Friday, March 28, 2014

అక్రమ సంతానం మీద తల్లికి ప్రేమ ఉండదా?!

చాగంటి కోటేశ్వర రావు గారు మహాభారతంలో ఒక ఘట్టం గురించి చెబుతూ ఒక స్త్రీ కన్యగా ఉండి సంతానం కన్నప్పుడు ఆ సంతానం మీద ఆ స్త్రీకి ప్రేమ ఉండదనీ, వివాహితగా కన్న సంతానం మీదే ప్రేమ ఉంటుందనీ ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు.

వారిని బట్టి మాతృత్వానికి, కడుపు తీపికీ కూడా అక్రమ, సక్రమ తేడాలు ఉంటాయన్నమాట.

వారు ఆ వ్యాఖ్య చేసిన సందర్భం కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భం. కర్ణుడు ప్రయోగించిన ఒక అస్త్రానికి అర్జునుడు కనిపించకూడా పోయాడు. కర్ణుని తన కొడుకుగా అప్పటికే గుర్తించిన కుంతి అర్జునుడు కనిపించక పోయేసరికి ఆందోళన చెంది మూర్ఛ పోయింది. అప్పుడు విదురుడు ఆమె ముఖం మీద నీళ్ళు చిలకరించగా ఆమెకు తెలివి వచ్చింది. కాసేపటికి కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ కనిపించేసరికి ఆమె మనసు కుదుట పడింది.

ఇదీ స్థూలంగా మహాభారతంలో ఉన్నది. ఈ చిత్రీకరణలో కుంతి మాతృత్వానికి లేదా కడుపు తీపికి ఎలాంటి విఘాతమూ కలగలేదు. అక్రమం, సక్రమం అనే తేడా లేకుండా కొడుకులిద్దరూ కనిపించినందుకు ఆమె తల్లి మనసు సేద తీరింది. మహాభారత కథకుడు మాత్రం ఆమె మాతృత్వానికి ఎలాంటి పరిధులూ నిర్దేశించలేదు.

చాగంటివారు ఆ పని చేయడమే ఆశ్చర్యం.

తల్లి అక్రమంగా బిడ్డను కంటే తనను తాను శిక్షించుకోవాలి. లేదా తనకు అక్రమ సంతానం ఇచ్చిన వాణ్ణి శిక్షించాలి. అంతే తప్ప తన జన్మకు తాను ఏమాత్రం బాధ్యుడు కాని బిడ్డను ఏవిధంగా శిక్షిస్తుంది? ఇది సహజన్యాయానికి విరుద్ధం కదా? కర్ణుడి మీద కుంతికి ప్రేమ లేకపోవడం అతనిని అన్యాయంగా శిక్షించడమే కదా? మాతృ సహజమైన ప్రేమను అతనికి లేకుండా చేయడమే కదా?

మహాభారత కథకుడు మాత్రం కర్ణుడి మీద ఇలాంటి మాతృ ప్రేమ రాహిత్యం అనే శిక్షను విధించలేదు. ఆయన ఎంతో ఔచిత్యాన్ని, సహజన్యాయాన్ని పాటించాడు. ఇంకా చెప్పాలంటే, కర్ణుడు తన కొడుకు అని చెప్పుకోలేని భీరురాలిగా, నిశ్శబ్దంగా కడుపుకోతను భరించే దయనీయురాలిగా కుంతిని చూపిస్తూ, కర్ణుని మాత్రం ధీరోదాత్తుడిగానే చిత్రించాడు. అతనికే చివరిలో అర్జునుని తప్ప మిగిలిన నలుగురు పాండవులనూ చంపనని తల్లికి వరమిచ్చాడు.

మహాభారత కథకుడు పాటించిన వైశాల్యాన్ని, ఔచిత్యాన్ని చాగంటివారు విస్మరించడం విచిత్రమే.

అక్రమ సంతానం మీద తల్లికి ప్రేమ ఉండదనే చాగంటివారి అభిప్రాయం ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో కూడా ఆలోచించాలి. అవివాహితగా గర్భం ధరించి, గర్భస్రావానికి కూడా వీలు కానప్పుడు ఆ బిడ్డను రోడ్డు మీద, చెత్త కుండీలలోనూ పారేయడం గురించిన వార్తలు చూస్తూ ఉంటాం. అక్రమ సంతానం మీద తల్లికి ప్రేమ ఉండదన్నప్పుడు  అది సమర్థనీయమే అవుతుంది. భ్రూణ హత్యలూ సమర్థనీయమే అవుతాయి. 

Wednesday, March 26, 2014

సినిమా కథకు, పురాణ కథకు పోలిక

బక్కపలచని హీరోచేత దుక్కల్లా ఉన్న పదిమంది రౌడీలను ఒంటి చేత్తో చితకబాదించడం మన సాధారణ లాజిక్కుకు విరుద్ధమని సినీ దర్శకుడికి తెలుసు. అయితే, అలా తీసినప్పుడే సినిమా హాలు ఈలలతో దద్దరిల్లిపోతుందనీ తెలుసు. ఆవిధంగా సినిమా తీసేవాడికీ, ప్రేక్షకులకీ మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అదే కెమిస్ట్రీ పురాణకథకునికీ, శ్రోతకీ మధ్య కూడా ఉంటుంది. అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు కోరుకునే సినిమా రూపం ముందు లాజిక్కులేవీ పని చేయవని సినిమా వాళ్ళకు ఎలా తెలుసో, అత్యధిక సంఖ్యాకులైన శ్రోతలు కోరుకునే పురాణ కథారూపం ముందు లాజిక్కులేవీ పనిచేయవని నాటి కథకునికీ బహుశా అలాగే తెలుసు. చెప్పొచ్చేది ఏమిటంటే, సినిమాకు ఒక నిర్ణీత శైలీ, రూపమూ ఎలా ఉంటాయో అలాగే పురాణ కథకూ ఉంటాయి. రెండింటిలోనూ ఒక మాంత్రిక శైలి సమానంగా ఉంటుంది.

ఒక మాంత్రిక శైలి రెడీమేడ్ గా ఎప్పుడైతే ఉందో, దానిని అనేక ఇతరవిధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, వాస్తవాన్ని కప్పి పుచ్చడానికీ, లేదా ఒక అసత్యాన్ని చలామణిలో ఉంచడానికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఒక నాయకునికి లేని సుగుణాలను ఆపాదించి ఆకాశానికి ఎత్తవచ్చు. ఇంకో నాయకునికి లేని లోపాలు ఆపాదించి పాతాళానికి పడదొక్కవచ్చు. రాజకీయనాయకులనే చూడండి, ఎన్నికలముందు ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరించే మంత్రదండం తమ వద్ద ఉందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక తమ దగ్గర మంత్రదండం ఏమీ లేదని చేతులెత్తేస్తారు.

(పూర్తి వ్యాసం  http://magazine.saarangabooks.com/2014/03/26/%E0%B0%92%E0%B0%95%E0%B1%87-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%86/ లో చదవండి)

Wednesday, March 19, 2014

ఆరోజుల్లో...పిల్ల నివ్వడమే తండ్రి వంతు. పెళ్లి ఖర్చు మగపెళ్ళివారిదే!

గాంధర్వానికి తపతి నిరాకరించి వెళ్లిపోవడంతోనే సంవరణుడు సూర్యుని ఆరాధించడం ప్రారంభించి, వశిష్టుని తలచుకున్నాడని కథకుడు చెప్పనే చెప్పాడు. సూర్యుని ఆరాధించాడని కథకుడు చెప్పడం, తపతిని దేవుడైన సూర్యుని కుమార్తెగా చెప్పడానికి యాంత్రికమైన కొనసాగింపు మాత్రమే. 

అయితే, సూర్యుని ఆరాధించడం వల్ల సంవరణుని పని జరగదు. వశిష్టునివల్లనే జరుగుతుంది. ఎందుకంటే, ఒక బ్రాహ్మణునిగా వశిష్టుడు క్షత్రియులకు ఎంత కావలసినవాడో, ఆదివాసులకూ అంతే కావలసినవాడు. వశిష్టుడు మధ్యవర్తిగా లేదా హామీగా ఉంటే సంవరణునికి తపతిని ఇవ్వడానికి ఆదివాసులకు అభ్యంతరం లేదు. ఆయన మీద వారికి అంతటి గురి. అలాగే, వశిష్టుడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. నేరుగా తపతి తండ్రిని కలిశాడు. సంవరణుడు యోగ్యుడు, అతనికి నీ కూతుర్ని ఇయ్యి అని చెప్పాడు. తండ్రి మారు మాట్లాడకుండా అప్పటికప్పుడు కూతురిని అతనితో పంపేశాడు. వశిష్టుడు తపతికి, సంవరణుడికీ పెళ్లి జరిపించాడు.

గమనించారో లేదో...కూతుర్ని ఇవ్వడమే తండ్రి వంతు. తనే పెళ్లి జరిపించే బాధ్యత ఆనాడు తండ్రికి ఉన్నట్టు లేదు. పెళ్లి జరిపించుకోవలసిన బాధ్యత వరుడివైపు వారిదే. గాంధారీ-ధృతరాష్ట్రుల విషయంలో కూడా ఇదే జరిగింది. గాంధారి తండ్రి సుబలుడు తన కూతురిని ధృతరాష్ట్రునికి ఇచ్చానని మాత్రమే అన్నాడు. సోదరుడు శకుని వెంట ఆమెను హస్తినాపురం పంపించాడు. అక్కడ భీష్ముడు మొదలైన వరుడి వైపువారే పెళ్లి జరిపించారు.

Saturday, March 15, 2014

కేజ్రీవాల్ వ్యాఖ్యకు మీడియా అంతగా స్పందించాలా?

అరవింద్ కేజ్రీవాల్ మీడియా అమ్ముడుపోయిందనేసరికి మీడియా ఆయన మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. ఎలాగంటే, ఒక రాజకీయపక్షం ఇంకో రాజకీయ పక్షం మీద ఆరోపణలు చేసినప్పుడు ఆ రాజకీయపక్షం విరుచుకుపడినంతగా. బహుశా అంతకంటే ఎక్కువగా.

ఏం? ఎందుకు? మీడియా కూడా ఒక రాజకీయపక్షంగా మారాలా? 

రాజకీయపక్షాలు సాధారణంగా అబద్ధాలు చెబుతాయి. కనీసం, నిజం చెప్పవు. రాజకీయపక్షాలు నిజం చెబుతాయని ఎవరూ అనుకోరు కూడా. నిజం చెప్పడం రాజకీయపక్షాల పని కూడా కాదు. 

అలాగే మీడియా అబద్ధాలు చెప్పదని కాదు. కానీ మీడియా నిజం చెప్పాలని ఎక్కువమంది ఆశిస్తారు. అసలు నిజాలు చెప్పడమే మీడియా పని కూడా. అటువంటి మీడియా కూడా అబద్ధాలు చెప్పే ఒక రాజకీయపక్షంగా మారాలా? అప్పుడు నిజాలు చెబుతుందని  జనం అనుకునే రంగం ఒక్కటైనా ఉంటుందా? 

మీడియాలో ప్రత్యేకించి ఏ ఒక్క సంస్థనో కాకుండా మొత్తంగా మీడియా మీదే ఆరోపణ చేసినప్పుడు అది అంతగా ఎందుకు స్పందించాలి? అది ఒక లూజ్ ప్లాట్ ఫారంగా ఉంటే సరిపోతుంది కదా? దానికి ఒక పార్టీ స్వభావం ఎందుకివ్వాలి? ఏదైనా పార్టీ స్వభావం తెచ్చుకుందంటే దాని ద్వారా కచ్చితంగా జరిగేది ఒకటే...అది నిజాలను సమాధి చేయడం. 

ఇందులో ఇంకో ప్రశ్న కూడా ఉంది. రాజకీయపక్షాలను, నాయకులను హోల్సేల్ గా మీడియా కడిగివిడిచిపెట్టడం లేదా? రాజకీయనాయకులు అలాగే తనను హోల్సేల్ గా కడిగినప్పుడు మీడియా అంత తీవ్రంగా ఎందుకు స్పందించాలి? కడిగేసే హక్కు తమకే తప్ప ఇంకొకరికి ఉండకూడదని అది ఎలా అనుకుంటుంది? అది ప్రజాస్వామ్యానికి బదులు మీడియా స్వామ్యం అవదా?

న్యాయవ్యవస్థ మీదా, చివరికి అది ఇచ్చే కొన్ని తీర్పుల మీదా కూడా  విమర్శలు, ఆరోపణలు రావడం చూస్తున్నాం. కానీ న్యాయవ్యవస్థ ఒక పార్టీగా మారి వాటిపై స్పందిస్తోందా? మీడియా ఎందుకు స్పందించాలి? 

ఏదో పోలిక కోసం చెప్పాను కానీ, న్యాయవ్యవస్థను, మీడియాను ఒకే పెడస్టల్ మీద ఉంచడం లేదు. 

అన్ని రంగాల్లో ఉన్నట్టే మీడియాలో కూడా బ్లాక్ షీప్ ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఉన్న సంగతి మీడియాకు కూడా తెలుసు. అయినాసరే, ఇలా బుజాలు తడుముకోడం దేనికి?  

మీడియాలో కొందరు అమ్ముడుపోవడం కన్నా ఎక్కువ ప్రమాదకరం, మీడియా మొత్తం ఇలా కట్టకట్టుకుని ఒక రాజకీయపార్టీ స్వభావం తెచ్చుకోవడం!

                                                                           ***

తాజా కలం: 16-3-2014 'హిందూ'లో Journalists question media reaction to Kejriwal's criticism అనే శీర్షికతో వార్త ఉంది. అందులో ఇలా ఉంది:

Eminet journalists on Saturday questioned the media reaction to criticism by the Aam Admi Party(AAP) leader Arvind Kejriwal. Of the view that the media should be open to criticism that is "legitimate and long overdue", Chairman of Kasturi & Sons Ltd, and publisher of The HIndu, N. Ram said: "the hype and over-reaction makes us look like a laughing stock"..."Unfortunately when people outside the media criticise us, we have a very thin skin", Ram said.


Thursday, March 13, 2014

గంధర్వుడి మాటల్లో గణసమాజ లక్షణాలు

ఆ వెంటనే గంధర్వుడు నీ పరాక్రమాన్ని మెచ్చాను’, నీతో స్నేహం చేయాలని ఉందని అర్జునుడితో అన్నాడు. అంతేకాదు, నా దగ్గర చాక్షుషి అనే విద్య ఉంది, ఆ విద్యతో మూడులోకాల్లో ఏం జరుగుతోందో చూడచ్చు, అయితే, అది అందరికీ పని చేయదు, నువ్వు తాపత్య వంశీకుడివి కనుక నీకు పనిచేస్తుంది అన్నాడు. మూడు లోకాలనూ చూడగలిగిన విద్య తన దగ్గర ఉన్నా, అర్జునుణ్ణి గుర్తించలేక ఓటమిని ఎందుకు కొని తెచ్చుకున్నాడో తెలియదు. పైగా, ఈ విద్యను తీసుకునేటప్పుడు ఆరుమాసాలపాటు ఒక వ్రతం పాటించాలని షరతు పెట్టాడు. మందుల వాళ్ళు, స్వాములు, పూజారుల బాణీని ఈ మాటల్లో మీరు పోల్చుకోవచ్చు. అంటే, వారి మూలాలు కాలగర్భంలో ఇంత లోతున ఉన్నాయన్నమాట.

మొత్తంమీద ఈ ఘటనలో అతణ్ణి ఆకర్షించింది బహుశా ఒకే ఒకటి, అది ఆగ్నేయాస్త్రం! తన దగ్గర ఎన్నో మాయలున్నాయంటున్న అతనికి అదే ఓ పెద్ద మాయగా కనిపించినట్టుంది, నీ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తే మీకు గుర్రాలు ఇస్తానని బేరం పెట్టాడు.

మొత్తానికి అతని వ్యవహారం అంతా చిన్న పిల్లల తంతులా ఉంది...

(పూర్తివ్యాసం
http://magazine.saarangabooks.com/2014/03/13/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%80-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A3/ లో చదవండి)


Saturday, March 8, 2014

కేజ్రీవాల్ ది పబ్లిసిటీ యావే! కానీ అది లేనిదెవరికి?

 నరేంద్ర మోడి అభివృద్ధి, సుపరిపాలన అంటున్నారు.
రాహుల్ గాంధీ సెక్యులరిజం, ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు..
అరవింద్ కేజ్రీవాల్ అవినీతి, కార్పొరేట్ పాలన అంటున్నారు..

మొత్తానికి ముగ్గురికీ ఎవరి అజెండాలు వారికి ఉన్నాయి.
ఎవరి అజెండాలు వాళ్ళు పట్టుకుని ఎన్నికల యుద్ధానికి దిగారు.

కాకపోతే, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు నడుపుతున్న తీరే ఎక్కువ విమర్శలను ఆకర్షిస్తోంది. ఎందుకు?

అవినీతి కొత్త సమస్య కాకపోయినా, కేజ్రీవాల్ రాజకీయాలు మాత్రం కొత్తగానే ఉన్నాయి. సాంప్రదాయిక రాజకీయాలకు అలవాటుపడిన కాంగ్రెస్, బీజేపీలకే కాక మిగిలిన పార్టీలకు కూడా ఇది మింగుడుపడడం లేదు. కేజ్రీవాల్ ఏం చేసినా వార్త అవుతోంది. ఆయన గుజరాత్ లో ఉన్న మూడు రోజుల్లోనూ మూడేళ్లకు సరిపోయే పబ్లిసిటీని సంపాదించుకున్నారు. మీడియా కెమెరాలన్నీ ఆయన చుట్టూనే పాతుకుపోయి ఉంటున్నాయి. నరేంద్రమోడీ అనే సింహం డెన్ లోకి నేరుగా వెళ్ళి ఢీకొన్న వీరుడిగా మీడియా ఆయనను ఫోకస్ చేస్తోంది. ఇంతకాలం కాంగ్రెస్ చేయలేకపోయిన పని ఆయన చేశాడనే వ్యాఖ్యాలూ వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీని కలవడానికి ఆయన చేసిన ప్రయత్నం అతిగానూ, నాటకీయంగానూ ఉన్న మాట నిజమే. తను కోరగానే మోడీ తన ఎంగేజ్ మెంట్లు అన్నీ రద్దు చేసేసుకుని వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తారని కేజ్రీవాల్ కూడా అనుకుని ఉండరు. అది simply impossible. మోడీ ఒక ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి. ఆయనది ఎంత బిజీ షెడ్యూలో అర్థం చేసుకోగలం.

అయితే, కేజ్రీవాల్ కు నిజంగా కావలసింది మోడీని కలవడం కాదు, పబ్లిసిటీని తెచ్చుకోవడం. అది పూర్తిగా నెరవేరింది. ఇక్కడ రెండింటినీ వేరు చేసి చూడాలి. మోడీ తనకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరుకోవడం తప్పు. కానీ పబ్లిసిటీని కోరుకోవడం తప్పు కాదు. అదంతా పబ్లిసిటీ స్టంట్  అని ఇతర రాజకీయ పార్టీలు విమర్శించడంలో అసలే అర్థం లేదు. పబ్లిసిటీకి పాకులాడని పార్టీలు ఏవున్నాయి?

కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడడంలో కూడా ఒక కొత్త ఎలిమెంట్ ఉంది. ఆయన కేవలం ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల అవినీతి గురించీ, అవినీతి కుంభకోణాల గురించీ మాత్రమే మాట్లాడడం లేదు. పాలనా వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నారు. గుజరాత్ లో కూడా లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగదని ఆరోపిస్తున్నారు.

నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా అవినీతి మరక అంటని స్వచ్ఛ చరితులే కావచ్చు. కానీ పాలనా యంత్రాంగం మొత్తాన్ని అలా చేయగలిగారా అన్న ప్రశ్నకు కేజ్రీవాల్ రాజకీయాలు అవకాశమిస్తున్నాయి. అంటే అవినీతిపై చర్చ విస్తృతమవుతోందన్న మాట. ప్రజల కోణం నుంచి అది మంచిదే కదా.


Thursday, March 6, 2014

అడవుల్లోకి వెళ్లడానికి బ్రాహ్మణుడే 'పర్మిట్'

ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే, అడవుల్లోకీ, ఆదివాసీ తెగల మధ్యకీ వెళ్లడానికి పర్మిట్’, లేదా లైసెన్స్ ఒక్క మునులకే ఉంది. ఈ రోజుల్లో మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ, ఆరోజుల్లో ఆ పర్మిట్ లేదా లైసెన్స్ చాలా విలువైనది. మునులు, లేదా బ్రాహ్మణుల విలువను, ప్రతిపత్తిని పెంచిన వాటిలో ఇది కూడా ఒకటి కావచ్చు. బ్రాహ్మణులకే ఈ పర్మిట్ ఎందుకు ఉందో ఊహించడం కష్టం కాదు. వాళ్ళు నిరాయుధులు! వాళ్ళ నోట మంత్రమే కాదు, ఎదుటివారిని మంత్రించే మాట కూడా ఉంది. వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న సాయుధ క్షత్రియులతో ఆదివాసులది సహజవైరం. కనుక క్షత్రియులు నేరుగా అడవిలోకి ప్రవేశించే అవకాశం లేదు. క్షేమం  కాదు. ఆవిధంగా అడవుల్లోకి క్షత్రియుల ప్రవేశానికి బ్రాహ్మణుడు టార్చ్ లైట్ లేదా లైసెన్స్ అయ్యాడన్న మాట. బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత మరింత గట్టిపడదానికి  బహుశా అదే ప్రారంభమూ కావచ్చు.

బ్రాహ్మణులు అడవుల్లోకీ, ఆదివాసుల మధ్యకూ  వెళ్లడం మాత్రమేనా…? కాదు, వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. కొందరైనా వాళ్ళలో కలసిపోయారు, లేదా వాళ్ళను తమలో కలుపుకున్నారు.  బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యతనే కాక, బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధాలను వెల్లడించే ఉదంతాలు పురాణ, ఇతిహాసాలలో అసంఖ్యాకంగా ఉన్నాయి. 

(పూర్తి వ్యాసం
http://magazine.saarangabooks.com/2014/03/06/%E0%B0%85%E0%B0%A1%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AC/ లో చదవండి)