‘శిశువు
చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు’
అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ
ఉంటుంది. పురాచరిత్రలో,
పురావస్తువులలో ‘ప్రాచీనస్మృతులూచే చప్పుడు’ వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది. అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా
శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని
హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్
హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా
ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే
బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక
చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి
కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ
ఉండిపోయాను.
ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు
కలగకపోతే ఇంకో విషయం చెబుతాను. అతను తన
పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు;
మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి!
గణసంస్కృతిలోకి! గణదశలో ప్రపంచ మానవాళి
ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.
ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి... ఎలెక్స్ హేలీ తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ
దర్శించినది మరెవరినో కాదు; మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను
దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు: కెబ్బా కంజీ పొఫానా!
మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.
ReplyDeletewww.poodanda.blogspot.com