Friday, June 27, 2014

పీవీ గారిది కంప్యూటర్ మెదడు

ఈ రోజు పూర్వ ప్రధాని పీవీ నరసింహారావుగారి జయంతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ కలసి పీవీ గారి జయంతిని నిర్వహిస్తే బాగుండేది. పీవీ తెలుగు వారు అందరికీ చెందిన వ్యక్తి. తెలుగువారికే కాదు, మొత్తం దేశానికి చెందిన వ్యక్తి. దేశవ్యాప్తంగా ఆయనను అభిమానించేవారు ఉన్నారు.

పీవీగారు భారతదేశ ప్రధాని కావడం స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక అద్భుతం. ఎందుకంటే, ఆయనకు మేధాబలమే తప్ప ప్రజాబలం లేదు. దక్షిణాది వ్యక్తిగా ప్రాంతీయబలం లేదు. కులబలం లేదు. అలాంటి వ్యక్తికి, కారణం ఏదైనా, కాంగ్రెస్ పార్టీ  ప్రధాని అయ్యే అవకాశం ఇచ్చింది. అదే కాంగ్రెస్ నాయకత్వం కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధి కూడా లేకుండా అవమానించింది. పార్టీలో ఎవరూ ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా వీలులేని పరిస్థితిని కల్పించింది. ఒక ప్లస్సూ, ఒక మైనస్సూ......

పీవీ ప్రధానమంత్రిత్వంలో కూడా కొన్ని ప్లస్సులూ, మైనస్సులు తప్పకుండా ఉండే ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా ఆయనపై ఉన్న అభిమాన, గౌరవాలను గమనిస్తే ప్లస్సులదే పై చేయి అనిపిస్తుంది. చాలామంది దృష్టిలో సుదూర ప్రభావంతో దేశాన్నికొత్త మలుపు తిప్పగల ఆర్థిక విధానాల ప్రారంభకుడు ఆయనే. సరే, ఈ విధానాల మంచి, చెడుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడం వేరే సంగతి.

ఎన్నికల వరకే రాజకీయ విభేదాలనీ, తర్వాత దేశాన్ని ముందుకు నడిపించడంలో సమష్టిగా పనిచేసేలా అందరినీ కలుపుకు పోవడం నా విధానమనీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. పీవీ నిశ్శబ్దంగానే ఆ విధానాన్ని అమలుచేశారు. అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయిని సముచితంగా గౌరవిస్తూ కొన్ని అంతర్జాతీయ విషయాలలో ఆయనను భాగస్వామిని చేశారు.

పీవీగారు వ్యక్తిగా అద్భుతమైన, అరుదైన వ్యక్తి. ఆయనలో ఒక రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు, మేధావి, బహుభాషాప్రవీణుడు, సాహితీ పిపాసి, రచయిత ఉన్నారు. ఉండడమే కాదు సమపాళ్లలో ఉన్నారు. తన మెదడులో ఇన్ని అరలను ఏకకాలంలో ఎలా పోషించుకున్నారో, అన్నింటికీ సమయం ఎలా ఇచ్చారో ఆశ్చర్యం కలుగుతుంది.

ఓ సారి హైదరాబాద్ లో ఆయన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సభ సందర్భంలో విమలా శర్మ అనే  రచయిత్రి తను మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించిన ఏకనాధరామాయణ సంపుటాలను, మరికొన్ని రచనలను ఆయనకు బహూకరించారు. చుట్టూ జనం మూగి ఉన్న ఆ సందర్భంలోనే ఆయన ఎంతో ఆసక్తితో ఆ పుస్తకాలను తిరగేస్తూ మరాఠీ సాహిత్యం గురించి ఓ పదినిమిషాలు మాట్లాడారు. జ్ఞానేశ్వరిని కూడా అనువదించమని ఆమెకు సూచించారు.

ఆయనలో మరో అద్భుతం జ్ఞాపకశక్తి!

ఆయన ఎవరితోనైనా ఒక విషయం ముచ్చటిస్తే, ఆ వ్యక్తి నెల రోజులకు కలసినా, రెండు నెలలకు కలిసినా సరే; అంతకుముందు మాటల్లో ఆ విషయాన్ని ఎక్కడ ఆపేశారో, సరిగ్గా అక్కడినుంచి ఎత్తుకునేవారు. ఆ వ్యక్తికి అది చాలా ఆశ్చర్యం కలిగించేది. ఒకవిధంగా ఆయనది కంప్యూటర్ మెదడు.

ఆయన తన Insider తెలుగు అనువాదం పాఠాన్ని ఎప్పటికప్పుడు స్వయంగా పరిశీలించి ప్రూఫ్ రీడింగ్ కూడా చేస్తూ అవసరమైన సవరణలు చేసి hard copy ని తిప్పి పంపేవారు. ఒకసారి ఆసుపత్రి బెడ్డు మీద కూడా ఉండి అనువాదం తాలూకు కాగితాలు చూసి తిప్పి పంపేసి, వెంటనే వైద్యం కోసం అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండు రోజులకు అనువాదకునికి ఫోన్ చేసి, ఫలానా chapter లో ఫలానా పేజీలో, ఫలానా పేరాలో ఒకచోట ఉపయోగించిన మాటకు బదులు ఈ మాట ఉంటే బాగుంటుందని సూచించారు. అంటే ఆరోగ్యసమస్యలలో, ప్రయాణం ఒత్తిడులలో ఉన్నప్పటికీ ఆయన మెదడులోని రచనకు సంబంధించిన భాగం చురుగ్గా పనిచేస్తూనే ఉందన్న మాట.

బీజేపీ ప్రభుత్వం వస్తే పీవీకి భారతరత్న ఇస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది జరగాలని కోరుకుందాం. భారతరత్న వల్ల ప్రత్యేకంగా ఆయనకు ఏదో ఒరుగుతుందని కాదు. విస్మృతికి గురవుతున్న ఆయన contribution అప్పుడైనా మరింత విస్తృతంగా చర్చలోకి వస్తుంది.


Thursday, June 26, 2014

నియోగ పద్ధతిలో సంతానం...ఒక మపాసా కథ...

చెహోవ్ తర్వాత...బహుశా చెహోవ్ తో సమానంగా... నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా. చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ పేరు The Legacy అని ఓ బండ జ్ఞాపకం.  


బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు.  ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.

పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. 

Sunday, June 22, 2014

ప్రీతీ జింటా-నుస్లీ వ్యవహారంపై ఇంత ఫోకస్ అవసరమా?!

ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి నిమిషమూ  ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసే మసాలా వార్తలు కావాలి. కొంతవరకు వాటి పరిస్థితిని అర్థం చేసుకోవలసిందే. కానీ ఎంతవరకూ? ఎక్కడో ఒకచోట హద్దు, ఔచిత్యం ఉండాలి కదా?

ప్రీతీ జింటా, నుస్లీ వాడియా వ్యవహారం వార్తలకు ఎక్కి పది రోజులు అయినట్టుంది.  పైగా దాని మీద డిబేట్లు కూడా. అయిదేళ్లపాటు బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నుస్లీ వాడియా ఓ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ప్రీతీ జింటా దగ్గరకు వచ్చి దురుసుగా ప్రవర్తించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లోపల ఎవరో అండర్ గ్రౌండ్ మనిషి నుస్లీని బెదిరించాడు. ప్రీతీ జింటా ఈ మధ్యలో అమెరికా వెళ్ళి వచ్చింది. ఇంతే కదా ఇంతవరకు జరిగింది? దీనిని రోజుల తరబడి సీరియల్ లా సాగదీయడానికి న్యూస్ వాల్యూ ఏముంది? ఏదైనా డెవెలప్ మెంట్ ఉంటే వార్తగా చెప్పచ్చు. లేనప్పుడు ఎందుకు అదే పనిగా ఎయిర్ టైమ్ ను వేస్టు చేయడం? వాళ్లేమైనా జాతీయ నాయకులా? కేవలం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కదా! పైగా ప్రీతీ జింటా కరెన్సీలో ఉన్న సినీ హీరోయిన్ కూడా కాదు. నుస్లీ వాడియా ఏ అంబానీలు, టాటాల స్థాయి ఉన్నవాడో కాదు. ఎందుకు వాళ్ళ సమస్యను జనం మీద రుద్దడం? అలాగని కరెంటు హీరోయిన్లు, అంబానీ స్థాయి వారూ అయితే తప్పులేదని అనడం నా ఉద్దేశం కాదు.  ఇలాంటి అన్ని వార్తలనూ జనం ఆసక్తిగా చూస్తారని వారు అనుకుంటున్నారా? అలా అనుకోవడానికి ఏమైనా ఆధారం ఉందా?

బియాస్ నదిలో 24 మంది కాలేజీ విద్యార్థులు కొట్టుకుపోయి చనిపోతే, ఆ దారుణ ఘటనపై ఇంత ఫోకస్ లేదు. దానిపై అంతగా చర్చలు లేవు. అది ఎంత ముఖ్యమైన విషయం!

న్యూస్ చానెళ్ల మధ్య పోటీ ఉంటుంది కనుక ఏ చానెల్ కు అదే వెనకబడిపోకూడదని అనుకుంటుంది నిజమే. అలాంటప్పుడు అన్ని చానెళ్లూ కలసి ఇలాంటి విషయాలలో పాటించవలసిన విధివిధానాల గురించి స్థూలంగా ఒక అవగాహనకు రావచ్చు కదా! అందరూ కలసి మీడియా ప్రమాణాలను నీరుగార్చడం దేనికి?


Thursday, June 19, 2014

గవర్నర్ల విషయంలో ఇంత రభస చేయాలా?

యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్ల తొలగింపు విషయంలో జరుగుతున్న చర్చ, రచ్చ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మన ఆలోచనల్లో ఉండే హిపోక్రసీని బయటపెడుతున్నాయి. ఇది అన్ని పార్టీలూ కలసి ఒక అవగాహనకు వచ్చి అతి తేలికగా పరిష్కరించుకోగలిగిన విషయం. కానీ ఆ పని చేయకుండా అదే పనిగా రాజకీయం చేసి జనం ముందు అర్థంలేని ఆట ఆడుతున్నాయి.

1977 వరకు కాంగ్రెస్ ఒక్కటే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఈ సమస్య రాలేదు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను తొలగించింది. అప్పుడే ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఉండవలసింది. రాలేదు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను కొనసాగించింది. 2004లో యూపీయే ప్రభుత్వం ఎన్డీయే నియమించిన గవర్నర్లను తొలగించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే చేస్తోంది. దీనిపై పెద్ద రభస.

దీనిని ప్రాక్టికల్ కోణం నుంచి చూద్దాం. మంత్రి పదవులు, ఇతర పదవులలానే గవర్నర్ కూడా ఒక పదవి. అధికారానికి వచ్చిన ఏ పార్టీ అయినా తన పార్టీవారికో, మిత్రపక్షం వారికో పదవులు ఇస్తుంది తప్ప ప్రతిపక్షాలకు ఇవ్వదు. ఇది సహజన్యాయం. మంత్రి, లేదా ఇతర పదవులను ఆశించేవారు ఉంటారు. పదవి ఇవ్వకపోతే అలిగే వారు ఉంటారు. అలాగే గవర్నర్ పదవికోసం ఆశించేవారూ ఉంటారు. 282 సీట్లు తెచ్చుకున్న అధికారపక్షం వీలైనంత ఎక్కువమందికి పదవులు ఇవ్వాలనుకుంటుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, పార్టీ విజయానికి ఎంతో మంది తోడ్పడి ఉంటారు. రాజకీయవాదులకు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది వేరే చర్చ. అందులో కూడా అందరూ ఒక అవగాహనకు వస్తే మంచిదే. అలాగే, ఇతర రంగాలకు చెందిన కొందరు రాజకీయేతర ప్రముఖులూ అధికారపక్షం దృష్టిలో ఉండచ్చు. వీలైనంతలో అందరికీ అవకాశం కల్పించాలని ఆ పార్టీ అనుకుంటుంది.

గవర్నర్ పదవి అన్ని పదవుల్లాంటిది కాదు, అది రాజ్యాంగపదవి అనే వాదాన్ని ముందుకు తెస్తూ ఉంటారు. మిగిలినవేవీ రాజ్యాంగ పదవులు కానట్టు. గవర్నర్లను రాజకీయాలకు అతీతంగా చూడాలనేది ఇంకో హిపోక్రటిక్ వాదం. ఇలా అంటూనే ఆ పదవుల్లో రాజకీయవాదులను నియమించి కేంద్రానికి వాళ్ళను ఏజంట్లుగా వాడుకుంటూ అనేక భ్రష్టమైన పనులు వాళ్ళతో చేయిస్తూ ఆ పదవిని దిగజార్చివేస్తూ ఉంటారు. అలాగే ఎవరెవరో అనామకుల్ని తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెడుతూ ఉంటారు.

కనుక ఇప్పటికైనా ఈ హిపోక్రసీని పక్కన పెట్టి ప్రాక్టికల్ కోణం నుంచి, సహజన్యాయం నుంచి ఈ విషయాన్ని చూడాలి. అన్ని పార్టీలు ఒక అవగాహనకు రావాలి. కేంద్రంలో ప్రధాని రాజీనామా చేస్తే, మంత్రివర్గం రద్దయిపోతుంది. అలాగే ఆ ప్రధాని హయాంలో నియమితులైన గవర్నర్లు కూడా రాజీనామా చేసే ఏర్పాటు ఉండాలి. కొత్త ప్రధాని అధికారం చేపట్టి, గవర్నర్లను నియమించేవరకు పాత గవర్నర్లు ఆపద్ధర్మ గవర్నర్లుగా కొనసాగవచ్చు. ఒకవేళ పాత గవర్నర్లలోనే ఎవరినైనా కొనసాగించదలచుకుంటే, వారి రాజీనామాను తిరస్కరించవచ్చు. ఏ నిర్ణయమైనా తీసుకోగల వెసులుబాటు కొత్త ప్రధానికి ఉండాలి, ఎంతైనా రాష్ట్రపతి గవర్నర్లను నియమించేది మంత్రిమండలి సిఫార్సు పైనే. ఇందువల్ల గవర్నర్ పదవికి గల రాజ్యాంగ ప్రతిపత్తికి వచ్చే నష్టం ఏమీ లేదు.

మెడీజీ సమస్యను మేడ్ డిఫికల్టు చేస్తున్నారు. రాజ్యాంగ పదవి పేరిట గవర్నర్ పదవిని రాజకీయం చేయడం తప్ప ఇది మరొకటి కాదు. 

Wednesday, June 18, 2014

ద్రౌపది వివాహంలో నిర్ణయాధికారం ఎవరిది?

ఇంకో కోణం నుంచి చూద్దాం...

ద్రౌపది పాండవులు అయిదుగురినీ పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవలసింది ఎవరు?
స్వయంవరంలో ద్రౌపది వరించిన అర్జునుడా? కాదు. పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజా? కాదు. ద్రౌపది తండ్రి ద్రుపదుడా? కాదు. వ్యాసుడా? కానే కాదు...
ఆ నిర్ణయం తీసుకోవలసింది నిజానికి ఇటు కుంతి! అటు ద్రౌపది!


కథకుడు ఏంచేస్తున్నాడంటే, నిజంగా నిర్ణయాధికారం ఉన్న వీరిద్దరినీ పక్కకు తప్పిస్తున్నాడు. మౌనమూర్తులుగా నిలబెడుతున్నాడు. ఏవిధంగానూ నిర్ణయాధికారం లేని పాత్రల చేతికి ఆ అధికారాన్ని అప్పగిస్తున్నాడు. అందుకు సంబంధించిన ధర్మమీమాంసలో వారిని భాగస్వాములను చేస్తున్నాడు. ఈ వివాహానికి వారిచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీ చేతిలో ఉన్న అధికారాన్ని పురుషుడికి అప్పజెబుతున్నాడు. అనగా, వ్యవస్థనే ఉద్దేశపూర్వకంగానూ, వ్యూహాత్మకంగానూ తలకిందులు చేస్తున్నాడు. 

Wednesday, June 11, 2014

ద్రౌపదిని అయిదుగురూ పెళ్లాడాలని కుంతి పొరపాటునే అందా?

సూక్ష్మంగా పరిశీలిస్తే, ద్రౌపది వివాహం కల్పించిన ధర్మసంకటం నుంచి కథకుడు అంత తేలిగ్గా ఏమీ బయటపడలేదు. ఇప్పటి మాటలో చెప్పాలంటే చాలా టెన్షన్ పడ్డాడు. గుంజాటన పడ్డాడు. నిజమాలోచిస్తే అతనికి ద్రౌపది అయిదుగురిని వివాహమాడడంలోని అసంబద్ధత రాను రాను చిన్న గీతగా మారిపోయి, దానిని శాస్త్రానికి నప్పించడం ఎలాగన్నదే పెద్దగీతగా మారిపోయినట్టు అనిపిస్తుంది. దేవధర్మంనుంచి సమస్యను ఎంత నరుక్కు వద్దామని అతడు చూసినా మనుష్యధర్మం తాలూకు చిక్కులు అతని అంతఃకరణను వేధిస్తూనే వచ్చాయి.


ధర్మతత్వం తెలిసిన ధర్మరాజు, కుంతి, ద్రుపదుడు తమలో తాము సమస్యను పరిష్కరించుకోలేకపోయిన స్థితిలో వ్యాసుడంతటి వాడు రంగప్రవేశం చేయడమే చూడండి... సమస్య ఎంత సంక్లిష్టమో అదే చెబుతుంది. విచిత్రమేమిటంటే, వ్యాసుడికి కూడా ఇది దేవధర్మం అని నిష్కర్షగా చెప్పి సందేహాలకు తెరవేయడం సాధ్యం కాలేదు. ఆయన కూడా దేవధర్మం-మనుష్య ధర్మం అనే రెండింటి మధ్యా ఊగిసలాడడం కనిపిస్తుంది. ఆయన కంటె ముందు ధర్మరాజూ అలాగే ఊగిసలాడాడు. దాని గురించి మొదట చెప్పుకుందాం. 


Friday, June 6, 2014

ద్రౌపది అయిదుగురికి భార్య ఎలా అయింది?

కొన్నేళ్ళ క్రితం ఖుష్బూ అనే సినీనటి చేసిన ఒక వ్యాఖ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది...

ఈ రోజుల్లో వివాహానికి ముందు ఆడపిల్లలకు లైంగిక సంబంధముండడం ఏమంత పెద్ద విషయం కాదని దాని సారాంశం. దానిపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీవీ చానెళ్లలో చర్చలు జరిగాయి. నిజమే ఆ వ్యాఖ్యను దైవ దూషణను మించిన అపచారంగా భావించడం సహజమే!


వేరే దేశాల అనుభవం ఎలా ఉన్నా, మన దేశంలో ఇప్పటికీ వివాహానికి ముందు ఆడపిల్లల లైంగిక సంబంధం, ఊహించడానికే దారుణమైన విషయం. దానిని ఏ రకంగా సమర్థించినా అది మనోభావాలను గాయపరుస్తుంది. కారణం, వివాహం అనే చెలియలికట్ట మన మనస్సులలో ఒక బలమైన సెంటిమెంట్ గా, అచంచలమైన విశ్వాసంగా పాతుకు పోవడమే.  లైంగిక సంబంధం విషయంలో వివాహానికి ముందు, తర్వాత అనేది ఏవిధంగానూ చెరపడానికి వీల్లేని శిలారేఖ.