Friday, February 14, 2014

యూపీఏ పతనం ఎప్పుడు ప్రారంభమైంది?

పార్టీ పతనమైనా, ప్రభుత్వం పతనమైనా ఒక్కసారిగా జరగదు. కొంతకాలం తీసుకుంటుంది. దానికి ఒక ప్రారంభం అంటూ ఉంటుంది. వాటిని కాస్త నిశితంగా గమనించేవారికి ఎవరికైనా ఆ పతనం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలుస్తూనే ఉంటుంది. పతనం వైపు వెడుతున్నామనే గ్రహింపు ఆ పార్టీకీ లేదా ప్రభుత్వానికీ వెంటనే కలిగితే అది పతనాన్ని ఆపడానికి చర్యలు తీసుకుంటుంది. ఆ గ్రహింపు కలగక పోయినా, కలిగినా పతనాన్ని ఆపగల శక్తి లేకపోయినా అవి పట్టు వదిలేస్తాయి. పతనానికి మౌన సాక్షిగా ఉండిపోతాయి. తమ సమాధిని తమే తవ్వుకునే ఘడియకోసం నిరీక్షిస్తుంటాయి.

యూపీఏ విషయంలో అదే జరిగింది...

నా ఉద్దేశంలో యూపీఏ పతనానికి ఒక స్పష్టమైన ప్రారంభం ఉంది. అదేమిటి?

అన్నా హజారే ఉద్యమం అని ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న రాజకీయ వ్యాఖ్యాత అన్నారు. అది పాక్షిక సమాధానం మాత్రమే. ఎందుకంటే అన్నా హజారే ఉద్యమానికి కూడా యూపీఏ ప్రభుత్వం ఓ బలమైన కారణం అందించాలి కదా!

కనుక యూపీఏ పతనానికి ప్రారంభం ఆ కారణం. ఆ కారణాన్ని స్పష్టంగా చెప్పాలంటే అది, కామన్వెల్త్ క్రీడలపై వచ్చిన అవినీతి ఆరోపణలు.

మీరోసారి ఆ రోజుల్లోకి వెళ్ళి ఓసారి గుర్తుచేసుకోండి. టీవీ చానెళ్లు రోజుల తరబడి కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణలపై ఫోకస్ చేశాయి. ప్రభుత్వం ఇమేజ్ దాంతో అడుగంటిపోవడం ప్రారంభించింది. విచిత్రం ఏమిటంటే, తన ఇమేజ్ అడుగంటిపోతున్నా మన్మోహన్ ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుంది. ప్రభుత్వం ఇమేజ్ అడుగంటడానికి అవినీతి ఆరోపణలు కారణం కాదు. దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోకపోవడం! ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేకపోయిందనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అక్కడ మీకు అనుమానానికి అవకాశమిచ్చేది తెరవెనుక నుంచి పార్టీ అధినాయకత్వం జోక్యం. లేదా మన్మోహన్ వ్యక్తిగత వ్యవహారసరళి కూడా కావచ్చు. ఇలాంటివి మామూలే ననే ఉదాసీన భావం ఆయనకు కలిగి ఉండచ్చు. కారణం ఏదైనా అది భవిష్యత్తులో ఎప్పటికైనా బయటపడుతుంది.

ఇంకొకటి కూడా ఉంది...కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఒక రకమైన పనితీరుకు అలవాటు పడింది. కాంగ్రెస్ అనే ఏముంది? అన్ని పార్టీలూ. అధికారపక్ష ఉమ్మడి సంస్కృతి అని దానిని అనచ్చు. అందులో పారదర్శకత ఉండదు. అవినీతిపై ఉదాసీనత ఉంటుంది. ఆరోపణల దర్యాప్తుపై తాత్సారం ఉంటుంది. దర్యాప్తును మసిపూసి మారేడు కాయను చేయడం ఉంటుంది. ఇలాంటి అలవాటు పడిన అధికారసంస్కృతి ఇలాగే కొనసాగుతున్నప్పుడు ఇంకో చిత్రం చూడండి...క్షేత్రస్థాయిలో అది ఇంకేమాత్రం కుదరని పరిస్థితి ఉంది. టీవీ చానెళ్ల విస్తరణ, సమాచారహక్కు, పౌరసమాజ చైతన్యం వగైరాలు పారదర్శకత లోపించిన అధికారసంస్కృతికి ఒక వైరుధ్యంగా ముందుకు వచ్చాయి. ఈ క్షేత్రవాస్తవిక గమనించకపోవడం కూడా యూపీఏ పతనదశకు ఒక కారణం.

యూపీఏ పతనం ఎప్పుడు మొదలైందనే మొదటి ప్రశ్నకు వెడితే, కామన్వెల్త్ క్రీడలనే సంగతిని నేను అప్పుడే నిర్ధారణకు వచ్చాను. అప్పుడే దాని పతన సూచనలను నేను పోల్చుకున్నాను.  ఆ తర్వాత 2జీపై దాని స్పందన నా ఊహకు మరింత ఊతమిచ్చింది. అంతేకాదు, దేశరాజకీయ వ్యవస్థలో ఒక మహాశూన్యం ఏర్పడిన సంగతిని నేనే కాదు ఆరోజుల్లో చాలామందే పోల్చుకుని ఉంటారు.

ప్రశ్న ఏమిటంటే, యూపీఏ వ్యవహరణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని ప్రతిపక్షాలు, అందులోనూ ప్రధానప్రతిపక్షమైన బీజేపీ భర్తీ చేయాలికదా, అందులోకి అన్నా హజారే ఎలా అడుగుపెట్టారు? ఈ ప్రశ్నకు నిష్పాక్షికంగా జవాబు చెప్పుకుంటే, ఈ శూన్యం ఏర్పడానికి యూపీఏ ఒక్కటే బాధ్యురాలు కాదు, బీజేపీ కూడా! మీరు గమనించే ఉంటారు, కామన్వెల్త్, 2జీ వగైరాలు నెలలు తరబడి political discourse ను ఆక్రమించుకుని ఉన్నంతకాలం బీజేపీ అవినీతిపై ఆత్మరక్షణలోనే ఉంటూ వచ్చింది. యెడ్యూరప్ప ఉదంతంతో గొంతు పెగలని స్థితిలోనే ఉంది. అన్నా హజారేకు అవకాశమిచ్చింది అదే. ఒక్క మాటలో చెప్పాలంటే, హెచ్చుతగ్గుల తేడాతో బీజేపీ కూడా కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలోనే ఉంది. ఒక పార్టీగా విఫలమైన ఆ పార్టీ నరేంద్ర మోడీ అనే వ్యక్తి బలంతో ఇప్పుడు ఊపిరి తెచ్చుకుని అధికారానికి చేరువయ్యే స్థితిలో ఉంది. ఈ పరిణామంతో రేపు ఒక పార్టీగా దాని రూపురేఖలు ఎలా మారతాయో భవిష్యత్తుకు వదిలిపెట్టవలసిన ఆసక్తికర ప్రశ్న.

ఇప్పటికే ఈ పోస్ట్ పెద్దది అయింది కనుక, మళ్ళీ మళ్ళీ చెప్పుకునే అవకాశం వస్తుంది కనుక ఇక్కడితో విరమిస్తూ చివరగా ఒక మాట అంటాను.

మీడియాలో ఎన్ని లోపాలు ఉన్నాసరే, మీడియాను ఎవరేమన్నా అన్నాసరే, యూపీఏ పతనఘట్టంలో ప్రముఖ పాత్ర పోషించింది, ప్రతిపక్షాల కన్నా మీడియాయే! కానీ ఓ గుర్తింపు, కృతజ్ఞత లేని పరిస్థితి దానిది. అయినా వాటి కోసం అది పని చేయలేదు. దాని పని అది చేసింది.


No comments:

Post a Comment