Saturday, March 15, 2014

కేజ్రీవాల్ వ్యాఖ్యకు మీడియా అంతగా స్పందించాలా?

అరవింద్ కేజ్రీవాల్ మీడియా అమ్ముడుపోయిందనేసరికి మీడియా ఆయన మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. ఎలాగంటే, ఒక రాజకీయపక్షం ఇంకో రాజకీయ పక్షం మీద ఆరోపణలు చేసినప్పుడు ఆ రాజకీయపక్షం విరుచుకుపడినంతగా. బహుశా అంతకంటే ఎక్కువగా.

ఏం? ఎందుకు? మీడియా కూడా ఒక రాజకీయపక్షంగా మారాలా? 

రాజకీయపక్షాలు సాధారణంగా అబద్ధాలు చెబుతాయి. కనీసం, నిజం చెప్పవు. రాజకీయపక్షాలు నిజం చెబుతాయని ఎవరూ అనుకోరు కూడా. నిజం చెప్పడం రాజకీయపక్షాల పని కూడా కాదు. 

అలాగే మీడియా అబద్ధాలు చెప్పదని కాదు. కానీ మీడియా నిజం చెప్పాలని ఎక్కువమంది ఆశిస్తారు. అసలు నిజాలు చెప్పడమే మీడియా పని కూడా. అటువంటి మీడియా కూడా అబద్ధాలు చెప్పే ఒక రాజకీయపక్షంగా మారాలా? అప్పుడు నిజాలు చెబుతుందని  జనం అనుకునే రంగం ఒక్కటైనా ఉంటుందా? 

మీడియాలో ప్రత్యేకించి ఏ ఒక్క సంస్థనో కాకుండా మొత్తంగా మీడియా మీదే ఆరోపణ చేసినప్పుడు అది అంతగా ఎందుకు స్పందించాలి? అది ఒక లూజ్ ప్లాట్ ఫారంగా ఉంటే సరిపోతుంది కదా? దానికి ఒక పార్టీ స్వభావం ఎందుకివ్వాలి? ఏదైనా పార్టీ స్వభావం తెచ్చుకుందంటే దాని ద్వారా కచ్చితంగా జరిగేది ఒకటే...అది నిజాలను సమాధి చేయడం. 

ఇందులో ఇంకో ప్రశ్న కూడా ఉంది. రాజకీయపక్షాలను, నాయకులను హోల్సేల్ గా మీడియా కడిగివిడిచిపెట్టడం లేదా? రాజకీయనాయకులు అలాగే తనను హోల్సేల్ గా కడిగినప్పుడు మీడియా అంత తీవ్రంగా ఎందుకు స్పందించాలి? కడిగేసే హక్కు తమకే తప్ప ఇంకొకరికి ఉండకూడదని అది ఎలా అనుకుంటుంది? అది ప్రజాస్వామ్యానికి బదులు మీడియా స్వామ్యం అవదా?

న్యాయవ్యవస్థ మీదా, చివరికి అది ఇచ్చే కొన్ని తీర్పుల మీదా కూడా  విమర్శలు, ఆరోపణలు రావడం చూస్తున్నాం. కానీ న్యాయవ్యవస్థ ఒక పార్టీగా మారి వాటిపై స్పందిస్తోందా? మీడియా ఎందుకు స్పందించాలి? 

ఏదో పోలిక కోసం చెప్పాను కానీ, న్యాయవ్యవస్థను, మీడియాను ఒకే పెడస్టల్ మీద ఉంచడం లేదు. 

అన్ని రంగాల్లో ఉన్నట్టే మీడియాలో కూడా బ్లాక్ షీప్ ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఉన్న సంగతి మీడియాకు కూడా తెలుసు. అయినాసరే, ఇలా బుజాలు తడుముకోడం దేనికి?  

మీడియాలో కొందరు అమ్ముడుపోవడం కన్నా ఎక్కువ ప్రమాదకరం, మీడియా మొత్తం ఇలా కట్టకట్టుకుని ఒక రాజకీయపార్టీ స్వభావం తెచ్చుకోవడం!

                                                                           ***

తాజా కలం: 16-3-2014 'హిందూ'లో Journalists question media reaction to Kejriwal's criticism అనే శీర్షికతో వార్త ఉంది. అందులో ఇలా ఉంది:

Eminet journalists on Saturday questioned the media reaction to criticism by the Aam Admi Party(AAP) leader Arvind Kejriwal. Of the view that the media should be open to criticism that is "legitimate and long overdue", Chairman of Kasturi & Sons Ltd, and publisher of The HIndu, N. Ram said: "the hype and over-reaction makes us look like a laughing stock"..."Unfortunately when people outside the media criticise us, we have a very thin skin", Ram said.


7 comments:

 1. మీడియా కేజ్రివాల్ మాటలకి ఎక్కువ "ప్రాధాన్యత" ఇవ్వడం కొత్త కాదే....ఓహొ ..ఈసారి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారనా!....అయినా కూడా ప్రచారం బాగానే లభించింది కదా.
  ఆయన అనే అబద్ధాలని కూడా తిప్పి తిప్పి రుద్దటం అలవాటు అయ్యి ఇప్పుడు కూడా అలా ప్రచారాద్ధాంతం చేసారేమో!.

  ReplyDelete
  Replies
  1. మీడియా మీద ఎలాంటి ఆరోపణైనా చేయండి కానీ, ఎవరికో ప్రచారం ఇస్తోందనే ఆరోపణలో న్యాయం లేదండీ. మీడియా ప్రచారం ఇవ్వని రాజకీయనాయకులు ఎవరైనా ఉన్నారా? చివరికి మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడని నాయకులకు కూడా ఇస్తోంది. పార్టీ పెడుతున్నానన్న పవన్ కళ్యాణ్ కు తెలుగు ఎంత ప్రచారం ఇచ్చింది? ఇక కేజ్రీవాల్ ఒక్కడే అబద్ధాలాడేవాడూ, మిగిలినవాళ్లు సత్యహరిశ్చంద్రులూ అయితే రాజకీయాలు ఎంత బాగుండేవో ఒకసారి ఊహించండి. అప్పుడు కేజ్రీవాళ్ళకు, పవన్ కల్యాణ్ లకు అవకాశమే ఉండదు కదా?

   Delete
  2. 'పవన్ కళ్యాణ్ కు తెలుగు మీడియా ఎంత ప్రచారం ఇచ్చింది?'అని చదువుకోగలరు.

   Delete
 2. అసలు మీడియా ఈయనని ignore చేయకుండా ఉండలేదా? జాతీయ మీడియాకి వేరే వార్తల్లో వ్యక్తులే లేరా?

  ReplyDelete
  Replies
  1. అన్యాయం...ఎంతోమంది కరప్ట్, క్రిమినల్, గూండా పొలిటీషియన్లను వదిలిపెట్టి ఈయనను ఒక్కడినే మీడియా ఇగ్నోర్ చేయాలని మీరు అనడం చాలా అన్యాయం. మీకు కేజ్రీవాల్ మీద మరీ అంత కోపం దేనికి?

   Delete
  2. నాకు కేజ్రీవాల్ మీద కోపం ఏమీ లేదండి.
   కేజ్రీవాల్‌కి మీడియా మీద నమ్మకం లేనప్పుడు మీడియా మాత్రం, ఆయన వెనుక ఎందుకు పడాలి అని? అంతే.

   Delete
  3. కేజ్రీవాల్ అనే వ్యక్తి లేదా వ్యక్తుల నమ్మకం, అపనమ్మకం మీద ఆధారపడి మీడియా పని చేయదండి. తన defined role తను నిర్వహిస్తుంది, అంతే. అయితే, మీడియా సంస్థలన్నీ నిర్వహిసున్నాయా అంటే అది వేరే విషయం. డాక్టర్ తనను తిట్టే వాడు తన దగ్గరకు వైద్యానికి వచ్చినా వైద్యం చేయాల్సిందే కదా. అలాగే మీడియా కూడా.

   Delete