గాంధర్వానికి తపతి నిరాకరించి వెళ్లిపోవడంతోనే సంవరణుడు
సూర్యుని ఆరాధించడం ప్రారంభించి, వశిష్టుని తలచుకున్నాడని కథకుడు చెప్పనే
చెప్పాడు. సూర్యుని ఆరాధించాడని కథకుడు చెప్పడం, తపతిని దేవుడైన
సూర్యుని కుమార్తెగా చెప్పడానికి యాంత్రికమైన కొనసాగింపు మాత్రమే.
అయితే, సూర్యుని ఆరాధించడం వల్ల సంవరణుని పని జరగదు. వశిష్టునివల్లనే
జరుగుతుంది. ఎందుకంటే, ఒక బ్రాహ్మణునిగా వశిష్టుడు
క్షత్రియులకు ఎంత కావలసినవాడో, ఆదివాసులకూ అంతే కావలసినవాడు.
వశిష్టుడు మధ్యవర్తిగా లేదా హామీగా ఉంటే సంవరణునికి తపతిని ఇవ్వడానికి ఆదివాసులకు
అభ్యంతరం లేదు. ఆయన మీద వారికి అంతటి గురి. అలాగే, వశిష్టుడు
వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. నేరుగా తపతి తండ్రిని కలిశాడు. సంవరణుడు యోగ్యుడు, అతనికి నీ కూతుర్ని ఇయ్యి అని చెప్పాడు. తండ్రి మారు మాట్లాడకుండా
అప్పటికప్పుడు కూతురిని అతనితో పంపేశాడు. వశిష్టుడు తపతికి,
సంవరణుడికీ పెళ్లి జరిపించాడు.
గమనించారో లేదో...కూతుర్ని ఇవ్వడమే తండ్రి వంతు. తనే పెళ్లి
జరిపించే బాధ్యత ఆనాడు తండ్రికి ఉన్నట్టు లేదు. పెళ్లి జరిపించుకోవలసిన బాధ్యత
వరుడివైపు వారిదే. గాంధారీ-ధృతరాష్ట్రుల విషయంలో కూడా ఇదే జరిగింది. గాంధారి
తండ్రి సుబలుడు తన కూతురిని ధృతరాష్ట్రునికి ఇచ్చానని మాత్రమే అన్నాడు. సోదరుడు
శకుని వెంట ఆమెను హస్తినాపురం పంపించాడు. అక్కడ భీష్ముడు మొదలైన వరుడి వైపువారే
పెళ్లి జరిపించారు.
పూర్వం ఎన్నో రకాల అచారాలు జాతుల్నిబట్టి, ప్రాంతాలబట్టి ఉండేవి.అవి అన్నీ కలిసి ఒక పద్ధతికి వస్తున్నట్లు ఉంది.(due to modernization and development of communications and transport facilities ) . నాకు తెలిసి రాయలసీమప్రాంతంలో మగపెళ్ళివాళ్ళే ఆడపిల్లని వెదుక్కుని అడిగిచేసుకొనేవాళ్ళు.ఇప్పుడు పరిస్థితి ఎలాగుందో తెలియదు.మత్స్యగంధి వృత్తాంతం కూడా ఇలాటిదే కదా!
ఒక రకంగా మీరన్నది నిజమే నండీ... కానీ చాలా పురాతన కాలానికి వెడితే, నేటిలా కమ్యూనికేషన్లు లేనప్పుడు కూడా విచిత్రంగా ప్రపంచం అంతటా దాదాపు ఆచారాలు ఒకేలా ఉండేవి.
Delete