవుతుంది. పూరించారా/అనువదించారా అన్న చర్చలోకి నేను వెళ్లలేదు. సంఖ్యే ఇక్కడ ప్రధానమన్న భావనతోనే నా మొదటి టపాలోనే పూరకులు/అనువాదకులు అనే రెండు మాటలూ వాడాను. మహాభారత కవిత్రయంలా భాగవతకర్తలు నలుగురన్నది ఎక్కువ ప్రసిద్ధిలో లేని స్థితిలో, చాగంటివారి వ్యాఖ్యను జనం ప్రమాణంగా తీసుకునే ప్రమాదం దృష్ట్యా కూడా సంఖ్య గురించిన ఈ వివరాన్ని గుర్తుచేయడానికి ప్రయత్నించాను.
   4. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మీరు అసలు చర్చను మిగతా ముగ్గురూ పూరించారా లేక అనువదించారా అన్న అంశంవైపు మళ్లించారు. అది సంఖ్యకు సంబంధించిన అసలు చర్చకు అనుబంధ చర్చగా మారింది. మిగతా ముగ్గురూ పూరకులు మాత్రమే ననీ పోతన ఒక్కరే మొదట 12 స్కంధాలూ రాశారని చెప్పడం మీద మీకు ఆసక్తి. చాగంటివారి వ్యాఖ్య నేపథ్యంలో భాగవత అనువాదకులు లేదా పూరకులు ఒకరు కాదు, నలుగురు అని చెప్పడం మీదే నాకు ఆసక్తి. పూరణే అయినా అనువాదమే అయినా ఆంధ్రభాగవతకర్తలు నలుగురే నన్న వాస్తవికవివరాన్ని గుర్తించడమే నాకు కావలసింది. ‘మీరు కూడా నలుగురే నని తేల్చారు’ అని నేను అనడం వెనుక ఉద్దేశం అదీ.
   5. ఇక పూరించారా/అనువదించారా అన్న అనుబంధచర్చలోకి వెడితే, నేను అనువదించారన్నవైపే మొగ్గాను. మీరు పూరించారన్నవైపు మొగ్గారు. నా వాదాన్ని నేను వినిపించాను. మీ వాదాన్ని మీరు వినిపించారు. రెండూ పాఠకుల ముందు ఉన్నాయి. దాని మీద నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
   6. అలాగే, చాగంటివారు ఏమన్నారో నేను స్పష్టంగా ఇచ్చాను. “బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పిందీ అదే. పోతన గారొక్కరే భాగవతాన్ననువదించారు.” అని మీరు అన్నారు. వాస్తవంగా చాగంటివారు ఏమన్నదీ మీరు ఇవ్వలేదు. చర్చకు అదే నాంది కనుక ఆ వ్యాఖ్యను ఇవ్వడం అవసరం.

   Delete
  4. పై సమాధానానికి అనుబంధంగా ఇంకొంచెం వివరణ:
   1. "ఆంధ్రమహాభారత ప్రస్తావన లేకుండా, పోతన ఒక్కరే భాగవతాన్ని అనువదించారని చాగంటి వారు అని ఉంటే సమస్య లేదు." అని పైన అన్నాను. ఆ వాక్యంలో పొరపాటు ఉంది. నిజానికి పోతన ఒక్కరే భాగవతాన్ని అనువదించారన్నప్పుడు కూడా సంఖ్యకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వస్తుంది. 'ఒక్కరే'అనే మాట అనకుండా 'పోతన భాగవతాన్ని అనువదించారు' అంటే, అసలా మాట అనాల్సిన అవసరమే లేదు. కవిత్రయంతో పోల్చి మరీ చాగంటివారు ఆ వ్యాఖ్య చేయడంలో సంఖ్యావివరంలో ఆయన పొరబడ్డారనడంలో నావరకూ ఎలాంటి సందేహంలేదు.
   2. "మహాభారత అనువాదకులు/ లేదా పూరకుడితో పోల్చడం వల్ల; ఆంధ్రభాగవతకర్తలు కూడా నలుగురే నన్న సంఖ్యావివరాన్ని ప్రస్తావించాల్సివచ్చింది." అన్న వాక్యంలో అనువాదకులు/ లేదా పూరకుడు అనవలసిన అవసరంలేదు. అనువాదకుడు/పూరకుడు(ఎర్రన) అని అంటే చాలు.

   Delete