Sunday, February 24, 2013

హంతకునికి డబ్బు సంచులిచ్చి పంపిన ఓ భారత కథ


 భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. అందులో కుల, మత, లింగ, ధనిక, పేద తేడాలు లేవు. అయితే, ఈ నీతిని ఉల్లంఘించేవారూ ఉన్నా, అది వేరే చర్చ.  మరి మహాభారత రాజ్యాంగం ప్రకారం కూడా చట్టం ముందు అందరూ సమానమేనా? 

కాదని నాడీజంఘుడు అనే కొంగ-గౌతముడు అనే బ్రాహ్మణుని కథ చెబుతుంది. మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఈ కథ ఉంది.

సంగ్రహంగా కథ ఇదీ:  గౌతముడు కులధర్మం వదిలేసి ఒక బోయను పెళ్లి చేసుకున్నాడు. ధనసంపాదన కోసం కొంతమంది వర్తకులతో కలసి దేశాంతరం బయలుదేరాడు. వారు ఒక కీకారణ్యంలోంచి వెడుతుండగా ఒక అడవి ఏనుగు వారి మీదపడింది. ప్రాణభయంతో తలోవైపుకీ చెదిరిపోయారు. గౌతముడు ఒంటరిగా ముందుకు సాగాడు. అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. ఆ చెట్టు మీద నివసించే నాడీజంఘుడు అతనిని చూసి జాలిపడ్డాడు. ఆతిథ్యమిచ్చి అలసట తీరేలా సేవలు చేశాడు. నీకు కావలసినంత ధనమిస్తాడని చెప్పి తన మిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు దగ్గరకు పంపించాడు. రాక్షసరాజు అతనికి మోయలేనంత ధనమిచ్చి పంపించాడు. తిరిగి మర్రిచెట్టు దగ్గరకు వచ్చిన గౌతముని నాడీజంఘుడు యధాప్రకారం ఆదరించాడు. గౌతమునిలో ఒక దుర్మార్గపు ఆలోచన పుట్టింది. బాగా బలిసి ఉన్న ఈ కొంగ తనకు కడుపునిండా ఆహారమవుతుందనుకున్నాడు. నిద్రపోతున్న కొంగను కట్టెతో  బాది చంపేశాడు. మాంసం వలిచి మూట కట్టుకుని డొక్కను అక్కడే వదిలేసి ప్రయాణమయ్యాడు.

రోజూ తన దగ్గరకు వచ్చే నాడీజంఘుడు ఎంతకూ రాకపోయేసరికి విరూపాక్షుడు కీడు శంకించాడు. ఏం జరిగిందో తెలుసుకురమ్మని భటులను పంపించాడు. కొంగ డొక్కను చూసిన భటులకు జరిగింది అర్థమైంది. గౌతముడే కొంగను చంపి ఉంటాడని గ్రహించిన భటులు అతన్ని వెతికి పట్టుకుని బంధించి విరూపాక్షుని ముందు నిలబెట్టారు. ఈ కృతఘ్నుని చంపి తినెయ్యకుండా నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చారని విరూపాక్షుడు అన్నాడు. మాకు మాత్రం నీతి లేదా? ఈ పాపాత్ముని శరీరాన్ని మేమెలా తింటామని భటులు అన్నారు. అతన్ని తీసుకెళ్లి  గాయాలు అయ్యేలా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి తోసేశారు. ఆకలితో నకనకలాడుతూ ఆ సమీపంలోనే తిరుగుతున్న కుక్కలు కూడా అతన్ని సమీపించడానికి ఇష్టపడలేదు.

మిత్రుని మరణానికి దుఃఖించిన విరూపాక్షుడు కొంగ డొక్కను తెప్పించి దహనసంస్కారాలు చేశాడు. అంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. నాడీజంఘుడు నీకే కాదు, బ్రహ్మకు కూడా మిత్రుడే, అతడు తనను చూడడానికి ఈ రోజు రాకపోవడంతో బ్రహ్మ ఆందోళన పడుతున్నాడని చెప్పాడు. నువ్వు నాడీజంఘునికి దహనసంస్కారం చేసి వెళ్ళిన తర్వాత దగ్గరలోనే ఒక ఆవుదూడ తల్లి గోవు దగ్గర పాలు తాగుతుండగా దాని మూతికి అంటిన పాల నురగ గాలికి ఎగిరివెళ్లి చితి మీద పడిందనీ, దాంతో నాడీజంఘుడు బతికాడనీ , ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడనీ చెప్పాడు.

నాడీజంఘుడు వచ్చాడు. తనవల్ల బ్రాహ్మణునికి ఇంతటి దుర్దశ కలిగినందుకు నొచ్చుకున్నాడు. అతన్ని విడిచి పెట్టేలా వరమిమ్మని ఇంద్రుని కోరాడు. బ్రహ్మ ఉద్దేశం కూడా అదేనని దివ్యదృష్టితో తెలుసుకున్న ఇంద్రుడు నాడీజంఘుని కోరిక తీర్చాడు. విరూపాక్షుడు భటులను పంపించి గౌతముని డబ్బు మూటలు తెప్పించి అతనికి ఇప్పించాడు. గౌతముడు వాటిని మోసుకుంటూ, మాటి మాటికీ వెనుదిరిగి చూస్తూ తొట్రుపడుతూ వెళ్లిపోయాడు.

కృతఘ్నుని దేహాన్ని కుక్కలు కూడా తాకవని చెప్పడం ఈ కథలోని ప్రధాన ఉద్దేశం.  దాంతోపాటే, పశుపక్షులలో కూడా దయ, క్షమ ఉంటాయనీ;  మిత్రధర్మాన్ని, అతిథి మర్యాదను అవి కూడా పాటిస్తాయనీ చెబుతోంది. రాక్షసులను మనుషుల్ని తినే వారుగా  చిత్రిస్తూనే వారికీ  నీతి, మిత్రధర్మం ఉంటాయని అంటోంది. అలాగే ఒక వ్యక్తి భ్రష్టుడు, కృతఘ్నుడు, హంతకుడు కావడానికి కులంతో సంబంధంలేదని కూడా చెబుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ హత్య వంటి తీవ్ర నేరానికి పాల్పడిన గౌతముని శిక్షించకుండా విడిచి పెట్టడం, పైగా డబ్బు మూటలు ఇచ్చి మరీ పంపించడం నేటి మన అవగాహన రీత్యా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులన్న సహజన్యాయాన్ని ఇది తలకిందులు చేస్తోంది.

అది ఆ కాలపు నీతి అనీ, ఇప్పుడు కుల,మత,లింగ వివక్షకు తావులేని కొత్త నీతిని తెచ్చుకున్నాం కనుక పాత కథలు తవ్వుకోనవసరం లేదనీ ఎవరైనా అనచ్చు. పైపైన చూస్తే ఇది సమంజసంగానే కనిపిస్తుంది. కానీ కాస్త లోతుకు వెడితే అలా అనిపించదు. ఇవి పాతకథలే అయినా ఇలాంటివి  పొందుపరచిన భారత, భాగవత, రామాయణాదులు ఇప్పటికీ ప్రవచన, వ్యాఖ్యాన, కళారూపాలలో  ప్రచారంలోనే ఉన్నాయి. కాకపోతే, నేటి సామాజిక, రాజకీయ వాతావరణంలో ఇబ్బందికరంగా తోచే విషయాలను దాచి, పాక్షికంగా మాత్రమే వాటిని ప్రచారంలో ఉంచడం జరుగుతోంది. మరోవైపు, ఆ రచనల లోని  ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పీడిత వర్గాలు పోరాడుతున్నాయి. ఆ రచనల  విశిష్టతను బోధించే సామాజికవర్గాలకూ, వీరికీ మధ్య అర్థవంతమైన  సంభాషణ జరగడం లేదు.  రెండూ పరస్పర శత్రుశిబిరాలుగా  కొనసాగుతున్నాయి.  పీడితవర్గాలు ఆ రచనలలోని చెడును ఎత్తి చూపుతుంటే, వాటి సమర్థకులు మంచిని మాత్రమే చూడమంటున్నారు. కుల, మత, ప్రాంత, లింగభేదాలకు అతీతంగా అందరినీ ఆలోచింపజేసే నీతి, రాజనీతి, ధర్మం, మానవీయ విలువలకు సంబంధించిన అనేక మంచి విషయాలు ఈ రచనల్లో ఉన్నాయి.  అయినాసరే, తమకు ప్రతికూలమైన విషయాలు వాటిలో ఉన్నప్పుడు పీడిత సామాజికవర్గాలు ఉదారబుద్ధితో కేవలం మంచిని మాత్రమే చూడడం సాధ్యమేనా?

అదీగాక, ఈ రచనలను మన దేశ సాంస్కృతిక, జ్ఞాన వారసత్వంలో భాగంగా గుర్తించినప్పుడు ఈ వారసత్వానికి పాత/కొత్త అన్న హద్దులు ఎలా గీస్తాం? అది మంచిదీ కాదు, సాధ్యమూ  కాదు. వాటిని దేశ వారసత్వంగా గుర్తించినప్పుడు నేటి ప్రజాస్వామిక యుగ లక్షణానికి అనుగుణంగా అన్ని సామాజికవర్గాలూ ఆ వారసత్వంపై హక్కుదారులే అవుతారు. ఇంకాస్త సూటిగా చెప్పాలంటే ఒక దళితుడు, లేదా మరో పీడితవర్గానికి చెందిన వ్యక్తి భారత,భాగవత, రామాయణాదులను సొంత ఆస్తిగా భావించుకునే  అవకాశం ఉండాలి. అంటే, వారికి ప్రతికూలమైన అంశాలను తొలగించి ఆ రచనలను కుల తటస్థంగా మార్చాలి. మొత్తం సాంస్కృతిక వారసత్వాన్నే  ప్రజాస్వామికీకరించి దానిని ఉమ్మడి వారసత్వంగా మార్చాలి.

అలా అనడం తేలికే కానీ, అందుకు ఏం చేయాలన్నదే అసలు ప్రశ్న.  ప్రతికూల కథలను, ఘట్టాలను తొలగించడం ఒక మార్గమా? అలా అయితే, ఆ రచనలకు, అందులోని భావాలకూ గల చారిత్రకతకు నష్టం కలుగుతుంది. వాటిని అన్నిటినీ ఒకచోట పొందుపరచి అనుబంధంగా ఇస్తూనే వాటిని ఆమోదయోగ్యం కానివిగా ప్రకటించి కుల తటస్థ పాఠాన్ని రూపొందించడం మరో మార్గమా?

మొదట ఉమ్మడి పాఠం అవసరాన్ని అందరూ గుర్తించగలిగితే, అది ఎలా చేయాలన్నది తర్వాతి ప్రశ్న.

                                                              ('సూర్య' దినపత్రికలో ఫిబ్రవరి 10, 2013న ప్రచురితం)
                                                                                                      


15 comments:

  1. తప్పుకు శిక్ష పడుతుంది, కానీ ఆ శిక్ష ఎంతవరకూ అంటే అతని వల్ల బాధకు గురైన వాళ్ళు క్షమించనంతకాలం, ఇది అర్ధం కాక ఈ విపరీత వ్యాఖ్యానాలు.

    ReplyDelete
    Replies
    1. మొదట సంస్కారవంతంగా, సభ్యతగా, హేతుబద్ధంగా స్పందించడం అలవరచుకుంటే మీరు ఇటువంటి అర్థరహిత,అసందర్భ,విపరీత వ్యాఖ్యలు చేయరు. మీరు చెప్పిన శిక్షాస్మృతినే అమలు చేయవలసివస్తే అఫ్జల్ గురును పార్లమెంట్ దాడి బాధితులు, రాజీవ హంతకులను రాజీవ్ కుటుంబసభ్యులు క్షమించేస్తే ఇక వాళ్ళను శిక్షించవలసిన అవసరం ఉండదు!

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. అయితే మొదటి ప్రశ్న
      చనిపోనది ఎవరు?

      Delete
    4. రెండవ ప్రశ్న శిక్ష విధించినది ఎవరు?

      Delete
    5. మూడవ ప్రశ్న
      క్షమించినది ఎవరు?

      Delete
  2. భాస్కరంగారూ, విశ్వనాథవారి క్లుప్తవ్యాఖ్యలో మీకు కుసంస్కారం, అసభ్యత, అహేతుకత, సందర్భరాహిత్యం, అర్థరాహిత్యం మరియు వైపరీత్యమూ అనే అనేక దురదృష్టకర లక్షణాఅలు యెలా కంపించాయో బోధపడటం లేదు. వార్రు వెలిబుచ్చిన అభిప్రాయంతో మీరు యేకీభవించనక్కర లేదు. కాని అసహనంతో యిన్ని అభాండలూ వేయనక్కరలేదు. ఆగ్రహపరవశత్వం వాదానికి శోభనివ్వదని మీరు గుర్తిసారని ఆశిస్తున్నాను.

    ఇకపోతే, మీరు సూటిగానే చెప్పినట్లు పురాణేతిహాసాలను కాలానుగుణంగా అంటూ యెప్పటిపప్పుడు సంస్కరించటం పేరుతో మార్పులు చేసుకుంటూ పోతే వాటి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. దీనిని మీరు కుడా గుర్తించారని తెలిసి సంతోషం కలిగింది. కాణి మీరన్న కాలానుగుణతటస్థపాఠాలను తయారు చేయటమూ వాటి షహజస్వరూపాలను నిస్సందేహంగా దెబ్బతీస్తుంది కాబట్టి అది అచరణసాధ్యమూ కాదు ఆచరణయోగూమూ కాదని నా అభిప్రాయం.

    ఈ విషయం పురాణేతిహాసాల వంటి ప్రాచీనసాహిత్య రూపాలకే కాదు అర్వాచీనసాహిత్యరూపాలకూ రావచ్చును. ముందుముందు తరాలలో మన జనం ఆంగ్లేయుల పట్ల అభిమానం కలవారిగా మారితే ఆ రాబోయే తరం వారు మన సాతంత్రోద్యమసాహిత్యాన్నంతటినీ తమ కాలానికీ భావాలకూ అనుగుణంగా సంస్కరించుకోవటం కూడా అభిలషణీయం అనుకుందామా? ఎందుకంటే అలా సంస్కారం పొందిన చరిత్రపాఠాలలో గంధీ నెహ్రూ బోసుల వంటివారు దేశద్రోహులుగా తేలుతారు.

    అందుచేత చారిత్రక విషయాలలోనూ సాహిత్య సంపద విషయంలోనూ మనకు నచ్చినట్లు మనం సంస్కరించుకోవటం అన్నది ప్రమాదకర్ఫమైన ఆలోచనా ధోరణి కావచ్చునని అనిపిస్తున్నది.

    చివరగా ఒకమాట. మీకు నా అభిప్రాయాలు కాని భాష కాని నచ్చకపోతే నాకేమీ అభ్యంరరం లేదు. లోకో భిన్నరుచిః. కాని దయచేసి ఆగ్రహించ వద్దని మనవి. నిందలూ, దీర్ఘ చర్చల పట్ల నాకు ఆసక్తీ లేదు, అంత సమయమూ లేదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ, మీరు ఇంత ఏకపక్షంగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. 'ఇది అర్థం కాక ఈ విపరీత వ్యాఖ్యానాలు' అన్న వాక్యంలో మీకు కనిపించని అభ్యంతరం నా సమాధానంలో కనిపించడం దురదృష్టకరం. అలాగే, ఆయన వ్యాఖ్యలో కనిపించని అసహనం నా వ్యాఖ్యలో కనిపించడం ఇంకా దురదృష్టకరం. ఈ పక్షపాత ధోరణి మీకు కూడా శోభనివ్వదు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో స్పందించి ఉంటే 'బాధితులు క్షమించనంతవరకే శిక్ష' అనే మాట ఆయన అని ఉండరు. అందులో మీకు ఎలాంటి అహేతుకతా కనిపించలేదా? ఆవేశంతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. నా ఇతర పోస్ట్ ల పై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూడండి.
      ఇక పురాణేతిహాసాలను సంస్కరించడం విషయంలో మీ అభిప్రాయం మీది. కాకపోతే, ఒకటి రెండు కులాలపట్ల పక్షపాతాన్ని, ఇతర కులాలపట్ల న్యూనతాభావాన్నీ చాటే పురాణేతిహాసాలను ఆ కులాలు ఆత్మీయంగా, ఆ వారసత్వానికి తాము కూడా హక్కుదారులుగా భావించడానికి ఏం చేయాలో చెప్పండి. పురాణేతిహాసాల పాక్షికతను వారు ప్రశ్నించకుండా ఏం చేయాలో కూడా చెప్పండి. ఇక ముందు ముందు జనం ఆంగ్లేయులపట్ల అభిమానులుగా మారితే...అన్నమీ ఊహ నిరాధారం, అసంభావ్యం. కేవలం యుక్తివాదం.

      Delete
    2. భాస్కరంగారూ, విశ్వనాథవారి అభిప్రాయంతో నేనూ యేకీభవించటం లేదండీ. విపరీతవ్యాఖ్యానం అని ఆయన అనటం కూడా సరికాదనే నా అభిప్రయమునూ. ఒకరి క్షమాపణలతో శిక్షార్హులు తప్పించుకోవచ్చనటాన్ని నేనూ తప్పుపడతాను. ఇకపోతే, పురాణేతిహాసాల పాక్షికత మన ఊహ లోనే ఉన్నదని అవి వాటిలో సహజంగా ఉన్నది కానవసరం లేదని అనుకుంటున్నాను. నా అభిప్రాయం మీకు రుచించకపోవచ్చును. నేను ఉదహరించినది యిక్తి వాదం అన్నరు. బాగుంది. కాని విషయవిమర్శ చేసేటప్పుడు అన్నీ అలోచించాలి. పురాణేతిహాసాలకు భారతీయులందరూ వారసులే. వారిలో కొందరు తమకు అనుకూలంగా లేవు కాబట్టి తాము హక్కుదారులుగా లేమని అనుకోవటమూ అందుకు పరిష్కారంగా వాటిని మార్చాలనుకోవటమూ రెండూ సబబు కాదని అనిపిస్తోంది.

      Delete
    3. మీరు ఆ మాట మొదటే అని ఉంటే మీకు పక్షపాతాన్ని ఆపాదించేవాడిని కాదు. ఆయన అయినా బాధితులు క్షమించిన తర్వాత కూడా శిక్ష వేయాలా? అన్న ప్రశ్నకే పరిమితమైతే చర్చ ముందుకు వెళ్ళేది. ఆ అవకాశం లేకుండా ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేశారు. అందులోనూ ఒకే ఒక వాక్యంలో. నాకు అర్థంకాక విపరీత వ్యాఖ్యానాలు చేశానన్నప్పుడు ఆయనకు ఎంత అర్థమైందో చెప్పాలి కదా?
      పురాణేతిహాసాల పాక్షికత ఊహాలోనే ఉన్నదని, అవి వాటిలో సహజంగా ఉన్నది కానవసరం లేదని అనుకుంటున్నానన్నారు. వాటిలో సహజంగా లేనిది ఊహలోకి ఎలా వస్తుంది? రావడానికి ఎవరు బాధ్యులు? వాటి పఠన పాఠనాలు, ప్రవచనాలూ చేస్తున్న పండితులూ, పౌరాణికులా? అదీగాక నా పోస్ట్ మీరు చదివారు కనుక ఆ కథ ఊహో వాస్తవమో మీరే చెప్పండి. పురాణేతిహాసాలకు భారతీయులందరూ వారసులే అన్నారు. ఒకటి రెండు కులాలను గొప్ప చేసి సోకాల్డ్ నిమ్న కులాలను కించపరిచే ఘట్టాలు ఉన్నప్పుడు వీటికి మీరు కూడా వారసులే అంటే ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పించగలరా? నేను అనేది ఏమిటంటే, కులమతలింగ భేదాలకు అతీతమైన రాజ్యాంగం గొడుగు కింద భారతీయులుగా అన్ని కులాల వాళ్ళూ కలసుకుంటున్నారు. కలిసి పని చేస్తున్నారు. పని చేయాలి కూడా. రాజ్యాంగ నిర్దేశాల కారణంగా లౌకిక కార్యక్షేత్రాలలో సమానత్వాన్ని కొంతవరకు తీసుకు రాగలిగారు. మరి మత,సాంస్కృతిక,ఆధ్యాత్మికరంగాలలో ఆ ప్రయత్నం జరుగుతోందా? ఈ వైపు ఎప్పటిలా మౌనం కొనసాగుతుండడంతో దళిత, ఇతర పీడిత కులాలు ఇతర మత ఆధ్యాత్మిక మార్గాలు వెతుక్కుంటున్నాయి. పురాణేతిహాసాలతో సహా హైందవ వారసత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కంచ ఐలయ్య రచించిన 'హిందూ మతానంతర భారతదేశం' అన్న రచనపై ఆమధ్య జరిగిన చర్చను మీరు చూసే ఉంటారు. మాజీ డీజీపీ అరవిందరావు వంటి వారు ఆ చర్చలో పాల్గొన్నారు. పురాణేతిహాసాలలోని మంచినే చూడండని వీరంటుంటే, మరి చెడు సంగతేమిటని వారు అడుగుతున్నారు. సంభాషణ అక్కడితో ఆగిపోతోంది. ఉభయుల మధ్య అర్థవంతమైన సంభాషణ లోపించిన ఈ పరిస్థితిని ఎంతకాలం కొనసాగిస్తారు? అన్ని కులాల మధ్య భావైక్యతను, అంతా భారతీయులమన్న స్పందనను ఎలా తీసుకొస్తారు? ఇవీ ప్రశ్నలు.

      Delete
    4. భాస్కరంగారూ, మీరు లేవనెత్తిన ప్రశ్మలు ఆలోచించదగ్గవిగా ఉన్నాయి. అయితే, వ్యాఖ్యల రూపంలో సుద్రీర్ఘ వివరణలు ఇవ్వటం అంత సబబుగా ఉండదనే ఉద్దేశంతో చాలా క్లుప్తంగా వ్రాస్తున్నాను.

      పురాణేతిహాసాలు యెవరినీ కించపరచలేదని నేననుకుంటున్నను. కాదని ఆధునికులలో చాలా మంది భావిస్తున్నారని నాకూ తెలుసు. ఎవరి సమర్థనలు వాళ్ళవి. ఒకనాటి భావజాలం, పథ్థతులూ నేటి వారలు వేరే దృష్టితో చూడటం వలన చిక్కులు యేర్పడుతూ ఉండవచ్చును. ఉదాహరణకు గాంధీగారు హరిజన పదాన్ని సృజించారు. ఆ పదం నేడు అక్షరాలా అంటరానిదయింది. అందు చేత గాంధీగారికి ఆయన హరిజనులని పిలచి (ఆయన దృష్టిలో)గౌరవించిన ప్రజలను ఆయన అవమానపరచారని నేడు ఆరోపిసించ వచ్చునా? గాంధీగారి సాహిత్యాన్ని ఇప్పుడు నేటివారి ఆమోదంకోసం ఆధునికీకరిద్దామా? ఇకపోతే చెడును చూడదలస్తే అది మనకు తప్పకుండా కనిపిస్తుంది. మంచిని చూడ దలచుకోకపోతే యేమీ చెయ్యలేం. ఉదాహరణకు విశ్వామిత్రవశిష్టుల వైరం తీసుకుని విశ్వామిత్రుడు ముక్కోపి అనే తీసుకోవటం బదులు అటువంటి స్థితినుండి బ్రహ్మర్షిగా పరిణితి చెందటాన్ని గ్రహించాలి. కాని ఆయన ధూర్తుడూ ముక్కోపి అనే విషయం దగ్గరే ఆగిపోయి వాదించదలచుకుంటే యెలా? ఇంకా చాలా వ్రాయవలసి ఉంది కాని ముందు చెప్పిన విస్తరభీతి వలన విరమిస్తున్నాను.

      Delete
    5. గాంధీగారు దళితులను హరిజనులని పిలవడం, శిక్షాస్మృతిని సెలెక్టివ్ గా అమలు చేయాలని చెప్పడం ఒకలాంటివి కావు. గాంధీగారే ఒకవేళ ఆమాట అన్నా దళితులే కాదు, దళితేతరులు కూడా వ్యతిరేకించవలసిందే. ఎందుకంటే అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కనుక. మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇతరులు ఎలా స్పందిస్తారో చూద్దాం. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
    6. అయితే భారతీయ శిక్షాస్మృతి నుంచీ క్షమించడం అన్న పదం తీసేద్దాం. సరిపోద్ది కదా. మొదట వెళ్ళి భారతీయ శిక్షాస్మృతి మీద ఒక suit file చెయ్యండి.

      Delete
    7. మీ ప్రశ్నల్లో మీరేం చెప్పదలచుకున్నారన్నదే ఓ పెద్ద కొశ్చన్ మార్క్ అయింది. మొత్తంమీద మీ లేటెస్ట్ వ్యాఖ్య చూశాక,మీరు తొట్టతొలి వ్యాఖ్యలో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించారని అర్థమైంది. కనుక నేను మొదట ఇచ్చిన సమాధానమే చాలు. అయినాసరే, మీ విలక్షణ శిక్షాస్మృతి ఎలాంటి విచిత్రసన్నివేశాలను సృష్టించగలదో ఇంకోసారి, మరింత వివరంగా చెప్పుకుందాం.
      1. అఫ్జల్ గురు,మరికొందరు టెర్రరిస్టులు పాత్రధారులైన పార్లమెంటు పై దాడిలో అదృష్టవశాత్తూ ఎవరూ చనిపోలేదనీ, పార్లమెంటు భవనం మాత్రమే దెబ్బతిందనీ అనుకుందాం. అప్పుడు మీ శిక్షాస్మృతి ప్రకారం భారతప్రభుత్వం అఫ్జల్ గురుతో సహా అందరినీ క్షమించి విడిచిపెట్టేయాలి(కథలో కొంగ కోరికపై గౌతముని క్షమించి విడిచిపెట్టినట్టుగా). అంతేకాదు, వాళ్ళ మెడలో పూలదండలు వేసి, దారి ఖర్చులు ఇచ్చి, బాజాభజంత్రీలతో సగౌరవంగా సాగనంపాలి(తను చేసిన ఘోరానికి కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించని గౌతమునికి డబ్బుమూటలు ఇచ్చి పంపించినట్టుగా)
      2. రాజీవ్ గాంధీ తనపై జరిగిన హత్యాప్రయత్నంలో చనిపోలేదనుకుందాం. అప్పుడు, మీ శిక్షాస్మృతి ప్రకారం భారతప్రభుత్వం హంతకులను క్షమించి విడిచిపెట్టేయాలి. అంతేనా? వారిని శౌర్యపతకాలతో సత్కరించి పంపించాలి.
      3. ఒక మగపశువు ఒక అమ్మాయిపై అత్యాచారయత్నం చేశాడు. మానభంగం తప్ప అన్నీ జరిగాయి. మానభంగం జరగలేదుకనుక మీ శిక్షాస్మృతి ప్రకారం ఆ అమ్మాయి ఆ మగపశువును క్షమించేయాలి. ఆ తర్వాత సత్కారం కూడా జరగాలి కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ పశువు కాళ్ళు కడిగి, నెత్తిన జల్లుకుని, సువర్ణ సహిత కన్యాదానం చేసి తరించాలి. ఆమధ్య ఒక జడ్జీగారు ఈ అమూల్యసలహానే ఇచ్చినట్టు వార్త వచ్చింది.
      నేరమూ-శిక్ష గురించి మీకు అర్థం కానిది చాలా ఉందని'నేరం క్షమాపణతో సరి' అనే మీ అవగాహన చెబుతోంది. నేరం అనేది నేరస్తునికీ,నేర బాధితునికీ/బాధితురాలికీ పరిమితమయ్యే వ్యక్తిగత విషయం కాదు. మధ్యలో సమాజం,ప్రభుత్వం,న్యాయస్థానాలు,చట్టాలూ ఉంటాయి. మీ శిక్షాస్మృతి ప్రకారం ఇవేవీ అక్కర్లేదు. నేరస్తుడూ-బాధితులూ సర్దుబాటు చేసేసుకుంటే చాలు. ఇలాంటి శిక్షాస్మృతి అనాగరిక, ఆటవిక యుగంలో కూడా లేదు. అంటే మీ ఊహలు అంతకంటే వెనకటి అంధకారదశలో ఉన్నాయన్నమాట. మహాత్మాగాంధీ అంతటివాడు తన హంతకుని క్షమించి విడిచిపెట్టమని అన్నాసరే, ఆయనను నెత్తిన పెట్టుకునే నెహ్రూ-పటేల్ ప్రభుత్వం కూడా గాంధీ హంతకుల మరణశిక్షకు వ్యతిరేకంగా సిఫార్సు చేయలేదు.

      Delete
    8. 'కుక్కలు కూడా తాకడానికి అసహ్యించుకున్న' ఒక నికృష్టుని క్షమించి విడిచిపెట్టడాన్ని సమర్థిస్తున్న మీ క్షమాగుణం అసాధారణమే. అయితే, కథలో కొంగ అతని కులాన్ని తలచుకుని నా వల్ల అతనికి ఇంత దుర్దశ కలిగిందే అని బాధపడి విడిచిపెట్టమంది(సావధానంగా వ్యాసం ఇంకోసారి చదవండి)కనుక అది పాక్షిక క్షమాగుణమే అవుతుంది. మీరు ఇంకో అడుగు ముందుకు వేసి అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు లాంటివారిని కూడా క్షమించి విడిచిపెట్టమని కోరుతూ మెర్సీ పిటిషన్లను వేసి ఉంటే మీది కల్తీ లేని క్షమాగుణం అయ్యేది. ఇప్పుడైనా నష్టం లేదు. ఉరిశిక్ష పెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి తరపునా మీరు మెర్సీ పిటిషన్ వేయచ్చు.
      భారతశిక్షాస్మృతి నుంచి క్షమించడం అనే పదం తీసేయమని కోరుతూ suit file చేయమని మీరు నాకు ఒక విచిత్రమైన సలహా ఇచ్చారు. మధ్యలో 'భారతశిక్షాస్మృతి నుంచి క్షమించడం అనే పదం తీసేయడం'అనే ముచ్చట ఎక్కడినుంచి ఊడిపడిందో కాసేపు అర్థం కాలేదు. నా వ్యాసంలో గౌతముని క్షమించకుండా ఉరి తీసేయమని నేను ఎక్కడైనా అన్నానా?!(సావధానంగా నా వ్యాసం ఇంకోసారి చదవండి) శిక్షించకుండా విడిపెట్టడం గురించే కదా నేను ప్రస్తావించింది? మన దేశంలో ఇప్పుడు rarest of rare cases లోనే మరణశిక్ష పడుతుంది. మరణశిక్షల సందర్భంలోనే క్షమాభిక్ష ప్రస్తావన వస్తుంటుంది. గౌతముని శిక్షించలేదని మాత్రమే అన్న నేను, క్షమించడం అన్న పదం తీసేయమని ఎందుకు సూట్ ఫైల్ చేయాలి?! ఎక్కడినుంచి ఎక్కడికెళ్లారో చూడండి. నా వ్యాసం మీరు సరిగా చదవలేదు. చదివింది కూడా మీకు అర్థం కాలేదని మీ అపార్థాలు చెబుతున్నాయి. వ్యాసం చదవకుండానే కామెంట్లు రాసేస్తారు. పైగా మీకు అర్థం కాలేదంటారు. అర్థం కాని భాషలో ప్రాణం తీస్తారు.
      నాకు సలహా ఇచ్చారు కనుక మీకూ ఒక సలహా. ప్రస్తుత శిక్షాస్మృతిని రద్దు చేసేసి పైన పేర్కొన్న, ఆదిమానవుల దశకు చెందిన మీ చిత్రవిచిత్ర శిక్షాస్మృతిని అమలులోకి తీసుకురమ్మని అర్జెంటుగా ఉద్యమించండి. మీ ఉద్యమం ఫలించి మీ శిక్షాస్మృతి అమలులోకి వస్తే హంతకులే మిగులుతారు. ప్రభుత్వం వాళ్ళకు డబ్బుమూటలు ఇచ్చి హంతకశ్రీ బిరుదుతో సత్కరించి చరితార్థమవుతుంది.

      Delete