Friday, February 27, 2015

'ఎస్సార్' ఆతిథ్యానికి గడ్కరి 'నో సార్' అనద్దా?!

కంపెనీలకు, రాజకీయనాయకులకు మధ్య సంబంధాలు ఉండడం, కంపెనీల ఆతిథ్యాన్ని రాజకీయనాయకులు అందుకుంటూ ఉండడం కొత్తవిషయం కాదు. అయినా అదొక విచిత్రం... బయటపడిన ప్రతిసారీ కొత్తగా అనిపించి ఎంతో కొంత సంచలనాత్మకం అవుతూ ఉంటుంది.

ఇలాంటి సంబంధాలకు దాదాపు ఏ పార్టీ అతీతం కాదనే అనిపిస్తుంది. ఇందులో కూడా దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ దే ఒరవడి అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ దేశంలోని అనేకానేక అవలక్షణాలకు జన్మస్థానంగా కాంగ్రెస్ ఎప్పుడో పేరు తెచ్చుకుంది కనుక ఆ పార్టీకి సంబంధించి ఇలాంటివి బయటపడినప్పుడు అవి అంత కొత్తగానూ, సంచలనాత్మకంగానూ అనిపించవు. అదే బిజెపి విషయంలో అయితే ఒకింత ఎక్కువ సంచలనమే కలిగిస్తాయి. కారణం, రోగగ్రస్త కాంగ్రెస్ కు ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన ప్రత్యామ్నాయంగా బిజెపిని భావించేవారు చాలా మంది ఉన్నారు కనుక; కాంగ్రెస్ కు భిన్నంగా బిజెపి high moral ground తీసుకుంటూ ఉంటుంది కనుక!

ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరి 2013 జూలైలో ఎస్సార్ గ్రూప్ కు చెందిన ఫ్రెంచ్ క్రూయిజ్ లో సకుటుంబంగా మూడు రోజులు విహరించారని ఇండియన్ ఎక్సెప్రెస్ వెల్లడించింది. ఎస్సార్ లో ఉద్యోగం కోసం కొందరిని దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ ఓరా లాంటి కాంగ్రెస్ నేతలు, వరుణ్ గాంధీ లాంటి బిజెపి నేతలు రికమెండ్ చేసినట్టు కూడా వెల్లడించింది.

బయటపడింది కనుక ఔనా అనుకుంటున్నాం. బయటపడనివి ఎన్నో!

ఇది అవినీతి కిందికి వస్తుందా, వస్తే ఎంత పెద్ద అవినీతి అవుతుందన్న ప్రశ్న కన్నా; ఇక్కడ ప్రధానంగా తలెత్తే ప్రశ్న కంపెనీలతో రాజాకీయ నాయకులకు వ్యక్తిగత సంబంధాలు ఉండచ్చా, వారి ఆతిథ్యాన్ని పొందచ్చా అన్నది. విలువల గురించి చెప్పే ఒక పార్టీ ప్రముఖ నేత అయిన  నితిన్ గడ్కరి తనను సమర్థించుకుంటూ ముందుకు తెచ్చిన తర్కం ఆశ్చర్యం కలిగిస్తుంది. తను అప్పుడు బిజెపి అధ్యక్షుడిగా కాదు సరికదా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా లేననీ; కనుక ఎస్సార్ ఆతిథ్యం పొందడంలో quid pro quo ఏమీలేదని ఆయన అన్నారు. ఆయన పార్టీవారు కూడా అదే అన్నారు. ఆపైన ఎస్సార్ యజమానులతో తనకు పాతికేళ్ళ స్నేహసంబంధాలు ఉన్నాయని గడ్కరి అంటున్నారు.

ఇది కేవలం సాంకేతికమైన సమర్థన మాత్రమే. అంతకు ముందు ఏదో  ఒక పదవిలో ఉన్న ఒక రాజకీయనాయకుడు ఆ తర్వాత కొద్ది కాలం ఏ పదవిలోనూ ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఏదైనా పదవిలో ఉండవచ్చు. కానీ అతను పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా రాజకీయనాయకుడే! పదవిలో ఉన్నా లేకపోయినా తన పార్టీకి చెందిన ప్రభుత్వాలను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి అతనికి ఉంటుంది. అందులోనూ గడ్కరి చిన్నా, చితకా నాయకుడు కాదు. బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. కనుక ఆయనకు మరింత ఎక్కువ పలుకుబడి ఉంటుంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందే ఎస్సార్ కంపెని గడ్కరీకి ఆతిథ్యాన్ని ఇచ్చిన సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి. బిజెపి అధికారం లోకి రానున్న విషయం అప్పటికే స్పష్టమైంది. కనుక భవిష్యత్తు అవసరాల కోసం, లాభాల కోసం ఎస్సార్ కంపెనీ గడ్కరిపై తన ఆతిథ్యాన్ని 'ఇన్వెస్ట్' చేసిందన్నమాట.

విషయం ఇంత సూటిగా ఉంటే, అప్పుడు ఏ పదవిలోనూ లేనంటూ సాంకేతికంగా సమర్థించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ఐ.ఏ.ఎస్ అధికారి దీర్ఘకాలిక సెలవులో ఉన్నాడనుకుందాం. అప్పుడు ఆయన ఇలాంటి ఆతిథ్యాలను పొందవచ్చా అన్న ప్రశ్నకు ఏం జవాబు చెబుతాం?

క్రోనీ కేపిటలిజం ఎంతోకాలంగా చర్చలో ఉంటున్న స్థితిలో ఎస్సార్ ఆతిథ్యానికి 'నో సార్' అని చెప్పడం కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అనుకుంటున్న బిజెపి విధి కాదా?!







2 comments:

  1. భాస్కరంగారూ, ఘంటసాలవారి పాట ఒకదానిలో వస్తుంది చూడండి, ఎదుటివాడికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ ‌ అని. ఈ దేశపు అన్ని మంచి రాజకీయసంప్రదాయాలుకూ కాంగ్రెసు పుట్టిల్లో కాదో చెప్పటం కష్టం కావచ్చును కానీ, ఈ దేశపు అన్ని దురదృష్టకరరాజకీయసంప్రదాయాలుకూ కాంగ్రెసు పుట్టిల్లేనని చెప్పటం మాత్రం అతిశయోక్తి ఎంతమాత్రం‌ కాదు. అందుచేత ఈ దేశంలోని అతి పెద్ద రాజకీయ పార్టీలు ఒకే రకం చెడుపధ్ధతుల్లో నడుస్తూ ఒకదాన్నొకటి సమయానుకూలంగా విమర్శించుకోవటం ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ‌ లేదు.

    ReplyDelete
  2. *భవిష్యత్తు అవసరాల కోసం, లాభాల కోసం ఎస్సార్ కంపెనీ గడ్కరిపై తన ఆతిథ్యాన్ని 'ఇన్వెస్ట్' చేసిందన్నమాట*
    మధ్య తరగతి వాళ్లు సైతం హానిమూన్ కి వారం రోజులు ఆస్ట్రేలియా, న్యు జిలాండ్, యురోప్ కి వెళ్ళుతున్నారు. ఆఫ్ ట్రాల్, మూడు రోజుల ఎస్సార్ కంపెనీ ఆతిద్యానికి ఎదో ఊహించటం బాగా లేదు. మీడీయా వారు అలా భావించే పనైతే, ఎస్సార్ కంపెనీ వారికి గడ్కరి చేసిన సహాయం ఉంటె బయట పెట్టాలి. కేంద్రoలో బిజెపి ప్రభుత్వం అయినా, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల లో చాలా మంది కాంగ్రెస్ అభిమానులే. కాంగ్రెస్ వారు అధికారంలో దిగిపోతూ ఆర్మి చీఫ్ నుంచి కిందవరకు ఏర్పాటు చేసుకొని పోయారు. నితిన్ గడ్కరి గారు ఎవైనా సహాయమే చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చి ఉండేది.

    *కాంగ్రెస్ కు భిన్నంగా బిజెపి హై మోరల్ గ్రౌండ్స్ తీసుకుంటూ ఉంటుంది.*
    అవును. లెఫ్ట్ లిబరల్స్/ మార్క్సిస్ట్ పుస్తకాలు చదివి వ్యాసాలు ఇచ్చే వారి స్టాండర్డ్స్ స్కేల్ తీసుకొచ్చి బిజెపిని కొలవకండి. స్టాండర్డ్స్ కూడా రిలేటివ్. వాళ్ల అబ్సల్యుట్ స్టాండర్డ్స్ పుస్తకలలో తప్పితే ఎక్కడా ఉండవు. బిజెపి, కాంగ్రెస్,కమ్యునిస్ట్ లకన్నా చాలా విషయాలలో ఎంతో బెటర్. గత ప్రభుత్వం లో లక్షల కోట్ల స్కాములు జరిగిన ఒక్క మంత్రి రాజీనామ చేయలేదు. స్కాములు ఆగలేదు. ప్రజలు చూసి చూసి విసిగెత్తిపోయారు.

    ReplyDelete