Wednesday, October 1, 2014

గాంధీజీ తర్వాత చీపురు పట్టిన మోడీ

గాంధీ జయంతి సందర్భంగా స్వయంగా చీపురు పట్టి స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు.

నాకు గుర్తు ఉన్నంతవరకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాక, స్వయంగా చీపురు పట్టినవారు, కలరా వ్యాపించినప్పుడు పాయిఖానాలు కూడా శుభ్రం చేసిన నాయకుడు గాంధీజీ ఒక్కరే. ఇన్నేళ్లకు గాంధీజీ చేసిన పనిని మోడీజీ తలకెత్తుకున్నందుకు పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించాలి.

ఈ సందర్భంలో కిందటి ఏడాది జనవరి 30 న గాంధీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక  బ్లాగును  ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.

కాంగ్రెస్ సభల్లో చీపురు పట్టిన గాంధీ

గాంధీ కన్నా సుభాస్ చంద్ర బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప నాయకులని కొన్ని రోజుల క్రితం ఎం.ఐ.ఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ ముగ్గురూ గొప్ప నాయకులని అనడం వరకు బాగానే ఉంది. కానీ మధ్యలో గాంధీని తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడు కాడని అనడం ఎందుకో తెలియదు. సందర్భం, అవసరం లేకపోయినా గాంధీని రెక్క పుచ్చుకుని మరీ మధ్యలోకి  లాగి ఆయన మీద ఓ రాయి వేయడం చాలామందికి  పరిపాటిగా మారింది. పాపం ఆయన పువ్వులూ, రాళ్లూ రెంటినీ స్వీకరించక తప్పడం లేదు.

ఎవరు గొప్ప నాయకులో నిర్ణయించడానికి ఎవరి కొలమానాలు వాళ్లకుంటాయి. ఆ జోలికి పోకుండా చెప్పుకోవాలంటే గాంధీ ఎవరితోనూ పోల్చలేని నాయకుడు. ఆధునిక భారతదేశంలో ఆ చివరినుంచి ఈ చివరివరకు యావన్మందీ నాయకుడిగా గుర్తించిన ప్రథమ నాయకుడు ఆయనే. ఒక మహాసేనానిగా ఎంతో చాకచక్యంగా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేసిన ప్రథమ నాయకుడు కూడా ఆయనే. ఆచి తూచి సహచరులను ఎంపిక చేసుకోవడంలో, వారిని నేర్పుగా వాడుకోవడంలో, వారితో రాజకీయ సంబంధాలే కాక వ్యక్తిగత ఆత్మీయ సంబంధాలను పెంచుకోవడంలో, సహచరుల మధ్య పరస్పర మైత్రిని ప్రోత్సహించడంలో గాంధీ తనకు తనే సాటి అనిపించుకోగల నాయకుడు. గాంధీ గురించి అన్నీ పార్స్వాలనూ తెలుసుకుని ఆయన నాయకత్వ దక్షతను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బుద్ధినీ, హృదయాన్నీ కూడా అంచనా వేయాలంటే ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవాలి.

గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అలాంటి పుస్తకాలలో ఒకటి. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో తెలుసుకోడానికి అదొక పాఠ్య గ్రంథం. నేటి నాయకులందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

ఆ పుస్తకం ఆధారంగా గాంధీ గురించి కొన్ని ముచ్చట్లు...

గాంధీ 1901లో కలకత్తాలో జరిగిన ఏ.ఐ.సీ.సీ సమావేశాలలో పాల్గొన్నాడు. వెళ్ళేటప్పుడు నాటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రయాణిస్తున్న రైలులోనే తనూ ఎక్కాడు. మధ్యలో, ముందుగానే నిర్ణయించుకున్న స్టేషన్ లో దిగి అగ్రనేతల బోగీలోకి వెళ్ళి వాళ్ళను పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన బోగీలోకి వెళ్లిపోయాడు.

కలకత్తా సదస్సులో ఆయన రెండు పాత్రలు నిర్వహించాడు. గోఖలే సాయంతో దక్షిణాఫ్రికా పోరాటంపై తీర్మానం ప్రతిపాదించి అయిదు నిమిషాలు దానిపై మాట్లాడడం మొదటిది. ఒక చీపురు తీసుకుని సమావేశస్థలిని తుడిచి శుభ్రం చేయడం రెండవది. ఆయన ఆ పని చేస్తుంటే అంతా కళ్ళప్పగించి చూశారు తప్ప అందులో పాలుపంచుకోడానికి  ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత, కాంగ్రెస్ కార్యదర్శులలో ఒకడైన జానకీనాథ్ ఘోశాల్ గుట్టలా పోగుబడిన ఉత్తరాలకు సమాధానం రాయడంలో సతమతమవుతుంటే గాంధీ వెళ్ళి ఆయనకు సహకరించాడు. ఇన్ని చేస్తూనే చాలామంది నాయకులను కలసి మాట్లాడాడు. కాంగ్రెస్ పనితీరు గురించి మొత్తం సమాచారం రాబట్టాడు.

                                                                      *

No comments:

Post a Comment