Sunday, June 22, 2014

ప్రీతీ జింటా-నుస్లీ వ్యవహారంపై ఇంత ఫోకస్ అవసరమా?!

ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి నిమిషమూ  ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసే మసాలా వార్తలు కావాలి. కొంతవరకు వాటి పరిస్థితిని అర్థం చేసుకోవలసిందే. కానీ ఎంతవరకూ? ఎక్కడో ఒకచోట హద్దు, ఔచిత్యం ఉండాలి కదా?

ప్రీతీ జింటా, నుస్లీ వాడియా వ్యవహారం వార్తలకు ఎక్కి పది రోజులు అయినట్టుంది.  పైగా దాని మీద డిబేట్లు కూడా. అయిదేళ్లపాటు బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నుస్లీ వాడియా ఓ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ప్రీతీ జింటా దగ్గరకు వచ్చి దురుసుగా ప్రవర్తించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లోపల ఎవరో అండర్ గ్రౌండ్ మనిషి నుస్లీని బెదిరించాడు. ప్రీతీ జింటా ఈ మధ్యలో అమెరికా వెళ్ళి వచ్చింది. ఇంతే కదా ఇంతవరకు జరిగింది? దీనిని రోజుల తరబడి సీరియల్ లా సాగదీయడానికి న్యూస్ వాల్యూ ఏముంది? ఏదైనా డెవెలప్ మెంట్ ఉంటే వార్తగా చెప్పచ్చు. లేనప్పుడు ఎందుకు అదే పనిగా ఎయిర్ టైమ్ ను వేస్టు చేయడం? వాళ్లేమైనా జాతీయ నాయకులా? కేవలం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కదా! పైగా ప్రీతీ జింటా కరెన్సీలో ఉన్న సినీ హీరోయిన్ కూడా కాదు. నుస్లీ వాడియా ఏ అంబానీలు, టాటాల స్థాయి ఉన్నవాడో కాదు. ఎందుకు వాళ్ళ సమస్యను జనం మీద రుద్దడం? అలాగని కరెంటు హీరోయిన్లు, అంబానీ స్థాయి వారూ అయితే తప్పులేదని అనడం నా ఉద్దేశం కాదు.  ఇలాంటి అన్ని వార్తలనూ జనం ఆసక్తిగా చూస్తారని వారు అనుకుంటున్నారా? అలా అనుకోవడానికి ఏమైనా ఆధారం ఉందా?

బియాస్ నదిలో 24 మంది కాలేజీ విద్యార్థులు కొట్టుకుపోయి చనిపోతే, ఆ దారుణ ఘటనపై ఇంత ఫోకస్ లేదు. దానిపై అంతగా చర్చలు లేవు. అది ఎంత ముఖ్యమైన విషయం!

న్యూస్ చానెళ్ల మధ్య పోటీ ఉంటుంది కనుక ఏ చానెల్ కు అదే వెనకబడిపోకూడదని అనుకుంటుంది నిజమే. అలాంటప్పుడు అన్ని చానెళ్లూ కలసి ఇలాంటి విషయాలలో పాటించవలసిన విధివిధానాల గురించి స్థూలంగా ఒక అవగాహనకు రావచ్చు కదా! అందరూ కలసి మీడియా ప్రమాణాలను నీరుగార్చడం దేనికి?


No comments:

Post a Comment