సూక్ష్మంగా
పరిశీలిస్తే, ద్రౌపది వివాహం కల్పించిన ధర్మసంకటం నుంచి కథకుడు అంత తేలిగ్గా ఏమీ
బయటపడలేదు. ఇప్పటి మాటలో చెప్పాలంటే చాలా ‘టెన్షన్’ పడ్డాడు. గుంజాటన పడ్డాడు. నిజమాలోచిస్తే అతనికి ద్రౌపది అయిదుగురిని
వివాహమాడడంలోని ‘అసంబద్ధత’ రాను రాను
చిన్న గీతగా మారిపోయి, దానిని శాస్త్రానికి నప్పించడం
ఎలాగన్నదే పెద్దగీతగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ‘దేవధర్మం’నుంచి సమస్యను ఎంత నరుక్కు వద్దామని అతడు చూసినా ‘మనుష్యధర్మం’ తాలూకు చిక్కులు అతని అంతఃకరణను వేధిస్తూనే వచ్చాయి.
ధర్మతత్వం
తెలిసిన ధర్మరాజు, కుంతి, ద్రుపదుడు తమలో తాము సమస్యను
పరిష్కరించుకోలేకపోయిన స్థితిలో వ్యాసుడంతటి వాడు రంగప్రవేశం చేయడమే చూడండి...
సమస్య ఎంత సంక్లిష్టమో అదే చెబుతుంది. విచిత్రమేమిటంటే,
వ్యాసుడికి కూడా ఇది దేవధర్మం అని నిష్కర్షగా చెప్పి సందేహాలకు తెరవేయడం సాధ్యం
కాలేదు. ఆయన కూడా దేవధర్మం-మనుష్య ధర్మం అనే రెండింటి మధ్యా ఊగిసలాడడం
కనిపిస్తుంది. ఆయన కంటె ముందు ధర్మరాజూ అలాగే ఊగిసలాడాడు. దాని గురించి మొదట చెప్పుకుందాం.
No comments:
Post a Comment