Tuesday, February 19, 2013

గాంధీ గురించి ఎంత తెలుసు?!

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి మనలో ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతవరకు తెలుసు?

ఎదుటివారి తెలియనితనాన్ని ఎత్తి చూపడానికి ఈ ప్రశ్నలు  వేస్తున్నానని దయచేసి అనుకోకండి. నన్ను కూడా కలుపుకునే ఆ ప్రశ్నలు వేశాను.  గాంధీ గురించి నాకేమీ తెలియదని-ఈ మధ్య ఆయన గురించి రాసిన ఒక పెద్ద పుస్తకాన్ని తెలుగులోకి అనువదించేవరకూ  నాకు కూడా తెలియదు. అనువదిస్తున్న రోజుల్లో నా అజ్ఞానానికి నన్ను నేను ప్రతిరోజూ నిందించుకున్నాను. విద్యార్థి దశనుంచీ గాంధీ గురించి ఈ దేశ ప్రజలకు సమగ్రంగా తెలియజెప్పని విద్యావ్యవస్థను నిందించాను.  గాంధీ గురించి తీయవలసినన్ని సినిమాలు తీయనందుకు సినిమారంగాన్ని నిందించాను. ఒక రాముడి కథలా, ఒక కృష్ణుడి కథలా గాంధీ కథను ప్రచారంలో ఉంచనందుకు ప్రచారసాధనాలను నిందించాను.

ఊరూరా గాంధీ శిలా విగ్రహాలను స్థాపించడం వల్లా, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ముద్రించడం వల్లా ఆయన రూపం ఒక్కటే మనందరికీ బాగా తెలుసు. అందులోనూ తమాషా చూడండి...చేతిలో కర్ర, బోడి తల, బోసినవ్వు, మోకాలివరకు అంగోస్త్రంతో ఉన్న గాంధీ రూపం ఒక్కటే మనకు బాగా తెలుసు. పసిపిల్లలు కూడా చటుక్కున గుర్తించే ఆ రూపం మనలో ఎంతగా ముద్రపడిపోయిందంటే, పుడుతూనే గాంధీ ఆ రూపంతో పుట్టాడా అన్నంతగా!
బాల గాంధీ, కౌమార గాంధీ, యువ గాంధీ, నడివయసు గాంధీల ఫోటోలు చూపించి 'ఈయనే గాంధీ' అంటే, 'ఈయనేం గాంధీ?' అన్న ప్రశ్న ఎదురైనా ఆశ్చర్యం లేదు. సూటు, బూటు, క్రాపు, నల్లని మీసకట్టుతో ఉన్న గాంధీని గాంధీగా పోల్చుకోవడం ఈ రోజున చాలా కష్టం.

ఒక వ్యక్తి జ్ఞాపకాన్ని శిలా విగ్రహ రూపంలో ఘనీభవింపజేసే సంస్కృతి ఈ పరిస్థితికి కారణమా అనిపిస్తుంది. ఒక వ్యక్తిని శిలా విగ్రహంగా మార్చి -అది కూడా ఒకే ఒక రూపంలో, భంగిమలో- ఊరూరా ప్రతిష్టించడమంటే; అతని సమగ్రచరిత్రను, అతని ఆదర్శాలను, అతని ఆశయాలను ఆ విగ్రహం కింద సమాధి చేయడమే నని కూడా అనిపిస్తుంది. మా రోజూ వారీ కార్యక్రమాలకూ, రాజకీయాలకూ దయచేసి అడ్డు రావద్దని ప్రార్థించడానికా అన్నట్టుగా  జయంతికీ, వర్ధంతికీ ఆ వ్యక్తి మెడలో ఓ దండ వేసి దణ్ణం పెట్టడం జాతి ఆ వ్యక్తి పట్ల చూపించే కృతజ్ఞత!

దీనిని బట్టి  విగ్రహ సంస్కృతికీ విజ్ఞాన సంస్కృతికీ మధ్య ఆజన్మశతృత్వం ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతుంది.

భారతదేశంలో గాంధీ నిర్వహించిన పాత్ర గురించే మనలో చాలామందికి తెలియవలసినంత తెలియనప్పుడు; ఆ పాత్రకు కావలసిన పూర్వరంగాన్ని, అనుభవాన్ని కల్పించిన గాంధీ దక్షిణాఫ్రికా జీవితం గురించి  తెలిసే అవకాశం అసలే లేదు. నిజానికి భారతదేశంలో గాంధీ నిర్వహించిన పాత్ర కన్నా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పాత్ర మరింత ఆసక్తికరం, మరింత నాటకీయం. గాంధీ యవ్వనంలో, నడి వయసులో నిర్వహించిన పోరాటం అది.

గాంధీ గురించి ఈ రోజున తెలుసుకోవడం ఏమంత కష్టం? ఆయన మీద వచ్చిన పుస్తకాలు ఎన్ని లేవు? అంతగా ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు కదా? అని ఈ పాటికి ఇది చదువుతున్నవారు అనుకోవచ్చు. నిజమే. పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే పుస్తకాలు చదివే సంస్కృతి దేశంలో బలపడిందా? అందులోనూ ఉద్గ్రంథాలు చదివే ఓపిక, తీరిక జనంలో ఉన్నాయా? మౌఖిక ప్రచారం ద్వారా, కళారూపాల ద్వారా విజ్ఞాన వ్యాప్తి అవసరం ఈ దేశంలో అంతరించిందని చెప్పగలమా?...ఇలా ఎన్నో అనుమానాలు!

గాంధీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను 'గాంధీని తెలుసుకుందాం' అనే శీర్షికతో అప్పడప్పుడు బ్లాగ్ పాఠకులతో పంచుకుంటే ఎలా ఉంటుందనిపించే ఈ ఉపోద్ఘాతం.

ఇప్పుడే మీకు ఇంకో విషయం కూడా తెలియజేయదలచుకున్నాను. నేను గాంధీ అభిమానినని చెప్పలేను. గాంధీకి వ్యతిరేకిననీ చెప్పలేను. గాంధీలో నాకు సరిపడని కొన్ని వైపరీత్యాలూ ఉన్నాయి. అయితే గాంధీ నిస్సందేహంగా నేటి తరం భారతీయులందరూ తెలుసుకోవలసిన, అధ్యయనం చేయదగిన వ్యక్తి.

నా ప్రతిపాదనపై దయచేసి మీ స్పందన తెలియజేయండి.






2 comments:

  1. బాగుంది.
    శ్రీ M.V.R. శాస్త్రిగారి పుస్తకాన్ని గూడా అద్యననం చేయవలసిందిగా సూచన.

    ReplyDelete
    Replies
    1. మీ సూచనకు ధన్యవాదాలు.

      Delete