Tuesday, February 26, 2013

రాజ్ నాథ్ సింగ్ కూ, పల్లంరాజుకూ పోలికేమిటి?!

జస్ట్... సరదాగా!                        




ఈ ఫొటోల్లోని వ్యక్తులను మీరు గుర్తుపట్టే ఉంటారు.

ఒకరు బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్.  ఇంకొకరు మానవవనరుల అభివృద్ధి మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు.  ఒకాయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇంకొకాయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందినవారు. ఇద్దరి వయస్సులో పదకొండేళ్ళ తేడా ఉంది. రాజ్ నాథ్ సింగ్ 1951లో జన్మిస్తే పల్లంరాజు 1962లో జన్మించారు.

ఇద్దరి పేర్లలో రాజు ఉన్నాడు, ఇద్దరూ మంచి ఒడ్డూ పొడవూ ఉంటారు. సరే, బట్టతల కనిపిస్తూనే ఉంది. వీటిల్లో విశేషం ఏమీలేదు కానీ,  ఇంకేవో  పోలికలు వీరి మధ్య ఉన్నాయని మీకు అనిపించడంలేదా?

ఇద్దరి మధ్య అచ్చుగుద్దినట్లు పోలికలు ఉన్నాయని నేను కూడా చెప్పడం లేదు సుమండీ. ఆ మాటకొస్తే ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా పోలికలు అచ్చుగుద్దినట్లు ఉండాలనేమీలేదు. విడి విడిగా కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నుదురు  పోల్చి చూస్తే  వీరిద్దరి మధ్యా తేడాలు తప్పకుండా కనిపిస్తాయి.

కనీసం, ఒకరిని చూస్తే ఇంకొకరు గుర్తొచ్చేంతగానైనా వీరి మధ్య పోలిక లేదంటారా?


Sunday, February 24, 2013

హంతకునికి డబ్బు సంచులిచ్చి పంపిన ఓ భారత కథ


 భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. అందులో కుల, మత, లింగ, ధనిక, పేద తేడాలు లేవు. అయితే, ఈ నీతిని ఉల్లంఘించేవారూ ఉన్నా, అది వేరే చర్చ.  మరి మహాభారత రాజ్యాంగం ప్రకారం కూడా చట్టం ముందు అందరూ సమానమేనా? 

కాదని నాడీజంఘుడు అనే కొంగ-గౌతముడు అనే బ్రాహ్మణుని కథ చెబుతుంది. మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఈ కథ ఉంది.

సంగ్రహంగా కథ ఇదీ:  గౌతముడు కులధర్మం వదిలేసి ఒక బోయను పెళ్లి చేసుకున్నాడు. ధనసంపాదన కోసం కొంతమంది వర్తకులతో కలసి దేశాంతరం బయలుదేరాడు. వారు ఒక కీకారణ్యంలోంచి వెడుతుండగా ఒక అడవి ఏనుగు వారి మీదపడింది. ప్రాణభయంతో తలోవైపుకీ చెదిరిపోయారు. గౌతముడు ఒంటరిగా ముందుకు సాగాడు. అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. ఆ చెట్టు మీద నివసించే నాడీజంఘుడు అతనిని చూసి జాలిపడ్డాడు. ఆతిథ్యమిచ్చి అలసట తీరేలా సేవలు చేశాడు. నీకు కావలసినంత ధనమిస్తాడని చెప్పి తన మిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు దగ్గరకు పంపించాడు. రాక్షసరాజు అతనికి మోయలేనంత ధనమిచ్చి పంపించాడు. తిరిగి మర్రిచెట్టు దగ్గరకు వచ్చిన గౌతముని నాడీజంఘుడు యధాప్రకారం ఆదరించాడు. గౌతమునిలో ఒక దుర్మార్గపు ఆలోచన పుట్టింది. బాగా బలిసి ఉన్న ఈ కొంగ తనకు కడుపునిండా ఆహారమవుతుందనుకున్నాడు. నిద్రపోతున్న కొంగను కట్టెతో  బాది చంపేశాడు. మాంసం వలిచి మూట కట్టుకుని డొక్కను అక్కడే వదిలేసి ప్రయాణమయ్యాడు.

రోజూ తన దగ్గరకు వచ్చే నాడీజంఘుడు ఎంతకూ రాకపోయేసరికి విరూపాక్షుడు కీడు శంకించాడు. ఏం జరిగిందో తెలుసుకురమ్మని భటులను పంపించాడు. కొంగ డొక్కను చూసిన భటులకు జరిగింది అర్థమైంది. గౌతముడే కొంగను చంపి ఉంటాడని గ్రహించిన భటులు అతన్ని వెతికి పట్టుకుని బంధించి విరూపాక్షుని ముందు నిలబెట్టారు. ఈ కృతఘ్నుని చంపి తినెయ్యకుండా నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చారని విరూపాక్షుడు అన్నాడు. మాకు మాత్రం నీతి లేదా? ఈ పాపాత్ముని శరీరాన్ని మేమెలా తింటామని భటులు అన్నారు. అతన్ని తీసుకెళ్లి  గాయాలు అయ్యేలా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి తోసేశారు. ఆకలితో నకనకలాడుతూ ఆ సమీపంలోనే తిరుగుతున్న కుక్కలు కూడా అతన్ని సమీపించడానికి ఇష్టపడలేదు.

మిత్రుని మరణానికి దుఃఖించిన విరూపాక్షుడు కొంగ డొక్కను తెప్పించి దహనసంస్కారాలు చేశాడు. అంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. నాడీజంఘుడు నీకే కాదు, బ్రహ్మకు కూడా మిత్రుడే, అతడు తనను చూడడానికి ఈ రోజు రాకపోవడంతో బ్రహ్మ ఆందోళన పడుతున్నాడని చెప్పాడు. నువ్వు నాడీజంఘునికి దహనసంస్కారం చేసి వెళ్ళిన తర్వాత దగ్గరలోనే ఒక ఆవుదూడ తల్లి గోవు దగ్గర పాలు తాగుతుండగా దాని మూతికి అంటిన పాల నురగ గాలికి ఎగిరివెళ్లి చితి మీద పడిందనీ, దాంతో నాడీజంఘుడు బతికాడనీ , ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడనీ చెప్పాడు.

నాడీజంఘుడు వచ్చాడు. తనవల్ల బ్రాహ్మణునికి ఇంతటి దుర్దశ కలిగినందుకు నొచ్చుకున్నాడు. అతన్ని విడిచి పెట్టేలా వరమిమ్మని ఇంద్రుని కోరాడు. బ్రహ్మ ఉద్దేశం కూడా అదేనని దివ్యదృష్టితో తెలుసుకున్న ఇంద్రుడు నాడీజంఘుని కోరిక తీర్చాడు. విరూపాక్షుడు భటులను పంపించి గౌతముని డబ్బు మూటలు తెప్పించి అతనికి ఇప్పించాడు. గౌతముడు వాటిని మోసుకుంటూ, మాటి మాటికీ వెనుదిరిగి చూస్తూ తొట్రుపడుతూ వెళ్లిపోయాడు.

కృతఘ్నుని దేహాన్ని కుక్కలు కూడా తాకవని చెప్పడం ఈ కథలోని ప్రధాన ఉద్దేశం.  దాంతోపాటే, పశుపక్షులలో కూడా దయ, క్షమ ఉంటాయనీ;  మిత్రధర్మాన్ని, అతిథి మర్యాదను అవి కూడా పాటిస్తాయనీ చెబుతోంది. రాక్షసులను మనుషుల్ని తినే వారుగా  చిత్రిస్తూనే వారికీ  నీతి, మిత్రధర్మం ఉంటాయని అంటోంది. అలాగే ఒక వ్యక్తి భ్రష్టుడు, కృతఘ్నుడు, హంతకుడు కావడానికి కులంతో సంబంధంలేదని కూడా చెబుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ హత్య వంటి తీవ్ర నేరానికి పాల్పడిన గౌతముని శిక్షించకుండా విడిచి పెట్టడం, పైగా డబ్బు మూటలు ఇచ్చి మరీ పంపించడం నేటి మన అవగాహన రీత్యా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులన్న సహజన్యాయాన్ని ఇది తలకిందులు చేస్తోంది.

అది ఆ కాలపు నీతి అనీ, ఇప్పుడు కుల,మత,లింగ వివక్షకు తావులేని కొత్త నీతిని తెచ్చుకున్నాం కనుక పాత కథలు తవ్వుకోనవసరం లేదనీ ఎవరైనా అనచ్చు. పైపైన చూస్తే ఇది సమంజసంగానే కనిపిస్తుంది. కానీ కాస్త లోతుకు వెడితే అలా అనిపించదు. ఇవి పాతకథలే అయినా ఇలాంటివి  పొందుపరచిన భారత, భాగవత, రామాయణాదులు ఇప్పటికీ ప్రవచన, వ్యాఖ్యాన, కళారూపాలలో  ప్రచారంలోనే ఉన్నాయి. కాకపోతే, నేటి సామాజిక, రాజకీయ వాతావరణంలో ఇబ్బందికరంగా తోచే విషయాలను దాచి, పాక్షికంగా మాత్రమే వాటిని ప్రచారంలో ఉంచడం జరుగుతోంది. మరోవైపు, ఆ రచనల లోని  ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పీడిత వర్గాలు పోరాడుతున్నాయి. ఆ రచనల  విశిష్టతను బోధించే సామాజికవర్గాలకూ, వీరికీ మధ్య అర్థవంతమైన  సంభాషణ జరగడం లేదు.  రెండూ పరస్పర శత్రుశిబిరాలుగా  కొనసాగుతున్నాయి.  పీడితవర్గాలు ఆ రచనలలోని చెడును ఎత్తి చూపుతుంటే, వాటి సమర్థకులు మంచిని మాత్రమే చూడమంటున్నారు. కుల, మత, ప్రాంత, లింగభేదాలకు అతీతంగా అందరినీ ఆలోచింపజేసే నీతి, రాజనీతి, ధర్మం, మానవీయ విలువలకు సంబంధించిన అనేక మంచి విషయాలు ఈ రచనల్లో ఉన్నాయి.  అయినాసరే, తమకు ప్రతికూలమైన విషయాలు వాటిలో ఉన్నప్పుడు పీడిత సామాజికవర్గాలు ఉదారబుద్ధితో కేవలం మంచిని మాత్రమే చూడడం సాధ్యమేనా?

అదీగాక, ఈ రచనలను మన దేశ సాంస్కృతిక, జ్ఞాన వారసత్వంలో భాగంగా గుర్తించినప్పుడు ఈ వారసత్వానికి పాత/కొత్త అన్న హద్దులు ఎలా గీస్తాం? అది మంచిదీ కాదు, సాధ్యమూ  కాదు. వాటిని దేశ వారసత్వంగా గుర్తించినప్పుడు నేటి ప్రజాస్వామిక యుగ లక్షణానికి అనుగుణంగా అన్ని సామాజికవర్గాలూ ఆ వారసత్వంపై హక్కుదారులే అవుతారు. ఇంకాస్త సూటిగా చెప్పాలంటే ఒక దళితుడు, లేదా మరో పీడితవర్గానికి చెందిన వ్యక్తి భారత,భాగవత, రామాయణాదులను సొంత ఆస్తిగా భావించుకునే  అవకాశం ఉండాలి. అంటే, వారికి ప్రతికూలమైన అంశాలను తొలగించి ఆ రచనలను కుల తటస్థంగా మార్చాలి. మొత్తం సాంస్కృతిక వారసత్వాన్నే  ప్రజాస్వామికీకరించి దానిని ఉమ్మడి వారసత్వంగా మార్చాలి.

అలా అనడం తేలికే కానీ, అందుకు ఏం చేయాలన్నదే అసలు ప్రశ్న.  ప్రతికూల కథలను, ఘట్టాలను తొలగించడం ఒక మార్గమా? అలా అయితే, ఆ రచనలకు, అందులోని భావాలకూ గల చారిత్రకతకు నష్టం కలుగుతుంది. వాటిని అన్నిటినీ ఒకచోట పొందుపరచి అనుబంధంగా ఇస్తూనే వాటిని ఆమోదయోగ్యం కానివిగా ప్రకటించి కుల తటస్థ పాఠాన్ని రూపొందించడం మరో మార్గమా?

మొదట ఉమ్మడి పాఠం అవసరాన్ని అందరూ గుర్తించగలిగితే, అది ఎలా చేయాలన్నది తర్వాతి ప్రశ్న.

                                                              ('సూర్య' దినపత్రికలో ఫిబ్రవరి 10, 2013న ప్రచురితం)
                                                                                                      


Saturday, February 23, 2013

హోం మంత్రిత్వం నుంచి చిదంబరంను ఎందుకు తప్పించారు?

హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లో గురువారం నాడు రెండు బాంబు పేలుళ్లు జరిగి 16 మంది చనిపోవడం, 120 మంది గాయపడడం ఊహించని ఘాతుకం. సామాన్యజనానికి ఇప్పటికీ ఉగ్రవాదుల రూపంలో మృత్యువు అడుగడుగునా పొంచి ఉందనడానికి ఇది నిదర్శనం. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి సానుభూతి తెలియజేయడం కన్నా మనం చేయగలిగింది లేదు.

కేంద్రం రాష్ట్రానికి నిర్దిష్టంగా ఇంటెలిజెన్స్ సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయింది;  కిందటి సంవత్సరం ఉగ్రవాదులు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్టు సమాచారం ఉన్నా, రెక్కీ నిర్వహించిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పలువురు తీహార్ జైలులో ఉన్నా బాంబు పేలుళ్లను ఎందుకు నివారించలేకపోయారన్న ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర పోలీసుల వైఫల్యం ఉందా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సందర్భాలలో వైఫల్యం ఎక్కడ ఉందో పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలకే తప్ప మామూలు మనుషులకు తెలిసే అవకాశం లేదు. ఎన్నో ఉగ్రవాద ఘాతుకాలను ఇంటెలిజెన్స్, పోలీస్ వర్గాలు ముందుగానే నిరోధించగలిగాయనీ, వాటికి ప్రచారం, ప్రశంస ఉండవనీ, ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయనీ ఆ వర్గాలు అంటూ ఉంటాయి. కానీ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల అనుభవంతో పోల్చితే ఇది పస లేని వాదంగానే తేలిపోతుంది. నిఘాలో, నిఘా యంత్రాంగంలో ఎక్కడో లోపం ఉండడం తప్ప ఈ వైఫల్యానికి మరో కారణం ఊహించలేం.

సరే, ఈ చర్చను నిపుణులకు వదిలేద్దాం. మామూలు మనుషులు కూడా వేయదగిన ప్రశ్నఒకటుంది.  హోం మంత్రిత్వం నుంచి చిదంబరం ను తప్పించి, సుశీల్ కుమార్ షిండేకు ఆ బాధ్యత ఎందుకు అప్పగించారు?

26/11 ముంబై బాంబు పేలుళ్లపై వెల్లువెత్తిన జనాగ్రహానికి స్పందించి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం శివరాజ్ పాటిల్ స్థానంలో చిదంబరంను హోం మంత్రిగా నియమించింది. శివరాజ్ పాటిల్ అసమర్థ హోం మంత్రి అన్న విమర్శలు అప్పటికి కొంతకాలంగా ఉన్నాయి. రోజుకు నాలుగైదు రకాల దుస్తులు మార్చడంలో ఉన్న శ్రద్ధ ఆయనకు పోలీసింగ్ పై లేదని అనేవారు. 26/11 ఘటన జరిగిన రాత్రి కూడా ఆయన దుస్తులపై మోజుకే ప్రాధాన్యం ఇచ్చారట. ఎట్టకేలకు ఆయనను తప్పించారు. మరుసటి సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, శివరాజ్ పాటిల్ ను కొనసాగించి మరిన్ని విమర్శలు మూటగట్టుకోవడం పార్టీకి ప్రయోజనకరం కాదన్న దృష్టి కూడా ఈ మార్పును ప్రభావితం చేసి ఉండచ్చు. అదే సమస్య. ఎన్నికల దృష్టి  దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన నిర్ణయాలను సైతం ప్రభావితం చేయగలిగేలా ఉండడమే విషాదం.

చిదంబరం నిజంగానే వ్యవస్థలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) ఏర్పాటు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్.ఎస్.జీ)ను దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరింపజేయడం, తీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం, ఇంటెలిజెన్స్ వర్గాల మధ్య సమన్వయ, సహకారాలు పెరగడానికి చర్యలు తీసుకోవడం వగైరాలు వాటిలో కొన్ని. అయితే, ఎన్.ఐ.ఏ గొప్పగా ఫలితాలు సాధించలేదన్న విమర్శ కూడా ఉంది. అందుకు కారణాలను సంస్థాగతంగానే వెతకవలసి ఉంటుంది. నేషనల్ కౌంటర్ టెర్రరిస్ట్ సెంటర్(ఎన్.సీ.టీ.సీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మాత్రం రాష్ట్రాలనుంచి వ్యతిరేకత వచ్చింది. హైదరాబాద్ ఘటన దరిమిలా అది కూడా చర్చలోకి వస్తోంది. వెంటనే ఎన్.సీ.టీ.సీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చిదంబరం ప్రధానికి లేఖ రాసినట్టు సమాచారం.

వ్యవస్థలో సమూల పరివర్తన తేవడానికి సమయం పడుతుంది. హోం మంత్రిగా చిదంబరం ఆ పరివర్తన ప్రయత్నం పై పట్టు సాధించి దానిని మరింత ముందుకు తీసుకు వెళ్ళే పనిలో తలమునకలవుతూ ఉంటారనడంలో సందేహం లేదు. ఇంతలోనే ఆయనను హోం మంత్రిత్వం నుంచి ఎందుకు తప్పించినట్టు? మంత్రుల నియామకం, శాఖల కేటాయింపు ప్రధాని విశేషాధికారంలోకి వస్తాయి కనుక ప్రశ్నించడానికి వీలులేదన్న మాట నిజమే. అయినాసరే, హైదరాబాద్ ఘటన నేపథ్యంలో చిదంబరంను హోం మంత్రిత్వం నుంచి తప్పించడం లోని ఔచిత్యాన్ని సందేహించకుండా ఉండడం కష్టం.

ఒక కారణం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థికమంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేశారు కనుక, ఆయన తర్వాత  ప్రధాని దృష్టిలో చిదంబరమే ఆర్థికమంత్రిత్వ శాఖకు సహజమైన ఛాయిస్ కావడంలో మామూలు పరిస్థితులలో ఆశ్చర్యం లేదు. ఇదే సమయంలో టైమ్ మ్యాగజైన్ మన్మోహన్ సింగ్ ఆర్థికరంగంలో గొప్పగా ఏమీ సాధించలేదంటూ ముఖపత్ర కథనాన్ని ప్రచురించింది. చిదంబరానికి తిరిగి ఆర్థికమంత్రిత్వం అప్పగించడం ద్వారా ఆ అప్రతిష్ట నుంచి కొంతైనా బయటపడచ్చని మన్మోహన్ సింగ్ అనుకుని ఉండచ్చు. అంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం హోం మంత్రిత్వశాఖను, దేశభద్రతా ప్రయోజనాలను పణంగా పెట్టారా అన్న అభిప్రాయం కలుగుతుంది. 26/11 తర్వాత ఉగ్రవాదుల దాడులు పూర్తిగా తగ్గకపోయినా వెనకటితో పోలిస్తే, తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. చిదంబరంను హోం మంత్రిత్వ శాఖనుంచి తప్పించడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. ఉగ్రవాదుల దాడులు తగ్గాయన్న ప్రభుత్వం భరోసా రాష్ట్రపతి పార్లమెంట్ ప్రసంగంలో కూడా వ్యక్తం కావడం గమనార్హం. ఆ ప్రసంగం రోజునే హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగాయి.

చిదంబరంను తప్పించి షిండేను హోం మంత్రిని చేయడంలో మన్మోహన్ సింగ్ క్షేత్రవాస్తవికతను సరిగా అంచనా వేయలేకపోయారా? అదే నిజమైతే అంతకంటే దురదృష్టం ఉండదు.

పోలిక చూడండి...సరిగ్గా 2009 ఎన్నికలముందే, 26/11 దాడులను పురస్కరించుకుని అసమర్థ హోం మంత్రిగా ముద్రపడిన శివరాజ్ పాటిల్ ను తప్పించారు. ఇప్పుడు 2014 ఎన్నికలముందు, హైదరాబాద్ బాంబు పేలుళ్ళ నేపథ్యంలో హోం మంత్రిగా షిండే సమర్థతపై విమర్శలు పుంజుకుంటున్నాయి. కొన్ని సందర్భాలు పునరావృతమవుతాయంటారు. ఇది అలాంటి ఒక సందర్భం కావచ్చు. శివరాజ్ పాటిల్ విషయంలో తీసుకున్న చర్యనే షిండే విషయంలోనూ తీసుకుంటారా?! వేచి చూడవలసిందే.

ఇండియన్ ముజాహిదీన్ లాంటి టెర్రరిస్టు మాడ్యూళ్లను ఒక్కటి కూడా లేకుండా తుడిచిపెడతామని ఇప్పుడు శపథం చేస్తున్నారు.  ఇలాంటి శపథం చేయడం ఇది ఎన్నోసారి? ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టడంతో మాడ్యూళ్ళ వేట మందగించిందని అనుకోవాలా?! 

Thursday, February 21, 2013

జలియన్ వాలా బాగ్ లో ఏం జరిగింది?

బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ ఫిబ్రవరి 20న అమృతసర్ లోని జలియన్ వాలా బాగ్ స్మారక నిర్మాణాన్ని  సందర్శించి అమరవీరులకు నివాళి అర్పించారు. 1919 ఏప్రిల్ లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోత బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత సిగ్గుమాలిన ఘటనగా సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆయన భారతదేశానికి క్షమాపణ చెబితే బాగుండేదని కొందరు అన్నారు. స్మారకస్థలిని సందర్శించి, అమరవీరులకు నివాళి అర్పించడం క్షమాపణ చెప్పడంతో సమానమేనని ఒక రిద్దరు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ దారుణ ఘటన జరిగిన గత 94 ఏళ్లలో జలియన్ వాలా బాగ్ మృతులకు నివాళి అర్పించిన  తొలి బ్రిటిష్ ప్రధాని ఆయనే.

ఇంతకీ జలియన్ వాలా బాగ్ లో ఏం జరిగిందో, దాని పూర్వాపరాలు ఎలాంటివో క్లుప్తంగా చెప్పుకుందాం:

1919 ఏప్రిల్ 13, ఆదివారం... హిందువులు, సిక్కులూ కూడా పవిత్రంగా భావించే బైశాఖి దినం. గాంధీ నాయకత్వంలో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళన పంజాబ్ తదితర ప్రాంతాలలో హింసాత్మక రూపం ధరించగా, పంజాబ్ లో సైనిక శాసకునిగా జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ను నియమించారు. డయ్యర్ అమృతసర్ లో బహిరంగ సమావేశాలు నిషేధించాడు. ఆ సంగతి తెలియని 10 వేల మంది హిందువులు, సిక్కులు జలియన్ వాలా బాగ్ లో సమావేశమయ్యారు. అది మూడు వైపులా అయిదడుగుల ఎత్తు గోడలున్న మైదానం.

డయ్యర్ ఓ యాభైమంది సైనికులతో వచ్చి మైదానం ప్రవేశ ద్వారాన్ని కమ్మేశాడు. బయటకు వెళ్లడానికి అదొక్కటే మార్గం. చెదిరిపోమని కనీసం ఒక్క హెచ్చరిక కూడా చేయకుండా కాల్పులకు ఆదేశించాడు. గూర్ఖా, బలోచీ రెజిమెంట్లకు చెందిన భారతీయ సైనికులు పది నిమిషాలపాటు కాల్పులు జరిపారు. దాదాపు తూటాకు ఒకరు చొప్పున నేల కొరిగారు. 379 మంది మరణించినట్టు, వెయ్యి మంది గాయపడినట్టు అధికారికంగా ప్రకటించారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ.

ఈ ఘటనకు పూర్వ రంగం:


1919 ఫిబ్రవరిలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో రౌలట్ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వాటి ప్రకారం, ఎవరైనా దేశద్రోహచర్యలకు పాల్పడినట్టు ఏ చిన్న ఆధారం దొరికినా, విచారణ లేకుండా అరెస్ట్ చేయచ్చు. అప్పీలుకు కూడా అవకాశం ఇవ్వకుండా రెండేళ్ళు జైల్లో పెట్టచ్చు, రౌలట్ అనే జడ్జీ నాయకత్వంలో రూపొందిన బిల్లులు కనుక వాటికి ఆయన పేరే పెట్టారు.

అప్పుడప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న గాంధీ ఆ బిల్లులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించడానికి నిర్ణయించారు. మొదట వల్లభ్ భాయ్ పటేల్ సాయం కోరారు. పటేల్ సరే ననడంతో  20 మందిని సమావేశపరచి సత్యాగ్రహానికి సంసిద్ధం చేశారు. వారిలో కవయిత్రి సరోజినీ నాయుడు కూడా ఉన్నారు. 1857 తర్వాత మొదటిసారిగా వీరందరూ బ్రిటిష్ చట్టాలను ధిక్కరిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. ఈ ఘటన బ్రిటిష్ సామ్రాజ్యచరిత్రను గొప్ప మలుపు తిప్పుతుందని గాంధీ ఊహించారు.

అయితే, చట్ట ధిక్కారానికి కాంగ్రెస్ సిద్ధం కాలేదు. దాంతో సత్యాగ్రహ సభ పేరుతో గాంధీ కొత్త సంస్థను ఏర్పాటుచేశారు. ఢిల్లీ వెళ్ళి వైస్రాయిని కలసి రౌలట్ బిల్లులపై వ్యతిరేకత తెలిపారు. అదే సమయంలో మహమ్మదాలీ జిన్నా, శ్రీనివాస శాస్త్రి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో బిల్లులకు వ్యతిరేకంగా ప్రసంగించారు. గాంధీ అక్కడినుంచి మద్రాసు వెళ్లారు. అక్కడ రాజగోపాలాచారికి అతిథిగా ఉన్నారు. అప్పుడే రౌలట్ బిల్లులలో ఒకదానిని చట్టం చేసినట్టు గాంధీకి తెలిసింది. మరునాడు, మార్చ్ 23న తెల్లవారుజామున 'నిద్రకూ, మెలకువకూ మధ్య' గాంధీకి ఒక ఊహ కలిగింది. మరుసటి ఆదివారం సమ్మెచేయమని యావద్భారతానికీ పిలుపు ఇవ్వాలనుకున్నారు. రాజగోపాలాచారి అందుకు ఆమోదం తెలిపారు. మార్చ్ 30న సమ్మెకు పిలుపు ఇచ్చిన గాంధీ తర్వాత దానిని ఏప్రిల్ 6కు మార్చారు. అయినాసరే ఢిల్లీ మద్దతుదారులు మార్చ్ 30నే సమ్మెకు సిద్ధమయ్యారు.

సమ్మె పిలుపుకు భారతదేశం అత్యద్భుతంగా స్పందించింది. మిగిలిన చోట్ల కంటే పంజాబ్ ఎక్కువగా అట్టుడికింది. గాంధీ మద్రాసు నుంచి బొంబాయి చేరుకున్నారు. పంజాబ్ వచ్చి అక్కడి ఉద్రిక్తతను చల్లార్చవలసిందిగా పంజాబ్ నాయకులు గాంధీపై ఒత్తిడి తెచ్చారు. గాంధీ ఏప్రిల్ 8న మహదేవ్ దేశాయిని వెంటబెట్టుకుని పంజాబ్ కు రైలులో బయలుదేరారు. బ్రిటిష్ అధికారులు ఆయన పంజాబ్ ప్రవేశాన్ని నిషేధించి బలవంతంగా తిరిగి బొంబాయి పంపేశారు. ఆ సందర్భంలో గాంధీ కొంత దూరం గూడ్సు బండిలో ప్రయాణం చేశారు.

పంజాబ్ లో హింస చెలరేగింది. అయిదారుగురు యూరోపియన్లను హతమార్చారు. మిస్ షేర్వుడ్ అనే ఆంగ్ల యువతిపై అత్యాచారం జరిగింది. జనరల్ సర్ రెజినాల్డ్ డయ్యర్ ను పంజాబ్ లో సైనిక శాసకునిగా నియమించారు.

ఆ తర్వాత...

జలియన్ వాలా బాగ్ ఊచకోతపై దర్యాప్తుకు బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ ను నియమించింది. దానికి నిర్దేశించిన విచారణాంశాలపై అసంతృప్తి ప్రకటించిన కాంగ్రెస్ సొంతంగా దర్యాప్తు జరపడానికి నిశ్చయించి గాంధీ, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ఎం.ఆర్. జయకర్, అబ్బాస్ త్యాబ్జీలతో కమిటీని వేసింది. కమిటీ పని భారాన్ని చాలావరకు గాంధీయే మోశారు. మూడు మాసాలపాటు పంజాబ్ లో తిరిగి ప్రత్యక్ష సాక్షులను విచారించి నివేదికను తనే తయారు చేశారు. జలియన్ వాలా స్మారక నిర్మాణానికి విరాళాలు సేకరించారు. మొదట్లో అందుకు తగిన స్పందన లేకపోవడంతో అవసరమైతే తన అహ్మదాబాద్ ఆశ్రమాన్ని అమ్మేసి అయినా నిధులు సమకూర్చుతానని గాంధీ ప్రకటించారు. అప్పుడు జనం ముందుకు వచ్చారు. 

1920 మే నెలలో హంటర్ కమిషన్ నివేదిక వెలువడింది, గాంధీ నివేదికలోని అంశాలనే అది ధ్రువీకరించింది. అయితే పంజాబ్ గవర్నర్ మైకేల్ ఒడ్వయర్ ను నిర్దోషిగా పేర్కొని విడిచిపెట్టింది. డయ్యర్ ను సైనిక నాయకత్వం నుంచి తప్పించింది. 

కొసమెరుపు

బ్రిటన్ ఎగువసభ(హౌస్ ఆఫ్ లార్డ్స్) డయ్యర్ ఊచకోతకు మెజారిటీ వోటుతో ఆమోదం తెలిపింది. బ్రిటిష్ అభిమానులు అతనికి ఒక కరవాలాన్నీ, 20 వేల పౌండ్లనూ బహూకరించి సత్కరించారు! 


Tuesday, February 19, 2013

ప్రతి యుద్ధోన్మాదీ ఈ బాలచంద్రుని హత్యకు బాధ్యుడే

ఈ ఫోటోను ఈ పాటికి చాలామంది చూసి ఉంటారు. కడుపు తీపి తెలిసిన తల్లులు, తండ్రుల పేగు కదలి ఉంటుంది. ఇతని పేరు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్ల నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ కొడుకు. ఇతని పేరు వినగానే పల్నాటి యుద్ధంలో మరణించిన బాలచంద్రుడి పేరు గుర్తొస్తోంది కదూ. అయితే, పల్నాటి బాలచంద్రుడు యుద్ధం చేసి మరణించాడు. నిరాయుధుడైన ఈ బాలచంద్రుడు శ్రీలంక సైనికులకు చిక్కాడు. వారు అతనికి బిస్కట్లు ఇచ్చి ఆ తర్వాత దగ్గరనుంచి ఛాతీకి గురిపెట్టి అయిదు తూటాలు పేల్చి చంపారు! అలా చంపడానికి రెండు గంటల ముందు తీసిన ఫోటో ఇది. తన ఆయువు ఇక రెండు గంటలే నన్న సంగతి ఈ బాలచంద్రునికి తెలియదు.

చంపిన సైనికుల్లో కొందరైనా పిల్లల తండ్రులుంటారు. ఈ బాలుని చంపేటప్పుడు వాళ్ళకు తమ పిల్లలు గుర్తొచ్చేరో లేదో తెలియదు. చంపడానికి ముందూ, చంపిన తర్వాతా వారు ఈ బాలుని ఫోటోలు తీశారు. ఎందుకు తీశారనుకుంటున్నారా? ఈ ఫోటోలు పైవారికి చూపిస్తే వారికి పతకాలు, ప్రమోషన్లు, నగదు బహుమతులు లభిస్తాయి. వారిని దేశభక్తులుగా గుర్తిస్తారు. బాలుని రక్తం చవి చూసిన ఈ కర్కోటక చర్యనే దేశభక్తిగా గుర్తించవలసివస్తే అలాంటి 'దేశభక్తి'ని ఎవరు కోరుకుంటారు?! శ్రీలంక సైనికులే కాదు అనేక దేశాల సైనికులు ఇలాంటి 'దేశభక్తి'ని తరచు ప్రకటించుకుంటూనే ఉంటారు.

 సైనికులనే అనుకోవడం దేనికి? తెల్లని పంచె, లాల్చీ, కండువా ధరించి సంస్కారవంతులుగా, నాగరికులుగా కనిపించేవారిలో కూడా సైనికులను తలదన్నే కరకు గుండెల వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం స్వామి లాంటివారు. తమిళ టైగర్లు ఇంతకంటే దారుణాలు చేశారని ఆయన అన్నారు. వారు పిల్లలకు కూడా సైనికశిక్షణ ఇచ్చి యుద్ధంలో ఉపయోగించుకున్నారనీ, ఈ బాలుడు కూడా 'క్రాస్ ఫైరింగ్' లో ప్రాణాలు కోల్పోయి ఉండచ్చనీ శ్రీలంక సైనికులను వెనకేసుకువచ్చారు. చొక్కా కూడా లేని ఈ బాలుడి ఫోటోలు చూస్తే ఇతడు యుద్ధంలో ఉన్నాడనీ, క్రాస్ ఫైరింగ్ లో చనిపోయాడంటే ఎవరూ నమ్మలేరు.

తమిళ టైగర్లు కూడా ఎన్నో ఘాతుకాలు చేసిన మాట నిజమే. అంతమాత్రాన ఈ బాలుని నిర్దాక్షిణ్య వధను సమర్థించగలమా? తమిళ టైగర్ల అధినేతను కూడా చంపేసి, తిరుగుబాటును నిర్వీర్యం చేసిన స్థితిలో ఈ బాలుని చంపవలసిన అవసరం ఏమొచ్చింది? పతకాలు, ప్రమోషన్లను మించి ఇంకే కారణం ఉంటుంది?

ఇంతకీ చంపడం, చావడం నిత్యకృత్యంగా, వీరోచితచర్యగా, గౌరవప్రదంగా భావించిన ఒకనాటి అనాగరిక దశనుంచి మనం ముందుకు వెళ్ళామా? అంతకంటే అనాగరిక, ఆటవిక దశకు తిరోగమించామా?

మహాభారతయుద్ధ సమయంలో కూడా అటువారు, ఇటువారు కూడా కొన్ని యుద్ధ నియమాలు పెట్టుకున్నారు. యుద్ధనీతి అవసరాన్ని గుర్తించారు. అక్కడక్కడ ఉల్లంఘనలు జరగడం వేరే విషయం. యుద్ధం వల్ల జరిగే జనక్షయాన్ని, ఇతర నష్టాలను  తలచుకుని ధర్మరాజే కాదు; మహావీరుడైన అర్జునుడు కూడా కలతచెందాడు. అయినాసరే, యుద్ధాన్ని, యుద్ధం పేరుతో జరిగే అనేకానేక అమానుషాలను దేశభక్తి పేరుతోనో, మరో పేరుతోనో నేటికీ సమర్థిస్తున్న మనం మహాభారతకాలం నుంచి ఎంత పురోగమించగలిగాం? నాగరికుల మనిపించుకోడానికి  మనం అర్హులమేనా?

బాలచంద్రుని నెత్తుటి  మరకలు అంటిన చేతులు కేవలం శ్రీలంక సైనికులవే ననుకోవడం పొరపాటు. ప్రపంచంలోని ప్రతి యుద్ధోన్మాది చేతులకూ అంటిన నెత్తుటి మరకలు అవి!


గాంధీ గురించి ఎంత తెలుసు?!

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి మనలో ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతవరకు తెలుసు?

ఎదుటివారి తెలియనితనాన్ని ఎత్తి చూపడానికి ఈ ప్రశ్నలు  వేస్తున్నానని దయచేసి అనుకోకండి. నన్ను కూడా కలుపుకునే ఆ ప్రశ్నలు వేశాను.  గాంధీ గురించి నాకేమీ తెలియదని-ఈ మధ్య ఆయన గురించి రాసిన ఒక పెద్ద పుస్తకాన్ని తెలుగులోకి అనువదించేవరకూ  నాకు కూడా తెలియదు. అనువదిస్తున్న రోజుల్లో నా అజ్ఞానానికి నన్ను నేను ప్రతిరోజూ నిందించుకున్నాను. విద్యార్థి దశనుంచీ గాంధీ గురించి ఈ దేశ ప్రజలకు సమగ్రంగా తెలియజెప్పని విద్యావ్యవస్థను నిందించాను.  గాంధీ గురించి తీయవలసినన్ని సినిమాలు తీయనందుకు సినిమారంగాన్ని నిందించాను. ఒక రాముడి కథలా, ఒక కృష్ణుడి కథలా గాంధీ కథను ప్రచారంలో ఉంచనందుకు ప్రచారసాధనాలను నిందించాను.

ఊరూరా గాంధీ శిలా విగ్రహాలను స్థాపించడం వల్లా, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ముద్రించడం వల్లా ఆయన రూపం ఒక్కటే మనందరికీ బాగా తెలుసు. అందులోనూ తమాషా చూడండి...చేతిలో కర్ర, బోడి తల, బోసినవ్వు, మోకాలివరకు అంగోస్త్రంతో ఉన్న గాంధీ రూపం ఒక్కటే మనకు బాగా తెలుసు. పసిపిల్లలు కూడా చటుక్కున గుర్తించే ఆ రూపం మనలో ఎంతగా ముద్రపడిపోయిందంటే, పుడుతూనే గాంధీ ఆ రూపంతో పుట్టాడా అన్నంతగా!
బాల గాంధీ, కౌమార గాంధీ, యువ గాంధీ, నడివయసు గాంధీల ఫోటోలు చూపించి 'ఈయనే గాంధీ' అంటే, 'ఈయనేం గాంధీ?' అన్న ప్రశ్న ఎదురైనా ఆశ్చర్యం లేదు. సూటు, బూటు, క్రాపు, నల్లని మీసకట్టుతో ఉన్న గాంధీని గాంధీగా పోల్చుకోవడం ఈ రోజున చాలా కష్టం.

ఒక వ్యక్తి జ్ఞాపకాన్ని శిలా విగ్రహ రూపంలో ఘనీభవింపజేసే సంస్కృతి ఈ పరిస్థితికి కారణమా అనిపిస్తుంది. ఒక వ్యక్తిని శిలా విగ్రహంగా మార్చి -అది కూడా ఒకే ఒక రూపంలో, భంగిమలో- ఊరూరా ప్రతిష్టించడమంటే; అతని సమగ్రచరిత్రను, అతని ఆదర్శాలను, అతని ఆశయాలను ఆ విగ్రహం కింద సమాధి చేయడమే నని కూడా అనిపిస్తుంది. మా రోజూ వారీ కార్యక్రమాలకూ, రాజకీయాలకూ దయచేసి అడ్డు రావద్దని ప్రార్థించడానికా అన్నట్టుగా  జయంతికీ, వర్ధంతికీ ఆ వ్యక్తి మెడలో ఓ దండ వేసి దణ్ణం పెట్టడం జాతి ఆ వ్యక్తి పట్ల చూపించే కృతజ్ఞత!

దీనిని బట్టి  విగ్రహ సంస్కృతికీ విజ్ఞాన సంస్కృతికీ మధ్య ఆజన్మశతృత్వం ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగుతుంది.

భారతదేశంలో గాంధీ నిర్వహించిన పాత్ర గురించే మనలో చాలామందికి తెలియవలసినంత తెలియనప్పుడు; ఆ పాత్రకు కావలసిన పూర్వరంగాన్ని, అనుభవాన్ని కల్పించిన గాంధీ దక్షిణాఫ్రికా జీవితం గురించి  తెలిసే అవకాశం అసలే లేదు. నిజానికి భారతదేశంలో గాంధీ నిర్వహించిన పాత్ర కన్నా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పాత్ర మరింత ఆసక్తికరం, మరింత నాటకీయం. గాంధీ యవ్వనంలో, నడి వయసులో నిర్వహించిన పోరాటం అది.

గాంధీ గురించి ఈ రోజున తెలుసుకోవడం ఏమంత కష్టం? ఆయన మీద వచ్చిన పుస్తకాలు ఎన్ని లేవు? అంతగా ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు కదా? అని ఈ పాటికి ఇది చదువుతున్నవారు అనుకోవచ్చు. నిజమే. పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే పుస్తకాలు చదివే సంస్కృతి దేశంలో బలపడిందా? అందులోనూ ఉద్గ్రంథాలు చదివే ఓపిక, తీరిక జనంలో ఉన్నాయా? మౌఖిక ప్రచారం ద్వారా, కళారూపాల ద్వారా విజ్ఞాన వ్యాప్తి అవసరం ఈ దేశంలో అంతరించిందని చెప్పగలమా?...ఇలా ఎన్నో అనుమానాలు!

గాంధీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను 'గాంధీని తెలుసుకుందాం' అనే శీర్షికతో అప్పడప్పుడు బ్లాగ్ పాఠకులతో పంచుకుంటే ఎలా ఉంటుందనిపించే ఈ ఉపోద్ఘాతం.

ఇప్పుడే మీకు ఇంకో విషయం కూడా తెలియజేయదలచుకున్నాను. నేను గాంధీ అభిమానినని చెప్పలేను. గాంధీకి వ్యతిరేకిననీ చెప్పలేను. గాంధీలో నాకు సరిపడని కొన్ని వైపరీత్యాలూ ఉన్నాయి. అయితే గాంధీ నిస్సందేహంగా నేటి తరం భారతీయులందరూ తెలుసుకోవలసిన, అధ్యయనం చేయదగిన వ్యక్తి.

నా ప్రతిపాదనపై దయచేసి మీ స్పందన తెలియజేయండి.






Sunday, February 17, 2013

రాజమండ్రి నుంచి నల్లజెర్ల మీదుగా ఎప్పుడైనా ఏలూరు వెళ్ళారా?!

కొన్ని రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్లడానికి హైదరాబాద్ నుంచి కారులో ఖమ్మం మీదుగా  కాకినాడకు బయలుదేరాం. అది  టూ లేన్ రోడ్డు. చాలావరకు బాగానే ఉంది కానీ కొన్నిచోట్ల దెబ్బతింది. దూరమూ, సమయమూ కలిసొస్తాయని ఈ రూటులో బయలుదేరాం.  అక్కడక్కడ రోడ్ల పరిస్థితి చూసిన తర్వాత అదే  పొరపాటైందనిపించింది. తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాం.

 అలాగే తిరుగు ప్రయాణంలో రాజమండ్రి, కొవ్వూరు, పంగిడి, నల్లజెర్ల మీదుగా విజయవాడకు బయలుదేరాం. కొంతదూరం వెళ్ళిన తర్వాత,  ఈ రూటు కంటే ఖమ్మం రూటే వెయ్యిరెట్లు నయమనిపించింది.  భీమడోలు వరకూ కొన్ని చోట్ల రోడ్డు తవ్వేశారు.  దాంతో కంకర రాళ్ళు పైకి తేలాయి.  పెద్ద పెద్ద గోతులు, గతుకులు, మట్టి దిబ్బలు  ఏర్పడ్డాయి.  వాటి మీదనుంచి పడుతూ లేస్తూ ప్రయాణించడం మట్టి రోడ్లపై ప్రయాణం కన్నా కూడా అధ్వాన్నం అయింది.  ఎదురుగా ఏముందో కనిపించని స్థాయిలో లారీలు, బస్సుల వంటి భారీ వాహనాలు  కొన్ని అడుగుల ఎత్తున దుమ్ము రేపుతూ వెడుతున్నాయి. కారులో వెళ్ళే వారు విండో తలుపులు మూసుకున్నా, బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాలపై వెళ్ళేవారు ఆ దుమ్ము కొట్టుకుంటూ, దానినే  పీలుస్తూ వెళ్లవలసిందే. అది వాళ్ళ ఆరోగ్యానికి ఎంత చెరుపు చేస్తుందో ఊహించుకోగలం.

దారి పొడవునా సేద్యపు నీటి కాలువలు ఉన్నాయి. వాటిల్లో నీరు ప్రవహిస్తోంది.  ఈ కాలువల నిర్మాణం కోసమే  అటూ ఇటూ కొంత మేర రోడ్డు తవ్వేసినట్టు అర్థమైంది. ఖమ్మం నుంచి వెళ్ళే రూటులో కూడా గోపాలపురం దాటిన తర్వాత  కొన్ని వేల గజాల మేర ఇలాగే రోడ్డు తవ్వేశారు.  విచిత్రం ఏమిటంటే నాలుగైదేళ్ళ నుంచీ ఈ రోడ్డు ఇదే స్థితిలో ఉంది. కాలువల నిర్మాణం పూర్తయినా తవ్వేసిన చోట్ల పక్కా రోడ్డు వేయలేదనీ,  ఈ దుస్థితికి అదే కారణమనీ అర్థమైంది. పక్కా రోడ్డు ఎందుకు వేయలేదంటే, కాలువల నిర్మాణం ఇరిగేషన్ శాఖ బాధ్యత. రోడ్డు నిర్మాణం రోడ్లు-భవనాల శాఖ బాధ్యత. ఆ రెండు శాఖల మధ్య సమన్వయం, సహకారం, ఉమ్మడి టైమ్ టేబుల్  లేవన్న మాట. ఇంతకు మించి మరో కారణం కనిపించడం లేదు. ఈవిధంగా రెండు శాఖలూ కలసి రోడ్డు వినియోగదారులకు నరకం చూపిస్తున్నాయి. వాళ్ళ ఆరోగ్యాలకు చెరుపు తెస్తున్నాయి. ఇరిగేషన్, రోడ్లు-భవనాల శాఖల మంత్రుల మధ్య కూడా సమన్వయం, సహకారం లేవని దీనినిబట్టి అనుకోవాలి.

ఏళ్ల తరబడిగా ఈ రోడ్డుమీద ప్రయాణించే జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు; రాజకీయనాయకులు ఈ సమస్యను ఎందుకు గుర్తించలేదో, పరిష్కారానికి ఎందుకు పూనుకోలేదో అర్థంకాదు. ప్రజల సౌకర్యాలపట్ల, ప్రజారోగ్యం పట్ల  ఖాతరు లేకపోవడం తప్ప ఇందుకు వేరొక కారణాన్ని ఊహించలేం.

ఇంతటితో అయిపోలేదు. ఈ రోడ్డు మీద ఇంతకంటే ఘోరమైన దృశ్యాలు కనిపించాయి. గౌరీపట్నంతో మొదలుపెట్టి  దేవరపల్లి దాటే వరకు తామర తంపరలా ఎన్నో స్టోన్ కటింగ్ యూనిట్లు కనిపించాయి. భారీ ఎత్తున రాళ్ళు కొట్టే కార్యక్రమం జరుగుతోంది. కనుచూపు మేర అంతటా మట్టి, దుమ్ము పేరుకుపోయాయి. రోడ్డు పక్కనే నివాసగృహాలు, పొలాలు, అరటితోటలు ఉన్నాయి. వేలాదిమంది జనం అక్షరాలా దుమ్ములో, మట్టిలో జీవిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అరటితోటల్లో ఎక్కడా ఆకుపచ్చదనం కనిపించలేదు. కొన్ని కిలోమీటర్ల మేర పచ్చని అరటి ఆకులు కాస్తా బూడిదరంగులోకి తిరిగిపోయాయి.

కొండల్ని పిండి చేసే ఇన్ని స్టోన్ కటింగ్ యూనిట్లకు, అందులోనూ నివాస ప్రాంతాల మధ్య ఎలా అనుమతి ఇచ్చారో తెలియదు. పర్యావరణవాదులు, ప్రజారోగ్యసంరక్షణవాదులు ఈ దారుణాన్ని ఎలా సహిస్తున్నారో తెలియదు. ఇక్కడి జనం ఎలా భరిస్తున్నారో అంతకంటే తెలియదు.

అసలు ఈ ప్రాంతంలో ప్రభుత్వమూ, అంచెలంచెల అధికారయంత్రాంగం  అనేవి ఉన్నాయా అన్నది మిలియన్ డాలర్ల సందేహం!

ఇంకో తమాషా చూసారా?! భీమడోలు దాటే వరకు అధ్వాన్నపు రోడ్డు మీద ఒళ్ళు హూనం చేసుకుంటూ, కారుకు దుమ్ముకొట్టుకుంటూ, కారు టైర్లకు నష్టం కలిగించుకుంటూ ప్రయాణం చేసి  ఎట్టకేలకు నాలుగు లేన్ల రోడ్డు మీదికి చేరుకుంటామా...అక్కడినుంచి హైదరాబాద్ వరకు అడుగడుగునా టోల్ గేట్ల చెల్లింపు! రాను పోనూ మొత్తం 600 రూపాయిలు టోల్ చెల్లించుకున్నాం. రోడ్డు సుఖానికి రుసుము వసూలు చేశారు సరే, రోడ్డు కష్టానికి పరిహారం ఎవరు ఇస్తారు?


Saturday, February 9, 2013

అఫ్జల్ గురు ఉరి: patience please

భారత్ ఉగ్రవాదుల పట్ల మెతకగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం మనదేశంలోనే కాదు, బయటి దేశాలలో కూడా ఉంది. 2001లో పార్లమెంట్ పై దాడికి కుట్ర చేసిన అఫ్జల్ గురు ఉరితీతలో జరుగుతున్న అసాధారణ జాప్యం ఈ అభిప్రాయానికి మరింత ఊతమిచ్చింది. అయినాసరే ప్రభుత్వం అఫ్జల్ గురు విషయంలో ఆరేళ్లు ఆలస్యం చేసింది. ఈ పరిస్థితిలో నవంబర్ లో అజ్మల్ కసబ్ ను, ఈ రోజు అఫ్జల్ గురును ఉరితీయడం ద్వారా ఉగ్రవాదులకు, బయటి దేశాలకూ కూడా ఉగ్రవాదులపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్న స్పష్టమైన మెసేజ్ ను భారత్ ఇంతకాలానికి ఇవ్వగలిగింది.

ఇది చాలా ముఖ్యమైన...ఈ దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సందేశం. ఈ సందేశం ప్రాముఖ్యాన్ని  రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క గొంతుతో నొక్కి చెప్పినప్పుడే అది చేరవలసిన వారికి చేరుతుంది. ఇతరేతర అంశాల చాటున అది మరుగున పడిపోతే ప్రయోజనం ఉండదు.

నిజమే, అఫ్జల్ గురు ఉరితీతలో ప్రభుత్వం విపరీత ఆలస్యం చేసింది. ఆ అలస్యాన్ని చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించవలసిందే. అయితే, ఊరి తీసిన తరువాత కూడా ఎందుకింత ఆలస్యం చేశారన్న ప్రశ్నను తిరగ దోడకూడదు. కనీసం ఈ చర్య ద్వారా అందించే మెసేజ్ ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే దేశాలు, వ్యక్తుల బుర్రల్లో నాటుకునే వరకైనా ఓపిక పట్టాలి. అలాగే, ఇంత  టైమ్  ఎందుకు తీసుకున్నారని ఇంతకాలం ప్రశ్నించినవారే, ఇప్పుడు 'టైమింగ్' ను ప్రశ్నించడం లోనూ ఔచిత్యం లేదు. బడ్జెట్ సమావేశాల ముందే ఎందుకు ఈ పని చేశారని అడగడమూ అర్థవంతంగా లేదు.

అఫ్జల్ గురు ఉరి ఒక ప్రభావవంతమైన పరిణామం. రోజువారీ విమర్శల తరహా దాడితో దాని ప్రాధాన్యాన్ని పలచన చేయడం మంచిది కాదు.

కాస్త వివేకాన్ని, సంయమనాన్ని పాటించడం అవసరం. అది కూడా కొద్ది రోజులపాటు...


Thursday, February 7, 2013

అయోధ్య... అభివృద్ధి... అస్పష్టత

బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అలహాబాద్ కుంభమేళాలో మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి.

అయోధ్య రామమందిర నిర్మాణం 'భారతీయుల ఆత్మగౌరవ అంశమే కానీ, ఎన్నికల అంశం కా'దని ఆయన అన్నారు. 'ఈ అజెండాలకు బీజేపీ దీర్ఘకాలంగా కట్టుబడి ఉందనీ, రామజన్మభూమిలో ఆలయం నిర్మించాలన్నది మా ప్రగాఢమైన కోరిక అనీ' అన్నారు(ది హిందూ, 7 ఫిబ్రవరి).

ఇదే రోజున నరేంద్ర మోడీ ఢిల్లీలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ 'అభివృద్ధి'ని ఉద్బోధించారు.

రాజ్ నాథ్ అయోధ్య మాటలూ, మోడీ అభివృద్ధి మాటలూ ఏం చెబుతున్నాయి? గత ఇరవై ఏళ్లలో(1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటననుంచీ చెప్పుకుంటే) బీజేపీ అయోధ్య నుంచి అభివృద్ధికి ప్రయాణించిందని చెబుతున్నాయా? రాజ్ నాథ్ అయోధ్య తరాన్ని ఉద్దేశిస్తే, మోడీ అభివృద్ధి తరాన్ని ఉద్దేశించారని చెబుతున్నాయా? బీజేపీ తరాల మధ్య అంతరాన్ని గుర్తించిందని  చెబుతున్నాయా? లేదా బీజేపీ ఇప్పటికీ అయోధ్యా-అభివృద్దిల మధ్య ఊగిసలాడుతోందనీ, రేపటి ఎన్నికలలో ఏదో ఒకటి క్లిక్ అవుతుందనే ఉద్దేశంతో అయోధ్యను కూడా 'లైవ్' లో ఉంచుకుంటోందని చెబుతున్నాయా?

వివరణ లేదు.

అయోధ్య ఎన్నికల అంశం కాదని రాజ్ నాథ్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? లోక్ సభలో ఇద్దరే ఇద్దరు సభ్యులున్న బీజేపీ బలాన్ని అద్వానీ అయోధ్య రథయాత్ర  తొంభై దాకా పెంచిన నేపథ్యంలో ఇప్పుడు అయోధ్య ఎన్నికల అంశం ఎందుకు కాకుండా పోయింది? ఇప్పుడు అయోధ్య పేరు చెబితే వోట్లు రావా? ఎందువల్ల రావు?

వివరణ లేదు.

ఒకసారి తొంభై దశకం లోకి వెడదాం. అయోధ్య రాముడి మీద భక్తితో ఎంతోమంది అమాయక భక్తులు అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు. జెండాలు మోశారు. కంఠనాళాలు ఉబ్బిపోయేలా నినాదాలు చేశారు. అయోధ్య వరకూ వెళ్ళి కరసేవలో పాల్గొన్నారు. నిజంగానే రామజన్మభూమిలో ఆలయం అవతరిస్తుందని నమ్మారు. 'మీకు అయోధ్య కావాలి. బీజేపీకి అయోధ్య మీదుగా అధికారం కావాలి. అధికారం దక్కితే అయోధ్యను వదిలేస్తుం'దని ఎవరెంత చెప్పినా వారి విశ్వాసం సడలలేదు. ఇంత జరిగిన తరువాత బీజేపీ ఎన్నికల అంశాల జాబితా నుంచి అయోధ్యను కొట్టి పారేస్తే వీరి విశ్వాసానికి, వీరి మనోభావాలకు తగిలే గాయానికి ఎవరు జవాబుదారీ?

బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత దానికి ప్రతిక్రియగా జరిగిన ముంబై బాంబు పేలుళ్లలో వందలాదిమంది చనిపోయారు. వందలాది కుటుంబాలు గర్భశోకాన్నిఎదుర్కొన్నాయి. ఆత్మీయులను పోగొట్టుకున్నాయి. అనాథలయ్యాయి. ఈ రోజున కదిపినా ఒక్కొక్క కుటుంబమూ ఒక్కొక్క విషాద, కన్నీటిగాథ చెబుతాయి.  ఈ కుటుంబాలకు ఎవరు జవాబుదారీ?

2002 లో అయోధ్య కరసేవలో పాల్గొని శబర్మతీ ఎక్స్ ప్రెస్ లో గుజరాత్ వస్తున్న భక్తులలో 58 మంది సజీవదహనమయ్యారు. వారిలో 15 మంది పిల్లలు, 25 మంది మహిళలు ఉన్నారు. దానికి ప్రతిక్రియగా గుజరాత్ లో జరిగిన ఊచకోతలో 1200 మంది మరణించారు. గోధ్రా సజీవదహనాన్ని, అనంతర మారణకాండను మరచిపోయి ముందుకు వెళదామంటున్నారు. కడుపులో చల్ల కదలకుండా ఉన్నవాళ్లం మరచిపోతాం సరే. ఆత్మీయులను, అయినవారిని కోల్పోయిన వారు;  జీవన ఆధారాన్ని కోల్పోయి అన్నివిధాలా చితికిపోయినవారు... మరచిపోతారా? మరచిపోవడం సాధ్యమేనా? వారి ఆరని కంటతడికి, వారి గుండెల్లో ఇప్పటికీ సుడులు తిరిగే నిశ్శబ్ద దుఃఖానికి ఎవరు జవాబుదారీ?

బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర  ప్రకంపనలను ఏదో ఒక స్థాయిలో దేశవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొన్నారు. మతకల్లోలాల భయానక ముఖాన్ని దగ్గరగా చూశారు. తమ నీడకు తమే ఉలికిపడుతూ రోజుల తరబడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. హైదరాబాద్ లో నాటి కర్ఫ్యూ వాతావరణం ఇప్పటికీ కళ్ళముందు కదలుతూనే ఉంది. ఓరోజు రాత్రి ఎనిమిది గంటల వేళ మా ఇంటికి దగ్గరలో రోడ్డు మీద ఎవరినో కత్తితో పొడిచారన్న వదంతి వ్యాపించింది. దాంతోపాటే కొంతమంది కత్తులతో దాడికి దిగబోతున్నట్టు  వదంతి గుప్పుమంది. ఒక్కసారిగా జనం ఇళ్ళలోంచి వీధిలోకి వచ్చారు. అందరి ముఖాల్లోనూ భయాందోళనలు. కొంతమంది యువకులు కత్తులు, కట్టెలు సిద్ధంగా ఉంచుకోవడం ప్రారంభించారు.

మగవారు, యువకులు సరే, వృద్ధులు, ఆడవాళ్ళు, పిల్లల సంగతేమిటి? వారిని సురక్షిత ప్రాంతానికి అప్పటికప్పుడు పంపిద్దామనుకున్నా ఎలా పంపుతాం? ఆటోలు లేవు. ఎవరికీ వాహనాలు బయటికి తీసే ధైర్యం లేదు. హైదరాబాద్ లో రోడ్లు కూడా భయంతో బిక్కచచ్చి పోయి మూగవోయాయి.

నాటి ఆ భయోద్విగ్న వాతావరణం మన ఆలోచనలపై కలిగించే ప్రభావాన్ని తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రాణభీతి వెంటాడే ఆ రోజుల్లోనే బాబ్రీ కూల్చివేతను తీవ్రంగా దుయ్యబడుతూ ప్రముఖ పాత్రికేయుడు ప్రేమ్ శంకర్ ఝా 'హిందూ'లో రాసిన ఒక వ్యాసం చదివి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఇలా రాయడం సాధ్యమేనా అనుకున్నాను. మతకల్లోలాల వంటి ఒక అసహజ వాతావరణంలో మామూలు రోజుల్లో మనం అనుభవించే భావప్రకటన స్వేచ్ఛ, ఇతర స్వాతంత్ర్యాలు  కూడా ఎంత అపురూపంగా, ఆశ్చర్యకరంగా తోస్తాయో అనుభవపూర్వకంగా అర్థమైంది.

ఇటువంటి అయోధ్య తరం అనుభవాలు, నేటి అభివృద్ధి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ అయోధ్య కాండ సృష్టికర్తలకు తెలుసు. అయోధ్యతరం వారు ఇంకా జీవించి ఉన్నారు. కనుక, అయోధ్యను ఎన్నికల అంశాల జాబితానుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకునే ముందు ఎందుకు అలా చేస్తున్నారో బీజేపీ  వివరణ ఇస్తే .
బాగుంటుంది.

బీజేపీ చెప్పే అవినీతిరహిత సుపరిపాలన నిఘంటువులొ 'జవాబుదారీ' అనే మాట కూడా  ఉంటే, అయోధ్య కాండకు  జవాబుదారీని ఎలా స్వీకరించదలచుకుందో స్పష్టం చేస్తే కూడా బాగుంటుంది. .


Wednesday, February 6, 2013

బ్రహ్మానందం-హేమ జంటలా ప్రభుత్వం-ప్రజలు

నిన్నటివరకూ కేంద్రప్రభుత్వం ఏమీ చేయకపోవడం జనానికి నచ్చలేదు. ఇప్పుడు ఏం చేసినా నచ్చడం లేదు.

ఈ ప్రభుత్వంతో ప్రజల కాపురం రాను రాను  'అతడు' సినిమాలో బ్రహ్మానందం-హేమల కాపురంలా తయారవుతోంది. అందులో హేమ ఏం మాట్లాడినా బ్రహ్మానందం పెడర్థాలు తీస్తాడు. అఫ్ కోర్స్, ఆ డైలాగులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయనుకోండి. కానీ, ప్రభుత్వం-ప్రజల మధ్య సాగుతున్న డైలాగులు నవ్వు తెప్పించడం లేదు. ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.

ప్రభుత్వం ఏమీ చేయకపోవడం, లేదా ఏదైనా చేయడం నచ్చకపోవడమే కాదు; జనాలకు అసలు ఈ ప్రభుత్వమే నచ్చడం లేదు. అందులోనూ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఈ ప్రభుత్వాన్నీ చూస్తే ప్రతివాళ్ళకీ మొత్తబుద్ధి అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచడం సహజమే. కానీ వాటికంటే ఎక్కువగా రాజకీయేతర వ్యక్తులు, సంఘాలు  ప్రభుత్వంపై స్వారీ చేస్తుండడమే అసహజంగా కనిపిస్తోంది. నచ్చని ప్రభుత్వాన్ని అవతలకు గెంటి పారేయచ్చు. జనం చేతిలో వోటు అనే ఆయుధం ఎలాగూ ఉండనే ఉంది. ఎన్నికలు కూడా ఇంకో ఏడాది దూరంలోనే ఉన్నాయి. తొమ్మిదేళ్లు ఓపిక పట్టినవారు ఇంకో ఏడాది ఓపిక పట్టడం ఏమంత కష్టం కాదు. కానీ ఎందుకో జనంలో అసహనం పెరిగిపోతోంది. విమర్శలు తప్పనడం లేదు. వాటిలో ఔచిత్యం పాలు తగ్గుతూ ఉండడమే విచిత్రం.

ఒక ప్రభుత్వాన్ని తిరస్కరిస్తే దాని స్థానంలో వచ్చేది ఇంకో ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం కూడా అందరికీ  అన్నివిధాలా నచ్చినట్టు ఉండదు. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వంలానే వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు మౌలికంగా ఒక్కలానే ఉంటాయి. అన్ని ప్రభుత్వాలూ ప్రభుత్వం చేయవలసిన కొన్ని పనులు చేస్తాయి. ప్రభుత్వాలు చేసే సగటు స్పీడులోనే ఆ పనులు చేస్తాయి. ప్రభుత్వాలు పాటించే రీతి, రివాజులను, రాజ్యాంగ విధులనే పాటిస్తాయి. కనీసం పాటిస్తున్నట్టైనా కనిపించక తప్పదు.  ప్రతిపక్షంలో ఉన్నంతసేపూ కొండ మీది కోతిని కిందికి దింపుతామని నమ్మిస్తాయి. ప్రభుత్వం అనే కొండ మీద కూర్చోగానే అవే కోతిగా మారి పృష్ఠభాగం చూపిస్తాయి.

అదీగాక, ఏం చేయడానికైనా ప్రభుత్వానికి కొంత జాగా ఇవ్వాలి. కొంత స్వేచ్చా ఇవ్వాలి. సొంత బుద్ధితో ఆలోచించే అవకాశమూ ఇవ్వాలి. మేము చెప్పినట్టు చేస్తావా, చస్తావా అంటూ బెత్తం పుచ్చుకోవడం ఎంతవరకూ న్యాయం? అది మరో రకం నియంతృత్వం అవదా?

లోక్ పాల్ బిల్లు విషయమే తీసుకోండి. లోక్ పాల్ ప్రతిపాదన నలభై ఏళ్ళకు పైగా ప్రచారంలో ఉంది. ఇన్నేళ్లలో ఏడెనిమిది సార్లు అది పార్లమెంట్ గుమ్మం తొక్కి మళ్ళీ బయటకు రాకుండా నిశ్శబ్దంగా సమాధైపోయింది. ఇలాంటి లోక్  పాల్  విఫల చరిత్ర తెలిసినవారు ఎవరూ  అది ఇప్పట్లో సాకారం అవుతుందనీ ఇటీవలి వరకూ అనుకుని ఉండరు. అది ఏ రూపంలో సాకారం అయినా అదొక అద్భుతమే ననుకుని ఉంటారు.  అన్నా హజారే, ఇతర పౌరసమాజ బృందాల పుణ్యమా అని ఇంతకాలానికి అది నిజమయ్యే రోజు వస్తోంది. ఆ క్రెడిట్ వారికి ఇవ్వవలసిందే.

కానీ లోక్ పాల్ కోసం ఉద్యమించిన వర్గాలలో మాత్రం ఆ సంతోషం, సంతృప్తి కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు.  లోక్ పాల్ బిల్లుపై స్థాయీ సంఘం సూచించిన 16 సవరణాలలో 14 సవరణలను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఆమోదించిన వాటిలో కొన్ని కీలకమైనవీ ఉన్నాయి. ఆమోదించని రెండు సవరణలలో ఒకటి లోక్ పాల్ ఆదేశాలపై పని చేసే సీబీఐ దర్యాప్తు అధికారిని బదిలీ చేసే అధికారం సీబీఐ డైరెక్టర్ కు ఉండాలా, లోక్ పాల్ కు ఉండాలా అన్న ప్రశ్నకు సంబంధించినది. మంత్రివర్గం సీబీఐ డైరెక్టర్ కే ఉండడం వైపు మొగ్గు చూపింది. రెండో సవరణ, ఆరోపణలు వచ్చిన అధికారిపై దర్యాప్తుకు ఆదేశించే ముందు అతని వాదాన్ని వినాలా వద్దా అన్న ప్రశ్నకు సంబంధించినది. వినాలన్న అభిప్రాయం వైపు మంత్రివర్గం మొగ్గు చూపింది. మంత్రివర్గం ఆమోదించిన బిల్లు రూపం మళ్ళీ పార్లమెంట్ ముందుకు వస్తుంది. అప్పుడు మరోసారి చర్చించుకోవచ్చు. ఆ చర్చ దరిమిలా ప్రభుత్వం తన వైఖరిని పునస్సమీక్షించుకోవచ్చు. లేదా ప్రతిపక్షాలు ప్రభుత్వ వాదనతో ఏకీభవించవచ్చు. ఇవేవీ జరగకుండా బిల్లు ఇప్పటి రూపంలోనే చట్టమై అమలులోకి వచ్చినా అనుభవంలో లోపాలు బయటపడితే అప్పుడే సవరించుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఇంకో ప్రభుత్వం చేయచ్చు. ఇదొక నిరంతర ప్రక్రియ. లోక్ పాల్ ఇంతకాలానికి సాకారం కానుండడమే ఇక్కడ అసలు విషయం. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దా? కనీసం దానికోసం అలుపెరుగని పోరాటం చేసినవారు కూడా? వాళ్ళలో ఆ సంతోషం ఎందుకు కనిపించడం లేదు?!

లైంగిక అత్యాచారాల నిరోధనకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ కూ ఇదే వర్తిస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఇంత ఆదరాబాదరగా ఆర్డినెన్స్ ను ఎందుకు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు అడగడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ విచిత్రంగా మహిళా హక్కుల సంఘాలు కూడా అడుగుతున్నాయి. ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఆర్డినెన్స్ పై సంతకం పెట్టవద్దని రాష్ట్రపతిని కోరే దాకా వెళ్ళాయి, ఇలాంటివి శ్రుతి మించిన స్పందనల గానే కనిపిస్తాయి. మానభంగాల నిరోధానికి ఏమీ చేయడం లేదని ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది. ఆ విమర్శల తీవ్రతను తగ్గించడానికి అది ఆర్డినెన్స్ మార్గాన్ని వెతుక్కొంది, అదేమీ చట్ట విరుద్ధం కాదు. ప్రభుత్వం తీసుకునే చర్యల్లో పొలిటికల్ మేనేజ్ మెంట్ కోణం కొంత ఉంటుంది. ఈ ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. దానిని ఒక వివాదాంశం చేయాలా? పైగా జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులను అన్నిటినీ ఎందుకు ఆమోదించలేదని హక్కుల సంఘాలు నిలదీస్తున్నాయి. ఆమోదించాలని ఏముంది?  సొంత విచక్షణను, ఆచరణ కోణాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించే అధికారం ప్రభుత్వానికి ఉండదా? ఉండదన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు? అదీగాక, ఆర్డినెన్స్ చట్టరూపం ధరించే క్రమంలో దానిపై పార్లమెంట్ లో ఎలాగూ చర్చ జరుగుతుంది. అప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు రానే వస్తాయి.

ఇదంతా చదివి నేను ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తున్నానని తొందరపడి నిర్ణయానికి రారనే భావిస్తాను. నేను ఇందులో ఉద్దేశించినది ఫలానా ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం అనే వ్యవస్థను.




Tuesday, February 5, 2013

రాహుల్ ప్రధాని పదవికి ఏవిధంగా అర్హుడు?

రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ సహా ఆయా పార్టీల థింక్ ట్యాంక్ సక్రమంగానే పనిచేస్తోందా?!

ఆయనకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్నను అది ముందుకు తేకపోవడం గమనిస్తే ఈ అనుమానం కలుగుతోంది.

రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ఏవిధంగా అర్హుడన్నదే ఆ ప్రశ్న.

రాహుల్ ప్రధాని పదవికి అభ్యర్థి అని కాంగ్రెస్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవచ్చు.  కానీ ఆ ఊహ చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఇటీవల ఆయనకు పదోన్నతి కల్పించిన తర్వాత ఆ ప్రచారం మరింత ఊపును అందుకునే అవకాశముంది. విచిత్రం ఏమిటంటే, 'రాహుల్ ప్రధాని పదవికి ఒక అభ్యర్థి' అన్న ఊహతో బీజేపీతోపాటు అనేక పార్టీలు కూడా రాజీ పడిపోయినట్టు కనిపించడం!  ఈ పార్టీల  థింక్ ట్యాంక్ సక్రమంగానే పనిచేస్తోందా అన్న అనుమానం అందుకే కలుగుతోంది.

ఎందుకంటే,  రాహుల్ 'అర్థ భారతీయుడు' మాత్రమే. మిగతా సగం ఆయన ఇటాలియన్. భారతదేశంలో ప్రధాని పదవికి అర్హతగల 'సంపూర్ణ భారతీయులు' ఎంతోమంది ఉండగా ఈ అర్థ భారతీయుడి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఆమోదించాలి? ఆమోదించడం వెనుక హేతుబద్ధత ఏమిటి?

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన బాధ్యత కాంగ్రెసేతర పార్టీలకు ఉంది.

రాజీవ్ గాంధీ అనే ఒక భారతీయుడి కుమారుడిగా రాహుల్ గాంధీ సంపూర్ణ భారతీయుడేననీ,  కనుక భారత ప్రధాని పదవికి అర్హుడేననీ అంటారా? ఏ ప్రాతిపదిక మీద అలా అంటారు? రాజీవ్ గాంధీ కుమారుడిగా ఆయన భారతీయుడే అయినప్పుడు సోనియా గాంధీ కుమారుడిగా ఇటాలియన్ మాత్రం ఎందుకు కారు? జాతీయతను రాజీవ్ గాంధీ అనే పురుషుడి వైపు నుంచి నిర్ణయించి, సోనియా గాంధీ అనే స్త్రీ వైపునుంచి ఎలా నిరాకరిస్తారు? ఇది  స్త్రీ-పురుషుల మధ్య వివక్ష చూపడం కాదా? ఈ వివక్షను  ఎందుకు ఒప్పుకోవాలి?  ఎవరు ఒప్పుకున్నప్పటికీ  స్త్రీవాదులు, మహిళా సంస్థలవారు ఎలా ఒప్పుకుంటారు?

ఇంకాస్త లోతుకు వెడితే ఇది 'బీజ-క్షేత్రా'ల గురించిన ప్రశ్న. పురుషాధిపత్యవ్యవస్థలో బీజానికే ప్రాధాన్యం ఇస్తారు. ఆవిధంగా రాజీవ్ గాంధీ కుమారుడిగా రాహుల్ భారతీయుడే అవుతారు కనుక ప్రధాని పదవికి ఆయన అర్హుడే నన్నది ఆయా పార్టీల అప్రకటిత భావనగా కనిపిస్తోంది. అంటే బీజ ప్రాధాన్య పురుషాధిపత్యవ్యవస్థను పరోక్షంగా అంగీకరించడమే. పైన చెప్పుకున్నట్టు ఎవరు అంగీకరించినా స్త్రీవాదులు, మహిళా హక్కుల సంఘాలు ఎందుకు ఒప్పుకోవాలి? క్షేత్రప్రాధాన్య కోణాన్ని వారు ముందుకు తేవచ్చుకదా? అప్పుడు రాహుల్ సంపూర్ణ ఇటాలియనే అవుతారు. ఆవిధంగా రాహుల్ ప్రధాని పదవికి అర్హుడు కారన్న వాదానికి ఈ వర్గం వాదాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకోవచ్చు.

పోనీ పురుషాధిపత్యవాదులూ, స్త్రీవాదులూ రాజీపడి రాహుల్ ను అర్థ భారతీయుడిగా, అర్థ ఇటాలియన్ గా గుర్తించారనే అనుకుందాం. అప్పుడు కూడా రాహుల్ అభ్యర్థిత్వం ప్రశ్నించదగినదే అవుతుంది. మొదటే చెప్పినట్టు ప్రధాని పదవికి అర్హతగల సంపూర్ణ భారతీయులు ఎందరో ఉండగా అర్థ భారతీయుని అభ్యర్థిత్వాన్ని ఎందుకు అంగీకరించాలి? 

Monday, February 4, 2013

సోనియా గాంధీ-నరేంద్ర మోడీ: ఒక పోలిక

 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీల మధ్య  పోలికా?!  ఆశ్చర్యంగా  ఉందే అనుకుంటున్నారా?  అదే తమాషా. ఒక్కొక్కసారి మనం ఊహించని వ్యక్తుల మధ్య, ఊహించని ఘట్టాల మధ్య పోలికలు కుదురుతూ ఉంటాయి. ఊహించని రీతిలో చరిత్ర పునరావృతమవుతూ ఉంటుంది.

సోనియా గాంధీ భారతీయుని వివాహమాడిన విదేశీయురాలైతే, నరేంద్ర మోడీ నూటికి నూరు పాళ్లూ భారతీయుడు, అందులోనూ హిందుత్వవాది. సోనియా 'లౌకికవాది' అయితే, మోడీ 'మతతత్వవాది'గా విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఏ రకంగా చూసినా ఒకరు ఉత్తరధ్రువం అయితే, ఇంకొకరు దక్షిణధ్రువం. అయినా సరే, సముద్రంలోని ఉప్పుకు, చెట్టుమీది కాయకూ సంబంధం ఉన్నట్లుగా వీరిద్దరి మధ్యా ఒక పోలిక కుదిరింది!

 ఆ పోలిక ఏమిటో చూద్దాం.

సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షపదవిని స్వీకరించినప్పటినుంచీ ఆమె విదేశీయత చర్చలోకి రావడం ప్రారంభమైంది. ఒక విదేశీయురాలు, అందులోనూ తన ఇటలీ పౌరసత్వాన్ని వదలుకోని వ్యక్తి భారతదేశ ప్రధాని ఎలా అవుతారన్న ప్రశ్న బీజేపీ ఒక్కటే కాదు, కాంగ్రెస్ లోనే ఉన్న శరద్ పవార్, సంగ్మా, తారిక్ అన్వర్ లాంటివారు కూడా లేవనెత్తారు. అంతేకాదు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. సరే, అదే పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ కు మిత్రపక్షం కావడం, కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ అధికారం పంచుకోవడం వేరే విషయం. అలాగే, ఇతర కాంగ్రెసేతర పక్షాలు కూడా (ఒకటి రెండు మినహాయింపులు ఉంటే ఉండచ్చు)ఒక విదేశీయురాలిగా సోనియా గాంధీ ప్రధాని కావడానికి వీలు లేదన్న వైఖరి తీసుకున్నాయి.

 ప్రధాని కావడానికి సోనియా అనర్హతా చర్చ 2004లో పతాకస్థాయికి వెళ్లింది. సోనియా గాంధీ ప్రధాని అవడమంటూ జరిగితే నేను శిరోముండనం(జుట్టు తీసేయడం) చేయించుకుంటానీ, ఒక్క పూట శనగలతో కడుపు నింపుకుంటాననీ, నేల మీద పడుకుంటాననీ నేటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అప్పట్లో చేసిన ప్రతిజ్ఞ సంచలనం సృష్టించింది. ప్రధాని కాగల అవకాశం ఉన్నప్పటికీ సోనియా వెనక్కి తగ్గి మన్మోహన్ సింగ్ ను ముందుకు తెచ్చారు. దానిని ఒక త్యాగంగా కాంగ్రెస్ వాదులు అప్పటినుంచీ చెప్పుకోవడం ప్రారంభించారు.

దాదాపు పదేళ్ళ తర్వాత, 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని కావడానికి గల 'అర్హతా';  లేదా ఆ మాట సరైనది కాదనుకుంటే, 'అభ్యంతరాలూ'  ఒక వ్యక్తి విషయంలో చర్చలోకి వస్తున్నాయి. ఆ వ్యక్తి నరేంద్ర మోడీ. అప్పటి ఆ చర్చకు కాంగ్రెస్ సోనియా కేంద్రబిందువు అయితే, ఇప్పటి చర్చకు బీజేపీ మోడీ కేంద్రబిందువు. ఆ విధంగా ఈ చర్చ విషయంలో రెండు అఖిలభారత  జాతీయ ప్రధాన పక్షాల మధ్యా ఒకవిధమైన 'సమతూకం' లేదా 'సమాన న్యాయం' ఏర్పడింది.

సోనియా గాంధీ ప్రధాని అయ్యే విషయంలో బీజేపీ నుంచి ఎక్కువ మోతాదులో ప్రతిఘటన ఎదురైతే, మోడీ విషయంలో ప్రస్తుతానికి ముస్లిం సంస్థలనుంచీ, 'లౌకికవాదులు'గా చెప్పుకునే ఇతరులనుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని మోతాదు ముందు ముందు మరింత పెరుగుతుందా, రేపు ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయన్నది వేచి చూడవలసిందే కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి జోస్యమూ చెప్పలేం.

సోనియా విషయంలో కాంగ్రెస్ లోనే చీలిక వచ్చి శరద్ పవార్ తదితరులు వేరు కుంపటి పెట్టుకుంటే;  మోడీ విషయంలో జేడీయూ భిన్న స్వరాలు వినిపిస్తున్న దృష్ట్యా , ఒకవేళ బీజేపీ మోడీ అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేస్తే  ఎన్డీయేలో కూడా చీలిక వస్తుందా అన్నది ప్రస్తుతానికి శేషప్రశ్న.

ఏదెలా ఉన్నా, నాకు తెలిసినంతవరకూ ప్రధాని కావడానికి  గల అర్హతానర్హతల చర్చ స్వతంత్రభారతచరిత్ర మొత్తంలో సోనియా, మోడీ ఇద్దరి  విషయంలోనే  ముందుకు వచ్చింది.  అది వారి మధ్య కుదిరిన ప్రధానమైన పోలిక.

సోనియా విదేశీయత ఆమె ప్రధాని కావడానికి ఒక అనర్హతగా జనం అంతా భావించారో లేదో మనకు తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రధాని అయ్యే అవకాశాన్ని సోనియా  స్వచ్ఛందంగా వదలుకున్నారు. అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ లో  వోట్లు ఆకర్షించగల ఏకైక నేత సోనియా గాంధీయే. ఈ వాస్తవంలో ఆమె ప్రధానికి కావడానికి అవసరమైన జనామోదం ఇమిడి ఉందా లేదా అన్నది కచ్చితంగా చెప్పలేం.

బహుశా రేపు మోడీకి కూడా ఇదే వర్తించవచ్చు.  బీజేపీలో చాలామంది అనుకుంటున్నట్లు సోనియా లానే ఆయన వోట్లను విశేషంగా  ఆకర్షించగల నాయకుడిగా రుజువు కావచ్చు.  ఒకవేళ రేపటి ఎన్నికలలో ఎన్డీయే అధికారంలోకి రాగల సంఖ్యాబలాన్నే తెచ్చుకుంటే, ప్రధాని పదవికి మోడీ అభ్యర్థిత్వం చర్చ కాంగ్రెస్ లో మాదిరిగానే పతాకస్థాయికి చేరుకుంటుందా?  చేరుకుంటే ఏం జరుగుతుందన్నవి  మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు.

ప్రస్తుతానికి ఇవి కూడా శేషప్రశ్నలు మాత్రమే.


Friday, February 1, 2013

వివాదాల 'విశ్వరూపం'

'విశ్వరూపం' వివాదం క్రమంగా విశ్వరూపాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం జరిగే చర్చలలో అంగీకారం కుదిరి సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోతే కమల్ హాసన్ అభిమానులే కాక అందరూ సంతోషిస్తారు. అంతకుముందు కమల్ హాసన్ భావోద్వేగ ప్రసంగం ఆయన ఎంత గాయపడ్డాడో, వందకోట్ల రూపాయిల భారీవ్యయంతో నిర్మించిన తన సినిమాను ఆడించుకోడానికి ఎంతటి పోరాటం చేసి అలసిపోయాడో వెల్లడించింది. "నా ఇంటితో సహా ఆస్తులన్నీ ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టాననీ, నష్టం వస్తే వాటన్నిటినీ వదలుకుంటాననీ, ఉండడానికి గూడు లేకపోయినా తనకు తిండి పెట్టే వాళ్ళు ఉన్నారనీ, ఏదైనా సెక్యులర్ రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోతా"ననే స్థాయిలో ఆయన స్పందించాడంటే మానసికంగా ఎంత చిత్రవధను ఎదుర్కొన్నాడో అర్థంచేసుకోవచ్చు. ఆయన రాజకీయ అనుబంధాలు ఏవీ లేని వట్టి కళాకారుడు కావడాన్ని అలుసుగా తీసుకుని తెరవెనుక శక్తులు కొన్ని ఒక ఆట ఆడించాలని చూసినట్టు అర్థమవుతూనే ఉంది. రాజకీయమైన అండ లేకుండా ఒక కళాకారుడు, లేదా మరో రంగానికి చెందిన వ్యక్తి  నెగ్గుకురాలేని  పరిస్థితులు దేశంలో ఉన్న సంగతిని కమల్ హాసన్ ఉదంతం మరోసారి రుజువు చేసింది.

నలభై ఏళ్లుగా సినిమా రంగంలో ఉండి, సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన కమల్ హాసన్ లాంటి అనుభవశాలి ఏ ఒక్క వర్గాన్ని అయినా నొప్పించే సన్నివేశాలు, మాటలు సినిమాలో చొప్పిస్తాడంటే నమ్మడం కష్టం. అందులోనూ మరింత సున్నితమైన మతవిశ్వాసాలను నొప్పించే సాహసానికి పాల్పడడం అసలే ఊహించలేని విషయం. అయితే, ఇంకో వాస్తవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున ఒక సినిమాకో, ఒక కళాకారునికో తుపాకీ గురి పెట్టడానికి  బలమైన, హేతుబద్ధమైన కారణం ఉండనవసరం లేదు. రాజకీయబలం, మందబలం,  రాజకీయంగా లాభించే అవకాశం ఉంటే చాలు. జనబలం ఒకవైపు; ఒంటరి వ్యక్తి ఇంకొకవైపు మోహరించినప్పుడు ఆ వ్యక్తి వైపే న్యాయమూ, హేతుబద్ధతా ఉన్నాసరే, ప్రభుత్వాలు కూడా జనబలం వైపే మొగ్గుతాయన్న చేదునిజాన్ని మరచిపోకూడదు. 'ఎవరు కరెక్టు?' అన్న మీమాంస రాజకీయపక్షాలకు అక్కరలేదు. 'పోలిటికల్ గా ఏది కరెక్టు?' అని మాత్రమే అవి చూసుకుంటాయి.  ప్రత్యేకించి  సినిమాల విషయంలో ప్రతిఘటన ధోరణి ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. చీకట్లో వేటగా పరిణమించింది. కనుక సినిమాలు తీసేవారు మరింత హెచ్చరికను పాటించవలసిన అవసరం ఉంది. అందులోనూ కమల్ హాసన్ లాంటి వారు తీసే  సినిమా క్లాస్, మాస్ అనే  తేడా లేకుండా అన్నివర్గాలవారికీ చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక అసలే ఛాన్స్ తీసుకోకూడదు.

'విశ్వరూపం' సినిమా నాతో సహా చాలామంది చూడలేదు కనుక దాని సంగతి అలా ఉంచి, చాలా  సినిమాలలో కనిపించే  ఒక లోపం గురించి చెప్పుకోవాలి.  సినిమాలవారు తమకు అంతగా తెలియని అంశాలలోకి కథాపరంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు తగిన హోమ్ వర్క్ చేసుకోరు. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా వ్యవహరిస్తారు.

ఉదాహరణకు ఒక సినిమాలో హీరో అజ్ఞాతంగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. పోలీసులు అతనిని పట్టుకోడానికి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న అతని సహాధ్యాయులందరినీ కస్టడీలోకి తీసుకుని, అతని ఆచూకీ చెప్పమని  చిత్రహింసలు పెడతారు. ఏ జానపద కథలోనో,  ఏ నియంతృత్వ దేశంలోనో అలా జరగొచ్చేమో కానీ, ఒక ప్రజాస్వామ్య దేశంలో అలా ఎప్పుడూ జరగదు. ఇంకో సినిమాలో హీరోయిన్ ఒక వారపత్రిక ఆఫీసుకు వెళ్ళి సంపాదకుని కలసి తను రాసిన నవలను ఇచ్చి ప్రచురించమని అడుగుతుంది. ఆ సంపాదకుడు కనీసం ఆమెను కూర్చోమని కూడా అనకుండా అమర్యాదగా, చులకనగా మాట్లాడతాడు. నిజజీవితంలో రచయితలపట్ల ఏ సంపాదకుడూ అంత మొరటుగా  ప్రవర్తించడు.

మిగిలినవారి సంగతి ఎలా ఉన్నా కమల్ హాసన్, ఆమిర్ ఖాన్ లాంటివారు కథాఘట్టంలోనే ఎంతో రీసెర్చ్ చేస్తారనీ, చిత్రీకరణ దశలో కూడా ఎన్నో కోణాలనుంచి జాగ్రత్తలు తీసుకుంటారనే అభిప్రాయం చాలామందిలో  ఉంది. అయినాసరే, విశ్వరూపం  విషయంలో ఇలా జరిగిందంటే;  ఆ సినిమా కథా ఘట్టంలోనో, చిత్రీకరణ దశలోనో  కమల్ హాసన్  తనకు తెలిసిన ఒకరిద్దరు ముస్లిం మేధావులతో  మాట్లాడి ఇప్పుడున్న వాతావరణంలో ముస్లింలు తన సినిమాను వ్యతిరేకించే అవకాశం ఏ కొంచెమైనా ఉంటుందా అన్నది  తెలుసుకునే ప్రయత్నం చేసారా అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది.

విశ్వరూపం వివాదాన్ని పక్కన ఉంచి ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. భావప్రకటన హక్కు ఎంతైనా శిరోధార్యమే కానీ అది పరిమితులు లేనిది మాత్రం కాదు. మీడియా భావ ప్రకటన హక్కుకు ప్రత్యక్ష సాక్ష్యం అని అందరూ అనుకుంటారు. అది అపరిమితమైన స్వేచ్ఛను అనుభవిస్తోందని కూడా భ్రమపడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, మీడియా కూడా భావప్రకటనలో కొన్ని హద్దులు పాటిస్తూనే ఉంటుంది. సెంటిమెంట్లను, మనోభావాలను దృష్టిలో పెట్టుకుంటూనే ఉంటుంది. మీడియా ఒక్కటే కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతివారూ భావప్రకటన పరిమితులను గమనించుకుంటూనే ఉంటారు. ఓ సారి ఓ పెద్దమనిషి,  "మీడియా ఎప్పుడూ నెగెటివ్ విషయాలే ఎందుకు ఫోకస్ చేస్తుంది? జనంలో అనుకూల భావనను ప్రోత్సహించే నిర్మాణాత్మకమైన విషయాలను ఎక్కువగా ఇవ్వవచ్చు కదా!" అని ఒక సంపాదకునితో అన్నాడు. అప్పుడా సంపాదకుడు, "అయ్యా, మీకు తెలియదేమో, మీడియా రిపోర్ట్ చేసే విషయాలకంటే, చేయకుండా దాచే విషయాలే చాలా ఎక్కువ. మీడియాకు తెలిసినవన్నీ బయట పెడితే దేశం అల్లకల్లోలమైపోతుంది" అన్నాడు.

సినిమా కూడా ఒక మీడియాయే కనుక భావప్రకటన పరిమితులను గుర్తించక తప్పదు. ఇలా అన్నానని విశ్వరూపం సినిమాలో నిజంగానే ముస్లిం లను గాయపరిచే అంశాలు ఉన్నాయనీ, కనుక ఆ సినిమాను అడ్డుకోవడం న్యాయమేననీ నేను అంటున్నట్టు దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏ చిన్నఅవకాశం దొరికినా సినిమా ప్రదర్శనను అడ్డుకునే ధోరణి ప్రబలిందనీ, అదొక రాజకీయశిక్షణ కార్యక్రమంగా మారిందనీ ముందే చెప్పాను. ఆ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా తమ భావప్రకటన హక్కును వినియోగించుకునే అవకాశం లేదా  అన్నదే నా ప్రశ్న.

ప్రస్తుతానికి ఇది ఊహాప్రాయమైన ప్రశ్న మాత్రమే. ఇంతకీ విశ్వరూపంలో వివాదం రేకెత్తించే అంశాలు ఏమాత్రమైనా ఉన్నాయో లేవో సినిమాను ఆమూలాగ్రంగా  చూస్తే తప్ప తెలియదు. రాజీ కుదిరి అందులో భాగంగా కత్తిరింపులు జరిగితే ఆ అవకాశమూ ఉండదు. ఆ చర్చా ఉండదు.