Monday, July 15, 2013

తనే దుర్వార్తగా మారిపోయిన టెలిగ్రామ్!

నిజమే, కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది. కానీ ఇంత త్వరగా మారిపోతుందని అనుకోలేదు. మన సంగతి అలా ఉంచి మన పూర్వులు అస్సలు అనుకుని ఉండరు .

163 ఏళ్ల క్రితం ప్రారంభమైన టెలిగ్రాఫ్ వ్యవస్థ నిన్నటితో కాలగర్భంలో కలసిపోయింది.  'టెలిగ్రామ్' అనే కేక ఇక వినిపించదు. ఆ వాస్తవాన్ని తలచుకున్నకొద్దీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవేదనగా ఉంటుంది. జీవితంలో హఠాత్తుగా ఏదో వెలితి ఏర్పడినట్టు అనిపిస్తుంది. గతంతో, గతజ్ఞాపకాలతో ఉన్న ఒక లింక్ ఒక్కసారిగా తెగిపోయినట్టు అనిపించి మాటలకు అందని విషాదంతో మనసు బరువెక్కిపోతుంది.

టెలిగ్రామ్ దుర్వార్తలనే కాదు శుభవార్తలనూ మోసుకొచ్చేది. కానీ ఎందుకో టెలిగ్రామ్ అనే కేక వినగానే దుర్వార్తనే శంకించేవాళ్ళం. ఎప్పుడైనా టెలిగ్రామ్ వస్తే మా అమ్మ చాలా ఆందోళన పడేది. ఎక్కడి పని అక్కడే ఆపేసి వంటింట్లోంచి బయటకు వచ్చేసేది. సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకుని అందులో ఏముందో చదివి చెప్పడానికి పట్టే ఆ అయిదారు నిమిషాల వ్యవధిలోనే ఎక్కడలేని టెన్షన్ నూ అనుభవించేది. "నా కాళ్ళూ చేతులూ ఆడడం లేదు, త్వరగా చదివి చెప్పరా" అనేది.

దుర్వార్తాహరిగా అనుకునే టెలిగ్రామ్ ఇప్పుడు తనే ఒక దుర్వార్తగా మారిపోయింది.

టెలిగ్రామ్ కాలధర్మం చెందినా దుర్వార్తలు ఉంటూనే ఉంటాయి. అయితే దుర్వార్తకూ, టెలిగ్రామ్ కూ ఉన్న ప్రత్యేకమైన ముడి ఇంకే సమాచార సాధనానికీ ఉండకపోవచ్చు. సెల్ ఫోన్ శుభ/అశుభ వార్తల మధ్య తేడాను చెరిపేసింది. సెల్ మోగగానే దుర్వార్తలను శంకించేవాళ్లు ఎవరూ ఉండరు.

నేను టెలిగ్రామ్ ను, అది కూడా ఒక అశుభవార్తను మోసుకొచ్చిన టెలిగ్రామ్ ను చివరిసారి అందుకున్నది... నాకు గుర్తున్నంతవరకూ 1995 మార్చ్ లో!

ఒక జీవిత కాలంలోనే మనం అనేక మార్పులు చూస్తున్నాం. కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేస్తుందని అంటారు కానీ అది మనకు ప్రత్యక్షంగా కనబడదు. కానీ కొత్త టెక్నాలజీ వచ్చి పాత టెక్నాలజీని పక్కకు తోసేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పదేళ్ళ కాలంలో ఒక్క  సెల్ ఫోన్ లలోనే ఎన్ని మార్పులు? 2జీ, 3జీ కూడా పాతబడి ఇప్పుడు 4జీ అంటున్నారు. 2జీ కుంభకోణం కేసు ఒక కొలిక్కి వచ్చేలోపల ఇంకా ఎన్ని జీలు వస్తాయో?

మన పూర్వులకీ మనకీ ఇదే తేడా. వారు తమ జీవితకాలంలో ఇన్ని మార్పులు చూసి ఉండరు. టెలిగ్రాము, పోస్ట్ కార్డ్ ల సాహచర్యంతోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి. మన కళ్ళముందే ఒక్కొక్కటే కనుమరుగైపోతూ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతున్న విషాదం ప్రత్యేకంగా మనదే.

టెలిగ్రామ్ పోయినా టెలిగ్రామ్ అనే కేక మన చెవుల్లో మరికొంతకాలం గింగురు మంటూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ కేక కూడా ఆగిపోతుంది.

టెలిగ్రాముకు కన్నీటి వీడ్కోలు!

2 comments:

  1. కొత్త సాంకేతికత వచ్చి పాతసాంకేతికతను కాలం చెల్లిందని చల్లగా సాగనంపింది!మార్పును ఆపలేము!ఇక టెలిగ్రాముకు నూకలుచెల్లి వీడ్కోలు చెప్పకతప్పలేదు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారూ

      Delete