హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము. దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.
No comments:
Post a Comment