Friday, October 21, 2016

ఇంత బేషరంగా ఎలా ఫిరాయిస్తారబ్బా?!

తమ మధ్య ఎలాంటి కీచులాటలు ఉన్నా పాతికేళ్లో, పదేళ్ళో కాపురం చేసిన భార్యను భర్త, భర్తను, భార్య విడిచిపెట్టాలనుకోవడం మనదేశంలో ఇప్పటికీ అంత తేలిక కాదు. చట్టపరమైన అడ్డంకుల సంగతి అలా ఉంచితే, పిల్లాలూ, ఇతర ఎమోషనల్ బంధాలూ అడ్డం వస్తాయి. పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. సర్దు బాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా విడిపోవడం లేదని కాదు. విడిపోతున్న కేసులకన్నా సర్దుకుని కలిసే ఉంటున్న కేసులే ఎక్కువ ఉంటాయి. విడిపోవడానికి  మానసికంగా ఎంతో సిద్ధం కావాలి. విడిపోవడమంటే జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే. ఎంత తగవులున్నా కలసి ఉండడానికి భార్యాభర్తలు ప్రయత్నించడమే భారతీయవివాహ వ్యవస్థకు గల బలమని అంటారు. అయితే అదే బలహీనత అని అనే వాళ్ళూ ఉన్నారు.

అదలా ఉంచితే, భారతీయ వివాహబంధం నమూనా మన బహుళ పక్ష ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ఏమాత్రం పనికిరావడం లేదు. పాతికేళ్లు ఒక పార్టీలో ఉండి దానితో, దాని ఐడియాలజీతో పెంచుకున్న ఎమోషనల్ బంధాన్ని ఒకే ఒక్క ప్రకటనతో పుటుక్కున తెంచుకుని ఇంకో పార్టీవ్రత్యానికి గెంతడానికి నాయకులు ఏమాత్రం వెనకాడడం లేదు.  అందుకు వాళ్ళలో ఎలాంటి అంతర్మథనం జరుగుతున్న ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇది బహుళపక్ష ప్రజాస్వామ్యానికి బలమో బలహీనతో తెలియడం లేదు.

Tuesday, October 11, 2016

అమ్మవారి పూజ ప్రపంచవ్యాప్తం

చాలా రోజులైంది బ్లాగ్ రాసి. పాఠకులు మన్నించాలి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంలో ప్రైమ్ పోస్ట్ ప్రచురించిన నా వ్యాసం లింకు ఇస్తున్నాను. చూడగలరు. 



అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…”
అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. అలాగే, ప్రపంచ పౌరాణికతపై మూడు బృహత్ సంపుటాలు రచించిన క్యాంప్ బెల్  అనే పండితుడు డిమీటర్ అనే గ్రీకుదేవతగురించి The Great Goddess of the Universe అంటాడు. ఆ మాట సూచిస్తున్నది కూడా పోతనగారు పేర్కొన్న అమ్మలగన్న అమ్మనూ, మూలపుటమ్మనే! ఆమె జగజ్జనని, లోకమాత. ఆదిశక్తి.
ప్రపంచమంతటా జగజ్జననిగా కొలుపు లందుకున్న ఆదిమదైవం, స్త్రీ దేవతే.
ఈ చిత్రం చూడండి. చూడగానే ఈమె మన అమ్మవారే నని మీకు అనిపించి తీరుతుంది. సూక్ష్మంగా చూసినప్పుడు వివరాలలో తేడాలు ఉంటే ఉండవచ్చు. నిజానికి ఈమె హెకటే (Hekate) అనే గ్రీకు దేవత. ఈమె చంద్ర సంబంధి, చంద్రునికి ప్రతీక. మాంత్రిక దేవత, ప్రసూతి దేవత కూడా. ఈమె లాంటిదే  అర్తెమిస్ అనే మరో దేవత.  హెకటేను, అర్తెమిస్ ను త్రియోదితిస్ (trioditis), అంటే మూడు మార్గాల కూడలిలో ఉండే దేవతగానూ; త్రిప్రోసొపొస్ (triprosopos), అంటే మూడు ముఖాలు కలిగిన దేవతగానూ కూడా పిలుస్తారు.

Tuesday, July 19, 2016

కాంగ్రెస్ చేసిన తప్పులే బీజేపీ చేయాలా!?

చాలా రోజుల తర్వాత బ్లాగులో రాజకీయ వ్యాఖ్య రాస్తున్నాను.

కాంగ్రెస్ చేయని పనులు కొన్ని బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ చేసిన ఎన్నో పనులు కూడా బీజేపీ చేస్తుంది(చేస్తోంది). అలాగే కాంగ్రెస్ కూడా.

ఉదాహరణకు కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. బీజేపీ మీద కూడా కొన్నైనా వచ్చాయి. అప్పుడు బీజేపీని ఆ విషయమై కాంగ్రెస్ అడిగిందనుకొంది, అప్పుడు మీ మీద ఉన్న అవినీతి ఆరోపణల సంగతేమిటని బీజేపీ అడుగుతోంది.

రాజ్యాంగ పదవుల్ని, ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ చేసిందనుకోండి, మీరు ఆయావ్యవస్థలను భ్రష్టు పట్టించలేదా అని బీజేపీ అడుగుతుంది.

భావప్రకటనా స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని కాంగ్రెస్ అందనుకోండి, అందులో మిమ్మల్ని మించిన ఘనులు ఎవరుంటారని అంటూ బీజేపీ ఎమర్జెన్సీ ని ఎత్తిచూపుతుంది.

ఇలా చాలా ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోవచ్చు...

ఇవాళ లోక్ సభలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో ఎన్డీయే వ్యవహార సరళి, న్యాయస్థానంలో అది బెడిసికొట్టడం చర్చలోకి వచ్చింది. ప్రభుత్వాలను కుప్ప కూల్చిన చరిత్రలోనూ, వాటి సంఖ్యలోనూ మిమ్మల్ని మించినవాళ్ళు ఎవరున్నారని హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జవాబిచ్చారు.

నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, కాంగ్రెస్ చేసిన తప్పులనే బీజేపీ కూడా చేయడం; నువ్వు తప్పు చేయలేదా అంటే నువ్వు చేయలేదా అని ఒకరినొకరు నిందించుకోవడం; ఈ ద్వై పాక్షిక వాగ్యుద్ధానికి జనం నిశ్శబ్ద శ్రోతలుగా ఉండడం... ఇదేనా రాజకీయమంటే?! ఈ జనానికి కూడా కాస్త ఆలోచనాశక్తి, సొంత అభిప్రాయాలూ ఉంటాయని బొత్తిగా తెలియనట్లుగా, లేదా బొత్తిగా పట్టనట్టుగా రాజకీయపక్షాలు ఎలా వ్యవహరిస్తాయి? దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్సే ఇలాంటి రాజకీయచర్చా సరళికి బాధ్యత వహించాలనీ, అదే ఈ ధోరణిని పెంచి పోషించిందనీ అనుకుందాం. కాంగ్రెస్ కన్నా గొప్ప పరిపాలన అందిస్తామనీ, గొప్ప ఒరవడులు కల్పిస్తామనీ చెప్పే బీజేపీ కూడా అలాగే ఎందుకు చేస్తోంది? తను ఈ సరళిని మార్చవచ్చు కదా!

జనంలో అందరూ కాంగ్రెస్ వాదులో, బీజేపీ వాదులో ఉండరు. ఉన్నా మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పేవారు వాళ్ళలో చాలామంది ఉంటారు. ఈ పార్టీలు వాళ్ళ ఉనికినే పట్టించుకోనట్టు ఎలా ఉంటాయి?

ఈ సందర్భంలో నా సొంత అనుభవం ఒకటి చెప్పుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను.

2004-05లో కాబోలు బీహార్ లో లాలూప్రసాద్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి ప్రమాదంలో పడింది. బీజేపీ మద్దతు గల నితీశ్ కుమార్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం  హుటాహుటిన రంగంలోకి దిగి గవర్నర్ నుంచి అనుకూల నివేదికను తెప్పించుకుని రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత రాష్ట్రపతి పాలన విధింపునకు మంత్రివర్గ నిర్ణయం తీసుకుని రష్యాలో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి అర్థరాత్రి ఆమోద ముద్ర తెప్పించుకుని రాష్ట్రపతి పాలన విధించింది.

అప్పుడు నేను వార్త దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నాను. యూపీఏ చర్యను అర్థరాత్రి ప్రజాస్వామ్యహత్యగా వర్ణిస్తూ చాలా ఘాటైన ఎడిటోరియల్ రాశాను. ఆ పత్రిక యజమాని అప్పుడు కాంగ్రెస్ లో ఉండడమే కాదు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నేతలనుంచి వరసపెట్టి ఆయనకు ఫోన్లు. ఎడిటర్ గా ఉన్న టంకశాల అశోక్ గారిని దీనిపై ప్రశ్నించారు. "అవును. నాకూ అలాగే అనిపించింది. ఆయనకూ అలాగే అనిపించింది. అదే రాశారు. తప్పేమిటి?" అన్నారు.  విశేషమేమిటంటే దానిపై ఆయన ఆ తర్వాత ఏమీ అనలేదు.
                                                                       ***
రోజులు, జనం ఆలోచనలు మారాయన్న సంగతి గతంలో యూపీఏ గమనించుకోలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. యూపీఏ రెండోవిడత పాలనా కాలాన్నే చూడండి. అప్పటికి మీడియా చాలా వ్యాప్తి చెందింది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాజకీయచర్చల ప్రత్యక్షప్రసారాలు, వాగ్యుద్ధాలు జనం డ్రాయింగ్ రూమ్ లకు చేరిపోయాయి. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో మీడియా శక్తియుక్తులు, పాత్రా సహస్రాధికంగా పెరిగిపోయాయి. ఈ దశలో తనపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై మన్మోహన్ ప్రభుత్వం దీర్ఘమౌనం పాటించి అభాసు పాలయ్యింది. దాని పతనం 2010-11 నాటికే ఖరారు అయిపోయింది. 2014 లో జరిగింది అది క్రియారూపం ధరించడం మాత్రమే.

ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉదాహరణల ద్వారా బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తోంది.
                                                                    ***

అందుకే అంటున్నాను...కాంగ్రెస్ తన అరవై ఏళ్ళకు పైబడిన పాలనలో చేసిన తప్పులనే చేసే లగ్జరీ బీజేపీకి లేదు. ఎన్నేళ్లలో వంతెన కింద చాలా నీళ్ళు ప్రవహించాయి. నేటి  జనం నిన్నటి జనం కాదు. నేటి మీడియా నిన్నటి మీడియా కాదు. మనిషికి వయసుతో పాటు లోకజ్ఞానం పెరుగుతుంది, మంచి చెడులను అంచనా వేసే వివేకమూ పెరుగుతుంది. చిన్నప్పుడు చేసిన తెలివితక్కువ పనులను పెద్దయిన తర్వాత చేయడు. అలాగే, ప్రజాస్వామ్య అనుభవమూ అవగాహనా కూడా కాలంతోపాటు పెరుగుతాయి. చిన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్నే ఇప్పుడు మేమూ చేస్తామంటే కుదరదు. అది వితండవాదన అవుతుంది. అంతకన్నా ఎక్కువగా అది ఆత్మహానికి దారితీస్తుంది.



Friday, June 24, 2016

'అంగా దంగా త్సంభవసి'- కథ

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.
అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,
“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

Thursday, June 2, 2016

స్లీమన్ కథ-35(చివరి భాగం): రోడ్డు మీద కుప్ప కూలిపోయాడు!

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.

Thursday, May 26, 2016

స్లీమన్ కథ-34: అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ఒక పురాతన భూఖండం అట్లాంటిస్!

  1. అట్లాంటిస్-కెనారీ దీవులు: అతి పురాతనకాలంలో, ఒక అంచనా ప్రకారం 9వేల సంవత్సరాల క్రితం, అట్లాంటిక్ సముద్రంలో ఉండేదిగా భావిస్తూ వచ్చిన దీవులు ఇవి. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 428-348) తన ‘తీమేయస్’ (Timaeus), ‘క్రీషియస్’ (Critias) అనే డైలాగులలో అట్లాంటిస్ గురించి రాశాడు. పెద్ద ఉత్పాతం ఏదో సంభవించి ఈ భూఖండం సముద్రంలో లోతుగా మునిగిపోయిందనీ, ఇందులోని పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలు మాత్రమే నీటిపై కనిపిస్తాయనీ రాశాడు. అప్పటినుంచీ అట్లాంటిస్ అనే భూఖండం నిజంగానే ఉండేదని నమ్ముతూ వచ్చినవాళ్ళు నేటి కెనారీ(Canary) దీవులు, అజోర్స్(Azores)దీవులు, కేప్ వర్ద్(Verde),మదీరా(Madeira)లు భాగంగా ఉన్న మైక్రోనేసియా యే ఆ మునిగిపోయిన ప్రాచీన భూఖండం తాలూకు అవశేషమని భావిస్తారు.

Thursday, May 19, 2016

స్లీమన్ కథ-33: ప్రధాని గ్లాడ్ స్టన్ ఫొటోను పాయిఖానాలో ఉంచాడు!

స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాలో ఉంచాడు.

Thursday, May 12, 2016

స్లీమన్ కథ-32: రష్యన్లు ఎత్తుకెళ్లిన ట్రాయ్ నిక్షేపాలు

ట్రాయ్ నిక్షేపాలు రెండో ప్రపంచయుద్ధం చివరివరకూ బెర్లిన్ లోనే ఉన్నాయి. యుద్ధం మొదలైన తర్వాత బెర్లిన్ జంతుప్రదర్శనశాలలో లోతుగా తవ్విన ఒక రహస్య కందకంలో వాటిని భద్రపరిచారు. 1945 వసంతంలో అవి రష్యన్ సేనల కంటబడ్డాయి. వాటిని వారు రష్యాకు తరలించారు.

(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/05/12/%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%96%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80%E0%B0%AE/ లో చదవండి)

Friday, May 6, 2016

స్లీమన్ కథ-31: యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకునేవారు!

తన ఒడిస్సే చివరి అధ్యాయంలో చిత్రించిన మారణకాండలాంటిది హోమర్ కు స్వయంగా తెలుసు. ఆ కృతిలో, ఒడీసియెస్ అర్థాంగి పెనలోపి పునస్వయంవరానికి వచ్చిన రాజులను నరికి పోగులు పెడతారు. పనికత్తెలను ఉరితీస్తారు. తన రోజుల్లో ఒక యువసామంతరాజును చంపి, రక్తం ఓడుతున్న మృతదేహాన్ని ఒక రథానికి కట్టి శిథిల నగర ప్రాకారాల చుట్టూ ఈడ్చుకు వెళ్ళిన ఘటన అతనికి తెలుసు. తను రాజుల గుడారంలో కూర్చుని ఉండగా, యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకోవడం తెలుసు.

(పూర్తిరచనhttp://magazine.saarangabooks.com/2016/05/06/%E0%B0%87%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%80-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2/ లో చదవండి)

Friday, April 29, 2016

స్లీమన్ కథ-30: మరణించిన మిత్రుడికి అఖిలెస్ భయానక నివాళి

హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము.  దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ  పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.

Friday, April 22, 2016

స్లీమన్ కథ-29: గ్రీకులకూ ఒక 'అర్జునుడు' ఉన్నాడు!

హెక్టర్ లో విచిత్రంగా మహాభారతంలోని అర్జునుడి పోలికలు, కర్ణుడి పోలికలూ కూడా కనిపిస్తాయి. అతను మనం తేలిగ్గా పోల్చుకోగలిగిన మానవమాత్రుడిలానే వ్యవహరిస్తాడు. అర్జునుడు కూడా ఈ మానవస్వభావానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ‘నరుడు’ అన్న అతని మరో పేరే దీనిని సూచిస్తూ ఉండచ్చు. హెక్టర్ లానే అర్జునుడు కూడా యుద్ధఘట్టంలో సందేహాలు, సందిగ్ధాల మధ్య నలుగుతాడు. విషాదానికి లోనవుతాడు. హెక్టర్ లానే యుద్ధానంతర విధ్వంసాన్ని పదే పదే ఎత్తి చూపుతాడు.

Thursday, April 14, 2016

స్లీమన్ కథ-28: గ్రీకుల 'మహాభారతం' ఇలియడ్

యుద్ధం ఆగిపోయిందన్న వార్త వస్తుంది. దానికి బదులు హెలెన్ భర్త మెనెలాస్, ఆమెను అపహరించుకుని వచ్చిన పారిస్ ద్వంద్వయుద్ధం చేయాలని తీర్మానించారు. హెలెన్ భవితవ్యాన్ని ఆ యుద్ధం నిర్ణయించబోతోంది. హెలెన్ శ్వేతవస్త్రం ధరించి, చెలికత్తెలు వెంటరాగా ప్రియామ్ ఉన్న బురుజును సమీపిస్తుంది. ఆమె రాకను గమనించిన పెద్దలు అప్రయత్నంగా గొంతులు తగ్గించి, ఆమె అద్భుత సౌందర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకోవైపు, సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం అంతం కాబోతోందన్న సంతోషం వాళ్ళలో వెల్లివిరుస్తోంది. ప్రియామ్ ఆమెను తన దగ్గరకు పిలిచి శత్రుసేనలోని ఒక వ్యక్తిని చూపించి, “అందరికంటే ఆజానుబాహువుగా, ధీరోదాత్తుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతాడు.

(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/04/14/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82-%E0%B0%87%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A1/ లో చదవండి)

Friday, April 8, 2016

పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

మైసీనియా తవ్వకాలలో రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. ఒకటి అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

Tuesday, April 5, 2016

స్లీమన్ కథ-26: అగమెమ్నన్ మమ్మీ దొరికింది!

ఆ ముఖంలో అతనికి అగమెమ్నన్ పోలికలు కనిపించాయి! అది గుండ్రంగా ఉండి, ముప్పై అయిదేళ్ళ పురుషుడి ముఖంలా కనిపించింది. అన్ని దంతాలూ పటిష్టంగా ఉన్నాయి. ఒక పెద్ద స్వర్ణ వక్షస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. అతని నుదుటి మీదా, వక్షస్థలం మీదా, తొడల మీదా బంగారు ఆకులు పరచి ఉన్నాయి. అతని ముఖానికి పక్కనే పడున్న బంగారు ముసుగు సాపుగా అయిపోయింది. స్లీమన్ దానిని చేతుల్లోకి తీసుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. 

Saturday, March 19, 2016

స్లీమన్ కథ-25: మతి పోగొట్టిన మైసీనియా స్వర్ణసంపద!

15 అడుగుల లోతున ఒక గులకరాయి పొర తగిలింది. ఆ పొర అడుగున మూడు కళేబరాలు కనిపించాయి. వాటిని మట్టి, చితాభస్మంలా కనిపిస్తున్న బూడిద దట్టంగా కప్పేసాయి.  వాటిలోంచి బంగారపు మెరుపులు తొంగి చూస్తున్నాయి.
చేతికి అందేటంత దూరంలో స్వర్ణనిక్షేపాలు ఉన్న సంగతి స్లీమన్ కు అర్థమైంది. ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు నీడలా తనను వెన్నంటి ఉన్న సంగతీ తెలుసు. ట్రాయ్ లో నిక్షేపాలను కనిపెట్టిన క్షణాలలోలానే ఒక్కసారిగా విపరీతమైన ఆందోళనతో, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అప్పటిలానే సహాయం కోసం సోఫియావైపు చూశాడు. అతనెంత ఉద్రిక్తతకు, ఉత్తేజానికీ లోనయ్యాడంటే; ఆ అస్థిపంజరాలను కప్పిన మట్టిని తొలగించడానికి కూడా అతనికి చేతులు ఆడలేదు. చటుక్కున సోఫియాయే వాటి పక్కన ఉన్న ఖాళీ జాగాలోకి దూరి వెళ్ళి జేబుకత్తితో మట్టిని తొలగించింది.

Tuesday, March 15, 2016

స్లీమన్ కథ-24: షరా మామూలుగా తవ్వకాలూ, తగవులాటలూ

ఆ తదుపరి రోజుల్లో జరిపిన తవ్వకాల్లో కూడా సమాధి రాళ్ళ శకలాలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బంగారు బొత్తం కనిపించింది. అలా సమాధి రాళ్ళ దగ్గరే బంగారు బొత్తం కనిపించేసరికి సమీపంలోనే నిక్షేపాల వాసన ఏదో స్లీమన్ కు ఘాటుగా సోకింది.

పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/02/10/%E0%B0%B7%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B0%97/ లో చదవండి)

Friday, February 26, 2016

ఆంధ్రభాగవత కర్త(లు) ఒకరా, నలుగురా?..మరికొంత చర్చ

మహాభారతాన్ని ముగ్గురు కవులు అనువదిస్తే, భాగవతాన్ని పోతనగారు ఒక్కరే అనువదించారని చాగంటి కోటేశ్వరరావుగారు అన్న నేపథ్యంలో, “భాగవతాన్ని పోతన ఒక్కరే అనువదించలేదు, మరో ముగ్గురు అనువదించారు” అన్న వాస్తవిక వివరాన్ని గుర్తు చేయబోతే, అది కాస్తా ఊహించని మలుపు తిరిగింది.  అయినా మలుపు మంచిదే అయింది. అయ్యగారి నాగేందర్ స్పందిస్తూ సంగ్రహంగా ఇలా అభిప్రాయపడ్డారు.

1.     పన్నెండు స్కంధాలూ పోతనగారే రాశారు. ఆయన తన రచనకు ప్రాచుర్యం కల్పించలేదు, కోరుకోలేదు. ఈ విషయం కృతిలోనే చెప్పుకున్నారు. 2. చాలాకాలంపాటు పూజా మందిరంలోనే లోనే ఉంచడంవల్ల తాళపత్రాలకు చెదలు పట్టాయి. పోతనగారు జీవించినవి భవంతులు కావు. శ్రీనాథుడికో, నన్నయకో ఉన్న సదుపాయాలు పోతనకు లేవు. ఆయన జీవనవిధానం వేరు. 3. శిథిలమైన భాగాలను ఆయన శిష్యులైన గంగన, సింగన, నారయలు పూరించారు.  ఇదే శిష్టజనామోదమూ, బహుళజనామోదమూ పొందిన అభిప్రాయం. 4. ఈ విషయాలలో అనుమానాలు చొప్పించే ప్రయత్నం వ్యర్థం. 5. పోతన భాగవత రచన తర్వాతే వీరభద్రవిజయము రచించారు.

ఇంతకీ పండితులు ఏం చెప్పారన్న ఆసక్తితో నా దగ్గర అందుబాటులో ఉన్న ఆంధ్రమహాభాగవతప్రతిని, 1982లో పోతన పంచశతి మహోత్సవాల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధ శాఖ ప్రచురించిన "మహాకవి పోతన" అనే వ్యాససంపుటిని పరిశీలించే అవకాశం కలిగింది. అందుకు ధన్యవాదాలు.
శ్రీ మహాభాగవతాన్ని మొదట ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించగా, తెలుగు విశ్వవిద్యాలయం పునర్ముద్రించింది. "బహు పాఠాన్తర పరిష్కార విపుల పీఠికా సహితం"గా అందించిన ఈ ముద్రణకు రాయప్రోలు సుబ్బారావు, దివాకర్ల వేంకటావధాని, తాపీ ధర్మారావు, దీపాల పిచ్చయ్యశాస్త్రి, బిరుదురాజు రామరాజు సంపాదకత్వం వహించారు. ఆపైన వారితో సహా 26 గురు పండితులు భాగవతప్రతుల పరిశీలనలో పాల్గొన్నారు.
అనుమానాలు చొప్పించనిదే పరిశోధనే లేదు. కనుక అనుమానాలు చొప్పించే ప్రయత్నం వ్యర్థమని కొమ్ములు తిరిగిన పండితులే అనుకోలేదు. వాళ్ళూ పోతన మీద భక్తి, ఆరాధనా ఉన్నవారే. అలాగని పోతన భాగవతం గురించి ప్రచారంలో ఉన్న కథల్ని గుడ్డిగా నమ్మేసి ఊరుకోలేదు. సాధ్యమైనంతవరకు ప్రశ్నించారు, తర్కించారు. అకాడెమీ భాగవత విపుల పీఠికలో 153 పాఠాన్తరాలను చర్చించి సాధు పాఠాన్ని నిర్ణయించడానికి పండితులు చేసిన ప్రయత్నాన్ని గమనిస్తే; అంతకుముందు భాగవతాన్ని పరిష్కరించి ప్రచురించిన పెద్ద పెద్ద పండితులు కూడా చిన్న చిన్న ప్రమాదాలకు ఎలా లోనయ్యారో అర్థమవుతుంది. ఉదాహరణకు అనేకమంది పండితులు మూలంలో ఏముందో గమనించుకోకుండా కొన్ని పాఠాన్తరాలను కల్పించడం కనిపిస్తుంది. వెంకట్రామా &కో వారికోసం ఒంటి చేతితో భాగవతపరిష్కరణ చేసి అందించిన మా నాన్నగారు విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు కూడా అక్కడక్కడ ఇలాంటి ప్రమాదాలకు లోనయ్యారని చెప్పడానికి నేను సంకోచించను. ఇంకా విశేషమేమిటంటే, సాహిత్య అకాడెమీ అధ్వర్యంలో 26గురు  పండితులు చేసిన భాగవతపాఠనిర్ణయంలోనూ  పొరపాట్లను ఎత్తిచూపిన ఉదాహరణలున్నాయి. ఒక కవిని అభిమానించడం, కావ్యాన్ని ఆస్వాదించడం వేరు. పరిశోధన, పరిష్కరణ, పాఠనిర్ణయం అనేవి వేరు. వేటికవే తమవైన స్వతంత్ర అస్తిత్వంతో, స్వతః ప్రమాణాలతో పనిచేస్తాయి. రెంటినీ కలగాపులగం చేయకూడదు. పరిశోధనకు పూనుకున్నప్పుడు అంధభక్తి, స్వపరభేదాలు, అభిమానదురభిమానాలు అడ్డురాకూడదు. కనుక పరిశోధన మీద జిజ్ఞాస ఉన్న భావి పండితులు అనుమానాలను చొప్పించే ప్రయత్నం విధిగా చేస్తూ ఉండవలసిందే తప్ప వ్యర్థమని ఊరుకోకూడదు.

అకాడెమీ భాగవత పీఠికలో “కట్టుకథ”ల గురించిన కొన్ని వాక్యాలు:

1.     శైథిల్య వృత్తాంతము: భాగవతరచనమును గూర్చియు దాని శైథిల్యమును గూర్చియు వింతవింత కథలు ప్రచారమందున్నవి. తనకు కృతి నంకిత మీయని కారణమున సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతమును పాతిపెట్టించె ననియు నందువలన నది యుత్సన్నమయ్యెననియు నొక కట్టుకథ కలదు. పోతన్నగారే దాచి దాచి తమ చరమదశలో వెలికి దీసి కుమారుని కీ సారస్వతనిక్షేపము నందిచ్చు నప్పటికే శిథిలమై యుండెననియు మరియొక కథ కలదు. మొదటిదాని కన్న నిది మెరుగుగా నున్న కథ. కాని అనుముల సుబ్రహ్మణ్యశాస్త్రిగారును, మల్లంపల్లి సోమశేఖరశర్మగారును భాగవత ముత్సన్నమగుటకు అప్పటి రాజకీయపరిస్థితులే కారణములని చెప్పినది మరికొంత సమంజసముగా నున్నది...తెలంగాణ మధికభాగము బహ్మనీ సుల్తానుల వశమైపోయినది. మరికొంత గజపతుల చేతిలో బడినది. నిజమైన కారణమేదో తెలియదు.

అకాడెమీ భాగవత పీఠికాకర్త గంగన, సింగన, నారయలు భాగవతాన్ని పూరించారని కొన్ని చోట్ల, అనువదించారని కొన్ని చోట్ల అన్నప్పటికీ పూరణవైపే మొగ్గినట్టు కనిపిస్తుంది. ఆయన ఇంకా ఇలా అంటారు:

 నిజమైన కారణమేదో తెలియదు కాని పోతనగారి భాగవత మంతయు లభించలేదు. ప్రౌఢసరస్వతి యను బిరుదువహించిన కేసన వంటి కుమారుడుండ, దాక్షాయణీపరిణయకర్తలైన కేసన మల్లన కవుల వంటి మనుమలుండ, భాగవత శిథిలపూరణము లేదా శేషపూరణము నారయ, సింగన, గంగనల పాలబడుట చిత్రము.
అకాడెమీ భాగవత పీఠికాకర్త ప్రకారం వీరభద్రవిజయము భాగవతరచన తరువాతిది అనడం కట్టుకథ. ఆ వాక్యాలు ఇవీ:

2.    వీరభద్రవిజయము భాగవతరచనము జరిగిన తరువాత వెలసిన కృతి యను కట్టుకథ యున్నది గాని అది నమ్మదగినది గాదు. వీరభద్రవిజయమందే యది పోతనగారి పిన్నతనపు రచనమనియు, అప్పటి కాతనికి వీరశైవము ముదిరియున్నట్లును నిదర్శనములున్నవి.
“మహాకవి పోతన” అనే వ్యాససంపుటిలో, “పోతన దేశకాలములు-కృతులు” అనే వ్యాసంలో ఆచార్య బి. రామరాజుగారి వాక్యాలు:
1.     అదేమి చిత్రమో కానీ మన ప్రాచీన మహాపురుషుల జీవితములు కాలములు వివాదాస్పదములు, కట్టు కథలకు పుక్కిటి పురాణములకు ఆకరములు.
2.    శ్రీనాథ, పోతనల బాంధవ్యము కట్టుకథ.(అనుమానాలను చొప్పించడం వ్యర్థమనుకుంటే ఈ కథను కూడా నమ్మేయచ్చు)
3.    దురభిమాన మసత్యమునకు అసత్యము ప్రమాదమునకు దారితీయును కదా. వీరభద్రవిజయము పోతనగారి బాల్యకృతి యనియు, కనుకనే యిందులో దోషములు దొరలెననియు, భాగవతకల్పతరువను పరిణతకృతికి వీరభద్రవిజయములో బీజములున్నవనియు...తెలియవలెను.

గంగన, సింగన, నారయలు పోతనలానే కొన్ని భాగవత స్కంధాలను ఆంధ్రీకరించినట్టే(పూరించడం కాదు) రామరాజుగారు అభిప్రాయపడ్డారు:

మన భారత రామాయణముల వలెనే భాగవతము కూడా ఒక్క చేతి మీదుగా పూర్తికాలేదు. పంచమ స్కంధమును బొప్పరాజు గంగన, షష్ఠస్కంధమును ఏర్చూరి సింగన, ఏకాదశ,ద్వాదశ స్కంధములను వెలిగొందల నారయ, తక్కిన స్కంధములను పోతన ఆంధ్రీకరించినట్టు ఈనాటికి నిర్ధారణమైన సాహిత్యచరిత్ర...(సర్వజ్ఞ సింగభూపాలుడు పాతిపెట్టగా) కొంత శిథిలమైనదనియు, శిథిల భాగములనే గంగన, సింగన, నారయలు పూరించిరనియు నొక దంతకథ.

రామరాజు గారి ప్రకారం, సింగభూపాలుడు పోతన భాగవతాన్ని పాతిపెట్టించాడన్న”కట్టుకథ”ను కల్పించినవాడు “సర్వలక్షణసారసంగ్రహ”కర్త కూచిమంచి తిమ్మన(1740). రామరాజుగారు ఇలా అంటారు:

అప్పకవి(1656), పోతనగారు శకటరేఫ, సాధురేఫములకు సాంకర్యమొనర్చినందుననే పూర్వలాక్షణికు లుదాహరింప లేదన్నందున, సాంకర్యము చేసినది పోతనగారు కాదనియు తక్కిన వారనియు చెప్పక కూచిమంచి తిమ్మన, సాంకర్యమును చేసినది శిథిల భాగములను పూరించినవారనియు, ఆ శైథిల్యము సింగభూపాలుడు పాతిపెట్టించుట వలన జరిగినదనియు, అంకితమీయనందున పాతిపెట్టించెననియు దిట్టమైన కట్టుకథ యల్లెను.
కనుక గంగన, సింగన, నారయలు చేసింది శిథిలపూరణం కాదని , స్వతంత్ర అనువాదమే ననీ రామరాజుగారు అభిప్రాయపడ్డారు. స్వయంగా పోతనగారే వారి చేత రాయించి ఉంటారన్న నిడదవోలు వెంకటరావుగారి అభిప్రాయాన్ని ప్రస్తావించారు:

శిథిలపూరణ విషయము అప్పకవిగాని అజ్జరపు పేరయలింగముగాని కేసన మల్లన కవులుగాని ప్రౌఢసరస్వతిగాని చివరకు గంగన సింగన నారయలుగాని చెప్పలేదు. కనుక దీనిని సులభముగా త్రోసివేయవచ్చును. మరి భాగవతము బహుకర్తృకమెందుకైనట్లు? భారతమును ముగ్గురు వ్రాసిరి. రామాయణమును నలుగురు వ్రాసిరి. భాగవతమునుగూడ నలుగురు వ్రాసిరి. వాని వ్రాతయంతే కాబోలు. స్వయముగా పోతనగారే గంగన సింగనలను పంచమ షష్ఠ స్కంధములను రచింప ననుమతించి యుందురనియు, పోతనగారు దశమస్కంధ రచనానంతరము శివలోకమునకో విష్ణులోకమునకో పోయిన తరువాత వెలిగందల నారయ ఏకాదశ ద్వాదశ స్కంధములు రచించి యుండుననియు కనుకనే పంచమ షష్ఠస్కంధములు, పోతనగారు రచించిన తదితర స్కంధములట్లుగాక అద్వైతపరమై యుండగా, పోతన మరణానంతరము రచింపబడిన ఏకాదశ ద్వాదశ స్కంధములు విశిష్టాద్వైతపరముగా నున్నవనియు నిడదవోలు వెంకటరావుగారు సమన్వయించిరి.

లాక్షణికులు పోతనను ప్రామాణికకవిగా భావించని మాట సత్యమే. అంతమాత్రాన పోతనపై, పోతన భాగవతంపై వారికి భక్తిగౌరవాలు లేవని భావించడం పొరపాటు. జనం పోతనను సహజకవిగా,  ప్రామాణిక కవులను మించి నెత్తిన పెట్టుకున్నారు. రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.

భాగవత రచనకు ముందే వీరభద్రవిజయమును పోతన రచించారని రామరాజుగారు కూడా అభిప్రాయపడ్డారు:

వీరభద్రవిజయము పోతనగారి బాల్యకృతి యనియు, కనుకనే ఇందులో దోషములు దొరలెననియు, భాగవత కల్పతరువను పరిణతకృతికి వీరభద్రవిజయములో బీజములున్నవనియు...తెలియవలెను.

పోతన గురించి రామరాజుగారు ఇంకా ఇలా అంటారు:

అసలు శ్రీనాథుడు పోతనగారి యింటికే రాలేదు. వచ్చినాడనుకొన్నను అతనికింత భోజనము పెట్ట చేతకాని శుష్క దరిద్రుడు కాడు పోతనామాత్యుడు. పల్లకిలో నూరేగునంతటి ఆస్థానకవి కాకపోయినను తామింత తిని పదిమందికి పెట్టగల స్తోమత యున్నవాడే పోతనామాత్యుడు. భాగవతములో నాయన తన తల్లిదండ్రుల గూర్చి చెప్పిన పద్యములను కొంచెము శ్రద్ధగా చదివినచో నీ విషయము తెలియును. పోతన వయసులో నున్నపుడు రాజాస్థాన వైభవములకు ప్రాకులాడియేగదా భోగినీదండకమును రచించినది. అటు తరువాత వయస్సు పెరుగు కొలది ఉన్నదానితో సంతృప్తిపడుచు-“పలికెడిది భాగవతమట...”యను స్థితికి వచ్చినాడు.

పోతనగారిపై రామరాజుగారి భక్తిప్రపత్తులను ఎవరూ సందేహించనక్కర్లేదు. అయినాసరే, పరిశోధకుడిగానూ, వయసుతోపాటు పరిణతిని తెచ్చుకునే మానవస్వభావంపట్ల అవగాహన కలిగినవారుగానూ ఆయన ఇక్కడ నిర్మమ దృష్టినే కనబరిచారు.

అకాడెమీ భాగవత పీఠికాకర్త అభిప్రాయాలను ఇలా క్రోడీకరించవచ్చు: 1. భాగవతాన్ని సర్వజ్ఞసింగభూపాలుడు పాతిపెట్టించాడన్నది కట్టుకథ. 2. పోతనగారే దాచి దాచి చరమదశలో కుమారుడికి అప్పగించేనాటికి అది శిథిలమైనదనే కథ ఇంతకన్నా కొంత మెరుగైనది. 3. భాగవతం శిథిలమవడానికి అప్పటి రాజకీయపరిస్థితులే(రాచకొండ, దేవరకొండ రాజ్యాలు అంతరించడం, తెలంగాణలో అధికభాగం బహ్మనీ సుల్తానుల వశం కావడం) కారణమన్న అభిప్రాయం అంతకంటే సమంజసమైనది. 4. వీరభద్రవిజయము భాగవతరచనకు ముందే జరిగింది. 5. ఇవి ఇలా ఉండగా, గంగన, సింగన, నారయలు భాగవతాన్ని పూరించారని కొన్ని చోట్ల, అనువదించారని కొన్నిచోట్ల అకాడెమీ భాగవత పీఠికాకర్త రాశారు. అంటే దీనిపై విశేషంగా దృష్టి సారించలేదన్నమాట.

బిరుదురాజు రామరాజుగారి అభిప్రాయాలను ఇలా క్రోడీకరించవచ్చు: 1. సర్వజ్ఞసింగభూపాలుడు భాగవతాన్ని పాతిపెట్టించాడన్నది కట్టుకథ. 2. భారతాన్ని ముగ్గురు రాసినట్టే, భాగవతాన్ని నలుగురు రాశారు. 3. గంగన, సింగన, నారయలు చేసింది పూరణ కాదు, స్వతంత్ర అనువాదం. (నిడదవోలు వారి అభిప్రాయం ప్రకారం) గంగన, సింగనల చేత పంచమ, షష్ఠ స్కంధాలను పోతనగారే అనువదింపజేశారు. ఆయన స్వర్గస్తులైన తర్వాత నారయ ఏకాదశ, ద్వాదశ స్కంధాలను అనువదించారు. 4. భాగవత రచనకు ముందే వీరభద్రవిజయమును పోతన రచించారు. 5. పోతన పల్లకిలో ఊరేగగల ఆస్థానకవి కాకపోయినా శుష్కదరిద్రుడు కాదు. వయసులో ఉన్నప్పుడు రాజాస్థాన వైభవాలకు పాకులాడినా, వయసు పెరిగిన తర్వాత ఉన్నదానితో సంతృప్తి పడుతూ భాగవత రచనకు పూనుకున్నారు.

గంగన, సింగన, నారయలు భాగవతాన్ని పూరించారనో, అనువదించారనో తేల్చి చెప్పకపోయినా ఏదో కారణం వల్ల పోతన భాగవతం శిథిలమైందని మాత్రం అకాడెమీ పీఠికాకర్త అభిప్రాయపడ్డారు. నాటి రాజకీయపరిస్థితుల కారణంగా అది జరిగిందన్న అభిప్రాయం ఎక్కువ సమంజసంగా ఉందని పేర్కొని ఆ పరిస్థితుల గురించి కూడా రాశారు. కాకతీయ సామ్రాజ్య పతనానికీ, విజయనగర సామ్రాజ్య అవతరణ వికాసాలకూ మధ్యకాలంలో సంభవించిన తురుష్కుల దండయాత్రలూ, ధర్మగ్లానీ వంటి కారణాలవల్ల భాగవతం శిథిలమైందని దాని సారాంశం. భాగవతమనే తాళపత్ర గ్రంథం శిథిలమవడం అనే పరిణామానికి ఇంతటి విశాల పరిణామాలతో ముడిపెట్టడం ఎంతవరకూ తర్కానికి నిలుస్తుందనేది ప్రశ్న. అనేక తాళపత్రగ్రంథాలు ఉండగా ధర్మద్రోహులు ఒక్క భాగవతంపైనే కత్తి కట్టి దానిని శిథిలం చేశారా?

ఒకవేళ ఇదే నిజమనుకున్నా, ధర్మద్రోహుల దృష్టి పడేటట్లుగా పోతనే 12 స్కంధాలూ రచించిన భాగవత తాళపత్ర ప్రతులు ఒకటి కాక అనేకం, అనేకచోట్ల ఉండి ఉండాలి. భాగవతమతం పలుచోట్ల వ్యాప్తిలో ఉండి ఉండాలి. అది ఒక ఉద్యమంగా వ్యాపించి ఉండాలి. ధర్మద్రోహులు అన్ని చోట్లకూ వెళ్ళి పనిగట్టుకుని ఒక్క భాగవత తాళపత్రప్రతులనే ధ్వంసం చేసి ఉండాలి. అలా జరుగుతుందా?! భాగవతప్రతులు అనేక చోట్ల అనేకం ఉన్నాయనుకుంటే, విధ్వంసం నుంచి కొన్నైనా తప్పించుకునే అవకాశం ఉంది. అప్పుడు పోతన చిరకాలంపాటు పూజామందిరంలో ఉంచడం వల్ల ఆ ఒక్క ప్రతీ శిథిలమైందన్న వాదానికి అది బాధకం అవుతుంది. ఇలా కాక, పోతన దాచిన ఒక్క ప్రతీ శిథిలమై; ఆ కారణంగా మిగతా ముగ్గురూ దానిని పూరించిన తర్వాత దానికి అనేక ప్రతులు ఏర్పడి, అనంతరపు దాడుల కారణంగా శిథిలమయ్యాయా అనుకుంటే అప్పుడు నాటి రాజకీయపరిస్థితుల కారణంగా శిథిలమైన భాగాలను మిగతా ముగ్గురూ పూరించారని చెప్పడం కుదరదు. అలా ఎవరూ చెప్పడం లేదు కూడా.

అకాడెమీ భాగవత పీఠికాకర్త ప్రకారం, “ఆంధ్రదేశముమందును ఆంధ్రదేశము బయటను భాగవతమునకు సంబంధించిన తాళపత్రగ్రంథములు వందలసంఖ్యలో కలవు”. వీటిలో 26 ప్రతులను పాఠపరిష్కరణకు ఎన్నుకొన్నామని ఆయన చెప్పుకున్నారు. అవి 1750-1893 మధ్యకాలానికి చెందినవి. ఇంకా ప్రాచీనమైనవి ఉన్నాయో లేదో తెలియదు. పోతన కాలంలో ఒక్క ప్రతి మాత్రమే ఉండి అనంతర కాలంలో వందలప్రతులు ఏర్పడడానికి కారణమేమిటి, ఆ మధ్యలో ఏం జరిగిందని ప్రశ్నించుకుంటే దానికి సమాధానంగా విధ్వంసం వాదాన్ని ముందుకు తేవచ్చు. అదెంత అతార్కికమో చూశాం.

పోతన తనెంతో భక్తిప్రపత్తులతో రచించిన భాగవతం ఒక్క ప్రతినీ చెదల భక్షణకు విడిచిపెట్టే నిర్లక్ష్యానికి పాల్పడరనుకోవడమే అన్నివిధాలా హేతుబద్ధం. తన భాగవతరచనను కుటుంబసభ్యుల మధ్యా, మిత్రుల మధ్యా మక్కువతో ఆయన పఠిస్తూ తన భక్తితత్పరతను వాళ్ళతో పంచుకునే ఉంటారనడం ఎంతైనా స్వాభావికం. ఆవిధంగా తను కోరకపోయినా తన రచనకు ఇతోధిక ప్రాచుర్యం కల్పించి ఉంటారనుకోవడమే న్యాయం.  స్వయంగా కవులైన ఆయన కొడుకు, మనుమలు భాగవతాన్ని చెదలు తింటుంటే ప్రేక్షకపాత్ర వహించారనుకోవడం కంటే అసహజం, అన్యాయం ఉండవు. తన రచనకు పరిమిత సంఖ్యలోనే అయినా ప్రతులు తయారు చేయించడానికి ఆయన జీవనవిధానం, ఆర్థికస్తోమత అడ్డువచ్చాయని భావించడమూ అలాంటిదే. క్రమంగా భాగవతానికి ప్రాచుర్యం పుంజుకుని వందల సంఖ్యలో ప్రతులు ఏర్పడ్డాయి. ఇలా భాగవత శైథిల్యవాదన తేలిపోయినప్పుడు,స్వయముగా పోతనగారే గంగన సింగనలను పంచమ షష్ఠ స్కంధములను రచింప ననుమతించి యుందురనియు, పోతనగారు దశమస్కంధ రచనానంతరము శివలోకమునకో విష్ణులోకమునకో పోయిన తరువాత వెలిగందల నారయ ఏకాదశ ద్వాదశ స్కంధములు రచించి యుండుననియు కనుకనే పంచమ షష్ఠస్కంధములు, పోతనగారు రచించిన తదితర స్కంధములట్లుగాక అద్వైతపరమై యుండగా, పోతన మరణానంతరము రచింపబడిన ఏకాదశ ద్వాదశ స్కంధములు విశిష్టాద్వైతపరముగా నున్నవనియు నిడదవోలు వెంకటరావుగారు సమన్వయించిరి.” అన్న రామరాజుగారి అభిప్రాయమే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.  





Monday, February 8, 2016

చాగంటివారూ...భాగవత అనువాదకులు ఒక్కరు కాదు, నలుగురు!

ఈరోజు పొద్దునే శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం వింటున్నాను. "మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రన ముగ్గురు అనువదించారు. కానీ భాగవతాన్ని పోతన ఒక్కరే అనువదించారు" అని ఆయన అన్నారు. "ప్రమాదో ధీమతామపి" అన్నట్టుగా చాగంటివారూ పొరబడతారనిపించింది.

ఆంధ్రమహాభాగవతాన్ని పోతన ఒక్కరే కాక, వెలిగొందల నారయ, గంగన, ఏల్చూరి సింగన అనే మరో ముగ్గురు అనువదించారు, లేదా పూరించారు.

(శ్రీ మహాభాగవతం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, పీఠిక, పుట: 15)

Thursday, February 4, 2016

అక్రమ సంబంధాల విషాదస్థలి మైసీనియా

మైసీనియాలో ఆ అయిదురోజుల తవ్వకాల్లో విలువైనవేవీ బయటపడకపోయినా, తప్పకుండా బయటపడతాయన్న నమ్మకంతో స్లీమన్ ఉన్నాడు. ఈ తవ్వకాల వివాదం సద్దుమణిగేదాకా రెండు మాసాలు ఓపికపట్టి ఆ తర్వాత గ్రీకు ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన దాఖలు చేసుకున్నాడు. మైసీనియాలో సొంత ఖర్చు మీద తవ్వకాలు జరుపుతాననీ, వాటిలో బయటపడే వాటినన్నిటినీ ప్రభుత్వానికి అప్పజెబుతాననీ, వాటి గురించి వెల్లడించే హక్కు మాత్రమే తనకు ఉంటుందనీ అందులో ప్రతిపాదించాడు. తనను ఇంతకుముందు దొంగగా, గ్రీసుకు శత్రువుగా చిత్రించిన మంత్రే దానిని ఆమోదిస్తూ సంతకం చేశాడు.
(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/02/03/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%B2%E0%B0%BF/లో చదవండి)

Friday, January 29, 2016

స్లీమన్ కథ-22: ట్రాయ్ నగలను భార్యకు అలంకరించాడు

పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సోఫియా తిరిగివచ్చింది. స్లీమన్ ఒక జేబుకత్తితో నిక్షేపాలను తవ్వి తీయడం  ప్రారంభించాడు. మట్టి, రాతిముక్కలు, పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రక్షణకుడ్యం కుప్పకూలేలా ఉంది. కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఓ పెద్ద ఖజానా  అతని భయాలన్నింటినీ హరించేసింది. మళ్ళీ సోఫియావైపు తిరిగి, “త్వరగా వెళ్ళు, నీ పెద్ద శాలువ తీసుకురా” అన్నాడు.

Friday, January 22, 2016

స్లీమన్ కథ-21: ఆరు బుట్టల్లో, ఓ బస్తాలో బంగారం తరలించాడు

ఎట్టకేలకు నిక్షేపాలను కనిపెట్టాననుకున్నాడు. టర్కుల చూపు పడకుండా వాటిని రక్షించడ మెలా అన్నది తక్షణ సమస్య. పనివాళ్లలో ఎవరూ పసిగట్టలేదు. సోఫియా అతని పక్కనే ఉంది. ఆమెవైపు తిరిగి, “నువ్వు వెంటనే వెళ్ళి ‘పైడోస్’ అని కేకపెట్టు” అని చెప్పాడు. పైడోస్ అనే ఆ గ్రీకు మాటకు సెలవుదినం అని అర్థం.

Thursday, January 14, 2016

స్లీమన్ కథ-20: నిధులు దొరికాయి!

ఆగస్టు 4…అప్పటికే అతను జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక ఆ వేసవిలో తవ్వకాలు ఆపేద్దామనుకుంటున్నాడు. అంతలో అతను ఎదురుచూస్తున్న నిధి మొదటసారి కంటబడింది. ఆనందపు అంబర మెక్కించేంత గొప్ప నిధిగా అతనికి తొలిచూపులో కనిపించలేదు. మూడు బంగారు చెవిపోగులు, ఒక బంగారు బొత్తం…! దగ్గరలోనే ఒక అస్థిపంజరం. అది ఒక యవతిదనీ; ఎముకల రంగును బట్టి, ట్రాయ్ తగలబడినప్పుడు మంటల్లో చిక్కుకుని మరణించి ఉంటుందనీ స్లీమన్ అంచనాకు వచ్చాడు.
(పూర్తి రచన 'నిధుల వేటలో...ఆశనిరాశాల ఊగిసలాటలో...' అనే శీర్షికతోhttp://magazine.saarangabooks.com/2016/01/13/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%86%E0%B0%B6%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B6%E0%B0%B2-%E0%B0%8A%E0%B0%97%E0%B0%BF/ లో చదవండి)
bhaskar3
స్వస్తిక చిహ్నం కలిగిన ఒక దేవత

Saturday, January 9, 2016

వరదశోకగ్రస్త జనానికి జయలలిత అందించే జల్లికట్టు వినోదం!

తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి.
వరుణదేవుడికి సమయాసమయాలు తెలియవు. ఎన్నికలు వచ్చిపడుతున్న సమయంలో చెన్నైని కనీవినీ ఎరగని వర్షాల్లో ముంచెత్తి జయలలిత ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించాడు. ప్రభుత్వం వైఫల్యం జాతీయ స్థాయిలో సైతం మోతెక్కి పోయింది. అయినాసరే  చచ్చినాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా బాధితులకిచ్చే అన్నం పొట్లాల మీద అమ్మ సొంత బొమ్మ వేయించుకుని వరదకన్నీట తడిసిన జనం బతుకుల్ని పిండి వోట్ల చుక్కలు రాల్చుకోవాలని చూసింది.
ఇంకా వరద శోకం నుంచి రాష్ట్రం తేరుకొనే లేదు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అనేముంది; ఎన్నికల వరదనుంచి గట్టెక్కడానికి ఏ గడ్డి అయినా కరవడానికి అన్ని పార్టీలు, ప్రభుత్వాలు సర్వదా సిద్ధమే. జయలలిత ప్రభుత్వం తాజాగా జనానికి జల్లికట్టు వినోదం అందించడం అనే ఓ కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టి కేంద్రాన్ని ఒప్పించింది. ఎన్నికల ఏరు దాటడానికి  జయలలిత చేయి అందిస్తుందని కాబోలు మోడీ ప్రభుత్వం జల్లికట్టు వినోదానికి అడ్డుకట్ట తొలగించి ఎడ్లతోనూ, దున్నపోతులతోనూ ఇంచక్కా ఆడుకుని వినోదిస్తూ వరద దుఃఖం మరచిపొండని తమిళ జనానికి సందేశించింది.
ఈ పార్టీలకు, ప్రభుత్వాలకు సిగ్గు లేదు. జనానికి దిక్కు లేదు!!!

Thursday, January 7, 2016

ట్రాయ్ తవ్వకాలలో 'శివలింగా'లు, యోని చిహ్నాలు

పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అర్థం కాలేదు.