Monday, December 31, 2012

'అన్నపూర్ణ' రాష్ట్రంలో... పోషకాన్నమో రామచంద్రా!

నా బ్లాగు వీక్షకులకు, నేను రాసిన వివిధ అంశాలపై స్పందించినవారికి, చర్చలో పాల్గొన్నవారికి, నా బ్లాగును ఎక్కువమంది వీక్షకుల దృష్టికి తెచ్చిన కూడలి, మాలిక అగ్రిగేటర్లకు...అందరికీ 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

                                                                            ***

ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ పెద్ద రాష్ట్రం. జనాభాలో 5వది. తలసరి ఆదాయంలో 4వది. పారిశ్రామికాభివృద్ధిలో 4వది. 100మంది అత్యంత సంపన్న భారతీయులలో 7గురు ఈ రాష్ట్రానికి చెందినవారు. 'అన్నపూర్ణ' అని ఈ రాష్ట్రానికి పేరు. ఇక్కడ 77 శాతం వరి పండిస్తారు.

కానీ మానవాభివృద్ధి సూచిలో ఈ రాష్ట్రం ఎక్కడుందో మీరు గమనించారా? 11వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 9, గుజరాత్ 8, తమిళ నాడు 6, హర్యానా 5, మహారాష్ట్ర 4, పంజాబ్ 2, కేరళ 1వ స్థానంలో ఉన్నట్టు ప్రణాళికా సంఘం కిందటి ఏడాది విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక వెల్లడిస్తోంది. ఆదాయం, విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత, పోషకాహారం, పారిశుద్ధ్యాలను మానవాభివృద్ధి సూచికి కొలమానాలుగా తీసుకుంటారు.

మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉండడమే కాదు, జాతీయ సగటు(0.467%)కన్నా తక్కువ మానవాభివృద్ధి ఉన్న బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, అస్సాం ల గ్రూపులో చేరింది.

"ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం కీలకమైన సవాళ్ళు" అని, నివేదికను విడుదల చేస్తూ ప్రణాళికాసంఘం హెచ్చరించింది.

'అన్నపూర్ణ' రాష్ట్రంలో మీరు ఏ ఊరికైనా వెళ్ళి చూడండి...ఆడా, మగా, పిల్లా, పెద్దా అందరిలో పోషకాహారలోపం మామూలు కంటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఎస్సీ జనాభాలో మరీ ఎక్కువగా ఉంది. అయితే,  ఇతర సామాజికవర్గాల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదు. ఊళ్లలో పండ్లు, కూరగాయలు తక్కువ ధరకు లభిస్తాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది కానీ, ఇప్పుడు అక్కడ కూడా వాటి ధరలు నగరాల ధరలతో పోటీ పడుతున్నాయి. కనుక పండ్లు, కూరగాయల ద్వారా పోషకాహారాన్ని పెంచుకునే అవకాశం ఊరి జనానికి లేదు.

ఈ రాష్ట్రంలో ఎనభై దశకం నుంచీ(మధ్యలో కొంతకాలం రద్దు, రేటు మార్పుతో)కిలో 2 రూ. బియ్యం పథకం అమలు జరుగుతోంది. భారీ మొత్తాల్లో సబ్సిడీ భారాన్ని మోస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. ఇటీవల కిలో 1రూ. కే బియ్యం పథకాన్ని అమలు చేస్తోంది. అయినా సరే, పోషకాహార లోపం ఇంతగా ఎందుకుందో తెలియదు. బడి పిల్లలకు పుష్టికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ఊళ్లలో పిల్లల వాలకాలలో ఆ పథకం ఆనవాళ్ళు కనిపించడంలేదు. అసలు ఏం జరుగుతోంది?

ఈ రోజు ఒక వార్త వచ్చింది. రంగారెడ్డి జిల్లా కులకచర్ల గ్రామంలో సరస్వతీ విద్యామందిరంలో 5వ తరగతి చదువుతున్న శ్రావణి అనే బాలిక సరస్వతీ విద్యామందిరాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని-పాఠశాల భవన ప్రారంభానికి వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. అందువల్ల బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గుతుందని కూడా చెప్పింది. మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చింది. ఎప్పుడు? అయిదేళ్ళ క్రితం! శ్రావణి పట్టు వీడకుండా ఈ అయిదేళ్లలో మరో రెండుసార్లు స్కూలుకు వచ్చిన మంత్రికి అదే విజ్ఞప్తి చేసింది. చివరికి మంత్రి ముఖ్యమంత్రిని ఆ మేరకు ఒప్పించింది. జనవరి 1 నుంచీ 480 సరస్వతీ విద్యాలయాలలో ఆ పథకం అమలుకాబోతున్నట్టు వార్త. మంత్రీ, అంతకంటే ఎక్కువగా శ్రావణీ అభినందనీయులు! ఇంతకీ ప్రశ్న ఏమిటంటే, శ్రావణి విజ్ఞప్తి నెరవేరడానికి అయిదేళ్లు పట్టినప్పుడు, 'పోషకాన్నమో రామచంద్రా' అని నోరు తెరిచి అడగని ఊళ్ళలోని  మూగ జనానికి పోషకాహారం అందడానికి ఎన్నేళ్లు పడుతుంది?

దేశంలోని చిన్నారుల పోషకాహార లోపం పై 12వ పంచవర్ష ప్రణాళిక 'ప్రత్యేకంగా' దృష్టి సారించిందట! ఇది కూడా ఈరోజు వార్తే. దేశంలో 18 ఏళ్ల లోపు ఉన్న 43 కోట్లమంది సంక్షేమానికి నడుం కట్టాలంటూ ప్రణాళికాసంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందట. దేశంలో 22 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనీ, మూడేళ్ళ లోపు పిల్లలలో 40.4 శాతం మంది ఉండవలసినంత బరువు ఉండడంలేదనీ చెప్పిందట. పిల్లలకు విటమిన్-డి పంపిణీ సక్రమంగా జరగడం లేదట. గ్రామస్థాయి వరకు పోషకాహార మండళ్లను, బాలల అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయడం ప్ర.సం. సూచనలలో కొన్ని. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటి? బాలల పోషకాహారలోపం పై ప్రభుత్వం ఇప్పుడిప్పుడే యుద్ధం ప్రకటిస్తోందని! మరి మిగిలిన వాళ్ళ సంగతి ఎప్పటికీ?! పోషకాహారలోపం అందరిలోనూ అంతరించడానికి ఎన్ని పంచ వర్ష ప్రణాళికలు గడవాలి?

కిందటి సంవత్సరం అంతా ఆహారభద్రతపై చర్చతోనే గడచిపోయింది. ఆహారభద్రతలో పోషకాహారభద్రత భాగం కావాలని ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి జాతీయ సలహా మండలి(ఎన్.ఏ.సీ)లోని నిపుణులకు తల ప్రాణం తోకకు వచ్చింది. చివరికి ఏదో అంగీకారానికి వచ్చారన్నారు. బిల్లు పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు వెళ్లింది. ఏడాది గడచినా దాని అతీ గతీ లేదు.

ఈ లోపల నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేసింది. దాని మీద సవాలక్ష అభ్యంతరాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి.

అదలా ఉంచి అన్నపూర్ణ రాష్ట్రపాలకులు ఊరి జనానికి పోషకాన్నం అందించడానికి ఏం చేస్తున్నారు? మానవాభివృద్ధి సూచిలో ఒకటో స్థానంలో ఉన్న కేరళతో పోటీ పడే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నట్టు ఎలాంటి ఆధారాలూ కనిపించడం లేదు.





Sunday, December 30, 2012

ఢిల్లీ యువతి విషాదాంతం: కనెక్టెడ్ జనాలు, డిస్కనెక్టెడ్ పాలకులు

పేరు తెలియని ఒక యువతి మృతి ఒక జాతీయ విషాదం అయింది. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. పేరు తెలియని ఒక యువతి మృతి ఆదివారం నాడు పత్రికలన్నిటిలో పతాకశీర్షిక అయింది. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. పేరు తెలియని ఒక యువతి మృతికి ప్రధాననగరాలలోని పౌరులనేకులు వీధుల్లోకి వచ్చి కోప సంతాపాలను ప్రకటించారు. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. ఢిల్లీ సామూహిక మానభంగ ఘటన జరిగినప్పటినుంచీ ఈ దేశంలో ఎప్పుడూ జరగనివి జరుగుతున్నాయి. స్పందనారాహిత్యం కరడుగట్టిన పాషాణవ్యవస్థపై జనం ఎన్నడూ లేనంత మహోద్రిక్తస్థాయిలో, ఎన్నడూ ఎరగని కొత్త పద్ధతుల్లో ఆగ్రహావేదనలు కుమ్మరించుకుంటున్నారు. ఇంతటి విషాదభరిత వాతావరణంలోనూ రేపటికి అది ఒకింత భరోసా!

"అమ్మా నాకు బతకాలని ఉంది" అని ఆ మానభంగ బాధితురాలు తల్లితో అన్నట్టు వార్తల్లో చదివాం. అంతా ముందే ఉన్న జీవితం గురించి పచ్చని కలలు కనే ఓ ఇరవై మూడేళ్ళ యువతి బతకాలని తపించడంలో ఆశ్చర్యంలేదు. చివరికి ఆమె ప్రాణాలతోపాటు ఆమె కోరికా అనంతవాయువుల్లో కలసిపోయింది. "నాకు బతకాలని ఉందమ్మా" అన్న కూతురు మాట తలచుకుని తల్లి బతికినంతకాలం కుమిలిపోతూనే ఉంటుంది. "నాకు బతకాలని ఉం"దన్న ఆ అభాగ్యురాలి మాట గుర్తొచ్చినప్పుడల్లా బతికి ఉన్నవాళ్ల గుండె కలుక్కుమంటూనే ఉంటుంది.

అయితే ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. ఈ పాషాణవ్యవస్థ ఢిల్లీ వీధుల్లో పోలీసులతో పెనుగులాడిన జనసందోహం కంటే ఎన్నో రెట్లు బలవత్తరమైనది. వారితోపాటు ఇతర నగరాలలో కొవ్వొత్తి దీపాలతో నిరసన తెలిపిన జనసమూహాలు అన్నీ కలసి ప్రతిఘటించినా లొంగనంత బలవత్తరమైనది. ఈ పాషాణవ్యవస్థ పది ముఖాలు ఉన్న దశకంఠ రావణుడి లాంటిది. మానభంగాలు దాని ఒకానొక ముఖం మాత్రమే. ఖాఫ్ పంచాయితీలు ఒక ముఖం. వోటు బ్యాంక్ కోసం ఖాఫ్ పంచాయితీలను సమర్థించే సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ యువ పార్లమెంట్ సభ్యులతో సహా రాజకీయనాయకులు ఒక ముఖం. ఆడ శిశువులను కడుపులోనే కడతీర్చే కటికతనం ఒక ముఖం. అవినీతి అక్రమాలు ఒక ముఖం. స్పందనా గుణం లోపించిన ప్రభుత్వాలు ఒక ముఖం. తమ పని తాము చేయని పోలీసులతో సహా అంచెలంచెల ఉద్యోగవ్యవస్థ ఒక ముఖం. వరకట్నపు చావులు ఒక ముఖం. న్యాయప్రదానంలో జరుగుతున్న అసాధారణ జాప్యం ఒక ముఖం...

ఇంత పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికినా దేశంలో మానభంగాలు ఆగలేదు. ఢిల్లీ ఘటన తర్వాత ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే అరడజను మానభంగాలు వార్తలకు ఎక్కాయి. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్న జనాలు తక్షణమే స్పందిస్తూ రోడ్ల మీదికి వస్తున్నారు కానీ, ప్రభుత్వాలు ఎప్పటిలా జనంతో డిస్కనెక్ట్ అయ్యే ఉన్నాయి. సోషల్ మీడియా వ్యాప్తి, సమాచార హక్కు మొదలైన పరిణామాల వెలుగులో ప్రభుత్వాలు జనంతో డిస్కనెక్ట్ అయిన దృశ్యం మరింత ప్రముఖంగా మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కామన్ వెల్త్ క్రీడలపై ఆరోపణలప్పుడూ అదే జరిగింది. 2జీ స్పెక్ట్రమ్ పై  ఆరోపణలప్పుడూ అదే జరిగింది. అన్నా హాజరే ఉద్యమమప్పుడూ అదే జరిగింది. కేజ్రీవాల్ ఉద్యమమప్పుడూ అదే జరిగింది. ప్రతి టామ్ డిక్ అండ్ హారీ రాసే లేఖలకూ ప్రధాని జవాబు ఇవ్వరని సుబ్రమణ్యం స్వామిని ఉద్దేశించి కపిల్ సిబల్ అన్నప్పుడే ప్రభుత్వం జనంతో ఎలా డిస్కనెక్ట్ అయిందో రూపు కట్టింది. ఇవాలిటికి ఇవాళ, "అప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదికి వచ్చే పరిస్థితిని ప్రభుత్వం ఊహించలేదు. ఇటువంటి పరిణామాన్ని కూడా ఇక ముందు దృష్టిలో పెట్టుకుంటాం" అని మంత్రి చిదంబరం ఢిల్లీ ఘటన నేపథ్యంలో అనడం కూడా ప్రభుత్వం జనంతో, క్షేత్రవాస్తవికతతో ఎంత డిస్కనెక్ట్ అయిందో చెప్పకనే చెప్పింది.

ప్రభుత్వం చట్టాలను బలోపేతం చేస్తామంటోంది...చేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటోంది...చేస్తుంది. పోలీసు బలగాలను పెంచుతామంటోంది...పెంచుతుంది. కానీ పనికి అంకితమై పని చేసేవారిని ఎక్కడినుంచి తీసుకొస్తుంది? పని సంస్కృతిని ఎలా తీసుకురాగలుగుతుంది? ఇదే ప్రశ్న నేను వెనకటి బ్లాగులో ముందుకు తెచ్చాను. ఈ రోజు హిందూ తన మొదటి పుట సంపాదకీయంలో అన్నది కూడా అదే. "Laws to deal with rape and sexual assault exist but not the police, judiciary, and leaders to work them. It is this leaderless vacuum that ordinary citizens must step into in order to affirm the rights of women."

పేరు తెలియని ఆ యువతి విషాదాంతం పది తలల పాషాణ వ్యవస్థతో ముఖా ముఖీ ఢీకొనవలసిన అవసరాన్ని ప్రబోధిస్తూనే ఆ వ్యవస్థ ఎంత బలవత్తరమైనదో కూడా చెబుతోంది. అనేక ప్రశ్నలూ, సవాళ్ళ రూపంలో అది చాచే విషపు కోరలనూ బయట పెడుతోంది.

(సంబంధిత బ్లాగ్: ఢిల్లీ మానభంగం: చిత్తశుద్ధి లేని చట్ట శుద్ధి ఏల?)

Saturday, December 29, 2012

యువపాఠకులకు ఎలాంటి తెలుగు ఇస్తున్నాం?

నేటి యువతకు ఆకర్షణీయమైన తెలుగును 'ప్యాక్' చేసి ఇస్తున్నామా అని కిందటి వ్యాసంలో ప్రశ్నించాను. దాని గురించి నా అభిప్రాయాలు మీతో ఇప్పుడు పంచుకుంటాను. అయితే, ప్రస్తుతానికి ఇవి ఏకపక్ష అభిప్రాయాలు మాత్రమే. ఇవి మీ అభిప్రాయాల గీటురాయికి కూడా సరైనవే ననిపిస్తే అప్పుడు అందరం కలసి ఏకాభిప్రాయానికి రావచ్చు.

యువత సంగతి కాసేపు అలా ఉంచుదాం. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటికీ నూరేళ్ళను మించిన చరిత్ర ఉంది. ఆయా ప్రక్రియలలో అత్యుత్తమమైన రచనలూ వచ్చాయి, ఉత్తమమైనవీ వచ్చాయి, అంత ఉత్తమం కానివీ వచ్చాయి. ఈ వందేళ్లలోనూ వచ్చిన ఓ ఇరవై  నవలలను, ఓ వంద కవితా సంపుటాలను, ఓ వంద కథలను, ఓ వంద వ్యాసాలను వివిధ కోణాల నుంచి అత్యుత్తమమైనవిగా/ఉత్తమమైనవిగా ప్రామాణీకరించి పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నదా? వ్యక్తుల స్థాయిలో అది జరుగుతూ ఉండచ్చు. కానీ నేను అనేది ఆ పని వ్యవస్థల స్థాయిలో జరగాలి. ఉదాహరణకు విశ్వవిద్యాలయాల స్థాయిలో. తెలుగు విశ్వవిద్యాలయం పేరిట మనకో విశ్వవిద్యాలయం ఉంది. ఏటా పురస్కారాలు ఇవ్వడం, ప్రచురణలకు ఆర్థిక సాయం చేయడం వగైరాలు మినహా ఆ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? పోనీ వివిధ ఇతర విశ్వవిద్యాలయాలలోని తెలుగు పీఠాలు కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయా? కేవలం సాహిత్యాన్ని ప్రచురించి ఇవ్వడం కాదు. ఆ సాహిత్యంలో ప్రతిఫలించిన నూరేళ్ళ తెలుగు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చరిత్రను దానికి జతపరుస్తూ ఇవ్వాలి. నూరేళ్ళ భావ పరిణామ చరిత్రనూ నిర్మించి ఇవ్వాలి. ఇదే సూచన నేను ఎనభై దశకంలో చేశాను. మళ్ళీ 2004 లో చేశాను. ఈ సూచనపై 'పేటెంట్' నాదేనని కూడా చెప్పాను. నిజానికి ఇదేమీ కొత్తది కాదు. సంస్కృతంలో పంచకావ్యాలు, తెలుగులో పంచ ప్రబంధాలు మొదలైన వర్గీకరణలు ఉన్న విషయం మనకు తెలిసినదే.

అసలు విషయమేమిటంటే, నూరేళ్ళ తెలుగు సాహిత్యం ఒక అడవిలా పెరిగిపోయింది. దాని గురించి ఒక అవగాహన ఇచ్చే కొన్ని ప్రాతినిధ్య రచనలు మనం నేటి తరానికి, ముందు తరాలకు అందించాలి. సాహిత్యాభిమానులు వాటిని కొనుక్కుని దగ్గర పెట్టుకునేలా ఉండాలి.

 ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు, దానికి ఒక ఇతివృత్తాన్ని, ఒక కాన్ సెప్ట్ ను ఇచ్చే అలవాటు, క్రమశిక్షణ మనకు అలవడలేదని నాకు అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమ వారు 75 ఏళ్ల తెలుగు సినిమా  పండుగ జరిపారు. అందులో 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రా, పరిణామాలు ఏవీ ప్రతిఫలించలేదు. కనీసం వెనకటి నటీ నటులను ఎక్కువమందిని రప్పించడం కానీ, వారిని ఫోకస్ చేయడం కానీ, వారితో మాట్లాడించడం కానీ జరగలేదు. అది పూర్తిగా నేటి సినిమా పండుగలానే జరిగింది. ఇప్పటి నటీనటులే వేదిక మొత్తాన్ని కమ్మేశారు. అవే ఐటెమ్ డ్యాన్సులు, అవే వెకిలి హాస్య ప్రదర్శనలతో మోతెక్కించేశారు.

కొంతకాలం క్రితం మిత్రుడు కె.పి. అశోక్ కుమార్ నాతో మాట్లాడుతూ, తెలుగు కథల సూచి తయారు చేసే పని తెలుగు విశ్వవిద్యాలయం నాకూ, 'అంపశయ్య' నవీన్ గారికి అప్పగించిందని చెప్పాడు. ఏం చేస్తారని అడిగాను. కథ పేరు, ప్రచురితమైన సంవత్సరం, పత్రిక పేరు ఇస్తామన్నాడు. దానివల్ల ఉపయోగమేముంటుంది, కథ పేరు తెలిస్తే కథ గురించి తెలిసినట్టు కాదు కదా, కనీసం అందులోని ఇతివృత్తాన్ని రెండు వాక్యాలలోనైనా ఇస్తే బాగుంటుందని నేను సూచించాను. మీ సూచన బాగుంది, నేను ఆ ప్రతిపాదన చేస్తానని అశోక్ కుమార్ అన్నాడు.

ఇప్పుడు యువత విషయానికి వద్దాం. బీటెక్ చదువుతున్న మా రెండో అబ్బాయి సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు వాడిలో పాఠనాసక్తి పెరుగుతోందని గమనించాను. వాడి చేత తెలుగు సాహిత్యం చదివించాలని ఉత్సాహపడ్డాను. అయితే, అందులో పడితే వాడి చదువు దెబ్బతినే ప్రమాదాన్ని శంకించి అప్పటికి ఊరుకున్నాను. కానీ, నా షెల్ఫ్ లో ఉన్న ఇంగ్లీష్ నవలలు, కథల సంపుటాలు రోజుకొకటి చొప్పున వాడి మంచం మీద కనబడడం ప్రారంభించాయి. 'ది ఓల్డ్ మన్ అండ్ ది సీ' చదివి చాలా థ్రిల్ అయ్యానని వాడు చెప్పాడు. అలాగే చెఖోవ్ కథలు కూడా బాగున్నాయన్నాడు. ఇలాంటి పాఠనాసక్తి ఉన్న ఈ తరం వారికి మనం ఎలాంటి తెలుగు కథలను, నవలలను అందించాలి? ఇది నాకు ఎదురైన ప్రశ్న. అవి వాళ్ళ ఇమాజినేషన్ కు అందాలి. వాళ్ళలో ఆసక్తి కలిగించాలి. మొదటే నిర్దిష్ట భావజాలం నుంచో లేదా నిర్దిష్ట దృక్పథం నుంచో ఆయా సామాజికపరిణామాలను ప్రతిఫలించే కథలను, నవలలను కాక ఒక తటస్థ స్థితి నుంచి యువత తెలుగు సాహిత్యంలోకి అడుగుపెట్టి ఆసక్తిని పెంచుకునేందుకు తోడ్పడే రచనలను కూర్చి అందించలేమా? అంటే, కేవలం నూతన తరాన్ని మాత్రమే లక్ష్యం చేసుకుని కొన్ని ప్రచురణలు తీసుకు రావలసి ఉంటుంది. అందుకు పూర్వరంగంలో చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. తెలుగును బతికించుకోడం కోసం ఆ శ్రమ తీసుకోవలసిందే. జీవితాన్ని కేవలం ఒక తటస్థ స్థితినుంచి వ్యాఖ్యానించే రచనలు మనకు పాశ్చాత్య సాహిత్యంలో అనేకం కనిపిస్తాయి. తెలుగులోనూ అలాంటివి ఏరి పట్టుకోగలం. ఇలా అన్నానని భావజాల/దృక్పథ ప్రధానమైన రచనలను పక్కన పెట్టమంటున్నాననుకుని అపార్థం చేసుకోవద్దు. యువ పాఠకుడు అభిరుచి పెరిగిన కొద్దీ వాటిలోకి క్రమంగా ప్రవేశిస్తాడు. అన్నట్టు ఇలా యువతను లక్ష్యం చేసుకుని కథా, కవితా,వ్యాస సంపుటాలను; నవలలను తీసుకురావాలన్న సూచనపైనా  పేటెంట్ నాదే.

వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఒక ప్రచురణను ముందుకు తెస్తున్నప్పుడు దాని వెనుక ఎలాంటి  థీమ్ ఉంది, ఎలాంటి పాఠకులను లక్ష్యం చేసుకుంటున్నామని ఆలోచించే అలవాటు చేసుకుంటే పాఠకులలో ఉండే తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. వేర్వేరు పాఠకులకు వేర్వేరు తరహాలో రచనలను అందించాలనే అవగాహన అప్పుడు ఏర్పడుతుంది.

ఇంగ్లీష్ మీడియం యువతను ఒక స్టీరియో టైప్ లో ఊహించుకోవడం సరికాదు. మా తమ్ముడి కొడుకు ఇంగ్లీష్ మీడియంలో హింది ప్రథమ భాషగా చదువుకున్నాడు. ఒకసారి, "పెదనాన్నా, నాకు రామాయణం, భారతం చదవాలని ఉంది" అన్నాడు. "నీకు తెలుగు అంత నడవదు కదా, ఇంగ్లీష్ లో చదువుకోవలసిందే" అన్నాను. దానిపై వాడిచ్చిన జవాబు నాకు ఆశ్చర్యం కలిగించింది. "లేదు. నేను తెలుగులోనే చదువుతాను. తెలుగు ఇంప్రూవ్ చేసుకుంటాను" అన్నాడు.

ఇలాంటి యువ పాఠకుల్లో తెలుగు పట్ల అభిరుచి, ఆకర్షణ పెరగడానికి మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

కొసమెరుపుగా ఒక ముచ్చట చెబుతాను. కొడవటిగంటి కుటుంబరావు గారి మునిమనవడు ఒకతను మా అబ్బాయికి పరిచయమయ్యాడు. "మీ ముత్తాతగారి రచనలు ఏవైనా చదివావా?" అని మా అబ్బాయి అతన్ని అడిగాడు. "లేదు. నాకు తెలుగు రాదు" అని ఆ అబ్బాయి జవాబిచ్చాడు. చందమామ లాంటి చక్కని తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించిన వ్యక్తి ముని మనవడికి ఆ పిల్లల పత్రికలోని కథలను చదువుకుని తెలుగు కథా దాహాన్ని పెంచుకునే అవకాశం లేకపోయింది.

ఇలాంటివారు తెలుగుపై అభిమానం, రుచీ పెంచుకుని ఇటువైపు చూస్తే, ముందు ఇవి చదవండి అని వారి చేతికి అందించ దగిన ప్రచురణల దిశగా తెలుగు సంస్థలు ఇప్పటికైనా ఆలోచన చేయవద్దా?

(సంబంధిత రచనలు: 1. నిజాల నేల విడిచి తెలుగు సాము 2. తెలుగు సభలు...నిరసనలు...శ్రీశ్రీ...)


Friday, December 28, 2012

నిజాల నేల విడిచి 'తెలుగు' సాము?!

తెలుగు భాష అస్తిత్వంపై ఉన్న భయాలు, అనుమానాల గురించి రాద్దామని కూర్చుంటే, ఇంతలో ఒక ముచ్చట గుర్తొచ్చింది. సీనియర్ పాత్రికేయులు, ఇండియా టుడే(తెలుగు) మాజీ సంపాదకులు ఎం. రాజేంద్ర గారు చెప్పారు. 1975 తెలుగు సభల వేదిక మీద 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి ఆలపిస్తున్నారు. ఆ గీతం పాడడానికే ఆమెను లండన్ నుంచి రప్పించారు. తనూ, మరికొందరు పాత్రికేయులూ వెనక వరసలో కూర్చుని ఉన్నారు. అంతలో ప్రవేశద్వారం వద్ద ఏదో వాదులాట వినిపించింది. మాసిపోయి మాసికలు పడిన దుస్తులతో ఆ పరిసరాలలో ఏమాత్రం ఇమడనట్టుగా కనిపించే ఒక వ్యక్తి, "ఆ పాట నేను రాసిందే, నన్ను లోపలికి వెళ్లనివ్వండి" అని అడుగుతున్నాడు. ద్వారం దగ్గర ఉన్నవారు ఒప్పుకోవడం లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన రాజేంద్ర గారు, ఆ జిల్లాలోని మదనపల్లెలో ఉంటున్న ఆ వ్యక్తిని గతంలో చూశారు కనుక వెంటనే గుర్తుపట్టి సభల నిర్వాహకులకు చెప్పారు. అప్పుడు వారు ఆయనను తీసుకు వెళ్ళి వేదిక ఎక్కించి శాలువా కప్పి పంపించారు. ఆయనే శంకరంబాడి సుందరాచారి!

(ఆయన గురించి సి. పూర్ణచంద్ ఈ రోజు(డిసెంబర్ 28) ఆంధ్రజ్యోతి, నవ్యలో రాసిన వ్యాసం కూడా వీలైతే చూడండి)

ప్రభుత్వం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. గీతం పాడడానికి ఎక్కడో ఉన్న టంగుటూరి సూర్యకుమారిని రప్పిస్తారు. కానీ అంతటి మహత్తర గీతానికి జన్మ నిచ్చిన కవి తమకు దగ్గరలోనే ఉన్నా పట్టించుకోరు.  అసలాయన  ఉన్నాడో లేడో కూడా ఆరా తీయరు. ప్రస్తుత సభల సందర్భంలో కూడా ఇలాంటి ముచ్చట్ల రికార్డులు ఎన్ని తయారవుతున్నాయో!  వేచి చూడవలసిందే.

ఇక తెలుగుభాష అస్తిత్వ భయాల గురించి...

1994లో ఒక వ్యక్తి, "మీతో మాట్లాడాలి" అంటూ నాకు ఫోన్ చేసి మరీ నా దగ్గరకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి...అప్పటికి నూతన ఆర్థిక విధానాలు అడుగుపెట్టి రెండేళ్ళు మాత్రమే అయింది. విదేశీ ఉద్యోగాలు ఇంతగా పెరగలేదు. తెలుగు చానెళ్లు ఇన్ని లేవు.  అందులోనూ వార్తా చానెళ్లు అసలే లేవని చెప్పచ్చు. దూరదర్శన్ ఒక్కటే రాజ్యం ఏలుతోంది. సెల్ ఫోన్లు రాలేదు. ఇప్పటిలా ప్రపంచీకరణ విస్తరించి ప్రపంచం ఒక గ్రామం అయిపోలేదు. ఆ వ్యక్తి వస్తూనే, "తెలుగు భాషను కాపాడుకోవాలండీ" అన్నారు. "సరే, ఏం చేయాలని మీ ఉద్దేశం?" అని నేను అడిగాను. ఆయన దానికి నిర్దిష్టంగా జవాబు చెప్పలేదు. తెలుగు వాడకం ఎలా తగ్గిపోతోందో చెప్పి, "తెలుగును కాపాడుకోవలసిందే నండీ" అని మరోసారి నొక్కి చెప్పారు. "మీ ఊహలో ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పండి. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఎత్తేయలా? హిందీ దూరదర్శన్ ప్రసారాలు తెలుగువాళ్ళ మీద రుద్దవద్దని చెప్పదలచుకున్నారా? తెలుగు దూరదర్శన్ లో తెలుగు కార్యక్రమాల సమయాన్ని పెంచాలని అడగదలచుకున్నారా? నేటి తరంవారిలో తెలుగు మీద అభిరుచి పెంచే కార్యక్రమాలు ఇవ్వాలా? పుస్తకాలు ప్రచురించాలా?..." ఇలా నేనే ఆయనకు ఆలోచన అందించడానికి శతవిధాల ప్రయత్నించాను. కానీ ఆయన ప్రతిదానికీ తల అడ్డంగా ఊపారు. "మనకు ఇతర భాషా ద్వేషం ఏమీ లేదండీ. ఇంగ్లీషు ఉండవలసిందే, హిందీ ఉండవలసిందే. మన తెలుగును మనం కాపాడుకోవాలండీ" అని మరోసారి ఉద్ఘాటించారు. 'రావణుడితో రామునికి ఎలాంటి శత్రుత్వమూ అవసరం లేదు, కానీ సీత చెరవీడవలసిందే' అన్నట్టుగా ఆయన మాటలు ధ్వనించాయి. నిజం చెప్పాలంటే, 'తెలుగును కాపాడుకోవాలన్న' ఒక్క ముక్క తప్ప ఆయన ఏం చెప్పదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. చూడండి చిత్రం, ఆయనా, నేనూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నాఇలా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే, నేను మాట్లాడింది తెలుగే కానీ ఆయన మాట్లాడింది 'ఉద్యమం' అనే భాషలో! 'ఉద్యమం' అనేది దానికదే ఒక భాష అన్న అభిప్రాయం నాలో అప్పటినుంచీ బలపడింది.

1994 సంగతి చెప్పాను కానీ తెలుగు భాషా పరిరక్షణోద్యమం ఇంకా ముందే మొదలయ్యుంటుంది. 1994 తర్వాత, నేను పైన చెప్పినవన్నీ వచ్చాయి. అంటే ఏమిటన్నమాట? తెలుగు వాడకం ఇంకా తగ్గింది. తెలుగు వాడకం తగ్గినకొద్దీ సహజంగానే తెలుగు పరిరక్షణోద్యమం  ఇంకా పుంజుకుంది. అంటే తెలుగు వాడకం తగ్గడమూ, తెలుగు పరిరక్షణోద్యమమూ కలవని రైలు పట్టాలలా సమాంతరంగా పయనిస్తున్నాయన్న మాట. ఈ సమాంతరపయనం ఇలా ఎంతకాలం సాగుతుంది? ఎంతకాలమైనా సాగుతుంది సరే, చివరికి ఏ గమ్యానికి చేరుకుంటుంది?

ఈ సమాంతర పయనం ఎందుకు సంభవించింది అంటే, ఒక రైలు పట్టా పూర్తిగా కటిక వాస్తవికత అయితే, రెండో రైలు పట్టా, భాష బతకాలన్న కేవల ఆకాంక్ష కావడం వల్ల. ఆ రెండింటి మధ్యా వైరుధ్యం ఉంది. కటిక వాస్తవికత ఏమిటంటే, జీవన పోరాటం తొలి అంకంలో ఉన్న తరం చదువుల్లో, ఉద్యోగ విపణిలో పోటీని తట్టుకోడానికి అవసరమైన అన్ని వనరులను, అవకాశాలనూ వాడుకుంటూ మునుముందుకు వెళ్లిపోవడానికే ప్రాధాన్యమిస్తుంది. తెలుగు ఏమైపోవాలని మీరు వారిని గుచ్చి అడిగితే ఏమీ ప్రయోజనం ఉండదు.

ఒక తమాషా చూడండి...తెలుగు భాషోద్యమ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్న డా. సామల రమేశ్ బాబు గారి పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం లోనే చదివినట్టు నాకు ఈ రోజే తెలిసింది. తెలుగు భాషా పరిరక్షణోద్యమంలో క్రియాశీలంగా ఉన్న ఎంతోమంది పిల్లలు అదే చేసి ఉంటారనడంలోనూ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అది కటిక వాస్తవికత. నేను ఉద్యమంలో లేకపోయినా(అలాగని తెలుగు పరిరక్షణ పట్ల నాకు ఆసక్తి లేదని దయచేసి అపార్థం చేసుకోవద్దు) మా పెద్దబ్బాయిని పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం లో చదివించాను. అప్పుడు నా అంచనా ఒకటే. తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ వస్తుందని!  నా అనుభవాన్ని అబ్బాయి మీద ప్రయోగించాను. కానీ ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం లోకి మారి మావాడు చాలా ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే పొరపాటు గుర్తించి మా రెండో అబ్బాయిని స్కూలు స్థాయినుంచీ ఇంగ్లీష్ మీడియం లోనే చదివించాను.

ఇంతకీ కావలసినదేమిటి? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా తెలుగును నిర్బంధం చేయడం, పాలనా వ్యవహారాలు తెలుగులో జరగడం, మీడియాలో అనవసరంగా  ఇంగ్లీష్ వాడకం మానేయడం వగైరాలు. ఇవేమీ అన్యాయమైన కోరికలు కావు. బుర్ర ఉన్న ఏ ప్రభుత్వమైనా పాఠశాల స్థాయిలో మాతృభాషను నిర్బంధం చేయకుండా ఉండదు. అందుకోసం కూడా ఉద్యమం చేయవలసి రావడమే మన ఖర్మ. ఇలాంటి ఆచరణాత్మకపార్స్వానికి తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు ఐక్యత, తెలుగువారి ఆత్మగౌరవం లాంటివి కూడా కలిపేసి అన్నింటినీ భావోద్వేగాల స్థాయికి తీసుకు వెళ్ళి సరళం చేయవలసింది కాస్తా సంక్లిష్టం చేస్తున్నామా అని నాకో అనుమానం. వాస్తవికత మరోలా ఉన్న పరిస్థితిలో తెలుగు వాదాన్ని భావోద్వేగాల స్థాయికి పెంచేసి అదే పనిగా రుబ్బుతూ ఉండడం వల్ల యువతలో ఒకవిధమైన అయోమయం, అపరాధభావం ఏర్పడే అవకాశం లేదా?

పిల్లల్ని విదేశీ ఉద్యోగాలకు పంపేసి, ఇక్కడ తమ లాంటి తల్లిదండ్రులు ఒంటరి జీవితం గడపవలసి రావడం గురించీ, మృగ్యమవుతున్న మానవసంబంధాల గురించీ, వెనకటి పల్లె జీవితంలో పరిఢవిల్లిన అనుబంధాల గురించీ సెల్ఫ్ పిటీతో కవిత్వం రాసే కవులు నాకు తెలుసు. పిల్లలు తెచ్చే డాలర్లు తీసుకుంటూ మనం ప్రతిగా ఏమిస్తున్నాం? మీరు మానవ సంబంధాలకు దూరమైపోయారనే అపరాధ మనస్తత్వాన్ని ఇస్తున్నాం. నిజం చెప్పాలంటే మన తరం వాళ్ళ కన్నా ఇప్పటి తరం వారు ఉదారంగా, విశాలంగా ఆలోచిస్తున్నారు.

అదలా ఉంచి పాఠశాల స్థాయి వరకూ తెలుగును నిర్బంధం చేస్తే తెలుగు బతుకుతుందన్న వాదనపై నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే, పాఠశాల విద్య తర్వాత ఒక వ్యక్తి తన చదువులోనూ, ఉద్యోగజీవితంలోనూ తెలుగేతర భాషా సాహచర్యంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు. అదీగాక, పాఠశాల విద్య తర్వాతే అతడు మరింత విశాల ప్రపంచంలోకి ప్రభావాలలోకి అడుగుపెడతాడు. సొంత బుద్ధితో ఆలోచించడం కూడా అప్పుడే ప్రారంభిస్తాడు. ఈ పరిస్థితిలో అతడు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న తెలుగు మిగులుతుందని చెప్పలేం. కనుక పీజీ వరకూ, చివరికి వైద్య, సాంకేతిక కళాశాల స్థాయిలో కూడా తెలుగు ఏదో ఒక పరిమితిలో కొనసాగవలసిందే. కావాలంటే, వైద్య, సాంకేతిక అంశాలు తెలుగులో ఎలా చెప్పాలో కసరత్తు చేసే అవకాశం వారికే ఇవ్వచ్చు. దానిని ఒక పరీక్షాంశం చేయచ్చు.

కావలసినవి నిర్దిష్టమైన చర్యలు.

యువతకు తెలుగును ఆకర్షణీయంగా 'ప్యాక్' చేసి ఇవ్వడానికి ఇంకా మరికొన్ని చేయచ్చు. ఇప్పటికే వ్యాసం పెద్దదైంది కనుక వాటి గురించి మరోసారి.





Thursday, December 27, 2012

తెలుగు సభలు...నిరసనలు...శ్రీశ్రీ...

ఈ రోజు నుంచీ మూడు రోజులపాటు తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సభలూ సమావేశాలూ జరుగుతున్నప్పుడు గుంపులో గోవిందం లా అనేకమందితో పాటు నాకు కూడా ఆహ్వానపత్రం అందుతూ ఉంటుంది. ఈసారి రాలేదు. కనుక సభల అజెండా ఏమిటో, ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎవరెవరు పాల్గొంటున్నారో నాకు తెలియదు. కార్యక్రమాల ఖరారు కూడా ఆదరాబాదరగా చివరి క్షణంలో జరిగిందని పత్రికలు రాశాయి కనుక ఆహ్వానపత్రాలు అచ్చుకావడంలో, పంపిణీ చేయడంలో కూడా అదే సంభవించి ఉండాలి. ఎవరెవరు వెడుతున్నారో తెలియక పోయినా; ఏ ఏ సంస్థలవారు వెళ్ళడం లేదో మాత్రం పత్రికల ద్వారా కొంత సమాచారం అందుతోంది. చివరికి తెలుగు భాషోద్యమ సమాఖ్యవారు కూడా సభలకు నిరసన తెలుపుతున్నారు.

జరిపేది ప్రపంచ స్థాయి సభలైనా ఏర్పాట్లు ఆఖరి క్షణం వరకూ డేకుతూనే ఉంటాయి. అదేమిటో తెలియదు. సభలు  ప్రారంభం కాకముందే ఏర్పాట్లపై విమర్శలు జోరందుకుంటాయి. సభలు జరుగుతున్నప్పుడూ, ముగిసిన తర్వాతా కూడా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే వాటిలో వస్తువు మారుతుంది. అందులో సర్కారీ ఆధ్వర్యంలో జరుగుతున్నసభలైతే  ఇక చెప్పనే అవసరం లేదు. ఏర్పాట్లలోనేకాదు, కార్యక్రమాల నిర్వహణలో కూడా  త్వరగా తెమిల్చివేసే ధోరణి ఇలాంటి సభలలో తరచు కనిపిస్తుంటుంది.  తిరుపతి వరకూ వెళ్ళి మూడు రోజులూ గడిపి ఏమి వెంటబెట్టుకుని వెడుతున్నామని ఒకసారి సమీక్షించుకుంటే ఏమీ కనిపించదు. ప్రభుత్వం ఖాతాలో మాత్రం కోట్ల రూపాయిల ఖర్చు కొట్టొచ్చినట్టు(తిరుపతి సభల వ్యయం 40 కోట్లు అంటున్నారు) కనిపిస్తుంది.

ఈ సభలు కూడా నామ్ కే వాస్తే గా, ఆషామాషీగా జరిగిపోతాయా అన్న అనుమానాన్ని పెంచే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ నెల 28నే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరగబోతోంది కనుక ముఖ్యమంత్రి చెప్పుల్లో కాళ్లు పెట్టుకునే సభల్లో పాల్గొనక తప్పదు. లేదా ఆయనతోపాటు రాజకీయప్రముఖులందరూ భౌతికంగా సభల్లో ఉన్నా మానసికంగా ఢిల్లీలో ఉండడం అనివార్యమవుతుంది. ప్రపంచ తెలుగు సభలు జరుపుకుంటున్నాం కనుక అఖిలపక్షాన్ని సభలకు ముందో, తర్వాతో ఏర్పాటు చేయమని మనవారు ఎందుకు ఢిల్లీని కోరలేదో తెలియదు. అదే తమిళులైతే ఏం చేసి ఉండేవారో!

తెలుగువారు అంతా కలసి ఇలాంటి సభలు జరుపుకోవలసిందే. అయితే అదేం చిత్రమో కానీ తెలుగు సభలు అనే సరికి భాష, సంస్కృతీ, సాహిత్యం, కళలు, సన్మాలు, సత్కారాలు,  కవిసమ్మేళనాలు వగైరాలు అజెండా మొత్తాన్ని కబ్జా చేసేస్తాయి.  వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాటితోపాటు, తెలుగువారి వ్యవసాయపరిస్థితులు, తెలుగువారి పరిశ్రమలు, తెలుగువారి జాబ్ మార్కెట్, తెలుగువారి పర్యాటక రంగం వగైరాలపై కూడా ఫోకస్ చేస్తే సభలు మరింత ప్రయోజనాత్మకం అవుతాయి. అన్నట్టు పారిశుద్ధ్యలోపం, పోషకాహార లోపంతో సహా అనేకానేక వికృతులతో కళావిహీనంగా మారిన తెలుగు పల్లెలపై దృష్టి పెట్టడం అత్యవసరాలలో ఒకటని నేను కొన్ని రోజులుగా రాస్తున్నాను.

ఇలాంటి సభల్లో కనిపించే మరో వింత ఏమిటంటే, భాష, సంస్కృతి, సాహిత్యం గురించి ఏమాత్రం తెలియని రాజకీయప్రముఖులు, ఇతర ప్రముఖులు వాటి గురించి మాట్లాడుతూ ఎక్కువ సమయం మింగేస్తారు. తీరా వాటి గురించి మాట్లాడవలసిన వక్తలను అయిదు నిముషాలలోనే ముగించమని నిర్వాహకులు తొందర పెడుతుంటారు. ప్రముఖ చరిత్రపరిశోధకుడు వకుళాభరణం రామకృష్ణ గారు ఒకసారి తన అనుభవాన్ని నాకు చెప్పారు. చెన్నైలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్ సభలకు అనుకుంటాను, ఆయనను ఆహ్వానించారట. ఆయన ప్రసంగపాఠాన్ని తయారు చేసుకుని పదిహేను గంటలపాటు రైలు ప్రయాణం చేసి చెన్నై సభలకు వెడితే, మీరు అయిదు నిముషాలలో ముగించాలని సభాధ్యక్షుడు ఆదేశించాడట. ఇదేం పద్ధతని రామకృష్ణ గారు వేదికమీదే గొడవపడ్డారట. అప్పటినుంచీ ఎక్కువమంది వక్తలున్న సభలకు నేను వెళ్ళడం లేదని ఆయన చెప్పారు.

1975 నాటి ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో నిరసన దళానికి, గళానికి మహాకవి శ్రీశ్రీ నాయకత్వం వహించాడు. అప్పటి నిరసన ఉధృతికీ, ఇప్పటి నిరసనకూ  పోలిక లేదు. ఇప్పుడూ నిరసన వ్యక్తమవుతోంది కానీ, దానికి శ్రీశ్రీ లాంటి ఉత్తేజభరిత నాయకత్వం లేదు. అప్పట్లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి 'బానిసకొక బానిసకొక బానిసా' అంటూ శ్రీశ్రీ తన సహజ శైలిలో చెప్పిన కవిత నాటి శ్రీశ్రీ అభిమాన యువత నాలుకలపై నర్తించింది. తెలుగు సభల సందర్భంలోనే శ్రీశ్రీని, మరికొందరు కవి రచయితలను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయంలో నేను అంత్యప్రాసలతో రాసిన ఒక ఔత్సాహిక కవిత పూర్తిగా గుర్తులేదు కానీ నాలుగు పంక్తులు గుర్తున్నాయి. అవి ఇవీ:

కటకటాలలోనె జరిగెను
భారత స్వాతంత్ర్య శిశూదయం
మరల అదే చోట ప్రభవించును
సమసమాజ ఉషోదయం

ఇక్కడే ఒక చిన్న వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావిస్తాను. అరెస్ట్  తర్వాత కొన్ని రోజులకు శ్రీశ్రీ రాజమండ్రి వస్తున్నట్టు తెలిసి ఆయనపై నేను రాసిన కవిత తీసుకుని రాజమండ్రి పరుగెత్తాను. వీరేశలింగం టౌన్ హాల్ లో సమావేశం. శ్రీశ్రీ ఇంకా రాలేదు. అంతవరకు నేను శ్రీశ్రీ ని చూడలేదు కనుక ఆయన రాకకోసం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్నాను. మా పక్కనుంచే విస్త్రీ కూడా లేని ముతక పైజమా, మోచేతుల చొక్కా ధరించిన ఒక బక్క పలచని ఆకారం వేదికవైపు నడిచి వెళ్లింది. సమావేశం మొదలై వేదిక మీదికి పిలిచిన తర్వాత ఆయనే మహాకవి శ్రీశ్రీ అని తెలిసింది. ఆయనే ఆ సమావేశానికి అధ్యక్షుడు కూడా. నాకు ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగించిన మరో విశేషం ఏమిటంటే, వేదిక మీదకి పిలిచినవారిలో ప్రముఖ దిగంబర,విప్లవ కవి చెరబండరాజు కూడా ఉన్నారు. ఆయనతో నాకు హైదరాబాద్ లో పరిచయం. ఆయన ద్వారా శ్రీశ్రీ మీద రాసిన కవితను శ్రీశ్రీ సమక్షంలోనే చదవచ్చనుకుని ఆశపడి వేదిక పక్కనే నిలబడి చెరబండరాజు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాను. చెరబండరాజు నన్ను చూసి ఆశ్చర్యపోతూ లేచి నా దగ్గరకు వచ్చారు. "నువ్వేమిటి ఇక్కడున్నావు?" అని అడిగారు. "మా ఊరు ఇక్కడికి దగ్గరే" నని చెప్పి, "శ్రీశ్రీ మీద రాసిన ఈ కవిత చదవాలని ఉంది. నాకు అవకాశం ఇప్పించా"లంటూ కవిత ఆయన చేతికి ఇచ్చాను. అది చదివిన చెరబండరాజు, "ఇలా రాసావేమిటి? మా ఉద్దేశంలో మనకింకా స్వాతంత్ర్యం రాలేదు కదా!" అన్నారు. నాకు ఏం చెప్పాలో తోచలేదు. "సరే, నువ్వు ఇక్కడే  ఉండు. శ్రీశ్రీ తో చెబుతాను. పిలిచినప్పుడు వద్దువుగాని" అని చెప్పి ఆయన వేదిక మీదికి వెళ్ళి నన్ను చూపించి శ్రీశ్రీ తో ఆ మాట చెప్పారు. శ్రీశ్రీ తల ఊపారు. అందరి ప్రసంగాలూ అయి శ్రీశ్రీ అధ్యక్షుడి మలి పలుకులు ప్రారంభించేసరికి చెరబండరాజు నొచ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి"ఆయన మలి పలుకులు ప్రారంభించేశాడు. నీ కవిత విషయం మరచిపోయినట్టున్నాడు. ఏమీ అనుకోకు. ఆయన మీద రాసిన కవితే కదా, ఆయనకే ఇస్తాను, ఇటివ్వు" అని తీసుకుని వెళ్ళిపోయారు.

చెప్పొచ్చేదేమిటంటే, అప్పటికీ ఇప్పటికీ వంతెన కింద చాలా నీరు ప్రవహించింది. కానీ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల తీరు మారలేదు. జోరు తగ్గినా వాటిపై నిరసనల తీరూ మారలేదు.




Wednesday, December 26, 2012

ఢిల్లీ మానభంగం: చిత్తశుద్ధిలేని చట్టశుద్ధి ఏల?

ఢిల్లీలో మానభంగ ఘటన జరిగి పదిరోజులు అయినా దాని మీద ఎందుకు స్పందించలేకపోతున్నానన్న ప్రశ్న నన్ను అప్పటినుంచీ సలుపుతూనే ఉంది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బిక్క చచ్చిపోతాం. మాటలు రావు, దొరకవు కూడా. ఢిల్లీ ఘటన కేవలం అలాంటిది మాత్రమే కాదు. ఆ ఘటన తీవ్రతను, దానిపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ధర్మాగ్రహాన్ని తక్కువ చేస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోకండని కోరుతూనే ఒక మాట అంటాను. దేశంలో రోజూ ఎన్నెన్ని మానభంగాలు జరుగుతున్నాయి!  ఇరవై నిమిషాలకు ఒకటి చొప్పున జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. చివరికి పసికందులను కూడా మగ మృగాలు విడిచిపెట్టడం లేదు. వావి వరసలను కూడా చూడడంలేదు. ఎంతకాలం నుంచీ ఇలాంటి ఘటనల్ని ఖండిస్తున్నాం? ఆవేశాగ్రహాలూ, ఆవేదనా కుమ్మరించుకుంటున్నాం? ఆగ్రహపూరిత ఖండనలూ, శాపనార్థాలూ, పరుష విమర్శల వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటే ఈపాటికి ఈ సమస్య కొంచెమైనా తగ్గుముఖం పట్టాలి కదా! కనుక మాటల ఈటెల వల్ల ఏమీ జరగదు. అవసరమైనవి చేతలు.

దేశంలో మానభంగ ఘటన జరిగిన ప్రతిసారీ ఢిల్లీలోలా జనం స్పందించడం లేదు. రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు జరపడం లేదు. రాజధానిని ముట్టడించడం లేదు. మీడియా పెద్ద ఎత్తున ప్రత్యక్షప్రసారం జరపడం లేదు. చర్చలు నిర్వహించడం లేదు. ఇప్పుడే ఎందుకివి జరుగుతున్నాయన్న  ప్రశ్నఅక్కడక్కడ వినిపిస్తున్న మాట నిజమే. ఆలోచించవలసిన ప్రశ్నే కానీ,  ప్రస్తుతానికి ఇలా అనుకుందాం:  ఢిల్లీ ఘటన జనం ఇమాజినేషన్ ను బాగా ఆకర్షించి ఉండచ్చు. లోపల్లోపల కుత కుత లాడుతున్న ఆగ్రహపు అగ్నిపర్వతం ఇప్పుడు ఒక్కసారిగా బద్దలై ఉండచ్చు. ఎలా జరిగినా ఈ చైతన్యం సమస్య పరిష్కారానికి ఏ కొంచెం దారితీసినా అదే పదివేలు.

ఏం చేయాలన్న చర్చ జరుగుతోంది. సూచనలు వినిపిస్తున్నాయి. పటిష్టమైన చట్టాలు తేవడం, సత్వర విచారణ న్యాయస్థానాల ఏర్పాటు, పోలీస్ బలగాలనూ, పోలీస్ నిఘానూ పెంచడం వగైరా వాటిలో ఉన్నాయి. సంబంధిత చట్టం ఒకటి ఏడేళ్లుగా పెండింగ్ లో ఉండడం కూడా ఆక్షేపణీయం అవుతోంది. మానభంగ నేరస్తునికి ఉరిశిక్ష విధించాలన్న అభిప్రాయం ఒకవైపున వినిపిస్తుండగా; అందువల్ల సమస్య పక్కదారి పట్టి, శిక్ష పడే కేసుల సంఖ్య ఇంకా తగ్గిపోతుందన్న వాదం మరోవైపున వినిపిస్తోంది. ఉరిశిక్ష కన్నా రసాయనిక ప్రక్రియలో అవయవాన్ని నిర్వీర్యం చేయడం మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

పటిష్ట చట్టాలు తేవలసిందే, సత్వర విచారణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయవలసిందే, పోలీస్ బలగాలను, నిఘాను పెంచవలసిందే. ఇంకా అవసరమైన చర్యలన్నీ తీసుకోవలసిందే. అదే సమయంలో కొన్ని అనుబంధప్రశ్నలనూ వేసుకోకుండా ఉండలేం. చట్టాలు లేకనే నేరాలు జరుగుతున్నాయా? ఉన్న చట్టాలు అయినా సక్రమంగా అమలు జరుగుతున్నాయా? సత్వరవిచారణ న్యాయస్థానాల సంఖ్య పెరిగితే, కేసులు త్వరగా పరిష్కారమై నేరస్తులకు శిక్ష పడుతుందని నమ్మడమెలా? రాజస్థాన్ లో సామూహిక అత్యాచారానికి గురైన ఒక ఎనిమిదేళ్ళ బాలిక కేసు సత్వర విచారణ న్యాయస్థానంలోనే నాలుగు నెలలుగా స్తంభించిపోయిందని ఈ రోజు వార్త.  మామూలు న్యాయస్థానాలలో కూడా ఉండవలసినంతమంది న్యాయమూర్తులు లేక కేసులు పెండింగ్ లో పడిపోతున్నప్పుడు సత్వర విచారణ న్యాయస్థానాలకు జడ్జీలను ఎలా అందిస్తారు? ఇక,  చట్టాలూ, కోర్టులూ, ఇతరేతర హంగులూ ఉన్న కేసుల్లోనే శిక్ష పడే కేసుల శాతం అత్యంత హీనంగా ఉందన్న సంగతిని ఎంతమంది గమనిస్తున్నారు?

పోలీస్ బలగాలను పెంచుతారు సరే, పోలీసుల చేత పని ఎలా చేయిస్తారు? వారిని పౌర మిత్రులుగా ఎలా తీర్చిదిద్దుతారు? వారిలో ప్రజారక్షణకు అవసరమైన నిబద్ధతను ఎలా తీసుకొస్తారు? ఈ దేశంలో జనం పిలుపుకు తక్షణమే స్పందించే పోలీస్ వ్యవస్థను మీరు ఎక్కడైనా చూసారా? మహిళలను అలా ఉంచండి, ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే మగవాళ్ళను సైతం మీరు ఎక్కడైనా చూసారా?  ఇంట్లో దొంగతనం జరిగితే పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోయిన సొత్తు దొరుకుతుందని నమ్మే వారిని ఎక్కడైనా చూసారా? తన కళ్ల ముందు నేరం జరుగుతుంటే జోక్యం చేసుకున్న పోలీసులను మీరు ఎంతమందిని చూశారు? ఈ దేశంలో పోలీస్ సంస్కరణలనే మాట ఎంతకాలంగా వినిపిస్తోంది? ఇంతవరకు అవి ఎందుకు కార్యరూపం ధరించలేదు?

సందర్భం అలాంటిది కనుక పోలీసుల గురించి చెప్పుకుంటున్నాం కానీ, వాళ్ళను మాత్రమే వేలెత్తి చూపించనవసరం లేదు. అసలు ఏ ఇతర విభాగాలలోనైనా పని మీద వచ్చిన పౌరుల పట్ల మర్యాదగా, కర్తవ్యపరాయణతతో స్పందించే ఉద్యోగులను మీరు ఎంతమందిని చూస్తున్నారు?  సింపుల్ గా చెప్పాలంటే మిత్రులారా, మనదేశంలో పని సంస్కృతి అనేది ఇంతవరకు ఏర్పడలేదు. మేము ప్రజాసేవకులం, వారి బాగోగులు చూడడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికే మేము జీతాలు తీసుకుంటున్నామన్న భావనను ఉద్యోగులలో చొప్పించే ప్రయత్నం ఎక్కడా జరగడం లేదు.  ఉన్న పోలీసులలో పని చేసే ప్రవృత్తిని రంగరించలేనప్పుడు సంఖ్య పెంచితే ఉపయోగమేమిటి?

ఒక కిరాణా కొట్టు యజమాని, ఒక బట్టల వ్యాపారి తమ వద్దకు వచ్చే వినియోగదారుని పట్ల చూపించే మర్యాద ప్రజాధనం నుంచి జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగి ప్రజలపట్ల ఎందుకు చూపించడం లేదు?

మానభంగం వంటి అతి హేయమైన నేరానికి ప్రేరేపించే సామాజిక పరిస్థితులు ఎలాంటివన్నది సామాజికశాస్త్రవేత్తలు పట్టించుకోవలసిన వేరొక ముఖ్యమైన పరిశీలనా కోణం. అది అలా ఉంచి, ఢిల్లీ మానభంగం ఘటన ఎంత కలచివేసేదో, నిరసనప్రదర్శనల సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించడమూ అంతే బాధాకరం. ఆ మరణం ఏ పరిస్థితులలో సంభవించిందన్న విషయంలో భిన్న వాదాలు వినిపిస్తున్నాయి కనుక వాస్తవం ఏమిటో నిర్ధారణ కాకుండా అందులోకి వెళ్లలేం. నాయకత్వం అంటూ ఒకటి లేకుండా అసంఘటితంగా అప్పటికప్పుడు ఉవ్వెత్తున లేచిన ధర్మాగ్రహప్రదర్శనలో విచిన్నకర శక్తులు అడుగుపెట్టి ప్రదర్శనను అవాంఛనీయమైన మలుపు తిప్పే  ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ మరణం పై వచ్చిన ఆరోపణలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్నే హెచ్చరిస్తున్నాయి.

మళ్ళీ అసలు సమస్యలోకి వెడితే, ప్రజలపట్ల సానుకూలంగా సానుభూతితో స్పందించవలసిన వ్యక్తులలోనే స్పందనాగుణం లోపించినప్పుడు ఉన్న వ్యవస్థలను పటిష్టం చేసినందువల్లా, కొత్తవి సృష్టించడంవల్లా ప్రయోజనం ఉంటుందా? వ్యక్తులలో పని చేసే సంస్కృతిని తీసుకురావడానికి ఏం చేస్తారు??





Tuesday, December 25, 2012

బాహ్య శుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు


 ఈ మధ్య అమెరికాలో, చికాగో దగ్గరలోని బ్లూమింగ్టన్ లో కొన్ని మాసాలు ఉన్నాను. మా పొరుగునే ఉన్న ఒక తమిళ జంట ఇక్కడ ప్రతి గురువారం షిర్డీ సాయి సత్సంగ్, భజన ఉంటాయని చెప్పి ఒక గురువారం మమ్మల్ని తీసుకు వెళ్లారు.  మేము వెళ్లేటప్పటికే ఆ ప్రాంగణం కార్లతో నిండిపోయింది. ఒక విశాలమైన హాలులో సాయి చిత్రపటం ఉంచారు. భజన జరుగుతోంది. సాఫ్ట్ వేర్ నిపుణులుగా పని చేసే యువతీ యువకులే అధికసంఖ్యలో ఉన్నారు. వారి చేతుల్లో తెలుగు, ఇంగ్లీష్ లిపుల్లో ఉన్న భజన గీతాలు, హారతి పాటల పుస్తకం ఉంది. హారతి కూడా అయిన తర్వాత అందరూ వరసలో నిలబడి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చివరగా భక్తులు ఇళ్ళలో వండి తెచ్చిన ప్రసాదాలు, పండ్లు ప్లాస్టిక్ బాక్స్ లలో పెట్టి పంపిణీ చేశారు. ఆ హాలూ, ఆ పరిశుభ్రత, భక్తుల క్రమశిక్షణ, ప్రసాద వితరణ అన్నీ అమెరికా ప్రమాణంలో ఉన్నాయి.

అన్నట్టు చెప్పడం మరచిపోయాను...భక్తులలో ఎక్కువమంది తెలుగువారే. బ్లూమింగ్టన్ లోని భారతీయుల్లో  తెలుగు జనాభాయే ఎక్కువ.  సత్సంగ్ లో పాల్గొన్న వాళ్ళలో యువతే అధిక సంఖ్యలో ఉండడం కూడా నా దృష్టిని ఆకర్షించింది. బహుశా పది పదిహేనేళ్లుగా ఈ పరిణామాన్ని చూస్తున్నట్టున్నాం. ఆర్థిక సంస్కరణలకు ముందునాటి యువతలో భక్తిప్రపత్తులు ఇంత ప్రస్ఫుటంగా, బాహాటంగా వ్యక్తమయ్యేవని చెప్పలేను. అప్పటి యువతలో నిస్పృహా, నైరాశ్యాలు ఎక్కువగా ఉండేవి. నిరుద్యోగం లాంటి సమస్యలవల్ల కావచ్చు. కృష్ణా రామా అనుకోవడం, గుడుల చుట్టూ తిరగడం వయసు మీరిన వాళ్ళు చేసేపని అన్న అభిప్రాయమూ, అలా తాము కూడా చేయడంలో ఒకవిధమైన నామోషీ, ముఖ్యంగా చదువుకున్న యువతలో ఉండేవనుకుంటాను. దాంతోపాటు, వామపక్ష/వామపక్ష తీవ్రవాద/నాస్తికవాద ఉద్యమాల ప్రభావమూ ఉండేది. ఆర్థిక సంస్కరణల అనంతరకాలంలో భక్తి ప్రపత్తుల ప్రకటనలో వయోభేదాలు అంతరించాయి. మళ్ళీ సాంప్రదాయిక దేవీదేవతలందరూ యువతను ఆకట్టుకుంటున్నారనీ చెప్పలేం. బహుశా వేంకటేశ్వరస్వామి మినహాయింపు. యువతను అత్యధికంగా ఆకర్షిస్తున్న దైవం షిర్డీ సాయి.

ఆ తర్వాత కూడా రెండు, మూడుసార్లు సత్సంగ్ కు వెళ్ళాం.  సత్సంగ్ నిర్వాహకులు బ్లూమింగ్టన్ లో షిర్డీ సాయి మందిర నిర్మాణం సంకల్పించి విరాళాల సేకరణ ప్రారంభించారు. బ్రేక్ ఫాస్ట్ ల ఏర్పాటు, సినిమా ప్రదర్శనలు వగైరాలు విరాళాల సేకరణలో భాగం. మరో ఏడాదిలో మరోసారి నేను బ్లూమింగ్టన్ కు వెళ్ళడమంటూ జరిగితే అప్పటికి అక్కడ షిర్డీ సాయి మందిరం తయారై ఉంటుందని నిశ్చయంగా అనిపించింది. భక్తి మహిమ అలాంటిది. సత్వర నిర్మాణాలు ఏమైనా జరుగుతున్నాయంటే అది ఆధ్యాత్మికరంగంలోనే. హైదరాబాద్ కు ఇదిగో అదిగో అంటున్న మెట్రో రైలు రావడానికి పదేళ్ళు పట్టచ్చు. ముందే కాలువలు తవ్వి కూర్చున్న పోలవరం ప్రాజెక్టుకు ఇరవయ్యేళ్లు పట్టచ్చు. దేవాలయ నిర్మాణం ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది.

భగవంతుడి మహిమ మూగతో మాట్లాడిస్తుందనీ, కాలు స్వాధీనంలోలేని వ్యక్తిచేత పర్వతాలను లంఘింపజేస్తుందనీ అంటారు. దేశం కాని దేశంలో భారతీయులచేత కూడా భారీ నిర్మాణాలు చేయిస్తుంది. చికాగో దగ్గరలోని అరోరాలో వేంకటేశ్వరస్వామి ఆలయం చూసినప్పుడు అలాగే అనిపించింది. ఎన్నో ఎకరాల విస్తీర్ణం గల పచ్చని ప్రాంగణంలో ఎత్తుగా ఠీవిగా పాలరాయితో కట్టిన భారీ కట్టడం అది. అమెరికా సంపన్నతకు తులదూగేలా ఉంది. అమెరికాలో హిందూ దేవాలయాలకు అనుబంధంగా భోజన, ఫలహార విక్రయశాల కూడా ఉంటుంది. శని, ఆదివారాలలో దూర దూర ఆలయాలకు కూడా కారులో వెళ్ళి దైవదర్శనం చేసుకుని, భోజన ఫలహారాలు చేసి తిరిగి రావడం తెలుగు యువతతో సహా అక్కడి భారతీయులకు పరిపాటిగా మారింది. మన దేవాలయ నిర్మాణవ్యవస్థను అమెరికాకు తీసుకువెళ్లి, ఆ దేశాన్ని విస్తరించిన మన ఆధ్యాత్మిక నడవగా మార్చుతున్న మన వాళ్ళు, అక్కడి పద్ధతులను తిరిగి మన దేశానికి తీసుకువస్తారనడంలోనూ సందేహం లేదు.

అమెరికానుంచి వచ్చాక పశ్చిమగోదావరిజిల్లాలోని సొంతవూరికి, అత్తవారి ఊరికి వెళ్లాల్సివచ్చింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో చేబ్రోలు వెళ్ళే రైలు కోసం ఎదురుచూస్తున్నాం. ఓ డెబ్భై, ఎనభై ఏళ్ల వృద్ధుడు మా పక్కన కూర్చున్నాడు. తను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో పుట్టపర్తి వెడుతున్నానని చెప్పాడు. సత్య సాయి జన్మదినం సందర్భంగా సేవాకార్యక్రమంలో పాల్గొనడానికి వెడుతున్నాడట. ఆ వయసులో అంత దూరం వెళ్ళి ఈయన ఎటువంటి సేవలు అందిస్తాడనిపించి ఆశ్చర్యం కలిగింది. అంతలో మరో వృద్ధుడు వచ్చి ఆ పెద్దమనిషిని పలకరించాడు. ఆయనా పుట్టపర్తికే. అయితే రిజర్వేషన్ దొరకలేదట. ఎలా అని అడిగితే, ఏముంది, జెనరల్ కంపార్ట్ మెంట్ ఎక్కేస్తానన్నాడు. అంత దూరం...ఆ వృద్ధుడి ధీమా ఆశ్చర్యం కలిగించింది. ఆ సమీపంలోనే మరో అరడజను మంది సత్యసాయి భక్తులు కనిపించారు. వాళ్లూ పుట్టపర్తికే. సత్యసాయి ట్రస్టు మీద ఆరోపణల సంగతేమిటి, భక్తుల రాకపై వాటి ప్రభావం పడిందా అని అడిగితే, అన్నీ సర్దుకున్నాయి, భక్తుల సంఖ్య ఇంకా పెరిగిందని మొదటి వృద్ధుడు చెప్పాడు.

ఏవో రోగాలతో తీసుకుంటూ, కుటుంబ సమస్యలతో నలుగుతూ, మంచి-చెడుల కలబోతగా కనిపించే మనుషుల్లో కూడా గుప్తంగా తమదైన భక్తి, ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది. విశ్వాసం వయసునీ, అనారోగ్యాన్ని అవలీలగా జయించి పుట్టపర్తివరకూ నడిపిస్తుంది. ఆ విశ్వాసానికి ఆలంబనం సత్యసాయి కావచ్చు, అయ్యప్పస్వామి కావచ్చు, మరో దైవం కావచ్చు. సత్య సాయి ట్రస్టు మీద, ఆయన ఉండగా ఎన్నడూ రాని స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. పత్రికలు ధారావాహికంగా కథనాలు ప్రచురించాయి. అయినా సరే, సాయి భక్తులలో విశ్వాసదీపం కొంచెం కూడా చలించలేదని ఆ వృద్ధుడితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. భక్తి రహస్యం అదే. ఆ సామ్రాజ్యంలోకి లౌకికమైన దేదీ అడుగుపెట్టలేదు.

చేబ్రోలులో రైలు దిగి నడుచుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాం. మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుతూ మా పక్కనుంచే లారీలు, ఒకటి రెండు కార్లు వెళ్లిపోయాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనిపించిన ఓ దృశ్యం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఏణ్ణర్థం క్రితం అక్కడ ఒంటి అంతస్తుతో షిర్డీ సాయి మందిరం ఉండేది. ఇప్పుడక్కడ  దాదాపు అన్ని హంగులతో రెండంతస్తుల మందిరం ఉంది. ఆ పక్కనే ఓ తాటాకు కప్పు కింద వంట సామగ్రి ఉంది.  ఇంటికి వెళ్ళాక మందిర నిర్మాణం గురించి చెప్పిన మా అత్తగారు, అక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతోందని కూడా చెప్పారు. మొదట్లో అన్నదానానికి పదిహేనువందలు తీసుకునేవారట, సంఖ్య పెరగడంతో ఇప్పుడు మూడువేలు తీసుకుంటున్నారట. ఒకవారం ఖర్చు తను భరిస్తానంటే; మూడు మాసాల దాకా ఖాళీ లేదు, ముందే రిజర్వు చేసేసుకున్నారని మందిర నిర్వాహకులు చెప్పారట.

ఊళ్లలోకి అడుగుపెట్టగానే కుంగదీసే భయం, దోమలు. చుట్టూ పొలాల వల్ల, ఓపెన్ డ్రైనేజ్ వల్ల దోమల దాడి ఎక్కువ. దానికి కరెంట్ కోత కూడా తోడైతే ఇక చెప్పనక్కరలేదు. అయితే అదృష్టం కొద్దీ ఈ మధ్య కరెంట్ ఉంటోందట. అయినాసరే, ఆల్ ఔట్ వంటి దోమల విధ్వంసకాల రక్షణ తప్పదు. తెల్లవారు జామునే మైకు శబ్దంతో భళ్ళున మెలకువచ్చింది. షిర్డీ సాయి మందిరం నుంచి భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపున గాయత్రీదేవి ఆలయం నుంఛీ స్తోత్రాలు మొదలయ్యాయి. మరోవైపున అయ్యప్ప దీక్షలో ఉన్నవారు కూడా మైకు ఆన్ చేశారు. ఒక్కోసారి అన్ని మైకుల శబ్దాలూ కలసిపోయి అస్పష్ట రణగొణధ్వనులను ప్రసారం చేస్తున్నాయి. ఈ మైకు శబ్దాలు క్షణకాలం ఆగితే, దూరంగా ఉన్న శివాలయం మైకు సన్న సన్నగా చెవిన పడుతోంది.  కొన్నేళ్లుగా ఊళ్ళు భక్తి గీతాలతో, దేవతా స్తోత్రాలతో మేలుకుంటున్నాయి. స్తబ్ధుగా, నిశ్శబ్దంగా ఉండే ఊళ్ళ ఉనికిని చాటే శాబ్దిక సాధనాలుగా గుడి మైకులు మారాయి.  హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు  ఊళ్ళకు మైకు సెట్లు ఇచ్చినప్పటినుంచీ ఇది ప్రారంభమైనట్టు జ్ఞాపకం.

గుడి కంటే ముందే లేచి చన్నీటిస్నానం చేసిన మా అత్తగారు ఈ రోజు ఉపవాసమనేవరకూ ఆ రోజు కార్తీక సోమవారమన్న సంగతి గుర్తురాలేదు. లేచి, కాస్త అలా నాలుగు వీధులు తిరిగొద్దామని బయలుదేరాను. స్తబ్ధ వాతావరణమే కాదు, అక్కడక్కడ పాడుబడినట్టున్న ఇళ్లూ కనిపించాయి. మట్టి రోడ్లు. చాలాచోట్ల గతుకులు. వాహనాలు, షాపులతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి మరింత అధ్వాన్నం. అదీ మట్టి రోడ్డే. గోతుల మయం. కొన్నిచోట్ల ఆ మధ్య కురిసిన తుపాను వర్షాల తాలూకు నీరు ఇంకా నిలిచి ఉంది. ఆ బురదనీటిని పాదచారుల మీద చిమ్ముతూ వాహనాలు వెడుతున్నాయి. దానికితోడు రోడ్డు పొడవునా  అటూ ఇటూ చెత్త పోగులు. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ఆ రోడ్డు మీదే శివాలయం ఉంది. దానికి కొన్ని అడుగుల దూరంలోనే మాంసవిక్రయం జరుగుతోంది. ఆ దృశ్యం, ఆధ్యాత్మిక సామ్రాజ్యంపై ఆధిపత్యం చాటుతూవచ్చిన ఒక సామాజికవర్గం పట్టు సడలిన సంకేతాలు ఇస్తోందా అనిపించింది.  అదే రోడ్డు మీద ముందుకు వెడితే ఒక చర్చి కనిపిస్తుంది.

క్రమంగా కార్తీక సోమవార సంరంభం పుంజుకుంది. ఆలయాల దగ్గర సందడి కనిపిస్తోంది. ఆడా, మగా పూలు, పండ్లు పుచ్చుకుని గుళ్ళకు చేరుతున్నారు. ఉండి ఉండి గుడిగంటలు మోగుతున్నాయి. ఒకటిమాత్రం చాలామందిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, పోషకాహారలోపం! ఊళ్ళో జనం చేతుల్లో సెల్ ఫోన్లు, ఇళ్ళల్లో టీవీలు ఉన్నమాట నిజమే. కానీ తాము జీవించే పరిసరాలు అంత మురికి మురికిగా, అనారోగ్యకరంగా ఉన్నాయే అన్న స్పృహ కానీ; అందుకు బాధ్యత వహించవలసిన వ్యవస్థల ఉనికి గురించిన పట్టింపు కానీ ఉన్నట్టు కనిపించలేదు. గుడి, భక్తి ప్రకటన...ఈ రెండే సామాజిక అభివ్యక్తులుగా కనిపించాయి. ఊరికీ, బాహ్యప్రపంచానికీ మధ్య  కనిపించని ఉక్కుతెరలు ఉన్నాయనిపించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ గ్రామజీవనం నమూనా ఇప్పటికీ చెక్కుచెదరలేదన్న భావన కలిగింది. అపరిశుభ్రత, అసౌకర్యాలు నిండిన పరిసరాలలో వారు జీవిస్తున్న మాట నిజమే. అదే సమయంలో వారు తమదైన భక్తి సామ్రాజ్యంలో జీవిస్తున్నారు. కేవలం విశ్వాసమే వారిని జీవింపజేస్తోంది. అయితే ఆ విశ్వాసం పాలకుల మీద కాదు. తమ భక్తి సామ్రాజ్య అధిపతి అయిన భగవంతుడి మీద.

రెండు రోజుల తర్వాత మా సొంత ఊరికి బయలుదేరాం. నిడదవోలు వెళ్లడానికి చేబ్రోలు స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్నాం.  ఫ్లాట్ ఫారం మీద భవానీదీక్ష పుచ్చుకున్న ఓ పదిమంది కాషాయం దుస్తులతో, ముఖాన గంధం కుంకుమలతో కనిపించారు. అందరూ చిన్న చిన్న వ్యాపారాలో వృత్తులో చేసుకుంటున్నవాళ్లు. అయ్యప్ప దీక్ష పుచ్చుకున్నవారు ఇద్దరో ముగ్గురో కనిపించారు. ఇలాంటి దీక్షావిధానం ఇటీవలికాలంలో అయ్యప్పదీక్షలతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. భవానీ దీక్షలే కాక అన్నవరం సత్యనారాయణస్వామి దీక్షలు, సింహాచల నరసింహస్వామి దీక్షలు, తిరుమల గోవింద దీక్షలు కూడా మొదలయ్యాయి. ఆధ్యాత్మిక సామ్రాజ్యంపై ఒక సామాజికవర్గం పట్టు సడలిందనడానికీ, ఆధ్యాత్మికరంగంలో జరుగుతున్న వికేంద్రీకరణకూ ఈ పరిణామం మరో స్పష్టమైన సూచన అనిపించింది. పూజారి జోక్యం లేకుండా ఎవరికి వారే నేరుగా భగవంతుని పూజించుకునే సౌలభ్యం ఉండడం ఈ దీక్షల ప్రాచుర్యానికి ఒక కారణమని కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు అర్థమైంది. అయితే భిన్న విధానాలు, భిన్న సామాజికవర్గాల మధ్య ఎలాంటి పోటీ కానీ, శత్రువైఖరి కానీ లేదు. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అధికార వికేంద్రీకరణే కాదు, అద్భుతమైన ప్రజాస్వామ్యమూ వెల్లివిరుస్తోంది. ఎవరూ ఎవరినీ కాదనడం లేదు. ఊళ్లలో చీకటితోనే మేలుకొలిపే గుడి మైకులూ, టీవీ చానెళ్లలో రోజంతా వినిపించే ప్రవచనాల సౌండ్ బైట్స్ లోనే కాదు; తిరువణ్ణామలై రమణాశ్రమం, పుట్టపర్తి ప్రశాంతినిలయం మొదలైనచోట్ల  కనిపించే ప్రశాంత మౌన వాతావరణంలోనూ అన్ని వర్గాలవారూ ఆధ్యాత్మిక శాంతిని ఆస్వాదిస్తున్నారు.

రైలు ఎక్కగానే నా సెల్ లో మెసేజ్ మోగింది. హైదరాబాద్, పంజగుట్టలోని జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఓ మిత్రుడు, మీరు హైదరాబాద్ ఎప్పుడొస్తున్నారు, ఒకసారి వచ్చి సెంటర్ ను చూడాలని అడుగుతున్నాడు. మౌనంలో ఉండడం వల్ల మెసేజ్ ఇచ్చాడట. నిడదవోలులో రైలు దిగి బస్టాండ్ వైపు నడిచాం. గుళ్ళ దగ్గర కార్తీకమాసం హడావుడి కనిపించింది.  బస్టాండ్ చూడగానే కడుపులో దేవినట్టు అయింది. వెలిసిపోయిన గోడలతో  ఇక్ష్వాకుల కాలంనాటిదిలా కనిపిస్తోంది. ప్రయాణికుల షెల్టర్ ను ఆనుకునే పాచి పట్టిన ఒక పెద్ద మురుగు నీటి వైతరణి ఉంది. దానిమీద దోమలు గుంపులుగా విహరిస్తున్నాయి. బస్సులాగే చోటు మిట్టపల్లాలతో ఉంది. పోలవరం బస్సు ఉందా?’ అని కంట్రోల్ రూమ్ లో కూర్చున్న ఉద్యోగిని అడిగితే, వస్తుంది అని శూన్యంలోకి చూస్తూ జవాబిచ్చాడు. ఎన్నింటికి?’ అని అడిగితే, చూపు తిప్పకుండానే, ఇప్పటికే రావాలన్నాడు. అంతలో తాళ్ళపూడి బస్సు వచ్చింది. అందులో వెడితే తాళ్ళపూడిలో దిగి మా ఊరు ప్రక్కిలంకకు మళ్ళీ ఆటో చేసుకోవాలి. పోలవరం బస్సు కోసం ఎదురుచూడడం కన్నా అదే నయమనుకుని బస్సు ఎక్కాం. బస్సు ఊళ్ళోంచి వెడుతుండగా రోడ్డువైపు దృష్టి సారించాను. రోడ్డు పొడవునా చెత్త కుప్పలు. ఒక చోట వెయ్యి గజాల ప్రదేశం అంతటా చెత్త పరచుకుని ఉంది. అక్కడే బహిరంగ కాలకృత్యాలు జరుగుతున్నాయి. దాని పక్కనే ప్రభుత్వాసుపత్రి ఉంది.

ప్రక్కిలంక చేరేసరికి పదకొండు దాటింది. ఊరు అన్ని ఊళ్ళలానే స్తబ్ధుగా ఉంది. మా ఇంటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతుంటే, లోపల ఖాళీ స్థలంలో తళతళా మెరిసిపోతున్న రేకులతో ఒక ఎత్తైన షెడ్డూ, అందులో రంగులు పెయింట్ చేసిన ఓ రథమూ కనిపించాయి. తలుపు కొట్టగానే అక్కయ్య తలుపు తీసింది. లోపల టీవీలో టీటీడీ చానెల్ నుంచి భక్తి కీర్తనలు వినిపిస్తున్నాయి. కుశల ప్రశ్నలు, భోజనాలు వగైరాల తర్వాత మాట్లాడుకుంటూ కూర్చుని ఉండగా, అంతలో అక్కయ్య ఏదో గుర్తొచ్చినట్టు లేచి టీవీ ఆన్ చేసి భక్తి చానెల్ పెట్టింది. చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం వస్తోంది. ఈ రోజు తెలుగు నాట ఇంటింటా తెలిసిన పేరు ఆయన. వివిధ చానెళ్లలో రోజుకు కనీసం నాలుగైదు సార్లు ఆయన కనిపిస్తారు, వినిపిస్తారు. నేటి టీవీ యుగం సృష్టించిన ఒక పౌరాణిక సెలెబ్రటీ గా ఆయనను చెప్పుకోవచ్చు. సాంప్రదాయిక భక్తి, ఆధ్యాత్మికతలనే బోధిస్తున్నా; అసాధారణమైన శ్రావ్యత, తన్మయత ఆయనలో ఆకట్టుకునే ప్రత్యేకతలు. ఆయన ప్రవచనాలు సీడీ ల రూపంలో కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఇదిగో రోజంతా ఈ భక్తి చానెళ్లతోనే కాలక్షేపం అంటూ అక్కయ్య టీవీ శ్రవణానికి ఒక చెవి అప్పగించి రెండో చెవిని మాకు అప్పగించింది. టీవీ వచ్చాక పురాణకాలక్షేపాలకూ, హరికథలకూ బయటికి వెళ్ళే అవసరమూ, అలవాటూ తప్పిపోయాయి.  అందులోనూ పిల్లల విదేశీ ఉద్యోగాలు వచ్చాకా, ఇతర బాధ్యతలు తీరిపోయిన తర్వాతా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు టీవీ సాహచర్యంలోనే ఒంటరి తనాన్ని జయిస్తూ భక్తి, ఆధ్యాత్మికతలను పండించుకుంటున్నారు.  ప్రవచనాలూ, దేవతాస్తుతులూ వగైరాలే కాదు; జాతకాలు, గ్రహశాంతులు, జపాలు, వాస్తు, రుద్రాక్షలు, ఉంగరాలలో ధరించే రాళ్ళు సహా అన్ని రకాలకు సంబంధించిన సలహాలు టీవీ చానెళ్ల ద్వారా ఇళ్లలోనే ఉచితంగా లభిస్తున్నాయి. వయోభేదం లేకుండా ఎవరెవరో టీవీ తెర మీద ప్రత్యక్షమై ఉపదేశాలు, సలహాలు ఇస్తున్నారు. వారి అర్హతా, నర్హతల గురించి ఎవరూ అడగడం లేదు. అన్ని చానెళ్లూ రుద్రాక్షలు, ఉంగరాల రాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వాణిజ్య కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిలోని  నిజానిజాలను పరిశీలించేవారు కానీ, ఆ వ్యాపారంపై నిఘా పెట్టిన వ్యవస్థ కానీ ఉన్నట్టు లేదు. తెలుగువారి ఆధ్యాత్మిక సామ్రాజ్యం వికేంద్రీకృతం, ప్రజాస్వామికమే కాదు; విశృంఖలం కూడా.

మధ్యాహ్నం  అలా వీధిలోకి వెళ్లినప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండే కిరాణా వ్యాపారి కనిపించి పలకరించాడు. రేకుల షెడ్డు చూపించి రథం కోసం ఈ మధ్యనే చేయించామని చెప్పాడు. ఈ ఏడాది మాఘమాసంలో జరిపిన సౌర యాగానికి, సూర్య నమస్కారాలకు ఊళ్ళనుంచి బళ్ళు కట్టుకుని వచ్చారనీ, 70 వేలు మిగిలాయనీ, శివాలయానికి ఆ డబ్బు ఖర్చు పెడుతున్నామనీ సగర్వంగా చెప్పాడు.

ఉదయమే చీకటితోనే శివాలయం నుంచీ, గోదావరి గట్టునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచీ వినిపించే మైకు శబ్దాలకు లేచి కూర్చున్నాను. వెలుగు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు వెంబడే గోదావరి గట్టుకు బయలుదేరాను. రోడ్డుకు అటూ ఇటూ అశుద్ధాలు! వాటి మధ్య నడవడానికి కంపరం కలిగింది. గట్టు మీద బాగుండచ్చన్న ఆశతో ఎలాగో ముందుకు నడిచాను. తీరా వెడితే అక్కడా అదే పరిస్థితి. శుభ్రమైన గోదావరి గాలి పీల్చుకోవచ్చునన్న ఆశకు నీళ్లొదిలి తిరుగుముఖం పట్టాను. వస్తుంటే ఒక పక్క నిర్మల్ గ్రామ్ పురస్కార్ కు సంబంధించిన బోర్డు కనిపించింది. బహిరంగ కాలకృత్యాలు నిషిద్ధమనీ, దానిని ఉల్లంఘించినవారిని శిక్షిస్తామనీ  దాని మీద రాసుంది. అంత బాధలోనూ నవ్వొచ్చింది. శిక్షించేదెవరు, శిక్షింపబడేదెవరు? అంతా మాయ!

అంతలో పూజారి మిత్రుడు ఎదురై పలకరించాడు. ఎలాగూ వచ్చారు, లక్షపత్రి పూజకు ఉండి వెళ్లండన్నాడు!

 చేబ్రోలు, ప్రక్కిలంకే ఏమిటి, ఆంధ్రదేశంలోని అన్ని ఊళ్లూ బాహ్య పరిసరాలను విస్మరించి భక్తిగంగలో మునకలేస్తున్న దృశ్యం కళ్ళకు కట్టింది.

ఆధ్యాత్మిక సామ్రాజ్యం అన్నప్పుడు దానికి ఒక రాజధానీ ఉండవలసిందే. ఆ విధంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధానులు రెండు.  హైదరాబాద్ రాజకీయ రాజధాని అయితే,  తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని. ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆకర్షణ గల పదవి బహుశా టీటీడీ అధ్యక్ష పదవే. వార్తల్లో ఉండడంలో టీటీడీ అధ్యక్షుడు ముఖ్యమంత్రితో పోటీ పడుతుంటారు.  అలాగే, రాజధాని అన్న తర్వాత హైదరాబాద్  మీద పెట్టినంత ఫోకస్ నే మీడియా తిరుపతి మీదా పెట్టక తప్పదు. అందుకే మంచివీ, చెడ్డవీ సహా తిరుపతికి సంబంధించిన అన్ని వార్తలనూ  అందించడడంలో ఇటీవలి కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పోటీ పడుతున్నాయి. తిరుమల వేంకటేశ్వరస్వామి సంపన్న దైవం కనుక మీడియా నిఘా మరింత తప్పనిసరి. ఆధ్యాత్మిక రాజధాని అన్నాక తిరుపతిపై  అధికారాన్ని స్థాపించుకోడానికి ఆధ్యాత్మిక నేతలు ప్రయత్నించడమూ సహజమే. వెయ్యి కాళ్ళ మండపం, బంగారపు తొడుగు మొదలైన వివాదాస్పద నిర్ణయాలలో, ఆగమోక్తవిధానాల ఉల్లంఘన వంటి ఆరోపణల సందర్భంలో చిన జియ్యర్, స్వరూపానందేంద్ర సరస్వతి వంటి స్వాముల జోక్యం, వారు తరచు వార్తలకెక్కడం చూస్తున్నాం. అలాగే, రాజకీయ సామ్రాజ్యంలోని ఊళ్లలానే, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోని  ఎన్నో  బడుగు గుడులు వెల వెల పోతుంటాయి. ఎన్నో ఆలయాలలో తగిన వ్యవస్థలు లేక భక్తులు అవస్థల పాలవుతుంటారు. శిఖరాలు, రాజగోపురాలు కుప్ప కూలుతుంటాయి. పర్వదినాలలో భక్తసమూహాల నియంత్రణలో  కనీసం అధునాతన పద్ధతులను కూడా అమలుచేయలేని నిర్వీర్యస్థితిలో ఆలయవ్యవస్థ ఉంటుంది.  

రాజకీయప్రజాస్వామ్యంలో జనం ఓటు మీద ఆధారపడే ప్రభుత్వాలైనా అప్పుడప్పుడు ప్రజలను నొప్పించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలో స్వాములు అంతకు మించిన గడుసరులు. అనుచరబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ప్రజల వ్యక్తిగత నడవడిలోకి తొంగి చూడకుండా జాగ్రత్త పడుతుంటారు. రోడ్లు, వీధులు సరే, కనీసం నదీతీరాలలో బహిరంగ కాలకృత్యాలు వద్దని, హృదయాలలానే పరిసరాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకోమనీ భక్తులకు ప్రబోధించే స్వాములు, పౌరాణికులు ఎవరైనా ఉన్నారా?!

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అన్నాక అందులో అనుమానాస్పద శక్తులూ ఉంటాయి. భూ కబ్జా వంటి ఆరోపణలు స్వాముల మీదా ఉన్నాయి. అన్నిటా పోలికలు చక్కగా కుదిరాయి. జనంలో రాజకీయ ప్రజాస్వామ్యంపట్ల ఉన్నంత నిర్లిప్తతే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మీద కూడా. తిరుపతి హుండీ నిండుతూనే ఉంది. రికార్డులు తిరగ రాస్తూనే ఉంది.

కార్తీక మాసంలో మూడువంతులు ఊళ్లలో భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఇక్కడా కార్తీక మాహాత్మ్యం వెల్లివిరుస్తున్న వాతావరణం కనిపించింది. నగరానికి శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఉన్నారు!
                                                                ****
                                (ఇండియా టుడే, 4వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలో ప్రచురితం)
                                                                            

Sunday, December 23, 2012

'లోపలి మనిషి' ప్రూఫులు దిద్దిన పీవీ

(ఈ రోజు భారత మాజీప్రధాని, రచయిత, బహుభాషావేత్త దివంగత పీవీ నరసింహారావు గారి 8వ వర్ధంతి.  ఆయన  ఆత్మకథాత్మక రచన 'ది ఇన్ సైడర్' (తెలుగులో 'లోపలి మనిషి') ను అనువదిస్తున్న రోజుల్లో నేను ఆయనను అనేకసార్లు కలుసుకున్నాను. అప్పుడు ఆయన వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను ఒకింత దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. కొన్ని విశేషాలను వీక్షకులతో పంచుకోవాలనిపించింది)

ఎన్నో దశాబ్దాల రాజకీయజీవితం నరసింహారావు గారిది. అయితే అంత సుదీర్ఘ రాజకీయజీవితమూ ఆయనలోని సృజనజీవినీ, రచయితను కప్పివేయలేదని తొలి పరిచయం లోనే నాకు అర్థమైంది. రకరకాల చాదస్తాలతో సహా రచయితలకు ఉండే లక్షణాలు అన్నీ ఆయనకు సంపూర్ణంగా ఉన్నాయి.

'ఆంధ్రప్రభ'దినపత్రికలో 'ది ఇన్ సైడర్' అనువాదాన్ని ధారావాహికంగా ప్రచురించాలని యాజమాన్యం నిర్ణయించినప్పుడు అనువాదం ఎవరు చేస్తారని నరసింహారావుగారు అడిగారు. నా పేరు చెప్పారు. 'అనువాదం నాకు నచ్చాలి. మొదట ఒకటి రెండు అధ్యాయాలు చేయించి నాకు పంపం'డని ఆయన సూచించారు. అలాగే పంపించాం. రెండు రోజుల్లోనే ఆయన అనువాద భాగాలను తిప్పి పంపుతూ ఈ సారి నేరుగా నాకే లేఖ రాశారు. అనువాదం మొత్తం మీద బాగుందంటూ కొన్ని సూచనలు చేశారు. నా సహాయం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఆ లేఖతో ఆయన వ్యక్తిత్వంలోని రెండు అంశాలు నాకు అర్థమయ్యాయి. మొదటిది-పని దగ్గర ఆయనకు ప్రోటోకాల్ పట్టింపులేవీ లేవు. రెండవది-అప్పటికే అనువాదకులుగా ప్రసిద్ధులైన కొందరి పేర్లు ఆయన పరిశీలనలో ఉన్నాయి. కానీ ఆయన నా లాంటి ఒక అప్రసిద్ధుని ఎంచుకున్నారు,

ఆ తర్వాత కొన్ని రోజులకు నేను, మా సంపాదకులు వాసుదేవ దీక్షితులుగారు  హైదరాబాద్ లోని రాజ్ భవన్ గెస్ట్ హౌస్ లో  తొలిసారి ఆయనను కలసి మాట్లాడాం. అప్పుడు ఆయనలో నాకు ఒక మాజీ ప్రధానీ, రాజకీయవేత్తా కనిపించలేదు. సాహితీవేత్తే కనిపించాడు. అప్పటికే హాలులో కొందరు రాజకీయ ప్రసిద్ధులు ఉన్నారు. నరసింహారావు గారి సిబ్బంది మమ్మల్ని లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. మేము వచ్చినట్టు చెప్పగానే నరసింహారావుగారు మాకోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే మా దగ్గరికి వచ్చారు. పలకరింపులు అయిన తర్వాత అనువాదం గురించి నాతో మాట్లాడారు. విశ్వనాథ వారి వేయిపడగల అనువాదకునిగా తన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారు. అంతలో ఒక మహిళా గవర్నర్ అక్కడికి వచ్చారు. ఆమె రాకవల్ల మాతో సంభాషణకు అంతరాయం కలిగి ఆయన ఇబ్బంది పడినట్టు అనిపించింది. తన రచనా వ్యాసంగం, ఇన్ సైడర్ అనువాదం మీద తప్ప ఆయనకు ఆ సమయంలో మరి దేనిమీదా ఆసక్తి లేదని ఆ కాసేపటిలోనే నాకు అర్థమైంది. 'మాలోని వాడివే, మా వాడివే నువ్వు' అని ఒక కవి రాసినట్టుగా ఆయన మా రచయితలలో వారే, మా వారే అనిపించి బెరుకు పోయింది.

అనువాదంలో నాకు కొన్ని పద్ధతులూ పట్టింపులూ ఉన్నాయి. అనువాదం పూర్తిగా మూలవిధేయంగా ఉండవలసిందే. అయితే అది స్వతంత్ర రచనలానూ కనిపించాలి. స్వేచ్చానువాదానికి నేను వ్యతిరేకిని. అలాగే అనువాదం మూలాన్ని మించకూడదు. మూలంలోని శైలీ, ఉరవడీ, బిగువూ అన్నీ అనువాదంలోనూ అచ్చుపడాలి. నరసింహారావుగారు నా అనువాదంలోని ఈ లక్షణాలను గుర్తించి మెచ్చుకున్నారు. అయితే, ఇంగ్లీష్ నుడికారాన్ని, సామెతలను తెలుగు చేసేటప్పుడు వాటికి సరిపోయే తెలుగు నుడికారాన్ని, సామెతలను ఉపయోగిస్తే మంచిదని నేను అనుకునవాణ్ణి.  కాదు, ఇంగ్లీష్ నుడికారాన్ని, సామెతలను యథాతథంగా అనువదించాలని పీవీ సూచించారు. ఒకసారి మాటల సందర్భంలో అందుకు కారణం చెప్పారు. ఇంగ్లీష్ నుడికారాన్ని యథాతథంగా అనువదించడం వల్ల తెలుగు భాషకు వ్యక్తీకరణ శక్తి పెరుగుతుందనీ, భాష నునుపెక్కుతుందనీ ఆయన సూత్రీకరణ. ఆయన దూరదృష్టి నన్ను ఆశ్చర్యపరచింది.

ఇంగ్లీష్ తో పోల్చితే తెలుగు భాషకున్న వ్యక్తీకరణ శక్తి స్వల్పమనే అభిప్రాయం అనువాదసమయంలో నాకు అనేకసార్లు కలిగింది. ఒక్క  ఇంగ్లీష్ మాట అనేక అర్థచ్చాయలనూ, భావవైవిధ్యాన్నీ ప్రకటించగలుగుతుంది. అంత అర్థస్ఫూర్తిగల మాటను తెలుగులో వెతికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఒక్కోసారి అసంతృప్తితోనే ఏదో ఒక మాట వాడక తప్పేది కాదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇలాంటి అవస్థ ఎదుర్కొన్న తావులోనే  పీవీ గారి దృష్టి పడేది. నాకు తట్టని మరింత మెరుగైన మాటను ఆయన అక్కడ వాడేవారు. భాషపై ఆయనకు గల పట్టు అలాంటిది.

భారత్-చైనా, భారత్-పాకిస్తాన్ యుద్ధఘట్టాలను ఆయన సన్నప్రింట్ లో రక్షణ నిపుణుల ఉటంకింపులతో చాలా విస్తృతంగా రాశారు. ఎంతో సమాచారాన్ని పొందుపరిచారు. పత్రికలో కేటాయించిన స్థలం దృష్ట్యా రోజులతరబడి ఈ వివరాలనే ప్రచురించవలసివస్తుందనీ, కథాగమనం కుంటుపడి సాధారణ పాఠకుని ఆసక్తిని హరించవచ్చుననీ, కనుక పరిహరిస్తే బాగుంటుందనీ ధైర్యం చేసి ఆయనతో అన్నాం. ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాకు లేఖ రాస్తూ ఈ విషయం ప్రస్తావించి, ముందు తరాలవారు తెలుసుకుని తీరాలన్న ఉద్దేశంతో ఆ సమాచారమంతా ఇచ్చాననీ, ఎవరి చాదస్తం వారికి నచ్చుతుంది కనుక మొత్తం ప్రచురించవలసిందేననీ అన్నారు. అది చాదస్తమైతే రచయితలు అందరికీ ఉండే చాదస్తమే.

వినడానికి ఆశ్చర్యంగానే ఉండచ్చు కానీ, భారత మాజీ ప్రధాని పీవీ 'లోపలి మనిషి' అచ్చవుతున్న సందర్భంలో ఓపికగా ప్రూఫులు కూడా దిద్దారు. పైగా ఢిల్లీలో ఆసుపత్రి బెడ్డు మీద ఉన్నప్పుడు కూడా.

ఎమెస్కో అధిపతి విజయకుమార్ గారు విజయవాడ, విశాఖపట్నాలలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన 'లోపలి మనిషి' ఆవిష్కరణ సభల్లో పీవీ గారు పాల్గొన్నారు. విజయవాడ సభలో వక్తలందరూ అనువాదం గురించి ఏమీ మాట్లాడకుండా మూల రచనగురించే మాట్లాడడం నన్నుఒకింత నిరుత్సాహపరచింది. ఆశ్చర్యమేమిటంటే, పీవీ గారు ఆ రోజు పూర్తిగా అనువాదం గురించే మాట్లాడారు. అంతేకాదు, నన్ను చూపించి ఇతడు నా అనువాదకుడు కాదు, నా ఇంటర్ ప్రెటేటర్ అన్నారు. మా  ఇద్దరికీ బాగా కుదిరిందనీ, ఇన్ సైడర్ రెండో భాగాన్ని కూడా ఇతడే అనువదిస్తాడని కూడా సభలో ప్రకటించారు. దురదృష్టం, ఆయన కోరిక తీరలేదు.

ఆయనలో నేను చూసిన రాజకీయపార్స్వంతో సహా  మరికొన్ని విశేషాలు మరోసారి ఎప్పుడైనా...

ఒకటి మాత్రం చెప్పి ముగిస్తాను. పీవీ నరసింహారావు గారి రాజకీయ జీవితంపై, వ్యక్తిత్వంపై ఎవరి అంచనాలు, అభిప్రాయాలు వారికి ఉండచ్చు. నేను అందులోకి వెళ్ళను. అయితే, ప్రముఖ పాత్రికేయులు కరణ్ థాపర్, శేఖర్ గుప్తాలు పీవీని అసాధారణ రాజకీయవేత్తగా పేర్కొంటూ ప్రశంసాపూర్వకంగా రాసిన రెండు వ్యాసాలు నాకు ప్రత్యేకించి గుర్తుండిపోయాయి. సాధారణంగా ఇంగ్లీష్ పాత్రికేయులు ఎవరి విషయంలోనైనా సూపర్లేటివ్స్ వాడడం చాలా అరుదు. విదేశీ వ్యవహారాలమీద నెహ్రూ తర్వాత అంత పట్టు, పరిజ్ఞానం ఉన్న ప్రధాని నేను గమనించినంతవరకు పీవీనే అని శేఖర్ గుప్తా అంటాడు.




Friday, December 21, 2012

ప్రధానిగా మోడీ: ఒక విష్ ఫుల్ థింకింగ్

యాంటీ-ఇన్ కంబెన్సీ (అధికారపక్ష వ్యతిరేకత) ఫ్యాక్టర్ పాతబడుతోందని గత మూడు నాలుగేళ్లుగా నేను ప్రత్యేకించి రాస్తున్నాను. కొన్నేళ్లుగా 'అభివృద్ధి', 'పనితనం' అనేవి రాజకీయ చర్చలో ప్రాధాన్యం వహిస్తుండడమే నా అంచనాకు కారణం.  రాజకీయచర్చా వస్తువు మారిందని సకాలంలో గుర్తించిన బుద్ధికుశలురు పరిపాలనలో అభివృద్ధికి, పనితనానికి చోటిస్తూ నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే సరికొత్త రాజకీయసంస్కృతిని తీసుకొచ్చారు. ఒకే పార్టీకి కాక వేర్వేరు పార్టీలకు చెందినవారు కూడా వీరిలో ఉన్నారు. నితీశ్ కుమార్(జేడీయూ-బీహార్ ముఖ్యమంత్రి), శివరాజ్ సింగ్ చౌహాన్(బీజేపీ-మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి), రమణ్ సింగ్(బీజేపీ-ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి), షీలా దీక్షిత్(కాంగ్రెస్-ఢిల్లీ ముఖ్యమంత్రి), నవీన్ పట్నాయిక్(బీజేడీ-ఒడిస్సా) చెప్పుకోదగిన కొన్ని పేర్లు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ జాబితాలో ఒక ప్రముఖుడే కానీ 'నిశ్శబ్దంగా పనిచేసుకోవడం' అనే మాట ఆయనకు వర్తించదు. కారణాలు ఏమైనాసరే, అభివృద్ధి అనే మాటను అందరికంటే ఎక్కువగా ఇప్పుడు చలామణిలో ఉంచింది ఆయనే. అదొక నినాదంగా జనం నోళ్లలో నానడానికి  అవసరమైనన్ని 'సౌండ్ బైట్స్'  ఇప్పుడు గుజరాత్ నుంచే ప్రసారమవుతున్నాయి.

ఇప్పుడే ఇంకో విషయం కూడా చెప్పుకుని అసలు విషయం లోకి వెడతాను. అభివృద్ధి గురించి చాలాకాలంగా మాట్లాడుతున్న అతి కొద్దిమంది తెలుగు పాత్రికేయులలో నేను ఒకణ్ణి. అంటే మిగిలినవారు అభివృద్ధి వద్దంటున్నారని కాదు. ఒత్తి చెప్పడంలోనూ, అభివృద్ధికి సంబంధించిన నమూనా విషయంలోనూ తేడా ఉందని చెప్పడమే నా ఉద్దేశం. అభివృద్ధి గురించి మాట్లాడి నేను విమర్శలూ ఎదుర్కొన్నాను. ఇప్పుడా అంశంలోకి లోతుగా వెళ్ళను. అయితే, అభివృద్ధి అనే మాటను ఒక తిట్టుపదంగానూ, అవినీతికి పర్యాయపదంగానూ, క్రోనీ క్యాపిటలిజానికి గౌరవప్రదమైన ముసుగుగానూ మార్చి దాని విలువ పోగొట్టారని కూడా నేను ఒప్పుకుంటాను. నా ఉద్దేశంలో, లేదా నా ఇమాజినేషన్ కు అందినంతవరకూ 2004-2009 మధ్యకాలం అభివృద్ధి కేంద్రిత రాజకీయ సంస్కృతిపై ఆశలు రేకెత్తించిన కాలం (దయచేసి ఇక్కడ ఎన్.డీ.ఏ, యూపీఏ తేడాలు తీసుకురావద్దు). 2009 తర్వాత గుజరాత్ మినహా దేశంలో మరెక్కడా అభివృద్ధి అనే మాట ధాటిగా  వినిపించడం లేదు. మన రాష్ట్రం సంగతి చెప్పనే అవసరం లేదు. పైగా ఎవరైనా అభివృద్ధి అంటే మీద పడి కరిచే వాతావరణం ఉంది. అది, బాధ్యతా, జవాబుదారీ, దార్శనికతా లేని రాజకీయ అంగుష్టమాత్రుల పుణ్యం!  అంతర్జాతీయ ఆర్థికసంక్షోభం ప్రభావం  కొంత ఉండచ్చు కానీ అదే ఏకైక కారణమని చెప్పలేం.

స్థూలంగా చెప్పుకుంటే, అభివృద్ధి ప్రాధాన్యాన్ని(లేదా పనితనం ప్రాధాన్యాన్ని) గుర్తించిన పై ముఖ్యమంత్రులు యాంటీ-ఇన్ కంబెన్సీ ఫ్యాక్టర్ నూ అధిగమించగలిగారు. నిర్దిష్ట భావజాలం, క్యాడర్ బేస్ ఉన్నవిగా  వామపక్షాలకు, బీజేపీకి మధ్య ఒక పోలిక ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ముప్పై ఏళ్లపాటు అధిగమించిన యాంటీ-ఇన్ కంబెన్సీ ని, గుజరాత్ లో బీజేపీ వరసగా అయిదుసార్లు (మూడుసార్లు నరేంద్ర మోడీ నాయకత్వంలో) సాధించిన అదే ఫీటునీ ఒకే గాటన కట్టలేం. బీజేపీ ఫీటు వెనుక మారిన రాజకీయ ప్రాధాన్యాల నేపథ్యం ఉంది. గుజరాత్ ఎన్నికల ప్రచారసందర్భంలోనూ, ఎగ్జిట్ పోల్ పై చర్చలోనూ బీజేపీ నాయకులు యాంటీ-ఇన్ కంబెన్సీ ఫ్యాక్టర్ పాతబడిపోయిందని పదే పదే నొక్కి చెప్పడం మూడు నాలుగేళ్లుగా నేను చెబుతున్నదానికి  ధృవీకరణ.

ఫలితాలు వెలువడిన రోజున వార్తా చానెళ్లు(ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ చానెళ్లు) రోజంతా గుజరాత్ మీదే ఫోకస్ చేశాయి. ఏకంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కవర్ చేస్తున్నాయా అన్న అభిప్రాయం కలిగించాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశీయంగానే కాక విదేశీ దృష్టిని కూడా విశేషంగా ఆకర్షించిన మాట వాస్తవం. ఫలితాలపైనే కాక నరేంద్ర మోడీని కూడా టీవీ తెర మీద జనం ఆసక్తిగా చూశారు. నరేంద్ర మోడీ తల్లిని దర్శించి ఆశీస్సులు తీసుకోవడం, విభేదాలను పక్కన పెట్టి తన రాజకీయ గురువు కేశూభాయ్ పటేల్ ఇంటికి వెళ్ళి ఆయనకు  పాదాభివందనం చేయడం సామాన్యజనం అద్భుతంగా కనెక్ట్ అయ్యే దృశ్యాలు. సరే, రాజకీయనాయకుడు అన్నాక ప్రతి చర్య వెనుకా ఎత్తుగడలను, వ్యూహాలను అనుమానించడం సహజం. అలాంటివి ఉండచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ పై చర్యలు మానవ సంబంధాల విలువలను ప్రతిబింబిస్తాయి. రాజకీయనాయకుల నడవడిలో విలువల ప్రతిఫలనం జనానికి ఆరోగ్యకరమైన సంకేతాలను ఇస్తుంది.

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోడీ ప్రధాని పదవికి ఒక అభ్యర్థిగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది, ఎన్నికల ప్రచార సందర్భంలో ఆ ప్రచారం మరింతగా ఊపందుకుంది. ఫలితాల రోజున చానెళ్ల చర్చలో ఇంకా మారుమోగింది. మోడీని వాజ్ పేయితో కూడా ఒకరిద్దరు పోల్చారు. మొత్తం మీద సైద్ధాంతికంగానూ, 2002 అనుభవాల నేపథ్యంలోనూ మోడీని వ్యతిరేకించేవారు కూడా ఆయనను ప్రధాని పదవిలో కనీసం ఊహించుకోవడమైనా ఇక నుంచీ ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతానికి అది ఊహ మాత్రమే. లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది మూడు మాసాలు వ్యవధి ఉంది. ఈ లోపల ఏం జరుగుతుందో చెప్పలేం. యూపీఏ హ్యాట్ ట్రిక్ సాధించినా సాధించవచ్చు. ఎందుకంటే, 2009 ఎన్నికలలో ఒకే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు ఓటర్ల స్పందనలో తేడా కనిపించింది. ఉదాహరణకు యూ.పీ, గుజరాత్ లలో బీ.ఎస్.పీ, బీజేపీ లకు పట్టం కట్టిన ఓటర్లు లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు ఇచ్చారు. ఒకవేళ ఎన్.డీ.ఏ అధికారం లోకి వస్తుందనుకున్నా ఆ కూటమిలోని పక్షాలు మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించాలి. బీజేపీలోనే అంతర్గత ఏకీభావం ఏర్పడాలి. వింటున్నదే నిజమైతే ఆర్.ఎస్.ఎస్. అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు.

అవన్నీ అలా ఉంచి మోడీ ప్రధాని అయ్యే సంభావ్యతను కాసేపు ఊహించుకుందాం. మోడీ మరో వాజ్ పేయి కాలేరు. కావాలని ఆశించడమూ న్యాయం కాదు. క్లోనింగ్ ప్రక్రియ ఇంకా ఆ స్థాయికి రాలేదు. బీజేపీలో 'లిబరల్ ఫేస్' అన్న గుర్తింపు ఇప్పటికీ వాజ్ పేయి ఒక్కరికే ఉంది.  వాజ్ పేయికి కలుపుగోలు ఇమేజ్ ఉంటే, మోడీకి ఆటోక్రాట్ ఇమేజ్ ఉందన్న సంగతిని ఎవరూ కాదనలేరు. వామపక్ష తీవ్రవాదుల్లోనూ వాజ్ పేయిని అభిమానించేవారు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది పక్కన పెట్టి మోడీలో గల అనుకూలాంశాలను, ప్రతికూలాంశాలను నిష్పాక్షికంగా చూద్దాం. వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోవడం, పరిపాలనాదక్షుడుగా గుర్తింపు పొందడం, జనసమ్మోహన శక్తి ఉండడం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుండడం ప్రధానంగా ఆయన అనుకూలాంశాలు. అయితే, పాలనావ్యవస్థలో అవినీతిని ఎంతవరకు తగ్గించగలిగారు, లోకాయుక్తను ఎందుకు ఏర్పాటు చేయలేదు, అభివృద్ధిని అన్ని వర్గాలకూ చేర్చగలిగారా, గ్రామాల పరిస్థితీ, రైతుల పరిస్థితీ ఏమిటి, మానవాభివృద్ధి సూచి ఎలా ఉంది, ప్రజాస్వామిక వాతావరణం ఎలా ఉంది, మీడియా పరిస్థితి ఎలా ఉంది మొదలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికిప్పుడు వీటిపై సాధికారంగా చెప్పలేను కనుక ఆ జోలికి వెళ్ళను. అయితే ఒకటి గుర్తించాలి.  పై ప్రశ్నలలో అనేకం కాంగ్రెస్ సహా అనేక పార్టీల ప్రభుత్వాలపై కూడా ఉంటాయి కనుక మోడీని ప్రత్యేకించడం న్యాయం కాదు.

ఇక ప్రతికూలాంశాలు... '2002' సంగతి తెలిసినదే. ఆ చీకటిగతం ఆయనను పదేళ్లుగా నీడలా వెంటాడుతూనే ఉంది. దానినుంచి తప్పించుకోడానికి ఇటీవలి కాలంలో ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూవచ్చారు. విచారాన్ని స్పష్టంగానో, అస్పష్టంగానో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీ జాతీయనాయకులు కూడా అదొక దురదృష్టకర ఘటన అనీ, దానిని మరచిపోదామనీ కొంతకాలంగా అంటున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన న్యాయప్రక్రియ పూర్తిగా ముగియలేదు కనుక ఆ కోణాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. అయితే బీజేపీకానీ, మోడీ కానీ 2002 పై అడపా తడపా విచార సంకేతాలను జారీచేయడంతో సరిపెట్టకుండా  ఇంకొంచెం ముందుకు వెడదామా వద్దా అన్న డోలాయమానంలోనే ఇప్పటికీ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అది, 2002 ఘటనలకు బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం! మోడీకే కాక, పార్టీ మొత్తానికి(ఇప్పటికంటే ఎక్కువ) ఆమోదయోగ్యత తెచ్చిపెట్టే అంశాలలో అదొకటి అవుతుంది. 1984లో ఢిల్లీలో సిక్కు మతస్థుల ఊచకోతపై కాంగ్రెస్ బహిరంగంగా విచారం వ్యక్తం చేసిన ఉదాహరణ ఉండనే ఉంది.

ఇటువంటి సందిగ్ధాన్ని బీజేపీ నాయకత్వం తన భావజాలం విషయంలోనూ చాలాకాలంగా ఎదుర్కుంటోంది. విభజన స్వభావం కలిగిన తన మౌలిక భావజాలానికి, దేశంలోని అన్ని వర్గాల సమ్మతీ అవసరమైన రాజకీయాధికారానికీ మధ్యనున్న వైరుధ్యాన్ని ఆ పార్టీ 2004 ఎన్నికల ఓటమి తర్వాతనుంచీ మరింత స్పష్టంగా గుర్తించడం ప్రారంభించింది. అద్వానీ జిన్నాను సెక్యులర్ వాదిగా పేర్కొనడం అందులో భాగమే. అలాగే, బీజేపీ గత ఇరవయ్యేళ్ళ రాజకీయప్రస్థానంలో అయోధ్య నినాదం  నుంచి అభివృద్ధి నినాదానికి మళ్లిన క్రమం మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అప్రకటితంగా, చాపకింద నీరులా జరిగిన ఆసక్తికరమైన ఆ పరివర్తనను ఎంతమంది గమనించారో తెలియదు. దానిపై పెద్దగా చర్చ లేకపోవడం ఆ అభిప్రాయానికి కారణం. అయోధ్య,  ఇతర హిందుత్వ అజెండా  ప్రస్తావన ఏ బీజేపీ నాయకుని నోటా ఈ రోజున వినిపించడం లేదు. ప్రతిపక్షస్థానం నుంచి అధికారపక్ష స్థానానికి ఎదిగిన తర్వాత క్రమంగా బీజేపీలో వచ్చిన మార్పు ఇది. అయితే ఈ మార్పును కూడా బహిరంగంగా అంగీకరించడానికి బీజేపీ ఇప్పటికీ సిద్ధంగా లేదు.

మోడీలో ఒక సమర్థ ప్రధానిని చూసి మెజారిటీ జనం ఆయనకు ఆమోదముద్ర  వేయాలంటే నా ఉద్దేశంలో ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి,  బీజేపీ ఈ సందిగ్ధాల నుంచి బయటపడాలి. అయితే, అంతమాత్రంతో సరిపోదు. బీజేపీ భావజాలంతో ప్రజాస్వామిక వాతావరణానికీ, ప్రజాస్వామిక హక్కులకు, సాంస్కృతిక స్వేచ్చకు పొసగదన్న అభిప్రాయం చాలామందికి ఉంది. అది అపోహా, నిజమా అన్న చర్చ లోకి నేనిప్పుడు వెళ్ళను. ఆ అభిప్రాయం సరికాదనే స్పష్టమైన సంకేతాలను ఆ పార్టీ అందించాలి. అలాగే సమ్మిళిత వృద్ధి(inclusive growth)కీ హామీ ఇవ్వాలి, ఒక్క మాటలో చెప్పాలంటే నేటి రైటాఫ్ సెంటర్ లేదా లెఫ్టాఫ్ సెంటర్ పార్టీల తరహా లోకి అది మారాలి. తను కోల్పోయిన వాటికి ప్రత్యామ్నాయంగా అది అవినీతికి తావులేని, విలువలతో కూడిన రాజకీయాలను; ఈ దేశ సామాన్యప్రజానీకంతో కనెక్ట్ అయ్యే ఆదర్శవంతమైన వ్యవహరణను తన ప్రత్యేక ప్యాకేజ్ గా ముందుకు తేవచ్చు.

బీజేపీలో అప్రకటితంగా ఇప్పటికే వస్తున్న పరివర్తన సరళిని గమనిస్తే, ఇది  గొంతెమ్మ కోరిక అనిపించదు. కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ  పైన చెప్పిన సందిగ్ధాలనుంచి బయటపడి, తనపట్ల వ్యతిరేకులలో ఉన్నభయాలను తొలగించి వాజ్ పేయి తరహాలో కలుపుగోలు స్వభావం గల ఒక సరికొత్త మోడీని అవతరింప జేయగలిగితే , మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడానికి అర్హుడే. యూపీఏ లో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేని నేపథ్యం నుంచి అంటున్న మాట ఇది.

 అదీగాక ఒకరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఇప్పటి మోడీయే ప్రధాని అయ్యే సంభావ్యతనూ నేను కాదనడం లేదు.

దీనిని ఒక విష్ ఫుల్ థింకింగ్ గానే తీసుకోవాలని బీజేపీ అభిమానులను కోరుతున్నాను. బీజేపీ ఎందుకు మారాలి అన్న చర్చను కానీ, సిద్ధాంత చర్చను కానీ తీసుకురావద్దని మనవి.





Monday, December 17, 2012

తెలుగు సభల్లో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా!?


 గాంధీజీ తర్వాత పారిశుద్ధ్యం గురించి మాట్లాడిన/మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా ఉన్నారా అని ఒక బ్లాగులో ప్రశ్నించాను. అప్పుడు నాకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జై రామ్ రమేశ్ పేరు గుర్తురాలేదు. పూర్తిగా పారిశుద్ధ్యం గురించి కాకపోయినా, దానితో సంబంధమున్న వ్యక్తిగత మరుగుదొడ్ల  అవసరం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య మీడియా దృష్టిని  ప్రముఖంగా ఆకర్షించాయి. హర్యానాలో కాబోలు మాట్లాడుతూ, 'వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం లేని ఇంటికి ఆడపిల్లను ఇవ్వ'ద్దని ఆయన సలహా ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో అదే వ్యాఖ్యను పునరుద్ఘాటించారు. ఆ సందర్భంలోనే  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ఏకరవు పెట్టిన వివరాలను ఆయన బహిరంగంగా తీసిపారేసినట్టు వార్త వచ్చింది. 'మీ ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉందా అని  అనంతపురం జిల్లాలో పదిమంది మహిళలను అడిగితే, లేదని ఏడుగురు మహిళలు జవాబిచ్చా'రని ఆయన చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండడాన్ని అభివృద్ధికి  ఒక సూచిగా నొక్కిచెప్పినందుకు ఆయన అభినందనీయుడు.

వ్యక్తిగత మరుగుదొడ్లకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఎప్పటినుంచీ ప్రచారం జరుగుతోందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో తలమునకలవుతారు. ఎప్పుడో వందేళ్ల క్రితమే వ్యక్తిగత మరుగుదొడ్డి అవసరాన్ని కందుకూరి వీరేశలింగంగారు ఒక నవలలో(సత్యవతీ చరిత్రము?) ప్రబోధించారు. స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో కమ్యూనిష్టులు కూడా పారిశుద్ధ్యం అవసరాన్ని ప్రచారం చేసేవారని మహీధర రామమోహన రావు గారి నవలలు చదివితే అర్థమవుతుంది. అటువంటి కమ్యూనిష్టులు సైతం ఈ రోజున పారిశుద్ధ్యం గురించి మాట్లాడకపోవడం, ఉద్యమించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  పదేళ్ళ క్రితం రాష్ట్రంలో పాదయాత్ర జరిపిన ప్రముఖ నాయకుడు కానీ, ఇప్పుడు జరుపుతున్న ప్రముఖ నాయకుడు కానీ పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి, తమ ప్రసంగాలలో ప్రస్తావించిన  దాఖలాలు లేవు. శాసనసభలో ఈ అంశంపై ఇటీవలికాలంలో గట్టిగా చర్చ జరిగిన సాక్ష్యం కూడా లేదు. ఒకవేళ ఈ అభియోగాలు  తప్పని నిరూపించే  వివరాలు ఎవరైనా అందిస్తే వినమ్రంగా స్వీకరించడానికి నేను సిద్ధమే.

జై రామ్ రమేశ్ అభినందనీయుడే. అయితే ఆయన కూడా సమస్యను పాక్షికంగానే ప్రదర్శిస్తున్నారు. మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యం గురించే మాట్లాడుతున్నారు. రోడ్లు, నదీతీరాలు, కాలువగట్లు, చెరువుగట్లు  బహిరంగ పాయిఖానాలుగా మారిన దుస్థితినుంచి ఊళ్లను కాపాడాలంటే  వ్యక్తిగత మరుగుదొడ్డి ప్రతి ఒకరికీ అవసరమే. పిల్లలను, మగవారిని మినహాయించడానికి వీలు లేదు. అలాగే,  కుళ్లి కంపు కొట్టే చెత్త గుట్టల వంటి ఇతర పారిశుద్ధ్య సమస్యల గురించి ఆయన మాట్లాడుతున్నట్టు లేదు. నన్నడిగితే, అన్ని రాజకీయపక్షాల నాయకులూ  పాదయాత్ర కాకపోయినా, కనీసం నెలలో పది రోజులు ఊళ్లలో మకాం పెట్టాలంటాను. అప్పుడే ఊళ్ళు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, ఎలా తగలబడుతున్నాయో ప్రత్యక్షంగా అర్థమవుతుంది.

అన్నట్టు ఇంకో విషయం మీలో ఎంతమందికి తెలుసు?! కేంద్రంలో మంచినీరు, పారిశుద్ధ్యాలకు ఒక మంత్రిత్వశాఖ ఉందట. ఈ శాఖ కింద 1999లో 'టోటల్ శానిటేషన్ కేంపెయిన్'(టీసీఎస్) పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారట. దీనికి ఆ తర్వాత 'నిర్మల్ భారత్ యాత్ర' అని పేరు మార్చారట. 1999-2012 మధ్యకాలంలో ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 81, 96, 510 మరుగుదొడ్లు నిర్మించారట. వీటిలో 80, 755, 08 వ్యక్తిగత మరుగుదొడ్లట. 962 మాత్రమే సాముదాయిక మరుగుదొడ్లట. ఈ పథకంలో భాగంగా స్కూళ్ళలో కూడా మరుగుదొడ్లను నిర్మించారట. అయితే, వాటికి చాలా చోట్ల తాళం వేయడమో లేదా టీచర్లు వాడుకోవడమో జరుగుతోందట. ఈ సంవత్సరాంతానికి నూటికి  నూరుశాతం గ్రామాలలోనూ మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని నిర్ణయించుకున్న లక్ష్యం. మన రాష్ట్రంలో ఇప్పటికీ 67 శాతం మేరకే కృతకృత్యులయ్యారని లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవంగా ఊళ్లలోకి వెళ్ళి చూస్తే ఈ పథకం అమలుకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించవు. అసలు అలాంటి పథకం ఉన్నట్టే చాలామందికి తెలియదు. పథకం గురించి ప్రచారం పూర్తిగా లోపించిందని దానిని సమీక్షించిన పండితులు పెదవి విరుస్తున్నారు.  నేను ఇటీవల వెళ్ళిన ఒక ఊళ్ళో నిర్మల్ గ్రామ్ పురస్కార్ అని రాసి ఉన్న ఒక బోర్డు కనిపించింది. బహిరంగ కాలకృత్యాలు నిషిద్ధమనీ, ఉల్లంఘిస్తే శిక్షించబడతారనీ దానిమీద రాసి ఉంది. విచిత్రమూ విషాదమూ ఏమిటంటే ఆ బోర్డుకు దగ్గరలోనే యథేచ్ఛగా బహిరంగ కాలకృత్యాలు జరుగుతున్నాయి.

ఈ నెల 27 నుంచీ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఆ సభల్లో తెలుగు సంస్కృతీ, సాహిత్యాలు, చరిత్ర గురించి మహోద్ఘాటనలు ఎలాగూ జరుగుతాయి.  300 మంది కవి రచయితలను ఆహ్వానిస్తున్నట్టు ఇప్పటికే వార్త. కానివ్వండి.  అదే సమయంలో ఆంధ్రరాష్ట్రం అంతా ఒక పెద్ద బహిర్భూమిగా మారిన సంగతిని ఆ మహాసభల్లో చర్చకు పెడతారా? దాని ప్రక్షాళన దిశగా తీర్మానం చేస్తారా??

పారిశుద్ద్య సమస్యతోపాటు పోషకాహారలోపమనే మరో సమస్యకూడా తెలుగు ఊళ్లను చెదపురుగులా తొలిచివేస్తోంది. దాని గురించి మరోసారి....

(సంబంధిత బ్లాగులు: 1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్  కావాలి?  2. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి  3. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?)

తాజా కలం:  'అన్ని రాజకీయపక్షాల నాయకులూ నెలలో పదిరోజులు ఊళ్లలో మకాం పెట్టాలనీ, అప్పుడే ఊళ్ళు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, ఎలా తగలబడుతున్నాయో ప్రత్యక్షంగా అర్థమవుతుందనీ' పైన రాశాను. తర్వాత గుర్తొచ్చింది, హైదారాబాద్ పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదని. ఇక్కడ కూడా చెత్త, కుళ్లిన ఆహారపదార్థాలు రోడ్ల మీద పొర్లి ప్రవహిస్తూ పరిసరాలను దుర్గంధభూయుష్టం చేస్తూనే ఉన్నాయి. చెత్త పట్టికెళ్లే కార్పొరేషన్ వాహనాలు దుర్గంధాన్ని దారి పొడవునా మోసుకెడుతూ కొంత చెత్తను రోడ్డు మీద వెళ్ళే జనాల నెత్తిన కూడా వేసి పోతుంటాయి.  గార్బేజ్ లిఫ్టింగ్ లో నాగరిక పద్ధతులను అమలు చేయడం కాదు సరికదా, దానిని తీసుకెళ్లే వాహనాలకు కనీసం మూత వేయాలన్న స్పృహ కూడా లేని పరమ అనాగరిక, అసహ్య పాలన రాజధానిలో నడుస్తోంది. ఈ పరిస్థితిలో ఊళ్ళ గురించి చెప్పుకోవడం వల్ల కంఠశోష తప్ప ప్రయోజనం ఏముంటుందనీ అనిపించే మాట నిజం. అయినాసరే, రేపటి మీద ఆశతో సమస్యను అప్పుడప్పుడైనా గుర్తుచేసుకోకా తప్పదు.  

Tuesday, December 11, 2012

ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?!

'హైదరాబాద్ ఎవడబ్బ సొత్తూ కాదు; అందరి అమ్మ సొత్తు' అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. 'రాష్ట్రాన్ని విభజించడమంటూ జరిగితే సీమాంధ్రులు హైదారాబాద్ లో అడుగుపెట్టలే'రని కూడా అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తారా, కలిపి ఉంచుతారా అన్నది కాలానికి విడిచిపెడదాం. సీమాంధ్ర నాయకులు ఎంతసేపూ హైదారాబాద్ ను పట్టుకుని వేళ్లాడుతున్నారే...దానిని మాత్రం  సీమాంధ్ర  ప్రజలు ప్రశ్నించవలసి ఉంది.

బాబూ లగడపాటి గారూ...ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. ఈ రాష్ట్రంలో ఇంకా వందలాది గ్రామాలూ, పట్టణాలూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎక్కడా జీవకళ అంటూ లేకుండా వెల వెల పోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో మురుగుతో దోమలతో అసహ్యంగా దీనంగా దరిద్రంగా ఉన్నాయి. ఎక్కడివరకో ఎందుకు? మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయవాడ నగరాన్నే తీసుకోండి. ఏ పేటలోనైనా ఒక్క రోజు ఫ్యానూ, ఏసీ లేకుండా పడుకుని చూడండి. దోమలతో నిత్య జాగారం చేసే మీ నియోజకవర్గ ప్రజల దుస్థితి ఎలాంటిదో అర్థమవుతుంది. ఎప్పుడైనా మీరు కృష్ణ స్నానానికి వెళ్ళి చూసారా? మానవ మల మూత్రాలను దాటుకుంటూ వెళ్లలేక స్నానం కోరిక విరమించుకుని ఇంటికి తిరిగి వెళ్ళి పోతారు. ఇది స్వానుభవంతో చెబుతున్న మాట.

బహిరంగ మల మూత్రాల సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్న ప్రభుత్వాధినేతలు, ప్రజా ప్రతినిధులు రేపు తమ సాఫల్యాల గురించి, రాజకీయ జీవితం గురించి తమ పిల్లలకు, మనవలకు ఏం చెప్పుకుంటారు?

మీ నగరంలో పురపాలకసంఘం అంటూ (కార్పొరేషన్ అనాలి కాబోలు. తీరు మారకపోయినా పేరు మారుతూ ఉంటుంది) ఒకటున్న ఆనవాలు చాలా చోట్ల కనిపించదు. ఆ సంఘంతో, అది చేయవలసిన పనిని మీరు చేయించలేరు. ఓపెన్ డ్రైనేజీల మురికి కూపాలనుంచి జనారోగ్యాన్ని కాపాడలేరు. మీ పెరడు ఎలా ఉందో పట్టించుకోకుండా  హైదరాబాద్ కోసం మీరు పోరాడుతున్నారు. మీరే కాదు, మీ సీమాంధ్ర సోదర నాయకులు కూడా డిటో. ఇదేమైనా న్యాయంగా ఉందా, చెప్పండి!

పారిశుద్ధ్య లోపమే కాదు మహాశయా...మీ ప్రాంత ప్రజానీకంలో...ఆడా మగా పిల్లా పెద్దా...అందరిలో పోషకాహారలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆంధ్ర ప్రాంతం అన్నివిధాలా అభివృద్ధి చెందిందన్న అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా ఉంటే అది ఎంత అవాస్తవమో వీరిని చూస్తే తెలిసిపోతుంది. మీ నియోజకవర్గంలో పోషకాహారలోపంతో బక్క చిక్కి జీవచ్చవాలను తలపించే  ఇలాంటి జనాన్ని ఎందరినో చూసి ఉంటారు. వారి గురించి ఆలోచించారా? మీ పార్టీ ప్రభుత్వం కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నా వీళ్ళు ఇలా ఎందుకున్నారో పట్టించుకున్నారా?  వీరికోసం ఏమైనా చేయాలని మీకు అనిపించడం లేదా? విజయవాడను పచ్చగా పరిశుభ్రంగా అన్నివిధాలా వాసయోగ్యంగా మార్చడానికి మీరేమైనా ప్లాను తయారుచేశారా?

 మీరు, మీ సోదర నాయకులు, జనమూ కలసి మీ ప్రాంతంలో మీ హైదరాబాద్ ను మీరే  సృష్టించుకోవచ్చు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం లాంటి పట్టణాలు  మీకున్నాయి. ముందు వీటిని అధునాతన పారిశుద్ధ్య సదుపాయాలు వగైరాలతో అభివృద్ధి చేసుకుని ఉపాధి కేంద్రాలుగా  వాసయోగ్యాలుగా మలచుకుంటే; వాటి నుంచి మీదైన హైదరాబాద్ తప్పకుండా అవతరిస్తుంది.

తమిళులకు, కన్నడిగులకు, మరాఠా ప్రజలకు, బెంగాలీలకు, ఇంకా ఎంతోమందికి ఉన్నట్టు మీకంటూ ఒక మహానగరం లేని లోటును ఎప్పుడు గుర్తిస్తారు?  ఎప్పటికి పూరించుకుంటారు?  ఉన్న నగరాలను, పట్టణాలను పాడు పెట్టి ఒకే ఒక నగరాన్ని పట్టుకుని ఎందుకు పాకులాడుతున్నారు?

కాదు, హైదరాబాద్ నగరం మనదే నని మీరంటారు. అది తెలుగువాళ్లందరి ఉమ్మడి సొత్తు అంటారు. వాళ్ళు కాదంటారు. పోనీ ఏదో విధంగా ప్రస్తుతానికి రాజీపడినా; మాకు ఒక రాజధాని స్థాయి నగరం లేకపోయిందే నన్న చింతా చిన్నతనం సీమాంధ్ర ప్రజానీకాన్ని పీడిస్తూనే ఉంటాయి. కనుక ఎప్పటికైనా హైదరాబాద్ స్థాయి నగరాలను ఆ రెండు ప్రాంతాలవారూ నిర్మించుకోనవసరం లేదా?

ఆ దిశగా ఇప్పటికైనా కనీసం ఆలోచనైనా ఎందుకు ప్రారంభించరు?


Sunday, December 9, 2012

వోటు ఎగ్గొట్టిన ఆ ముగ్గురూ...

ఈ బ్లాగ్ ప్రారంభించాక గత రెండున్నర మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒకే ఒకటి (ఆంధ్ర రాజకీయాలు: ఒక ఆబ్సర్డ్ డ్రామా) మించి  రాయలేదు. ఆంధ్ర రాజకీయాలలో ఉత్తేజపరిచేవీ, ఉత్సాహపరచేవీ ఏవీ లేకపోవడం ఒక కారణం.  కనీసం చీల్చి చెండాడేటంత స్థాయీ, సరుకూ కూడా వాటిలో  లేకపోవడం ఇంకో కారణం. 'కలం' శోష తప్ప అందులో ఏమీ ఉండదు. జాతీయరాజకీయాలు ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉండడం కూడా ఒక కారణమైతే కావచ్చు. ఒకవైపు ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇలా మాట్లాడడం... మీకే కాదు, ఒక తెలుగువాడిగా నాకూ బాధగానే ఉంటుంది. అయినా ఎంత నిష్టురంగా ఉన్నప్పటికీ, చెప్పుకోవలసిన సమయంలో  కొన్ని నిజాలు చెప్పుకోక తప్పదు.

జాతీయస్థాయి నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా అనామకంగా, ఆర్భకంగా కనిపిస్తుంది. కేంద్రంలో వరసగా రెండుసార్లు యూపీఏ అధికారంలోకి రావడానికి కావలసిన సంఖ్యాబలాన్ని సమకూర్చిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం. అయినాసరే, జాతీయ కాంగ్రెస్ లో మంచి 'విజిబిలిటీ' ఉన్న నాయకుడు తెలుగువాళ్లలో ఒక్కడూ కనిపించడు. కేంద్రం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒకడూ తద్దినం పెట్టేవాడి తమ్ముడిలానే కనిపిస్తాడు. రాష్ట్రానికి వచ్చేసరికి ప్రతివాడూ పులైపోతాడు. జైపాల్ రెడ్డి పార్లమెంటేరియన్ గా, వివాదరహితుడిగా, స్థాయి కలిగిన నేతగా ఒక ఇమేజ్ ఉన్నవారే. కానీ ఆయన ఎక్కువగా కనబడరు, వినబడరు. కాంగ్రెస్ కు ముప్పైమందికి పైగా ఎం.పీల నిచ్చిన ఈ రాష్ట్రం నుంచి క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి నిన్నటివరకూ ఆయన ఒక్కడే.

పోనీ ఇతర పార్టీలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందా అంటే, అదీ కనిపించదు. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీలో ఒక్క వెంకయ్య నాయుడే కాస్త నదురుగా కనిపిస్తుంటారు. అది కూడా చాలా అరుదుగానే. ఆయనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేంద్రస్థాయిలో ఎప్పుడైనా లిప్తకాలంపాటు ఆయన అలా తళుక్కు మంటుంటారేమో కానీ రాష్ట్రంలో మాత్రం మసక మసకే. ఇక సీపీయం నేత సీతారాం ఏచూరి కేంద్రస్థాయిలో కొంత గుర్తింపు ఉన్నవారే. అయితే తెలుగువాడే అయినా ఆయన పాదాలు తెలుగునాట ఎంత బలంగా ఆనాయో చెప్పలేం. ఢిల్లీ మనిషిగానే ఆయనను గుర్తించక తప్పదు. సురవరం సుధాకర్ రెడ్డి అవడానికి సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్నాతనకు ముందు ఆ హోదాలో ఉన్న ఏ.బీ. బర్దన్  ధాటిలో దూకుడులో విజిబిలిటీలో  సహస్రాంశం కూడా సురవరంలో కనిపించదు. కనిపించాలని రూలేమైనా ఉందా అని అడిగితే నేనేమీ చెప్పలేను.

మరి తెలుగుదేశం...?! నిజానికి దేవేందర్ గౌడ్ గురించి రాయబోయి ఇంత శాఖాచంక్రమణం చేశాను. రాయడానికి ఏమీ లేదనుకునే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్పృశించక తప్పని పరిస్థితిని కల్పించింది ఆయనే. ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు...సుజనా చౌదరి, గుండు సుధారాణి. అయినాసరే ముఖ్య ప్రేరణ దేవేందర్ గౌడే!

దేవేందర్ గౌడ్ ఎంత రాజకీయ జీవితం చూశారు! రాజకీయవిజ్ఞత, వివేకం అవసరమైన ఎన్ని కీలక పదవులు నిర్వహించారు! తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఆయన సెకండ్ ఇన్ కమాండ్ అనిపించుకున్న రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి రాజ్యసభకి  వెళ్ళేసరికి ఏమైంది?  విజ్ఞతా వివేకాలు ఒక్కసారిగా జీరో అయిపోయాయి. ఒక కీలకమైన రాజకీయ ప్రాముఖ్యం కలిగిన వోటు వెయ్యవలసిన రోజున  రాజ్యసభకు వెళ్లకుండా ఎగ్గొట్టి  ఓ సుజనా చౌదరితోనూ, ఓ గుండు సుధారాణితోనూ సమానం అయిపోయారు. రాష్ట్రం దాటితే మనవాళ్లు సైలెంట్ అయిపోవడమే కాదు, పార్లమెంట్ సభ్యత్వాన్ని విరామ సంగీతంగా, ఆటవిడుపుగా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా  తీసుకుంటారనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

దేవేందర్ గౌడ్ లాంటి సీనియర్ కి రాజకీయంగా, పార్టీ పరంగా ఎఫ్.డీ.ఐ వోటు ఎంత కీలకమో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అది కేవలం ఎఫ్.డీ.ఐకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో వేసే వోటు కాదు. రాజకీయ సంకేతాలను, రేపటి సమీకరణలను సూచించే వోటు. పార్టీల కమిట్ మెంటును, కప్పదాట్లను కూడా  వెల్లడించే  వోటు. వామపక్షాలతో, తృణమూల్ కాంగ్రెస్ తో కలసి వోటు వేయని టీడీపీ సభ్యులు రేపు ఏ మొహం పెట్టుకుని థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో 'థర్డ్ ఫ్రంట్' నాయకులకు మొహం ఎలా చూపిస్తారు? వాళ్ళతో గ్రూప్ ఫోటో ఎలా దిగుతారు?

ఎఫ్.డీ.ఐ వోటు అధికార/ప్రతిపక్షాలు ఉభయులకూ ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత జీవన్మరణసమస్యగా మారిందో కొన్ని రోజుల ముందునుంచే మీడియా ఊదరగొడుతోంది. అందులో కొంత అతి ఉంటే ఉండచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద జనం దృష్టి, మీడియా చూపు రాజకీయపక్షాల మీద ఫోకస్ అయి ఉన్నాయి. చివరికి కాంగ్రెస్ సభ్యులలో ఒకరు వీల్ చైర్లో, ఇంకొకరు స్ట్రెచర్ మీద వచ్చి వోటు వేస్తే, రెండు కాళ్లతో   నడవగలిగిన స్థితిలో ఉండి కూడా మన  దేవేందర్ గౌడ్, ఆయన పార్టీ సహచరులు ఇద్దరు సభకు వెళ్లకుండా ముఖం చాటేశారు!

పైగా తను వోటు వేయకపోవడాన్ని అంత 'వివాదాస్పదం' చేయడంపై గౌడ్ 'హాశ్చర్యం' వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీర్మానం ఓడిపోతుందని ముందే తెలిసిపోయింది కనుక తను వోటు వేయకపోయినా నష్టముండదనే ఉద్దేశంతో అధినేత అనుమతితోనే గైరు హాజరయ్యానని ఆయన చెబుతున్నారు. అదే నిజమైతే అధినేత అనుమతి ఎలా ఇచ్చారో మరో ఆశ్చర్యం. గౌడ లానే మిగిలిన పార్టీలూ అనుకుని వోటింగ్ కు గైరుహాజరవచ్చు కదా! ఎందుకు కాలేదు?

మిగిలిన ఇద్దరూ తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరినట్టు వార్త. అధినేత వాళ్ళను క్షమించి విడిచిపెడితే, నేరస్తులు ముగ్గురు కాదు, ఆయనతో కలుపుకుని నలుగురు అవుతారు. కనుక రాజీనామా చేయించడం ఉన్నంతలో పరువు నిలుపుకునే మార్గం. రాజ్యసభకు రాజీనామా చేయడం శిక్షగా వాళ్ళూ భావించనవసరం లేదు. రాజ్యసభలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే ఆ కాలాన్ని సొంత వ్యాపారాలకు నిక్షేపంగా వినియోగించుకోవచ్చు!




Thursday, December 6, 2012

ఎఫ్.డీ.ఐ చర్చ: కొన్ని ప్రశ్నలు, సందేహాలు

చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ మంచిదా, చెడ్డదా అన్నది చటుక్కున తేల్చి చెప్పడం కష్టమని కిందటి బ్లాగ్ లో అన్నాను. పార్లమెంట్ లో రెండు రోజుల చర్చను గమనించిన తర్వాత కూడా ఈ  అభిప్రాయాన్ని మార్చుకోవలసిన అవసరం కనిపించలేదు. అయితే  ఏ విషయంలోనైనా వెంటనే అభిప్రాయం చెప్పే వాళ్ళను మీరు  చూస్తుంటారు కనుక  ఆ జాబితాలో చేరని నా మాటలను కేవలం పైకి వినబడేలా చేసే ఆలోచన(లౌడ్ థింకింగ్)గానే తీసుకుంటారని భావిస్తున్నాను.

రాజ్యసభలో అరుణ్ జైట్లీ, సీతారాం ఏచూరీల ప్రసంగాలు విన్న తర్వాత చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ ని అనుమతించడంవల్ల నిజంగానే చాలా నష్టాలు ఉంటాయనిపించింది. నిజం చెప్పాలంటే భయం వేసింది. ఎఫ్.డీ.ఐని అనుమతిస్తే చిన్న చిన్న మధ్య దళారులు పోయి సూపర్ దళారులు అవతరిస్తారని జైట్లీ అన్నారు. ప్రస్తుతం దేశంలో పాల వ్యాపారాన్ని తీసుకుంటే, 60 శాతానికి పైగా ఆదాయం ఉత్పత్తిదారులకు అందుతుంటే, మిగిలిన కొద్ది శాతమే దళారులకు,ఇతరులకు పోతోందనీ;  అదే పెద్ద పెద్ద రీటెయిల్ కంపెనీలున్నఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాల్లో సరిగ్గా దీనికి తలకిందులుగా జరుగుతోందనీ అన్నారు. మన దేశంలో చక్కెర పరిశ్రమలో మాత్రమే చెరకు రైతులకు, ఫ్యాక్టరీలకూ మధ్య దళారీ వ్యవస్థ లేదనీ, అయినా సరే, చెరకు రైతులు నష్టాల ఊబిలోనే ఉండిపోతున్నారనీ అన్నారు. వాల్ మార్ట్ లు, టేస్కోలు, కర్రెఫోర్లు మౌలిక సదుపాయాలను కల్పించవనీ, ఆ పని ప్రభుత్వమే చేయాలనీ అన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చెడిపోయే శాతాన్ని ప్రభుత్వం చాలా ఎక్కువ చేసి చెబుతోందనీ; వాస్తవానికి అది చాలా తక్కువ శాతమనీ అంటూ కొన్ని ప్రభుత్వ సంస్థల గణాంకాలను ప్రస్తావించారు. రీటెయిల్ రంగంలోకి ఎఫ్.డీ.ఐని అంగీకరిస్తే అమెరికా, ఇంగ్లండ్, ఫ్రెంచ్ కంపెనీలు దేశంలో తిష్టవేసి చైనా ఉత్పత్తులను మనకు అమ్ముతాయనీ, మనవాళ్లు సేల్స్ బాయస్ గా , సేల్స్ గర్ల్స్ గా మాత్రమే ఉండిపోతారనీ అన్నారు. అసంఘటిత చిల్లర వ్యాపార రంగం నిజానికి చిల్లర వ్యాపారులకు సేఫ్టీ వాల్వ్ అని కూడా అన్నారు.

చివరగా జైట్లీ ఇంకో మాట కూడా అన్నారు...దయచేసి 'ప్రస్తుత పరిస్థితులలో' ఎఫ్.డీ.ఐ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండని దాని సారాంశం. అంటే మరో సమయంలో ఎప్పుడో ఎఫ్.డీ.ఐకి తలుపు తెరిచే అవకాశాన్ని తమ పార్టీకి తెరచి ఉంచుకున్నారన్న మాట. ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ఎఫ్.డీ.ఐ అనుమతికి ఇదే తగిన సమయమని భావిస్తే, విపక్షం ఇది తగిన సమయం కాదంటోంది. ఎవరి అంచనా సరైనదనుకోవాలి?

సీతారాం ఏచూరీ కూడా ఇంతే భీతావహ దృశ్యాన్ని చూపించారు.

అయితే, ఎఫ్.డీ.ఐ వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయని విన్న తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు, సందేహాలు అలాగే ఉండిపోయాయి.

1. ఇప్పటికే దేశీయంగా రిలయెన్స్ ఫ్రెష్, మెట్రో లాంటి బడా రీటెయిల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటి వల్ల చిన్న చిన్న కిరాణా వర్తకులకు, రోడ్ల మీద తిరుగుతూ కూరగాయలు అమ్ముకునేవారికి నష్టం జరగడం లేదా? 'ఎఫ్.డీ.ఐ' అన్న మాటే లేదు తప్ప ఇది కూడా 'బడా వ్యాపారులు వర్సెస్ చిన్నవ్యాపారు' ల పరిస్థితే కదా?
2. రోడ్ల మీద పాదచారులకు, సైకిళ్ళమీద వెళ్ళే వారికి అసౌకర్యంగా ఉంటున్నాసరే, కార్ల సంఖ్య పెరిగిపోవడానికి అవకాశమిస్తున్నాం. బీజేపీ హయాంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం సాగించారు. ఆ విషయాన్ని ఆ పార్టీ సగర్వంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. నాలుగు లేన్ ల రోడ్ల నిర్మాణం జరిగిన పల్లెలకు వెళ్ళి చూడండి. కార్లు, లారీలే తప్ప ఎడ్ల బండ్లు కనిపించడంలేదు. గతంలో రోడ్డు దాటడానికి వీలుండేది. డివైడర్ల వల్ల ఇప్పుడా అవకాశం పోయింది. దృశ్యాన్ని ఇంకో వైపు నుంచి చూడండి...  పాదచారులు, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళూ ఎప్పటికీ అలాగే ఉండిపోవడం లేదు. బైక్ కొనుక్కునే స్థాయికీ, కారు కొనుక్కునే స్థాయికీ ఎదుగుతున్నారు. అలాగే, అసంఖ్యాక ప్రజానీకానికి అందుకొనే స్థోమత లేకపోయినా ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూళ్ళు, సాంకేతిక కళాశాలలు అవతరిస్తూనే ఉన్నాయి. అయినా జరుగుతున్నదేమిటి? రిక్షా కార్మికుడు, రోజు కూలీ దగ్గరనుంచి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆ స్థాయి విద్య అందించాలనుకుంటున్నారు. ఈ మొత్తం సన్నివేశం నుంచి బడా చిల్లర వ్యాపార సంస్థలను మాత్రమే మినహాయించాలనడంలో సహేతుకత ఏమిటి?(ఎఫ్.డీ.ఐ అనే మాటను కాసేపు వదిలేద్దాం)
3. ఇందులో చిన్న చిన్న చిల్లర వ్యాపారుల ఉపాధి సమస్య ఇమిడి ఉంది కనుక పై అంశాలతో ఈ సమస్యను పోల్చలేమని మీరు అనచ్చు. అయితే ఏ కుటుంబమూ ఈ రోజున ఒకే ఉపాధిని పట్టుకుని వేళ్ళాడడం లేదన్న సంగతినీ గుర్తించాలి. 'ఒక చిల్లర వ్యాపారి కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులు ఉంటారనీ, ఎఫ్.డీ.ఐ వల్ల వాళ్ళందరికీ ఉపాధి పోతుందనీ" అంటున్నారు. జరిగేది ఏమిటంటే, అయిదుగురూ చిల్లర వ్యాపారమే చేయాలనుకోరు. చదువులు వగైరాలతో ఇప్పటి ఉపాధి కంటే ఉన్నతమైన ఉపాధికి మళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ అదే ఉపాధి మార్గం లో ఉన్నా తండ్రిని మించి వ్యాపారాన్ని వృద్ధి చేసే మార్గాలు తొక్కుతారు. ఆ క్రమంలో వాళ్ళు కూడా ఏ సూపర్ బజార్ స్థాయికో వెళ్లాలని అనుకోవచ్చు. ఇంకో సన్నివేశానికీ అవకాశం ఉంది. ఒక కిరాణా వ్యాపారి కొడుకు పై చదువులు చదివి ఏ విదేశంలోనో ఉంటూ వాల్ మార్ట్ లో షాపింగ్ చేస్తూ ఉండచ్చు. ఇలా అనడం ద్వారా   సమస్యను చులకన చేస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఊర్ధ్వచలనం ఇలాగే సంభవిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా ఎఫ్.డీ.ఐకి వ్యతిరేకంగా వాదించేవారు సమాజాన్ని ఒక చలనశీల దృక్పథం నుంచి చూసే బదులు నిశ్చల చిత్రంగా చూస్తున్నారా?
4. చెడిపోయే పండ్లు, కూరగాయలు వగైరాల శాతం తక్కువే నని వాదించడం గమనిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. ధాన్యం వగైరాలు నిల్వ చేయడానికి తగినన్ని గోదాములు, శీతల గిడ్డంగులు లేకపోవడం ఏటా చర్చకు వస్తూనే ఉంటుంది. వృద్ధి రేటు పెరిగిన దశలో కూడా చాలినన్ని గిడ్డంగులు నిర్మించలేని దుస్థితిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి. ఎన్డీ.ఏ హయాంలో కూడా టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలు ఆరుబయట ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పుచ్చిపురుగులు పట్టడం గురించి; ఎలుకలకు, పందికొక్కులకు ఆహారం కావడం గురించి విన్నాం. ఇటీవలి కాలంలో సుప్రీం కోర్ట్ కూడా ఈ సమస్యను తీవ్రంగా తీసుకున్న సంగతి తెలుసు. గిడ్డంగుల నిర్మాణానికి విదేశీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సంగతి అబద్ధం కాదు. ఇక సరఫరా వ్యవస్థ మరింత అధ్వాన్నం. పీడీఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాణ్యతకు సరి తూగడం లేదని చెప్పి అమెరికా మన దేశం నుంచి కొంతకాలం పాటు మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన సంగతిని గమనించారా?  వీటన్నిటి నేపథ్యం నుంచి ఎఫ్.డీ.ఐని చూడవలసిన అవసరం లేదా?

ఎఫ్.డీ.ఐనే నమ్ముకుంటారో; లేదా దేశీయ నిధులనో వెచ్చిస్తారో...మొత్తానికి రీటెయిల్ రంగాన్ని సంస్కరించవలసిన అవసరమైతే ఉంది. కాదంటారా?

Tuesday, December 4, 2012

చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ: ఏది నిజం? ఎవరు నిజం?

చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్.డీ.ఐ)లను అనుమతించడంపై మీ అభిప్రాయం ఏమిటని ఈమధ్య ఒక మిత్రుడు అడిగారు. నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నించాను. అయితే కొన్ని విషయాలలో చటుక్కున అభిప్రాయం చెప్పడం కష్టం. అందులోనూ ఇప్పుడున్న రాజకీయవాతావరణంలో మరింత కష్టం.  ప్రజాస్వామిక రాజకీయాలలో నాయకుడనేవాడు బంగారం లాంటి అంశాన్ని ముట్టుకున్నా అది మట్టైపోతుంది.  రాజకీయపక్షపాతం సోకి అష్టావక్రంగా మారిపోతుంది. అన్నింటికంటే పెద్ద నష్టం ఏమిటంటే, ఆ అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారం జనానికి ఎప్పటికీ అందదు. నిష్పాక్షిక అభిప్రాయం ఎండమావిగా పరిణమిస్తుంది. రాజకీయాల చీకటి బిలంలోకి ఏదైనా ఒక అంశం అంశం  జారిపోయిందా... దానికిక నువ్వులు, నీళ్ళు వదలుకోవలసిందే.

ఇలా అనడంలో ప్రజాస్వామ్యాన్ని, రాజకీయవాదుల్ని తీసి పారేసే ఉద్దేశం అణుమాత్రం కూడా లేదు. ప్రజాస్వామ్యం మంచిదే. రాజకీయవాదులు ఎంతైనా అవసరమే. అయితే, మంచివనుకునే వాటిని కూడా మంచివి కాని లక్షణాలు కొన్ని ఆవహిస్తాయనీ ఒప్పుకోవలసిందే.

దేశ ఆర్థికతకు, భద్రతకు, భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని అంశాలనైనా రాజకీయపాక్షికతకు అతీతంగా చూడకూడదా; అన్నీ పార్టీలూ ఏకాభిప్రాయానికి రాకూడదా అనిపిస్తుంది. అయితే ఆ మాట పైకి అనడానికి కూడా సంకోచించవలసిన వాతావరణం ఇప్పుడుంది. ఎందుకంటే అలా అనే వ్యక్తి మీద 'ఐడియలిస్ట్' అన్న ముద్ర పడిపోతుంది. విచిత్రం ఏమిటంటే, 'అవసరాలు' కూడా ఇక్కడ 'ఆదర్శాలు'గా మారిపోతాయి.

నిజానికి ఒకవైపునుంచి చూస్తే ఇరవై ఏళ్లుగా అమలు జరుగుతున్న ఆర్థిక సరళీకరణ విధానాలకు ఎఫ్.డీ.ఐ కొనసాగింపే తప్ప ఇంకొకటి కాదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరళీకరణ విధానాలు అమలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధానాల ఫలితంగా దేశం 4.50 శాతం 'హిందూ' వృద్ధి రేటునుంచి 8.9 శాతం వృద్ధి రేటును అందుకోవడం చూస్తూనే ఉన్నాం(ఇటీవలి కాలంలో అది తిరోగమన మార్గం పట్టిన సంగతీ గుర్తించవలసిందే). దీనితోపాటు ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయన్న విమర్శా ఉంది. అలాగే, ఈ దేశంలో గత ఇరవై ఏళ్లలో 'అభివృద్ధి' అనే మాట 'అవినీతి'కి పర్యాయపదంగా మారిన సంగతీ నిజం. స్థూలంగా అనిపిస్తున్న దేమిటంటే,  సరళీకరణ ప్రక్రియను మేనేజ్ చేయడంలో రాజకీయనాయకత్వం తగిన పరిణతిని, బాధ్యతాయుత దృష్టిని, జవాబుదారీని  చూపలేకపోయింది. కోతి చేతి కొబ్బరికాయలా వ్యవహరించింది. దాని ఫలితమే రక రకాల స్కాములు!

ఈ ఇరవై ఏళ్లలో రాజకీయనాయకత్వంపై అవిశ్వాసం పెరిగింది. అనుమానాలు పెరిగాయి. వ్యతిరేక భావం పెరిగింది. తేడా గమనించండి...తమ ప్రాంతంలో ఫ్యాక్టరీ కావాలనీ, ప్రాజెక్ట్ కావాలనీ ప్రజలూ, రాజకీయపక్షాలూ ఆందోళన చేసిన రోజులున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అరవై దశకంలో జరిగిన ఆందోళన ఒక ప్రముఖ ఉదాహరణ.  ఎనభై దశకంలో నల్లగొండ జిల్లా ప్రజలు తమ ప్రాంతంలో అణువిద్యుత్ కర్మాగారం రావాలని కోరుకున్న సంగతి గుర్తుచేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు కావాలని జనం కోరుకునే వాతావరణం లేదు. పైగా ఆ ప్రయత్నాలను ప్రతిఘటించే వాతావరణం ఉంది. కారణమేమిటి? అభివృద్ధిని మేనేజ్ చేయడంలో రాజకీయనాయకత్వంలో పరిణతి, పారదర్శకత లోపించడం!

ఇటీవలి ఓక్స్ వేగన్ కార్ల ఫ్యాక్టరీ విషయమే తీసుకోండి. ఆ వ్యవహారంలో తలెత్తిన అవినీతి ఆరోపణలే విపక్షాల దృష్టిని, జనం దృష్టిని పూర్తిగా ఆక్రమించుకున్నాయి. చివరికి ఆ ఫ్యాక్టరీ రాష్ట్రానికి రానే లేదు. చిత్రమేమిటంటే, ఫ్యాక్టరీ రాలేదే నన్న బాధ జనంలోనూ కనిపించలేదు, రాజకీయపక్షాలలోనూ కనిపించలేదు. ఇంకా విచిత్రమేమిటంటే 'అభివృద్ధి' అనే మాటా, అందుకు సంబంధించిన చర్చా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశం మొత్తంలో గత మూడేళ్లుగా వినిపించడమే లేదు. కారణం ఏమిటి? రాజకీయనాయకత్వం!

అభివృద్ధి చర్చను అణగదొక్కుతున్నది అవినీతి ఒక్కటేనా? కాదు...రాజకీయ అవకాశవాదం కూడా.

వామపక్షాల విషయంలో అస్పష్టత లేదు. అవి ఒక సైద్ధాంతిక భూమిక నుంచి సరళీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. అందులో అమెరికాపట్ల వ్యతిరేకత కూడా అంతర్లీనంగా ఉంటుంది. అయితే తాము అధికారంలో ఉన్నచోట సిద్ధాంతాలను సవరించుకోడానికి మొగ్గు చూపిన చరిత్రా వాటికి ఉంది. పశ్చిమ బెంగాల్ లో బుద్ధదేవ్ భట్టాచార్య చేసింది అదే. అలవాటులేని ఔపోసన వల్ల అది అతిగా పరిణమించి వికటించింది. చివరికి వామపక్ష అధికారానికే ఎసరు పెట్టింది,

బీజేపీ వైఖరే ఎక్కువ ప్రశ్నార్థకం. ఆర్థిక సరళీకరణ అనేది కాంగ్రెస్ కు కంటే మితవాద పక్షమైన బీజేపీ హృదయానికే ఎక్కువ దగ్గరగా ఉంటుంది. అయినాసరే, సరళీకరణ చర్యలను అది వామపక్షాలను తలదన్నే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఎందుకు? రాజకీయ అవకాశవాదం మినహా మరో కారణం కనిపించదు.

ఎఫ్.డీ.ఐ దగ్గరికి మళ్ళీ వద్దాం. మంగళవారం నాడు లోక్ సభలో చర్చ ప్రారంభించిన ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ మంచి వాగ్ధాటిని చాటుకుని,  ప్రశంసలు అందుకున్నారు, సరే. అదే సమయంలో కొన్ని అసందర్భ వ్యాఖ్యలూ చేసి చర్చ స్థాయిని దిగజార్చారు. వాల్ మార్ట్ భారత్ లోని అధికారులకు లంచమిచ్చిందన్న ఒక న్యూస్ ఏజెన్సీ వార్తను ఉదహరించి, దానికి నేరుగా మన్మోహన్ సింగ్ ను లింక్ చేశారు. ఆ ప్రస్తావన చేయడం దానికదే తప్పు కాకపోయినా, ఆ సందర్భంలో చేయడంలోనే ఔచిత్యం లోపించింది. చర్చ ఎఫ్.డీ.ఐ మంచి చెడుల గురించే కానీ, అవినీతి గురించి కాదు కదా! అలాగే ఎఫ్.డీ.ఐ అంటే వాల్ మార్ట్ ఒక్కటే కాదు. అయినాసరే ఆమె ఆ వ్యాఖ్య చేయడం దేనిని సూచిస్తుంది? ఎఫ్.డీ.ఐపై కన్నా ప్రభుత్వంపై వ్యతిరేకతనే సూచిస్తుంది. అంతకంటే ముఖ్యంగా విపక్షంగా ప్రభుత్వం చర్యలను వ్యతిరేకించాలి కనుక వ్యతిరేకిస్తున్నామన్న సూచననూ అందించింది.

అదీ అసలు సమస్య.

అదలా ఉంచి ఎఫ్.డీ.ఐపై సుష్మా స్వరాజ్ దండగుచ్చిన అభ్యంతరాలను గమనిస్తే, అవును, నిజమే కదా అనిపిస్తుంది.  దానికి  కపిల్ సిబల్ చెప్పిన సమాధానమూ సహేతుకంగానే కనిపిస్తుంది. రైతులకు నష్టం జరుగుతుందని సుష్మా స్వరాజ్ అంటే లాభం జరుగుతుందని కపిల్ సిబల్ వాదం. ఇందులో ఏది నిజం? జనం ఒక అభిప్రాయానికి ఎలా రావాలి?

రేపు ఒకవేళ  ఎఫ్.డీ.ఐ అమలులోకి వచ్చి ఏళ్ళు గడచినా సరే ఈ రెండు వాదాలూ వినిపిస్తూనే ఉంటాయి. జనం ఒక అభిప్రాయానికి రావడం ఎప్పటికీ జరగకపోయినా ఆశ్చర్యంలేదు. రాజకీయవాదుల నోళ్లలో పడిన ఏ విషయమైనా అంతే.

టెలికాం రంగంపై ప్రభుత్వానికున్న గుత్తాధిపత్యాన్ని సడలించడంపైనా మొదట్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, అందువల్ల పోటీ పెరిగి టెలిఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. బీటీ పత్తి విత్తనాలను బూచిగా చూపించి రైతులను హడలగొట్టారు. వాటి ఖరీదు చాలా ఎక్కువ అన్నారు. కానీ ఇప్పుడు రైతులందరూ బీటీ పత్తి విత్తనాలనే కోరుకుంటున్నారు. వాటి ధర కూడా తగ్గింది. అయినాసరే, బీటీ విత్తనాలకు వ్యతిరేకంగా ఎలుగెత్తి వాదించే వారు ఇప్పుడూ ఉన్నారు. ఇందులో ఏది నిజం? ఒక అభిప్రాయానికి ఎలా రావాలి?

గతంలో ఎఫ్.డీ.ఐని వ్యతిరేకించిన మన్మోహన్ సింగ్, సోనియాలు ఇప్పుడు ప్లేటు ఎందుకు ఫిరాయించారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. న్యాయమే. కపిల్ సిబల్ సమాధానం చెబుతూ, ఎన్.డీ.ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మురసోలీ మారన్ చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐని అనుమతించడంవల్ల కలిగే లాభాలను ఏకరవు పెట్టిన నోటు చదివి వినిపించారు. ఆ అంశాన్ని బీజేపీ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన సంగతిని కూడా ప్రస్తావించారు. ఇదీ న్యాయమే. రాజకీయపక్షాలే ఎఫ్.డీ.ఐపై అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మాట మారుస్తున్నప్పుడు జనం దానిపై నిశ్చితమైన అభిప్రాయానికి ఎలా రావాలి? అప్పుడు అవసరం లేదనుకున్నామనీ, ఇప్పుడు ఆ అవసరం కనిపిస్తోందని కాంగ్రెస్ అంటుంటే; అప్పట్లో ఆ అవసరం కనిపించించదనీ, ఇప్పుడా అవసరం లేదనీ బీజేపీ అంటోంది.  ఎవరి అంచనా కరక్టనుకోవాలి?

ఎఫ్.డీ.ఐకి మేము వ్యతిరేకం కాదనీ; కావాలంటే రోడ్లు, రేవులు,విద్యుత్తు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎఫ్.డీ.ఐని ఆహ్వానించండని బీజేపీ అంటోంది. అందువల్ల మాత్రం జనంపై ఆర్థికభారం పడదా? రేపు రోడ్ల వినియోగానికి ఎక్కువ టోల్ ను, విద్యుత్ వినియోగానికి ఎక్కువ చార్జీలనూ వసూలు చేయరా?

చివరగా వేసుకోవలసిన అసలు ప్రశ్న...ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభించిన సరళీకరణ ప్రయాణం అంతిమగమ్యానికి చేరనవసరం లేదా, మధ్యలో రైలు దిగిపోగలమా? పోనీ ఈ ఇరవై ఏళ్ల అనుభవాన్ని సమీక్షించుకుని ఎక్కడ ఆగాలో, ఎక్కడ సాగాలో కొత్తగా ప్లాను తయారు చేసుకోవడం అవసరమనిపిస్తే ఆ ప్రయత్నమైనా చేయాలి కదా? ఏదీ ఆ ప్రయత్నం?

పైన చెప్పుకున్నట్టు అయ్యవారిని చేయబోయి కోతిని తయారు చేయడంలో అన్నీ పార్టీలూ సిద్ధహస్తులే అయినప్పుడు, ఎంత మంచి సంస్కరణ అయినా వికటిస్తుంది. అసలు సమస్య ఎఫ్.డీ.ఐ యో మరొకటో కాదు; పరిణతీ, ప్రజాహితదృష్టీ, జవాబుదారీ లోపించిన రాజకీయనాయకత్వమే!