Thursday, February 27, 2014

కోసల-మగధ సినిమా కథలో హీరో ఎవరు?

 కోసల-మగధ సినిమా కథలో కథనమే నాది కానీ, కథ కోశాంబీదే.  మల్లబంధులకు పెట్టిన పరీక్షా, పుష్కరిణిలో స్నానం చేయాలన్న మల్లిక కోరికను అతను తీర్చడం రాహుల్ సాంకృత్యాయన్ రచన  ఓల్గా సే గంగ నుంచి తీసుకున్నవి.


ఇంతకీ సినిమా కథ అన్నాక ఒక హీరో ఉండాలి కదా?! ఈ కథలో హీరో ఎవరు? ఇది నాకు ముందుగా ఎదురైన ప్రశ్న. నాకు వదలిపెడితే; పసనేది, మల్లబంధుల, అజాతశత్రు, విదూదభుడు, దీర్ఘచరాయణుడు...వీరిలో ఎవరైనా హీరో కావచ్చునంటాను. వీళ్లలో ఏ ఒక్కరి కోణం నుంచైనా ఈ కథ చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే, నా ఉద్దేశంలో ఈ కథలో వీళ్ళెవరూ హీరోలు కారు, కోసల అదృశ్యమై మగధ ఏకైక సామ్రాజ్యంగా అవతరించడం అనే చారిత్రక పరిణామం; అంటే చరిత్ర, హీరో! లేదా విలన్! విలన్ ప్రధానంగా సినిమా ఎందుకు ఉండకూడదు? అయితే, చరిత్ర హీరోగా (లేదా విలన్ గా) తీసిన సినిమా చూడడానికి మన ప్రేక్షకులు అలవాటు పడకపోవడం ఒక సమస్య.  పోనీ నేనే చరిత్రను హీరోను చేసి  సినిమా తీద్దామంటే ఓ వందకోట్లు(హాలీవుడ్ స్థాయిలో అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కాబోలు) నష్టపోవడానికి నా దగ్గర ఓ వెయ్యికోట్లు లేవు.
(పూర్తి వ్యాసం
http://magazine.saarangabooks.com/2014/02/27/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B1%81/ లో చదవండి)

Wednesday, February 26, 2014

రోటీ-కపడా-మకాన్ ఔర్ బీజేపీ

కొన్ని మార్పులు చాపకింద నీరులా వస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. బీజేపీలో వచ్చినట్టు పైకి కనిపిస్తున్న మార్పు అలాంటిదే! 'పైకి కనిపిస్తున్న' అనే మాట ఎందుకు వాడానంటే, అందులో ఇంకా స్పష్టత రావలసి ఉంది కనుక.

ఆ మార్పు ఏమిటో చెప్పుకునే ముందు, అసలు రాజకీయాలు, అందులోనూ ప్రజాస్వామ్య రాజకీయాలు దేనికో ఒకసారి చూద్దాం...

రోటీ-కపడా-మకాన్ అనే మాట ఉంది. దీనిని కూడు, కట్టుకునేందుకు వస్త్రం, గూడు అని తెలుగులో చెప్పుకోవచ్చు. వీటికి అదనంగా భద్రతను కూడా చేర్చుకోవచ్చు. మనిషికి మౌలికంగా కావలసినవి, రాజకీయాలనుంచి ఆశించేవి ఇవే. విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, అభివృద్ధి మొదలైనవన్నీ ఈ మౌలిక అవసరంలో భాగాలే. రాజకీయాలకు, లేదా ప్రభుత్వాలకు సర్వోన్నత బాధ్యత వీటిని సమకూర్చడమే. ఇవి ఎప్పుడైతే సమకూడాయో అప్పుడు మిగిలిన అవసరాలు ప్రజలే చూసుకుంటారు. వాటి విషయంలో ప్రభుత్వాలకు, రాజకీయాలకు ఎలాంటి జవాబుదారీ ఉండనవసరంలేదు.

భారతదేశం స్వతంత్రం కాకముందునుంచీ, అయిన తర్వాతా ప్రజల సమస్య రోటీ-కపడా-మకాన్ లే. స్వతంత్ర భారత ప్రభుత్వాలు ఆ దిశగా ఏవో కొన్ని అడుగులు వేశాయి. అయితే ఆ అడుగులు ఆశించినంత వేగంగా పడలేదనే అభిప్రాయం ఉంది. దానికితోడు అవినీతి లాంటి జాడ్యాలు ఆ అడుగులకు మరిన్ని బ్రేకులు వేస్తూ వచ్చాయి. ప్రతిపక్షస్థానంలో ఉన్న పార్టీలు చేయవలసింది ఆ సంగతిని వేలెత్తి చూపించడం. మేము అధికారంలోకి వస్తే ఆ పని చేస్తామని చెప్పడం. కొన్ని పార్టీలు ఆ పని చేస్తూనే వచ్చాయి...

మరి బీజేపీ?!

బీజేపీకి రోటీ-కపడా-మకాన్ గురించిన ఆలోచనలు లేవని కావు. ఉన్నాయి. అయితే అవి (కనీసం నిన్నటి వరకు)ఆ పార్టీ రాజకీయ తాత్విక పత్రంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలలో మాత్రమే ఉంటూ వచ్చాయి. పైకి మాత్రం హిందుత్వ, అయోధ్య, సాంస్కృతిక జాతీయవాదం వగైరాల గురించి మాట్లాడే పార్టీగానే జనానికి పరిచయమవుతూ వచ్చింది. ఆ మాటలతోనే ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షస్థాయికి ఎదుగుతూ వచ్చింది.

ఒక ఉదాహరణ చూడండి...

తొంభైల ప్రారంభంలో దేశం ఆర్థికంగా ఒక సంక్షోభపరిస్థితిని ఎదుర్కొంది. ఆ సంక్షోభం మేధావులకే కాక మామూలు జనానికి కూడా మొదటిసారి ఆందోళన కలిగించింది. ఆ సమయంలో అప్పుడప్పుడే బీజేపీ అయోధ్య రథయాత్ర ముగించుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత దిశగా అడుగు వేస్తోంది. సరిగ్గా అప్పుడే పీవీ నరసింహారావు కీలకమైన కొన్ని ఆర్థిక చర్యలు తీసుకున్నారు. అవి సంక్షోభాన్ని గట్టెక్కించి దేశాన్ని నేటి అభివృద్ధి నమూనావైపు తీసుకు వెళ్ళాయి. ఈ నమూనా వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది వేరే చర్చ. అందులోకి మనం ఇప్పుడు వెళ్లనవసరం లేదు.

అప్పుడు కూడా రోటీ-కపడా-మకాన్ పార్టీలు వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ బీజేపీ తొంభైల ద్వితీయార్థంలో తను అధికారంలోకి వచ్చాకే వాటి మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ వచ్చింది. అప్పుడు కూడా ఆ మాటలతోపాటు, తనవైన పైన చెప్పుకున్న మాటలూ మాట్లాడుతూనే ఉంది. 2004లో తను అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రెండు రకాల మాటలనూ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు, ఈ 2014లో మాత్రం ఆ పార్టీ రోటీ-కపడా-మకాన్ ల గురించే మాట్లాడాలని నొక్కి నొక్కి చెబుతోంది. ఇందుకు భిన్నమైన కమ్యూనల్ మాటలు మిగతా పార్టీలే మాట్లాడుతున్నాయని ఆక్షేపిస్తోంది. స్థానాలు ఎలా తలకిందులయ్యాయో చూడండి.

ఏమైనా బీజేపీ రోటీ-కపడా-మకాన్ లను నొక్కి చెప్పడం ఆహ్వానించదగిన పరిణామం. అయితే తన పాత అజెండా సంగతేమిటి? అందులో ఇంకా స్పష్ట త రాలేదు. సాంస్కృతిక జాతీయవాదం లాంటి లక్ష్యాలను ఆ పార్టీ సాంస్కృతికరంగ నాయకత్వానికి వదిలేసి తను ఒక రాజకీయ పక్షంగా రోటి-కపడా-మకాన్ లకే పరిమితమవుతుందా?....అదీ శేషప్రశ్న.


Thursday, February 20, 2014

రెండు రాష్ట్రాలుగా ఇప్పుడు ఒక్కటవుదాం!!!

తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు!

రాయలసీమ, ఆంధ్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు!

తెలంగాణ ముందు ఇప్పుడు తాను కోరుకున్న, తన ఊహలో ఉన్న ఉజ్వల భవిష్యత్ పథం ఆవిష్కృతమైంది.

ఆంధ్ర, రాయల సీమలు ఈ క్షణాన అగమ్యగోచర, అంధకార భవిష్యత్తును ఊహించుకుంటున్న మాట నిజమే. కానీ అవి కూడా ఆత్మవిశ్వాసాన్ని పాదుకొలుపుకుని సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోడానికి ముందడుగు వేయాలనీ, వేస్తాయనీ ఆకాంక్ష. ప్రతిజాతి చరిత్రలోనూ ఇటువంటి ఘట్టాలు ఎన్నో వచ్చి ఉంటాయి. తెలుగువారికి ఇప్పుడిది కొత్తగా అనిపించవచ్చు. కానీ కాలం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సందర్భాలను, ప్రారంభాలను ఆవిష్కరిస్తూ ముందుకు పోతూనే ఉంటుంది. ప్రతి పరిణామమూ పాతబడుతూ కొత్త జీవితాన్ని చిగురింపజేస్తూనే ఉంటుంది. ఈ ఉద్విగ్న క్షణాన్ని నిబ్బరంగా,ఆత్మవిశ్వాసంతో, ఓరిమితో దాటుకుంటూ  భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే ఇప్పుడిక చేయవలసింది.

తెలంగాణ డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ప్రత్యేకించి 2000 సంవత్సరం నుంచి మూడు ప్రాంతాలప్రజలూ ఆ డిమాండ్ తో  సహజీవనం చేస్తున్నారు. ఆ డిమాండ్ ఇతర అనేక అంశాలను అధిగమించి ఒక భావోద్వేగ అంశంగా అప్పటినుంచీ మరింత crystalize అయిందన్న సంగతీ అందరికీ తెలుసు. భావోద్వేగాల ముందు ఏ తర్కమూ, రీజనింగూ పని చేయవని నేను అప్పుడే తెలుసుకున్నాను. జనంలో ఒక ఆకాంక్ష అంటూ మొలకెత్తితే అది ఎప్పటికైనా చెట్టుగా ఎదుగుతుంది. ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో అది అసలే సాధ్యం కాదు.

నా ఉద్దేశంలో తెలంగాణ 2004లో, కాంగ్రెస్, టీఆర్ ఎస్ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నప్పుడే వచ్చింది. ఆ విధంగా చూస్తే పదేళ్ళు ఆలస్యమైంది. పోనీ దానిని ప్రమాణంగా తీసుకోదలచుకోకపోతే 2009 డిసెంబర్ లో చిదంబరం ప్రకటన చేసినప్పుడే వచ్చింది. ఆ విధంగా నాలుగేళ్ళు ఆలస్యమైంది. ఈ ఆలస్యం రెండు ప్రాంతాలనూ నష్టపరిచింది. మొత్తం తెలుగువారి అజెండాను తెలంగాణ ఒక్కటే ఆక్రమించుకుంది. తెలుగువారిని ముందుకు తీసుకువెళ్లవలసిన అన్ని అజెండాలూ స్తంభించిపోయాయి. అభివృద్ధిలో తెలుగువారు కనీసం అయిదేళ్లు వెనకబడిపోయారు.

రెండు రాష్ట్రాలు ఏర్పడడం వల్ల కొంపలేమీ మునిగిపోవు, విభజనను పాలనా సౌలభ్య కోణం నుంచి చూస్తే బాగుండునని నేను ముందునుంచీ ఆశించాను. కానీ అలా జరగలేదు. రెండు వైపులా ఆవేశకావేషాలు కట్టలు తెంచుకున్నాయి. మీ భాష వేరు, మా భాష వేరు; మీ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు అని అనుకునే వరకూ వెళ్ళాయి. అదే నన్ను ఎక్కువ బాధించింది. చివరికి విభజన బిల్లులోనూ అలాంటి మాటలు ఉండడం ఆ వాదానికి ఒక అధికారికతను కల్పించి మరింత బాధించింది. ఒకవేళ భాష, సంస్కృతి వగైరాలలో తేడాలు ఉన్నా, భారతదేశ స్వభావ రీత్యా అవి విభజనకు ప్రాతిపదిక కావని మనకు తెలుసు. కానీ ఉద్రేకాల ఉప్పెనలో ఆ విచక్షణ కొట్టుకు పోయింది. ఇకనైనా ఆ విచక్షణను పునరుద్ధరించుకోవాలి.

ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నా తెలుగువారిగా ఒక్కటై ముందుకెళ్ళాలి. ఉభయులూ కలసి తెలుగువారి చరిత్రలో కొత్త పేజీ తెరవాలి. 

Wednesday, February 19, 2014

కోసల..మగధ: ఓ సినిమా కథ (చివరి భాగం)

పసనేది రోజు రోజుకీ రాజ్యం పట్ల నిరాసక్తు డవుతున్నాడు. నిర్లిప్తు డవుతున్నాడు. బౌద్ధ సన్యాసులతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతున్నాడు. దానధర్మాలు చేస్తున్నాడు. మిగతా సమయాన్ని తన ఏకాంత మందిరంలో, తనలో తాను గడుపుతున్నాడు.

అతని మీద బుద్ధుని ప్రభావమే కాక, బుద్ధుని ప్రభావం ఉన్న వాసభ ఖత్తియ ప్రభావం కూడా పడుతోంది.  ఆమె దాసి కూతురనీ, తనను మోసగించి ఆమెను కట్టబెట్టారనే కోపం అతని మనసులో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. ఆమె సౌశీల్యం, వ్యక్తిత్వం ఆమె వైపు అతన్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. ఆమె కేవలం శరీర సుఖాన్నీ, కొడుకునీ ఇచ్చిన అర్థాంగిగా అతనికి కనిపించడం లేదు. తనను సేద తీర్చే చలవపందిరిలా, కంటి వెలుగులా, ఆత్మబంధువులా కనిపిస్తోంది. ఆమె నాగ జాతీయుల ఆడబడుచు. బుద్ధుడికి నాగజాతీయులపై విశేష గౌరవాభిమానాలు ఎందుకున్నాయో ఆమెను చూస్తే పసనేదికి అర్థమవుతోంది.

ఇంతటి ఉత్తమురాలి రక్తం పంచుకున్న కొడుకు అంత కర్కోటకుడు ఎలా అయ్యాడో  నని ఒక్కోసారి పసనేదికి  ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆ వెంటనే అతనికే సమాధానం స్ఫురిస్తూ ఉంటుంది. అతను తన రక్తం కూడా పంచుకుని పుట్టాడు. తనలోని కర్కోటకాంశ అతనికి సంక్రమించడంలో ఆశ్చర్యం ఏముంది?


ఈ ఊహ రాగానే పసనేదికి తన గుండెను ఏదో కర్కశహస్తం మెలి తిప్పేసినట్టు అయిపోతుంది. విషాదంతో, పశ్చాత్తాపంతో అతని తల పాతాళం లోకి దిగబడిపోతున్నట్టు అనిపిస్తుంది...

(పూర్తి వ్యాసం

Friday, February 14, 2014

యూపీఏ పతనం ఎప్పుడు ప్రారంభమైంది?

పార్టీ పతనమైనా, ప్రభుత్వం పతనమైనా ఒక్కసారిగా జరగదు. కొంతకాలం తీసుకుంటుంది. దానికి ఒక ప్రారంభం అంటూ ఉంటుంది. వాటిని కాస్త నిశితంగా గమనించేవారికి ఎవరికైనా ఆ పతనం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలుస్తూనే ఉంటుంది. పతనం వైపు వెడుతున్నామనే గ్రహింపు ఆ పార్టీకీ లేదా ప్రభుత్వానికీ వెంటనే కలిగితే అది పతనాన్ని ఆపడానికి చర్యలు తీసుకుంటుంది. ఆ గ్రహింపు కలగక పోయినా, కలిగినా పతనాన్ని ఆపగల శక్తి లేకపోయినా అవి పట్టు వదిలేస్తాయి. పతనానికి మౌన సాక్షిగా ఉండిపోతాయి. తమ సమాధిని తమే తవ్వుకునే ఘడియకోసం నిరీక్షిస్తుంటాయి.

యూపీఏ విషయంలో అదే జరిగింది...

నా ఉద్దేశంలో యూపీఏ పతనానికి ఒక స్పష్టమైన ప్రారంభం ఉంది. అదేమిటి?

అన్నా హజారే ఉద్యమం అని ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న రాజకీయ వ్యాఖ్యాత అన్నారు. అది పాక్షిక సమాధానం మాత్రమే. ఎందుకంటే అన్నా హజారే ఉద్యమానికి కూడా యూపీఏ ప్రభుత్వం ఓ బలమైన కారణం అందించాలి కదా!

కనుక యూపీఏ పతనానికి ప్రారంభం ఆ కారణం. ఆ కారణాన్ని స్పష్టంగా చెప్పాలంటే అది, కామన్వెల్త్ క్రీడలపై వచ్చిన అవినీతి ఆరోపణలు.

మీరోసారి ఆ రోజుల్లోకి వెళ్ళి ఓసారి గుర్తుచేసుకోండి. టీవీ చానెళ్లు రోజుల తరబడి కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణలపై ఫోకస్ చేశాయి. ప్రభుత్వం ఇమేజ్ దాంతో అడుగంటిపోవడం ప్రారంభించింది. విచిత్రం ఏమిటంటే, తన ఇమేజ్ అడుగంటిపోతున్నా మన్మోహన్ ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుంది. ప్రభుత్వం ఇమేజ్ అడుగంటడానికి అవినీతి ఆరోపణలు కారణం కాదు. దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోకపోవడం! ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేకపోయిందనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అక్కడ మీకు అనుమానానికి అవకాశమిచ్చేది తెరవెనుక నుంచి పార్టీ అధినాయకత్వం జోక్యం. లేదా మన్మోహన్ వ్యక్తిగత వ్యవహారసరళి కూడా కావచ్చు. ఇలాంటివి మామూలే ననే ఉదాసీన భావం ఆయనకు కలిగి ఉండచ్చు. కారణం ఏదైనా అది భవిష్యత్తులో ఎప్పటికైనా బయటపడుతుంది.

ఇంకొకటి కూడా ఉంది...కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఒక రకమైన పనితీరుకు అలవాటు పడింది. కాంగ్రెస్ అనే ఏముంది? అన్ని పార్టీలూ. అధికారపక్ష ఉమ్మడి సంస్కృతి అని దానిని అనచ్చు. అందులో పారదర్శకత ఉండదు. అవినీతిపై ఉదాసీనత ఉంటుంది. ఆరోపణల దర్యాప్తుపై తాత్సారం ఉంటుంది. దర్యాప్తును మసిపూసి మారేడు కాయను చేయడం ఉంటుంది. ఇలాంటి అలవాటు పడిన అధికారసంస్కృతి ఇలాగే కొనసాగుతున్నప్పుడు ఇంకో చిత్రం చూడండి...క్షేత్రస్థాయిలో అది ఇంకేమాత్రం కుదరని పరిస్థితి ఉంది. టీవీ చానెళ్ల విస్తరణ, సమాచారహక్కు, పౌరసమాజ చైతన్యం వగైరాలు పారదర్శకత లోపించిన అధికారసంస్కృతికి ఒక వైరుధ్యంగా ముందుకు వచ్చాయి. ఈ క్షేత్రవాస్తవిక గమనించకపోవడం కూడా యూపీఏ పతనదశకు ఒక కారణం.

యూపీఏ పతనం ఎప్పుడు మొదలైందనే మొదటి ప్రశ్నకు వెడితే, కామన్వెల్త్ క్రీడలనే సంగతిని నేను అప్పుడే నిర్ధారణకు వచ్చాను. అప్పుడే దాని పతన సూచనలను నేను పోల్చుకున్నాను.  ఆ తర్వాత 2జీపై దాని స్పందన నా ఊహకు మరింత ఊతమిచ్చింది. అంతేకాదు, దేశరాజకీయ వ్యవస్థలో ఒక మహాశూన్యం ఏర్పడిన సంగతిని నేనే కాదు ఆరోజుల్లో చాలామందే పోల్చుకుని ఉంటారు.

ప్రశ్న ఏమిటంటే, యూపీఏ వ్యవహరణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని ప్రతిపక్షాలు, అందులోనూ ప్రధానప్రతిపక్షమైన బీజేపీ భర్తీ చేయాలికదా, అందులోకి అన్నా హజారే ఎలా అడుగుపెట్టారు? ఈ ప్రశ్నకు నిష్పాక్షికంగా జవాబు చెప్పుకుంటే, ఈ శూన్యం ఏర్పడానికి యూపీఏ ఒక్కటే బాధ్యురాలు కాదు, బీజేపీ కూడా! మీరు గమనించే ఉంటారు, కామన్వెల్త్, 2జీ వగైరాలు నెలలు తరబడి political discourse ను ఆక్రమించుకుని ఉన్నంతకాలం బీజేపీ అవినీతిపై ఆత్మరక్షణలోనే ఉంటూ వచ్చింది. యెడ్యూరప్ప ఉదంతంతో గొంతు పెగలని స్థితిలోనే ఉంది. అన్నా హజారేకు అవకాశమిచ్చింది అదే. ఒక్క మాటలో చెప్పాలంటే, హెచ్చుతగ్గుల తేడాతో బీజేపీ కూడా కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలోనే ఉంది. ఒక పార్టీగా విఫలమైన ఆ పార్టీ నరేంద్ర మోడీ అనే వ్యక్తి బలంతో ఇప్పుడు ఊపిరి తెచ్చుకుని అధికారానికి చేరువయ్యే స్థితిలో ఉంది. ఈ పరిణామంతో రేపు ఒక పార్టీగా దాని రూపురేఖలు ఎలా మారతాయో భవిష్యత్తుకు వదిలిపెట్టవలసిన ఆసక్తికర ప్రశ్న.

ఇప్పటికే ఈ పోస్ట్ పెద్దది అయింది కనుక, మళ్ళీ మళ్ళీ చెప్పుకునే అవకాశం వస్తుంది కనుక ఇక్కడితో విరమిస్తూ చివరగా ఒక మాట అంటాను.

మీడియాలో ఎన్ని లోపాలు ఉన్నాసరే, మీడియాను ఎవరేమన్నా అన్నాసరే, యూపీఏ పతనఘట్టంలో ప్రముఖ పాత్ర పోషించింది, ప్రతిపక్షాల కన్నా మీడియాయే! కానీ ఓ గుర్తింపు, కృతజ్ఞత లేని పరిస్థితి దానిది. అయినా వాటి కోసం అది పని చేయలేదు. దాని పని అది చేసింది.


Thursday, February 13, 2014

కోసల, మగధ...ఓ సినిమా కథ-3

మగధను పాలిస్తున్న బింబిసారుడికి ఒక కొడుకు. పేరు, అజాతశత్రు. అతనికిప్పుడు ఇరవయ్యేళ్లు. అజాతశత్రు కొంతకాలంగా అసహనంగా ఉంటున్నాడు. తండ్రి మీద కోపం ముంచుకొస్తోంది. కోపం ద్వేషంగా మారుతోంది.

నీ తండ్రికి నీ తాత పదిహేనేళ్ళకే సింహాసనం అప్పగించి తప్పుకున్నాడు. నీకు ఇరవయ్యేళ్లు వచ్చాయి. అయిదేళ్లు ఆలస్యమైపోయింది అని వస్సకారుడు తన చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాడు. వస్సకారుడు తన ఈడువాడే. బ్రాహ్మణుడు. మంచి తెలివితేటలు ఉన్నవాడు.

అతనంటున్నదీ నిజమే. తన మేనమామ పసనేదికి కూడా ఆయన తండ్రి పదిహేనేళ్ళకే రాజ్యం అప్పగించాడు. అదీగాక, తమ రాజ్యం ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. అక్కడ  మేనమామ మాత్రం తన రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. తన తండ్రి బింబిసారుడు నిమ్మకు నీరెత్తినట్టు కాలం దొర్లిస్తున్నాడు.

ఈ పరిస్థితిని ఊహించుకుంటే తనకి ఆగ్రహమే కాక ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఎందుకంటే, రాజ్యవిస్తరణ అవకాశాలు తన మేనమామకి కంటే తమకే ఎక్కువ ఉన్నాయి. తమ అధీనంలో కావలసినంత లోహ సంపద ఉంది. వస్సకారుడు తనతో రోజూ ఇదే చర్చ. నీ తండ్రి వల్ల ఏమీ కాదు, ఆయన అడ్డు తొలగించుకో, నువ్వు చేతుల్లోకి తీసుకో అని చెబుతున్నాడు.


ఆలోచించిన కొద్దీ ఏదో ఒకటి చేసి తీరవలసిందే నన్న తొందర అజాతశత్రులో పెరిగిపోతోంది. ఏం చేయాలో కూడా కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే, అందుకు మనసు రాయి చేసుకోవాలి...

(పూర్తి వ్యాసం









Tuesday, February 11, 2014

'1984 ఢిల్లీ-2002 గుజరాత్' స్పందనల మధ్య తేడా ఎందుకుంది?

'2002 గుజరాత్' ప్రస్తావన వచ్చినప్పుడల్లా,  '1984 ఢిల్లీ' కూడా ప్రస్తావనకు వస్తోంది. ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువగా వస్తోంది.

దాంతోపాటే, అంతగా కాకపోయినా,  ఇంకో ప్రశ్న కూడా ప్రస్తావనకు వస్తోంది. అది:  '2002 గుజరాత్' వివాదాస్పదం, సంచలనాత్మకం అయినంతగా '1984 ఢిల్లీ' ఎందుకు కాలేదు?

టీవీ డిబేట్లలో కొందరు టీవీ జర్నలిస్టులు దానికి ఒక సమాధానం చెబుతూ వస్తున్నారు. అదేమిటంటే, 1984లో ఇన్ని టీవీ న్యూస్ చానెళ్లు లేవు కనుక ఢిల్లీ ఊచకోత తీవ్రత జనానికి తెలియలేదు కనుక అది అంత వివాదాస్పదం, సంచలనాత్మకం కాలేదట! 2002లో టీవీ చానెళ్లు మూల మూలలకూ విస్తరించాయి కనుక గుజరాత్ ఊచకోత జనం దృష్టిలో బాగా పడిందట! టీవీ చానెళ్లు లేక పోవడం కాంగ్రెస్ కు అదృష్టం తెచ్చిపెడితే, ఉండడం నరేంద్ర మోడీకి దురదృష్టం తెచ్చిపెట్టిందన్నమాట.

నిజమా? ఆ సమాధానంతో మీరు ఏకీభవిస్తారా??

నాకు కూడా మొదట్లో అది సహేతుక సమాధానమనే అనిపించింది. కానీ  ఇంకోవైపునుంచి చూస్తే అలా అనిపించడం లేదు.

ఢిల్లీలో 3000 వేల మంది శిక్కులను నరికి పోగులు పెడితే, టీవీ చానెళ్లు లేవు కనుక దాని తీవ్రత జనానికి తెలియలేదా? కాంగ్రెస్ కు 400 పైగా లోక్ సభ సీట్లతో అఖండ విజయం అందించారా? ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా? ఢిల్లీలో ఏం జరిగిందో తెలియని అంధయుగంలో మన దేశం ఉందా? దాని తీవ్రత ఎంతో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉందా? టీవీ చానెళ్లు లేకపోతే మానె, వార్తా పత్రికలు లేవా? పల్లెటూళ్ళ రచ్చబండ దాకా వార్తా పత్రికలు వెళ్ళడం లేదా? ఇంకా దారుణం, కాంగ్రెస్ కు అపూర్వ విజయం కట్టబెడతారా?

ఆలోచించిన కొద్దీ జర్నలిస్టు మిత్రుల మాటల్లో నాకు ఎలాంటి సహేతుకతా కనిపించడంలేదు. నాకు సమస్య కాంగ్రెస్ తో కన్నా జనంతో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. అది కూడా 1984 లో తగిన వయస్సూ, పరిణతి ఉన్న జనాలతో! వారి ఆలోచనల్లో 3000 వేల మందిని పరమ ఘాతుకంగా చంపడం గాఢమైన ముద్ర వేయలేదా? వాళ్ళలో ఆగ్రహావేశాలు పెల్లుబుకలేదా? పెల్లుబుక లేదంటే, వారి మైండ్ సెట్ ఎలాంటిదనుకోవాలి? ఎంతటి హింసనైనా మామూలుగా తీసుకునే ఒక నిర్లిప్త స్వభావం వారిదనుకోవాలా? ఈ మానసిక కోణాన్ని ఎవరైనా ఇంతవరకు పరిశీలించారా?

నేను కూడా ఈ జనంలోకి(తగినంత వయసు, పరిణతి ఉన్న) వస్తానేమో నాకు తెలియదు. కాకపోతే 1984లో నేను అప్పుడప్పుడే పత్రికా రంగంలోకి అడుగుపెట్టాను. ఒకవేళ నేను కూడా ఈ జనంలో భాగమే ననుకుంటే, వారి గురించి అన్నవి నాకూ వర్తిస్తాయి.


Sunday, February 9, 2014

మోడీ ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకా?!

రాజకీయనాయకులు ఆడిస్తున్నారా...లేక మీడియా ఆడిస్తోందా...లేక రాజకీయనాయకులూ, మీడియా కలసి ఆడిస్తున్నారా? మొత్తమ్మీద జనాన్ని ఆడిస్తున్నారు...జనంతో ఆడుకుంటున్నారు!

మీడియా, రాజకీయనాయకులూ కలసి జనాన్ని ఎలా ఆడిస్తారో జనసామాన్యానికి తెలిసే అవకాశం లేదు. అది రాజకీయనాయకులకూ, మీడియాకు మాత్రమే తెలుస్తుంది.

నాకేమనిపిస్తుందంటే, ప్రజాస్వామ్యం అంటే రాజకీయనాయకులూ, మీడియా కలసి రోజుల తరబడి, నెలల తరబడి, ఏళ్లతరబడి జనంతో ఆడుకొనే ఖరీదైన ఆట.

మీడియాలో ఉన్నవాళ్లకి ఈ రహస్యం కొంతవరకు తెలుస్తుంది. వాళ్ళు చాలా విషయాలలో  జరగబోయేది సరిగా చెప్పగలుగుతారు. ఎప్పుడో కానీ వాళ్ళ లెక్క తప్పదు. ఆత్మస్తుతి అనుకోకపోతే సరదాగా నా అనుభవాలు మీతో పంచుకుంటాను.

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం గురించి కోర్ కమిటీ సమావేశానికి వారం పది రోజుల ముందునుంచీ మీడియా అదేపనిగా ఊదరగొట్టింది. దానిపై డిబేట్లు కూడా జరిపింది. "చూస్తూ ఉండండి, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించదు" అని పది రోజులముందే నేను జర్నలిస్టు మిత్రులతో అన్నాను. అదే జరిగింది.

తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నాక సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్కుమ్మడి పైకి లేచింది. అశోక్ బాబు అనే ఎన్జీవో నాయకుడు హఠాత్తుగా వార్తలలోకి వచ్చారు. ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చి తాడో పేడో తేల్చగల మనిషిగా ఆశాజీవులకు కనిపించారు. సమైక్యాంధ్రవాదులలో, ముఖ్యంగా హైదరాబాద్ లోని సీమాంధ్రజనంలో విభజన ఆగిపోతుందనే భ్రమ కలిగించారు. సమైక్యాంధ్ర వాదం ఇంత ఉవ్వెత్తున ఎగసిపడుతుందని కేంద్రం ఊహించి ఉండదని, ఇప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చని చాలామంది విద్యావంతులే నాతో అన్నారు. అశోక్ బాబును ప్రశంసించారు. ఒక టీవీ చానెల్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు, కేంద్రం ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లదని చెప్పాను. అదే జరిగింది. ఎలా చెప్పానంటే, నా అంచనాలు, నా లెక్కలు నాకున్నాయి.

ఆరు రాజ్యసభ స్థానాలకు రాష్ట్రంనుంచి జరుగుతున్న ఎన్నికలనే తీసుకోండి. కొంతమంది తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పైగా కాంగ్రెస్ నాయకత్వానికి సమైక్యాంధ్ర డిమాండ్ తడాఖా చూపించడానికే బరిలోకి దిగామన్నారు, ఇంకేముంది, రాజ్యసభ ఎన్నికలపై ప జనంలో ఎక్కడలేని ఉత్కంఠనూ, అధికారిక అభ్యర్థులలో ఆందోళనను సృష్టించడానికి మీడియా యథాశక్తి ప్రయత్నించింది. ప్రత్యేక కథనాలు రాసింది. చానెళ్లు ఎంతో air time ను ఖర్చుపెట్టాయి. కానీ అధికారిక అభ్యర్థులే బరిలోకి మిగులుతారని నాకు తెలుసు. అదే జరిగింది. నాకు ఎలా తెలుసునంటే మన రాజకీయనాయకుల వ్యక్తిత్వం మీద నాకు గురి ఉంది కనుక. principled stand తీసుకుని రాజకీయభవిష్యత్తుతో ఆడుకోడానికి వీళ్ళు వెనకటి విలువల దృష్టి ఉన్న చాదస్తపు రాజకీయ నాయకులు కాదు. కనుక వీరివి ఉత్తరకుమార ప్రగల్భాలని, తాటాకు చప్పుళ్లని ఊహించడానికి పెద్ద తెలివి అక్కరలేదు. మరెందుకు తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడ్డారంటారా? చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డి అనే జనానికి తెలియని ఆ ఇద్దరు అభ్యర్థులూ free గా ఎంత air time ను, న్యూస్ పేపర్ జాగాను వాడుకును పబ్లిసిటీ తెచ్చుకున్నారో ఒకసారి చూడండి.

ఇప్పుడు, నిజమో అబద్ధమో ఇంకా తేలవలసిఉన్న ఒక గెస్ గురించి చెబుతాను...

నరేంద్ర మోడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకి అని చాలా రోజులుగా నా మనసుకు గట్టిగా అనిపిస్తోంది. అలా అనిపించడానికి కారణాలు ఉన్నాయి. నా అంచనాలో మోడీ వ్యక్తిత్వం ఇందిరా గాంధీ వ్యక్తిత్వం లాంటిది. అందులో తాము అనుకున్న అజెండాయే తప్ప ఇంకొకళ్ళ అజెండా ఉండే చాన్సే లేదు. ఈ దేశంలోని ఒక రాష్ట్రాన్ని విడగొట్టి ఇంకో రాష్ట్రాన్ని సృష్టించడం అన్నది ఇందిర, మోడీ తరహా వ్యక్తిత్వాలు ఉన్న వారి అజెండాలో ఉండడానికి అసలే అవకాశం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లకు స్టేటస్ కొ ను చెరపడం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఒకవేళ చెరపాలనుకున్నా అది  తమ అజెండాలో ఉండాలి.  తమకు ఇష్టమైనదే వీరు చేస్తారు తప్ప ఇంకొకరు అడిగింది చేయరు. మోడీ తెలంగాణ గురించి మాట్లాడకపోవడం కూడా నా అనుమానానికి ఒక సమర్థన. రాష్ట్ర విభజన pre-modi అజెండా తప్ప post-modi అజెండా కాదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు వచ్చాక తెలంగాణాను బీజేపీ ఆపగలదా అన్న ప్రశ్నను అలా ఉంచితే,  మొత్తానికి post-modi సందర్భంలో బీజేపీ  ఈ  విషయంలో లోలోపల ఏవో మల్లగుల్లాలు పడుతోందనే నాకు అనిపిస్తోంది. నా అంచనా ప్రకారం మోడీ రాష్ట్రవిభజనకు వ్యతిరేకి అనే విషయం ఎప్పటికైనా బయటపడితే, అది నిజమైన నా అంచనాలలో ఇంకొకటి అవుతుంది.





Thursday, February 6, 2014

కోసల, మగధ...ఓ సినిమా కథ-2


కోసలను ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు. పసనేది అనే దేశినామానికి ప్రసేనజిత్తు సంస్కృతీకరణ. కోసలను పాలించిన పూర్వరాజులందరూ ఇక్ష్వాకు వంశీకులు.  కనుక తనను కూడా ఇక్ష్వాకు వంశీకునిగా పసనేది చెప్పుకునేవాడు. కానీ నిజానికి అతడు ఆదివాసుల్లోనూ ఓ కింది తెగకు చెందినవాడు. దానిని మాతంగకులంగా చెబుతారు. అదే ఇప్పుడు మాంగ్ అని పిలిచే ఓ అస్పృశ్యకులం. అతని భార్యపేరు మల్లిక. ఆమె ఒక తోటమాలి కూతురు.

తనను పసనేది ఇక్ష్వాకు వంశీకునిగా చెప్పుకున్నా బ్రాహ్మణులు అతనికి ఆ గుర్తింపును ఇవ్వలేదు. అతనిని వ్రాత్య క్షత్రియుడనీ, క్షత్రబంధుడని మాత్రమే అన్నారు. ఇవి నిమ్నలేదా న్యూనార్థకాలు. అధికారస్థానంలో, లేదా సైనికవృత్తిలో ఉన్నప్పటికీ వైదిక ఆచారాల పరిధిలోకి రానివారినీ, వాటిని పాటించనివారినీ వ్రాత్య క్షత్రియులనీ, క్షత్రబంధులనీ అనేవారు. ఇటువంటివారు అధికారం చేజిక్కుంచుకున్నప్పుడు సాంప్రదాయిక క్షత్రియుడన్న గుర్తింపుకు, బ్రాహ్మణుల గుర్తింపుకు పాకులాడేవారు. యజ్ఞయాగాలు చేసేవారు. బ్రాహ్మణులకు గ్రామాలు దానం చేసేవారు. క్షత్రియులుగా తమకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న తెగతో వివాహసంబంధం పెట్టుకోవాలని అనుకునేవారు.

పసనేది కూడా అలాగే అనుకుంటున్నాడు...

Wednesday, February 5, 2014

మరి పీవీ నరసింహారావు సంగతేమిటి?

నరేంద్ర మోడి కోల్ కతా ర్యాలీలో మాట్లాడుతూ ఇందిరా గాంధీ తర్వాత ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసి ఉండాల్సింది అన్నారు. మరి పీవీ నరసింహారావు సంగతేమిటి? తన మాట తెలుగువాళ్లను నొప్పిస్తుందని మోడీకి తోచకపోవడం ఆశ్చర్యం. ప్రణబ్ ముఖర్జీ నిస్సందేహంగా ప్రధాని కావడానికి అర్హులే. అయితే, మన్మోహన్ సింగ్ స్థానంలో ప్రణబ్ ప్రధాని కావలసింది అని అన్నా అర్థవంతంగా ఉండేది. తను రాష్ట్రపతి అయ్యేవరకు, యూపీయేలో ప్రధాని నిర్వహించవలసిన పోలిటికల్ మేనేజ్ మెంట్ ను చాలావరకు నిర్వహించింది ప్రణబ్ ముఖర్జీయే. 

Monday, February 3, 2014

ఆ కుర్రాణ్ణి చంపిన పాపం ఏ గంగనీళ్లతో కడిగితే పోతుంది?!

ఆ కుర్రాడి హత్య గుర్తొచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమంటుంది..అయ్యో, ఈ దేశం ఏమైపోతోందనిపిస్తుంది...ఈ దేశం గొప్పతనం గురించి చెప్పేవన్నీ అబద్ధాలనిపిస్తుంది...తీవ్రనైరాశ్యం కలుగుతుంది...

ఇరవై ఏళ్ల కుర్రాడు...అరుణాచల్ ప్రదేశ్ వాడు...పేరు నిడోమ్ తనియమ్...పేరు కొత్తగా ఉందా?...ఉంటే మాత్రం? ఈ దేశంలో ఎంతమంది పేర్లు ఇతర ప్రాంతాలవాళ్ళకు కొత్తగా ఉండవు? యూరప్ వాళ్ళకు, అమెరికన్లకు కొత్తగా వినిపించే, నోరు తిరగని పేర్లవాళ్లు ఎంతమంది మనదేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళడంలేదు? చదువుకోవడం లేదు? ఉద్యోగాలు చేయడం లేదు? వాళ్ళను అక్కడి వాళ్ళు చంపేస్తున్నారా?

మనదేశం ఆ దేశాలకన్నా ఎందులో గొప్పండీ?

నిడోమ్ తనియమ్ వేరే దేశం వాడు కాదు. ఈ దేశం వాడు. దేశరాజధానికి చదువుకోడానికి వచ్చాడు. అతన్ని ఎందుకు చంపేశారు?? ఏ గంగ నీళ్ళతో కడిగితే ఆ పాపం పోతుంది??

అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే నంటూ చైనాతో పోరాడుతున్నాం. అరుణాచల్ ప్రదేశ్ మనుషులు మనవాళ్లు కారా??