Saturday, July 20, 2013

శ్రీ సాయి సచ్చరిత్ర: చాగంటివారి వ్యాఖ్యలు

నేటి ప్రవచకులు అనేకమందిలో చాగంటి కోటేశ్వరరావు గారు అనేక విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నవారు. వాటన్నింటిలోనూ ప్రప్రథమంగా చెప్పుకోవలసినదేమిటంటే, ఆయన తను ప్రవచించే అంశాన్ని అనుభవిస్తూ, అందులో తాదాత్మ్యం చెందుతూ ప్రసంగిస్తారు. భక్తితన్మయత్వాన్ని స్వయంగా అనుభవిస్తూ చెప్పడమే ఆయన ప్రసంగానికి చక్కని శ్రావ్యతనూ, మాధుర్యాన్నీ కల్పిస్తూ అసంఖ్యాక శ్రోతలను ఆయనవైపు ఆకర్షిస్తోంది. ఆయనలోని అపరిగ్రహం(తన ప్రసంగాలకు ప్రతిఫలం తీసుకోకపోవడం) అనే అరుదైన లక్షణం కూడా ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది.  ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడం ఆయనలోని మరో ప్రత్యేకత. వారి గురించి నేను గత సంవత్సరం ఇండియా టుడే లో రాస్తూ నేటి కాలపు పౌరాణిక సెలెబ్రెటీగా ఆయనను పేర్కొని ఆయన ప్రత్యేకతలను కొన్నింటిని స్పృశించాను.

ఈ అవగాహన నేపథ్యంలో, శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గురించి టీవీ 9 వారు ప్రసారం చేసిన ఆయన వ్యాఖ్యలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. అయ్యో, ఇలా మాట్లాడుతున్నారేమిటని బాధకలిగింది. ఆ మాటలు ఆయన స్వభావ విరుద్ధంగా  చాలా కటువుగా ధ్వనించాయి. ఆయా పవిత్ర గ్రంథాల పారాయణం గురించి ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని ప్రకటించే సంపూర్ణ స్వేచ్ఛ కూడా వారికి ఉంది. ఆయన అభిప్రాయాలు  నిజాలే కావచ్చు. శ్రీ సాయి సచ్చరిత్ర పై, గురుచరిత్రపై గౌరవభావమే తప్ప వ్యతిరేక భావం వారికి లేకపోవచ్చు. కానీ అంతటి ప్రసంగకోవిదులైన ఆయన ఈసారి ఎందుకో  తన అభిప్రాయప్రకటనలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదనే నాకు అనిపించింది. ఆయన అభిప్రాయాలు ఏకపక్షంగా ఉన్నట్టు అనిపించడమే కాక, ఆయన నుంచి సందేహానివృత్తిని  కోరదగినవిగానూ  కనిపించాయి.

ముందుగా వారి వ్యాఖ్యలను చెప్పుకుందాము:

1. నూటికి 99 మంది కోరికలతోనే గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు. కోరికలతో గురువు వద్దకు వెళ్లకూడదు. గురువుకు అసహ్యం పుడుతుంది.

2. సచ్చరిత్ర పారాయణ చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చేస్తున్నారు?

3. వ్యాసుడు చెప్పిందే ప్రమాణం. వారి కన్నా ఎక్కువ ఎవరూ చెప్పలేరు. సాయిబాబా గారైనా వ్యాసుడు చెప్పిందే చెప్పాలి.

4. సాయిబాబా జీవితచరిత్ర పారాయణ చేయచ్చు. అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. తత్వం ఆవిష్కరణ కానిదే పారాయణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సాయిబాబా గారికి ఇష్టమైనది తత్వ బోధే. గురుచరిత్ర పారాయణం తప్పని నేను అనను. అయితే ప్రయోజనం లభిస్తుందని చెప్పడం కష్టం.

5. (సాయి సచ్చరిత్ర లోని) సుదాముని కథ తప్పు. అది తాడూబొంగరం లేని కథ. అంత అర్థరహితమైన కథ ప్రపంచంలో లేదు. కుచేలుని గురించి ఇష్టమొచ్చినట్లు రాయడం తప్పు. అది చదవడం వల్ల పాపం వస్తుంది. కుచేలుని గురించి చులకనగా రాయడం, చదవడం దారుణం. ఆ రచయిత కనిపిస్తే దీనికి ప్రమాణం ఏమిటని అడగండి.

6. అర్థం తెలిసినా తెలియకపోయినా బీజాక్షరాలు ఉన్న గ్రంథాలను పారాయణ చేస్తే ప్రయోజనం ఉంటుంది. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. సుందరకాండను, సౌందర్యలహరిని పారాయణ చేస్తారు. వాటిలో బీజాక్షరాలు ఉన్నాయి. అవి బుద్ధి మీద ప్రభావం చూపిస్తాయి. వాటివల్ల సరస్వతీ కటాక్షం ఉంటుంది. అర్థం తెలియనక్కరలేదు.

పాయింట్ల వారీగా నా స్పందన ఇదీ:

1. కోరికలతో పారాయణ చేయకూడదన్న చాగంటి వారి అభిప్రాయం ఒక ఆదర్శస్థితిని చెబుతుంది. కనుక దానితో  ఎవరూ విభేదించనవసరం లేదు. అయితే నూటికి  99 మంది గురుచరిత్ర ఒక్కదానినే కోరికలతో పారాయణ చేస్తున్నారని నేను అనుకోను. సుందరకాండ, లలితాసహస్రం, విష్ణుసహస్రం వంటి పారాయణ యోగ్యమైన గ్రంధాలను కూడా చాలామంది కోరికలతోనే పారాయణ చేస్తారు. అలాంటివారు ఎందరో మనకు తెలుసు. కోరికలతో పారాయణ ప్రారంభించినా క్రమంగా అది చాగంటి వారు చెప్పిన తత్వావిష్కారానికీ, కోరికలను లేని స్థితికీ దారితీయచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే, సుందరకాండ పుస్తకంలోనే దాని పారాయణవల్ల ఎటువంటి ఐహికమైన  కోరికలు సిద్ధిస్తాయో చెబుతారు. అటువంటి ప్రచురణాలను చాలామంది చూసే ఉంటారు. చాగంటివారు ఈ అంశాన్ని స్పృశించి ఖండించినట్టు లేదు. అలాగే, కోరికలతో వచ్చేవారిని ప్రోత్సహించే గురువులు కూడా ఉన్నారు. వారి గురించి చాగంటి వారు మాట్లాడినట్టు లేదు. (వారు మాట్లాడారనీ, టీవీ 9 వారు వాటిని ఎడిట్ చేశారనీ నిరూపితమైతే ఈ నా అభిప్రాయాన్ని ఉపసంహరించుకుంటాను)

2.  సచ్చరిత్రను పారాయణ చేయమని ఎవరు చెప్పారు, ఎందుకు చేస్తున్నారని అనడంలో ఆయన స్వభావ విరుద్ధమైన కటుత్వం ధ్వనించింది.

3. వ్యాసుడు చెప్పిందే ప్రమాణమని నిష్కర్షగా చెప్పడానికి చాగంటివారికి ఉన్న  స్వేచ్ఛను ప్రశ్నించడం లేదు. అయితే, సాయిబాబా గారైనా సరే వ్యాసుడు చెప్పిందే చెప్పాలనడం సాయి భక్తులను నొప్పిస్తుంది. సాయి భక్తులకు సాయిబాబాయే సర్వోన్నతుడు. ఎవరి గురి వారిదే కనుక నిజానికి ఆధ్యాత్మిక జగత్తులో సాధారణంగా  ఇలాంటి తారతమ్యాలను తీసుకురారు. స్వయంగా చాగంటివారే హరి హరుల సందర్భంలోనూ, ఇతర సందర్భాలలోనూ  ఈ విషయాన్ని ఉద్ఘాటించారు.

4. పారాయణ చేయచ్చు గానీ ప్రయోజనం ఉండదన్న వారి నిర్ధారణ సాయి భక్తులను, గురుచరిత్ర పారాయణ చేసేవారినీ నొప్పించి నిరుత్సాహపరుస్తుంది. పూజ కానీ, పారాయణ కానీ వ్యక్తిగతం, వ్యక్తిగత విశ్వాసపూర్వకం. వాటి వల్ల ప్రయోజనం అనేది వారి వారి అనుభవానికి అందేదే తప్ప ఇతరులు చెప్పగలిగింది కాదు.

5. నేను గమనించినంతవరకు సచ్చరిత్రలోని సుదాముని కథలో తప్పు కానీ, చదివితే పాపం కలిగేటంత అనుచితి కానీ కనిపించలేదు. దగ్గర ఉన్న వారికి పెట్టకుండా ఒక్కడే తినకూడదన్న ధర్మాన్ని మాత్రమే అది చెబుతుంది. ఒక వేళ ఆ కథ  ప్రామాణికమైనది కాకపోతే ఆ మాట చెప్పవచ్చు. కానీ దానిమీద చాగంటి వారు ఆ స్థాయిలో స్పందించడం వారి ప్రసంగసరళిని ముందునుంచీ గమనించేవారిని ఆశ్చర్యచకితం చేస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. వేల సంవత్సరాలుగా అస్తిత్వం లో ఉన్న పురాణకథలు కాలగతిలో అనేక రూపాలు తీసుకున్నాయి. ఒకే కథ భిన్న ప్రాంతాలలో భిన్న రూపాలలో జనశ్రుతిలో ఉంటూ వచ్చింది. సచ్చరిత్ర రచయిత మరాఠీ భాషీయుడు కనుక తన ప్రాంతంలో వ్యాప్తిలో ఉన్న కథను తీసుకుని ఉండచ్చు. పురాణకథలకు ప్రామాణికతను నిర్ధారించడం కష్టం. బహుశ్రుతులు అయిన చాగంటివారికి ఈ విషయం తెలిసే ఉంటుందనడంలో సందేహం లేదు.

6. బీజాక్షరాలు ఉన్న గ్రంథాలను పారాయణ చేస్తే విశేషఫలితాలు ఉంటాయని ఆయన చెప్పడం వరకూ సరే. ఇతర గ్రంథాల పారాయణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదనడమే ఆలోచనీయం. ఇది కూడా వ్యక్తిగత విశ్వాసానికీ, అభిరుచికీ, ఇష్టానికీ సంబంధించినది. సాయి సచ్చరిత్ర పారాయణ వల్ల ఎవరైనా మనశ్శాంతి పొందుతుంటే అది ప్రయోజనం కాదని అనగలమా? అదీగాక ఏ గ్రంథానికి ఎటువంటి మహిమ సిద్ధిస్తుందో ఎలా చెప్పగలం?

చాగంటివారు ఆర్షసంప్రదాయబోధకులు. ఆ సంప్రదాయానుగుణంగా వారు చేసే బోధలు ఆర్షసంప్రదాయ అనుయాయులందరికీ  శిరోధార్యం కావడం సహజమే. అయితే భారతదేశంలో అర్షసంప్రదాయమే కాక ఇతర సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆయా కులాల వారు ఆయా ప్రత్యేక దేవీ దేవతలను కొలవడం కనిపిస్తుంది. ఉదాహరణకు పెద్దమ్మ, పోలేరమ్మ, గండి పోచమ్మ, మావుళ్ళమ్మ వంటి దేవతలను పూజించే కులాలవారినే తీసుకోండి. వారు ఆ దేవతలను భక్తి, విశ్వాసాలతో కొలుచుకుంటూ; అందువల్ల తాము ప్రయోజనం పొందుతున్నామనే నమ్ముతారు. ఆ పూజా విధానాలు కూడా అర్షవిధానాలకు భిన్నంగానూ ఉంటాయి. ఆర్షసంప్రదాయ అనుయాయులు అటువంటి కొలుపులలో సాధారణంగా పాల్గొనరు. వారి పద్ధతిలో వారు పూజలు, ఉపాసనలు చేసుకుంటారు. తెలంగాణలో జరిగే బోనాలలో ఆంధ్రప్రాంతీయులు పాల్గొనడం తక్కువ. వారి పద్ధతులు వారికి ఉన్నాయి. అలాగే, ఇతర ప్రాంతీయ భేదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పాండురంగవిఠలుడు మహారాష్ట్రలో ప్రసిద్ధ దైవం, మన రాష్ట్రంలో అంతగా కాదు. అంతిమంగా చెప్పాలంటే, అంతా విశ్వాసంలోనే ఉంది. సాయి సచ్చరిత్ర పారాయణకైనా, మరో పారాయణకైనా ఇదే వర్తిసుంది. బీజాక్షరాలు ఉన్న సంస్కృత గ్రంథాల పారాయణ అందరికీ సాధ్యమూ కాదు. వారికి చేతనైనంతలో సచ్చరిత్ర వంటి గ్రంథాలను పారాయణ చేసుకుంటారు.

చాగంటి వారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రవచనాలు అన్ని తరగతులవారినీ ఆకర్షిస్తున్నాయి. మనదేశంలో ఎవరి పూజావిధానాలు వారికి ఉన్నా, ఇతర విధానాలను ప్రశ్నించని తత్వమూ అనాదిగా ఉంది. ఈ అవగాహన నుంచి, అనుభవం నుంచి చూసినప్పుడు చాగంటివారి వ్యాఖ్యలు ఆశ్చర్యపరుస్తాయి. రెండేళ్లుగా ఆయన ప్రసంగాలు వింటున్న నేను ఆయన పై వ్యాఖ్యలు చేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
13 comments:

 1. మీ విశ్లేషణ బాగుంది. ఈ చిన్నవివాదాన్ని ఆస్తికలోకం వదిలివేస్తుందని ఆశిద్దాం

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు దుర్గేశ్వర గారూ...

   Delete
 2. ఆర్షసంప్రదాయం అంటే ఏంటో వివరించగలరా ?

  ReplyDelete
  Replies
  1. ఋషులచే చెప్పబడిన వేదాలను, ఉపనిషత్తులను, శాస్త్రాలను, పురాణాలను ప్రమాణంగా తీసుకుని సంస్కరించబడి, సామాజికంగా సాంస్కృతికంగా, విద్యాపరంగా ఉన్నతస్థితిలో ఉన్నవారికి ఎక్కువ అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక, భక్తి విజ్ఞానం ఆర్షసంప్రదాయం.

   Delete
 3. భాస్కరంగారూ,
  మీ వ్యాసం బాగుంది. దీనిని ఉద్దేసించి ఒక వ్యాఖ్య వ్రాసాను. కాని అది మరీ‌ పెద్దదిగా ఉంది.
  అది వ్యాఖ్యగా ఉంచటం సమంజసం కాదని, నా శ్యామలీయం బ్లాగులో ఒక టపాగా ప్రకటిస్తున్నాను.

  ReplyDelete
 4. ధన్యవాదాలు శ్యామలరావు గారూ...

  ReplyDelete
 5. చాగంటి వారి సురుచిర
  భాగవత ప్రవచనములు ప్రతిభాన్వితముల్ ,
  ఈగతి 'శ్రీగురు చరిత'ను
  లాగి వివాదమ్ము చేయ రాదు బుథులకున్ .
  -----బ్లాగు : సుజన-సృజన

  ReplyDelete
 6. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు జఫా గారూ...బ్రహ్మశ్రీ అనే మాట బ్రాహ్మణత్వాన్నీ,బ్రహ్మజ్ఞాన సంపదనూ సూచిస్తుంది. ఇంకేమైనా విశేషార్థాలు ఉన్నాయేమో తెలియదు. మహారాజశ్రీ అనే సంబోధన లాంటిదే ఈ మాట కూడా.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. Namaskar Guru gaaru...
   Naa chinna comment: Vyasudini takkuva chesi enduku choostunnaru?
   Vyasaya Vishnu roopaya Vyasa roopaya Vishnave Namo vai bhrahma nidhaye vaasistaya namohnamah.. ani direct gaa vishnu sahastra naamam cheppindi kadaa.. Mari... anduvalla Sai baba ni Devudi to compare cheyyadam takkuva cheyyadam endukavutundi......
   MSK Kishore

   Delete
 7. Inkokati.. Nenu Chaganti vaaru Saibaba gurichi cheppaga oka sari vinnadi emitante...
  Veera matham(Like saibaba and konni Ramuni Vigrahalu) vesukunna moortula daggara darsanaaniki velli sonta korikalanu korakoodani.....

  ReplyDelete
 8. ధన్యవాదాలు msk గారూ, వ్యాసుని విష్ణువుగా చెప్పినా, సాయి భక్తులు సాయిబాబా గారిని దేవుడుగా కొలిచినా వారి వారి విశ్వాసమే మూలం. విశ్వాసాల మధ్య హెచ్చుతగ్గులు తీసుకురావడం సమంజసం కాదనే నేను అన్నది.

  ReplyDelete