Wednesday, January 30, 2013

కలకత్తా కాంగ్రెస్ లో చీపురు పట్టిన గాంధీ

                                                    (ఈ రోజు గాంధీజీ 65వ వర్ధంతి)

గాంధీ కన్నా సుభాస్ చంద్ర బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప నాయకులని కొన్ని రోజుల క్రితం ఎం.ఐ.ఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ ముగ్గురూ గొప్ప నాయకులని అనడం వరకు బాగానే ఉంది. కానీ మధ్యలో గాంధీని తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడు కాడని అనడం ఎందుకో తెలియదు. సందర్భం, అవసరం లేకపోయినా గాంధీని రెక్క పుచ్చుకుని మరీ మధ్యలోకి  లాగి ఆయన మీద ఓ రాయి వేయడం చాలామందికి  పరిపాటిగా మారింది. పాపం ఆయన పువ్వులూ, రాళ్లూ రెంటినీ స్వీకరించక తప్పడం లేదు.

ఎవరు గొప్ప నాయకులో నిర్ణయించడానికి ఎవరి కొలమానాలు వాళ్లకుంటాయి. ఆ జోలికి పోకుండా చెప్పుకోవాలంటే గాంధీ ఎవరితోనూ పోల్చలేని నాయకుడు. ఆధునిక భారతదేశంలో ఆ చివరినుంచి ఈ చివరివరకు యావన్మందీ నాయకుడిగా గుర్తించిన ప్రథమ నాయకుడు ఆయనే. ఒక మహాసేనానిగా ఎంతో చాకచక్యంగా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేసిన ప్రథమ నాయకుడు కూడా ఆయనే. ఆచి తూచి సహచరులను ఎంపిక చేసుకోవడంలో, వారిని నేర్పుగా వాడుకోవడంలో, వారితో రాజకీయ సంబంధాలే కాక వ్యక్తిగత ఆత్మీయ సంబంధాలను పెంచుకోవడంలో, సహచరుల మధ్య పరస్పర మైత్రిని ప్రోత్సహించడంలో గాంధీ తనకు తనే సాటి అనిపించుకోగల నాయకుడు. గాంధీ గురించి అన్నీ పార్స్వాలనూ తెలుసుకుని ఆయన నాయకత్వ దక్షతను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బుద్ధినీ, హృదయాన్నీ కూడా అంచనా వేయాలంటే ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవాలి.

గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అలాంటి పుస్తకాలలో ఒకటి. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో తెలుసుకోడానికి అదొక పాఠ్య గ్రంథం. నేటి నాయకులందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

ఆ పుస్తకం ఆధారంగా గాంధీ గురించి కొన్ని ముచ్చట్లు...

                                                                        *
కాంగ్రెస్ సభల్లో చీపురు పట్టిన గాంధీ

గాంధీ 1901లో కలకత్తాలో జరిగిన ఏ.ఐ.సీ.సీ సమావేశాలలో పాల్గొన్నాడు. వెళ్ళేటప్పుడు నాటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రయాణిస్తున్న రైలులోనే తనూ ఎక్కాడు. మధ్యలో, ముందుగానే నిర్ణయించుకున్న స్టేషన్ లో దిగి అగ్రనేతల బోగీలోకి వెళ్ళి వాళ్ళను పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన బోగీలోకి వెళ్లిపోయాడు.

కలకత్తా సదస్సులో ఆయన రెండు పాత్రలు నిర్వహించాడు. గోఖలే సాయంతో దక్షిణాఫ్రికా పోరాటంపై తీర్మానం ప్రతిపాదించి అయిదు నిమిషాలు దానిపై మాట్లాడడం మొదటిది. ఒక చీపురు తీసుకుని సమావేశస్థలిని తుడిచి శుభ్రం చేయడం రెండవది. ఆయన ఆ పని చేస్తుంటే అంతా కళ్ళప్పగించి చూశారు తప్ప అందులో పాలుపంచుకోడానికి  ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత, కాంగ్రెస్ కార్యదర్శులలో ఒకడైన జానకీనాథ్ ఘోశాల్ గుట్టలా పోగుబడిన ఉత్తరాలకు సమాధానం రాయడంలో సతమతమవుతుంటే గాంధీ వెళ్ళి ఆయనకు సహకరించాడు. ఇన్ని చేస్తూనే చాలామంది నాయకులను కలసి మాట్లాడాడు. కాంగ్రెస్ పనితీరు గురించి మొత్తం సమాచారం రాబట్టాడు.

                                                                      *

దొరకని వివేకానంద దర్శనం

కలకత్తాలో స్వామీ వివేకానందను దర్శించడానికి ఎంతో ఉత్సాహపడుతూ సుదూరంగా ఉన్న బేలూర్ మఠం వరకూ నడచి వెళ్ళాడు. తీరా అంత దూరం వెళ్ళాక, స్వామి కలకత్తాలోనే ఉన్నారనీ, చాలా అస్వస్థులుగా ఉన్నారనీ, చూడడానికి వీలు పడదనీ మఠంలో వాళ్ళు చెప్పారు. గాంధీ నిరాశతో వెనుదిరిగాడు.

                                                                         *
'చరిత్ర సృష్టించు'

గాంధీ మొదటిసారి పటేల్ ను అహమ్మదాబాద్ లోనూ, నెహ్రూను లక్నోలోనూ, కృపలానీని శాంతినీకేతన్ లోనూ, రాజేంద్రప్రసాద్ ను బీహార్ లోనూ కలుసుకున్నాడు.

కృపలానీ తనను చరిత్ర అధ్యాపకుడిగా పరిచయం చేసుకున్నాడు. 'నాతో కలసి పనిచేస్తూ చరిత్ర సృష్టించ' మని గాంధీ ఆయనతో అన్నాడు.

                                                                        *
ఊళ్ళోలేని రాజేన్ బాబు 

నీలిమందు రైతుల పోరాటానికి మార్గదర్శనం చేయమని రాజ్ కుమార్ శుక్లా అనే రైతు గాంధీని కోరాడు. గాంధీ ఆయనతో కలసి అహమ్మదాబాద్ నుంచి ఉత్తర బీహార్ కు బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యంలో పాట్నాలో దిగారు. న్యాయవాది రాజేంద్రప్రసాద్ ఇంటికి గాంధీని శుక్లా తీసుకువెళ్లాడు. రాజేంద్రప్రసాద్ ఊళ్ళో లేడు. ఆయన ఇంట్లో పనివారు గాంధీని తక్కువ కులస్తుడిగా భావించి బావినీ, పాయిఖానాను వాడుకోడానికి ఒప్పుకోలేదు. అక్కడినుంచి గాంధీ, శుక్లా ముజాఫర్ పూర్ బయలుదేరారు.

వాళ్ళు వస్తున్నట్టు తెలిసి కృపలానీ కొంతమంది విద్యార్థులతో కలసి అర్థరాత్రి వేళ స్టేషన్ కు వచ్చాడు.  చేతుల్లో లాంతర్లు ఉన్నా గాంధీని పట్టుకోవడం కృపలానీకి కష్టమైంది. కారణం...ఆయన మూడో తరగతి బోగీలోంచి దిగాడు.

పాట్నా తిరిగొచ్చిన రాజేంద్రప్రసాద్ గాంధీ వచ్చి వెళ్ళిన సంగతి తెలిసి నొచ్చుకుంటూ ముజఫర్ పూర్ వచ్చి గాంధీని కలుసుకున్నాడు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని అనువదించి ఇవ్వడం ఆయనకు గాంధీ అప్పగించిన మొదటి  పని.

భవిష్యత్తులో రాజేంద్రప్రసాద్ భారత తొలి రాష్ట్రపతి అయ్యారు.

                                                                     (మోహన్ దాస్ తెలుగు అనువాదం ఎమెస్కో ప్రచురించింది)

సంబంధిత పోస్ట్:  గాంధీ గురించి సరదాగా కొన్ని...(సెప్టెంబర్ 2012)

వీరేశలింగం అనుకరణలు, అనుసరణలు

                                ('తెలుగులో తొలి నవల ఏది?' అన్న29 జనవరి  పోస్ట్ కు కొనసాగింపు)

ఇంగ్లీష్ లో తొలి నవల 'పమేలా' వెలువడిన 26 ఏళ్ళకు గోల్డ్ స్మిత్ రాసిన 'వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' వచ్చింది. క్రమంగా జేన్ ఆస్టిన్, థాకరే, జార్జి ఇలియెట్, స్కాట్, హార్లీ, హెచ్ జి వెల్స్, జోసెఫ్ కాన్ రాడ్ లాంటి ప్రతిభావంతులు నవలా ప్రక్రియను పరిపుష్టం చేశారు. వీరిలో కొంతమంది గోపాలకృష్ణమచెట్టి, వీరేశలింగం గార్లకు సమకాలికులే. అయినాసరే, వీరిద్దరూ తమ రచనలను 'నవల'గా ఎందుకు పేర్కొనలేదో తెలియదు.

ఇంకా విచిత్రం ఏమిటంటే, తమ రచనలలోని ఇతివృత్తం ఈ కాలానికి చెందినది కాదని  వీరిద్దరూ ప్రత్యేకంగా చెప్పుకున్నారు. శ్రీరంగరాజచరిత్రలోని కథ 400 ఏళ్లనాటిదని చెట్టిగారు అంటే, రాజశేఖరచరిత్రములోని కథ 200 ఏళ్లనాటిదని వీరేశలింగం అన్నారు.

ఇంతకీ "తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితి" నని వీరేశలింగం ఎలా అన్నారు, తన రచన కంటె ముందు శ్రీరంగరాజచరిత్ర అనే 'నవీనప్రబంధము' వచ్చినట్టు ఆయనకు తెలియదా అంటే... తెలుసు. తెలియడమే కాదు, ఆ రచనను ఆయన చదివారని కూడా అక్కిరాజు రమాపతిరావు తేల్చారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన వీరేశలింగం రచనలకు సంపాదకులుగా ఉన్న రమాపతిరావు తొలి తెలుగు నవల ఏదన్న ప్రశ్నపై కొంత చర్చ చేశారు. శ్రీరంగరాజచరిత్ర నవీన ప్రక్రియకు ఆద్యమని చెప్పదగిన ప్రౌఢరచనగా వీరేశలింగం భావించి ఉండకపోవచ్చన్నారు.  400 ఏళ్లనాటి కథగా రచయిత చెప్పడం, నాయకుడు మహాకులీనుడై ఉండాలన్న ఆలంకారిక నియమాన్ని ప్రస్తావించడం, ఇంగ్లీష్ సాహిత్య ప్రక్రియ ప్రభావం ఆ రచనపై ఏమాత్రం ఉండకపోవడం వంటి కారణాల వల్ల చెట్టిగారిని ప్రథమ నవలా రచయితగా వీరేశలింగం ఒప్పుకోలేదని స్పష్టమవుతోందన్నారు. అంటే ఏమిటన్నమాట? వీరేశలింగం ఒప్పుకోలేదు కనుక అనంతర సాహిత్యచరిత్రకారులు, విమర్శకులు కూడా ఒప్పుకోలేదు!

ఆమాటకొస్తే, రాజశేఖరచరిత్రములోని కథ కూడా 200 ఏళ్ల క్రితం జరిగిందని వీరేశలింగం చెప్పుకున్నారు. అందులోని కథానాయకుడు రాజశేఖరుడు కూడా కులీనుడే. మరి చెట్టిగారి రచనను ప్రథమ నవలగా గుర్తించడానికి అడ్డువచ్చిన ఈ కారణాలు వీరేశలింగం రచనను గుర్తించడానికి ఎందుకు అడ్డురాలేదు? కట్టమంచి మొదలుకొని ఇటీవలి సహవాసి వరకూ ఎవరూ ఇందులోని అసంబద్ధతను గమనించలేదు. చెట్టిగారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు.

అంతేకాదు, మరికొన్ని ఆశ్చర్యాలు కూడా ఉన్నాయి. శ్రీరంగరాజచరిత్రను వీరేశలింగం చదవడమే కాదు, అందులోని రెండుమూడు సన్నివేశాలను అనుకరించారు! 'తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము' అనే తన సిద్ధాంతరచనలో కొత్తపల్లి వీరభద్రరావు ఈ సంగతిని సోదాహరణంగా వివరించారు(పేజీలు 494-500). "శ్రీ పంతులుగారు శ్రీరంగరాజచరిత్రను చూడలేదనలేము. చూచినను ఆ విషయమును గూర్చి వ్రాయకుండుట-స్వీయచరిత్రములోనైనను-ఆశ్చర్యమే! శ్రీరంగరాజచరిత్రపై తమకంత గౌరవము లేకున్నను, తామా గ్రంథమును చూచినట్లు పంతులుగారు వ్రాసియుండవలసినది" అని ఆయన వ్యాఖ్య.

ఆపైన, గోల్డ్ స్మిత్ రచన 'వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' కీ, రాజశేఖరచరిత్రముకూ ఉన్న దగ్గరి పోలికల గురించి కూడా వీరభద్రరావు సుదీర్ఘంగా చర్చించారు(పేజీలు 501-524). పాత్రల రూపకల్పనలో, సన్నివేశ కల్పనలో ఉన్న అతి దగ్గర పోలికలను నలభైకి పైగా ఉదహరించారు. గోల్డ్ స్మిత్ రచననుంచి వీరేశలింగం వాక్యాలకు వాక్యాలనే ఎలా ఎత్తి రాశారో చూపించారు.

చివరగా, "ఈ రెండు నవలల నిట్లు పరిశీలించిన తరువాత పంతులుగారు రాజశేఖరచరిత్రము పీఠికలో వ్రాసినట్లు కథను గల్పించుటలో గోల్డ్ స్మిత్తను నింగ్లీషు కవీశ్వరుని గ్రంథ సాహాయ్యమును గొంత పొందినట్లే తెలియును. ఇంకనూ సూక్ష్మముగా పరిశీలించినచో ఆ సాహాయ్యమూ సామాన్యమైనది కాదని కూడా తెలియును" అని వీరభద్రరావుగారి సగౌరవ ఆక్షేపణ.

ఆకాలపు అవగాహన దృష్ట్యా ఇలాంటివి దోషాలుగా వీరేశలింగం భావించి ఉండకపోవచ్చు. అదీగాక, ఆయన గొప్ప సంఘసంస్కర్తా, ఆధునిక యుగ వైతాళికులలో అగ్రగణ్యుడూ అన్న గౌరవంతో  కూడా వీటిని మనం ఉపేక్షించచ్చు. సమస్య అది కాదు. అనంతర సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు వీరేశలింగం మాటనే వేదవాక్యంగా తీసుకుని సాహిత్యచరిత్రకూ, చెట్టి గారికీ కూడా అన్యాయం చేయడమే ఆశ్చర్యం.




Tuesday, January 29, 2013

తెలుగులో తొలి నవల ఏది?

(ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతిగారు ఒక బ్లాగులో కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖరచరిత్రము గురించి రాసిన వ్యాసం చూశాక(23 జనవరి 2013) 2008లో 'సాక్షి'లో నేను రాసిన  వ్యాసాన్ని పోస్ట్ చేయాలనిపించింది. కొన్ని సవరణలతో రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను)

'కామమ్మ మొగుడంటే కామోసనుకున్నా'నని సామెత. తొలి తెలుగు నవల ఏదన్న వివాదంలోకి ఈమధ్య అనుకోకుండా తలదూర్చినప్పుడు ఈ సామెత గుర్తొచ్చింది. తను రచించిన 'రాజశేఖరచరిత్రము'ను 'వచన ప్రబంధము'గా పేర్కొన్న కందుకూరి వీరేశలింగం, 'తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితి'నని చెప్పుకున్నారు. ఇంకేముంది? ఆ తర్వాతి కాలపు పండితులందరూ ఆ మాటను వేదవాక్యంగా తీసుకున్నారు. అలనాటి కట్టమంచి రామలింగారెడ్డి మొదలుకుని, కిందటి సంవత్సరం(2007) 'నూరేళ్ళ తెలుగు నవల' అనే పుస్తకాన్ని వెలువరించిన సహవాసి వరకూ అందరూ రాజశేఖరచరిత్రమునే తొలి తెలుగు నవల అన్నారు. లోతుల్లోకి వెడితే, సత్యశోధన దృష్టి కన్నా వీరేశలింగంపై భక్తి గౌరవాలే పరిశోధకులను ఎక్కువ ప్రభావితం చేశాయనిపిస్తుంది.

రాజశేఖరచరిత్రము 1878లో వెలువడితే, నరహరి గోపాలకృష్ణమచెట్టి రచించిన 'శ్రీరంగరాజ చరిత్ర' 1872లో వెలువడింది. గోపాలకృష్ణమచెట్టి వీరేశలింగం అంత ప్రసిద్ధుడు కాకపోయినా కొంత చరిత్ర ఉన్నవారే. ఆయన 1832లో నేటి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జన్మించారు. సంస్కృతం, తెలుగు, తమిళం, ఆంగ్లాలలో పండితుడిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగజీవితం ప్రారంభించి, తర్వాత కలెక్టరాఫీసులో గుమస్తాగా చేరి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. నిజాయితీ, సామర్థ్యం, సేవాభావన ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వెంకటగిరి, కొల్లాపురం సంస్థానాధీశులు ఉన్నతపదవి ఇవ్వజూపినా తిరస్కరించారు. ఆంగ్లంలో థామస్ స్ట్రెంజ్ రాసిన న్యాయశాస్త్ర క్రోడీకరణను పరవస్తు చిన్నయసూరితో కలసి తెలుగులోకి అనువదించారు.

ఆయన 'శ్రీరంగరాజ చరిత్ర' రాయడానికి ప్రేరణ -అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మేయో బెంగాల్ గెజిట్లో చేసిన ఒక ప్రకటన. బెంగాలీ ప్రజల ఆచారవ్యవహారాలను తెలిపే కల్పిత రచన చేసినవారికి బహుమతి ఇస్తామని ఆ ప్రకటన సారాంశం. తెలుగువారి ఆచారవ్యవహారాలను తెలిపే ఉద్దేశంతో గోపాలకృష్ణమచెట్టి శ్రీరంగరాజచరిత్రను వెంటనే రాసి ప్రచురించారు. ఈ రచన వెలువడిన ఆరేళ్ళ తర్వాత తను వెలువరించిన రాజశేఖరచరిత్రమును వీరేశలింగం వచనప్రబంధం అంటే, గోపాలకృష్ణమ చెట్టి శ్రీరంగరాజచరిత్రను 'నవీన ప్రబంధం' అన్నారు. నిజానికి 'నవల' అనే ఊహకు వీరేశలింగం కన్నా గోపాలకృష్ణమ చెట్టే దగ్గరగా ఉన్నారని ఈ పేరునుబట్టి అర్థమవుతుంది.

ఎందుకంటే, లార్డ్ మేయో 'కల్పిత రచన' అన్నప్పుడు  'నవల' నే దృష్టిలో పెట్టుకుని ఉండచ్చు. అప్పటికి ఇంగ్లీష్ లో నవలా, నవల అనే పేరూ ప్రసిద్ధిలోకి వచ్చేశాయి. భారతీయులకు నవల అనే పేరు అప్పటికి అంతగా తెలియదు కనుక మేయో ఆ పేరు ఉపయోగించకుండా 'కల్పిత రచన' అని ఉండచ్చు. ఇంగ్లీష్ లో తొలి నవలగా గుర్తించిన రచన 1740లో, అంటే శ్రీరంగరాజచరిత్ర కన్నా 132 ఏళ్లక్రితం వెలువడింది. అది-శామ్యూల్ రిచర్డ్ సన్ (1689-1761) రాసిన 'పమేలా'. దానికే 'వర్చ్యూ రివార్డెడ్' అనే ఇంకో పేరు కూడా ఉంది. రిచర్డ్ సన్ రాసిన 'క్లారిస్సా' అనే మరో నవలను అతని మాస్టర్ పీస్ గా చెబుతారు. దానికి కూడా 'ది అడ్వెంచర్స్ ఆఫ్ ఏ యంగ్ లేడీ' అనే మరో పేరు ఉంది. నవలకు రెండు పేర్లు పెట్టే ఒరవడిని గోపాలకృష్ణమ, వీరేశలింగం ఇక్కడినుంచే తీసుకుని ఉండచ్చు. శ్రీరంగరాజచరిత్రకు 'సోనాబాయి పరిణయము', రాజశేఖరచరిత్రముకు 'వివేకచంద్రిక' అనే పేర్లు కూడా ఉన్నాయి.

శ్రీరంగరాజ చరిత్రలోని కథకూ, పమేలా నవలలోని కథకూ పోలికలు ఉండడం మరో విశేషం.  ఒక ధనిక కుటుంబంలో సేవకురాలిగా ఉన్న అమ్మాయిని యజమానురాలి కొడుకు పెళ్లి చేసుకోవడం 'పమేలా'లో కథ. శ్రీరంగరాజచరిత్రలో కథానాయకుడు,విద్యానగర యువరాజు అయిన రంగరాజు సోనాబాయి అనే లంబాడీ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఆమె లంబాడీ కాదనీ, రాజకన్య అనీ చివరిలో తెలుస్తుంది.

ఇంకా విశేషమేమిటంటే, గోపాలకృష్ణమచెట్టి, రిచర్డ్ సన్ ల మధ్య కూడా పోలికలు ఉండడం. అనంతరకాలంలో వస్తు, శిల్పాలలో ఎంతో అభివృద్ధి చెందిన నవల ముందు రిచర్డ్ సన్ రచనలు వెల వెల పోతాయనీ, అనవసరమైన వివరాలతో సుదీర్ఘంగా  సాగుతూ విసుగు పుట్టిస్తాయనీ ఆంగ్ల సాహిత్య చరిత్రకారులు అంటారు. అయితే, నవలా ప్రక్రియకు ఆద్యుడు అన్న గౌరవం మాత్రం రిచర్డ్ సన్ కే దక్కాలంటారు(An outline History of ENGLISH LITERATURE, By William Henry Hudson).  అలాగే, శ్రీరంగరాజచరిత్రతో పోల్చితే రాజశేఖరచరిత్రము నిస్సందేహంగా నాణ్యమైన రచనే. అనేక ప్రక్రియలలో అసంఖ్యాక రచనలు చేసిన వీరేశలింగం ముందు గోపాలకృష్ణమ చెట్టి రచయితగా వెల వెల పోయే మాటా నిజమే.

కానీ, రిచర్డ్ సన్ ను ఆంగ్ల నవలకు ఆద్యుడిగా గుర్తించి గౌరవించడంలో ఆంగ్ల సాహిత్యచరిత్రకారులు చారిత్రకదృష్టిని , నిష్పాక్షికతను, పెద్ద మనసును చాటుకున్నారు. గోపాలకృష్ణమచెట్టి విషయంలో ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు ఆ పని చేయలేకపోయారు.

అందువల్ల గోపాలకృష్ణమచెట్టికే కాదు, ఆంధ్రసాహిత్య చరిత్రకూ అన్యాయం జరిగింది.

వీరేశలింగం గారి అనుకరణలూ, అనుసరణల గురించి మరో పోస్ట్ లో...

లైంగిక నేరాలు: కోరికల అణచివేతే కారణమా?

ఏ సమస్యకైనా చాలా ముఖాలు ఉంటాయి. ఒకటి రెండు ముఖాలపైనే దృష్టి పెడితే సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదు. లైంగిక అత్యాచారాలనే చూద్దాం. లైంగిక అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ఎలాంటి చట్టాలు ఉండాలి; వారికి ఉరిశిక్ష వేయాలా, లేక యావజ్జీవశిక్ష చాలా; రసాయనిక ప్రక్రియలో వారి పుంసత్వాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా ఉంటుంది?...వగైరా అంశాల  చుట్టూనే చర్చ ఎక్కువగా తిరుగుతోంది. జస్టిస్ వర్మ కమిటీ నివేదికపై చర్చలో కూడా ఇవే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి.  అత్యాచారాల నేరస్తులను శిక్షించడంపైనే కాక, అత్యాచారాల నివారణపై కూడా దృష్టిని కేంద్రీకరించాలనీ, వాటి సామాజిక మూలాలను కూడా గమనించాలనీ స్వయంగా జస్టిస్ వర్మ కూడా అన్నారు.

అంటే, అత్యాచారాల సమస్యను కేవలం శాంతి, భద్రతల కోణం నుంచి మాత్రమే చూసినందువల్ల ప్రయోజనం ఉండదనీ; సామాజిక సమస్యగా కూడా చూడాలనీ జస్టిస్ వర్మే కాక చాలామంది అభిప్రాయం. సామాజిక సమస్యగా చూసినప్పుడు పరిష్కార మార్గాలను సమాజంలోనే వెతకవలసి ఉంటుంది. పసి పిల్లలని కూడా చూడకుండా అత్యాచారం జరిపే పశుప్రవృత్తి(వేరే మాట దొరకక ఈ మాట వాడుతున్నాను. పశువులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించవు) మనుషుల్లో ప్రకోపించడం వెనుక సామాజిక కారణాలు తప్పనిసరిగా ఉంటాయి. (ఆడ శిశువుల భ్రూణ హత్యలు, పరువు హత్యలు తదితర కారణాలతో) జనాభాలో స్త్రీ-పురుష నిష్పత్తి తగ్గిపోతున్న సంగతి తెలిసినదే. అదే  అత్యాచారాల వంటి సామాజిక వికృతులకు దారి తీయిస్తోందా అని నాకో అస్పష్ట అనుమానం ఉంది. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల వధువు దొరకడం చాలా కష్టమైపోయి, సోదరులు పాండవ ఆచారాన్ని పాటిస్తున్నారని ఆమధ్య ఒక వార్త చదివాను. ఆడపిల్లకు పెళ్లి చేయడం ఎంత కష్టమయ్యేదో(ఇప్పుడు కావడం లేదని కాదు) ఇప్పుడు మగపిల్లవాడి పెళ్లి చేయడం అంతే కష్టంగా పరిణమించడం చాలా చోట్ల చూస్తున్నాం. ఇలాంటి వాటికీ అత్యాచారాలకూ ముడి ఏమైనా ఉందా అన్నది సామాజిక శాస్త్రవేత్తలే చెప్పగలరు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ, రచయిత్రి జూపాక సుభద్ర 'మృగాళ్ళు లేని నిర్భయ సమాజానికి...' అనే శీర్షికతో రాసిన(29 జనవరి, ఆంధ్రజ్యోతి)ఒక వ్యాసంలో కొన్ని ఆసక్తికర, చర్చనీయ వ్యాఖ్యలు చేశారు. వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను:

1. పిల్లలు మేజర్లు కాగానే అత్యధికులు ఆర్థిక స్వతంత్రులు కాలేక పోతున్నారు. ఇష్టమొచ్చిన చదువు/నైపుణ్యాలను సంపాదించుకోడానికి, ఇష్టమొచ్చిన జీవితభాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి తగిన ప్రోత్సాహం లేక తరచు తల్లిదండ్రులు, సమాజం నుంచి, కట్టుబాట్ల పేరుతో ఆంక్షలు, నియంత్రణలు, తిరస్కారాలను ఎదుర్కోవలసివస్తోంది. 

2. ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడే తత్వం, సోమరితనం, నిరుద్యోగం యువతలో బాగా పెరిగింది. 

3. యువతుల్లో, ఆడపిల్లల్లో కుటుంబ వ్యవస్థ, సమాజం న్యూనతాభావాన్ని, అశక్తతను పెంచాయి.

4. లైంగిక కోర్కెలను నిగ్రహించుకోవాలి, తీర్చుకోవడం తప్పు అనే సంఘ నీతి వల్ల యువత లైంగిక సహజాతాలను అణచి పెట్టుకోవలసి వస్తున్నది. లేదా వక్రమార్గాలు తొక్కి లైంగిక నేరాలకు పాల్పడుతున్నది. 

5. అతిశయించిన అల్లరి చేష్టల(వేధింపుల)తోనైనా నాయికలను అనుకూలం చేసుకునే హీరో పాత్రలుండే సినిమా దుష్ట సంస్కృతి ప్రభావం యువకుల్లో పెరిగింది. 

6. సోషల్ కాస్ట్రేషన్(సామాజిక లింగాధిపత్యాన్ని తొలగించడం) అవసరమని పాత్రికేయ మిత్రుడు రమేష్ హజారే సరిగానే చెప్పాడు. కూడు, గూడు, గుడ్డ అని నినదించి పథకాలు ప్రవేశపెట్టాయనీ, ఇదే మాదిరిగా నిద్ర, మైథునం కొరవడిన బానిసలకు అవి అందించే పథకాలనూ ప్రవేశపెడితే సమాజంలో లైంగిక నేరాలు తగ్గుతాయేమో ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగుంటుందని మరో సీనియర్ పాత్రికేయుడు అభిప్రాయపడ్డాడు. 

7. కొన్ని సమాజాల్లో పిల్లలు యవ్వనంలోకి ప్రవేశించగానే లైంగిక స్నేహాలు చెయ్యడానికి, స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి వ్యక్తిగత స్వేచ్ఛ కలిగి ఉన్నారు. 

8. అరుదైన నేరాలకు ఉరిశిక్ష ఉండాల్సిందే అంటున్న కేంద్రప్రభుత్వం చివరికి తన ఉరి కత్తిని బలహీనమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలున్న నేరస్తుల మెడ పైకే తెస్తుంది. బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలున్న నేరస్తులను వదలివేసే ప్రమాదముంది. 

Saturday, January 26, 2013

బురదలో 'పద్మా'లు

సినీ గాయని ఎస్. జానకి పద్మ అవార్డును తిరస్కరించడం ఒకందుకు ఆనందం కలిగించింది. అయితే అందుకు ఆమె చెప్పిన కారణాలలో ఒక కారణం ఆశ్చర్యం కలిగించింది. ఇంకో కారణం, 'అవును నిజమే కదా' అనిపింపజేసింది.

పద్మ అవార్డు కోసం తెరవెనుక ఎవరెవరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో, వర్షపు చినుకుల కోసం చాతకపక్షుల్లా ఒక జీవితకాలం పాటు ఎలా ఎదురుచూస్తారో తెలుసు కనుక వచ్చిన అవార్డును తిరస్కరించడానికి ఎంతో తెగింపు కావాలి. ఇంతకాలానికి ఒకరైనా ఆ తెగువ చాటుకున్నారు కనుక ఆనందం.

ఇక ఆశ్చర్యం దేనికంటే, 'భారతరత్న' కంటే తక్కువ అవార్డు తీసుకోనని జానకిగారు అన్నందుకు! తన ప్రతిభ పట్ల ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసం ఉండడం అభినందనీయమే. హిందీ గాయని లతా మంగేష్కర్ కు భారతరత్న ఇచ్చారు కనుక నాకు మాత్రం ఎందుకు ఇవ్వరనేది ఆమె ఉద్దేశమని తెలిసిపోతూనే ఉంది. ఇక్కడ ఆమె దక్షిణాది-ఉత్తరాది (లతా మంగేష్కర్ పశ్చిమ భారతీయురాలు కనుక హిందీ-హిందీయేతర అనుకుందాం)తేడా తీసుకురావడం మాత్రం కొంతవరకు సబబుగానే కనిపిస్తుంది.

ఇదే సమయంలో మరికొన్ని నిజాలూ దృష్టిలో పెట్టుకోవాలి. జానకి గారి కంటే ఎక్కువ పాటలు పాడిన మరో ప్రతిభావంత గాయని పీ.సుశీల గారికి కూడా పద్మ భూషణే ఇచ్చారు. ఆమె స్వీకరించారు. జానకిగారూ, సుశీల గారేకాక పద్మ అవార్డుల తీరును గమనించేవారంతా గుర్తించవలసిన మరో విచిత్రం కూడా ఉంది. ఎందరో నేపథ్య గాయకుల, గాయనీమణుల ప్రతిభకు సానపెట్టి శ్రోతలకు పరిచయం చేసిన సినీ సంగీత దర్శక దిగ్గజాలు చాలామందికి పద్మ అవార్డులు వచ్చినట్టు లేదు. కనీసం మనకు తెలిసిన గొప్ప ఉదాహరణ సాలూరు రాజేశ్వరరావుగారు. 1999 వరకు జీవించిన ఆయనకు పద్మ భూషణ్ కాదు సరికదా పద్మశ్రీ కూడా రాలేదు.

ఇక బాపూ గారు ఉన్నారు. ఆయన ప్రముఖ చిత్రకారుడే కాక సినీ దర్శకుడు కూడా. ఆయనకు పద్మ అవార్డు ఇంతవరకు రాకపోవడం కిందటి సంవత్సరం చర్చనీయం అయింది. 'సాక్షి' పత్రిక దానిపై సంపాదకీయం కూడా రాసింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఆయన పద్మశ్రీమంతులయ్యారు. చిత్రం ఏమిటంటే ఆయన చిత్రిక పట్టి నటులుగా తీర్చి దిద్దిన నటశిల్పాలు, నటశేఖరులలో కొందరు చాలా కాలం క్రితమే పద్మశ్రీలు, పద్మభూషణ్ లు అయ్యారు.

పౌరాణిక పాత్రల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఎన్టీఆర్ వంటివారు పద్మ అవార్డుకు ఎంతైనా అర్హులే. అయితే,  ఆ పౌరాణిక పాత్రలకు రూపకల్పన చేసి చిరస్మరణీయం చేసిన కేవీ రెడ్డి,  కమలాకర కామేశ్వరరావు  లాంటి దర్శక రత్నాలకు నాకు తెలిసినంతవరకు  పద్మ అవార్డు రాలేదు(ఒక వేళ ఈ సమాచారం తప్పైతే విజ్ఞులు సవరించగలరు).

అంటే ఏమిటన్నమాట? తెరమీద కనిపించి, వినిపించేవారికీ; తెరవెనుక ప్రయత్నాలు చేసుకునేవారికే కానీ తెరవెనుక ప్రతిభావంతులకు  పద్మ అవార్డులు రావడం చాలా అరుదు.

వెలుగు కింద చీకటి ఉన్నట్టుగా, పద్మం కింద పంకం(అంటే బురద) ఉంటుంది. పోలిక ఎంత బాగా కుదిరిందో చూడండి.

ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేవన్నీ ఇలాగే ఉంటాయేమో! అర్హులకు ఇందిరమ్మ ఇళ్లూ రావు. పద్మ అవార్డులూ రావు.

అయినా తెలియక అడుగుతాను...బిరుదులూ, అవార్డులూ ఇచ్చే పని ప్రభుత్వానికి ఎందుకు? అంతకంటే చక్కబెట్టవలసిన ముఖ్యమైన పనులు ప్రభుత్వానికి ఎన్ని లేవు?!


"తల్లి లాంటి ఊళ్ళకు బూజు...హైదరాబాద్ ప్రియురాలిపై మోజు"

 సీమాంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలోనూ ఇతర పట్టణాలనూ, ఊళ్లను పాడు పెడుతున్నారనీ, అభివృద్ధిని అంతటినీ హైదరాబాద్ లోనే కుమ్మరిస్తున్నారనీ,  సీమాంధ్ర ప్రాంతంలో హైదరాబాద్ స్థాయి నగరాలను అభివృద్ధి చేసుకోవలసిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలనీ, సీమాంధ్ర జనం తమకు ఒక రాజధాని స్థాయి నగరం లేని చారిత్రకమైన లోటును పూరించుకోవాలనీ నేను వివిధ సందర్భాలలో రాశాను.

ఈ రోజు (26 జనవరి) ఆంధ్రజ్యోతిలో అలోక్ రే అనే ఒక బెంగాలీ గృహిణి 'అత్త తప్పును కోడలు సరిదిద్దేనా?' అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆమె అభిప్రాయాలు కొన్ని ఒకింత తేడాతో నా అభిప్రాయాలనే సమర్ధిస్తున్నాయి. ఆ వ్యాసం నుంచి కొన్ని relevant భాగాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.

                                                                        ***

"నయా రాయపూర్, చండీగఢ్ ల మాదిరిగా కొత్త రాజధానులని ఎందుకు అంటున్నానంటే ఇలా కట్టడం వల్ల సామాజికంగా, భౌగోళికంగా జరిగే అభివృద్ధి అపారంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి...హైదరాబాద్ లాంటి రాజధాని నగరాలు రెండు అటు తెలంగాణా, ఇటు ఆంధ్రలో వెలిస్తే ఎలా ఉంటుందో. వాటివల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో. ...ఇది ఖర్చుతో కూడుకున్నదే. అయినా తప్పదు.

తల్లి లాంటి ఊళ్లను అభివృద్ధి చేసుకోకుండా ప్రియురాలి వంటి హైదరాబాద్ పై తెలుగువాళ్ళంతా మోజు పడుతున్నారు. అటు ఆంధ్రాప్రాంతీయులు, ఇటు తెలంగాణీయులు అంతా హైదరాబాద్ ను పట్టుకుని వేలాడుతున్నారు. ఇక్కడే సదుపాయాలన్నీ కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. తమ ఊర్లను బంజరు దొడ్లుగా మార్చేస్తున్నారు. ఆంధ్రలోని కొన్ని పట్టణాలు తెలంగాణ లోని పట్టణాల కంటే దారుణంగా ఉన్నాయి. అయినా అక్కడి ప్రజలు ఎందుకని తమ నాయకుల్ని నిలదీయడం లేదో అర్థం కాలేదు నాకు...అదే విధంగా తెలంగాణలోని ప్రాంతాలు కూడా! అంతా హైదరాబాద్ కే వలస. రెండు ప్రాంతాల నేతలూ...ప్రజలూ హైదరాబాద్ నే కౌగిలించుకుంటున్నారు...ఊళ్లను వల్లకాడు చేసి...పిల్లా పాపలతో  ఇక్కడే మకాం పెట్టేయాలని తపిస్తున్నారు."

                                                                        ***

ఇది చదివిన తర్వాత, 'మరి బెంగాల్ లో గోర్ఖా ల్యాండ్ వేర్పాటు ఉద్యమం విషయంలో ఈ బెంగాలీ ఆడబడుచు ఏమంటారో' నన్నప్రశ్న బాణంలా దూసుకొచ్చే మాట నిజమే.  అదెలా ఉన్నా;  ఊళ్లను పాడు పెడుతున్నారనీ, హైదరాబాద్ స్థాయి నగరాలను అన్ని ప్రాంతాలవారూ అభివృద్ధి చేసుకోవాలనీ అన్న మాటలు అర్థవంతంగానే ఉన్నాయి కదా!

మంచి మాటలు... 'వినదగు నెవ్వరు చెప్పిన'...

సంబంధిత పోస్ట్ లు: 1. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది!  2. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి? 3. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి. 4. తెలుగు సభల్లో తెలుగు 'బహిర్భూమి' గురించి చర్చిస్తారా?




Thursday, January 24, 2013

కామోత్సవ్ లా ఈ సాహిత్యోత్సవ్ ఏమిటి?!

భారతదేశానికి ఒక ఆత్మ అంటూ ఉందా?

పోనీ ఆత్మను నమ్మని వాళ్ళు ఉంటారు కనుక ఇదే ప్రశ్నను మరోలా వేసుకుందాం...

భారతదేశానికి ఒక హృదయమనేది ఉందా?

ఆత్మతో స్పందించి హృదయంతో మాట్లాడతారనుకునే కవులు, రచయితలూ కూడా ఫైవ్ స్టార్ సెట్టింగ్ లలో  'సాహిత్యోత్సవ్' లు జరుపుకోవడం చూస్తుంటే ఇలాంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. అనుమానంతోపాటు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఎలా వస్తాయనిపిస్తుంది.

అనేకానేక విధాలుగా క్షోభిస్తున్నఈ దేశం ఏ కారణంతో నైనా 'సెలెబ్రేట్' చేసుకునే ఘడియ వచ్చిందా? కామోత్సవ్ లా ఈ  సాహిత్యోత్సవ్ ఏమిటి?

కిందటి నెలలో ఢిల్లీలో జరిగిన దారుణ మానభంగ ఘటన భారతీయ సమాజం ఆత్మను(పోనీ హృదయాన్ని) కుళ్లబొడిచిందనుకున్నాం. దానిపై భారతీయసమాజం మొత్తం ఒకే గుండెతో స్పందించిందనుకున్నాం. దేశం మొత్తంలో రోజుల తరబడి సంతాప వాతావరణం నెలకొందనుకున్నాం. ఆ వెంటనే వచ్చిన జనవరి 1  ఆర్భాటాలకు దూరంగా ఉండాలని కేంద్రం నిర్ణయించుకుని కొంత సున్నితత్వాన్ని చాటుకుంది.

అయితే, ఢిల్లీ మానభంగ ఘటన తర్వాత కూడా మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు, నాలుగేళ్ల పసి పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. పశువులు కూడా పాల్పడని అత్యంత హేయమైన చర్యలకు పాల్పడుతున్న మనుషులను పోల్చడానికి ఏ భాషలోనూ మాటలు దొరకని పరిస్థితిని చూస్తున్నాం.

మానభంగాల వంటి తీవ్రాతి తీవ్ర ఘాతుకాలే కాక ఈ దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఏటా జరిగినట్టే దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఉత్తరభారతంలోని మరికొన్ని చోట్లా ఈ ఏడాది కూడా చలి చావులు సంభవించాయి. అధికారికంగా ఆకలి చావులు లేవనుకున్నా అసంఖ్యాక జనం రోజూ అర్థాకలి చావులు చస్తూనే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఉరితాళ్ళు పేనుకుంటూనే ఉన్నారు. గ్రామసీమలు  పోషకాహార, పారిశుద్ధ్యలోపాలతో దరిద్రం ఓడుతున్నాయి. అనేక ఊళ్ళు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా లేక కళ్ళు తేలేస్తున్నాయి. ఆర్థిక వ్యత్యాసాల గండి రాకాసి ప్రమాణంలో పెరుగుతూనే ఉంది. అవినీతి కుంభకోణాలు పాము పుట్టల్లా బద్దలవుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లతో జైళ్ళు నిండిపోతున్నాయి...

ఇంతటి దుర్మార్గపు వ్యవస్థపై పిడుగులు కురిపించవలసిన కవి రచయితలు తమ కలాలనే  వజ్రాయుధాలను జమ్మి చెట్టుకెక్కించి సాహిత్యోత్సవ్ లు జరుపుకోవడమా?! ఎంత ఆఘాయిత్యంగా ఉంది! అభ్యుదయం, ఆదర్శం ఏ ఆకర్షణల ఎండమావుల వెంట పడి గల్లంతైపోయాయి?

ఢిల్లీ యువతి మానభంగం, హత్య కలిగించిన శోకం నుంచి ఈ దేశం ఇంకా తేరుకొనే లేదు. సంతాప దినాలు పూర్తి కానేలేదు. హైదరాబాద్ లో లిటరరీ 'ఫెస్టివల్' నిర్వహించారు. విప్లవ,అభ్యుదయ,స్త్రీవాద కవులు కూడా పాల్గొన్నారు. నేటి నుంచీ జైపూర్ లో లిటరరీ 'ఫెస్టివల్' జరుగుతోంది. దేశ, విదేశీ కవులు, రచయితలు పాల్గొనబోతున్నట్టు సమాచారం.

సాహిత్య సమావేశాలు జరగవచ్చు, తప్పులేదు. కానీ వాటిని 'ఫెస్టివల్' అనడ మేమిటి?  అలా అనడంలోని అనౌచిత్యం, అసంబద్ధత ఇంతమంది ఘనతవహించిన కవిపుంగవుల మెదళ్ళకు తట్టలేదా? చలన చిత్రోత్సవాలు, సంగీతోత్సవాలు  జరుగుతున్నాయంటే వాటి దారి వేరు. కళా జగత్తుకు అంతటికీ తలమానికంగానే కాదు, తలగానూ ఉండవలసిన సాహిత్యం కూడా తలను తాకట్టు పెట్టేసి 'ఉత్సవ'మార్గం పట్టడమా?

వ్యవస్థాగత రుగ్మతలపై కసిగా కలాల కత్తులు నూరవలసిన మన కవి రచయితలు రసికరాజులుగా కూడా ఎలా మారారో చూడండి... సాహిత్యోత్సవ్ అన్నాక దానికి రంజైన కళాత్మక నేపథ్యం కూడా ఉండవలసిందే. 'పింక్ సిటీ'గా పేరున్న చారిత్రక నగరం జైపూర్ అయితేనే అందుకు భేషుగ్గా ఉంటుంది. ఆ ఫ్యూడల్ రాజాస్థానపు ఎరుపు రంగు కట్టడాలలో అదృశ్యంగా ఉన్న పరువు హత్యల నెత్తుటి చారికలు  మన కవి రచయితల రసికనేత్రాలకు కనబడవు!

దేశం శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉందని చాటడానికీ, వాస్తవిక సమస్యలనుంచి జనం దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వాలు ఇలాంటి ఉత్సవాలను జరపడమో ప్రోత్సహించడమో చేస్తుంటాయి. కవి రచయితలు కూడా ఆ వలలో చిక్కుకున్నారంటే అర్థమేమిటి? బహుశా ప్రభువులకు, కవులకు మధ్య అప్రకటిత అవగాహన ఏమైనా ఏర్పడిందా?

సామాజిక హితానికి అంకితమైన నేటి కాలపు కవులకు ఎవరికీ 'సెలెబ్రేట్' చేసుకునే అవకాశం వారి జీవిత కాలంలో రానే రాదు. అటువంటిది సాహిత్యోత్సవ్ ల పేరిట విజయనగర సామ్రాజ్యపు రోజులను ఆవిష్కరించే దశకు మన కవులు తిరోగమించడాన్ని ఏమనాలి?

ఇక్కడ కూడా గాంధీజీని ఒక బెంచ్ మార్క్ గా చెప్పుకోక తప్పడం లేదు. తనకు చిన్నప్పుడు నాటకాల మీద ఎంతో మక్కువ ఉండేదనీ, అయితే నా జీవితంలో వినోదాలు, వేడుకల అధ్యాయం నా పన్నెండేళ్ళ వయసుకే ముగిసిపోయిందనీ, ఆ తర్వాత నా జీవితంలోకి అవి ప్రవేశించలేదనీ, అందుకు అవకాశం కూడా లేకపోయిందనీ ఆయన ఆత్మకథలో రాసుకున్నారు.

ఇందుకు భిన్నంగా నేటి మన కవి రచయితలు ఏం చేస్తున్నారు? అభ్యుదయ యుగాన్ని స్వప్నించినవారే, అది సాకారం కాకుండానే తమ ఆదర్శాలను అటక ఎక్కించి ఉత్సవ మార్గంలో ఊరేగుతున్నారు!






Tuesday, January 22, 2013

డైనెస్టీ నేస్టీ... ఎవరికి కాదు టేస్టీ?!

నిన్న(21 జనవరి) రాత్రి ఇంగ్లీష్ వార్తా చానెళ్లలో వారసత్వ అధికారం పై వాడి, వేడి చర్చ జరిగింది. ఒక చానెల్ చర్చలో బీజేపీ నేత ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎద్దేవా చేస్తూ తన సహజశైలిలో 'డైనెస్టీ-నేస్టీ-కొందరికి టేస్టీ' అని చమత్కరించారు. కాంగ్రెస్ ప్రతినిధిగా చర్చలో పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి రాజీవ్ శుక్లా సమాధానం చెబుతూ బీజేపీలో కూడా 50 మందికి పైగా రాజకీయ వారసులు ఉన్నారు, వారి మాటేమిటని అడిగారు. రాజ్ నాథ్ సింగ్ కుమారుని గురించి ప్రస్తావించారు. దానిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ, నాయకత్వ స్థానంలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు.

అంటే వెంకయ్య నాయుడి ఉద్దేశంలో పార్టీలలో వారసత్వ రాజకీయాలు ఉండచ్చు. కానీ వారసులు నాయకత్వ స్థానంలో ఉండకూడదు! ఇదెలా సాధ్యమవుతుంది? ఉదాహరణకు, రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు నాయకత్వ స్థానం లో ఉన్నారు. ఆయన కుమారుడు పార్టీలో ఉన్నారు కానీ నాయకత్వ స్థానంలో లేరు. ఒకవేళ రేపు ఆయన నాయకత్వ స్థానానికి చేరుకోరని ఎలా చెబుతారు? వారసులు నాయకత్వస్థానానికి చేరుకోకూడదని ఏమైనా నియమం పెడతారా? పార్టీలో ఎదిగే అవకాశం లేనప్పుడు వారసులు పార్టీలో చేరి వెట్టి చాకిరీ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తారు? వెంకయ్య నాయుడి గారి తర్కం నాకైతే అర్థం కాలేదు.

అనేక పార్టీలలో ముఖ్యమంత్రులు, మంత్రుల పుత్రరత్నాలు, పుత్రికారత్నాలు ఎమ్మెల్యేలుగానో, ఎం.పీలు గానో ఉన్నారు. వీరు రేపు మంత్రులో, ముఖ్యమంత్రులో, అవకాశాలు కలిసొస్తే ప్రధానమంత్రో అయ్యే అవకాశం ఉండదా? మీరు 'వారసులు' కనుక కావడానికి వీలు లేదని ఎలా అంటారు? ఏ న్యాయసూత్రం ప్రకారం అంటారు?

దేశంలో ఆకర్షణీయమైన ఇతరేతర రంగాలు/ అనాయాస ఆదాయమార్గాలు అభివృద్ధి చెందనంత కాలం రాజకీయరంగంపై వారసుల ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఈ వాస్తవాన్ని విస్మరించి ఒకరి వారసులను ఒకరు ఆడిపోసుకోవడం వల్ల జనానికి అయాచిత వినోదాన్ని అందించడం తప్ప ప్రయోజనం ఏముంటుంది?

మరో చర్చలో సచిన్ పైలట్ మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాల ఆరోపణలో అర్థం లేదని తేల్చారు. వారసత్వం లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడచ్చు కానీ, ఆ తర్వాత సొంత ప్రతిభను చాటుకునే ప్రతిసారీ ఎన్నిక కావలసివస్తుందని ఆయన తర్కం. అయ్యా మహాశయా, లాంచింగ్ ప్యాడ్ దొరకడమే కష్టం, దానితో పోలిస్తే ఆ తర్వాత అల్లుకు పోవడం ఎవరికైనా తేలికే నన్న వాస్తవాన్ని వడ్డించిన రాజకీయ విస్తళ్ళ లాంటి వారసుల బుద్ధికి ఎక్కేలా ఎలా చెప్పాలి?

పోనీ వారసత్వ రాజకీయాలను నిరసించే రాజకీయ పార్టీలన్నీ ఒక పని చేస్తే ఎలా ఉంటుంది?

అది-రాజకీయాలలోకి వారసుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆ మేరకు పార్టీ నియమావళిలో నిబంధనను పొందుపరచడం. కనీసం రెండు, మూడు పార్టీలైనా ఆ పని చేస్తే మిగిలిన పార్టీల మీద కూడా ఒత్తిడి పెరిగి రేపు అవి కూడా ఆ మార్గం తొక్కే అవకాశం ఉంటుంది కదా! పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా!


Monday, January 21, 2013

రాహుల్ ప్రసంగం-బీజేపీ స్పందన

ఎన్నికల ఫలితాల రోజున నరేంద్ర మోడీ' తన రాజకీయ గురువు కేశూభాయ్ పటేల్ ఇంటికి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేయడం, తల్లిని దర్శించి ఆశీస్సులు తీసుకోవడం సామాన్యజనం అద్భుతంగా కనెక్ట్ అయ్యే దృశ్యాలనీ, ఇవి మానవ సంబంధాల విలువలను ప్రతిఫలిస్తాయనీ' సరిగ్గా నెలరోజుల క్రితం(21 డిసెంబర్ 2012), 'ప్రధానిగా మోడీ: ఒక విష్ ఫుల్ థింకింగ్' అనే పోస్ట్ లో రాశాను.

జైపూర్ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ నూతన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అదే చేశారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు:

"నిన్న రాత్రి  మా అమ్మ నా గదిలోకి వచ్చారు. నా పక్కన కూర్చుని ఏడ్చారు. బలహీనులను సాధికారుల్ని చేయలేనప్పుడు అధికారం విషం లాంటి దన్నారు."

"నేను చిన్నప్పుడు బ్యాడ్ మింటన్ ఆడేవాణ్ణి. అది నాకు సమతుల్యత నేర్పింది. మా నాయనమ్మ ఇంట్లో ఆమెకు అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు నాకు బ్యాడ్ మింటన్ నేర్పారు. నాతో చాలా ఆత్మీయంగా ఉండేవారు. వారే ఒక రోజు మా నాయనమ్మను చంపారు. ఆ ఘటన నాలో సమతుల్యతను తీసుకుపోయింది."

"నాయనమ్మ హత్య జరిగిన రోజున నాన్న బెంగాల్ లో ఉన్నారు. వెంటనే తిరిగి వచ్చారు. నాన్న కంట తడి పెట్టడం అంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రోజే మొదటిసారి నాన్న ఏడవడం చూశాను."

రాహుల్ అన్న ఈ మాటలు కూడా జనంతో అద్భుతంగా కనెక్ట్ అయ్యే మాటలు. ఆయన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో కొన్ని రాజకీయ ధ్వనులు మాత్రమే చేశారు. అది కూడా చాలా అరుదుగా. వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యుల ప్రస్తావనలు, భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ఆయన నోట ఇంతవరకూ వినలేదు. సాధారణంగా నాయకుల నోట రాజకీయమైన మాటలు, పార్టీ/ప్రభుత్వ విధానాలు, ఆచరణశుద్ధి లేని ఉపదేశాలు వగైరాలు యాంత్రికంగా దొర్లిపోతుంటాయి. అవి జనంలో ఎలాంటి స్పందనా తీసుకురావు. నాయకులన్న తర్వాత జనానికి వారు వ్యక్తిగతంగా కూడా అర్థమవుతుండాలి. వారి ఆలోచనలు, విధానాలు, అభిప్రాయాలు, వాగ్దానాలే కాక: వారి హృదయమూ తెలుస్తూ ఉండాలి. రాహుల్ తన తొలి కీలక ప్రసంగంలోనే  జనంతో కనెక్ట్ కాగల మాటలు మాట్లాడారు. నిజానికి ఆయన దాదాపు దశాబ్దకాలంగా వార్తలలో ఉన్నారు. అయినా సరే, ఇలా తన హృదయం నుంచి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదో తెలియదు. రెండు పర్యాయాల పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీలో సోనియా తర్వాత అంతటి కీలక వ్యక్తిగా, (జనానికి తెలిసేలా) తనదైన ముద్ర ఎందుకు వేయలేదన్న ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉంటుంది.

సరే, రాహుల్ గాంధీ ఇంతటి పార్టీ భారాన్ని మోయడంలో ఎంతవరకు కృతకృత్యులు అవుతారు, తను ఉద్దేశిస్తున్న మార్పులు ఎంతవరకు తీసుకు రాగలుగుతారు, పార్టీనీ, ప్రభుత్వం పని తీరును తను ఆశించిన విధంగా మార్చగలుగుతారా, లేక వాటికి అనుగుణంగా తనే మారతారా,  అధికార వికేంద్రీకరణ లక్ష్యాన్ని ఎంతవరకు నిజం చేయగలుగుతారు, 2014 ఎన్నికలలో పార్టీని విజయతీరంవైపు నడిపించగలుగుతారా అన్న ప్రశ్నలు ఎలాగూ ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి. ఆయన సాఫల్య, వైఫల్యాల చర్చ ఇక మీదట మరింత గట్టిగా జరుగుతుంది. అదలా ఉంచి ఆయన జైపూర్ ప్రసంగానికే పరిమితమైతే అది ఆయన రాజకీయ భవిష్య గీతానికి తగిన పల్లవిగా చెప్పవచ్చు.

రాహుల్ మరికొన్ని గుర్తుపెట్టుకోదగిన మాటలు అన్నారు:

"మన మంత్రులు పంచాయతీ పనులు ఎందుకు చేస్తున్నారు? సుప్రీం కోర్ట్ ఎందుకు సాధారణ కేసుల భారాన్ని మోస్తోంది? ఉపాధ్యాయులను ముఖ్యమంత్రులు నియమించాల్సిన అవసరం ఏమిటి? ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వామైనా కొద్దిమంది నాయకుల చేతిలో ఎండుకుంటుంది? మన దేశంలో అధికారం కేంద్రీకృతమైంది."

"యువతలో ఎందుకీ ఆగ్రహం? ఎర్రబుగ్గ కార్లలో అధికారం పరుగులు తీస్తుంటే, వీరు పక్కన నిలబడి చూస్తారు. ఏ రంగాన్ని తీసుకున్నా తెలివైన వారిని పక్కన పెట్టేలా వాటిని రూపొందించారు. అన్నింటి తలుపులూ బిగించేశారు."

"మనం విజ్ఞానాన్ని గౌరవించం. అధికారానికి మాత్రమే విలువ ఇస్తాం. భారత్ లో ఇదొక విషాదం."

రాహుల్ గాంధీ మామూలు జనానికి కనెక్ట్ అయ్యే మాటలు మాట్లాడడమే కాదు, అన్ని పార్టీల వారినీ ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యకరమైన సంకేతాలు ఏ వైపు నుంచి వచ్చినా గుర్తించే అలవాటు రాజకీయపక్షాలు ఇకనైనా చేసుకోవాలేమో. అలా చేయడం రాజకీయంగా కరెక్ట్ కాదనుకుంటే కనీసం మౌనమైనా పాటించాలి. ఆ దృష్ట్యా చూసినప్పుడు రాహుల్ ప్రసంగం పై బీజేపీ స్పందన నిరాశ కలిగించిందని చెప్పక తప్పదు. అది రాహుల్ ప్రసంగ స్ఫూర్తితో తులతూగక పోగా; ఆయన ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడారనీ, ఆయన ప్రసంగంలో ఉన్నది ఆదర్శవాదం(ఐడియలిజం) మాత్రమేననీ బీజేపీ అధికారప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. విలువల గురించి మాట్లాడే బీజేపీ ఆదర్శవాదం కూడదన్నట్టు మాట్లాడడం ఆశ్చర్యం. ఇక అరుణ్ జైట్లీ ఆనువంశిక అధికారమనే పాత ఆరోపణే మరోసారి చేశారు. మొత్తం మీద రాహుల్ రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే బీజేపీ రాజకీయంగా స్పందించింది.


Sunday, January 20, 2013

రాహుల్ గాంధీ ప్రమోషన్:2

నిజానికి కుటుంబ పాలన  అనేది కాంగ్రెస్ కే పరిమితం కాదు. కాంగ్రెస్ లోనూ నెహ్రూ-గాంధీ కుటుంబం ఒక్కదానికే పరిమితం కాదు. కాంగ్రెస్ లో పాలక కుటుంబాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కుటుంబపాలనను ఆక్షేపిస్తూ, తమదే అసలు సిసలు ప్రజాస్వామిక పార్టీ అని చెప్పుకునే బీజేపీలోనూ పాలక కుటుంబాలు, వారసత్వ రాజకీయాలూ ఉన్నాయి. విజయరాజే సిందియా కుటుంబం ఒక ఉదాహరణ. బీజేపీలో వారసులను రాజకీయాలలోకి తీసుకురారాదన్న నియమం ఏమీ లేదు. అటల్ బిహారీ వాజ్ పేయికి సంతానమే ఉండి, రాజకీయాలపై ఆసక్తి చూపితే వద్దని అంటారని చెప్పలేం. ఒడిస్సాలో బీజేడీ అధినేత నవీన్ పట్నాయిక్ రూపంలో బిజూ పట్నాయిక్ వారసత్వమే అధికారం నెరపుతోంది. బీజేడీ గతంలో బీజేపీకి మిత్రపక్షం. అలాగే మరో మిత్రపక్షమైన శివసేనలో వారసత్వ రాజకీయాలే చీలికను తెచ్చాయి. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా వారసులే అధికారచక్రం తిప్పుతున్నారు. హర్యానాలో పాలక వారసత్వం దేవీలాల్ నుంచి ఆయన కొడుకు ఓం ప్రకాశ్ చౌతాలకు ఎలా బదిలీ అయిందో చూశాం. ఇప్పుడు చౌతాలాకూ వారసులు అందివచ్చారు. ద్రవిడ భూమిలో కరుణానిధి ఈ మధ్యనే తన అధికార ఆస్తిని స్టాలిన్ కు ఇస్తూ వీలునామా రాశారు. చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్ యాదవ్ మరికొన్ని ఉదాహరణలు.  తాజాగా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ రాజకీయ వారసుడిగా ముందుకు వస్తున్నారు.

మిగిలిన పార్టీలకూ, కాంగ్రెస్ కూ మధ్య ఒక తేడా మాత్రం ఉంది. కాంగ్రెస్ 125 ఏళ్ళకు పైబడిన పార్టీ కనుక ఆ పార్టీలో  పాలక కుటుంబాల సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. ఆ పార్టీలో పాలనాధికారం కొడుకులు, కూతుళ్లనూ, మనవలనూ కూడా దాటి మునిమనవల వరకూ చేరుకుని ఉండచ్చు. బీజేపీ తదితర పార్టీలకు అంత చరిత్ర లేదు కనుక ప్రస్తుతానికి కొడుకులు, కూతుళ్ళు, మనవల వరకు రాజకీయ వారసత్వం చేరుకుని ఉండచ్చు. అలాగే కాంగ్రెస్ తో పోల్చితే కాంగ్రెసేతర పార్టీలలో పాలక కుటుంబాల సంఖ్య తక్కువైతే కావచ్చు. మొత్తానికి తేడా రాశిలోనే కానీ వాసిలో కాదు.  ఒకవేళ ముందు ముందు కూడా వారసత్వ రాజకీయాలను జనం సహించగలిగే పరిస్థితి ఉండి; రాజకీయాల కంటే ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ వృత్తులు/ఆదాయమార్గాలు ఏవీ అందుబాటులోకి వచ్చి ఉండకపోతే కాంగ్రెసేతర పార్టీలలో కూడా పాలక కుటుంబాల సంఖ్య పెరిగి తీరుతుందనడంలో సందేహం లేదు.

అయినా సరే, 'పార్టీలలో వారసత్వ రాజకీయాలు ఉండడం వేరు, కాంగ్రెస్ లోలా అత్యున్నత అధికారం ఒకే కుటుంబ వారసత్వంగా ఉండడం వే'రని ఎవరైనా వాదిస్తే వారి తర్కప్రావీణ్యానికి ఒక నమస్కారం చేయడం కన్నా చేయగలిగింది లేదు.

ఈవిధంగా నిష్పాక్షికంగా  చూసినప్పుడు భారతీయ రాజకీయ సంస్కృతిలో కుటుంబపాలనను ప్రత్యేకించి ఒక పార్టీకే ఆపాదించి ఆడిపోసుకునే అవకాశం లేకపోయినా; రాహుల్ గాంధీ విషయంలో ఆ అంశం భూతద్దంలో కనిపించడానికి వేరే కారణాలు ఉన్నాయి. అవి ప్రధానంగా రాహుల్ వ్యక్తిగత ప్రవర్తనాసరళికి సంబంధించినవి.

రాహుల్ గాంధీ, నాకు గుర్తున్నంతవరకు 2004 నుంచీ రాజకీయంగా వార్తలలో ఉంటున్నారు. అప్పట్లో ఆయన భారతదేశ సామాజిక, రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారనీ; విశ్వవిద్యాలయ పండితులతో భేటీ అవుతున్నారనీ వార్తలు వచ్చాయి. భవిష్య నాయకుడిగా తర్ఫీదు అవుతున్నారనే అభిప్రాయం చాలామందికి కలిగింది. ఇప్పుడు 2013లో నిలబడి ఒకసారి వెనుదిరిగి చూస్తే, రాజకీయ శిక్షణకు ఆయన చాలా ఎక్కువ కాలం తీసుకున్నారనే కాక ఇప్పటికీ శిక్షణ పూర్తి కాలేదనే అభిప్రాయమే కలుగుతుంది. ఆయన ఇప్పటికి రెండు పర్యాయాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్ చర్చల్లో ఆయన చురుగ్గా పాల్గొన్న సందర్భం కానీ, గుర్తు పెట్టుకోదగిన ప్రసంగం చేసిన సందర్భం కానీ కనబడవు. ఇటీవలి ఢిల్లీ మానభంగ ఘటనపై ఆయన మాట్లాడకపోవడం, నిరసన ప్రదర్శన జరుపుతున్న యువతతో ఒక కీలక యువనేతగా కనెక్ట్ కాకపోవడం విమర్శలను ఆకర్షించాయి. గత కొన్ని ఎన్నికలుగా ఆయన ఉత్తరప్రదేశ్ పై దృష్టిని కేంద్రీకరించడం తెలిసినదే. అయినా చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేదన్న విమర్సా ఆయన మీద ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారని అనడమే కానీ అవి ఎలాంటివో తెలియదు. అవి అంతగా  ప్రచారంలో లేవు. 2004 నుంచీ ఇప్పటి వరకూ జరుగుతున్నది రాహుల్ అనే యువనేతకు మెరుగులు దిద్ది షో కేస్ లో పెట్టే ప్రయత్నం మాత్రమే. అది ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో తెలియదు. ఈ పాటికే స్వయంప్రకాశాన్ని సంతరించుకుని రాజకీయంగా తన ఉనికిని రాహుల్ గట్టిగా చాటుకుని ఉంటే, కుటుంబపాలన కోణం వెనకంజ వేసి ఉండేది. కానీ స్వయంప్రకాశాన్ని తెచ్చుకోడానికే ఆయన అసాధారణ వ్యవధి తీసుకుంటున్నారు. అదీ సమస్య!

మొత్తం మీద పైన చెప్పుకున్నట్టు, పట్టణ ప్రాంత మధ్యతరగతికీ, యువతకూ పార్టీ దగ్గర కావాలన్న సోనియా; అంతలోనే పాత పద్ధతులకు మళ్ళిపోయి  రాహుల్ ను అధినాయక స్థానం దిశగా నడిపించడం ద్వారా వాస్తవానికి ఆ వర్గాలను దూరం చేసుకుంటున్నారా అనిపిస్తుంది. రాహుల్ కు మరికొంత సమయమిచ్చి, తగినంత అనుభవమూ, ఇమేజ్ ఉండి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని  మరొక యువనేతను ఎవరినైనా ఈలోపున  ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో!?

గోడమీది రాతల్ని చదవడంలో రాజకీయ పార్టీలు అన్నీ ఆలస్యం చేస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ మరింత ఎక్కువ ఆలస్యం చేస్తుంది. కాంగ్రెస్-యూపీయే నాయకత్వం క్షేత్రవాస్తవికతకు దూరమవుతున్న సంగతి 2009 ఎన్నికల తర్వాత మరింత స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. వివిధ అవినీతి ఆరోపణలపై దాని స్పందనే అందుకు ఒక నిదర్శనం. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్న నేటి యువత పూర్తిగా భిన్నమైన యువత అన్న సంగతి అన్నా హాజరే ఉద్యమ సందర్భంలోనూ, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కు వ్యక్తమైన మద్దతు సందర్భంలోనూ మరింత బాగా అర్థమైంది.  ఢిల్లీ ఘటనతో కానీ ఆ సంగతి కాంగ్రెస్ కు తలకెక్కలేదు.

కాంగ్రెస్ గుర్తించని అంశం మరొకటి కూడా ఉంది. నేటి యువత అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై బాంబు పేలుళ్ళ వంటి ఘటనల అనంతరకాలానికి చెందిన యువత కూడా. బీజేపీ ఈ పరిణామాన్ని గమనించో గమనించకో తెలియదు కానీ, మూడో కంటికి తెలియనంత నిశ్శబ్దంగా అయోధ్యనుంచి అభివృద్ధికి మళ్ళిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడి ఒక్కరే అభివృద్ధికి కస్టోడియన్ లా ప్రచారం పొందుతున్నారు. నేటి విద్యావంత మధ్యతరగతి యువతను మోడీయే ఎక్కువ ఆకట్టుకుంటే ఆశ్చర్యంలేదు. నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, జగమెరిగిన ఆర్థికవేత్త మన్ మోహన్ సింగ్ పదేళ్లుగా కేంద్రంలో అత్యున్నత అధికారపీఠం మీద ఉన్నారు. అయినాసరే, తన విధానాల ఫలితంగా చెప్పదగిన అభివృద్ధి ని మోడీ తన నినాదంగా చేసుకుంటుంటే మన్ మోహన్ మౌన మోహన్ లా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు. అదే తమాషా!

                                                                                                                        (అయిపోయింది)

తా.క:  'ది హిందూ' దినపత్రిక కొన్ని రోజుల క్రితం రాహుల్ ను 'యువరాజ్' గా సంబోధించడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ రోజు(20 జనవరి) మరోసారి అలాగే సంబోధించడం చూసి మరింత ఆశ్చర్యపోయాను. ఇంకో పత్రికైతే అనుకోవచ్చు...కానీ హిందూ లాంటి పత్రిక! అందులో professional maturity లోపించిన సంగతిని సంపాదకుల దృష్టికి ఎవరూ తేలేదా ?





Saturday, January 19, 2013

రాహుల్ గాంధీ ప్రమోషన్:1

జైపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్ నుంచి ప్రస్తుతానికి చెప్పుకోదగిన సందేశాలు  రెండు అందాయి. మొదటిది, పట్టణ ప్రాంత జనానికి; ముఖ్యంగా యువతకు, మధ్యతరగతికి పార్టీ దగ్గరవాలన్న సోనియా గాంధీ సందేశం. రెండవది, రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీలో 'సెకండ్ ఇన్ కమాండ్' ఆయనేనన్న సందేశాన్ని అధికారికంగా అందించడం. క్రమంగా ఆయనే 'ఫస్ట్ ఇన్ కమాండ్' గా మారతారన్న విషయం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు.

గమనించవలసింది ఏమిటంటే, యువతకు దగ్గరవాలన్న సోనియా సందేశానికి రాహుల్ పదోన్నతి ఒక సహజక్రియగా  కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతూ ఉండచ్చు. కానీ క్షేత్రవాస్తవికత(గ్రౌండ్ రియాలిటీ)నుంచి చూస్తే పై రెండు సందేశాలు పరస్పర విరుద్ధమైనవని అర్థమవుతుంది. ఎలాగో చూద్దాం.

పట్టణ ప్రాంత జనాలు, యువత, మధ్యతరగతి క్రమంగా రాజకీయంగా తమ ఉనికిని స్థాపించుకుంటున్నారనీ, వారిని దూరం చేసుకోవడం పార్టీకి నష్టం కలిగిస్తుందనీ సోనియా గాంధీ సరిగానే గుర్తించారు. కాకపోతే పదేళ్ళు, లేదా కనీసం అయిదేళ్లు ఆలస్యంగా గుర్తించారు. నేటి యువత పది, పదిహేనేళ్ళ నాటి యువత కాదు. ఇంకా చెప్పాలంటే ముప్పై ఏళ్లనాటి యువత కూడా కాదు. ముప్పై ఏళ్ల క్రితం వరకు యువతతోపాటు మొత్తం  మధ్యతరగతి విద్యావంతవర్గం వోటుకు అంత విలువ లేదు. ఎన్నికలలో రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి వారికి  లేదు. అది రాజకీయంగా విస్మృతవర్గం. ఎన్నికల్లో కనీసం వోటు హక్కును కూడా వినియోగించుకోని మందకొడి వర్గంగా వీరు విమర్శలను ఎదుర్కోవలసి రావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. లేదా ఇదే కారణం కావచ్చు. కాంగ్రెస్ సహా  మధ్యేవాదపక్షాలు అన్నీ పాదయాత్రలు చేయడం, పల్లె బాటలు పట్టడం, కిలో రెండు రూపాయల బియ్యం వంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం వగైరాలన్నీ ఎన్నికలలో నిర్ణయాత్మక పాత్ర పోషించే గ్రామీణ వోటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగమే. ఇప్పుడు ఈ వోటర్ల ప్రాధాన్యం పోయిందని అనడంలేదు. కాకపోతే మధ్యతరగతి విద్యావంతవర్గం కూడా రాజకీయంగా గొంతు పెంచుకుంటోంది. సోనియా గాంధీ మాటలు ఆ గ్రహింపునే వెల్లడిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా గత పది, పదిహేనేళ్లుగా చూస్తున్న యువత అంతకు ముందునాటి యువత కంటే భిన్నం. ఈ యువత ఉదారవాద ఆర్థికవిధానాల మధ్య కన్ను విప్పిన లేదా పెరిగిన యువత. సోనియా గాంధీ అన్నట్టు వెనకటి కంటే ఎక్కువగా ఆధునిక విద్యను అందుకుంటూ, ఆర్థికంగా బలపడుతూ; సమాచార హక్కూ, సోషల్ మీడియా వంటి వనరులతో సరికొత్త రాజకీయ చైతన్యాన్నిపుంజుకుంటూ, భావప్రకటనాశక్తిని సమీకరించుకుంటున్న యువత. అంతేకాదు, ఈ యువత పాత రాజకీయ సంస్కృతిలోని కొన్ని అంశాలను ద్వేషిస్తోంది. పాలకులనుంచి జవాబుదారీని డిమాండ్ చేస్తోంది.  ముప్పై ఏళ్ల లోపు వారు నేటి జనాభాలో 40 శాతం ఉన్నారు కనుకనే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనడం నేటి యువతపట్ల పూర్తి అవగాహనను ప్రతిబింబించదు. ఈ యువత గుణాత్మకంగానే(qualitatively) భిన్నమైనదన్న అవగాహన అవసరం.

గుణాత్మకమైన తేడా అలా ఉండగా, మధ్యతరగతి విద్యావంతవర్గంలో భాగంగా నేటి యువతకు కొన్ని చారిత్రక వారసత్వాలూ ఉన్నాయి. అది కనీసం 90 ఏళ్ల వారసత్వం. మొదట్లో గాంధీజీని వ్యతిరేకించిన సనాతనవాదులకూ; ఆ తర్వాత స్వతంత్ర భారతంలో తమను ఒక రాజకీయ అప్రధాన, విస్మృతవర్గం గా మార్చిన నెహ్రూ-ఇందిరాగాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ ను వ్యతిరేకించిన వారికీ నేటి యువత వారసులు. కాంగ్రెస్ విద్వేషం మధ్యతరగతి విద్యావంత వర్గపు ఇంటింటి వారసత్వం. కాంగ్రెస్ విద్వేషంలో కాంగ్రెస్ ఆనువంశిక అధికారం(కేంద్రంలో అత్యున్నత అధికారం నెహ్రూ-గాంధీ కుటుంబానికి పరిమితం కావడం) ఒక ముఖ్యమైన భాగమన్న సంగతిని మరచిపోకూడదు.

మళ్ళీ సోనియా గాంధీ సందేశం దగ్గరకు వెడితే; యువతను, మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకోవలసిన అవసరాన్ని ఆమె సరిగానే గుర్తించారు. మరోవైపు, మధ్యతరగతి యువతకు ఏమాత్రం రుచించని ఆనువంశిక అధికార సంస్కృతికి అద్దం పట్టే రాహుల్ గాంధీ పదోన్నతికీ, కాంగ్రెస్ నేతలు ఆయనను పూలదండలతో ముంచెత్తుతున్న దృశ్యానికీ, వారి వందిమాగధ స్తోత్రాలకు మౌన సాక్షిగా, శ్రోతగా ఉండిపోయారు. అలా జైపూర్ చింతన్ వేదిక నుంచి జారీ అయిన రెండు ముఖ్య సందేశాలూ పరస్పర విరుద్ధంగా పరిణమించాయి.




Friday, January 18, 2013

తెలుగు సినిమాలకు ఈ కథల దరిద్రం ఏమిటి?

రాజమౌళి 'మర్యాదరామన్న' సినిమా గురించి మొన్న రాశాను. ఆ తర్వాత తెలిసింది, ఆ సినిమా 1923లో వచ్చిన 'అవర్ హాస్పిటాలిటీ' అనే ఆంగ్ల సినిమాకు అనుసరణ అని! కొంత నిరాశ చెందాను. అయితే, అనుసరణ సినిమా అయినా మూల కథాంశాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రేక్షకులను హత్తుకునేలా ఉత్కంఠభరితంగా కథను మలచడంలో రాజమౌళి చూపిన ప్రతిభను అంగీకరించవలసిందే.

'మర్యాదరామన్న' అనుసరణ సినిమా అని తెలిసిన తర్వాత నాకు ఎదురైన ప్రశ్న ఏమిటంటే, తెలుగులో ఇంత మంచి దర్శకులు ఉండి కూడా అనుసరణ సినిమాల వైపు ఎందుకు మొగ్గుతున్నారని? ఇంత గొప్ప ప్రతిభ కూడా సొంత కథను ఎందుకు సృష్టించలేక పోతోంది? తెలుగు సినిమాను కథాదారిద్ర్యం ఎందుకు వెంటాడుతోంది? ఈ దారిద్ర్యం మొదటినుంచీ ఉన్నదేనా? లేక మధ్యలో వచ్చిందా? సినీరంగ నిపుణులు ఎవరైనా దీనిమీద పరిశోధన చేశారా? 

అనుసరణ ఆరోపణ సినిమాల మీద తరచు వస్తూనే ఉంటుంది. అయితే, సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు అవి దేనికో అనుసరణ అన్న సంగతీ అంతే తరచుగా మరచిపోతుంటాం. ఏదో ఒక సినిమాకు అనుసరణ కావడం మనలో చాలామంది దృష్టికి చాలా మామూలు విషయం లానూ, ఏమంత తప్పు పట్టనవసరం లేనిదిగానూ కనిపిస్తుంది. కారణమేమిటి? మనదైన కథను మనం సృష్టించుకోలేమనీ, ఎరువు కథలే మనకు గతి అనీ అటు సినిమాలు తీసే వారూ, ఇటు సినిమాలు చూసే వారూ నిర్ణయానికి వచ్చేశారా?

తెలుగులో వచ్చిన ఏ సినిమా ఏ సినిమాకు అనుసరణో తెలుసుకోవడం ఆసక్తికరమే కాదు; విజ్ఞానదాయకమూ, మార్గదర్శకమూ కూడా. అనుసరణ సినిమాల గురించి తెలుసుకున్నప్పుడైనా సొంత కథ మీద కొందరిలోనైనా పట్టుదల పెరిగే అవకాశముంటుంది.  కనీసం సినీ పాత్రికేయులెవరైనా అనుసరణ సినిమాల వివరాలను  పుస్తకరూపంలో అందించే ప్రయత్నం చేశారా? ఇప్పటికే ఎవరైనా చేసి ఉంటే సరే, చేయకపోతే చేయడం చాలా అవసరం. తెలుగు సినిమా చరిత్రలో అది కూడా ఒక ముఖ్య అధ్యాయం కావలసిన అంశం. నన్నడిగితే తెలుగు సినిమా పాటల విషయంలో కూడా అలాంటి ప్రయత్నం జరగాలంటాను. హిందీ సినిమా పాటలు వింటున్నప్పుడు వాటిలో అనేక తెలుగు సినిమా పాటలు ధ్వనిస్తూ ఉండడం చాలామంది  గమనించి ఉంటారు.  ఎవరైనా తెలుగు సినిమా పాటల అనుసరణ చరిత్రకు పుస్తకరూపం ఇచ్చారా?  

ఇంతకీ  తెలుగు సినిమా కథాదారిద్ర్యానికి కారణం ఏమిటి? లోతుకు వెళ్ళిన కొద్దీ ఈ దారిద్ర్యం కేవలం సినిమాలకే పరిమితమైంది కాక అనేక అంశాలకు విస్తరించి కనిపిస్తుంది. తెలుగు జీవితంలోనే కథ లోపించిందా? లేక తెలుగు జీవితంలోని కథను పట్టుకోగల చూపు లోపించిందా?  అదీ కాకపోతే తెలుగువారికి కొత్త కథ అవసరం లేదా? ఇవేకాక  వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు...

ఆలోచించవలసిన ప్రశ్నలే. మరి మీరేమంటారు? 


Tuesday, January 15, 2013

దర్శక 'రాజ'మౌళి

పాఠకులకు ఆలస్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు.

సంక్రాంతి పండుగకు బంధువుల ఊరికి వెళ్ళడం వల్ల నా బ్లాగ్ లో కొత్తవి ఏవీ పోస్ట్ చేయలేకపోయాను. అందుకే ఇలా ఆలస్యంగా శుభాకాంక్షలు.

కొన్ని మాసాలుగా  నేను టీవీలో కానీ, థియేటర్లలో కానీ తెలుగు సినిమా కాదు కదా, ఏ సినిమా చూడలేదు. బంధువుల ఇంట్లో పండుగ రోజున అనుకోకుండా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాదరామన్న' సినిమా చూశాను. ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. రాజమౌళి పేరు బాగా తెలుసు కానీ, ఆయన సినిమాలు ఏవీ నేను ఇంతవరకు సావకాశంగా చూడలేదు. 'మర్యాదరామన్న' సినిమా పేరు విన్నాను కానీ పేరును బట్టి అది చూడదగిన సినిమా అనిపించలేదు.

 పని గట్టుకుని సినిమాకు వెళ్ళే అలవాటు నాకు తప్పిపోయి  దశాబ్దాలు అయింది.  నా వృత్తి కూడా అందుకు ఒక ముఖ్యమైన కారణం. ఎప్పుడైనా అనుకోకుండా టీవీలో సినిమాలు చూసే అనుభవం మాత్రమే నాది. టీవీలో టెలికాస్ట్ అయ్యేసరికి ఆ సినిమా పాతబడిపోతుంది కనుక ఆ సినిమాపై నా స్పందన కూడా చద్ది వాసన కొడుతుంది. కనుక నా నిస్సహాయతను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుని చద్ది వాసన కొట్టే నా స్పందనను సహిస్తారని ఆశిస్తున్నాను.

'మర్యాదరామన్న' చూశాక రాజమౌళిపై నాకు గౌరవం ఏర్పడింది. కథాంశం చిన్నది. పైగా కథానేపథ్యం బాగా నలిగిపోయిన రాయలసీమ ముఠాతగాదాలు. కానీ అద్భుతంగా, ఉత్కంఠభరితంగా కథను మలిచాడు. పాటలు కూడా కృతకంగా కాకుండా సందర్భంలో, సన్నివేశంలో చక్కగా ఒదిగిపోయాయి. కథ చెప్పడంలో రాజమౌళి తమిళ, హిందీ సినిమాల ఒరవడిని పాటించిన మాట నిజమే. అయితే ఆ ఒరవడిని సొంతం చేసుకుని సిద్ధహస్తత చాటాడు. క్రమంగా సొంత ముద్రను పెంచుకుంటూ తననుంచి కనీసం మరో పదేళ్లపాటు నాణ్యమైన సినిమాలు రాగలవన్న ఆశ కలిగించాడు. తెలుగు సినిమా స్థాయి పెరుగుతోందన్న భరోసా అందించాడు.

బహుశా హీరో ఓరియెంటెడ్ సినిమా దశనుంచి దర్శక ప్రాధాన్యం కలిగిన సినిమా దశకు తెలుగు సినిమా పయనిస్తోందన్న అభిప్రాయాన్ని రాజమౌళి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ల సినిమాలు కలిగిస్తున్నాయి. తెలుగు సినిమాకు ఇదొక శుభ సూచన.

ఎక్కువగా చూసే అవకాశం లేకపోవచ్చు కానీ, సినిమా నా అభిమాన విషయాలలో ఒకటి. కనుక సినిమా పై నా స్పందనలను ఎప్పుడైనా ఇలా మీతో పంచుకుంటూ ఉంటాను. ఏదైనా పాయింట్  ఉంటుందనిపిస్తే చదవండి, లేకపోతే వదిలేయండి.


Thursday, January 10, 2013

అక్బరుద్దీన్ కేసు: మెజారిటీ ప్రజల ప్రేక్షకపాత్ర ఎంతకాలం?

"ధర్మరాజు తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా?" అని కౌరవసభలో శత్రుపక్షానికి చెందిన ద్రౌపది అడిగిన ప్రశ్న న్యాయమేనన్నవాడు మహాభారతంలో వికర్ణుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. రెండు పక్షాలు కలబడుతున్నప్పుడు మధ్యలో నలిగి చచ్చేవి  న్యాయమూ ధర్మమేనని ఆనాడే నిరూపించిన పాత్ర వికర్ణుడు.

ఇప్పుడూ అదే జరుగుతోంది.

న్యాయ, ధర్మాలు, నిష్పాక్షికత  అనే ఒక తటస్థస్థితినుంచి నేటి ఆధునిక ప్రజాస్వామిక భారతీయ సమాజమూ దూరంగా జరిగిపోతోంది. రాజకీయాలు మతీకరణ చెందుతున్నాయి. మతాలు రాజకీయీకరణ చెందుతున్నాయి. బుద్ధిజీవులు రాజకీయీకరణ చెందుతున్నారు. నిజానికి న్యాయస్థానాలు, చట్టాలు అనేవి ఉన్నది సమాజంలో తటస్థభూమికను పోషించడానికే. అవి మనదేశంలో మనం తెచ్చుకున్న లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాంగనిర్దేశాలను అమలు చేస్తాయి. రాజ్యాంగం కూడా తటస్థ ప్రాతిపదికపై రూపొందినదే. అది కుల, మత, ప్రాంత, భాషా, లింగ భేదాలకు అతీతంగా ఒక సమక్రీడాస్థలి(లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్)ని ఏర్పాటుచేసింది.

విచిత్రం, అంతకంటే విషాదం ఏమిటంటే, మనం చాలా వివాదాల సందర్భంలో తటస్థ రాజ్యాంగం ఉనికినీ, దాని వెలుగులో అవతరించిన చట్టాల ఉనికినీ మరచిపోతుంటాం. 1950(రాజ్యాంగం అవతరించిన సంవత్సరం)కి వెనకటి కాలంలోకి వెళ్ళిపోయి, అప్పటి వివాదాలను, అంతకంటే చాలాముందునుంచీ ఉన్న వివాదాలను 2013లోకి కూడా తీసుకొస్తుంటాం. ఆనాటి మైండ్ సెట్ తో మాట్లాడుతూ ఉంటాం. చట్టాలను చేతుల్లోకి తీసుకుంటుంటాం. అలా తీసుకోవడాన్ని సమర్థిస్తుంటాం. ఎవరో నిరక్షరులు సమర్థించడం కాదు, బుద్ధిజీవులు అనబడేవారు కూడా.

అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటనలు చేసినవారు, రోడ్లమీద ప్రదర్శనలు చేసినవారు; అక్బరుద్దీన్ లానే మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఇతరుల మీద కూడా చర్య తీసుకోవాలని అనడం లేదు. చర్య తీసుకోవలసిన అవసరం లేదా అని అడిగితే జవాబు దాటవేస్తున్నారు. ఒకవేళ వారిపై కూడా చర్యకు సిద్ధమైతే అందుకు వ్యతిరేకంగా వీరే మరోసారి రోడ్ల మీద నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతారు. అంటే ఏమిటన్న మాట? అక్బరుద్దీనా, ఇంకొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా చట్టాన్ని అమలు చేయాలన్న మాట ఆ పక్షం నుంచీ, ఈ పక్షం నుంచీ కూడా వినిపించడం లేదు. రెండూ చట్టం ఉనికిని గుర్తించడం లేదు. లేదా చట్టాన్ని సెలక్టివ్ గా అమలు చేయాలని కోరుకుంటున్నాయి.

చట్టం ఉనికిని గుర్తించని ఈ దేశంలో, చట్టాన్ని సెలక్టివ్ గా అమలు చేయాలని కోరుకునే ఈ దేశంలో మరో పక్క ఉన్న చట్టాలు చాలవనీ, కఠిన చట్టాలు తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది! ఎంత తమాషా!

ఒక హిందుత్వ అభిమాని నాతో మాట్లాడుతూ ప్రవీణ్ తొగోడియా, వరుణ్ గాంధీ లాంటివారు అక్బరుద్దీన్ అంత తీవ్రమైన ప్రసంగాలు చేస్తే చర్య తీసుకోవచ్చునన్నాడు. 'తీవ్రత'ను ఎలా అంచనా వేయాలి? ఎవరు అంచనా వేయాలి? నిజంగానే వారిపై చర్య తీసుకోవడమే జరిగితే, వారు అక్బరుద్దీన్ అంత 'తీవ్రం'గా మాట్లాడలేదు కనుక చర్య అన్యాయమని మళ్ళీ వారి అనుకూల వర్గాలే రోడ్ల మీదికి వస్తాయి. షరా మామూలుగా చట్టాల ఉనికి మరోసారి గల్లంతు అయిపోతుంది.

ఆ హిందుత్వ అభిమానే మరో మాట అన్నాడు. ముంబైలో ముస్లిం లు రోడ్ల మీద సామూహికంగా నమాజు చేసుకోడాన్ని బాల్ థాక్రే వ్యతిరేకించారట. దానికి పోటీగా రోడ్ల మీద దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారట.

"రోడ్ల మీద నమాజు వల్ల వాహనదారులకు, పాదచారులకు, ఇళ్ళలో వారికి ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇబ్బంది తొలగించమని కోరుతూ చట్టాలను ఆశ్రయించాలి కానీ పోటీ కార్యక్రమం వల్ల ఇబ్బంది ఎలా తొలగుతుంది?" అని అడిగాను.

 "ముస్లిం సంతుష్టీకరణ విధానాలను అనుసరించే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేస్తుందా?" అని ఆయన అడిగాడు.

"అప్పుడు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయాలి. అంతే కానీ, చట్టం ఉనికిని అవతలివారు కూడా విస్మరించి పోటీ కార్యక్రమం నిర్వహించడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది?" అని అడిగాను.

ఒకవేళ ముస్లిం ల కంటే ముందే ఎవరైనా  రోడ్ల మీద దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తే దానిపై కూడా థాక్రే, ఆయన భావజాలాన్ని సమర్థించే వారి స్పందన ఇలాగే ఉంటుందా?! ఉండదని చెప్పడానికి ఎవరూ సందేహించనవసరం లేదు. పొద్దుటే గుళ్లలో లౌడ్ స్పీకర్లు, రోడ్లమీద అయ్యప్ప భజనలు, గణేశ ఉత్సవాల పందిళ్ళు, బాణాసంచా పేలుళ్లు వగైరాలు వీరికి అభ్యంతరకరం కావడంలేదు. ముస్లింల నమాజే ఎందుకు అభ్యంతరకరం అవుతోంది? రెండిటినీ కూడా అసౌకర్య కోణం నుంచే చూసి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరే సివిక్ సెన్స్ ఎందుకు లోపిస్తోంది?

తటస్థ రాజ్యాంగం వెలుగులో చట్టాలు చర్యకు ఉపక్రమించే లోపలే అటు వారూ, ఇటువారూ కూడా చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం జరిగిపోతోంది. శాంతియుత, సామరస్య జీవనానికి కొన్ని తరాలపాటు మాపుకోలేని నష్టం జరిగిపోతోంది. ఎవరూ రాజ్యాంగం ఉనికినీ, చట్టాల ఉనికినీ గుర్తించడంలేదు. స్వతంత్ర ప్రజాస్వామిక భారతం అవతరించడానికి ఎంతో ముందునాటి చారిత్రక కక్షలనూ కార్పణ్యాలనూ తీర్చుకోడానికి అటూ ఇటూ కూడా ఉన్న అల్పసంఖ్యాకులు మొత్తం సమాజాన్నే యుద్ధరంగంగా మార్చివేయడం జరుగుతోంది. దీనికి మెజారిటీ ప్రజానీకం ఇలా నిశ్శబ్ద ప్రేక్షపాత్ర చిత్తగించడం ఎంతకాలం?

మతవిద్వేషాలను రాజకీయ పెట్టుబడిగా మలచుకునే శక్తుల వెనుక గుడ్డిగా జెండాలు మోసే వెట్టి చాకిరీ నుంచి విముక్తులై జనాలు రాజ్యాంగం వెలుగులో చట్టబద్ధ పాలనను కోరే ఒక మెజారిటీ పార్టీగా ఎప్పటికీ అవతరిస్తారు?!
                                                                ***
సంబంధిత పోస్ట్: అక్బరుద్దీన్ కేసు: చట్టం తన పని తాను చేస్తోందా?





Wednesday, January 9, 2013

హైదరాబాద్ కాకపోతే బెంగళూరు!...రెండో రాజధాని అవసరమే

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయడం వల్ల కలిగే లాభనష్టాలను విశ్లేషిస్తూ ఈ రోజు(9-1-13)ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తావ్యాసం నన్ను ఆకర్షించింది. అయితే, అది 'తెలంగాణ' నేపథ్యంలో రాసినది. అందులోకి వెళ్ళను. దక్షిణభారతంలో రెండో రాజధాని అవసరమా, కాదా  అన్న అంశానికే పరిమితమవుతాను.

నా ఉద్దేశంలో దక్షిణాదిలో ఒక జాతీయ రాజధాని ఉండడం అవసరం. ఉత్తర,దక్షిణాలకు మధ్యలో ఉంది కనుక అందుకు హైదరాబాద్ ఎక్కువ అనుకూలం కావచ్చు. అది కాదనుకుంటే రెండో పక్షంగా బెంగళూరును, మూడో పక్షంగా చెన్నైని పరిశీలించవచ్చు.

దక్షిణాదిలో ఒక జాతీయ రాజధాని ఉండాలనడానికి నా కారణాలు ఇవీ:

1. రాజధాని నగరమంటే  ప్రభుత్వశాఖలు; మంత్రులు, అధికారుల నివాసాలు, దౌత్యకార్యాలయాలు వగైరాలకు వసతులు, హంగులు సమకూర్చే ఒక భౌగోళిక ప్రదేశం అనుకుంటారు.  రాజధాని అంటే రాజకీయాధికారం కేంద్రీకృతమయ్యే చోటని కూడా అనుకుంటారు. ఇవి నిజమే కానీ మరికొన్ని నిజాలు కూడా ఉన్నాయి. రాజధాని అనేది  భౌగోళికప్రదేశం మాత్రమే కాదు,  మానసిక ప్రదేశం కూడా.  ఇంకాస్త తేలికగా చెప్పాలంటే రాజధానికి దేహమే కాక ఆత్మ కూడా ఉంటుంది.  కనిపించే రూపమే కాక కనిపించని వ్యక్తిత్వం కూడా ఉంటుంది. రాజకీయ అధికారంతోపాటు, ఒక జాతికి లేదా ఒక జనసమూహానికి చెందిన సమకాలీన సాంస్కృతిక ధోరణులు, మేధో వ్యాసంగాలు, వైజ్ఞానిక సంస్థలు, మీడియా కూడా రాజధానిలో కేంద్రీకృతమై దానికి  ఆత్మను, వ్యక్తిత్వాన్ని కల్పిస్తుంటాయి. ఇవి దేశం మొత్తాన్నే కాక, తమ దగ్గరలో ఉన్న రాజకీయాధికారాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉంటాయి. రాజకీయాధికారం విధాన నిర్ణయాలు చేయడానికి తోడ్పడే మేధో వనరులు వీటి ద్వారా కూడా అందుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని అనేది అధికార కేంద్రమే కాక ఆలోచనా కేంద్రం కూడా.

2. ఇటువంటి జాతీయ రాజధాని దేశం మొత్తానికి ఇప్పుడు ఢిల్లీ ఒక్కటే ఉంది. జాతీయ స్థాయినుంచి ఒకసారి దేశాన్ని చూడండి... భారతదేశం అంటే ఉత్తరభారతం మాత్రమే నన్న అభిప్రాయం మీకు కలిగితీరుతుంది. ఉత్తరభారతం  ప్రస్ఫుటంగా కనిపించే సింహం ముఖం లానూ, దక్షిణభారతం సన్నని తోక లానూ కనిపిస్తాయి. ఉత్తరభారతం వెలుగులో ఉన్నట్టు, దక్షిణభారతం చీకటి ఖండంలానూ కనిపిస్తాయి(ఈశాన్య భారతానికి కూడా ఈ తేడా  వర్తిస్తుంది కానీ ప్రస్తుతానికి దక్షిణభారతం గురించే మాట్లాడుకుందాం).  ఎంతో వైవిధ్యం ఉన్న ఈ సువిశాలభారతదేశం మొత్తాన్ని శాసించే జాతీయరాజకీయాధికారం మొత్తం ఢిల్లీలోనే కేంద్రీకృతమైంది. దానితోపాటే జాతీయరాజకీయ కార్యకలాపాలు, విధాన కల్పన వనరులు, మీడియా సహా అన్నీ ఢిల్లీలోనే కేంద్రీకృతమయ్యాయి. ఢిల్లీలో పాతుకుపోయినవాళ్ళే దేశచక్రం తిప్పుతుంటారు. దేశం అజెండాను వాళ్ళే రూపొందిస్తుంటారు. దేశం నాడి వాళ్ళకే బాగా తెలుస్తుంది. జాతీయస్థాయి అవగాహనే కాక, జాతీయ నుడికారం(నేషనల్ ఇడియం)పై పట్టు వాళ్ళకే ఉంటుంది. దక్షిణాదికి వస్తున్నకొద్దీ ఇది పలచబడి పోతుంది. ఏ విషయంలోనైనా సరే ఢిల్లీ గుండె చప్పుడు దక్షిణాది గుండెల్లో ధ్వనించడానికి ఎన్నో 'వింధ్యపర్వతాలు' అడ్డుపడుతుంటాయి. దక్షిణాది నాయకులు ఉత్తరాది నాయకుల వెనుక తద్దినం పెట్టేవాడి తమ్ముడి పాత్రనే సాధారణంగా పోషిస్తుంటారు తప్ప జాతీయ అజెండా కూర్పులో చురుకైన భాగస్వాములు కాలేరు. అలాగే దక్షిణాది ప్రజలు కూడా.

3. మీడియా గురించే చూద్దాం. జాతీయ మీడియాలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలు ఫోకస్ అయినంతగా దక్షిణ భారత రాష్ట్రాలు కావు. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలలోని మామూలు ఘటనలు కూడా జాతీయ మీడియా లో విశేష వార్తలు అవుతుంటాయి. దక్షిణభారత రాష్ట్రాలలోని చెప్పుకోదగిన ఘటనలు కూడా సింగిల్ కాలం వార్తలవుతుంటాయి. ఎప్పుడోకానీ అక్బరుద్దీన్ వ్యవహారం లాంటివి జాతీయమీడియాలో ప్రాధాన్యం పొందవు.  చిన్న రాష్ట్రమైన ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ జాతీయస్థాయి కల ఢిల్లీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఫోకస్ అయినంతగా యూపీ లాంటి  పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోకస్ అయ్యే అవకాశమే లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయం చెప్పనే అవసరం లేదు. సామీప్యం కూడా ఇందుకు ఒక కారణం. ఉదాహరణకు, మన రాష్ట్రంలో హైదరాబాద్ లోనే మీడియా కేంద్రీకృతం అయినందువల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితిని గమనించండి. ఇందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల వారే ఎక్కువ ఫోకస్ అవుతారు. వారి గొంతే గట్టిగా వినిపిస్తుంది. చిన్న నాయకులకు కూడా పెద్ద  ప్రచారం లభిస్తుంది. రాష్ట్రానికి ఆ చివర ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ నేతల గొంతు కూడా మీడియాలో వినిపించదు. ఇదే పరిస్థితిని ఢిల్లీలోని జాతీయమీడియాకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్వయించి చూడండి.

4. ఉత్తర/దక్షిణాల మధ్య అందరూ తేలిగ్గా గుర్తించగలిగిన ఒక వ్యత్యాసం, దేశ ప్రధానమంత్రిత్వం  ఉత్తరాదివారి అప్రకటిత హక్కుగా చలామణి అవుతుండడం.  ఈ అరవై ఏడేళ్ళ స్వతంత్ర ప్రజాస్వామ్య భారతంలో దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయి అయిదేళ్లూ అధికారంలో ఉండగలిగింది పీవీ నరసింహారావు ఒక్కరే(దక్షిణాది నుంచి రెండో ప్రధాని దేవెగౌడ గురించి పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు). అటువంటి పీవీ కి ఢిల్లీలో స్మృతి నిర్మాణం చేయకుండా హైదరాబాద్ కు తరిమేసిన దందా ఉత్తరాదివారిది. అయినా సరే, దక్షిణాది వారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం భారతదేశంలో వారి బలహీనమైన ఉనికికి నిదర్శనం.

5. కనుక ఉత్తర, దక్షిణాల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు తగ్గాలంటే, దక్షిణాదిన రెండో రాజధాని ఉండవలసిందే. అప్పుడే జాతీయ అజెండా రూపకల్పనలో చురుగ్గా పాల్గొనే అవకాశం దక్షిణాదివారికి కూడా లభిస్తుంది. దక్షిణాదివారి గొంతు జాతీయస్థాయిలో వినిపిస్తుంది. ఇంకో చిత్రం గమనించండి...విద్య, విజ్ఞానం, మానవాభివృద్ధి, పురోగమనం మొదలైన అనేక విషయాలలో ఎన్నో ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాది రాష్ట్రాలే మెరుగ్గా ఉంటాయి. కానీ ఎన్నో వెనుక బడిన రాష్ట్రాలు ఉన్న ఉత్తరాదిన దేశ రాజధాని ఉంది. ఫలితంగా ఆయా రంగాలలో  దక్షిణాది రాష్ట్రాల పురోగమన అనుభవాన్ని దేశం మొత్తం పంచుకునే అవకాశం లోపించింది. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడినప్పుడు ఆ అవకాశం కలుగుతుంది.

6. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. దక్షిణాదిన అఖిల భారత ప్రసిద్ధి కలిగిన విశ్వవిద్యాలయం ఒక్కటీ లేదు. ఇందుకు భిన్నంగా ఢిల్లీలో జేఎన్ యూ లాంటివి ఉన్నాయి. దేశానికి అవసరమైన థింక్ ట్యాంక్ జేఎన్ యూలోనే  తయారవుతుందని కూడా అంటారు. రాజధానిలో ఉండడమే అందుకు కారణం. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడితే, అందుకు తగిన స్థాయిలో ఉన్నత విద్యాసంస్థలూ అభివృద్ధి చెందుతాయి.

7. దక్షిణాదిన రాజధాని అవతరిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య రాకపోకలు అనూహ్యంగా పెరుగుతాయి. దక్షిణాది భాషల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒక భాషా సాహిత్యం ఇంకో భాషలోకి తర్జుమా అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సినిమా, నాటకం తదితర కళారూపాల మధ్య సామీప్యం, పరస్పర ప్రభావం ఇనుమడిస్తాయి. ఉత్తర, దక్షిణాల మధ్యా  సాన్నిహిత్యం పెరుగుతుంది.  కళా, భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆలోచనా  సమ్మేళనం ప్రజల ఆలోచనా సరళిపై ఆరోగ్యకరమైన ప్రభావం చూపుతుంది. సమైక్యతకు దోహదం చేస్తుంది.


Sunday, January 6, 2013

వర్ణవ్యవస్థకు మూలం ఆర్యులా, సింధు నాగరికులా?


(ఆర్యులు, ద్రావిడుల గురించి చాలా రకాల ఊహలు, లేదా అపోహలు వాస్తవాలుగా ప్రచారం పొందుతున్నాయని కొందరు ప్రామాణిక చరిత్రకారుల రచనలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అలాంటి ఊహల మీద ఆధారపడి రాసిన ఒక వ్యాసంపై నా స్పందన ఇది. ఇటువంటి అంశాలపై ఆసక్తి గల పాఠకుల కోసం దీనిని  పోస్ట్ చేస్తున్నాను. స్పందననూ ఆహ్వానిస్తున్నాను. ఆర్యులు, ద్రావిడుల గురించి ఉన్న ఇతరేతర వాదాలు, వివాదాలలోకి మరీ అంత లోతుగా వెళ్లకుండా  ఈ వ్యాసానికి పరిమితమై స్పందిస్తే బాగుంటుందని మనవి) 

సింధు నాగరికత- ఆర్యులు- ద్రావిడులు- హిందూ ధర్మం- వర్ణవ్యవస్థ మొదలైన వాటి గురించి చాలాకాలంగా చాలా రకాల ఊహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఊహల మీద ఆధారపడి కొన్ని రాజకీయపక్షాలు పనిచేస్తున్నాయి. ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ ఊహలనుంచి స్ఫూర్తిని పొంది, ప్రస్తుత బహుజనుల ఉద్యమాలకు చేయూతనివ్వడం లక్ష్యంగా మూలవాసీ సమూహాల చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను పునర్నిర్మించుకునే ప్రయత్నానికి కొందరు పూనుకుంటున్నారు(సింధు స్ఫూర్తి ఆవాహన, ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 2 వ్యాసం).

ఊహల మీద ఆధారపడి అని ఎందుకు అంటున్నానంటే, గార్డన్ చైల్డ్, డీ.డీ. కోశాంబి, జోసఫ్ క్యాంప్ బెల్, ఇర్ఫాన్ హబీబ్, (పై వ్యాసకర్తలు పేర్కొన్న) రొమీలా థాపర్ వంటి ప్రామాణిక చరిత్రకారులు, పురాసంస్కృతీ, మత విశ్లేషకుల రాతలు పై ఊహలను సమర్థించడంలేదు. సమర్థించకపోగా వాటికి పూర్తి భిన్నమైన అభిప్రాయాలను అందిస్తున్నాయి.

 పై వ్యాసంలోని ఊహలను ప్రస్తావించుకుని, ప్రామాణిక అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం:

1   .  ఈ దేశ మూలవాసులు ద్రావిడులు. వారు అద్భుతమైన సింధు నాగరికతను సృష్టించారు:  
ద్రావిడులు ఈ దేశ మూలవాసులు అనే ముందు ఈ వివరాలు దృష్టిలో ఉంచుకోవాలి. సింధు శిథిలాలలో కొన్ని అస్థిపంజరాలు దొరికాయి. అవి ప్రోటో-ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్(మధ్యధరాప్రాంత) కవళికలను సూచించాయి. ప్రోటో-ఆస్ట్రలాయిడ్ కవళికలు దక్షిణ, మధ్యభారతాలలోని ఆదివాసులలోనూ; హిందూ సమాజంలోని వెలి కులాలలోనూ కనిపిస్తాయి. ఇక మెడిటరేనియన్ కవళికల జనం స్పెయిన్, పోర్చుగల్, మడగాస్కర్ మొదలుకుని భారత్ వరకూ వ్యాపించి పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీ. పూ. 7500-5500 నాటికే ఈ జాతివారు పాలస్తీనాలో ఉన్నారు. ఉత్తరభారతంలోనూ, ఇతర చోట్లా ఉన్నత సామాజిక వర్గాలలో ఈ కవళికలవారే అధికసంఖ్యాకులు. మొహంజదారో తవ్వకాలలో బయట పడిన ఒక ఆకృతిని పురోహితుడిగా గుర్తించారు. ఇతడిలో మెడిటరేనియన్ కవళికలు ఉన్నాయి. ఇప్పటికీ పురోహితులు దాదాపు ఇతని ఆహార్యాన్నే అనుకరిస్తున్నారు. ఇటువంటి పురోహితుని ఆకృతులే సుమేరియా, మెసపొటేమియా శిల్పాలలోనూ కనిపిస్తాయి. పశ్చిమాసియాలో తొలినాటి వ్యవసాయ జనావాసాలు అంతటా మెడిటరేనియన్ జనం వ్యాపించి ఉండేవారు. చరిత్రపూర్వకాలంలోనే మెడిటరేనియన్ జనం పశ్చిమం నుంచి భారత్ కు వలస వచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్యులు భారత్ లోకి అడుగుపెట్టేనాటికే ఈ వలస సంభవించింది. కొంతవరకు ఆర్యులు వీరిని తమలో కలుపుకోవడమూ జరిగింది(ఓరియంటల్ మైథాలజీ: జోసఫ్ క్యాంప్ బెల్). కనుక ప్రోటో-ఆస్ట్రలాయిడ్ జనమే మూలవాసులు అనడానికి అవకాశముంది. వారినీ, మెడిటరేనియన్ వలస జనాన్నీ కలుపుకుని ద్రావిడులు అనదలచుకుంటే, ద్రావిడులలో కొందరే మూలవాసులు, అందరూ కాదు. ద్రావిడులు అద్భుతమైన సింధు నాగరికతను సృష్టించారు అనేటప్పుడు జాగ్రత్త పాటించాలి. పట్టణాలు, తీర్చిదిద్దిన వీథులు, గృహాలు, స్నానశాలలు, మురుగునీటిపారుదల వ్యవస్థ వగైరాలు ఉండడం వరకూ అది అద్భుతమే. కానీ చాలా విషయాల్లో అది అద్భుతమూ కాదు, స్ఫూర్తిని పొందవలసింది అంతకంటే కాదు. ఏమైనా అది వస్తుగత దృష్టినుంచి చూడవలసిన ఒక చారిత్రక వాస్తవికత.

2.   ఆర్యులు సింధు నాగరికతను అంతమొందించారు’:  
ఈ మాట భారతదేశ చరిత్రా, సమాజాల గురించి కనీస అధ్యయనాన్ని, అవగాహనను కూడా ప్రతిబింబించదు. ఈ దేశంలో ఏదీ ఇంకొక దానిని అంతమొందించిన దాఖలా లేదు. బౌద్ధం సంగతేమిటని అనచ్చు. బౌద్ధ తాత్వికతలోని కొన్ని అంశాలను హైందవం లీనం చేసుకున్న సంగతి తెలిసినదే.  బౌద్ధం బహుశా ఈ దేశ స్వభావానికి భిన్నంగా వ్యవస్థీకృత, ఏకశిలాసదృశ మతాన్ని ప్రతిపాదించడం భారత్ లో దాని ఉనికి పలచబడడానికి కారణం కావచ్చు. చరిత్ర పొడవునా ఇక్కడ జరిగింది భిన్న విశ్వాసాలు, ఆచారాల మధ్య అతుకు పెట్టడం; ఒకదానినొకటి లీనం(ఎసిమిలేషన్) చేసుకోవడమే. దీని గురించి విస్తారంగా చర్చించిన కోశాంబి, ఈ దేశ భౌగోళిక అమరికే అందుకు కారణమని అంటాడు. సంథింగ్ వర్సెస్ సంథింగ్ కు ఈ దేశంలో అవకాశం తక్కువ. ఈ కోణంనుంచి చెప్పుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయి.

3.      సింధు నాగరికతలో వర్ణవ్యవస్థ లేదు, ఆర్యులు వర్ణవ్యవస్థను ప్రవేశపెట్టారు. సింధు నాగరికతలో పూజారివర్గానికి ప్రత్యేకస్థానం లేదు:  
చరిత్రకారులు, పురామానవశాస్త్రజ్ఞుల పరిశీలనలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వర్ణవ్యవస్థ(కనీసం బీజరూపంలోనైనా) ఉన్నది సింధు నాగరికతలోనే. ఆర్యులలో మొదట వర్ణవ్యవస్థ లేనేలేదు. వారు సింధు నాగరికత నుంచే వర్ణవ్యవస్థ నమూనా తెచ్చుకున్నారు. దానిని మరింత అభివృద్ధి చేసి వాడుకున్నది మాత్రం వారే. కోశాంబి ప్రకారం, ఆర్యులు పురుషపరంపరకు చెందినవారు. పురుషదేవతారాధకులు. స్త్రీ దేవతలు చాలా తక్కువ. జన్యు, ఆకృతుల రీత్యా ఆర్యులు ఒకే కుదురువారు కారు. అనేక తెగలను తమలో కలుపుకున్నారు. వారికి జాతిస్వచ్ఛత గురించి పట్టింపు లేదు.   వారికి ప్రత్యేకమైన పురోహితవ్యవస్థ కూడా లేదు. ఎవరికివారే దేవతారాధన చేసేవారు. ఆర్యసంప్రదాయానికి చెందిన గ్రీస్, రోమ్ లలో కూడా ఇదే కనిపిస్తుంది. మిగిలిన ఆర్య సంప్రదాయాలలో ఎక్కడా బ్రాహ్మణుల వంటి వృత్తి పురోహితులు లేరు. బ్రాహ్మణశబ్దం పూర్తిగా భారతీయం. వీరితోనే వర్ణవిభజన ప్రారంభమైంది(ఏన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ: డీ.డీ. కోశాంబి). ఇతర ఆర్యసంప్రదాయాలలో  లేని ఈ పరిణామం భారత్ లోనే సంభవించడానికి కారణం, సింధు నాగరికతతో సంపర్కం. సింధు నాగరికతకు; మెసపొటేమియా, సుమేరు సంస్కృతులకు చాలా సంబంధాలున్నాయి. నేటి మన కులవ్యవస్థతో పోల్చదగిన వ్యవస్థ మెసపొటేమియాలో ఉండేది. అక్కడ రెండు రకాల బానిసలు ఉండేవారు. యుద్ధఖైదీలు, రుణం తీర్చలేకపోయినవారు, బానిస సంతానం మొదటి రకం. వీరి బానిసత్వం శాశ్వతం కాదు. డబ్బు చెల్లించో, స్వతంత్రులు దత్తు చేసుకోవడం ద్వారానో బానిసత్వం నుంచి వీరు విముక్తులు కావచ్చు. దేవాలయ బానిసలు రెండో రకం. వీరిని సిర్కుతు లనేవారు.  వీరు శాశ్వత బానిసలు. వీరిలో ఆస్తిపరులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులూ కూడా ఉండచ్చు. అయినా సరే వీరు బానిసలే. మన దేశంలోని పట్టువిడుపులు లేని కులవ్యవస్థతో దీనిని పోల్చవచ్చు. మెసపొటేమియా తరహా బానిసత్వం సింధులో కూడా ఉండేదనుకుంటే, తాము కృష్ణవర్ణులుగా పేర్కొన్న దాసులను, లేదా దస్యులను ఆర్యులు సేవకులను చేసుకోవడం సహజపరిణామమేనని కోశాంబి అంటాడు. ఆర్యులలో బానిసత్వం లేకపోగా, బానిసత్వాన్ని వారు వ్యతిరేకించారని కూడా ఆయన అంటాడు. ఆర్యులు భారతదేశానికి వచ్చేనాటికే సింధు నాగరికతలో అభివృద్ధి చెందిన పురోహితవ్యవస్థ ఉంది. అంతవరకూ ప్రత్యేకపురోహితవ్యవస్థ లేని ఆర్యులు సింధు పురోహితవ్యవస్థను సొంతం చేసుకున్నారు. క్యాంప్ బెల్ ప్రకారం కూడా ఆర్యులు సాదాసీదా రకం. వారిది సంక్లిష్ట సామాజికవ్యవస్థ కాదు. వారిలో అప్పటికి రాజ్యభావన పుట్టలేదు. అధికారం చెలాయించడం, బలప్రయోగం, దోచుకోవడం వారి ప్రధానవ్యాపకాలు. నాటి దేవాలయ కేంద్రిత నగర రాజ్యాలలోని పురోహితవ్యవస్థను అరువు తెచ్చుకుని స్వప్రయోజనాలకు వాడుకున్నారు.

4.   వైదిక మతాన్ని జాతీయమతంగా చిత్రించి, భారతీయసంస్కృతికి హైందవాన్ని అంటగట్టి, ఆర్యేతర, ముఖ్యంగా ద్రవిడ సంస్కృతీ, నాగరికతలను తృణీకరించడం హిందూత్వ తాత్విక భావజాలంలో ప్రధానాంశం. సింధు నాగరికతలో సతి లాంటి దురాచారాలు ఉన్నట్టు కనిపించదు’:
ఇవి కూడా వాస్తవాలను పూర్తిగా తలకిందులు చేస్తున్న ఊహలు. నిజానికి ఇప్పుడు హిందూమతంగా చెప్పుకుంటున్న మతంలోని దాదాపు ప్రతి అంశమూ వైదిక సంబంధమైనది కాదు, ద్రవిడ సంస్కృతికి చెందినది.  క్యాంప్ బెల్ స్పష్టంగా ఇలా అంటాడు: అనంతరకాలంలో భారతదేశంలో అభివృద్ధి చెందిన పురాణగాథలన్నీ సారాంశంలో వేదాలకు సంబంధించినవి కావు. ద్రవిడ సంబంధమైనవి. ఇంకా చెప్పాలంటే, కంచు యుగానికి చెందిన సింధు సంస్కృతినుంచి ఉద్భవించినవి.  గార్డన్ చైల్డ్ ఏమంటున్నాడో చూద్దాం: మట్టితో చేసిన చిన్న స్త్రీ విగ్రహాలు, పూజావస్తువుల మీదా, సీళ్ళ మీదా చిత్రించిన బొమ్మలు, ముఖ్యంగా లింగం, యోని ఆకారం కలిగిన పెద్ద రాతి బొమ్మలు అనేకం ఈ (సింధు) శిథిలాల్లో లభించాయి. ఇవి వంశచిహ్నాల సంప్రదాయం, సృష్టికి గర్భధారణకు సంబంధించిన ఆచారాలు ఇంకా బతికి ఉన్నాయని నిరూపిస్తాయి. ఇంతేగాక వీటినుంచి కొంతమంది దేవతలు కూడా ఉద్భవించారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా తరువాత కాలంలో హిందూమతంలోని కొన్ని ముఖ్యాచారాలను సూచిస్తాయి. లింగం, యోని రూపాలతో తరువాత కాలంలో హిందూ దేవతలు కొందరు చిత్రించబడడం మనం గమనిచవచ్చు(చరిత్రలో ఏం జరిగింది?: గార్డన్ చైల్డ్, అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య).  వామాచారానికి చెందిన తాంత్రిక పూజలు సింధు వారసత్వమని కోశాంబి అంటాడు. సింధు చిత్రాలతో, లిపితో తాంత్రిక చిహ్నాలకు సంబంధం ఉందని కూడా అంటాడు.  సింధు సీళ్ళపై కనిపించే చిత్రాల సరళి హిందూ దేవతావిగ్రహాలలో ఇప్పటికీ కనిపిస్తుందంటాడు. సింధు సంస్కృతిలో మాతృదేవతారాధనలో భాగంగా లింగ పూజ ఉండేదనీ; మాతృదేవతారాధన భారత్ లో అభివృద్ధి చెందినట్టుగా ప్రపంచంలో మరెక్కడా అభివృద్ధి చెందలేదనీ క్యాంప్ బెల్  అంటాడు. భారత్ లో నేటికీ రెండురకాల మాతృదేవతారాధనా పద్ధతులు కొనసాగుతున్నాయి. మొదటిది ప్రోటో-ఆస్ట్రలాయిడ్ వారసత్వం అయితే, రెండోది నూతన శిలాయుగ వారసత్వం. ఈ దేశంలోని భిన్న ఆరాధనా విధానాల మధ్య సహజీవనానికీ, లేదా సంలీనానికీ ఇదొక ఉదాహరణ.  సింధు సంస్కృతిలోని మాతృదేవతారాధనకూ;  మెసపొటేమియా, సమీప ప్రాచ్యం, ఈజిప్ట్, యూరప్ లతో సహా ఇంచుమించు ప్రపంచమంతటా ఒకప్పుడు ఉన్న మాతృదేవతారాధనకూ దగ్గరి సంబంధం ఉంది.  మాతృదేవతారాధన ఉన్న ప్రతిచోటా నరబలి ఉండేదన్న క్యాంప్ బెల్ మాటను గుర్తుపెట్టుకోవాలి. 1835లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించేవరకూ భారత్ లో నరబలి ఆచారం కొనసాగిందని ఆయన అంటాడు. హరప్పాలో లభించిన సీళ్ళు నరబలి ఆచారమూలాలు సింధు సంస్కృతిలో ఉన్నట్టు చెబుతున్నాయి. ఒక సీలుపై ఒక స్త్రీని బలి ఇస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మరో సీలుపై ఒక పురుషుని బలి ఇస్తున్న దృశ్యమూ,  ఏడుగురు స్త్రీల మూర్తులూ కనిపిస్తాయి. ఇది ఆనాడు ఈజిప్ట్ మొదలైన చోట్ల కూడా పాటించిన  రెగిసైడ్’(రాచబలి)ను సూచిస్తుందని క్యాంప్ బెల్ అంటూ, ఆ ఏడుగురు స్త్రీ మూర్తులూ సతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చంటాడు. ఇలాంటి దృశ్యాలున్న సీళ్లే మెసపొటేమియాలోనూ కనిపించాయి. తెలుగునాట ఏడుగురు అక్కలు’, సప్తమాతృకలు అనే పేర్లు ఇప్పటికీ ప్రసిద్ధమే.  మన మతవిశ్వాసాల మూలాలు సింధు సంస్కృతిలో ఉన్నాయనడానికి ఇదొక ఉదాహరణ.  సింధు శిథిలాలలోనే లభించిన అరడజను సీళ్లపై యోగముద్రలో ఉన్న ఒక పురుషుని ఆకృతి కనిపిస్తుంది. ఇది పశుపతి, లేదా శివుని రూపానికి మాతృక.  మెసపొటేమియా దేవాలయవ్యవస్థకూ, మన దేవాలయవ్యవస్థకూ చాలా పోలికలున్నాయి. సింధు సంస్కృతి మీదుగా అందిన వారసత్వం అది. మెసపొటేమియాలోని ఇష్టార్ దేవాలయంలో పవిత్ర వ్యభిచారం జరుగుతూ ఉండేది. మన దేశంలో దేవదాసీ వ్యవస్థకు ఇదే మూలం కావచ్చు.

5.  సింధు నాగరికతలో వ్యక్తి స్థానం వృత్తి, ప్రావీణ్యతలను బట్టి నిర్ణయించబడింది కానీ పుట్టుక మీద కాదు’: వాస్తవాలలోకి వెడితే ఇది కూడా నిరాధారమైన ఊహ గానే తేలిపోతుంది. నిజానికి సింధు సమాజం వ్యత్యాసాలు నిండిన వర్గ సమాజమని కోశాంబి అంటాడు. అంతేకాదు, ఎటువంటి మార్పూ లేకుండా వెయ్యీ, పదిహేను వందల ఏళ్లపాటు గడ్డ కట్టుకుపోయిన శిథిల సమాజమని కూడా అంటాడు. జనంలో తిరగబడే ప్రవృత్తిని కూడా అణచివేసి సమాజాన్ని జడీభూతంగా మార్చింది కూడా మతవిశ్వాసాలూ, మతాధిపత్యమే నంటాడు.

6.     ద్రవిడ సంస్కృతిలోని మతవిధానం సమాజశ్రేయస్సుకు దోహదం చేసింది’:  
ఈ మాటలో ఎంత నిజముందో పై అంశాల వెలుగులో ఎవరికి వారే అంచనాకు రావచ్చు. ఏదిఏమైనా అది మన గతం. చెరుపుకోలేని గతం. అందులోని మంచి, చెడులను కూడా వస్తుగత దృష్టినుంచి చూడాలి. బర్బరదశలో ఉన్న ఆర్యుల కంటె, వ్యవసాయాధారిత పట్టణ నాగరికతను నిర్మించిన సింధు ప్రజలు నిస్సందేహంగా ఉన్నతదశకు చెందినవారు. అయితే ఆ ఉన్నతికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అది కాలంలో ఘనీభవించి అనేకానేక ఆంతరిక లోపాల వల్ల క్షీణదశకు లోనై సహజమరణానికి చేరువైన నాగరికత. ఆర్యుల రాక దానిని మరింత త్వరితం చేసింది. సింధు సమాజ పరిస్థితిని బ్రిటిష్ ఆధిపత్యానికి ముందునాటి భారతదేశ పరిస్థితితో పోల్చవచ్చు. బ్రిటిష్ తో పోల్చితే భారత్ వేల సంవత్సరాల  సాంస్కృతిక, నాగరిక అస్తిత్వం గల దేశం. అయినా సరే, అనేక అంతర్గత వైరుధ్యాలతో బలహీనపడిన కారణంగా పరాధీనతకు తలవంచవలసివచ్చింది. అటువంటి క్షీణ భారతం స్ఫూర్తి దాయకమని ఎవరూ అనరు. అలాగే సింధు స్ఫూర్తికి ఆవాహన అనేటప్పుడూ మెలకువ పాటించాలి.

ఈ దేశంలో కులవ్యవస్థ నిజం. కులదాష్టీకం నిజం. శతాబ్దాలపాటు ఆత్మన్యూనతకు, అణచివేతకు గురైనవారు జరిపే ఆత్మగౌరవ, అస్తిత్వ పోరాటాలను సమర్థించాలనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. వారు తమ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను పునర్నిర్మించుకునే ప్రయత్నాన్ని ఆహ్వానించవలసిందే. అయితే ఆ నిర్మాణం ఊహల పునాది మీద జరగకూడదు. చారిత్రక వాస్తవాలు చారిత్రక అనుభవాలను ప్రతిఫలిస్తాయి. వాస్తవాలను మరుగు పుచ్చినా, లేదా వక్రీకరించినా  ఆ అనుభవాలనుంచి పొందవలసిన ఉమ్మడి ప్రయోజనాలను నష్టపోతాం.  కులపీడన గురించి చెప్పుకోవలసిన వాస్తవాలు, చర్చించుకోవలసిన అంశాలు  ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కులపీడనలో గల తారతమ్యాల గురించీ, కులవ్యవస్థకు, వ్యవసాయార్థికతకు పడిన పీటముడి గురించీ ప్రస్తావించుకోవలసిన అంశాలు అసంఖ్యాకం.
                                              (ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6-1-2013న ప్రచురితం)                                        




Saturday, January 5, 2013

భారత్ భారత్ గానే ఉంది...ఇంకా ఇండియా కాలేదు

"భారత్ లో రేపులు జరగడం లేదు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం వల్ల భారత్ ఇండియా గా మారిపోతున్న పట్టణ ప్రాంతాలలోనే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భారత్తే కాపాడుతోంది" అన్న ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాటికి  ఇచ్చిన టీకా టిప్పణీ మరింత ఆశ్చర్యం కలిగించింది. ఇదే సమయంలో, "మహిళలు గీత దాటితే సీత గతే" అని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య నిజానికి పై వ్యాఖ్యలలా ఆశ్చర్యం కలిగించలేదు. అయినా సరే, బీజేపీ శ్రేణులు పాపం ఆ మంత్రిని  సమర్థించలేదు. దాంతో ఆయన  ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారు.

భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయనడానికి నా కారణాలు ఇవీ:

1. భారత్ ఇప్పటికీ భారత్ గానే ఉంది. ఇంకా ఇండియా కాలేదు. ఈ భారత్ అనే మహాసముద్రంలో 'ఇండియా' అనేది అక్కడక్కడ చిన్న చిన్న దీవులుగానే ఉంది. గ్రామాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ అనీ; పట్టణాలనూ, నగరాలనూ దృష్టిలో ఉంచుకుని ఇండియా అనీ అనడం చూస్తున్నాం. నేను అనేది ఏమిటంటే, భారత దేశం మొత్తం ఇప్పటికీ ఒక మహాగ్రామమే. మనం ఇప్పుడు గ్రామంగా గుర్తిస్తున్నది చిన్న గ్రామం. పట్టణంగా గుర్తిస్తున్నది అంతకంటే కొంచెం పెద్ద గ్రామం. నగరంగా గుర్తిస్తున్నది ఇంకా పెద్ద గ్రామం. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై లాంటి మహానగరాలు చాలా పెద్ద గ్రామాలు. ఇవన్నీ కలిగిన భారత్ ఒక మహాగ్రామం. కనుక భారతీయుల మందరమూ భారత్ అనే గ్రామంలోనే నివసిస్తున్నాం. జనం చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామానికి, మరింత పెద్ద గ్రామానికి, ఇంకా పెద్ద గ్రామానికి వలస వస్తున్నారు. తమతోపాటు తమ 'సంస్కృతీ, సంప్రదాయా'లను కూడా తీసుకొస్తున్నారు. ఏతావతా చెప్పేదేమిటంటే మానభంగాలు, హత్యలు వగైరాలు అన్నీ భారత్ అనే మహాగ్రామంలోనే జరుగుతున్నాయి. కనుక భారత్/ఇండియా అన్న భాగవత్ గారి వర్గీకరణ వాస్తవిక దృష్టిపై ఆధారపడి చేసింది కాదు. ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించడానికి అదీ కారణం.  వాస్తవికతను ఏమాత్రం ప్రతిబింబించని ఆ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు  సమర్థించడానికి తంటాలు పడడం రెట్టింపు ఆశ్చర్యం కలిగించడం సహజమే.

భాగవత్ గారి వ్యాఖ్యలతో పోల్చితే మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలో 'భారత్/ఇండియా' గంద్రగోళం ఏమీ లేదు. అది సూటిగా ఉండి, మనకు బాగా తెలిసిన ఓ 'మైండ్ సెట్'ను సూచిస్తోంది, అంతే! కనుక అది ఎలాంటి ఆశ్చర్యమూ కలిగించలేదు. అయినా సరే, పాపం ఆయనకు బీజేపీ నుంచి మద్దతు లభించలేదు.

2. భారత్ లో ఇప్పుడు 'గ్రామం'గా గుర్తించే చిన్న గ్రామంలో రేపులు, బలాత్కారాల లాంటివి ఢిల్లీ లాంటి చాలా పెద్ద గ్రామంలో జరిగినట్టు జరగవు. ఎందుకంటే మరీ చిన్న గ్రామం అవడం వల్ల తప్పించుకోడానికి వీలుండదు. కనుక వేరే పద్ధతుల్లో లొంగదీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. భాగవత్ గారు 'భారతీయ సంస్కృతీ సంప్రదాయా'లను కాపాడేవిగా భావించే భారత్ లోని చిన్న గ్రామాలలో ఖాఫ్ పంచాయతీలు 'పరువు' హత్యలను అమలు చేస్తుంటాయి. ఢిల్లీ లాంటి పెద్ద గ్రామాలలోని పొలిటీషియన్లు ఆ ఖాఫ్ పంచాయతీలను ఖండించే సాహసం చేయరు. భారత్ లోని చిన్న గ్రామాలలో కూడా వరకట్నపు వేధింపులూ, హత్యలూ జరుగుతుంటాయి. భారత్ లోని చిన్న గ్రామం నుంచి యువత పెద్ద గ్రామానికి వెళ్ళడం ఒకవిధంగా ఆటవిడుపుగా ఉంటుంది. పెద్ద గ్రామంలో తమ గ్రామంలో కన్నా విశాలమైన, పరస్పర పరిచయాలు తక్కువగా ఉండే విశాల సమాజాన్ని చూస్తారు కనుక స్వేచ్చకు కళ్లేలు విప్పెస్తారు. ఈవ్ టీజింగ్ లకు వగైరాలకు ఎక్కువగా పాల్పడేది ఇలా చిన్న గ్రామం నుంచి కొత్తగా పెద్ద గ్రామంలోకి అడుగుపెట్టినవారే. రేపులు, ఐటెమ్ డ్యాన్సులు, అశ్లీల సంభాషణలు, హీరో ఓరియెంటెడ్  మసాలా సినిమాలను ఈల వేసి ప్రోత్సహించే మహారాజపోషకులు చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామానికి కొత్తగా  ప్రవహించే  జనాలే. అంతేకాదు, రాష్ట్రాల రాజధానులనే పెద్ద గ్రామాలలోని శాసనసభలను, ఢిల్లీ అనే చాలా పెద్ద గ్రామంలోని పార్లమెంట్ ను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసేది కూడా భాగవత్ గారు చెప్పిన  'భారత్' మహాగ్రామవాసులే.

3. ఇప్పుడు పట్టణాలుగా, నగరాలుగా చెప్పుకునే పెద్ద, ఇంకా పెద్ద గ్రామాలలో కంటే; గ్రామంగా చెప్పుకునే చిన్న గ్రామం జనంలోనే లైంగిక 'చైతన్యం' కూడా ఎక్కువగా ఉంటుంది. నా అనుభవమే చెబుతాను. నేను పట్టణమనే ఒక పెద్ద గ్రామంలో హైస్కూలు చదువు చదువుకున్నాను. నా పది హేనో ఏట గ్రామానికి వెళ్లినప్పుడు, వయసులో చదువులో నాకంటే ఓ ఏడాది జూనియర్ అయిన ఒక మిత్రుడు స్త్రీ-పురుష సంబంధాల గురించి, అందులోనూ తనకు తెలిసిన అక్రమ సంబంధాల గురించీ చెబుతుంటే నేను నోరు వెళ్లబెట్టాను. అప్పటివరకూ నాకు అలాంటి విషయాలు ఏవీ తెలియవు. నేను మొదటిసారి (అదే  చివరిసారి కూడా)'...మేళా'న్ని గ్రామంలోనే చూశాను. రానంటున్నా బలవంతం చేసి ఓ మిత్రుడు తీసుకెళ్ళాడు. '...మేళం' అయిన తర్వాత ఊళ్ళో కామందులు ఒక్కో అమ్మాయిని తీసుకెడతారని కూడా చెప్పాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా నేను మొదటిసారి గ్రామంలోనే చూశాను. ఇక 'చింతామణి' బూతు నాటకం గ్రామాలలో మహాపాపులర్. ఇలాంటి చిన్నా, పెద్దా గ్రామాలతో నిండిన భారత్తే 'సంస్కృతీ సంప్రదాయా'లను కాపాడుతోందని భాగవత్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. పైగా అన్యాయంగా పాశ్చాత్యసంస్కృతీ ప్రభావంతో రేపులు ఎక్కువయ్యాయని ఆయన అభాండం వేశారు.

భారత్ లోని గ్రామాలు ఎలా ఉన్నాయో  'బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు' అనే నా పోస్ట్ లోనూ, మరికొన్ని పోస్ట్ లలోనూ  చెప్పడానికి ప్రయత్నించాను. దయచేసి వాటిని ఒకసారి చూడండి.

అలాగే, నేను గ్రామాలను ఏదో అన్నానని అపార్థం చేసుకోవద్దు. మనమందరం భారత్ అనే మహాగ్రామవాసులమే.

                                                                           ****    

సంబంధిత పోస్ట్ లు: 1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీఎంసీల ఫినాయిల్ కావాలి? 2. తెలుగు భాషనే కాదు తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి 3.  తెలుగు సభల్లో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా? 4. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది ? 5. బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు.


Friday, January 4, 2013

అక్బరుద్దీన్ కేసు: చట్టం తన పని తాను చేస్తోందా?

ఇంతకీ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ విషయంలో రూల్ ఆఫ్ లా అమలు జరుగుతోందా?

 'అమలు జరుగుతోందని' ప్రస్తుతానికి అంత కచ్చితంగా చెప్పలేం. అమలు జరిగీ జరగనట్టుగా ఉంది. పూర్తిగా అమలు జరగకపోవచ్చు. చివరికి, అసలే అమలు జరగలేదన్న అభిప్రాయం కలిగించినా ఆశ్చర్యంలేదు.

 భోపాల్ దుర్ఘటన కేసులో ఏం జరిగింది?  యూనియన్ కార్బైడ్ సీ ఈ ఓ వారెన్ యాండర్సన్ ను అరెస్ట్ చేసినట్టే చేసి మధ్యాహ్నానికి 'రూ.25 వేల'పూచీకత్తుతో బెయిల్ ఇచ్చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వవాహనంలో విమానాశ్రయంలో దిగబెట్టి దేశం దాటించేశారు. కనుక ఆయన విషయంలో రూల్ ఆఫ్ లా (అరెస్ట్ చేశారు కనుక)అమలు జరగలేదా అంటే జరగలేదని చెప్పలేం. కానీ యాండర్సన్ మళ్ళీ ఇండియాకు రాలేదు. 90 దాటిన వయసులో న్యూయార్క్ లో విశ్రాంతజీవితం గడుపుతున్నాడు. ఆవిధంగా చూస్తే యాండర్సన్ విషయంలో రూల్ ఆఫ్ లా అమలుకాలేదు.

బోఫోర్స్ ముడుపుల ఆరోపణ వెలుగుచూసిన పందొమ్మిదేళ్ళ తర్వాత,  నిందితులలో ఒకడైన ఆట్టోవియో కత్రోచీ విషయంలో 'రూల్ ఆఫ్ లా అమలుచేయడానికి' సీబీఐ శతవిధాల ప్రయత్నించింది. తీరా ఆయనను నిర్బంధంలోకి తీసుకోబోయేసరికి అంతవరకూ ఇండియాలోనే ఉన్న ఆయన కాస్తా మలేసియా జారుకున్నాడు. ఎలాగైనాసరే 'రూల్ ఆఫ్ లా అమలుచేయదలచుకున్న' సీబీఐ ఆయనను ఇండియా రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తగిన సాక్ష్యాలు లేవని మలేసియా ప్రభుత్వం ఆయనను అప్పగించడానికి తిరస్కరించింది. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా అమలులో భాగంగా సీబీఐ ఇచ్చిన ఎలర్ట్ కు స్పందించిన ఇంటర్ పోల్ అర్జెంటీనా లో కత్రోచీని నిర్బంధంలోకి తీసుకుని సీబీఐ కి ఆ విషయం తెలియజేసింది. పదహారురోజుల ఆలస్యంగా సీబీఐ ఒక బృందాన్ని అర్జెంటినా పంపింది. కానీ ఆ బృందం తాజా వారెంట్ లాంటి అత్యవసర పత్రాలు తీసుకువెళ్లడం మరచిపోయింది. దాంతో కత్రోచీ అప్పగింతకు నిరాకరించిన కోర్టు, ఆయన కోర్టు ఖర్చులు కూడా ఇండియాయే భరించాలని ఆదేశించింది. కత్రోచీ కడుపులో చల్ల కదలకుండా క్షేమంగా ఉన్నాడు. చెప్పొచ్చేదేమిటంటే, ఎంత ప్రయత్నించినా కత్రోచీ విషయంలో రూల్ ఆఫ్ లా అమలుకాలేదు.

అక్బరుద్దీన్ ది భిన్నమైన కేసైనా రూల్ ఆఫ్ లా వర్తింపులో పై ఇరువురితో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఆయన డిసెంబర్ 8న నిజామాబాద్ లో, డిసెంబర్ 22 న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణ. డిసెంబర్ 9న...లేదా కనీసం 10న ఆయనపై కేసు దాఖలు చేసి ఉంటే రూల్ ఆఫ్ లా అమలుపై సందేహాలు వచ్చి ఉండేవికావు. కానీ అది జరగలేదు. ఈ లోపల ఆయన 22న మరోసారి అటువంటి ప్రసంగమే చేశారు. ఆ తర్వాతైనా వెంటనే కేసు దాఖలు చేసి ఉంటే రూల్ ఆఫ్ లా అమలు పట్ల సందేహాలు ముదిరి ఉండేవికావు. కానీ అదీ జరగలేదు. ఎట్టకేలకు కోర్టు చెబితే తప్ప రూల్ ఆఫ్ లా అమలుకు ప్రభుత్వం పూనుకోలేదు. 25 రోజుల తర్వాత కేసు దాఖలు చేశారు. ఈ లోపల అక్బరుద్దీన్ లండన్ వెళ్ళిపోయారు. ఆయన తిరిగి ఇండియాకు వచ్చిన మాట నిజమే. అయితే వచ్చి ఒక రోజు దాటిపోయినా ఆయనను అరెస్ట్ చేయలేదు. ఆయన కోర్టుకు హాజరు కావలసిన ఊళ్లలో 144 సెక్షన్ విధించారు తప్ప ఆయన ఇంటి ముందు జనం గుమి కూడకుండా నివారించలేదు. వైద్యపరీక్షల పేరుతో ఆయన కోరిన నాలుగు రోజుల గడువును ఇస్తున్నట్టే కనిపిస్తున్నారు. తేడా చూడండి...ఈ మధ్య మహారాష్ట్రలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యను పురస్కరించుకుని ఆమెను ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు!

అంతకుముందు, అక్బరుద్దీన్ పై చర్య తీసుకోవడంలో దాదాపు నెల రోజులపాటు ఆలస్యం ఎందుకు జరిగిందని అడిగితే, న్యాయ సలహాదారు అభిప్రాయం మొన్ననే(జనవరి 2) అందిందని పోలీసులు చెప్పారు. అంటే, అక్బరుద్దీన్ ప్రసంగాలు మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయో లేదో చెప్పడానికి న్యాయసలహాదారుకు  అన్ని రోజులు పట్టింది.  ఎందుకని? ఆయన అక్బరుద్దీన్ కావడం తప్ప మరో కారణం కనిపించదు. కత్రోచీనీ నిర్బంధంలోకి తీసుకున్నట్టు ఇంటర్ పోల్ తెలియజేసిన తర్వాత కూడా 16 రోజుల పాటు ఎందుకు తాత్సారం చేశారని అడిగితే, అర్జెంటినా నుంచి అందిన పత్రాలు స్పానిష్ భాషలో ఉండడం వల్ల తర్జుమాకు సమయం పట్టిందని సీబీఐ జవాబిచ్చింది (నిజానికి ఇంగ్లీష్ లోనే పత్రాలు అందాయని మరో సమాచారం).  అక్బరుద్దీన్ విషయంలో కూడా, ఆయన ప్రసంగాలు ఉర్దూలో ఉండడం వల్ల తర్జుమాలో ఆలస్యం జరిగిందంటున్నారు.  కత్రోచీ దేశం దాటిపోతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత ఇంటర్ పోల్ ను ఎలర్ట్ చేసినట్టే; అక్బరుద్దీన్ విషయం లోనూ అవసరమైతే ఇంటర్ పోల్ సాయం తీసుకుంటామని పోలీసులు అన్నారు. గమనించారా, పోలికలు ఎంత బాగా కుదిరాయో! కేసు ఏమైనా కావచ్చు గాక, రూల్ ఆఫ్ లా అమలుపట్ల ఇలాంటివి జనంలో నమ్మకం కలిగించవు.

ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నది, అక్బరుద్దీన్ గురించో, యాండర్సన్, కత్రోచీల గురించో కాదు...రూల్ ఆఫ్ లా అమలు గురించి! అక్బరుద్దీన్ పార్టీ వాళ్ళు ఇదే రూల్ ఆఫ్ లా ను బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా తదితరుల విషయంలో ఎందుకు అమలు చేయలేదని అడగచ్చు. అలా అడగడం న్యాయమే. అలాగని అక్బరుద్దీన్ విషయంలో అమలు కాకూడదని వాళ్ళు అనకూడదు. అలాగే, బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా మద్దతుదారులు  అక్బరుద్దీన్ మీద చర్య తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పుడు, మరి బాల్ థాక్రే, ప్రవీణ్ తొగాడియా వంటి వ్యక్తుల  విషయంలో మీరేమంటారని అడిగితే, సమాధానం దాటవేయకూడదు.

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు అదే జరుగుతోంది.  రూల్ ఆఫ్ లా అమలు డిమాండ్ కూడా పార్టీల ప్రాతిపదికన చీలిపోతోంది. ప్రభుత్వం ఇతరేతర ఇబ్బందులు, సానుకూలతలు, ప్రతికూలతల దృష్ట్యా రూల్ ఆఫ్ లా ను 'సెలెక్టివ్'గా అమలు చేయడం, లేదా కనిపించీ కనిపించనట్టుగా అమలు చేయడం మొదలైనవి దీనికి అదనం.

కనుక, ఈ దేశంలో ఇప్పుడు అత్యవసరంగా జరగవలసింది రూల్ ఆఫ్ లా అమలును కోరుకునేవారందరూ ఒక పార్టీగా ఏర్పడడం!

 చట్టాలను 'సెలెక్టివ్'గా అమలు చేసే అవకాశం ఎప్పుడైతే ఇచ్చారో, లేదా  ఎప్పుడైతే దానిని సమర్థించారో అక్బరుద్దీన్ లకు, ప్రవీణ్ తొగోడియాలకు, వరుణ్ గాంధీలకే 'న్యాయం' అందుతుంది తప్ప; ఒక సామాన్య హిందువుకు, ఒక సామాన్య ముస్లిం కు, ఒక సామాన్య క్రైస్తవునికి, ఒక సామాన్య దళితునికీ, ఒక సామాన్య ఆదివాసీకి ఎప్పటికీ న్యాయం జరగదు.

మానభంగ నేరాన్ని శిక్షించడానికి ఎంత కఠినమైన చట్టాన్నైనా తీసుకురండి. ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులనైనా ఏర్పాటు చేయండి. కానీ, చట్టాన్ని 'సెలెక్టివ్'గా అమలుచేయడాన్ని మీరు ఎప్పుడైతే మౌనంగా అంగీకరించారో  అప్పుడు పలుకుబడి, డబ్బు, అధికారం ఉన్నవారిని ఎంతటి కఠిన చట్టాలైనా ఏమీ చేయలేవు. అవేవీ లేనివారు మాత్రమే శిక్షించబడతారు.

కనుక పార్టీ లకు అతీతంగా అందరూ రూల్ ఆఫ్ లా అమలును కోరుకోవాలి. రూల్ ఆఫ్ లాను కోరుకునేవారందరూ ఒక పార్టీ కావాలి.

ఈ దేశంలో మెజారిటీగా ఉన్న సామాన్యుడు రూల్ ఆఫ్ లాను కోరుకోవడం, కేవలం తప్పు చేసినవారిని శిక్షించి తీరాలన్న ధర్మాగ్రహంతో కాదు సుమా, అంతకంటే ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం!


Wednesday, January 2, 2013

ముద్దులు, కౌగిలింతల 'ధ్యానం': భారతీయాత్మకు నొప్పి లేదా?

ముద్దులు, కౌగిలింతల ధ్యాన దృశ్యాలను కొన్ని తెలుగు పత్రికలు ప్రచురించి 24 గంటలు గడిచిపోయాయి. కానీ విచిత్రం చూడండి...రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు స్పందించిన జాడ లేదు. అంతకంటే చిత్రం, ఈ రాష్ట్ర మహిళా హోం మంత్రి కూడా స్పందించలేదు. ఒక న్యాయవాది మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం, అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరగడం మినహా ఎక్కడా భూమి కంపించలేదు. ఢిల్లీ ఘటన సృష్టించిన సంచలనంలో, స్పందనలో, ఆగ్రహావేశాలలో వెయ్యో వంతు కూడా ఈ దృశ్యాలు సృష్టించలేదు.

ఈ దేశంలో భారతీయ విలువల పరిరక్షణకే కంకణం కట్టుకున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యం, అవీ వీధికెక్కిన ఆనవాళ్ళు లేవు. ఆధ్యాత్మికత ముసుగులో భారతీయ యువతులను  బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దాడి, ఒడిలో కూర్చొబెట్టుకుని లాలిస్తున్నదృశ్యాలు పత్రికలకు ఎక్కిన తర్వాత కూడా భారతీయాత్మకు చీమ కుట్టినట్టు కూడా లేదు.

ఎందువల్ల ఇలా జరిగింది? ఇది నిజంగా చాలా లోతుగా  చాలా కోణాలనుంచి ఆలోచించవలసిన ప్రశ్న!

గుర్తుపెట్టుకోండి, యావద్దేశం ఢిల్లీ వైపు రోజుల తరబడి దృష్టి సారించిన రోజుల్లోనే ఇక్కడ ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో పై దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఘటనపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కూడా ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి దృశ్యాలకు బాధ్యులైనవారిలో భయం పుట్టించలేదు. ప్రభుత్వంలో మెలకువ కలిగించలేదు. ఢిల్లీ స్థాయి నిరసనలు ఎన్నెన్ని, ఎన్నెన్ని రోజులపాటు జరిగితే దేశవ్యాప్తంగా వ్యక్తులలో, వ్యవస్థలలో, ప్రభుత్వాలలో కదలిక వస్తుంది?!

ఈ స్పందనారాహిత్యం చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తోంది. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక విలువల పరిరక్షణే ధ్యేయమని చెప్పుకునే సంస్థలు కూడా ఈ కౌగిలింతలను, చుంబనాలను, ఒడి లాలింపులను ఆధ్యాత్మిక 'ప్రయోగం'గానే  భావిస్తున్నాయా? వీటికి బాధ్యులైన ఆధ్యాత్మిక పురుషులకు కూడా-పాపం శమించుగాక-రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణమహర్షి, అరవింద ల సరసన పీట వేయదలచుకున్నారా? అదే నిజమైతే, వారే కాదు, అందరూ  భారతీయ విలువల కళేబరాన్ని నూరు గజాల లోతున పాతిపెట్టి కన్నీటి తర్పణం విడిచి రావచ్చు.

ఇప్పటికీ దీనిని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసించే అమాయకులు ఎవరైనా ఉంటే వారికి నేను చెప్పేది ఒకటే...మనకు ఇంతకన్నా ఉదాత్తమైన, సభ్యతాసంస్కారవంతమైన, విలువైన ధ్యాన సంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి తుచ్చమైన ప్రయోగాలు మనకు అవసరం లేదు.

నేను ఇంతకుముందే చెప్పినట్టు, రాజకీయ నాయకత్వానికి ఇటువంటి అవాంఛనీయశక్తులతో ఇతరేతర లాలూచీలు ఏవీ లేకపోతే, కేవలం ఆధ్యాత్మిక అజ్ఞానమే వాటిని అనుమతించడానికి కారణమైతే నాదొక సలహా...ప్రభుత్వానికి రకరకాల సలహాదారులు ఉంటారు. అలాగే అత్యవసరంగా ఒక ఆధ్యాత్మిక సలహాదారును అది ఏర్పాటు చేసుకోవాలి.

ఢిల్లీ స్థాయి ప్రకంపనలు ఇక్కడ పుట్టకపోవడానికి నాకు మరో కారణం కనిపిస్తోంది. అది మీడియా వైఫల్యం. మీరు గమనించారో లేదో, ఢిల్లీ నుంచి పని చేసే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలే ఫోకస్ అవుతుంటాయి. ఢిల్లీలోనే కాదు, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ల లో ఏం జరిగినా జాతీయ మీడియాలో వార్త అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలలో ఎంతటి ఘోరాలు జరిగినా ఎప్పుడో కానీ  అదొక  ప్రముఖ వార్త కాదు. దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగవు. ఇక దక్షిణాది రాష్ట్రాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు రెండూ ప్రాంతీయ మీడియాగానే పనిచేస్తుంటాయి. ఢిల్లీలోని ఎలక్ట్రానిక్ మీడియాలా జాతీయస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని రూపొందించే శక్తికానీ, ప్రభావితం చేసే శక్తి కానీ దక్షిణాది చానెళ్లకు లేదు. దక్షిణాది చానెళ్లలో ఒక అర్నబ్ గోస్వామి, ఒక రాజ్ దీప్ సర్దేసాయి, ఒక కరణ్ థాపర్, ఒక బర్ఖాదత్, ఒక నిధీ రాజ్దాన్ లాంటివారు కనిపించకపోవడం స్పష్టంగా కనిపించే ఒక తేడా. సమాచారం జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికి సంబంధించినంతవరకు దక్షిణాది రాష్ట్రాలు ఒక చీకటి ఖండం. అదే, ఇక్కడి ప్రభుత్వాలకు, రకరకాల సంఘవిద్రోహశక్తులకు పెద్ద రక్షణ కవచం.

ఢిల్లీ ఘటనపై మీడియా మరీ అతి చేసిందనే అభిప్రాయం ఎవరికైనా ఉండచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ మూల జరిగిన ఘటనల పై స్పందన  చూసినమీదట ఆ డోసు కూడా సరిపోదనే అభిప్రాయం కలుగుతోంది. జాతీయ చానెళ్ల కెమెరా ఫోకస్ ఇటు కూడా మళ్ళవలసిన  అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.



ముద్దులు, కౌగిలింతల 'ధ్యానం': ఆంధ్రలో ఓ దారుణం

ఢిల్లీలో 23 ఏళ్ల యువతి మానభంగం, హత్యలపై యావద్దేశంలో ఇప్పటికీ  ఆగ్రహం జ్వలిస్తూనే ఉంది. మహిళల పట్ల జరిగే ఘాతుకాలకు అడ్డుకట్ట పడేవరకూ ఆగ్రహాగ్ని అలా జ్వలిస్తూనే ఉండాలనీ, ఎత్తిన కత్తి దించడానికి వీలులేదనే పట్టుదల జనంలో కనిపిస్తోంది. మానభంగాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలను అరికట్టే దిశగా కేంద్రమూ, కొన్ని రాష్ట్రప్రభుత్వాలూ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. సంతోషమే...

కానీ, ఇదే సమయంలో ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో గమనించారా?  ఈరోజు కొన్ని తెలుగు దినపత్రికలు ప్రచురించిన దృశ్యాలు చూస్తే, మహిళల మర్యాదను మంటగలపడంలో అవి ఢిల్లీ యువతి మానభంగ ఘటనకు ఏమాత్రం తీసిపోవనే అభిప్రాయం మీకు కలిగితీరుతుంది. కొన్ని దృశ్యాలలో నెరిసిన గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు కొందరు యువతులను ఆలింగనం చేసుకుంటున్నాడు! ఇంకో దృశ్యంలో, ఆయన శిష్యుడుగా చెబుతున్న ఒక నల్లని గడ్డం మనిషి ఒడిలో ఒక యువతి కూర్చుని ఉంది! మరో దృశ్యంలో ఆ మనిషే మరో యువతిని ముద్దాడుతున్నాడు! 'ఆధ్యాత్మిక ప్రేమతత్వా'న్ని పంచే ప్రక్రియలో ఆ ఆలింగనాలు, ఒడిలో కూర్చోబెట్టుకోవడాలూ, ముద్దాడడాలూ భాగమట!

ఇలాంటి బహిరంగ విశృంఖల దృశ్యాలు చూసిన తర్వాత కూడా మన రక్తం ఉడకకపోతే, మన సాంస్కృతిక విలువలకు అవి చేసే గాయాల నొప్పి అనుభవానికి రాకపోతే ఈ దేశాన్ని దాని ఖర్మానికి విడిచిపెట్టడం తప్ప చేయగలిగింది లేదు. ఈ దృశ్యాలు ఘనత వహించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక తెచ్చాయో ప్రస్తుతానికి సమాచారం లేదు. మామూలు కదలిక కాదు, ఆ దృశ్యాలకు బాధ్యులైనవారిపై కఠినచర్య తీసుకోవడంతోపాటు, పిరమిడ్ ధ్యాన కేంద్రంగా ఇటీవలి కాలంలో  విశేషప్రచారం పొందుతున్న ఆ సంస్థపైనా చర్య తీసుకోవడం అవసరం. అయితే, ఆ సంస్థ ఇటీవల నిర్వహించిన ప్రపంచ ధ్యాన సభలకు ఎంతటి ప్రముఖులు హాజరయ్యారో గమనిస్తే, రాష్ట్రప్రభుత్వం చర్యకు సాహసిస్తుందనిపించదు. కడ్తాల్ అనే చోట ఆ ధ్యాన కేంద్రాన్ని సందర్శించినవారిలో తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. అక్కడ ధ్యానం చేశాక  నాకెంతో మనశ్శాంతి కలిగిందని జైపాల్ రెడ్డి చెప్పుకున్నారు. పత్రికలు ప్రచురించిన దృశ్యాలు చూసిన తర్వాత కూడా మీ మనస్సు అంతే శాంతిని అనుభవిస్తోందా జైపాల్ రెడ్డిగారూ?

ఆసియాలోనే అతి పెద్ద పిరమిడ్ గా దాని గురించి చెబుతున్నారు. పిరమిడ్ నిర్మాతపై అసైన్డ్ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణ వినిపిస్తోంది. పిరమిడ్ నిర్మించిన ప్రాంతం చుట్టుపక్కల రియెల్ ఎస్టేట్ మంచి ఊపులో ఉందంటున్నారు. పిరమిడ్ నిర్మాణ వ్యూహాలలో అది కూడా భాగమంటున్నారు. వినిపించే ఆరోపణలను అలా ఉంచి కనిపించే దృశ్యాల గురించే మాట్లాడుకుందాం.

ఢిల్లీ యువతి మానభంగంతో ఈ దృశ్యాలను ఎలా పోల్చుతారన్న సందేహం ఎవరికైనా ఉండచ్చు.  ఢిల్లీ ఘటనకు భిన్నంగా పై దృశ్యాలలోని మహిళలు ఇష్టపూర్వకంగా ఆలింగనాలు, ముద్దులు, ఒడి లాలింపులు అంగీకరించారన్న వాదన ముందుకు తేవచ్చు. కానీ లోతుగా ఆలోచించి చూడండి...పై దృశ్యాలు ఢిల్లీ ఘటనకంటే కూడా దారుణమైనవని మీకే అనిపిస్తుంది. ఢిల్లీ ఘటనలో క్రౌర్యం ఉంది, పాశవికత్వం ఉంది, దౌర్జన్యం ఉంది. కానీ పై దృశ్యాలలో ఆధ్యాత్మికత ముసుగులో జరిగే బహిరంగ వంచన ఉంది. ప్రేమతత్వం అనే  మత్తు చల్లి  మహిళల్ని లొంగదీసుకుని వారి శరీరంపై ఆధ్యాత్మిక  అత్యాచారానికి పాల్పడే నికృష్టత ఉంది.

ఈ దృశ్యాలు ఈ దేశ సాంస్కృతిక విలువలకు చేసే గాయాల మాటేమిటి? ఇవి ఈ దేశప్రజలకు కలిగించే సాంస్కృతిక ఆఘాతాల సంగతేమిటి? ఇంత గొప్ప ఆధ్యాత్మికసంపన్నత ఉన్న ఈ దేశంలో మహిళల్ని ముద్దాడడం, ఆలింగనం చేసుకోవడం, ఒళ్ళో కూర్చొబెట్టుకోవడం లాంటి నీచమైన చర్యలను ఏ ఆధ్యాత్మిక సంప్రదాయమైనా బోధించిందా? ఎదిగిన కూతురును తాకడానికి కన్నతండ్రి కూడా సందేహించే ఈ దేశంలో పరపురుషుడు బహిరంగంగా యువతులను ఆలింగనం చేసుకునే దృశ్యాన్ని ఊహించగలమా? ఈ దేశంలో ధ్యాన సంప్రదాయాలకు ఎంత చరిత్ర ఉంది? బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్య, అధునాతన కాలంలో రమణమహర్షి, అరవిందుడిలాంటి ఎందరో ప్రవచించిన ఆరోగ్యకరమైన ధ్యాన సంప్రదాయాలు, నమూనాలు మనకు ఎన్ని లేవు? ఏ సంప్రదాయమైనా ఇలాంటి అత్యాచారాలకు తావిచ్చిందా? ఇంత గొప్ప ధ్యానవారసత్వం మనకు ఉండి కూడా ఇలాంటి వెర్రి మొర్రి, నీతిబాహ్య ప్రదర్శనలకు మనవారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ ఆధ్యాత్మిక దారిద్ర్యం, దిక్కులేని తనం జనానికి ఎలా దాపురించింది? సూటిగా అడగాలంటే,  ఈ దేశంలోని రకరకాల పురాతన పంథాలకు చెందిన పీఠాధిపతులు, స్వాములు ఏం చేస్తున్నారు?

ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులకు, శక్తులకు గొడుగు పట్టే రాజకీయనాయకత్వం- వారిని మించిన పెద్ద బెడద. ఎవరు, ఎలాంటివారు, వారి కార్యకలాపాలు ఏమిటన్నది చూడకుండా, పిలిచినదే తడవుగా పంచే, కండువాలు సర్దుకుంటూ వచ్చి వాలే గవర్నర్లు, మంత్రులే ఈ అవాంఛనీయ శక్తులకు కొండంత అండ. తమకు లోతుగా  తెలియని విషయాలు ఉంటాయన్న స్పృహ వీరికి ఉండదు. మహాద్భుత నిర్మాణం ఏదో చేసి, ప్రపంచ స్థాయి సభలు జరుపుతున్నారనేసరికి అక్కడ హాజరై పొగడ్తలతో ముంచెత్తడం ఒక్కటే వీరికి తెలుసు. అదే తమ రక్తబంధువులలో ఎవరైనా అలా ఆలింగన, చుంబనాలు అందుకుంటుంటే వీరి స్పందన ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఆ  పిరమిడ్ నిర్మాతను ప్రశంసలతో ముంచెత్తుతారా??

అన్నింటి కన్నా ఆశ్చర్యం...అంత పెద్ద పిరమిడ్ ఆంధ్రదేశం గుండెలపై ఎలా ప్రత్యక్షమైంది? దానికి ఎవరెవరు ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? అక్కడ జరగబోయే కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా ఆరా తీసిన తర్వాతే ఇచ్చారా? ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి ఇలాంటి ఘోరమైన దృశ్యాలు దృష్టికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు?,,,ఇవన్నీ శేషప్రశ్నలు.

ఢిల్లీ వైపు దృష్టి సారించిన యావద్దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూపు మళ్లించవలసిన అవసరం లేదా అన్నది ఈ క్షణాన అసలు ప్రశ్న.