Tuesday, October 21, 2014

ఇందిరా గాంధీ, మోడీల పోలిక గురించి మరోసారి...

ప్రతివారికీ రూపాయిలలో తూచడానికి ఏమాత్రం విలువ లేని చిన్న చిన్న సంతోషాలు ఉంటూఉంటాయి. సాధారణంగా ఆ సంతోషం విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికైనా అది చెబితే, 'ఓస్, అంతేనా? అదో గొప్ప విషయమా' అనేయచ్చు. ఎవరూ గుర్తించని పరిస్థితిలో వాళ్ళే దానిని వెల్లడించుకుని వాళ్ళ భుజం వాళ్ళే తట్టుకోవలసి వస్తుంది.

ఇప్పుడు నేను చేయబోతున్నది అదే!

నాకు కూడా చిన్న చిన్న సంతోషాలు ఉన్నాయి. అవి మరేం కాదు, ఆయా అంశాలలో నా అంచనాలు గురికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు కలిగే సంతోషాలు. అటువంటివి ఇదే బ్లాగులో కొన్ని ఇంతకుముందు పాఠకులతో పంచుకున్నాను. అది కూడా ఏడాది పైనే అయినట్టుంది. వాటిలో ఒకటి, నరేంద్ర మోడీ వ్యవహారశైలి ఇందిరాగాంధీ వ్యవహారశైలికి చాలా దగ్గరగా ఉంటుందన్నది. తెలంగాణవాదులు చాలా అదృష్టవంతులనీ, కేంద్రంలో యూపీఏ కాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండి ఉంటే, తెలంగాణ ఇప్పట్లో వచ్చేది కాదనీ కూడా అన్నాను. ఎందుకు వచ్చేది కాదో కూడా చెప్పాను. అందుకు కారణం నరేంద్ర మోడీ స్వభావంలోనే ఉందని చెప్పాను. సరిగ్గా ఇందిరా గాంధీది కూడా అదే స్వభావం అన్నాను.

ఇందిరా గాంధీ, నరేంద్ర మోడీల స్వభావం ఎలాంటిదంటే, తమ ఎజెండాలను ఇతరులతో అమలు చేయించడమే తప్ప ఇంకొకరి ఎజెండాలను వారు స్వీకరించే ప్రశ్నే లేదు. తెలంగాణకానీ, ఇంకొకటి కానీ వాళ్ళ ఎజెండాలో ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే. అవతలి వాళ్ళది ఎంత బలవత్తరమైన ఎజెండా అయినా సరే.

ఇంకొకటి ఏమిటంటే, ఈ స్వభావం వాళ్ళకి తాము చేయదలచుకున్నదానిపై ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. దానిని ముందుకు తీసుకెళ్లే తెగువ ఉంటుంది. అది మంచిదే కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రణాళికకు కలసివచ్చే మేరకే వారు ఇతరుల ఎజెండాకు సందు ఇస్తారు. కలసి రాకపోతే ఇవ్వరు.

అలాగే, వీరు తమ ఎజెండాలో ఉంటే తప్ప స్టేటస్ కొ ను చెరపడానికి ఇష్టపడరు. అవతలి వాళ్ళ ఎజెండా సంక్షోభస్థాయికి వెళ్ళి తమ మీద ఒత్తిడిని పెంచిన కొద్దీ, ఆ ప్రమాణంలోనే వీరు దానిని ఎదుర్కొని తమ విధానాన్నే నెగ్గించుకోడానికి చూస్తారు.

ఇతరులు తమ వైఫల్యాలనో, లోపాలనో ఎత్తి చూపుతూ విమర్శలను తీవ్రం చేసిన కొద్దీ ఒక మాదిరి వాళ్లైతే జంకి కనీసం చూపులకైనా దిద్దుబాటుకు పూనుకున్నట్టు కనిపిస్తారు. కానీ ఈ స్వభావం ఉన్న వాళ్ళు అలా కాదు. విమర్శల తీవ్రత పెరుగుతున్న కొద్దీ తమలో ఎత్తి చూపే లోపాలను, వైఫల్యాలను సరిదిద్దుకోకూడదన్న పట్టుదల వీళ్లలో పెరుగుతూ ఉంటుంది. ఇందిరా గాంధీ స్వభావంలోని ఆ లక్షణమే ఆమెను ఎమెర్జెన్సీ వైపు అడుగు వేయించింది. జయప్రకాశ్ నారాయణ్ వంటి వారిని కూడా జైల్లోకి తోయించింది.

మోడీ విషయానికి వస్తే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గంలోఅవినీతి ఆరోపణలున్న ఇద్దరిని తప్పించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాసరే,  ఆయన వారిని తప్పించలేదు. విమర్శలు రావడమే అందుకు కారణం. ఒకవేళ విమర్శలు రాకపోతే తప్పించేవారేమో. అమిత్ షా పై అంతకంటే ఎక్కువ విమర్శలు వచ్చినప్పటికీ ఆయనను బిజెపి అధ్యక్షుని చేయడం కూడా అలాంటిదే. కళ్లేలు తమ చేతుల్లో ఉన్నప్పుడు గుర్రం ఎలా పరిగెడితే ఏం లే అన్న ధీమా వీళ్లలో ఉంటుంది.

ప్రశంసనీయమైన పనులు  చేయడంలోనూ ఈ స్వభావం ఉన్నవాళ్ళు అంతే తెగువను, పట్టుదలను ప్రదర్శిస్తారు. ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ అవతరణలో నిర్వహించిన పాత్ర అలాంటిదే. నరేంద్ర మోడీ మీద కూడా చాలామందికి అలాంటి ఆశలే ఉన్నాయి. నికరంగా ఆయన ఏం చేస్తారో ముందు ముందు చూడవలసిందే.

ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏకరవు పెడుతున్నానంటే, నేను నరేంద్ర మోడీని ఇందిరాగాంధీతో పోల్చే నాటికి తెలుగు మీడియాలో కానీ, జాతీయ మీడియాలో కానీ ఎవరూ ఆ పోలిక తేగా నేను చూడలేదు. మోడీ ప్రధాని అయ్యాక రెండు నెలలకు కాబోలు జాతీయ మీడియాలో ఆ పోలిక ఒకే ఒకసారి ప్రస్తావనకు వచ్చింది. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంలో ఒక టీవీ చానెల్ చర్చ సందర్భంలో ఇందిరాగాంధి మార్గంలో మోడి వెడుతున్నారా? అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది.

శివసేన విషయంలో gambling కు మోడీ సాహసించడంలో కూడా పైన చెప్పిన స్వభావమే ఉంది. శివసేనతో ఆయనకు ప్రధాని కావడానికి ముందునుంచీ వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలలో వాటి పాత్ర ఉండే తీరుతుంది. ఇక్కడ కూడా శివసేనే తన దారికి రావాలి తప్ప తను దాని దారికి వెళ్ళే ప్రశ్న లేదు. ఎంత రిస్కు కైనా సిద్ధపడే తెగింపు స్వభావం అది.

ఇక్కడ తెలంగాణ లానే అక్కడ విదర్భ ఉంది. విదర్భను ప్రత్యేకరాష్ట్రం చేయడానికి తాము సుముఖమే నన్న భావనను ఆ ప్రాంత ప్రజల్లో బిజెపి కలిగించింది. కానీ మోడి దగ్గర అలాంటివేమీ కుదరవు. .చిన్న రాష్ట్రాల నినాదాన్ని బిజెపి ఇక వదలుకోవచ్చు. నా అంచనాలో మోడీ ఇక ఏ రాష్ట్రాన్ని విభజించడానికి ఒప్పుకోరు, ఉత్తర ప్రదేశ్ లాంటి మరీ పెద్ద రాష్ట్రమైతే తప్ప. అసలు అలాంటి నినాదమే తల ఎత్తకుండా చూసే వ్యవహారశైలి ఆయనది.


No comments:

Post a Comment