Friday, October 3, 2014

విద్యావంతులలో కూడా పారిశుద్య స్పృహ కలిగించడం అంత తేలిక కాదు!

ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి స్వచ్చభారత్ పేరుతో దేశాన్ని పరిశుభ్రం చేసే పనిని చేపట్టినందుకు కోట్లాది మందికి సంతోషంగా ఉంది. అలాంటి కోరిక నాతో సహా చాలామందికి ఉంది. కానీ ప్రధానమంత్రి  చేపట్టినందువల్ల దానికి విశేష ప్రచారం లభించి కొన్నేళ్ళకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయనే అన్నట్టు జనంలో (సాధారణ జనంలో కాదు సరికదా, విద్యావంతులలో కూడా) ఆ మేరకు చైతన్యం తేవడం అంత తేలిక కాదు.

ఈ సందర్భంలో నా అనుభవాలు ఒకటి రెండు పంచుకోవాలనిపిస్తోంది.

మాది పశ్చిమగోదావరి జిల్లా. కొవ్వూరు నుంచి గోదావరిగట్టు మార్గంలోనూ, వేరే రోడ్డు మార్గంలోనూ పోలవరానికి వెళ్ళే దారిలో మా ఊరు ప్రక్కిలంక వస్తుంది. గోదావరి గట్టు దారిలో ఎప్పుడు వెళ్ళినా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆడా, మగా చాలామంది గోదావరి గట్టును బహిరంగ పాయిఖానాగా వాడుకుంటూ ఉంటారు. వ్యక్తిగత మరుగుదొడ్ల స్పృహ నేటి 21 వ శతాబ్దిలో కూడా ఈ జనంలో ఏర్పడలేదు. మళ్ళీ గోదావరి జిల్లాలు వెనకబడినవి ఏమీ కావు. ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు కనీసం వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరంపై కూడా దృష్టి పెట్టలేకపోయాయి.

దీని మీద మనం ఏమైనా చేయాలనిపించేది. ఇలా ఉండగా మేము చాలాకాలం కొవ్వూరులో కూడా ఉన్నాం కనుక చిరకాలంగా తెలిసిన కొవ్వూరు మిత్రుడు ఒకరు మన కొవ్వూరు వాళ్ళం అంతా కలసి ఒక సంఘంగా ఏర్పడదామని ప్రతిపాదన తెచ్చాడు. చాలామంది హైదరాబాద్ లో ఉన్నారు కనుక మొదట హైదరాబాద్ లో ఒక గుళ్ళో సమావేశమూ, భోజనాలూ ఏర్పాటు చేశాడు. గుళ్ళో సమావేశం అనేసరికే నేను సగం నీరుగారి పోయాను. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం వారు ఇలాంటి సమావేశాలను గుళ్ళల్లో జరుపుతూ ఉంటారు. అందులోని ఔచిత్యం నాకు అర్థం కాదు. గుళ్ళు అన్ని సామాజికవర్గాలకూ చెందినవి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం తన సమావేశాలకు ఆలయాలను ఉపయోగించుకోవడంలో అవి "మాకు చెందినవి" అన్న ఒక తప్పుడు సందేశాన్ని ఇతరులకు ఇచ్చినట్టు అవుతుంది. ఆలయాలలో ఆలయాలకు చెందిన సమావేశాలు, ఆధ్యాత్మిక సమావేశాలు తప్ప ఇతర సమావేశాలు జరగకూడదన్న నిబంధన ఇప్పటికైనా చేయడం అవసరం.

గుడిలో సమావేశం అన్నందుకు సగం నీరుగారిపోయినా, మొత్తానికి మరికొందరిని కూడా వెంటబెట్టుకుని నేను సమావేశానికి వెళ్ళాను. అందులో నేను మాట్లాడుతూ పారిశుధ్యం గురించీ, వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి, గోదావరి గట్టును పరిశుభ్రంగా ఉంచడం గురించి మనం ఏమైనా చేయాలని ప్రతిపాదించాను. అంతా విన్నారు కానీ నా ప్రతిపాదనకు మద్దతు లభించలేదు. ఆ తర్వాత ఆ సమావేశం చేసిన తీర్మానం నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలూ, లక్షపత్రి పూజలూ చేయాలన్నదే ఆ తీర్మానం. మొత్తం మీద పారిశుధ్యం అవసరంగా ఎవరికీ అనిపించలేదు.

మరో అనుభవం. ఆమధ్య భక్తి చానెల్ వాళ్ళు భక్తి గురించి ఒక చర్చా కార్యక్రమానికి నన్ను పిలిచారు. అందులో నాతోపాటు ఒక స్వామీజీ, ఒక పండితుడు, ఒక రచయిత పాల్గొన్నారు. వాళ్ళందరూ భక్తి ఎంత అవసరమో చెప్పారు. నేను బాహ్యశుద్ధి, పర్యావరణ రక్షణ ఎంత అవసరమో చెప్పాను. పరిసరాలను, పర్యావరణను కాపాడడం కూడా భగవంతుని పూజించడం లాంటిదే నన్నాను. అది విన్నవాళ్లు మీరొక్కరే భిన్నంగా మాట్లాడారన్నారు. చానెల్ వాళ్ళు కూడా అదే అన్నారు. మన భక్తిలో బాహ్యశుద్ధి భాగం కాకపోవడం,  టీవీ చానెళ్లలో ప్రవచనాలు చేసే స్వామీజీలు, పండితులూ కూడా బాహ్యశుద్ధిని నొక్కి చెప్పకపోవడం మీరు గమనించవచ్చు.

చెప్పొచ్చేదేమిటంటే, పరిసరాల పరిశుభ్రత ఎంత అవసరమో విద్యావంతులచేత గుర్తింపజేయడం కూడా అంత తేలిక కాదు.

నేను పారిశుధ్యం అవసరం గురించి ఈ బ్లాగులో రాసిన వాటి వివరాలను ఇస్తున్నాను. ఆసక్తికలవారు చదువుతారని ఆశిస్తున్నాను.

1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి?- నవంబర్, 29, 2012

2. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి- డిసెంబర్, 1, 2012

3. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?- డిసెంబర్, 11, 2012

4. తెలుగు సభలలో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా?- డిసెంబర్, 17, 2012

5. బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు- (నేను ఇండియా టుడే లో రాసింది. డిసెంబర్, 25, 2012

6. మన నదుల పేర్లు ఎంత అందమైనవి!- జూన్, 30, 2013

12 comments:

  1. దేశంలో ఏ పుణ్య క్షేత్రానికి వెళినా తెలుగు వారు గంగోత్రి నుంచి, శబరిమల దాకా, కాశీ నుంచి సోమ నాథ్ దాక, షిరిడిలో ఎక్కడ చూశినా అధిక సంఖ్యలో కనిపిస్తారు.మనవారికి శుభ్రత పైన అవగహాన తక్కువ. మరి మనవారు శుభ్రత పాటిస్తే సగం దేశం కూడా బాగౌతుంది.

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీరామ్ గారూ...మీరన్నది నిజం.

      Delete
  2. భాస్కరంగారూ, విద్యావంతుల్లో ఉన్నంత బాధ్యతారాహిత్యం మీరెక్కడా చూడరు. ఉదహరణకు గేటెడ్ కమ్మూనిటీస్ అని ఉన్నాయి చూసారూ ఈ హైదరాబాదులో అక్కడ నివాసం ఉండే జనాభా పిల్లామేకాతోసహా అంతా విద్యాధికులే. ఐనా ఆ ఆవాసస్థలాలు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయంటే, వీళ్ళా చదువుకున్న సజ్జు అని చీదరపుడుతుంది. శుభ్రత శూన్యం. పరస్పరసహకారం శూన్యం. మళ్ళీ ఉభయనవరాత్రులకూ (గణపతి, దేవీ) గొప్పగా డబ్బులు పోగేసి హంగామా భక్తిప్రదర్శనలు అసహ్యంపుట్టే లెవెల్లో చేస్తారు. వాటిల్లోనూ‌ బోలెడు అవినీతీ-రాజకీయాలూనూ. అసలు విద్యావంతుల దుష్ప్రవర్తనలే దేశదారిద్ర్యానికి ముప్పాతికశాతం కారణం అంటే అతిశయోక్తి లేదు.

    ReplyDelete
    Replies
    1. .మీతో ఏకీభవిస్తున్నాను శ్యామలరావు గారూ...

      Delete
  3. భాస్కరం గారూ, అభినందనలు. చక్కని విషయాలు వ్రాసారు. ప్రథాని స్వచ్చ భారత్ నినాదం దేశమంతటా విస్తరించాలన్నా, గొప్పల కోసం, ఫొటోల కోసం, పత్రికలలో పడడం కోసం కాకుండా, మన చుట్టూ సమాజాన్ని పరి శుభ్రంగా ఉంచు కోవాలనే స్పృహ మన విద్యాధికులతో పాటు అందరికీ రావడానికి చాన్నాళ్ళే పట్టేలా ఉంది. కానీ, అసాధ్యం కాక పోవచ్చు. నాయకుల చిత్త శుద్ధిలో విశ్వస నీయత లోపించనంత వరకూ ఆలస్యంగా నయినా, వారిచ్చిన స్ఫూర్తి సత్ఫలితాలనే ఇస్తుందని నా నమ్మకం. ఇక్కడ, మీకో స్వానుభవం చెబుతాను ... మా గేటెడ్ కమ్మ్యూనిటీలో మధ్యలో ఉండే తో స్థలం లోకి చెత్త నింపిన పాలథిన్ కవర్లు వచ్చి పడేవి. చెత్తల బండీ వ్యక్తి వచ్చే వరకూ ఆగ లేక పోవడం వారి బలహీనత ! garden place లో అలాంటి చెత్తను పది రోజుల పాటు తెల్లారిగట్టే తొలిగించే కార్యక్రమం చేపట్టాను. అపార్టు మెంట్ల కిటికీల లోంచి ఇది గమనించే వారేమో ! నేను ఎవరినీ నిందించ కుండా, ఎవరికీ దీని గురించి హెచ్చరికల్లాంటివి చేయ కుండా నామానాన నేను చేసుకు పోయేను ... పది రోజులు గడిచేక మా తోట ప్రాంతాలలో ఒక్క పాలిథిన్ కవరూ వచ్చి పడడం లేదు ! ఈ సోదంతా ఎందుకంటే, మనం జనాలకి ఏదీ చెప్పి చేయించ లేం ... చేసి చూపించాలి. ఆపని మోదీ లాంటి వారు మొక్కు బడిగా ఏ ఒక్క రోజో కాకుండా తరచుగా, వీలయితే, ప్రతి నిత్యం చేసుకు పోతూ ఉంటే ... సవ్చ్చ భారత్ అసాధ్యం కాక పోవచ్చుననే ఆశ ఉంది .ఈ ఆశ దేశ ప్రజలందరిలోనూ ఉంది ... కానీ ఒక విధమయిన నిర్లిప్తత. ఉదాసీనభావం. మరీ ముఖ్యంగా మనలో దీని పట్ల నిరాసక్తత పెరగడానికి కారణం ... మన ఘనమూన ఏలికలు ఇలాంటి కార్యక్రమాలని రాజకీయ లబ్ధి కోసం, ప్రచాదర ఆర్భాటాల కోసం మాత్రమే చూస్తూ ఉండడం ... ఈ ఇనుప తెరను మోదీ ఛేదించ గలరేమో చూడాలి ... ఏమంటారా !

    ReplyDelete
    Replies
    1. నిజమే జోగారావు గారూ...చేసి చూపడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. వ్యక్తిగతమైన చొరవ ఎంతైనా అభిలషణీయమే. అయితే దానికి పరిమితులూ ఉంటాయి. వ్యక్తిగత చొరవతోపాటు ఆయా పద్ధతులను వ్యవస్థలను అభివృద్ధి చేయడం కూడా అవసరమనుకుంటాను.

      Delete
  4. ఈ విషయంలో నేను ఇప్పుడే రాసిన స్వచ్చ భారత్ ' నా కమనీయం బ్లాగు లో చూడమని కోరుతున్నాను. మనవాళ్ళు చాలామంది చెప్తే వినే రకం కాదు. మూర్ఖులు.అన్నిరాష్ట్రాలలోకి కేరళ మేలు. కఠినమైన చర్యలు,శిక్షలు,జరిమానాలు అమలుచేయనిదీ ఈపని సాధ్యం కాదు.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ, చర్యలూ చాలా అవసరం

      Delete
  5. మంచి ప్రయత్నాన్ని స్వాగతిద్దాము.
    చేతనైనంత మద్దతు ఇద్దాము.
    ఇప్పుడిప్పుడే విమర్శించకుండా ఉందాము.

    ReplyDelete
  6. మనం నేర్చుకొనే విద్యలో అది భాగమైతే తప్పకా వస్తుంది. అది విద్యాలయం లోనే మొదలు కావాలి. ఇకపోతే ఆధ్యాత్మిక గురువులు చాలా చేయొచ్చు కానీ ఏమీ చేయడం లేదు. భగవంతుని సృష్టికి విరుద్ధ మైన ప్లాస్టిక్ ని కనీసం గుళ్ళలో, పుణ్య క్షేత్రాలలో అయినా వారు తగ్గించ వచ్చు. వాళ్లను సెన్సిటైజ్ చేసే ప్రోగ్రాం పెట్టండి సార్.

    ReplyDelete
    Replies
    1. నిజమే సీతారాం రెడ్డి గారూ...ఆధ్యాత్మిక గురువులు చాలా చేయచ్చు. కానీ చేయడం లేదు. వారే ఇంకొకరికి ఉపదేశం చేసే హోదాలో ఉన్నారు కనుక, వారికి చెప్పే సాహసం ఎవరికీ లేదు.

      Delete