Sunday, January 5, 2014

కాంగ్రెస్-బీజేపీ(జనసంఘ్)-ఆమ్ ఆద్మీ: నేను

ఈ శీర్షికను బట్టి ఈ పార్టీలతో నాకు ప్రత్యేక సంబంధం ఏదో ఉందని అనుకోకండి. ఈ పార్టీలలో ఉన్న సభ్యులను, నాయకులను మినహాయిస్తే వీటితో మిగతా అందరికీ ఎంత సంబంధం ఉందో నాకూ అంతే ఉంది. పార్టీలతో  ఇంకెలాంటి సంబంధం లేకపోయినా ఈ దేశ ప్రజలు దశాబ్దాలుగా రక రకాల  పార్టీల పేర్లు వింటున్నారు. వాటిలో  ఒక పార్టీకి వోటు వేస్తున్నారు(సరే, అసలు వోటు వేయని వాళ్ళూ ఉన్నారనుకోండి). బాల్యం నుంచి పెద్దరికం వరకు  మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈ పార్టీలు (ఏడాది వయసు మాత్రమే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి  మినహాయింపు) మన జీవితకాలంలోని అనేకానేక జ్ఞాపకాలలో భాగం అయిపోయాయి. కాదంటారా?!

అలాంటి నా  చిన్నప్పటి జ్ఞాపకాలలో ఒకటి...

60 దశకంలో విజయవాడలో మేమున్న సత్యనారాయణపురంలో  చాలా చోట్ల గోడల మీద ఒక దీపం గుర్తు, పక్కనే జనసంఘ్ అనే పేరు కనిపించేవి. జనసంఘ్ అనే ఆ పేరు పక్కనే ఎవరో కొంటె పిల్లలు 'భో' అనే అక్షరం చేర్చేవారు. అప్పుడది 'భోజనసంఘ్' అయ్యేది. అలా ఒక్క అక్షరం చేరితే అర్థం మారిపోవడం నాకు వింతగానూ, ఆసక్తికరంగానూ ఉండేది.

కాంగ్రెస్ గురించి నాకు ఇటువంటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవీ లేవు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా  ఉన్నా దాని గురించి అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. తెలిసింది కూడా నెగిటివ్ గానే తెలుసు. 63లోనో 64లోనో కానీ, ఒక వేసవి కాలంలో విజయవాడలో చాలా చోట్ల కొంపలు అంటుకుపోయేవి.  దగ్గరలో ఇళ్ళు అంటుకున్నాయన్న వార్త రావడం, అంతా బక్కెట్లతో, బిందెలతో నీళ్ళు సిద్ధం చేసుకుని ఇంటికి  కాపలా కాయడం కొన్ని రోజులపాటు సాగింది. అలా ఇళ్ళు అంటుకుపోవడానికి ఏవో క్షుద్రశక్తులు కారణమని చెప్పుకునేవారని నాకు లీలగా జ్ఞాపకం. ఆ తర్వాత అది కమ్యూనిష్టుల పని అని కూడా ప్రచారమయింది. అందులో నిజం ఎంతో అబద్ధమెంతో తెలుసుకునే వయసు నాకు లేదు కానీ, మొత్తానికి ఆ ప్రచారం కమ్యూనిష్టులంటే భయాన్ని మాత్రం పుట్టించింది. దానికితోడు నా సామాజికవర్గం రీత్యానూ, మేమున్న ప్రాంతం రీత్యానూ కమ్యూనిష్టుల గురించి నాకు ఎక్కువగా తెలిసే అవకాశం కూడా లేదు.

మిగిలింది కాంగ్రెస్... ఉన్నది ఒక్క కాంగ్రెస్సే కనుక దాని గురించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగిన జ్ఞాపకాలు ఏవీ లేవు. మన ఇంట్లో చిరకాలంగా చూస్తున్న మనుషులు, టేబులు, కుర్చీ,  గోడ గడియారం లానే అదీ ఒక పరిచితమైన పేరు మాత్రమే. ఎన్నికలొచ్చినప్పుడు మా అమ్మ, నాన్న వెళ్ళి వోటు వేసిరావడం; కాంగ్రెస్ కు వేశామని చెప్పడం లీలగా గుర్తు.

అయితే, మా సామాజికవర్గంలో కాంగ్రెస్ మీదా, గాంధీ, నెహ్రూల మీదా; తర్వాత తర్వాత ఇందిరాగాంధీ మీదా చాలా వ్యతిరేకతా, తీవ్ర తృణీకారభావం గూడుకట్టుకున్నాయన్న సంగతి నాకు క్రమంగా అర్థమవుతూ వచ్చింది. ప్రైవేట్ సంభాషణాల్లో వాళ్ళను చెడ తిట్టడం కూడా నాకు తెలుసు. అయినా సరే, కాంగ్రెస్ కే వోటు వేసేవారంటే ప్రత్యామ్నాయం లేకనే కాబోలు. వాళ్ళలో కొందరికి జనసంఘ్ పట్ల అనుకూలత ఉండేది కాబోలు. కానీ దానిని వ్యక్తీకరించే మార్గం లేదు. ఆ పార్టీకి అంగబలం, అర్థబలం, కనీసం ఇంకొకరు డిపాజిట్ కడతామని బతిమాలినా ఎన్నికల్లో నిలబడడానికి ముందుకొచ్చే అభ్యర్థులు లేరు. అయితే,  రాష్ట్రంలో ఆ పార్టీని నిర్మించే పని ఆర్.ఎస్.ఎస్. వైపునుంచి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలా అప్పటినుంచీ జరుగుతూనే ఉన్నట్టుంది.  ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను జనసంఘ్ కు అందిస్తూ ఉండడం నాకు ఒకింత సాధికారికంగా తెలుసు. విశేషమేమిటంటే, జనసంఘ్ భవిష్యరూపమైన బీజేపీ అవతరించిన తర్వాత కూడా ఆ ప్రణాళిక పూర్తి అయినట్టు లేదు.

70 దశకం వచ్చేసరికి నాకు రాజకీయాలు ఒకింత బోధపడుతూవచ్చాయి. ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ విధింపు నాకే కాదు, నా తరం వారు అందరి  ప్రాథమిక రాజకీయ అవగాహనకూ ఎంతోకొంత దోహదం చేశాయి. అప్పటికే ఒక వర్గం దృష్టిలో విలన్లుగా ముద్రపడిన కాంగ్రెస్, గాంధీ, నెహ్రూలు ఇందిరాగాంధీ రాకతో మరింత విలన్లుగా మారడమే కాక, వాళ్లలోనూ ఇందిరాగాంధీ అతి పెద్ద విలన్ గా అవతరించారు. మన రాష్ట్రంలో బలపడకపోయినా ఉత్తరాది రాష్ట్రాలలో కొంత బలపడిన  జనసంఘ్ జనతా పార్టీలో విలీనం కావడం ద్వారా కేంద్రంలో అధికారానికి దగ్గరగా వచ్చింది. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో అప్పటికే ఆ పార్టీ అధికారం చవి చూసింది. అప్పట్లో మా ఊరు వచ్చిన ఉత్తరభారత స్వామీజీ ఒకరు మధ్యప్రదేశ్ లోని వీరేంద్రకుమార్ సక్లేచా ప్రభుత్వం అంత అవినీతి భూయిష్టమైన ప్రభుత్వం మరెక్కడా లేదని మా ఊళ్ళో గోదావరి స్నానానికి వెళ్లినప్పుడు ఒక పెద్దాయనతో అనడం నాకు బాగా గుర్తు.

సరే, ఈ చరిత్రంతా చెప్పడానికి దీనిని మొదలుపెట్టలేదు. అదలా ఉంచితే, నాకు గుర్తున్నంతవరకు  తెలిసీ తెలియని ఆ వయసులో జనసంఘ్ నాకు కాంగ్రెస్ కంటే భిన్నంగా, admirable గా కనిపించిన మాట నిజం. అయితే అందుకు కారణం అది హిందువుల పార్టీ అని కాదు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న, కొన్ని విలువల గల పార్టీ అనే ఊహ ఉండేది. 70 దశకంలో మేము పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరులో ఉండేవారం. కొవ్వూరులో జనసంఘ్ కు sole representative ఒకే ఒకరు ఉండేవారు. ఆయన పేరు రావి విశ్వేశ్వరరావు. ఆ పార్టీ నిర్మాణానికి సొంత ఖర్చు మీద కాలికి బలపం కట్టుకుని తిరిగేవారు. ఓడిపోతారని తెలిసినా సరే,  రాజమండ్రి లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎమర్జెన్సీలో జైలుకెళ్లి వచ్చిన చాపరాల సుబ్బారావు అనే ఆయనని పోటీ చేయించారు. చెప్పొచ్చేదేమిటంటే, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రాంతంలో కూడా జనసంఘ్ ప్రస్తుతరూపమైన బీజేపీ తన ఉనికిని పెంచుకోవడం ప్రారంభించింది. రాజమండ్రి నియోజకవర్గం నుంచి రెండుసార్లు, నరసాపురం నియోజకవర్గం నుంచి ఒకసారి ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. కానీ నాకు రావి విశ్వేశ్వర రావు, చాపరాల సుబ్బారావులు ఏమయ్యారో తెలియలేదు. వాళ్ళ పేర్లు మళ్ళీ వినిపించలేదు.

పంచాంగం ఒక ఆవృత్తిని పూర్తి చేసుకుంది, ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చి ఆశ్చర్యచకితం చేసింది. అవినీతి లేని నిజాయితీతో కూడిన స్వచ్చమైన పాలనను అందించడం అనే ధ్యేయంతో ఆ పార్టీ అవతరించిన సంగతి తెలిసిందే.

 జనసంఘ్(బీజేపీ)ను మా చిన్నప్పుడు మేము  అచ్చంగా ఇలాంటి పార్టీగానే ఊహించుకున్నామని పైన చెప్పాను కదా. అటువంటి బీజేపీకి ఆమ్ ఆద్మీ చెమటలు పట్టిస్తుండడం, ఆ పార్టీని బదనాం  చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుండడం  నాకు ఆశ్చర్యంగానే కాక  వినోదంగా కూడా ఉంది.

ఇప్పుడు 15-20 ఏళ్ల వయసు ఉన్నవారు, మా తరం వాళ్ళు జనసంఘ్ లేదా బీజేపీని ఊహించుకున్నట్టే, ఆమ్ ఆద్మీని ఊహించుకుంటూ ఉంటారనడంలో సందేహం లేదు. ఈవిధంగా పంచాంగం మరో ఆవృత్తిని ప్రారంభించిందని అనుకోవచ్చు.

ఈ ఆవృత్తి అయినా వెనకటి ఆవృత్తిని రిపీట్ చేయకూడదని కోరుకోవడంలో తప్పేముంది? మనిషి ఆశాజీవి కదా!








4 comments:

  1. భాస్కరం గారు,
    ఆ రోజుల్లో సరోజిని నాయడు గారు గాంధిగారితో బాపు మిమ్మల్ని మీ సిద్దాంతాల కనుగుణం గా (రైల్లో మూడవ తరగాతి ప్రయాణం మొద||)నడుచుకోనేటట్లు చేయాలంటే మాకేంతో ఖర్చు అవుతున్నాదని చెప్పారంట. అలాగే ఆప్ పార్టిని చాలా నిజాయితి గల పార్టిని చిత్రికరించటానికి మీడీయా కయ్యే ఖర్చు, దానిని భరించే తెర వెనుక దేశ,విదేశ శక్తులను చూసి బిజెపి పార్టి ఆందోళన చెందుతున్నాది. అంతేకాని అరవింద్ కేజ్రివాల్ ను చూసి కాదు. ఆప్ పార్టి సుగర్ కోటేడ్ సోషలిస్ట్ విధానాల డ్రామాను, జతీయ మీడీయా ద్వారా రక్తి కట్టించి, ఆప్ పార్టి వారు నిజాయితికి చిహ్నంలా చిత్రికరించి, ఆ పార్టి విధానాలను మెచ్చి ఇంఫొసిస్,ఆర్.బి.యస్. పెద్ద కంపెని ల ఉద్యోగులు రిజైన్ చేసి మరీ చేరుతున్నారంట్టూ ప్రచారం ఊదరగొట్టి, నమో కి ప్రత్యామ్నయం అని ప్రచారం చేయటం లో కోట్లరూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారని చాలా మంది నెటిజన్లకు తెలుసు.

    ‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smiles Narendra Modi and the BJP today made the most of the latest diplomatic cables released by WikiLeaks, saying these showed that the Gujarat Chief Minister was “incorruptible” — in fact, “the lone honest Indian politician”.

    http://m.indianexpress.com/news/incorruptible-in-wikileaks-narendra-modi-smiles/766153/

    ReplyDelete
    Replies
    1. శ్రీరామ్ గారూ...ఆబ్జెక్టివ్ గా చూద్దాం. మీరన్న మీడియా ప్రచారం, తెరవెనుక శక్తులు కోట్లు ఖర్చు పెట్టడం అనేవి కాంగ్రెస్ కు, బీజేపీకీ కూడా ఆపాదించవచ్చు. నరేంద్ర మోడీని మీడియా పెంచుతోందన్న ఆరోపణ ఉన్న సంగతి మీకు తెలియనిది కాదు. కనుక ఆప్ ఒక్కదానినే వేలెత్తి చూపలేం. ప్రతి పార్టీ వెనుక మీడియా ప్రచారం, తెరవెనుక శక్తులు కోట్లు ఖర్చు పెట్టడం సరే కానీ, అదే ఎన్నికల తీర్పును ప్రభావితం చేయడమే నిజమైతే మాత్రం చాలా ఆందోళన చెందకతప్పదు. తెరవెనుక శక్తులు ప్రజాస్వామ్యాన్ని, అంటే ప్రజలను మేనేజ్ చేసే పరిస్థితి ప్రజాస్వామ్యాన్నే అర్థరహితం చేస్తుంది. మీరన్నట్టు మోడి నిజాయతీ కలిగిన ఏకైక రాజకీయ నాయకుడనే ఒప్పుకున్నా, అలాంటి ఏకైకులు అన్ని పార్టీలలోనూ ఉన్నారని కూడా ఒప్పుకోవలసిందే. ఏ ఒక్కరో నీతిపరులు ఉండడం సమస్యకు పరిష్కారం అవుతుందంటారా?

      Delete
  2. ప్రతీ పార్టీ మంచి ఆదర్శాలతోనే మొదలౌతుంది. దానిలోని కొద్దిమంది నిబద్దతతోనే ఉంటారు. కానీ పార్టీ అన్నాక గుంపు కావాలి కదా. గుంపు జమ కూడడంతోటే ఆదర్శాలలో సడలింపులు వస్తుంటాయి. కాబట్టి ఆయా కాలాలలో పార్టీలను సాపేక్షకంగా బేరీజు వేసుకొని వోటు వేయాలి. అంతే. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు కదా మనం సత్యాన్ని వ్యవస్థీకృతం చేయలేము, చేయ కూడదు అని. అదంతే. ఒక్క ఆశ ఏమిటంటే ప్రజాస్వామ్యం. పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని పాటించే పార్టీలని మాత్రమే కొంతవరకు నమ్మొచ్చు.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే సీతారాం రెడ్డి గారూ...రాజకీయవ్యవస్థలో ఏదో ఒక ప్రమాణంలో అవినీతి ఎప్పుడూ ఉంటుంది. అవినీతి అసలే లేని వ్యవస్థను ఆశించడం మరీ అమాయకత్వం అవుతుంది. సమస్య ఏమిటంటే అవినీతి బయట పడినప్పుడు దానిపై చర్య తీసుకునే నిబద్ధత రాజకీయ నాయకత్వంలో లేకపోవడం. కామన్వెల్త్ క్రీడలు, 2జీ ఆరోపణలు రాగానే వాటిపై వెంటనే చర్యకు ఉపక్రమిస్తే, మన్మోహన్ సింగ్ ఇంత అపఖ్యాతి పాలయ్యేవారు కాదు.

      Delete