Sunday, June 30, 2013

మన నదుల పేర్లు ఎంత అందమైనవి!

మన నదుల పేర్లు ఎంత అందమైనవి!

భాగీరథి...అలకనంద...మందాకిని...గంగ...యమున...సరస్వతి...సింధు...శతద్రు...వితస్థ... పరూష్ణి...నర్మద...తపతి...గోదావరి....కృష్ణ...కావేరి...తుంగభద్ర...పెన్న...

రెండు...మూడు...నాలుగు అక్షరాల పేర్లు. చాలావరకూ అన్నీ సరళాక్షరాలు...

నదులకు ఇంతటి మృదువైన, అందమైన పేర్లు పెట్టిన మన పూర్వులు ఎంత భావుకులో, ఎంత మృదుహృదయులో,  మనిషి మనుగడలో ముఖ్య భూమిక పోషించే నదులపై వారికి ఎంత ప్రేమాభిమానాలో అనిపిస్తుంది. చేతులెత్తి వారికి మొక్కాలనిపిస్తుంది.

ఇంత అందమైన పేర్లున్న నదుల వెనుక ఎంత మృత్యుదాహం దాగి ఉంది! వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీసే క్రూరత్వం ఎలా పొంచి ఉంది!

ఉత్తరాఖండ్ జలప్రళయం నేపథ్యంలో ఆలోచిస్తే నదుల తప్పేమీ లేదనిపిస్తుంది. తప్పంతా మనదే. సుకుమారమైన నదుల తీరాలను విచక్షణారహితంగా కాంక్రీట్ అడవులుగా మార్చిన మొరటుదనం మనదే. అంతే విచక్షణారహితంగా డ్యామ్ లను నిర్మించి నదీ గమనాన్ని కృత్రిమంగా అడ్డుకుని దారి మళ్లించిన నేరం మనదే. ప్రకృతికి అనుగుణంగా, ప్రకృతికి తలవంచి జీవించడం మనం మరచిపోయాం. పచ్చని చెట్టు కనిపిస్తే తెగ నరికే బండతనం, స్వచ్చమైన నదీ జలాలలో పారిశ్రామిక వ్యర్థాలను కలిపేసే మురికిదనం మనలో ఎప్పుడు ప్రవేశించాయో  వెనక్కి వెళ్ళి ఒకసారి ఆరా తీస్తే, అక్కడే ఉత్తరాఖండ్ విలయం వేళ్ళు కనిపిస్తాయి. మనం చేసిన, చేస్తున్న అనేకానేక అకృత్యాలతో ప్రకృతిలో పేరుకున్న ఆగ్రహ అగ్నిపర్వతం ఉండి ఉండి ఒక్కసారిగా బద్దలవుతోందేమో! ఉత్తరాఖండ్ విపత్తును అలాగే చూడాలేమో!

పెరిగిన జనాభా పోషణకు ప్రకృతి వనరులను కొల్లగొట్టడం అనివార్యం అనే మాటలో వాస్తవం లేదని అనలేం. అలాగే, విచక్షణారహితంగా ప్రకృతిలో జోక్యం చేసుకుంటే ఇటువంటి అనర్థాలు తప్పవన్న వాస్తవాన్నీ కాదనలేం.
మొత్తం మీద మన అభివృద్ధి నమూనాను సవరించుకోక తప్పదేమో! ఏమేరకు సవరించుకోవాలన్నది అందరూ కూర్చుకుని ఆలోచించుకోవలసిన సందర్భం ఇది.






Thursday, June 27, 2013

తాత ముత్తాత పేరేమిటి?!

మీ తాత ముత్తాత పేరేమిటి?!
మీ వంశవృక్షం గురించి మీకు ఎంత తెలుసో పరీక్షించడం కోసం ఈ ప్రశ్న వేశానని దయచేసి అపార్థం చేసుకోకండి. మా తాత ముత్తాత(అంటే మా తాతగారి ముత్తాత అన్నమాట) పేరు నాకు తెలియదని చెప్పడానికే ఇలా ప్రారంభించాను. నాలానే ఈ దేశంలో చాలామందికి తాత ముత్తాత పేరు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. తన పుట్టినతేదీ ఏమిటో చెప్పలేని వాళ్ళు కూడా ఈ దేశంలో చాలామందే ఉన్నారు. బహుశా మీకు కూడా అలాంటివారు తారసపడే ఉంటారు.
మా తాత ముత్తాత పేరు నాకు తెలియదన్న వాస్తవం గుర్తొస్తే  సిగ్గుతో చితికి పోతూ ఉంటాను.  ఈ దేశం వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఉన్న ఒక గొప్ప దేశమనీ; ఈ సంపదకు నేను వారసుడిననే భావన  ఆ క్షణాలలో ఒక పెద్ద మిథ్యగా నాకు అనిపిస్తుంది. ఈ దేశం నాకు ఏదీ కానట్టు, వేళ్ళు తెగిపోయిన ఒక చెట్టులా నేను శూన్యంలో వేలాడుతున్నట్టు అనిపిస్తుంది. తాత ముత్తాత పేరు (అంటే కనీసం అయిదు తరాలు) కూడా తెలియని వాళ్ళం  ఈ దేశం నాదని ఎలా గర్విస్తామో, వేల సంవత్సరాల ఈ దేశ గతంపై హక్కు ఎలా చాటుకుంటామో నాకు అర్థం కాదు. 

ఈ నేల అనే చెట్టుతో మన బతుకులనే తీగలు గాఢంగా అల్లుకున్నాయనడానికి తాత ముత్తాత పేరు తెలియడం ఒక సాక్ష్యం అని నేను భావిస్తాను.
 (పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)


Wednesday, June 12, 2013

థర్డ్ ఫ్రంట్ కడుపులో ఫోర్త్ ఫ్రంట్!

గోవా దగ్గరనుంచీ '2014' ఊపందుకుంటోంది. ఎప్పుడో కానీ టీవీలో  కనిపించని ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ హఠాత్తుగా టీవీ తెర ముందుకు వచ్చారు. యూపీఏ, ఎన్డీయే లకు తమ పార్టీ(బీజేడీ) సమానదూరం పాటిస్తుందంటూ థర్డ్ ఫ్రంట్ కే తమ మొగ్గు అని స్పష్టం చేశారు. అద్వానీ రాజీనామా తర్వాత ఎన్డీయేతో తెగతెంపులు తప్ప గత్యంతరం లేదన్న జేడీయూ అద్వానీ రాజీపడిన తర్వాత కూడా తెగతెంపులవైపు అడుగేయడం విచిత్రం. నితీశ్ కుమార్ జేడీయూ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. బీజేపీతో తెంచుకున్నా తన ప్రభుత్వానికి ముప్పు లేకుండా చూసుకోడానికి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు బీజేపీకి చెందిన ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడి కూడా తమ ఎమ్మెల్యేలను సమావేశ పరుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రంగప్రవేశం చేసి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడడం మరింత ఆసక్తికరం. జేడీయూ ఆమెతో మాట్లాడడానికి తన ప్రతినిధిని పంపింది, గోవాలో ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన నరేంద్ర మోడీ శుభాకాంక్షలు అందించిన జయలలిత తాజాగా కేంద్రంలో friendly ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వ్యాఖ్యానించారు. మోడీతోనే కాక నవీన్ పట్నాయిక్ తో కూడా స్నేహ సంబంధాలున్న జయలలిత ఆ వ్యాఖ్య ద్వారా ఏం సూచిస్తున్నారో తెలియక రాజకీయ వ్యాఖ్యాతలు తికమక పడుతున్నారు.

వామపక్షాలు, సమాజ్ వాది పార్టీ, తెలుగు దేశం చాలారోజులుగానే థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నాయి. నిజానికి భారత రాజకీయాలలో మొదటినుంచీ థర్డ్ ఫ్రంట్ కు పేటెంట్ పొందిన ప్రముఖ పార్టీలు ఇవే. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా థర్డ్ ఫ్రంట్ అనడం; జేడీయూ, బీజేడీలు ఇందుకు కలసివస్తాయని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే మమతా బెనర్జీ కూడా థర్డ్ ఫ్రంట్ అంటే, అది థర్డ్ ఫ్రంట్ అవదు; ఫోర్త్ ఫ్రంట్ అవుతుంది. కారణం, ఇంకో థర్డ్ ఫ్రంట్ లో ఉన్న వామపక్షాలతో కలసి ఆమె ఫ్రంట్ కట్టే అవకాశం లేదు. కనుక, వామపక్షాలు, సమాజ్ వాది, తెలుగు దేశం పార్టీలు తమ థర్డ్ ఫ్రంట్ ను తాము విడిగా ఏర్పాటు చేసుకుంటాయి. ఒకవేళ సమాజ వాది, తెలుగు దేశం లు మమత ఫ్రంట్ లో చేరితే వామపక్షాలు ఒంటరిగా మిగిలిపోతాయి.

ఇలా థర్డ్ ఫ్రంట్ గుడారం వేస్తున్న పార్టీలు అన్నీ రేపు యూపీఏ, ఎన్డీయేలలో ఏదో ఒక వైపు చేరిపోయి గుడారం ఎత్తివేసే అవకాశాన్ని ఇప్పుడే తోసి పుచ్చలేం. ఈ క్షణానికి పరిమితమై చెప్పుకుంటే, థర్డ్ ఫ్రంట్  ఫోర్త్ ఫ్రంట్ కీ దారితీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Tuesday, June 4, 2013

రాజకీయ పార్టీల 'చావు'

'తన చావు జగత్ ప్రళయ' మని సామెత!

ఇప్పుడు రాజకీయపక్షాలు అలాంటి జగత్ ప్రళయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక పార్టీ కాదు, కుడి-ఎడమ తేడా లేకుండా అన్ని పార్టీలూ!

రాజకీయ పార్టీల జమా ఖర్చులూ వగైరాలు కూడా సమాచార హక్కు చట్టం కిందికి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ ఉత్తర్వు ఇచ్చింది. అందుకు కొన్ని కారణాలూ చెప్పింది. కమిషన్ అభిప్రాయంలో రాజకీయ పార్టీలు ప్రైవేట్ సంస్థలు కావు, వాటికి ప్రజాసంస్థల స్వభావం ఉంది. అవి ప్రజల మధ్య పనిచేస్తుంటాయి. కనుక వాటి గురించిన అన్ని విషయాలనూ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అలాగే, రాజకీయ పార్టీలు ప్రభుత్వం నుంచి, అంటే ప్రజాధనం నుంచి ప్రజల ఆస్తులనుంచి లబ్ధి పొందుతూ ఉంటాయి. ఉదాహరణకు కాంగ్రెస్, బీజేపీలు రెండే ప్రభుత్వం నుంచి 253 కోట్ల రూపాయిల సబ్సిడీ పొందుతున్నాయట. మిగిలిన పార్టీలు పొందే సబ్సిడీని కూడా దీనికి చేర్చుకుంటే అది ఏ  అయిదారువందలకోట్లో, ఇంకా ఎక్కువో ఉంటుంది. ఢిల్లీలో లుటియెన్ బంగాళాల అద్దె మార్కెట్ రేట్ల ప్రకారం లక్షల్లో ఉంటే రాజకీయ పార్టీలు వేలల్లో మాత్రమే అద్దె చెల్లిస్తున్నాయి. పార్టీ భవనాలు కట్టుకోడానికి ప్రభుత్వం ఉచితంగా స్థలం కూడా ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఇలా వనరులు, ఆస్తులు పొందే రాజకీయ పార్టీలు మరోవైపు లక్షలు, కోట్లలో విరాళాలు కూడా సేకరిస్తూ ఉంటాయి. అయితే ఆ విరాళాలు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు ఎవరో జనానికి తెలియదు. అది నల్లడబ్బో, తెల్ల డబ్బో తెలియదు. తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని సమాచార కమిషన్ అంటోంది.

అయితే విచిత్రంగా రాజకీయ పార్టీల వ్యవహారాలను బయటపెట్టవలసిన అవసరం లేదని పార్టీలు అంటున్నాయి. కాంగ్రెస్ అదే అంటోంది. బీజేపీ అదే అంటోంది. సీపీయం, సీపీఐలు అదే అంటున్నాయి. బహుశా ఎంఎల్ పార్టీలూ అదే అనచ్చు. రాజకీయ పార్టీలు ప్రైవేట్ సంస్థలే తప్ప ప్రజాసంస్థలు కావంటున్నాయి. వాటిని ప్రజాసంస్థలుగా పరిగణించి సమాచార హక్కు చట్టం కిందికి తేవడం ప్రజాస్వామ్యానికే చేటు తెస్తుందని బెదిరిస్తున్నాయి. కావాలంటే ఎన్నికల కమిషన్ ను అడిగి పార్టీల సమాచారాన్ని తీసుకోవచ్చునంటున్నాయి.

మొత్తం మీద రాజకీయ పార్టీల మధ్య అపూర్వమైన సంఘీభావం వ్యక్తమవుతున్న అరుదైన సందర్భం ఇది.

ఇంతకీ రాజకీయ పార్టీలు సమాచార హక్కు కిందికి రావడానికి ఎందుకు భయపడుతున్నాయి? చర్చ పుంజుకున్న కొద్దీ పార్టీల అసలు రంగులు బయటపడతాయేమో చూద్దాం.

ఓ వ్యాఖ్య తరచూ వినిపిస్తూ ఉంటుంది. శివాజీ గొప్ప వీరుడే, గొప్ప దేశభక్తుడే కానీ శివాజీ లాంటివాడు, పక్క ఇంట్లో పుట్టాలని అనుకుంటారు తప్ప తమ ఇంట్లో పుట్టాలని అనుకోరట. అలాగే, సమాచార హక్కు చట్టం గొప్పదే; అది అధికారపక్షం లేదా ప్రతిపక్షం భరతం పట్టాలి కానీ మన భరతం  పట్టకూడదు. అధికారులు, ఉద్యోగుల అవకతవకలు బయటపెట్టడం వరకు అది గొప్ప చట్టమే. మన జోలికే రావడమంటూ జరిగితే అది ప్రజాస్వామ్య విరుద్ధం! సమాచార కమిషన్ ఉత్తర్వుపై రాజకీయ పార్టీల స్పందన అచ్చం ఇలాగే ఉంది.

రాజకీయ పార్టీలు ప్రైవేటా పబ్లిక్కా అని అడిగితే ఏం చెప్పగలం? చెరువులో చేపలు నీళ్ళు తాగుతున్నాయో లేదో చెప్పడం ఎవరి తరం?

Saturday, June 1, 2013

కేశవరావు కాంగ్రెస్ 'నిమజ్జనం'

మొన్న కడియం శ్రీహరి...ఈ రోజు కె. కేశవరావు!

పార్టీలు మారడం కొత్త కాదు. పార్టీలు పుట్టినప్పుడే  పార్టీ ఫిరాయింపులూ పుట్టాయి. అందులోనూ ఎన్నికల రుతువులో పార్టీలు మారే కప్పల హడావుడి ఎక్కువగా ఉంటుంది. అదను చూసుకుని దూకడానికి గోడమీద పిల్లులు బారులు కడుతూ ఉంటాయి.

ఎంతోమంది పార్టీలు మారుతున్నప్పుడు పై ఇద్దరినే ఎందుకు వేలెత్తి చూపుతున్నారంటే, పార్టీ ఫిరాయింపుదారుల గుంపులో గోవిందంలా ఒకపట్టాన ఊహించలేని  ప్రత్యేకత లేదా ప్రత్యేక కారణాలు వీరికి ఉండడం వల్లనేమో! ఏమైతేనేం, వీళ్లూ గుంపులో చేరారు కనుక మన పొరపాటు ఊహను మనమే సవరించుకోవాలి.

శ్రీహరి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కేశవరావు గురించి.

కేశవరావు కూడా విద్యాధికుడు. మేధావుల కోవలో ఆయనను చేర్చి చెప్పుకుంటారు. పాత్రికేయుడిగా కూడా ఉన్నారు. 'నిమజ్జనం' అనే ఆర్ట్ ఫిల్మ్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.  బహుశా చాలాకాలంగా కాంగ్రెస్ ఆయనను ఆదరిస్తూ ఉండడానికి విద్యాధికత వంటి అర్హతలే కారణం కావచ్చు. ఎందుకంటే ఆయనను గొప్ప జనబలం ఉన్న నాయకుడిగా చెప్పలేం. ఆయన ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించినట్టు లేదు. గతంలో శాసనమండలి సభ్యునిగా, శాసనమండలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. చెప్పుకోదగిన జనబలం లేకపోయినా కాంగ్రెస్ రాష్ట్రంలో మంత్రిపదవి ఇచ్చి ఆదరించింది. పీసీసీ అధ్యక్షుని చేసింది. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు పార్టీ పరిశీలకునిగా నియమించింది. ఏ పార్టీ అయినా ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతుంది? అయినాసరే, కేశవరావు కాంగ్రెస్ ను నిమజ్జనం చేసేసి టి‌ఆర్‌ఎస్ లో చేరుతున్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదు కనుక పార్టీ మారుతున్నానని కేశవరావు చెబుతున్నారు. ఇక్కడే కొన్ని సందేహాలు:

1. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న షరతుతో కేశవరావు కాంగ్రెస్ లో చేరలేదు. తెలంగాణా ఇస్తుందన్న కచ్చితమైన హామీ తీసుకునే ఆ పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ పదవులు పొందలేదు. ఎన్నో ఇచ్చిన కాంగ్రెస్ ను తెలంగాణా ఇవ్వడంలేదన్న కారణంతో ఎందుకు వదిలేస్తున్నారు?

2. కాంగ్రెస్ ఇవ్వని తెలంగాణ టి‌ఆర్‌ఎస్ తప్పనిసరిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటే ఆయన పార్టీ ఫిరాయింపును కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ టి‌ఆర్‌ఎస్ తెలంగాణ ఇవ్వగలదా? అది కూడా చేయగలిగింది తెలంగాణకు ఒత్తిడి తేవడమే. కనుక ఇంతవరకూ చేసినట్టే కాంగ్రెస్ లో ఉంటూనే కేశవరావు కూడా తెలంగాణకు ఒత్తిడి తేవచ్చు. ఆయన పార్టీ మారడం వల్ల తెలంగాణ లక్ష్యానికి కొత్తగా ఒరిగేది ఏముంటుంది?

3. ఒకవేళ తెలంగాణ టి‌ఆర్‌ఎస్ వల్లనే సాధ్యమని ఆయన అనుకుంటే ఆయన ఆ పార్టీలో చేరకపోయినా తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా ఆయనకూ గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ను వదిలి టి‌ఆర్‌ఎస్ లో చేరడం వల్ల అదనంగా ఏమొస్తుంది? (మరో విడత రాజ్యసభ సభ్యత్వం కాకపోతే)

కనుక మేధావిగా చెప్పుకునే కేశవరావు తను పార్టీ మారడానికి చెబుతున్న కారణం "తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం" అన్నట్టుగా లేదా?

అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న: దశాబ్దాలుగా ఉన్న పార్టీతో అనుబంధాన్ని ఒక మిథ్యా కారణంతో ఎలా తెంచుకుంటున్నారు? కడియం శ్రీహరి విషయంలో వేసుకున్న అదే ప్రశ్న మళ్ళీ ఇక్కడా....

విద్యావంతులు రాజకీయాలలో చేరితే అవి బాగుపడతాయంటారు. శ్రీహరి, కేశవరావు విద్యావంతులు కారా?!