Friday, June 27, 2014

పీవీ గారిది కంప్యూటర్ మెదడు

ఈ రోజు పూర్వ ప్రధాని పీవీ నరసింహారావుగారి జయంతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ కలసి పీవీ గారి జయంతిని నిర్వహిస్తే బాగుండేది. పీవీ తెలుగు వారు అందరికీ చెందిన వ్యక్తి. తెలుగువారికే కాదు, మొత్తం దేశానికి చెందిన వ్యక్తి. దేశవ్యాప్తంగా ఆయనను అభిమానించేవారు ఉన్నారు.

పీవీగారు భారతదేశ ప్రధాని కావడం స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక అద్భుతం. ఎందుకంటే, ఆయనకు మేధాబలమే తప్ప ప్రజాబలం లేదు. దక్షిణాది వ్యక్తిగా ప్రాంతీయబలం లేదు. కులబలం లేదు. అలాంటి వ్యక్తికి, కారణం ఏదైనా, కాంగ్రెస్ పార్టీ  ప్రధాని అయ్యే అవకాశం ఇచ్చింది. అదే కాంగ్రెస్ నాయకత్వం కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధి కూడా లేకుండా అవమానించింది. పార్టీలో ఎవరూ ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా వీలులేని పరిస్థితిని కల్పించింది. ఒక ప్లస్సూ, ఒక మైనస్సూ......

పీవీ ప్రధానమంత్రిత్వంలో కూడా కొన్ని ప్లస్సులూ, మైనస్సులు తప్పకుండా ఉండే ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా ఆయనపై ఉన్న అభిమాన, గౌరవాలను గమనిస్తే ప్లస్సులదే పై చేయి అనిపిస్తుంది. చాలామంది దృష్టిలో సుదూర ప్రభావంతో దేశాన్నికొత్త మలుపు తిప్పగల ఆర్థిక విధానాల ప్రారంభకుడు ఆయనే. సరే, ఈ విధానాల మంచి, చెడుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడం వేరే సంగతి.

ఎన్నికల వరకే రాజకీయ విభేదాలనీ, తర్వాత దేశాన్ని ముందుకు నడిపించడంలో సమష్టిగా పనిచేసేలా అందరినీ కలుపుకు పోవడం నా విధానమనీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. పీవీ నిశ్శబ్దంగానే ఆ విధానాన్ని అమలుచేశారు. అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయిని సముచితంగా గౌరవిస్తూ కొన్ని అంతర్జాతీయ విషయాలలో ఆయనను భాగస్వామిని చేశారు.

పీవీగారు వ్యక్తిగా అద్భుతమైన, అరుదైన వ్యక్తి. ఆయనలో ఒక రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు, మేధావి, బహుభాషాప్రవీణుడు, సాహితీ పిపాసి, రచయిత ఉన్నారు. ఉండడమే కాదు సమపాళ్లలో ఉన్నారు. తన మెదడులో ఇన్ని అరలను ఏకకాలంలో ఎలా పోషించుకున్నారో, అన్నింటికీ సమయం ఎలా ఇచ్చారో ఆశ్చర్యం కలుగుతుంది.

ఓ సారి హైదరాబాద్ లో ఆయన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన సభ సందర్భంలో విమలా శర్మ అనే  రచయిత్రి తను మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించిన ఏకనాధరామాయణ సంపుటాలను, మరికొన్ని రచనలను ఆయనకు బహూకరించారు. చుట్టూ జనం మూగి ఉన్న ఆ సందర్భంలోనే ఆయన ఎంతో ఆసక్తితో ఆ పుస్తకాలను తిరగేస్తూ మరాఠీ సాహిత్యం గురించి ఓ పదినిమిషాలు మాట్లాడారు. జ్ఞానేశ్వరిని కూడా అనువదించమని ఆమెకు సూచించారు.

ఆయనలో మరో అద్భుతం జ్ఞాపకశక్తి!

ఆయన ఎవరితోనైనా ఒక విషయం ముచ్చటిస్తే, ఆ వ్యక్తి నెల రోజులకు కలసినా, రెండు నెలలకు కలిసినా సరే; అంతకుముందు మాటల్లో ఆ విషయాన్ని ఎక్కడ ఆపేశారో, సరిగ్గా అక్కడినుంచి ఎత్తుకునేవారు. ఆ వ్యక్తికి అది చాలా ఆశ్చర్యం కలిగించేది. ఒకవిధంగా ఆయనది కంప్యూటర్ మెదడు.

ఆయన తన Insider తెలుగు అనువాదం పాఠాన్ని ఎప్పటికప్పుడు స్వయంగా పరిశీలించి ప్రూఫ్ రీడింగ్ కూడా చేస్తూ అవసరమైన సవరణలు చేసి hard copy ని తిప్పి పంపేవారు. ఒకసారి ఆసుపత్రి బెడ్డు మీద కూడా ఉండి అనువాదం తాలూకు కాగితాలు చూసి తిప్పి పంపేసి, వెంటనే వైద్యం కోసం అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండు రోజులకు అనువాదకునికి ఫోన్ చేసి, ఫలానా chapter లో ఫలానా పేజీలో, ఫలానా పేరాలో ఒకచోట ఉపయోగించిన మాటకు బదులు ఈ మాట ఉంటే బాగుంటుందని సూచించారు. అంటే ఆరోగ్యసమస్యలలో, ప్రయాణం ఒత్తిడులలో ఉన్నప్పటికీ ఆయన మెదడులోని రచనకు సంబంధించిన భాగం చురుగ్గా పనిచేస్తూనే ఉందన్న మాట.

బీజేపీ ప్రభుత్వం వస్తే పీవీకి భారతరత్న ఇస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది జరగాలని కోరుకుందాం. భారతరత్న వల్ల ప్రత్యేకంగా ఆయనకు ఏదో ఒరుగుతుందని కాదు. విస్మృతికి గురవుతున్న ఆయన contribution అప్పుడైనా మరింత విస్తృతంగా చర్చలోకి వస్తుంది.


2 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. పీవీగారు ఒక నిరాడంబరుడైన గొప్పవ్యక్తి.
  ఒక అరుదైన స్థితప్రజ్ఞుడు.
  మానావమానాలకు ఆయన అతీతుడుగా జీవించారు.

  చాలా సంవత్సరాల క్రిందట ఆయన చేసిన అనువాదగ్రంథం ఒకటి చదివాను. అద్భుతం. అది హరినారాయణ్ ఆప్టే గారు వ్రాసిన పన్ లక్షత్ కోన్ ఘతో అనేదానికి తెలుగుసేత. ఆ పుస్తకం పేరు అబలాజీవితం.

  పీవీగారికి భారతరత్న ఇచ్చి గౌరవించటం జరుగుతుందని ఆశిస్తున్నాను.
  అలా చేయటం ఈ‌ భారతజాతి తన సంస్కారౌన్నత్యాన్ని ప్రకటించుకుంటే అది అత్యంత ముదావహం అందరికీ.

  ReplyDelete