Monday, January 6, 2014

ఉదయ కిరణం అప్పుడే ఎలా అస్తమించింది?!

మామూలు మనుషులకన్నా కళాకారుడు ఎక్కువ సంతోషంగా జీవిస్తాడు. ఎక్కువ సంతృప్తితో జీవిస్తాడు. ఆ కారణాల వల్ల ఎక్కువ కాలం జీవిస్తాడు!

మరి ఉదయకిరణ్ అనే ఆ అబ్బాయి 34 ఏళ్లకే ఎందుకు చచ్చిపోయాడు??!!

ఎక్కడో లోపముంది. ఎక్కడో తీగ తెగింది. ఏదో అవుతోంది.. ఏమవుతోంది?

బళ్ళారి రాఘవ...స్థానం నరసింహా రావు...పీసపాటి నరసింహమూర్తి...షణ్ముఖి ఆంజనేయరాజు...నిన్నటి కాలానికి చెందిన ఈ రంగస్థల నటులూ నటులే. ఉదయకిరణ్ అనే ఆ అబ్బాయీ నటుడే. కానీ పై నటులు దరిద్రమే అనుభవించారో, సంపన్నతే అనుభవించారో...నటులుగా ఒక జీవిత కాలం తృప్తిగా జీవించారు. ఈ రంగస్థల నటుల్లో కొందరు నటిస్తూనే స్టేజి మీద గుండె ఆగి మరణించినవారూ ఉన్నారు. వీరికి ఉన్న సంతోషకరమైన, సంతృప్తి కరమైన నట జీవితం ఉదయకిరణ్ కు ఎందుకులేకుండా పోయింది? ఉదయకిరణం మధ్యాహ్న కాలానికి కూడా ఇంకా చేరుకోకుండానే ఎందుకు ఆరిపోయింది?

రంగస్థల నటులే దేనికి? వెనకటి తరం సినీ నటులు మాత్రం? చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం మొదలైన వాళ్ళు అంతా సహజమరణమే పొందారు తప్ప అర్థాయుష్కంగా చనిపోలేదు. ఉదయ కిరణ్ ఎందుకు చనిపోయాడు?

వెనకటి నటులకు డబ్బు అంతగా దొరకకపోయినా చిన్నదో పెద్దదో వేదిక దొరికేది. జీవితానికీ, జీవించాలనే కోరికకూ ధనమో ఇంధనమో దొరికేది. మరి ఉదయకిరణ్ కు ఏమి లోపించాయి? అవకాశాల నిచ్చెన మీంచి పైకి పాకే అతని ప్రయత్నాలకు ఏ కనబడని కాలనాగులు అడ్డుపడి కిందికి తోసేసాయి? అతను ఎందుకు డిప్రెషన్ లో పడిపోయాడు? మూడో నాలుగో హిట్ సినిమాలు చేసిన అతనికి కనీసం సినిమా కార్యక్రమాలకు ఆహ్వానాలు రావడం కూడా ఎందుకు మానేశాయి?

ఉదయకిరణ్ ఆత్మహత్య తెలుగు సినీరంగం వర్తమాన స్థితిగతుల పై ఒక విషాదభరిత క్రూరవ్యాఖ్య కావచ్చు. తెలుగు సినీ వేదిక అప్పుడప్పుడే వికసించే కళా జీవితాలకు వధ్యస్థలిగా మారిపోయి ఉండచ్చు. కళ మినహా ఇతరేతర దుష్టశక్తుల స్వైరవిహారానికి ఆటపట్టు అయిన ఒక రుద్రభూమిగా తెలుగు సినీ రంగం మారి ఉండచ్చు.

ఉదయ కిరణ్ అస్తమయం కేవలం తెలుసు సినీరంగ సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య. లేత తీగలు ఆరోగ్యంగా, ఆనందంగా పైపైకి పాకి పందిరిని అల్లుకునే అవకాశం లేకుండా మూలంలోనే ఏదో చీడ వాటిని తినేస్తోంది. అవకాశాలు, కాసుల వెతుకులాటలో అడుగడుగునా అడ్డుపడే కొండచిలువలను తప్పించుకునే ప్రయత్నంలోనే మనిషి శారీరకంగా, మానసికంగా అలసిపోయి అకాల మరణంలోనే సమాధానాన్ని వెతుక్కుంటున్నాడు.

ఉదయకిరణ్ మరణం ఈ సమాజదేహాన్ని లోలోపలనుంచి తినేస్తున్న భయానక రోగానికి బాహ్యచిహ్నం మాత్రమే!


5 comments:

  1. సరుకు లేకున్నా...గుండు కొట్టిన వంశం రా అని చెప్పుకుని బ్రతికే అవకాశం లేక పోవటం వల్ల... బానిసల్లా వెంట పడే అభిమానులూ దర్శకులూ దొరకలేదు...లేక పోతే చింపాంజీ ని తెచ్చి, ఆంధ్రా లో మేం ఒక్కళ్ళమే మనుషులం రా అని తొడలు బాదుకున్నా....లక్షలాది అభిమానులు తోక ఊపుకుంటూ వెనక చేరే వారే...ఇప్పుడు కావాల్సింది వెర్రి అభిమానులు...టాలెంట్ కాదు...

    ReplyDelete
  2. ప్రపంచం లో ఫెయిర్ ప్లే ఎక్కడా ఉండదండీ!
    వందల కోట్ల డబ్బులూ, చేతిలో సిన్మా థియేటర్లూ ఉండి కూడా వారి వారసులను కాదని బయటి వారికి ఛాన్స్ ఇచ్చే మహానుభావులు ఉండటానికి సినిమా రంగం మంచి మనుషులు ఉండే కళారంగం కాదు,అది ఒక వ్యాపారం .......

    మంచి కళాకారుడి గా బతకాలంటే భాస్కరం గారు చెప్పినట్టు, పాత తరం నటుల్లాగా చాలా మంచి పనులు చేసి బతకవచ్చు. కానీ వ్యాపారం చేసేటప్పుడు అన్ని తెలుసుకునీ ఉండాలి, అన్నిటికీ తయారుగా ఉండాలి.

    పాపం ఉదయ్ కిరణ్ గారు సున్నిత మనస్కుడు.

    ReplyDelete
  3. ఎందుకీ insincere నివాళులు?

    జరిగిందేంటో మనందరకూ తెలుసు. ఇప్పుడు ఇంతలా నివాళులర్పిస్తున్న మనమే ఆ కుటుంబంవారి (కాదు కాదు కులంవారి) సినిమాలొస్తే ఎగురుకుంటూ వెళ్ళమా? పోనీ వాళ్ళేమన్నా గొప్ప నటులా అంటే అదేమీలేదు. ప్రజలందరి చెవుల్లోనూ పబ్లిగ్గా పువ్వులుపెట్టినా అభిమానిస్తూనే ఉన్నామే ఇది సిగ్గూశరంలేనితనంకాక మరింకేమిటి? ఆనాలుగు కుటుంబాలూ అలా చేస్తున్నాయని బుగ్గలునొక్కుకోవడంకాక "మేం ఆనాలుగు కుటుంబాల సినిమాలను బహిష్కరిస్తున్నాం. తెలుసు సినిమా పరిశ్రమలో, వ్యవస్థలో ఒక మార్పుని కాంక్షిస్తున్నాం. అదివచ్చేవరకూ మేం సంకల్పం సడలకుండా వ్యవహరిస్తాం" అని చెప్పగలమా? మనం మన వ్యసనాపూరిత అభిమానాలాల్నీ, కులపిచ్చినీ వదిలించుకోనంతకాలం ఇలా ఎంతో మంది బలవుతారని మనకుతెలీదా? లేక అలాంటి నివాళులర్పించే అవకాశాలకోసమేనా మనం ఎదురుచూస్తున్నది. తప్పు ఒక అవ్యవస్థను, కులతత్వాన్నీ వినోదంపేరిట ప్రోత్సహిస్తున్న మనది.

    ReplyDelete
  4. శ్రీనాథ్ గారూ, మీ స్పందన సహజంగా ఉంది

    ReplyDelete
  5. ఉదయ కిరణ్ ఆత్మహత్య బాధాకరం. చాలా కారణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా తను ఆత్మహత్య చేసుకోవడం ఒక రకంగా తప్పు, బాధ్యతా రాహిత్యం. ఎందుకంటే సినిమా హీరోలను అనుకరించే బలహీన మనస్కులు సమాజంలో ఉన్నారు. కనీసం ఆ కారణం ఆలోచించి అయినా బ్రతకాల్సి ఉండే. సినిమా కాకపొతే మరో రంగానికి మారాల్సి ఉండే. కళ కన్నా జీవితమే గొప్పది.

    ReplyDelete