Friday, April 29, 2016

స్లీమన్ కథ-30: మరణించిన మిత్రుడికి అఖిలెస్ భయానక నివాళి

హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము.  దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ  పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.

Friday, April 22, 2016

స్లీమన్ కథ-29: గ్రీకులకూ ఒక 'అర్జునుడు' ఉన్నాడు!

హెక్టర్ లో విచిత్రంగా మహాభారతంలోని అర్జునుడి పోలికలు, కర్ణుడి పోలికలూ కూడా కనిపిస్తాయి. అతను మనం తేలిగ్గా పోల్చుకోగలిగిన మానవమాత్రుడిలానే వ్యవహరిస్తాడు. అర్జునుడు కూడా ఈ మానవస్వభావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ‘నరుడు’ అన్న అతని మరో పేరే దీనిని సూచిస్తూ ఉండచ్చు. హెక్టర్ లానే అర్జునుడు కూడా యుద్ధఘట్టంలో సందేహాలు, సందిగ్ధాల మధ్య నలుగుతాడు. విషాదానికి లోనవుతాడు. హెక్టర్ లానే యుద్ధానంతర విధ్వంసాన్ని పదే పదే ఎత్తి చూపుతాడు.

Thursday, April 14, 2016

స్లీమన్ కథ-28: గ్రీకుల 'మహాభారతం' ఇలియడ్

యుద్ధం ఆగిపోయిందన్న వార్త వస్తుంది. దానికి బదులు హెలెన్ భర్త మెనెలాస్, ఆమెను అపహరించుకుని వచ్చిన పారిస్ ద్వంద్వయుద్ధం చేయాలని తీర్మానించారు. హెలెన్ భవితవ్యాన్ని ఆ యుద్ధం నిర్ణయించబోతోంది. హెలెన్ శ్వేతవస్త్రం ధరించి, చెలికత్తెలు వెంటరాగా ప్రియామ్ ఉన్న బురుజును సమీపిస్తుంది. ఆమె రాకను గమనించిన పెద్దలు అప్రయత్నంగా గొంతులు తగ్గించి, ఆమె అద్భుత సౌందర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకోవైపు, సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం అంతం కాబోతోందన్న సంతోషం వాళ్ళలో వెల్లివిరుస్తోంది. ప్రియామ్ ఆమెను తన దగ్గరకు పిలిచి శత్రుసేనలోని ఒక వ్యక్తిని చూపించి, “అందరికంటే ఆజానుబాహువుగా, ధీరోదాత్తుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతాడు.

(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/04/14/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82-%E0%B0%87%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A1/ లో చదవండి)

Friday, April 8, 2016

పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

మైసీనియా తవ్వకాలలో రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. ఒకటి అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

Tuesday, April 5, 2016

స్లీమన్ కథ-26: అగమెమ్నన్ మమ్మీ దొరికింది!

ఆ ముఖంలో అతనికి అగమెమ్నన్ పోలికలు కనిపించాయి! అది గుండ్రంగా ఉండి, ముప్పై అయిదేళ్ళ పురుషుడి ముఖంలా కనిపించింది. అన్ని దంతాలూ పటిష్టంగా ఉన్నాయి. ఒక పెద్ద స్వర్ణ వక్షస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. అతని నుదుటి మీదా, వక్షస్థలం మీదా, తొడల మీదా బంగారు ఆకులు పరచి ఉన్నాయి. అతని ముఖానికి పక్కనే పడున్న బంగారు ముసుగు సాపుగా అయిపోయింది. స్లీమన్ దానిని చేతుల్లోకి తీసుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు.