Monday, October 27, 2014

నల్ల కుబేరుల దగ్గర రాజకీయ పార్టీలే విరాళాలు మెక్కినప్పుడు నల్లధనంపై యుద్ధం చేసేది ఎవరు?

నల్లధనం తిమింగలాలనో, మొసళ్ళనో బయట పెడుతుందనుకుంటే ప్రభుత్వం మూడు చిరు చేపల్ని బయటపెట్టింది. అయితే నాకిది అంత ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కిందటి ప్రభుత్వం కూడా ఇలాంటి చిరుచేపల్నే బయటపెట్టింది. కనుక అద్భుతాలను ఊహించలేదు. అదీగాక, ప్రభుత్వం బయటపెట్టబోయే పేర్లలో పెద్ద పేర్లు ఏవీ ఉండకపోవచ్చని మీడియా ముందే ఉప్పు అందించింది.

ఈ పేర్ల వెల్లడి కన్నా నన్ను ఆశ్చర్యపరిచింది, షాక్ ఇచ్చింది ఏమిటంటే; వీళ్లలో ఇద్దరు కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ విరాళాలు ఇచ్చిందన్న సంగతి. ఇందులో ఒక కంపెనీ బిజెపీకి 9 సార్లు మొత్తం కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే, కాంగ్రెస్ కు 3 పర్యాయాలుగా 60 లక్షలకు పైగా విరాళం ఇచ్చిందట.

ఆ లెక్కన ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉందని అంటున్న 800 మంది జాబితాలోని నల్లధనస్వాములలో ఎంతమంది, ఎంత మొత్తాల్లో ఈ పార్టీలకు విరాళాలు ఇచ్చి ఉంటారు?! వీళ్లలో ఎంతమందిని చట్టాన్ని అప్పగించి, ఎంతమందిని దొడ్డి దోవన వదిలేసే ప్రయత్నం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన మొత్తాలను బట్టి, రేపు ఇవ్వగలిగిన స్తోమతను బట్టి చట్టానికి అప్పగించడం, లేదా వదిలేయడం ఉంటాయేమో!

నల్లధనంపై ప్రభుత్వాల యుద్ధం ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిపోవడం లేదా?

నల్లధనం, రాజకీయం ఇలా పాలు, నీళ్లలా కలసి పోయినప్పుడు, రెండింటినీ విడదీసి ప్రజలకు చూపించి, శిక్షించడానికి సరికొత్త రాజకీయహంసను ఏ మానససరోవరం నుంచి తీసుకొస్తారు?

నల్లధనం కొండచిలువల పేర్ల వెల్లడి ఇంకా ఎలాంటి చిత్రవిచిత్రాలను సృష్టిస్తుందో చూస్తూ ఉందాం. 

No comments:

Post a Comment