రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు అనే మాటలు మనకు బాగా తెలుసు. వీటి మధ్య స్వల్పంగా అర్థభేదాలు
ఉండచ్చు కానీ వీటన్నిటినీ మనం రాక్షసులు అనే ప్రసిద్ధ అర్థంలోనే తీసుకుంటూ ఉంటాం.
మన పురాణ, ఇతిహాస కథలు; వాటి ఆధారంగా
తీసే సినిమాల పుణ్యమా అని రాక్షసుల
గురించి మనలో కొన్ని ఊహలు స్థిరపడిపోయాయి. వారు భారీ ఆకారంతో చాలా వికృతంగా
భయంకరంగా ఉంటారు. వాళ్ళకు కొమ్ములు, కోరలు ఉంటాయి. వాళ్ళు
మనుషుల్ని తినేస్తారు. వాళ్ళ దగ్గర ఏవో మాయలు ఉంటాయి. రాక్షసులను ఇలా
ఊహించుకోవడంలో మనలో పెద్దవాళ్ళు, పండితులూ కూడా పసివాళ్లు
అయిపోతూ ఉంటారు. ఇటువంటి రాక్షసులు నిజంగానే ఉండేవారని వారు నమ్మడమే కాక మనల్ని
నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మహాభారతంలో నరమాంసభక్షణ చేసే రాక్షసజాతికి
చెందినదిగా చెప్పే హిడింబ నరుడైన భీముని వరించడమే కాక అతనివల్ల కొడుకుని కూడా
కంటుంది. అయినాసరే, ఆమె రాక్షసియే!
వేల సంవత్సరాలుగా సంస్కృతి, సారస్వతం, మతం వగైరాలు మన ఆలోచనలపై ముద్రించే నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయో
తెలుసుకోడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇలాంటి నమ్మకాల చరిత్రను తవ్వుకుంటూ కాస్త
లోపలికి వెడితే వాటి వెనుక ఉన్న హేతుత్వం అర్థమవుతుంది. కుక్కను చంపాలంటే మొదట
దానిమీద పిచ్చికుక్క అనే ముద్ర వేయాలని నానుడి. అలాగే ఒకప్పుడు(బహుశా ఇప్పుడు
కూడా) శత్రువు మీద; లేదా భిన్న ఆచారవ్యవహారాలు పాటించేవారి
మీద అలాంటి ముద్రలే వేసేవారు. ఆ విధంగా
జాతి వాచకాలు ఎన్నో తిట్టుపదాలుగా, అవహేళన పదాలుగా
మారిపోయాయి. ‘అప్రాచ్యులు’ అనే మాటనే
తీసుకోండి. తూర్పుదేశానికి చెందినవారు కారనే దాని సామాన్యార్థం. కానీ అదిప్పుడు
తిట్టుపదంగా, అవహేళన వాచకంగా మారిపోవడం మనకు తెలుసు.
అలాంటివే మ్లేచ్ఛుడు, పిండారీ లేదా పింజారీ వగైరా మాటలు.
No comments:
Post a Comment