Saturday, July 13, 2013

పేరులో అక్షరం మారితే జాతకం మారుతుందా?!

"మీ పేరులో ఒక దుష్టాక్షరం ఉంది. అందుకే మీరు ఏది తలపెట్టినా జరగడంలేదు. మీ పేరులో ఒక్క అక్షరాన్ని మార్చుకుంటే చాలు మీరు ఏది ముట్టుకున్నా బంగారమవుతుంది"

ఇలా చెప్పే జ్యోతిష్కులు చాలామంది టీవీ చానెళ్లలో కనిపిస్తున్నారు. టీవీ చానెళ్లు వాళ్ళతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకే చానెల్ ఇలాంటి ముగ్గురు, నలుగురితో కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అంతేకాదు, వాళ్ళ అపాయింట్ మెంట్ తీసుకోడానికి ఫోన్ నెంబర్లు ఇస్తోంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ఊళ్ళల్లో ఉండేదీ చెబుతోంది. వాళ్ళ పర్యటన వివరాలు ఇస్తోంది. ఇవి వాణిజ్య ప్రకటనల లానూ,  వీరితో ప్రసారం చేసే ప్రశ్నోత్తరాల కార్యక్రమం వీరికి ప్రాచుర్యం కల్పించడానికి ఉద్దేశించిన 'టీజర్ల' లానూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా రుద్రాక్ష వ్యాపార ప్రకటనల లాంటివే. ఈ రకమైన జ్యోతిషంతో ఎంత వ్యాపారం జరుగుతోందో తెలియదు. దీనిపై ఎవరూ దృష్టి పెట్టినట్టు కనిపించదు.

జ్యోతిషం అనేసరికి చాలామందికి ఉత్సుకత ఉంటుంది. పెద్దగా నమ్మనివారు కూడా తమ గురించి ఏం చెబుతారో నన్న ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పోయేదేముంది, ఒక ఫోన్ కాలే కదా అనుకుని ప్రయత్నిస్తారు. కానీ ఎన్నిసార్లు డయల్ చేసినా చానెల్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ దొరకదు. గాఢంగా నమ్మేవాళ్లు అక్కడినుంచి నేరుగా ఆ జ్యోతిష్కుని కాంటాక్ట్ చేస్తారు. బహుశా ఆ నెంబర్ తేలిగ్గా కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలిపే జవాబుదారీ ఆ టీవీ చానెల్ కు సహజంగానే ఉండదు.

ఇక్కడ కూడా విశ్వాసాన్ని ప్రశ్నించనవసరం లేదు. మనిషికి ఏదో ఒక విశ్వాసం ఉండడం సహజం. అయితే అదే సమయంలో వివేకమూ ఉండాలి. పేరులో ఒక అక్షరం మార్చుకున్నంత మాత్రాన జీవితం బాగుపడిపోతుందా, కష్టనష్టాలనుంచి అవలీలగా బయటపడగలుగుతామా అని క్షణకాలం ఆగి ఆలోచించాలి. తన పేరే ఉన్నవారు అంతా తమలానే ఇబ్బందుల్లో ఉన్నారా అని ఆలోచించాలి, వారిలో ఎంతమంది మంచి స్థితిలో ఉన్నారో చూడాలి. తల్లిదండ్రులు చేసిన నామకరణంలో, లేదా వాళ్ళు చిన్నప్పటినుంచీ పిలిచిన ముద్దు పేరులో వాళ్ళ ఆశీస్సులు కూడా కలిసి ఉంటాయి. అంతకుమించిన గొప్ప ఆశీస్సులు ఎవరినుంచీ అందే అవకాశం లేదు. మన శ్రేయస్సును తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆశించేవారూ ఉండరు. కనుక వారు పెట్టిన, పిలిచిన  పేర్లు చెరుపు చేస్తాయా అని  ఆలోచించాలి.

జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న చర్చలోకీ లోతుగా వెళ్ళనవసరం లేదు. శాస్త్రం కాదని ఇట్టే తీర్పు ఇవ్వనూ అవసరం లేదు. జ్యోతిషం శాస్త్రమే అయుండచ్చు. అయితే, "రెండురెళ్ళు నాలుగు" అన్నంత కచ్చితంగా జాతకం చెప్పగలిగినవారు తారసపడేవరకూ మీరు ప్రతివారినీ నమ్మనవసరం లేదు. ఏ ఇద్దరు జ్యోతిష్కులు చెప్పేదీ కలవనంతకాలం, ఏ ఒక్కరు చెప్పిన జాతకఫలం నిజం కానంత కాలం జ్యోతిష్కులను అనుమానంగా చూడక తప్పదు. ఫలానా జ్యోతిష్కుడు చెప్పింది నిజమైంది, ఎందుకు ఆయనను నమ్మకూడదని మీరు అనుకోవచ్చు. అదే జ్యోతిష్కుడు మీ విషయంలో చెప్పిన వాటిలో నిజం కానివీ ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. "అయితే మగ లేదా ఆడ" అన్నట్టుగా కొన్ని నిజమవుతుంటాయి. నమ్మకానికి వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు.

నా స్వానుభవం ఒకటి చెబుతాను. నేను పనిచేసిన ఒక దినపత్రికలో ఒక సిద్ధాంతిగారు వారఫలాలు, సంవత్సర ఫలాలు రాస్తూ ఉండేవారు.  ఆ ఏడాది తను సంవత్సరఫలాలు రాసిన సంచిక తీసుకుని ఓ రోజు ఆయన  నా దగ్గరకు వచ్చారు. "చూడండి, కేంద్రంలో అధికారపరివర్తన జరుగుతుందని రాశాను, అదే జరిగింది" అంటూ నా ముందు  ఆ సంచిక ఉంచారు. యథాలాపంగా తెరచి చూశాను. నిజమే, ఆయన ఆ మాట రాశారు. ఆయనను అభినందించాను. "ఒక రిక్వెస్ట్. నా జోస్యం నిజమైనట్టు చెబుతూ ఒక వార్త ప్రచురించాలి మీరు" అని ఆయన అడిగారు. "సరే ప్రచురిస్తాం. అయితే ఒక షరతుతో" అని నేను అన్నాను. "ఏమిటో చెప్పండి" అని ఆయన అన్నాడు. "మీరు చాలా ఏళ్లుగా సంవత్సరఫలాలు రాస్తున్నారు కదా...మీ జోశ్యాలు ప్రతిసారీ నిజం అయ్యాయా?" అని అడిగాను. ఆయన ముఖంలో రంగులు మారాయి. "ప్రతిసారీ ఎందుకు నిజమవుతాయి. ఏ జ్యోతిష్కుడి అంచనాలైనా ఒక్కొక్కసారి తప్పుతాయి" అని ఆయన అన్నాడు. అదీ వాస్తవం! "ఈ ఏడాది మీ జోస్యం నిజమైందని ప్రకటించడానికి అభ్యంతరం లేదు. దాంతోపాటు మీ విఫల జోశ్యాలను కూడా ప్రకటించాలి. అదే న్యాయం. అవునా, కాదా చెప్పండి?" అన్నాను. "అదెలా కుదురుతుంది?" అని ఆయన అని అక్కడితో సంభాషణ ఆపేశారు.

ఆయన కోరినట్టు వార్త ప్రచురిస్తే ఆయనకు మరింత  పేరు వచ్చి డిమాండ్ పెరగచ్చు. కానీ జ్యోతిషానికీ,  జ్యోతిష్కులను నమ్మేవారికీ ఆ వార్త వల్ల న్యాయం జరగుతుందా? ఆలోచించండి.  

10 comments:

  1. ఈ ఏడాది మీ జోస్యం నిజమైందని ప్రకటించడానికి అభ్యంతరం లేదు. దాంతోపాటు మీ విఫల జోశ్యాలను కూడా ప్రకటించాలి. అదే న్యాయం. అవునా, కాదా చెప్పండి?-100% ప్రకటించాలి అలా ప్రకటించిన వారు చాలామంది ఉన్నారు..వారిలో కే.పీ/రామన్/కే.ఎం.రావు లాంటి ఉద్దండులున్నారు.అది మీకు తెలుసా ?ఇక పేరులో అక్షరం మారితే జాతకం మారుతుందా అని మీ సందేహం.మారుతుంది అని నా సమాధానం.
    పదాన్ని పలికేటపుడు ఇచ్చే వత్త్హిది వాళ్ళ పేరులోని వైబ్రేషన్స్లో తేడా వస్తుంది.దీనిపైన వొక స్పెషల్ శాస్త్రమే ఉంది దాని పేరు -"లేటరోలోజీ" ..ఇది కేవలం అక్షరాల మీద భవిష్యత్ను చెప్పే శాస్త్రం.

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదాలు. మీరు చెప్పిన ఉద్దండులు ఉండచ్చు, కాదనడం లేదు. కానీ అంత ఉద్దండులు కానివాళ్లూ ఉన్నారు. వాళ్ళే ఎక్కువమంది. జ్యోతిషం చీకట్లో విసిరే రాయిలా పరిణమించేది ఇలాంటివారి వల్లే. అసలు ప్రశ్న ఏమిటంటే, శాస్త్రం అన్నప్పుడు ఏ ఇద్దరు చెప్పేదానిలోనూ వ్యత్యాసం(కనీసం ఎక్కువ వ్యత్యాసం)ఉండకూడదు. ఫలితాలు కచ్చితంగా ఉండాలి. మీరన్న లెటరోలజీకీ ఇదే వర్తిస్తుంది.

      Delete
    2. సరే మీ పాయింట్ కి వద్దాము.శాస్త్రకారుడు తప్పు కావచ్చును గాని శాస్త్రం తప్పు కానేరదు.అందుకని మీరు శాస్త్రాన్నే విమర్సిస్తున్నారే.అది తప్పు కాదా?ఇక టీవీలలో ఈ శాస్త్రం పైన వచ్చే పోగ్రాములు అన్ని వొక డ్రామా అనేది శుద్ధ్హ వాస్తవం.ముఖ్యంగా మాచిరాజు వేణుగోపాల్ చెప్పే సోది వాస్తు పరమ చందాలమైనది.నిజమైన శాస్త్రకారుడు ,శాత్రం తెలిసిన శాస్త్రకారులు తప్పుడు ఫలితాలను ఇవ్వనే ఇవ్వరు..అది అక్షర శాస్త్రం కానివ్వండి/జ్యోతిష్యం కానివ్వండి/వాస్తు కానివ్వండి../హస్త సాముద్రికం కానివ్వండి.ఈకారణంగానే పూర్వం కనీసం నలుగురు జ్యోతిష్య పండితులను పిలచి జాతక విశ్లేషణలు చేయించుకునే వారు..కారణం వారిలో ఇద్దరు చెప్పిన ఫలితాలు సరిపోతే దానిని ప్రమాణం గా తీసుకునేవారు.కాని మీరు చూచినా అందరు శాస్త్రకారులు అరా-కోరా పాండిత్యం కలిగినవారు కావడం మీ దురదృష్టం.అందుకే అందరిని వొకే గాడిన కట్టి వొక PRE OCCUPIED THOUGHT లో ఈ పోస్ట్ను రాసారు..

      Delete
    3. astrojoyd గారు చెప్పిన కామెంట్ తో ఏకీభవించలేము. అక్షరాలని బట్టి వైబ్రేషన్ లో తేడా వస్తుంది కాబట్టి ప్రభావం ఉంటుంది అంటున్నారు. లెటరాలజీ భారతీయ పేర్లకు వర్తిస్తుందా లేక లాటిన్/ఆంగ్ల పేర్లకే వర్తిస్తుందా అన్నది కూడా మనకి తెలియదు. అసలు భారతీయ పేర్లను ఆంగ్లం లో సరిగా రాయటమే కష్టం. సరైన స్పెల్లింగు లేనే లేదు. ఉదాహరణకు శ్రీ అనే అక్షరాన్ని sree, shree, sri, shri ఇలా రకరకాలుగా రాయొచ్చు. ఒక తెలుగు పేరును ఇంగ్లీషులో రాసుకుని ఆ అక్షరాలకి వర్తిస్తుందో లేదో తెలియని శాస్త్రాన్ని ఉపయోగించి అనాలసిస్ చేసి, ఉన్న ఆ కాస్త పేరునూ ఖూనీ చేయటం ఎంతవరకు సబబు? ఇక అంగ్లం లో రాసిన మామూలు పేర్లనే అవతలివారు సరిగా చదువుతారో లేదో తెలియదు (పేరు పలికినపుడే కదా వైబ్రేషన్స్ వచ్చేది!). ఆపైన పంటికింద రాయిలా ఒక అక్షరాన్ని కలిపితేనో లేక తీసేసినా ఏర్పడిన కొత్త పదాన్ని ఎవరిష్టం వచ్చినట్లు వారు ఉచ్చరిస్తూ ఆ వైబ్రేషన్స్ ఒక జీవితాన్నే మార్చేస్తాయంటే అభిషేక్ బచ్చన్ నుమ్ముతాడేమోగాని నేను మాత్రం నమ్మలేను.

      ఇకపోతే శాస్త్రకారులే కాదు ఒక్కోసారి శాస్త్రమూ తప్పు చెప్పవచ్చు. ఉదాహరణకు వైద్య విఙ్ఞాన శాస్త్రాల్లో కొన్ని సార్లు ఒక శాస్త్రవేత్త చెప్పిన సిధ్ధాంతాన్ని మరొక శాస్త్రవేత్త తప్పని నిరూపించడమో లేక దానికి మరిన్ని పరిమితులున్నాయని వివరించడమో చూస్తున్నాం. ఎప్పటికపుడు కొత్త పరిశోధనలకనుగుణంగా మార్పులు చెందే శాస్త్రమే నిలుస్తుంది. అలా కాక ఎప్పటికీ మారకుండా నిలిచే సిధ్ధాంతమేదైనా ఉంటే అది అందరికీ ఒకే ఫలితాలివ్వాలి (ఉదాహరణకు గురుత్వాకర్షణ, రసాయన చర్యలు గట్రా). జ్యోతిష్య శాస్త్రం లో అలాంటి మార్పులు చూసినట్లు లేదు, అందరికీ ఒకే ఫలితాలు ఇవ్వట్లేదు కూడా. అందుకనే జ్యోతిష్యాన్ని ఒక నమ్మకంగా చూడాలే తప్ప నిరూపిత శాస్త్రంగా అంగీకరించలేం.

      Delete
    4. "అభిషేక్ బచ్చన్ నుమ్ముతాడేమోగాని నేను మాత్రం నమ్మలేను"

      :D

      True bro. Astrology (numerology) is another pseudoscience that has been striving one the post-processioning of the happenings.

      Delete
  2. పేరులో ఏమి పెన్నిధి ఉన్నది అన్నాడు షేక్స్పియర్.పేరులో ఒక అక్షరం మార్చినంత మాత్రాన ఒనగూడే ప్రయోజనం ఏదీ లేదనే నా అభిప్రాయం!

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారూ

      Delete
    2. పేరులో పెన్నిధి లేనపుడు పుట్టిన జన్మ తార ఆధారంగా ఎందుకు పేర్లు అడుగుతున్నారు?వొక అక్షరం లేదా లెటర్ మార్చినంతమాత్రాన ప్రయోజనం లేదా?అయితే ఫర్ ఎక్సామ్పుల్:-Apoda లో A తీసివేస్తే అర్ధం మారడం లేదా>పోడా అంటే పాదములు గలది అపోడా అంటే లేనిదీ అని అర్ధం రావడం లేదనా మీ అభిప్రాయం ?

      Delete
  3. భాస్కరంగారూ
    వ్యాసం బాగుంది. అబినందనలు. ఈ‌ రోజుల్లో ప్రతీదీ వ్యాపారమయమై పోయింది. దేవుళ్ళతోనూ వ్యాపారం చేసుకుంటున్న రోజులు మరి. పొట్టకూటి జ్యోతిషం కొత్త విషయం కాదు. కాని ఇది వ్యవస్థీకృతం కావటం చాలా ఆందోళన చెందవలసిన విషయం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్యామలరావు గారూ, మీరన్నది నిజం.

      Delete