Friday, April 8, 2016

పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

మైసీనియా తవ్వకాలలో రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. ఒకటి అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

No comments:

Post a Comment