విభజనా, సమైక్యమా అనేది కాసేపు అలా ఉంచుదాం...
నాకు కొన్ని రోజులుగా ఒకటే ఆశ్చర్యం కలిగిస్తోంది.
సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న సెంటిమెంట్ ఇంత బలంగా ఉన్నట్టు మాకు తెలియదని చాలామంది ఎంపీలు, మంత్రులు, కేంద్రమంత్రులు అనడం గమనించే ఉంటారు.
"తొందరపడ్డామేమోననీ, సీమాంధ్ర అంచనాలో పొరపాటు చేశామనీ" సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అన్నట్టు తాజాగా వార్త వచ్చింది.
సీమాంధ్రలో సమైక్యానికి అనుకూలంగా బలమైన సెంటిమెంట్ ఉందని మంత్రులు సహా ప్రజాప్రతినిధులకు ఎందుకు తెలియలేదు? వాళ్ళు జనంలో లేరా? జనంతో కనెక్ట్ అయి లేరా? తమ తమ నియోజకవర్గాలలో జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోడానికి ఈ పదమూడేళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి కూడా ప్రయత్నించ లేదా? కనీసం, తెలంగాణకు అనుకూలంగా 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేసిన తర్వాతనైనా సీమాంధ్రుల మనోభావాలను తెలుసుకోడానికి వీరు ప్రయత్నించలేదా?
వారిని ఈ ప్రశ్నలు అడిగినవారు ఎవరూ కనిపించలేదు.
2004 ఎన్నికలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో, తద్వారా తెలంగాణ ఇస్తామన్న ఆశలు ఆ ప్రాంతం వారిలో ఎప్పుడైతే రేకెత్తించిందో, రాష్ట్రపతి పార్లమెంట్ ప్రసంగం లో ఎప్పుడైతే తెలంగాణ ప్రస్తావన చేశారో అప్పుడే తెలంగాణ తథ్యమన్న సంకేతాలు వెళ్లిపోయాయి. కాకపోతే ఎంత కాలానికి అనేదే అప్పటికి మిగిలిన ప్రశ్న.
పోనీ, ఆ సంకేతాలను అప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోలేక పోయారనుకుందాం. 2009లో చిదంబరం ప్రకటన చేసిన తర్వాతనైనా అర్థం చేసుకోవాలి కదా! ఎన్నికల రాజకీయంలో భాగంగా టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అంతమాత్రాన తెలంగాణ ఇచ్చేస్తారేమిటి అని మామూలు జనం అనుకోవచ్చు, రాజకీయనాయకులు అనుకోగలరా? వాళ్ళకు political instinct లేదా రాజకీయ ఇంగితం, లేదా దూరదృష్టి ఉండద్దా?
వారిని ఈ ప్రశ్నలు అడిగినవారూ కనిపించలేదు.
నాయకుల్లో పైన చెప్పిన లక్షణాలు ఉండి ఉంటే, వాళ్ళు జనంలో ఉండి ఉంటే; తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా సమైక్య ఉద్యమాన్ని అప్పుడే నిర్మించి ఉండేవారు. హైదరాబాద్ లో ఎంజీవోలు పెట్టిన సభల్లాంటివి సీమాంధ్రప్రాంతాలలోనూ పెట్టి ఉండేవారు.
ఇలా అనడంలో ఉద్దేశం, తెలంగాణాను ఇవ్వద్దనో, లేదా ఇవ్వమనో చెప్పడం కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని ప్రాంతాలలోని మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవలసిందే. ఇప్పటి సమైక్య ఆందోళన ముందునుంచీ ఉండి ఉంటే అదొక balancing factor గా ఉపయోగపడి కేంద్రం అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగే దిశగా స్పష్టమైన ఆలోచనలు చేసి ఉండేది. ఊహించలేకపోయామంటూ సీమాంధ్ర నాయకులు తప్పించుకోజూడడం సరైన excuse అవుతుందా?!
తొందరపడ్డామనీ, అంచనా వేయలేకపోయామనీ అహ్మద్ పటేల్ అనవలసిన పరిస్థితి అసలెందుకు వచ్చింది? దానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి తగిన feed back కేంద్రానికి అంది ఉండకపోవాలి. లేదా అందినా కేంద్రం దానిని పట్టించుకోకపోయి ఉండాలి. జనంలో సెంటిమెంట్ ఉందని మాకు తెలియలేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులే అంటున్నారు కనుక మొదటి కారణమే నిజమై ఉండాలి.
***
నాకీ సందర్భంలో ఒకటి గుర్తొస్తోంది.
అరవైదశకం చివరి మాట. అప్పటికి నేనింకా విద్యార్థిగా ఉన్నాను. ప్రపంచ తెలుగు సభలో, రచయితల సభలో జరుగుతున్నాయి, నాకు గుర్తు లేదు. కానీ ఒక సన్నివేశం మాత్రం ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ కళ్ళముందు కదులుతోంది, వేదిక మీద ముఖ్యమంత్రి సహా మంత్రులు పలువురు ఉన్నారు. కపిల కాశీపతి అనే ఓ సీనియర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయనాయకుల మీద నిప్పులు చెరుగుతున్నారు. అది ఎంతవరకు వెళ్లిందంటే, "అవాకులు చెవాకులు పేలే రాజకీయ నాయకుడిని నోరుముయ్యి(ఒక తిట్టు పదం వాడారు)అంటూ చొక్కా పుచ్చుకుని కిందికి ఈడ్చితే తప్ప ఈ రాజకీయాలు బాగుపడవు" అన్నారాయన. ముఖ్యమంత్రి ఉన్న సభలో ఆయన అలా మాట్లాడడం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసెసింది. అందుకే ఆ ఘటన గుర్తుండిపోయింది.
పాత్రికేయులు పద్ధతిగా ఉన్నారా అన్నది వేరే ప్రశ్న. ఉండేవారు ఉన్నారు, లేని వారు లేరు. అలాగే రాజకీయనాయకులూ...
నా ప్రశ్న ఏమిటంటే, జనంలో సెంటిమెంట్ ఉందని మాకు తెలియలేదు, ఊహించలేదన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులను "అయితే మీరు జనంలో లేరా, జనంతో కనెక్ట్ అయి లేరా?" అని ఏ ఒక్కడూ ఎందుకు అడగలేదు???