నరేంద్ర మోడీకి భార్య ఉందనీ, ఆమె పేరు యశోదా బెన్ అనీ రెండు నెలల క్రితమే వార్త వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆమె ఇంటర్వ్యూ కూడా ప్రచురించింది. మోడీ తన నామినేషన్ పత్రంలో ఆమె పేరు పేర్కొనడం వల్ల ఇది మళ్ళీ వార్త అయింది.
ఇందులో ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు...
మోడీ ఇంతకాలం తనకు పెళ్లి అయిన సంగతిని ఎందుకు దాచినట్టు? అది ప్రపంచానికి తెలియవలసినంత ప్రధానమైన విషయం కాదు కనుక దాచి ఉంచారనుకుందాం. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తికి పెళ్లయిందా లేదా అన్నది అప్రధానం అయినప్పుడు నామినేషన్ పత్రంలో marital status ను అడిగే కాలమ్ ను ఎందుకు చేర్చినట్టు? ఆ కాలమ్ ఉన్న తర్వాత కూడా గత ఎన్నికలలో మోడీ దానిని blank గా ఎందుకు ఉంచేసినట్టు? ఉంచారుపో, దానిని నింపమని సదరు అధికారి ఆయనను ఎందుకు అడగనట్టు? ఇప్పుడు మాత్రమే మోడీ భార్య ఉన్న సంగతిని ఎందుకు వెల్లడించినట్టు?
మన దేశంలో నిబంధనల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అదే మామూలు మనిషి అయితే, దానిని blank గా ఎందుకుంచావని అడుగుతారు. మన ఎన్నికల కమిషన్ ఇంత గొప్పదీ అంత గొప్పదీ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత ఎన్నికల ఘట్టంలోనే అదెంత దుర్బలమో తెలిసిపోతోంది. అభ్యర్థులను కట్టడి చేసే గొప్ప అధికారాలు అన్నీ ఈసీకి ఉన్నాయని అనడమే కానీ వాటిని వినియోగించిన సాక్ష్యం కనిపించడంలేదు, ఉత్తుత్తి నోటీసులు ఇవ్వడం తప్ప.
మోడీ పెళ్లి విషయానికి మళ్ళీ వెడదాం...
ఆయన అన్నదమ్ములు అది బాల్య వివాహం అంటున్నారు కానీ, అలా అని చెప్పలేం. అప్పటికి ఆయనకు 18 ఏళ్ళు, ఆమెకు 17 ఏళ్ళు ఉన్నాయి. అది పెళ్లి అంటే ఏమిటో తెలిసే వయసే.
వారిద్దరి మధ్యా ఎలాంటి కలతలూ లేవు. ఒకరికొకరు ఎందుకు దూరమైనట్టు? ఆయన దేశసేవకు ప్రాధాన్యం ఇచ్చి ఇంట్లోంచి వెళ్లిపోయారని ఒక సమాధానం. దేశసేవ కోసం పెళ్లి మానేస్తే అర్థముంది. కానీ తీరా పెళ్లి చేసుకున్న తర్వాత దేశ సేవకు భార్య అడ్డమని భావించడంలో న్యాయమేముంది? గాంధీ పెళ్లి చేసుకున్నాకే దేశసేవలోకి అడుగుపెట్టారు. భార్యను అడ్డమని భావించలేదు. పైగా ఆమెను కూడా దేశసేవలో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆవిధంగా ఆమె జీవితానికి చరితార్థతను కల్పించారు. మరి మోడీ యశోదాబెన్ కు అటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఆమెను అనామకంగా ఎందుకు ఉంచేశారు?
భారతీయ సాంప్రదాయంలో అగ్నిసాక్షిగా జరిగే పెళ్ళికి ఉన్న ప్రతిపత్తి తెలిసినదే కదా! పెళ్లి రెండు జీవితాలకు ముడి. పెళ్లి భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ఒక బాధ్యత. మోడీ ఆ బాధ్యతను ఎందుకు గుర్తించలేదు? ఇన్నేళ్లలోనూ భార్య ఉనికిని ఎందుకు పట్టించుకోలేదు? ఆమె గురించిన సమాచారం కూడా ఆయన వద్ద లేకపోవడమేమిటి? పోనీ తను దేశసేవలో ఉండడం అందుకు కారణం అనుకున్నా, తమ ఇంట్లో ఆమెకు కోడలి స్థానం కదా. ఆమె తన ఇంట్లో సభ్యురాలు కదా. తమ మధ్య భార్యాభర్తల సంబంధం లేకపోయినా వారు విడాకులైతే పుచ్చుకోలేదు. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. వారి మధ్య గొడవలూ లేవు. అలాంటప్పుడు అత్తమామలకు కోడలిగా, అన్నకు మరదలిగా, తమ్ముళ్ళకు వదినెగా ఆమె స్థానం ఆమెదే కదా. ఆ సంబంధం కూడా ఎందుకు లేకుండా పోయింది?
మొత్తానికి నరేంద్ర మోడీ తన భార్య పట్ల ఎలాంటి బాధ్యతా తీసుకోలేదు. తను దేశసేవ పేరుతో ఆమెను వదలి వెళ్ళేటప్పుడు తానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు కానీ, ఆమె అభిప్రాయం తెలుసుకోలేదని వార్త సూచిస్తోంది. ఆమెను చదువుకోమని చెప్పారు కానీ, ఆ తర్వాత ఆమె ఏం చదువుతోందో, ఏం చేస్తోందో కనుక్కోలేదు. ఆమెకు కూడా ఒక స్త్రీగా భర్తతో కాపురం చేయాలనీ, పిల్లల్ని కనాలనే కోర్కె ఉంటుందన్న సంగతిని ఆలోచించలేదు. విడాకులైనా ఇచ్చి ఆమెను పునర్వివాహానికి ప్రోత్సహించలేదు. అసలు ఆమె అంతరంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆమెను అలా విడిచిపెట్టేశారు, అంతే!
నరేంద్ర మోడీ రేపు ప్రధాని అయితే దేశంలోని 120 కోట్ల మందికీ న్యాయం చేయగల సమర్థులే అనుకున్నా, ఆయన ప్రధాని కాకముందే అన్ని కోట్లమందిలో యశోదా బెన్ అనే ఒక్కరు తగ్గిపోయారని మీకు అనిపించడం లేదా?! ఇక్కడే నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. ప్రపంచంలో ఎన్ని కోట్లమంది ఉన్నా ఒక్క జీవితం విలువ, మిగిలిన కోట్ల జీవితాల విలువతో సమానం. ఎలాగంటే ఒక తల్లికి పదిమంది పిల్లలు ఉంటే, ఒక్క కొడుకు లేదా కూతురు జీవితం విలువ పదిమంది విలువతో సమానం. తొమ్మిదిమంది జీవితానికి ఉమ్మడిగా ఎక్కువ విలువ ఇచ్చి ఒక్కరి జీవితానికి తక్కువ విలువ నివ్వదు. అలాగే ప్రకృతి అనే తల్లి కూడా తనకు ఎన్ని కోట్ల మంది సంతానం ఉన్నా వారందరికీ విడివిడిగానూ, కలిపీ ఒకే విలువ ఇస్తుంది.
ఈవిధంగా భార్యపట్ల మోడీ బాధ్యత చూపకపోవడం కూడా 120 కోట్లమందిపట్ల బాధ్యత చూపకపోవడంతో సమానమే కాదా?!