బోస్ కు పెరిగిన మద్దతు
అహింసతో సహా గాంధీ విధానాలు, వ్యూహాలు అన్నీ
విఫలమై కాంగ్రెస్ లోనే కాక దేశం మొత్తంలోనే ఆయన దాదాపు ఒంటరిగా మారిన సందర్భం ఇది.
ఒకపక్క జనంలో బ్రిటిష్ వ్యతిరేకత తారస్థాయికి చేరగా, ఆసియా
దేశమైన జపాన్ చేతిలో పాశ్చాత్యశక్తులు చిత్తుగా ఓడిపోతుండడం ఆ దేశంపట్ల వారిలో
అనుకూలభావాన్నీ అదే స్థాయిలో పెంచింది. ఈ మధ్యలో 1941లో బోస్ తన కలకత్తా నిర్బంధం
నుంచి నాటకీయంగా తప్పించుకుని అప్ఘానిస్తాన్ మీదుగా జర్మనీ పారిపోయి, బెర్లిన్ నుంచి చేసిన రేడియో ప్రసంగాలు దానికి మరింత ఊతమిచ్చాయి. కాంగ్రెస్
లో ఎక్కువమంది నాయకులు, కార్యకర్తలు బోస్ వైపు తిరిగారు. జర్మనీనుంచి
ఆయన జపాన్ చేరుకుని జలాంతర్గాములను సేకరించబోతున్నట్టు వార్తవచ్చింది. బోస్
నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలసి భారత-బర్మా సరిహద్దుల్లో
వీరోచితపోరాటం చేసింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువ. పరిస్థితి
పూర్తిగా తన పట్టు జారిపోతోందనుకున్న గాంధీ ప్రజలమనోభావాలకు అనుగుణంగా ‘క్విట్ ఇండియా’ నినాదాన్ని అందుకున్న తర్వాతే మళ్ళీ
జనం ఆయనవైపు మళ్ళడం ప్రారంభించారు.
హిట్లర్ మరణం-జపాన్ లొంగుబాటు
అంతవరకూ యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా,
పెరల్ హార్బర్ పై జపాన్ దాడిచేసేసరికి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దాంతో బ్రిటన్
యుద్ధపాటవం అనేకరెట్లు పెరిగి బలాబలాలు తారుమారయ్యాయి. 1945 నాటికి హిట్లర్
మరణించడం, అణుబాంబు ప్రయోగంతో జపాన్ లొంగిపోవడం, ఆ వెనువెంటనే తైవాన్ లో జరిగిన విమానప్రమాదంలో బోస్ మరణించినట్టు వార్త
రావడం సంభవించాయి. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయపరిణామాల మబ్బులు తొలగిపోయి జాతీయరాజకీయాలు
తిరిగి తేటపడడం ప్రారంభించాయి. ఇప్పుడు బోస్ లేకపోవడం ఒక్కటే తేడా.
ఎవరు ఎంత బాధ్యులు?
జాతీయరంగస్థలినుంచి బోస్ నిష్క్రమణ రెండు అంచెలలో జరిగింది.
మొదటిది, కాంగ్రెస్ నుంచి నిష్క్రమణ. రెండోది, ‘మరణం’ లేదా ‘అంతర్ధానం’ రూపంలో జరిగిన నిష్క్రమణ. ఎలాంటి బాధ్యులన్న ప్రశ్నను కాసేపు పక్కన
పెడితే; కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ, నెహ్రూ తదితరులే బాధ్యులవుతారు. అదే, ఆయన ‘మరణం’ లేదా, ‘అంతర్ధానా’నికి బాధ్యులెవరన్నప్పుడు అంతర్జాతీయశక్తులు
తప్పనిసరిగా అడుగుపెడతాయి. జర్మనీ, జపాన్ లతో తలపడుతున్న
బ్రిటిష్ కు, ఆ రెండు దేశాల నుంచి సాయం పొందుతున్న బోస్
కదలికలపై నిఘావేయాల్సిన అవసరం స్పష్టమే. ఆయన కుటుంబసభ్యులపైకి దానిని పొడిగించడమూ
సహజమే. రహస్యపత్రాలు బయటపెడితే కొన్ని దేశాలతో
సంబంధాలు దెబ్బతినచ్చని ఇప్పటి కేంద్రప్రభుత్వం వినిపిస్తున్న వాదన కూడా; బోస్ ‘మరణం’, లేదా ‘అంతర్ధానం’ వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర గురించిన
అనుమానాన్ని బలోపేతం చేసేలానే ఉంది.
కాంగ్రెస్ నుంచి బోస్ నిష్క్రమణకు గాంధీ,
నెహ్రూ తదితరులు ఎలాంటి బాధ్యులన్న ప్రశ్న చూద్దాం. అందుకు కారణం వ్యక్తిగత
రాగద్వేషాలు, అధికారంలో పోటీ అవుతాడన్న భావనే అన్న
నిర్ధారణకు అవకాశంలేకుండా భావజాల పరమైన వ్యత్యాసాలు ఉండనే ఉన్నాయి. బోస్-గాంధీలది
హింస-అహింసల మధ్య పెనుగులాట. బోస్-నెహ్రూలది ఫాసిస్టు-ఫాసిస్టు వ్యతిరేకశక్తుల
మధ్య స్పర్థ. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి నెహ్రూకు ఇచ్చిన
అవకాశాన్ని బోస్ కు గాంధీ నిరాకరించడాన్నీ, బోస్ కు నెహ్రూ
మద్దతు ఇవ్వకపోవడాన్నీ అర్థం చేసుకోడానికి ఇదొక కోణం. ఒకవేళ గాంధీ, నెహ్రూలను బోస్ విషయంలో ‘ముద్దాయి’లుగా పరిగణించాల్సివచ్చినా పెద్ద ముద్దాయి గాంధీ అవుతాడు కానీ, నెహ్రూ అవడు. బోస్ తో గాంధీకి ఉన్నంత విభేదం నెహ్రూకు లేదని
చెప్పుకున్నాం. అయితే, నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ కుటుంబ సభ్యులపై నిఘా ఎందుకు
కొనసాగించాయన్న ప్రశ్న వస్తుంది. పరిపాలనా కోణం నుంచి చూస్తే
అదేమంత విశేషం అనిపించదు. సంఘపరివార్ వర్గాలు, వామపక్ష
తీవ్రవాదులతో సహా కొన్ని రకాల భావజాలాలవారిపై ఇంటెలిజెన్స్ నిఘా ఎప్పుడూ ఉంటూనే
ఉంది.
బోస్ ‘మరణం’, లేదా ‘అంతర్ధానం’ వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర ఉన్నట్టు
కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు వెల్లడిస్తూ ఉంటే, ఆ విషయం
నెహ్రూ ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్న వస్తుంది. అందులో కూడా ఆయనను మొదటి ముద్దాయిగా
నిర్ధారించాలంటే, ప్రస్తుత ప్రభుత్వం తన దగ్గరున్న అన్ని
రహస్యపత్రాలనూ బయటపెట్టాలి!
బోస్ ప్రతిష్టను మసగబార్చారనీ,
స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్రను తక్కువచేశారనే ఆరోపణలు,
అనుమానాలు సహజమే కానీ; పూర్వాపరాల అవగాహన లోపించినప్పుడు అవి కేవలం సొంత అభిమాన ప్రకటనలుగానో, రాజకీయఫ్రేరితాలుగానో తేలిపోతాయి. గాంధీకి బోస్ విషయంలో పూర్తి స్పష్టత
ఉంది. తమిద్దరివీ రెండు భిన్నమార్గాలుగానే చూశాడు. బోస్ దేశభక్తిని, సాహసప్రవృత్తిని ఆకాశానికి ఎత్తాడు. నీ మార్గంలో నువ్వు విజయం సాధిస్తే
మనస్ఫూర్తిగా అభినందిస్తానని కూడా ఒకసారి బోస్ కు రాశాడు. ఒకవేళ జపాన్-జర్మనీ కూటమే
గెలిచి ఉంటే ఆ విజయం బోస్ మార్గానికే దక్కి, భారత్ చరిత్రే భిన్నమైన
మలుపు తిరిగేది. కానీ అలా జరగలేదు. జపాన్-జర్మనీ ఓటమి బోస్
ను శాశ్వతంగా తెరమరుగు చేసి గాంధీ-నెహ్రూ భావజాలాన్ని విజయతీరం చేర్చింది.
ఒకవేళ కేంద్రం వద్ద ఉన్న రహస్యపత్రాలు కూడా వెల్లడై,
అన్నివిధాలా నెహ్రూనే విలన్ గా స్థాపించిన పక్షంలో, అప్పుడది
వేరే కథ!
(అయిపోయింది)